అరణ్యములో దేవుని పాఠశాల

ఇశ్రాయేలీయులు ఐగుప్తు దేశమును వదలి వెళ్లారు. వారి ముందు 40 సంవత్సరముల అరణ్య యాత్ర ఉన్నది. అది దేవుని పాఠ శాల. the school of God. మనము స్కూల్ కి వెళ్తాము. పాఠాలు నేర్చుకొంటాము. స్కూల్ అంటే పిక్నిక్ లాగా ఉండదు కదా. ప్రొద్దునే నిద్ర లేచి స్కూల్ కి వెళ్ళాలి, టీచర్ గారు చెప్పే పాఠాలు వినాలి, ఆట పాటలు మానుకొని హోమ్ వర్క్ చేయాలి. కొన్ని సార్లు క్రమ శిక్షణకు గురవుతాము. మార్కులు సరిగ్గా రాకపోతే మనలను విమర్శించే వారు ఉంటారు. మన మీద జోక్స్ వేసి ఎగ తాళి చేసే ఆకతాయిలు ఉంటారు. స్కూల్ కి వెళ్ళినప్పుడు అన్ని ఓర్చుకొని పాఠాలు నేర్చుకొంటాము. దేవుని పాఠ శాల కూడా అంతే. దేవుడు ఇశ్రాయేలీయులను 40 సంవత్సరాల పాఠ శాలకు రమ్మన్నాడు. వాగ్దాన దేశములోకి వారు ప్రవేశించక ముందు వారు ఈ పాఠాలు నేర్చుకోవాలి.

ఓపికతో నేర్చుకోవాలి. దేవుడు వారి పట్ల ఎంతో దీర్ఘ శాంతము చూపించాడు. కొంతమంది ఏమంటారంటే, మీ దేవుడికి ఎందుకంత కోపం, ఆయనకు సహనము లేదా? అని ప్రశ్నిస్తారు.

     హైదరాబాద్ లో ఎన్నో కంపెనీలు ఉన్నాయి. మీరు ఏ కంపెనీ కైనా వెళ్లి దాని CEO ని అడగండి. ‘ మీ కంపెనీ లో 70 శాతం మంది మీ మాట వినకపోతే మీరు ఏమి చేస్తారు?  వారు మీ మాట వినకుండా మిమ్మల్ని తిడితే సహిస్తారా? మిమ్మల్ని శాప నార్ధాలు పెడితే సహిస్తారా? మిమ్మల్ని

అపహాస్యము చేస్తే సహిస్తారా?’ ఆ సీఈఓ మీతో ఏమంటాడు? ‘70 శాతము ఉద్యోగులు నా మాట ధిక్కరిస్తే నేను సహించను.నేను వాళ్ళకు ఉద్యోగాలు ఇచ్చింది నన్ను తిట్టి, శాపాలు పెట్టి, ఎగతాళి

చేయటానికి కాదు. వాళ్లందరినీ ఉద్యోగాల్లో నుండి డిస్మిస్ చేస్తా. లేకపోతే కంపెనీ ఏ మూసేస్తా?’ అంటాడు. మాట వినని దాసులను ఏ యజమానీ సహించడు. 

      దేవుడు సృష్టించిన మనుష్యులలో ఎక్కువ మంది ఆయన మాట వినరు. ఆయన నామాన్ని అవమానిస్తారు, దూషిస్తారు, శపిస్తారు, ఎగ తాళి చేస్తారు. అవన్నీ దేవుడు ఓర్చుకొంటున్నాడు. ఈ భూమి మీద మానవ జాతిని  నాశనము చేయటానికి దేవునికి 5 నిమిషాలు కూడా పట్టదు. అయితే ఆయన దీర్ఘ శాంతముతో ఓర్చుకొంటున్నాడు. ఇశ్రాయేలీయులు అరణ్యములో ప్రవేశించిన కొన్ని రోజులకే దేవుని మీద సణుగుట, గొణుకుట మొదలు పెట్టారు. దేవుడు వారి ఎడల దీర్ఘ శాంతము చూపించాడు. 

     దేవుని పాఠశాలలో ప్రతి ఒక్కరికీ శ్రమలు వస్తాయి. జీవితము ఎప్పుడూ పూల పాన్పు లాగా ఉండదు. ఇశ్రాయేలీయులకు అరణ్యములో సమస్యలు వచ్చినాయి. వారికి నీళ్లు లేవు, ఆహారము లేదు, ప్రకృతి సహకారము లేదు, రోగాల బారినపడ్డారు, పాము కాట్లకు గురయ్యారు, శత్రువుల

దాడులు వారి మీద జరిగినవి. అయితే వాటన్నిటిలో దేవుడు వారితో ఉన్నాడు. నీరు లేనప్పుడు దేవుడు వారికి బండలో నుండి నీటిని ఇచ్చాడు. ఆకాశములో నుండి మన్నా కురిపించి ఆహారము ఇచ్చాడు. వారి రోగాలు స్వస్థపరచాడు, వారి పాము కాట్లను స్వస్థపరచాడు. వారికి శత్రువుల నుండి

విజయము ఇచ్చాడు. వారికి మంచి నాయకుణ్ణి ఇచ్చాడు. దేవుని యొక్క సర్వసమృద్ధి అనే పాఠాన్ని దేవుడు వారికి నేర్పిస్తున్నాడు. The All Sufficiency of God అనే పాఠాన్ని దేవుడు వారికి నేర్పిస్తున్నాడు. ఈ రోజు మనము నేర్చుకొనవలసిన పాఠము కూడా అదే. ప్రభువైన యేసు క్రీస్తు యొక్క సర్వ సమృద్ధి.The All Sufficiency of Christ.

    యేసు ప్రభువు ఏమన్నాడు? మత్తయి 6:25 నేను మీతో చెప్పునదేమనగా ఏమి తిందుమో యేమి త్రాగుదుమో అని మీ ప్రాణమును గూర్చియైనను, ఏమి ధరించుకొందుమో అని మీ దేహమును గూర్చియైనను చింతింపకుడి. మత్తయి 6:25 

క్రీస్తు మనకు జీవాహారము.

క్రీస్తు మనకు జీవజలము.

క్రీస్తు మన స్వస్థత

క్రీస్తు మన విజయము 

క్రీస్తు మన నాయకుడు

     యేసు క్రీస్తు యొక్క సర్వసమృద్ధి ని తెలుసుకోవటమే దేవుని పాఠ శాలలో ప్రతి విశ్వాసి నేర్చుకొనవలసిన ముఖ్యమైన పాఠము. మన్నా లో మనకు యేసు ప్రభువు రూపము కనిపిస్తున్నది, ఇశ్రాయేలీయులను అరణ్యములో పోషించింది మన్నానే. ఈ లోకములో మనల్ని పోషించేది యేసు క్రీస్తు ఇచ్చే జీవాహారమే. ఇశ్రాయేలీయులు ప్రతి రోజూ మన్నా సేకరించి తిన్నారు. మనము ప్రతి రోజూ యేసు క్రీస్తు తో మనలను నింపుకోవాలి. అరణ్యములో ఇశ్రాయేలీయులను వెంబడించిన రాయిలో కూడా మనకు ప్రభువైన యేసు క్రీస్తు కనిపిస్తున్నాడు. ఆ రాయి లో నుండే సమృద్ధిగా నీరు వచ్చి వారి దాహము తీర్చింది. 1 1 కొరింథీ పత్రికలో అపొస్తలుడైన పౌలు గారు వ్రాశాడు:  ఏల యనగా తమ్మును వెంబడించిన ఆత్మసంబంధమైన బండలోనిది త్రాగిరి; ఆ బండ క్రీస్తే.1 కొరింథీ 10:4 

     అరణ్యములో మోషే బండను కొట్టాడు. అప్పుడు ఆ బండలో నుండి నీరు వచ్చి ఇశ్రాయేలీయుల దాహం తీర్చింది. సిలువ మీద క్రీస్తు అనే మన బండ కొట్టబడ్డాడు. ఆయన మరణించి, తిరిగి లేచి, పరలోకానికి తిరిగి వెళ్లి మనకు పరిశుద్దాత్మ ను ఇచ్చాడు. పరిశుద్ధాత్ముడు క్రీస్తు యొక్క జీవజలముతో మన దాహము తీర్చాడు. ఈ లోకము ఒక అరణ్యము, యేసు క్రీస్తు అనుగ్రహించే జీవజలములు త్రాగకపోతే మీరు సొమ్మసిల్లిపోవడము ఖాయము.

-ఆ తరువాత మీరు గమనించండి. ఇశ్రాయేలీయులకు అరణ్యములో యుద్ధాలు చేయాల్సిన పరిస్థితి కూడా వచ్చింది. నిర్గమ కాండము17 అధ్యాయము చూద్దాము. 8 వచనంలో అమాలేకీయులు ఇశ్రాయేలీయుల మీద దాడి చేయుట మనము చూస్తాము. ఐగుప్తు నుండి విడుదల పొంది వారు సంతోషముగా ఉన్న రోజుల్లో వారి మీద శత్రువు విరుచుకుపడ్డాడు.  ఫరో నుండి విడిపింప బడినప్పటికీ వారికి శత్రువుల బెడద వదల్లేదు. అరణ్యములో వారు ప్రయాణము చేస్తూ వెళ్తున్నప్పుడు, శత్రువులు వారి మీద దాడులు, యుద్ధాలు చేస్తూనే ఉన్నారు. ఈ రోజు క్రైస్తవ విశ్వాసులు కూడా విశ్వాస జీవితములో శత్రువులను ఎదుర్కుంటూనే ఉంటారు. క్రైస్తవులకు ఇద్దరు శత్రువులు ఉన్నారు.

మొదటి శత్రువు సాతానుడు, 

రెండవ శత్రువు శరీరము.

    1 పేతురు పత్రిక 5:8 లో మనము చదువుతాము: 

నిబ్బరమైన బుద్ధి గలవారై మెలకువగా ఉండుడి; 

మీ విరోధియైన అపవాది గర్జించు సింహమువలె ఎవరిని మింగుదునా

అని వెదకుచు తిరుగుచున్నాడు.

     సాతానుడు సింహము వలె ఎవరిని మింగుదునా అని తిరుగుచున్నాడు. మనమేమి చేయాలి : నిబ్బరమైన బుద్ధి గలవారై మెలకువగా ఉండుడి; భారత సైన్యము ఎప్పుడూ అలెర్ట్ గా ఉంటుంది. చైనా వాడు, పాకిస్తాన్ వాడు, ఆఫ్గనిస్తాన్ వాడు, బంగ్లాదేశ్ వాడు – ఎవరు ఎప్పుడు దాడి చేస్తారో తెలియదు; ఆ సైనికులు ఎప్పుడూ అలెర్ట్ గా, మెలుకువగా ఉంటారు. క్రైస్తవ విశ్వాసి కూడా అంతే. సాతానుడు ఎప్పుడు మన మీద విరుచుకు పడతాడో మనము ఊహించలేము. మన శరీరం మనల్ని ఎప్పుడు శోధిస్తుందో మనము ఊహించలేము. గలతీ పత్రిక 5 అధ్యాయములో మనము చదువుతాము: 

  1. నేను చెప్పునదేమనగా 

ఆత్మానుసారముగా నడుచు కొనుడి, 

అప్పుడు మీరు శరీరేచ్ఛను నెరవేర్చరు.

  1. శరీరము ఆత్మకును ఆత్మ 

శరీరమునకును విరోధముగా అపేక్షించును.

 ఇవి యొకదానికొకటి వ్యతిరేకముగా 

ఉన్నవి గనుక మీరేవిచేయ 

నిచ్ఛయింతురో వాటిని చేయకుందురు.

    శరీరము, ఆత్మ ఒకదానికొకటి విరోధముగా ఉన్నాయి. పరిశుద్ధాత్ముడు మనలను దేవుని యొక్క పరిశుద్ధత వైపుకు తీసుకువెళ్తాడు. అయితే మన శరీరము దానికి ఒప్పుకోదు. మనలను పాపము వైపుకు అది నడిపిస్తుంది. దానితో మనము యుద్ధము చేయాలి. ఎఫెసీయులకు వ్రాసిన పత్రిక 6 అధ్యాయములో క్రైస్తవుని పౌలు గారు ఒక సైనికునితో పోల్చాడు.

  1. ఏలయనగా మనము పోరాడునది శరీరులతో కాదు,

 గాని ప్రధానులతోను, అధికారులతోను, 

ప్రస్తుత అంధకారసంబంధులగు లోక నాథులతోను, 

ఆకాశమండలమందున్న దురాత్మల సమూహ ములతోను పోరాడుచున్నాము.

  1. అందుచేతను మీరు ఆపద్దినమందు వారిని ఎదిరించుటకును, 

సమస్తము నెరవేర్చినవారై నిలువ బడుటకును శక్తిమంతులగునట్లు, 

దేవుడిచ్చు సర్వాంగ కవచమును ధరించుకొనుడి.

  1. ఏలా గనగా మీ నడుమునకు సత్యమను దట్టి కట్టుకొని నీతియను మైమరువు తొడుగుకొని 
  2. పాదములకు సమాధాన సువార్తవలననైన సిద్ధమనస్సను జోడుతొడుగుకొని నిలువ బడుడి.
  3. ఇవన్నియుగాక విశ్వాసమను డాలు పట్టు కొనుడి; దానితో మీరు దుష్టుని అగ్నిబాణములన్నిటిని 

ఆర్పుటకు శక్తిమంతులవుదురు. 

  1. మరియు రక్షణయను శిరస్త్రాణమును, దేవుని వాక్యమను ఆత్మఖడ్గమును ధరించు కొనుడి. 

                                             ఎఫెసీ 6 

    అవన్నీ ఉండాలి, ఎక్కడ చిన్న వీక్ నెస్ కనిపించినా శత్రువు దాడి చేస్తాడు. ఇక్కడ అమాలేకీయులు చేసింది అదే. ఇశ్రాయేలీయుల మీద వారు దాడి చేశారు. మోషే గారు యెహోషువ ను పిలిపించాడు: ‘యెహోషువ, మన సైన్యాన్ని సిద్ధము చేయుము. అమాలేకీయులను ఓడించు’ అన్నాడు. యెహోషువ గొప్ప విశ్వాసము కలిగిన వాడు. ‘యుద్ధమా, అమ్మో నా వల్ల కాదు’ అని పారిపోలేదు. ధైర్యముగా వెళ్ళాడు, శత్రువులను ఎదుర్కొన్నాడు. పోరాటం చేశాడు. మోషే ఏమిచేసేడంటే, ఇద్దరు మిత్రులను తీసుకొని కొండ శిఖరము మీద ఎక్కాడు. దేవుని వైపు చేతులు ఎత్తి  ప్రార్ధించాడు. మోషే చేతులు పైకి ఎత్తినప్పుడు ఇశ్రాయేలీయులు గెలిచారు, ఆయన చేతులు దించినప్పుడు అమాలేకీయులు గెలిచారు. 

చుట్టూ శత్రువులు దాడి చేస్తూ ఉన్నారు. 

పరలోకములో దేవుడు ఉన్నాడు. 

యెహోషువ యుద్ధము చేస్తున్నాడు. 

మోషే ప్రార్ధన చేస్తున్నాడు. 

 

     ఈ రోజు మనము కూడా అంతే. సాతానుడు, శరీరము మన మీద యుద్ధము చేస్తున్నారు. మనము యెహోషువ వలె యుద్ధము చేయాలి, మోషే వలె ప్రార్ధన చేయాలి. మోషే ఇశ్రాయేలీయుల పక్షమున, యెహోషువ పక్షమున ప్రార్ధన చేస్తున్నాడు. దీనిని Intercessary Prayer అంటారు. ఇది ఇతరుల కోసము చేసే ప్రార్ధన. విజ్ఞాపన ప్రార్ధన. స్వార్ధ పరులు ఈ ప్రార్ధన చేయలేరు. ఇతరుల సంక్షేమము గురించి ఆలోచించేవారే, కాంక్షించే వారే ఈ ప్రార్ధన చేయగలరు. ఇది దేవుని వాక్యంలో మనకు కనిపించేదే. 

-సొదొమ, గొమొఱ్ఱాలు దేవుని తీర్పు క్రింద ఉన్నాయి. అబ్రహాము వారి గురించి విచారించాడు.‘పోనీ, వారి పీడ వదిలిపోతుంది, నాకు పోయింది ఏముంది’ అనుకోలేదు.‘దేవా ఆ పాపాత్ములను కరుణించు’ అని దేవునికి వారి పక్షమున ప్రార్ధన చేశాడు.

-యెరూషలేములో దేవుని ఆలయము ప్రతిష్టించేటప్పుడు సొలొమోను రాజు ఇశ్రాయేలీయుల పక్షమున విఙ్ఞాపణ ప్రార్ధన చేశాడు.(2 దినవృత్తాంతములు 6:21) 

-యిర్మీయా ప్రవక్త ఇశ్రాయేలీయుల పక్షమున కన్నీటితో దేవునికి విఙ్ఞాపణ ప్రార్ధన చేశాడు (యిర్మీయా 12) 

-ఇశ్రాయేలీయులు బబులోనులో చెరపట్టబడి ఉన్నప్పుడు దానియేలు వారికోసము విఙ్ఞాపణ ప్రార్ధన చేశాడు (దానియేలు 9) 

-యూదులు బబులోను చెర నుండి బయటపడ్డారు. తిరిగి యూదా దేశము వెళ్లారు. ఏమి చేయాలో

తోచని సందిగ్దములో పడ్డారు. అప్పుడు ఎజ్రా వారి కోసము విఙ్ఞాపణ ప్రార్ధన చేశాడు.(ఎజ్రా 8:23) 

-యోబు అనేక శ్రమలకు గురయ్యాడు. అతని స్నేహితులు వచ్చి ఆయనను ఓదార్చక పోగా, విమర్శించారు.అయితే, యోబు వారి మీద పగ పట్టలేదు, కక్ష తీర్చుకోలేదు. వారి కోసమే విఙ్ఞాపణ ప్రార్ధన చేశాడు (యోబు 42:10) 

-పేతురు చెఱసాలలో ఉన్నాడు. అప్పుడు సంఘము ఆయన కోసము అత్యాసక్తితో విఙ్ఞాపణ ప్రార్ధన

చేసింది (అపో.కార్య 12:5) 

-అపొస్తలుడైన పౌలు సంఘముల కొరకు, విశ్వాసుల కొరకు విఙ్ఞాపణ ప్రార్ధన చేశాడు.(ఎఫెసీ 6:18) 

-ప్రభువైన యేసు క్రీస్తు తన శిష్యుల కోసము విఙ్ఞాపణ ప్రార్ధన చేశాడు (యోహాను17:15)

-ఈ రోజు మన కోసము ఆయన విఙ్ఞాపణ చేస్తున్నాడు. హెబ్రీ 7:25 లో మనము చదువుతాము: 

ఈయన తన ద్వారా దేవునియొద్దకు వచ్చువారి పక్షమున, విజ్ఞాపనము

చేయుటకు నిరంతరము జీవించుచున్నాడు

గనుక వారిని సంపూర్ణముగా రక్షించుటకు శక్తిమంతుడై యున్నాడు.

    పాత నిబంధనలో యాజకుడు దేవుని సన్నిధిలోకి వెళ్లిన ప్రతిసారీ ప్రజల పక్షమున దేవునికి విఙ్ఞాపణ ప్రార్ధన చేశాడు. ఈ రోజు ప్రభువైన యేసు క్రీస్తు మన ప్రధాన యాజకునిగా మన పక్షమున

విఙ్ఞాపణ చేస్తున్నాడు. పరిశుద్ధాత్ముడు మన పక్షమున విఙ్ఞాపణ ప్రార్ధన చేయుచున్నాడు (రోమా 8:26-27). ఈ అంత్య దినాల్లో మనము కూడా నశించుచున్న ఆత్మల పక్షమున దేవునికి విఙ్ఞాపణ ప్రార్ధన చేయాలి.

    మనము రోజూ కాసేపన్నా మన దేశములో నశించిన ఆత్మల కోసము విఙ్ఞాపణ ప్రార్ధన చేస్తున్నామా? మన ఊరిలో నశించిన ఆత్మల కోసము విఙ్ఞాపణ చేస్తున్నామా? మన సంఘములో ఇతర విశ్వాసుల కోసము కాసేపన్నా విజ్ఞాపణ ప్రార్ధన చేస్తున్నామా? ఇక్కడ మోషే తన ప్రజల కోసం విఙ్ఞాపణ ప్రార్ధన

చేస్తున్నాడు. అతనికి చేతులు బరువు ఎక్కినప్పుడు అహరోను, హోరు ఆయనకు రెండు ప్రక్కల కూర్చొని 

ఆయన చేతులు బలపరచారు. మోషే చేసే ప్రార్ధనలో వారు కూడా పాలుపొందారు. విఙ్ఞాపణ ప్రార్ధన దానియేలు వలె ఒంటరిగా చేయొచ్చు; మోషే వలె ఇతరులతో కలిసి చేయవచ్చు. 

     అద్భుతమైన విజయము దేవుడు యెహోషువకు అనుగ్రహించాడు. అమాలేకీయుల పేరు ఇక ఉండ కుండా తుడిచివేస్తాను అని దేవుడు ప్రవచించాడు. అమాలేకీయులు యాకోబు అన్న ఏశావు సంతానము. అంటే యూదులకు వారు పెదనాన్న పిల్లలు. యూదులను చూసి వీళ్ళు మా బాబాయి 

పిల్లలే కదా, పోనీలే అనుకోలేదు. కుళ్లుతో రగిలిపోయారు.యూదులను ఎలాగైనా నాశనము చేయాలి అని కంకణము కట్టుకున్నారు. దేవుడు ఏమన్నాడంటే, ‘మీకు ఏమాత్రం కనికరం లేదు కాబట్టి నేను మీ జాతి మొత్తాన్ని భూమి మీద లేకుండా నాశనము చేస్తాను’ చరిత్రలో ఆ ప్రవచనము నెరవేరింది. దేవుడు అమాలేకీయుల మీద విజయాన్ని ఇచ్చినప్పుడు మోషే అక్కడ ఒక బలిపీఠము కట్టి దానికి యెహోవా నిస్సి అని పేరుపెట్టాడు. దాని అర్ధము ఏమిటంటే దేవుని విజయము.

ఇది ఇశ్రాయేలీయుల విజయము కాదు, 

ఇది యెహోషువ విజయము కాదు, 

ఇది మోషే విజయము కాదు, 

ఇది దేవుని విజయము. 

ఇది యేసు క్రీస్తు విజయము. 

    1 కొరింథీ 15:57 లో మనము చదువుతాము: అయినను మన ప్రభువైన యేసుక్రీస్తు మూలముగా మనకు జయము అనుగ్రహించుచున్న దేవునికి స్తోత్రము కలుగును గాక. ప్రభువైన యేసు క్రీస్తు ద్వారానే  దేవుడు మనకు విజయము ఇస్తున్నాడు.

    రోమా పత్రికలో మనము చదువుతాము.

అయినను మనలను ప్రేమించినవాని ద్వారా మనము వీటన్నిటిలో

అత్యధిక విజయము  పొందుచున్నాము. రోమా 8:37 

We are more than conquerors 

అత్యధిక విజయము మనకు అనుగ్రహించబడింది, ఎలా అనుగ్రహించబడింది? మనలను ప్రేమించిన వాని ద్వారా. 

సిలువ మీద యేసు క్రీస్తు 

సాతాను శక్తులను, 

నరకపు శక్తులను, 

పాపపు శక్తులను, 

ఇహలోక శక్తులను పూర్తిగా జయించివేశాడు. 

ఈ రోజు యేసు క్రీస్తు మనకు యెహోవా నిస్సి. 

ఆయన విజయములో మనము పాలుపొందుతున్నాము. 

లోకమును జయించిన విజయము మన విశ్వాసమే.

this is the victory that overcometh the world, even our faith. 1 యోహాను 5:4 

    ఈ లోకాన్ని మనము మన స్వంత శక్తితో  జయించలేము, డబ్బుతో జయించలేము. యేసు క్రీస్తు నందు విశ్వాసము ద్వారానే మనము ఈ లోకాన్ని జయించగలము. ఇశ్రాయేలీయుల అరణ్యయాత్రను ఈ రోజు మనము చూశాము. దేవుడు వారికి కావలసిన ఆహారాన్ని, నీటిని, విజయాన్ని అనుగ్రహించాడు. ఈ రోజు ప్రభువైన యేసు క్రీస్తు మన జీవాహారము, మన జీవజలము, మన విజయము. ఆయన యొద్దకు వచ్చి రక్షణ పొందాలన్నదే నేటి మా ప్రేమ సందేశము.

Please make a donation to our ministry

We are sustained by donations averaging about $20. Only a tiny portion of our readers give. Please support us to keep us online and growing. Thank you.

$20.00