కరోనా ను క్రైస్తవులు ఎలా జయిస్తున్నారు?

ఇప్పుడు ప్రపంచం మొత్తము కరోనా గుప్పిట్లో ఉంది. కోట్లాది మంది ప్రజలు ఇంటి గడప దాటి బయటకు వెళ్లలేని పరిస్థితి వచ్చింది. ప్రపంచ వ్యాప్తముగా ఇప్పటికే 10 లక్షల మంది ఈ వైరస్ బారిన పడ్డారు. దాదాపు 50 వేల మంది ప్రాణాలు కోల్పోయారు. వారు కూడా మన లాంటి మనుష్యులే, జీవితం మీద ఎన్నో ఆశలు పెట్టుకొని బ్రతుకున్నవారే. ఎక్కడో చైనా లో బయటపడిన వైరస్ తమ జీవితాన్ని అర్ధాంతరముగా చిదిపేస్తుంది అని వారు ఊహించి ఉండరు. కొన్ని దేశాల్లో మృత్యువు స్వైర్య విహారం చేస్తున్నది. ఇరాన్, ఇటలీ, స్పెయిన్, అమెరికా లాంటి దేశాల్లో ప్రతి రోజూ వేల మంది చనిపోతున్నారు. అటువంటి పరిస్థితి భారత దేశములో రాక ముందే మనము జాగ్రత్త పడాలి. అమెరికా దేశములో న్యూ యార్క్ చాలా విషమ పరిస్థితిలో ఉంది. అక్కడ 40,000 మందికి ఈ వైరస్ అంటుకుంది.1000 మందికి పైగా చనిపోయారు. ఒక్క నగరములో వెయ్యి మంది చనిపోతే పరిస్థితి ఎలా ఉంటుందో ఊహించండి. హాస్పిటల్ ముందు ట్రక్కులు పెట్టి మృత దేహాలను తీసుకొని వెళ్తున్నారు. ఒక్క నగరములో ఎందుకు ఇంత మంది చనిపోతున్నారు.న్యూ యార్క్ గవర్నర్ ఆండ్రూ క్యూమో ఒక మాట అన్నాడు. మేము అన్ని రకాల ప్రజలను ప్రేమిస్తాము.స్టాట్యూ అఫ్ లిబర్టీ స్వేచ్చకు ప్రతీకగా ఉంది.అందరికీ స్వేచ్ఛను ఇచ్చాము. అందరితో కలుస్తాము, అందరితో కలిసి మెలసి ఉంటాము. అందరూ ఇక్కడికి వస్తారు. వారి జబ్బులు, వారి అంటు వ్యాధులు కూడా ఇక్కడకు తీసుకు వస్తారు. ఈ పరిస్థితి మా ప్రేమకు, స్వేచ్చకు కట్టిన వెల అన్నాడు. ప్రేమలో స్వేచ్ఛ ఉంటుంది, స్వేచ్ఛలో రిస్క్ ఉంటుంది. ఆయన మాటలు విన్నప్పుడు నాకు యేసు ప్రభువు గుర్తుకు వచ్చాడు.ఆయన మనలను ప్రేమించాడు. ఆయన మనకు స్వేచ్ఛను ఇచ్చాడు. ఎంతో రిస్క్ తీసుకొన్నాడు.ఆయన మీద ఉమ్మి వేసాము, ఆయన ముఖంమీద గుద్దాము, కొరడాలతో కొట్టాము. మేకులు వేసి సిలువ వేసాము. మన మీద ఉన్న ప్రేమతో దేవుడు ఎంత రిస్క్ తీసుకొన్నాడు అని నాకు అనిపించింది. 

     ఈ కరోనా పాండెమిక్ లో కూడా దేవుని ప్రేమ మనలను నడిపిస్తున్నది. దేవుడు నన్ను మరచిపోయాడు, దేవుడు నన్ను నిర్లక్ష్యము చేస్తున్నాడు అని మనము అనుకోకూడదు. పరిస్థితులు బాగాలేదు. నేను ఇప్పుడు రోజుకు 15 గంటలు హాస్పిటల్ లో గడుపుతున్నాను. ఆది వారము కూడా హాస్పిటల్ లో ఉంటున్నాను. అనేక మంది పేషెంట్లు వస్తున్నారు. డాక్టర్, నా పరిస్థితి ఏమిటి? నాకు జ్వరము, దగ్గు, ఊపిరి పీల్చుకోలేక పోతున్నాను. నాకు కరోనా వైరస్ అంటుకుందా? నేను చనిపోతానా? టెస్ట్ చేయండి అని అడుగు తున్నారు. వారి పరిస్థితి చూసి నాకు బాధ వేసింది. రోజుకు 15 గంటలు హాస్పిటల్ లో ఉంటున్నాను. వీళ్ళ జబ్బులు, వైరస్లు నాకు అంటిస్తారేమో? దేవా, నాకెందుకు ఈ పరిస్థితి పెట్టావు? అని నా మనస్సులో అనుకొన్నాను. అపొస్తలుడైన పౌలు

రోమా పత్రిక 8 అధ్యాయములో వ్రాసిన మాటలు నాకు గుర్తుకు వచ్చాయి. ఆయన ఒక ప్రశ్న అడుగుతాడు: 

  1. క్రీస్తు ప్రేమనుండి మనలను ఎడబాపు వాడెవడు? శ్రమయైనను బాధయైనను

హింసయైనను కరవైనను వస్త్రహీనతయైనను ఉపద్రవమైనను 

ఖడ్గమైనను మనలను ఎడబాపునా? 

  1. మరణమైనను జీవమైనను దేవదూతలైనను ప్రధానులైనను ఉన్నవియైనను 

రాబోవున వియైనను అధికారులైనను ఎత్తయినను లోతైనను సృష్టింపబడిన 

మరి ఏదైనను,39. మన ప్రభువైన క్రీస్తు యేసునందలి

 దేవుని ప్రేమనుండి మనలను ఎడబాప నేరవని రూఢిగా నమ్ముచున్నాను.

     ఆ మాటలు నన్ను ఎంతో ధైర్యపరచినాయి. ఈ కరోనా వైరస్ కూడా క్రీస్తు ప్రేమ నుండి నన్ను వేరుచేయలేదు అని ధైర్యముగా హాస్పిటల్ కి వెళ్ళాను.పేషెంట్లకు సేవ చేశాను. అవిశ్వాసులు ఈ పరిణామాలకుఎంతో నిస్పృహ లోకి వెళ్లిపోయారు. ఈ పరిస్థితులలో క్రైస్తవులందరూ దేవుని ప్రేమను ఇతరులకు చూపించాలి. న్యూ యార్క్ నగరములో సెంట్రల్ పార్క్ లో సమారిటన్ పర్సు సంస్థ టెంట్ హాస్పిటల్ వేసింది. దానిని చూసినప్పుడు నాకు సంతోషం కలిగింది.బిల్లీ గ్రాహం గారి కుమారుడు ఫ్రాంక్లిన్ గ్రాహం ఆ ధార్మిక సంస్థ ను స్థాపించాడు. ఈ రోజు వారు కరోనా రోగుల కోసం ఆ హాస్పిటల్ కొన్ని గంటల్లో అక్కడ టెంట్ లు వేసి స్టార్ట్ చేశారు. బిల్లీ గ్రాహం గారు లూకా సువార్త 10 అధ్యాయములో నుండి మంచి సమరయుడు కథ చెబుతూ ఉండేవాడు. రక్తసిక్తమైన గాయాలతో రోడ్డు ప్రక్కన పడి ఉన్న బాధితునికి మంచి సమరయుడు సహాయం చేశాడు. అతని గాయాలు కట్టాడు, ఆహారం పెట్టాడు. ఆయన ప్రోత్సాహముతో ప్రారంభమైన సమరిటన్ పర్సు కరోనా రోగులకు సేవ చేస్తున్నది.ఈ రోజు మనము కూడా మన పర్సు తియ్యాలి. వీలైనంత మందికి సహాయము చేయాలి. డబ్బు లేని వారికి కూడా మనం సహాయం చేయాలి. 

    కొన్ని రోజుల క్రితం ఒక తండ్రి నా హాస్పిటల్ కు వచ్చాడు. రెండు సంవత్సరాల చిన్న పాప అతని చేతిలో ఉంది. ఆ పాప జ్వరముతో బాధపడుతూ ఉంది.ఆ తండ్రి నాతో అన్నాడు, ‘డాక్టర్, నా దగ్గర డబ్బులు లేవు, మా పాప జ్వరముతో బాధ పడుతుంది.ఈ ఊరు మొత్తము అన్ని హాస్పిటల్ లకు వెళ్ళాను.నా దగ్గర డబ్బులు లేవని ఎవరూ మా పాపను చూడటల్లేదు అన్నాడు. అతని పరిస్థితి చూసి నాకు బాధ కలిగింది. ఆ పాపను చేర్చుకొని పరీక్షలు చేసి, మందులు వ్రాశాను. ఆ తండ్రి నాకు కృతఙ్ఞతలు చెప్పాడు. వెళ్లబోయే ముందు కనీసం 10 సార్లు ‘థాంక్యూ డాక్టర్’ అని చెప్పాడు.

దేవుడు కూడా మన యొద్ద నుండి కృతజ్ఞత కోరుతున్నాడు. రోమా 1:21 లో మనము చదువుతాము.

వారు దేవుని నెరిగియు ఆయనను దేవునిగా మహిమపరచ లేదు, కృతజ్ఞతాస్తుతులు

 చెల్లింపనులేదు గాని తమ వాదముల యందు వ్యర్థులైరి. 

     ఈ రోజు మన సమాజములో చాలా మంది పరిస్థితి అలాగే ఉంది. దేవుడు వారికి ఎంతో సహాయం చేశాడు, వారికి ఎన్నో బ్లెస్సింగ్స్ ఇచ్చాడు. అయితే వారు ఒక నిమిషం కూడా దేవుని మహిమపరచరు. నోరు విప్పి ఒక్క సారి కూడా దేవునికి కృతజ్ఞతా స్తుతులు చెల్లించరు. ఈ కరోనా సమయములో దేవుడు వారితో మాట్లాడుతున్నాడు. వారు తమ వాదములలో వ్యర్థులవుతున్నారు. ఒకాయన వాట్సాప్ లో నాకు మెసేజ్ పెట్టాడు. గోమూత్రం త్రాగితే కరోనా మన జోలికి రాదు. ఆయన మాటలు నమ్మి కొంతమంది గో మూత్రం త్రాగుతున్నారు. ఆవులు అంటే మనకు ప్రేమ ఉండ వచ్చు. అయితే వాటి యూరిన్ లో ఎలాంటి ఇమ్మ్యూనిటి ఉండదు. ఆ ఆవు కు ఏవన్నా జబ్బులు ఉంటే, ఆ జబ్బులు కూడా మనకు వచ్చే ప్రమాదం ఉంది. కాబట్టి ప్రజలు గో మాత్రానికి దూరముగా ఉంటే మంచిది.ప్రస్తుతము మన దగ్గర ఉన్న సమాచారం ప్రకారం హైడ్రాక్సీ క్లోరోక్విన్, క్లోరోక్విన్, రెండేసివిర్ మందులు ఆశాజనకముగా ఉన్నాయి. నేను హైడ్రాక్సీ క్లోరోక్విన్ మందు వ్రాస్తున్నాను. దేవుని కృప వలన ఇలాంటి మందులు కరోనా రోగులకు ఉపయోగపడే అవకాశం ఉంది. ఒక మంచి వార్త ఏమిటంటే, కరోనా వైరస్ సోకిన వారు అధిక శాతం ప్రాణాలు కోల్పోకుండా బయటపడుతున్నారు. గాలి పీల్చుకోవడం కష్టముగా ఉన్న వారికి వెంటిలేటర్ వాడాల్సి ఉంది.