కరోనా నేర్పే దేవుని పాఠాలు

Screen Shot 2020-04-06 at 10.35.04 AM.png

ఇప్పుడు ప్రపంచం మొత్తము కరోనా గుప్పిట్లో ఉంది. కోట్లాది మంది ప్రజలు ఇంటి గడప దాటి బయటకు వెళ్లలేని పరిస్థితి వచ్చింది. ప్రపంచ వ్యాప్తముగా ఇప్పటికే 10 లక్షల మంది ఈ వైరస్ బారిన పడ్డారు. దాదాపు 50 వేల మంది ప్రాణాలు కోల్పోయారు. వారు కూడా మన లాంటి మనుష్యులే, జీవితం మీద ఎన్నో ఆశలు పెట్టుకొని బ్రతుకున్నవారే. ఎక్కడో చైనా లో బయటపడిన వైరస్ తమ జీవితాన్ని అర్ధాంతరముగా చిదిపేస్తుంది అని వారు ఊహించి ఉండరు. కొన్ని దేశాల్లో మృత్యువు స్వైర్య విహారం చేస్తున్నది. ఇరాన్, ఇటలీ, స్పెయిన్, అమెరికా లాంటి దేశాల్లో ప్రతి రోజూ వేల మంది చనిపోతున్నారు. అటువంటి పరిస్థితి భారత దేశములో రాక ముందే మనము జాగ్రత్త పడాలి. అమెరికా దేశములో న్యూ యార్క్ చాలా విషమ పరిస్థితిలో ఉంది. అక్కడ 40,000 మందికి ఈ వైరస్ అంటుకుంది.1000 మందికి పైగా చనిపోయారు. ఒక్క నగరములో వెయ్యి మంది చనిపోతే పరిస్థితి ఎలా ఉంటుందో ఊహించండి. హాస్పిటల్ ముందు ట్రక్కులు పెట్టి మృత దేహాలను తీసుకొని వెళ్తున్నారు. ఒక్క నగరములో ఎందుకు ఇంత మంది చనిపోతున్నారు.న్యూ యార్క్ గవర్నర్ ఆండ్రూ క్యూమో ఒక మాట అన్నాడు. మేము అన్ని రకాల ప్రజలను ప్రేమిస్తాము.స్టాట్యూ అఫ్ లిబర్టీ స్వేచ్చకు ప్రతీకగా ఉంది.అందరికీ స్వేచ్ఛను ఇచ్చాము. అందరితో కలుస్తాము, అందరితో కలిసి మెలసి ఉంటాము. అందరూ ఇక్కడికి వస్తారు. వారి జబ్బులు, వారి అంటు వ్యాధులు కూడా ఇక్కడకు తీసుకు వస్తారు. ఈ పరిస్థితి మా ప్రేమకు, స్వేచ్చకు కట్టిన వెల అన్నాడు. ప్రేమలో స్వేచ్ఛ ఉంటుంది, స్వేచ్ఛలో రిస్క్ ఉంటుంది. ఆయన మాటలు విన్నప్పుడు నాకు యేసు ప్రభువు గుర్తుకు వచ్చాడు.ఆయన మనలను ప్రేమించాడు. ఆయన మనకు స్వేచ్ఛను ఇచ్చాడు. ఎంతో రిస్క్ తీసుకొన్నాడు.ఆయన మీద ఉమ్మి వేసాము, ఆయన ముఖంమీద గుద్దాము, కొరడాలతో కొట్టాము. మేకులు వేసి సిలువ వేసాము. మన మీద ఉన్న ప్రేమతో దేవుడు ఎంత రిస్క్ తీసుకొన్నాడు అని నాకు అనిపించింది. 

     ఈ కరోనా పాండెమిక్ లో కూడా దేవుని ప్రేమ మనలను నడిపిస్తున్నది. దేవుడు నన్ను మరచిపోయాడు, దేవుడు నన్ను నిర్లక్ష్యము చేస్తున్నాడు అని మనము అనుకోకూడదు. పరిస్థితులు బాగాలేదు. నేను ఇప్పుడు రోజుకు 15 గంటలు హాస్పిటల్ లో గడుపుతున్నాను. ఆది వారము కూడా హాస్పిటల్ లో ఉంటున్నాను. అనేక మంది పేషెంట్లు వస్తున్నారు. డాక్టర్, నా పరిస్థితి ఏమిటి? నాకు జ్వరము, దగ్గు, ఊపిరి పీల్చుకోలేక పోతున్నాను. నాకు కరోనా వైరస్ అంటుకుందా? నేను చనిపోతానా? టెస్ట్ చేయండి అని అడుగు తున్నారు. వారి పరిస్థితి చూసి నాకు బాధ వేసింది. రోజుకు 15 గంటలు హాస్పిటల్ లో ఉంటున్నాను. వీళ్ళ జబ్బులు, వైరస్లు నాకు అంటిస్తారేమో? దేవా, నాకెందుకు ఈ పరిస్థితి పెట్టావు? అని నా మనస్సులో అనుకొన్నాను. అపొస్తలుడైన పౌలు

రోమా పత్రిక 8 అధ్యాయములో వ్రాసిన మాటలు నాకు గుర్తుకు వచ్చాయి. ఆయన ఒక ప్రశ్న అడుగుతాడు: 

  1. క్రీస్తు ప్రేమనుండి మనలను ఎడబాపు వాడెవడు? శ్రమయైనను బాధయైనను

హింసయైనను కరవైనను వస్త్రహీనతయైనను ఉపద్రవమైనను 

ఖడ్గమైనను మనలను ఎడబాపునా? 

  1. మరణమైనను జీవమైనను దేవదూతలైనను ప్రధానులైనను ఉన్నవియైనను 

రాబోవున వియైనను అధికారులైనను ఎత్తయినను లోతైనను సృష్టింపబడిన 

మరి ఏదైనను,39. మన ప్రభువైన క్రీస్తు యేసునందలి

 దేవుని ప్రేమనుండి మనలను ఎడబాప నేరవని రూఢిగా నమ్ముచున్నాను.

     ఆ మాటలు నన్ను ఎంతో ధైర్యపరచినాయి. ఈ కరోనా వైరస్ కూడా క్రీస్తు ప్రేమ నుండి నన్ను వేరుచేయలేదు అని ధైర్యముగా హాస్పిటల్ కి వెళ్ళాను.పేషెంట్లకు సేవ చేశాను. అవిశ్వాసులు ఈ పరిణామాలకుఎంతో నిస్పృహ లోకి వెళ్లిపోయారు. ఈ పరిస్థితులలో క్రైస్తవులందరూ దేవుని ప్రేమను ఇతరులకు చూపించాలి. న్యూ యార్క్ నగరములో సెంట్రల్ పార్క్ లో సమారిటన్ పర్సు సంస్థ టెంట్ హాస్పిటల్ వేసింది. దానిని చూసినప్పుడు నాకు సంతోషం కలిగింది.బిల్లీ గ్రాహం గారి కుమారుడు ఫ్రాంక్లిన్ గ్రాహం ఆ ధార్మిక సంస్థ ను స్థాపించాడు. ఈ రోజు వారు కరోనా రోగుల కోసం ఆ హాస్పిటల్ కొన్ని గంటల్లో అక్కడ టెంట్ లు వేసి స్టార్ట్ చేశారు. బిల్లీ గ్రాహం గారు లూకా సువార్త 10 అధ్యాయములో నుండి మంచి సమరయుడు కథ చెబుతూ ఉండేవాడు. రక్తసిక్తమైన గాయాలతో రోడ్డు ప్రక్కన పడి ఉన్న బాధితునికి మంచి సమరయుడు సహాయం చేశాడు. అతని గాయాలు కట్టాడు, ఆహారం పెట్టాడు. ఆయన ప్రోత్సాహముతో ప్రారంభమైన సమరిటన్ పర్సు కరోనా రోగులకు సేవ చేస్తున్నది.ఈ రోజు మనము కూడా మన పర్సు తియ్యాలి. వీలైనంత మందికి సహాయము చేయాలి. డబ్బు లేని వారికి కూడా మనం సహాయం చేయాలి. 

    కొన్ని రోజుల క్రితం ఒక తండ్రి నా హాస్పిటల్ కు వచ్చాడు. రెండు సంవత్సరాల చిన్న పాప అతని చేతిలో ఉంది. ఆ పాప జ్వరముతో బాధపడుతూ ఉంది.ఆ తండ్రి నాతో అన్నాడు, ‘డాక్టర్, నా దగ్గర డబ్బులు లేవు, మా పాప జ్వరముతో బాధ పడుతుంది.ఈ ఊరు మొత్తము అన్ని హాస్పిటల్ లకు వెళ్ళాను.నా దగ్గర డబ్బులు లేవని ఎవరూ మా పాపను చూడటల్లేదు అన్నాడు. అతని పరిస్థితి చూసి నాకు బాధ కలిగింది. ఆ పాపను చేర్చుకొని పరీక్షలు చేసి, మందులు వ్రాశాను. ఆ తండ్రి నాకు కృతఙ్ఞతలు చెప్పాడు. వెళ్లబోయే ముందు కనీసం 10 సార్లు ‘థాంక్యూ డాక్టర్’ అని చెప్పాడు.

దేవుడు కూడా మన యొద్ద నుండి కృతజ్ఞత కోరుతున్నాడు. రోమా 1:21 లో మనము చదువుతాము.

వారు దేవుని నెరిగియు ఆయనను దేవునిగా మహిమపరచ లేదు, కృతజ్ఞతాస్తుతులు

 చెల్లింపనులేదు గాని తమ వాదముల యందు వ్యర్థులైరి. 

     ఈ రోజు మన సమాజములో చాలా మంది పరిస్థితి అలాగే ఉంది. దేవుడు వారికి ఎంతో సహాయం చేశాడు, వారికి ఎన్నో బ్లెస్సింగ్స్ ఇచ్చాడు. అయితే వారు ఒక నిమిషం కూడా దేవుని మహిమపరచరు. నోరు విప్పి ఒక్క సారి కూడా దేవునికి కృతజ్ఞతా స్తుతులు చెల్లించరు. ఈ కరోనా సమయములో దేవుడు వారితో మాట్లాడుతున్నాడు. వారు తమ వాదములలో వ్యర్థులవుతున్నారు. ఒకాయన వాట్సాప్ లో నాకు మెసేజ్ పెట్టాడు. గోమూత్రం త్రాగితే కరోనా మన జోలికి రాదు. ఆయన మాటలు నమ్మి కొంతమంది గో మూత్రం త్రాగుతున్నారు. ఆవులు అంటే మనకు ప్రేమ ఉండ వచ్చు. అయితే వాటి యూరిన్ లో ఎలాంటి ఇమ్మ్యూనిటి ఉండదు. ఆ ఆవు కు ఏవన్నా జబ్బులు ఉంటే, ఆ జబ్బులు కూడా మనకు వచ్చే ప్రమాదం ఉంది. కాబట్టి ప్రజలు గో మాత్రానికి దూరముగా ఉంటే మంచిది.ప్రస్తుతము మన దగ్గర ఉన్న సమాచారం ప్రకారం హైడ్రాక్సీ క్లోరోక్విన్, క్లోరోక్విన్, రెండేసివిర్ మందులు ఆశాజనకముగా ఉన్నాయి. నేను హైడ్రాక్సీ క్లోరోక్విన్ మందు వ్రాస్తున్నాను. దేవుని కృప వలన ఇలాంటి మందులు కరోనా రోగులకు ఉపయోగపడే అవకాశం ఉంది. ఒక మంచి వార్త ఏమిటంటే, కరోనా వైరస్ సోకిన వారు అధిక శాతం ప్రాణాలు కోల్పోకుండా బయటపడుతున్నారు. గాలి పీల్చుకోవడం కష్టముగా ఉన్న వారికి వెంటిలేటర్ వాడాల్సి ఉంది. 

     చాలా హాస్పిటల్ లలో పేషెంట్ లకు సరిపోయినంత సంఖ్యలో వెంటిలేటర్ లు లేవు. అమెరికా లో కొన్ని చోట్ల పరిస్థితి ఎలా తయారయ్యిందంటే, ఎవరికి వెంటిలేటర్ ఇవ్వాలో, ఎవరికి ఇవ్వకూడదో డాక్టర్లు, అధికారులు నిర్ణయిస్తున్నారు. వారిని చూసినప్పుడు నాకు నాజీ అధికారులు గుర్తుకు వచ్చారు. పోయిన సారి నేను పోలాండ్ వెళ్ళినప్పుడు ఔస్క్ విట్జ్ కాన్సంట్రేషన్ క్యాంపుకు వెళ్ళాను. అక్కడ రైలు పట్టాల దగ్గర నడిచాను. రెండో ప్రపంచ యుద్ధములో హిట్లర్, అతని నాజీ సైన్యము లక్షలాది మంది యూదులను అక్కడకు తరలించారు. రైలు పెట్టెల్లో వారిని అక్కడకు తీసుకొని  వచ్చేవారు. వారు రైలు దిగగానే అక్కడ ఒక నాజీ అధికారి నిలబడి ఉండేవాడు. కాస్త బలముగా, తక్కువ వయస్సు ఉన్న వారిని ఆ అధికారి ఒక ప్రక్కకు పంపేవాడు. వారందరినీ బానిసలుగా చేసుకొని వెట్టి చాకిరీ చేయించుకునేవారు. కాస్త బలహీనముగా కనిపించిన వారిని, వృద్ధులను ఇంకో వైపుకు పంపేవాడు. వాళ్లందరినీ గ్యాస్ ఛాంబర్లలో వేసి విషవాయువులు వదలి వారి ప్రాణాలు తీసేవారు. ఎవరు బ్రతకాలో, ఎవరు చనిపోవాలో ఆ అధికారి నిర్ణయించేవాడు. ఇప్పుడు కూడా అటువంటి మనస్తత్వము మనము చూస్తున్నాము. బలహీనముగా ఉన్న వారికి, పని చేయలేని వారికి వెంటిలేటర్లు ఇవ్వటం లేదు. బలముగా ఉన్న వారికి, పనిచేయగలడు అనుకొనే వారికి వెంటిలేటర్ ఇవ్వటం లేదు. ఆ విధముగా ఎవరు బ్రతకాలో, ఎవరు చనిపోవాలో కొంత మంది డాక్టర్లు, అధికారులు నిర్ణయిస్తున్నారు. అది చాలా తప్పు. దీనిని యుటిలిటేరియనిజం ( Utilitarianism) అంటారు. ఈ ఫిలాసఫీ ఏమంటదంటే, ఒక వ్యక్తి విలువ అతని ఆర్థిక స్థోమత మీద ఆధారపడి ఉంటుంది. ఒక వ్యక్తి విలువ ఆ వ్యక్తి సమాజానికి ఎంత ఉపయోగపడతాడు అనే దాని మీద ఆధారపడివుంటుంది. ఈ ఫిలాసఫీ ఇప్పుడు ప్రపంచాన్ని నడిపిస్తున్నది. ఇది చాలా ప్రమాదకరం. 

     వ్యక్తి విలువ దేవుడు నిర్ణయించాడు.దానిని మనిషి తన చేతుల్లోకి తీసుకోకూడదు.దేవుడు తన స్వరూపమందు నరుని సృష్టించెను అని ఆదికాండము 1:26 లో మనము చదువుతున్నాము.దేవుడు తన స్వరూపమందు ప్రతి వ్యక్తిని సృష్టించి వారికి ఒక ప్రత్యేకమైన, స్థిరమైన, శాశ్వతమైన విలువ ఇచ్చాడు. యేసు ప్రభువు అడిగాడు: ‘ఒక సర్వలోకమును సంపాదించుకొని తన ఆత్మను పోగొట్టుకొనుట వాని కేమి ప్రయోజనము?’. సర్వలోకము కంటే ఒక వ్యక్తి యొక్క ఆత్మ విలువైనది. కాబట్టి సరిపోయినన్ని వెంటిలేటర్లు లేవని చెప్పి కొంతమందిని చావుకు వదిలివేయడం 

చాలా తప్పు. నా ముక్కు బాగా లేదు, నా బుగ్గలు బాగా లేదు, నా కళ్ళు బాగా లేదు, నా పొట్ట బాగా లేదు అని ప్లాస్టిక్ సర్జరీల మీద కొన్ని వేల కోట్లు ఖర్చు పెడుతున్నారు. ఆ డబ్బుతో పేషెంట్ లకు ఉపయోగపడే వెంటిలేటర్ లు కొంటే మంచిది. ప్రభుత్వాలు కూడా యుద్ధ ప్రాతిపదిక మీద వెంటిలేటర్ లు తయారు చేసి ఆయాసము వచ్చిన వారందరికీ వాటిని అందుబాటులోకి తెస్తే మంచిది. రోడ్ల మీద నిలబెట్టి జనం మీద కెమికల్స్ స్ప్రే చేస్తున్నారు. అది చాలా దారుణము.ఈ కరోనా సమయములో కూడా వ్యక్తి యొక్క విలువ, గౌరవం లను మనము మరచిపోకూడదు. వాటిని నిర్లక్ష్యం చేయకుండానే మనం ఆరోగ్యాన్ని కాపాడు కోవచ్చు. 

    ఆ తరువాత ప్రశ్న, కరోనా సమయములో చర్చిలు మూసివేయాలా? కొంత మంది పాస్టర్లు ఆది వారము ఇంకా ప్రజలను మందిరాల్లో ఉంచి ప్రార్ధనలు, ఆరాధనలు చేస్తూనే ఉన్నారు. ప్రభుత్వము కొంత మంది పాస్టర్ లను అరెస్ట్ చేయడం మనము చూస్తున్నాము. దేవుడే మమ్ములను కాపాడుతాడు అని వారు అంటున్నారు. అది కూడా మంచి పద్దతి కాదు. రోమా 13 ప్రకారము క్రైస్తవులు మానవ ప్రభుత్వములకు లోబడి ఉండాలి. ప్రభుత్వ వ్యవస్థ ను పెట్టింది కూడా దేవుడే. ఈ వైరస్ నుండి కాపాడుకోవాలంటే మనము సామాజిక దూరం పాటించాలి. ఢిల్లీ లో నిజాముద్దీన్ ప్రాంతములో జరిగిన ఒక మత కార్యక్రమములో పాల్గొన్న వారిలో వందలాది మందికి ఈ వైరస్ సోకింది. కాబట్టి ఈ సమయములో మత కార్యక్రమాలకు దూరముగా ఉంటే మంచిది. దేవుడి పేరు చెప్పి మనము తీసుకొనవలసిన  జాగ్రత్తలు మానివేయడం మంచిది కాదు. ప్రార్ధన చేశామని నిర్లక్ష్యముగా డ్రైవ్ చేయము కదా. ప్రార్ధన చేశామని మందులు వేసుకోకుండా ఉండము కదా. ప్రార్ధన చేశామని చదువుకోకుండా పరీక్షకు వెళ్ళము కదా. ప్రార్ధన చేస్తూనే మన జాగ్రత్తలు మనము తీసుకోవాలి. 

     తరువాత ప్రశ్న: ఒంటరి తనమును ఎలా జయించాలి? కరోనా వలన సామాజిక దూరము పాటించవలసి వచ్చింది. దీని వలన చాలా మంది ఒంటరి తనమునకు గురవుతున్నారు. చరిత్రలో ఇప్పుడు ఉన్నంత సమాచార వ్యవస్థ ఇంతకు ముందు ఎప్పుడూ లేదు. అయినప్పటికీ మనం ఒంటరి తనానికి గురవుతూనే ఉన్నాము. ఇంకో విచిత్రం ఏమిటంటే ఇప్పుడు చాలా మంది ఇళ్లల్లోనే ఉండుట వలన గృహ హింస పెరుగుతున్నది. డొమెస్టిక్ అబ్యూస్ కేసులు పెరిగిపోయినవి. అంటే మన కుటుంబ సభ్యులతో కూడా ఎలా జీవించాలో, ప్రవర్తించాలో మనము నేర్చుకోలేదు. ఇతరులతో మన సంభందం బాగుండాలంటే ముందు మనకు దేవునితో మంచి సహవాసం ఉండాలి.  

    రవి జకరియాస్ గారుమొన్న నిన్న ఒక మాట చెప్పాడు. నాకు కాన్సర్ వచ్చింది. ట్రీట్మెంట్ కోసం టెక్సాస్ వచ్చాను.చుట్టూ కరోనా, నాకు కాన్సర్. ఈ సమయములో నేను దేవుని సహవాసములో గడుపుతున్నాను అన్నాడు. ఆయన కోసం మనమందరమూ ప్రార్ధన చేయాలి. ఆయన వలె, దేవుని దాసులు దేవుని సహవాసములో గడిపి క్లిష్ట పరిస్థితుల్లో కూడా ఒంటరి తనముతో బాధపడరు. 

23 కీర్తన లో మనము చదువుతాము: గాఢాంధకారపు లోయలో నేను సంచరించినను ఏ అపాయమునకు భయపడను నీవు నాకు తోడైయుందువు నీ దుడ్డుకఱ్ఱయు నీదండమును నన్ను ఆదరించును.

కీర్తన 23:4 

    దావీదును ఎప్పుడూ దేవుని సహవాసములో గడిపాడు. మనుష్యులు అందరూ ఆయనను వదలి వెళ్లిపోయిన సందర్భాలు ఆయన జీవితములో అనేకము ఉన్నాయి. అయితే ఆ ఒంటరి తనములో దావీదు దేవుని సహవాసములో గడిపాడు.1665 లో ప్లేగ్ వ్యాధి ఇంగ్లాండ్ దేశాన్ని చుట్టుముట్టింది.సర్ ఐజక్ న్యూటన్ కేంబ్రిడ్జి యూనివర్సిటీ లో చదువుకుంటున్నాడు. ఆయన వయస్సు 23 సంవత్సరాలు. ప్లేగ్ వ్యాధి వలన యూనివర్సిటీ మూతపడింది. న్యూటన్ కేంబ్రిడ్జి కి 60 మైళ్ళ దూరములో ఉన్న తన స్వగ్రామానికి వెళ్ళాడు. స్వీయ గృహ నిర్బంధములో గడిపాడు.ఆ సమయాన్ని వృథా చేయకుండా అనేక పరిశోధనలు చేశాడు. గురుత్వాకర్షణ శక్తి మీద అనేక పరిశోధన ప్రయోగాలు చేశాడు.బైబిల్ స్టడీ చేశాడు. బైబిల్ ప్రవచనాలు చదివాడు.మనం కూడా ఈ సమయములోబైబిల్ స్టడీ చేస్తే మంచిది. బైబిల్ ప్రవచనాలు చదివితే మంచిది.

    తరువాత ప్రశ్న: యిర్మీయా గ్రంథము 7:32 లో చెప్పబడిన ప్రవచనము ఇటలీ లోని తోఫెతులో నెరవేరిందా? ఈ ప్రవచనము చూద్దాము: 32. కాలము సమీపించుచున్నది; అప్పుడు అది తోఫెతు అనియైనను బెన్‌హిన్నోము లోయ అనియైనను అనబడక వధలోయ అనబడును; పాతిపెట్టు టకు స్థలము లేకపోవువరకు తోఫెతులో శవములు పాతి పెట్టబడును; ఇదే యెహోవా వాక్కు.

    కొంతమంది ఏమంటున్నారంటే, ఇటలీ లోని తోఫెతు లో కరోనా వలన చాలా మంది చనిపోయారు. వారిని పాతిపెట్టుటకు కూడా స్థలము లేదు. యిర్మీయా చెప్పిన ప్రవచనం ఇక్కడ నెరవేరింది అని అంటున్నారు. అయితే, ఇటలీ లో ఉన్న తోఫెతుకు, యిర్మీయా 7 లో ఉన్న తోఫెతుకు అసలు ఎలాంటి సంబంధము లేదని మనం గ్రహించాలి. ఈ తోఫెతు యెరూషలేము సమీపములో బెన్ హిన్నోము లోయలో ఉంది. ఇశ్రాయేలీయులు ఈ లోయలో మానవ బలులు అర్పిస్తున్నారు. వారు దేవుని వైపు నుండి తొలగిపోయి అన్య జనుల విగ్రహములవైపుకు వెళ్లిపోయారు.31 వచనము లో చదువుతున్నాము.

అగ్నిలో తమ కుమారులను తమ కుమార్తెలను

 దహించుటకు బెన్‌ హిన్నోము లోయలోనున్న

 తోఫెతునందు బలిపీఠములను కట్టుకొనియున్నారు. 

   ఆ మాటలు మీరు గమనించండి: బెన్‌ హిన్నోము లోయలోనున్న తోఫెతు. తోఫెతు అంటే తోఁఫు  అనే పదములో నుండి వచ్చింది. అంటే డ్రమ్ అని అర్థము. ఇశ్రాయేలీయులు ఈ లోయలో మొలెకు అనే సూర్య దేవతకు విగ్రహారాధన చేసేవారు.

తమ కుమారులను, కుమార్తెలను ఆ దేవతకు అర్పించేవారు. ఆ చిన్న పిల్లలు పెట్టె కేకలు వినిపించకుండా వారు డ్రమ్ములు వేసేవారు. దానిని బట్టి ఆ ప్రాంతానికి తోఫెతు లేక ‘డ్రమ్ములు’ అనే పేరు వచ్చింది. ఇశ్రాయేలీయులు చేసే ఘోరాలు చూడలేక దేవుడు వారిని తన ప్రవక్తల ద్వారా హెచ్చరించాడు.వారు దేవుని మాట వినలేదు. అప్పుడు దేవుడు యిర్మీయా ద్వారా ఈ ప్రవచనము చేశాడు. ఆ ప్రవచనము బబులోనీయుల ద్వారా దేవుడు నెర వేర్చాడు. క్రీ పూ 586 లో నెబుకద్నెజ్జరు రాజు యెరూషలేమును ముట్టగించి అక్కడ ఉన్న దేవుని ఆలయాన్ని నాశనం చేసి యూదులను హతమార్చాడు. ఆ విధముగా యిర్మీయా చేసిన ప్రవచనం క్రీ. పూ 586 లో నెరవేరింది. దానికి ప్రస్తుతం ఉన్న కరోనాకి ఎలాంటి సంభందం లేదు. యిర్మీయా 7:32 లో ‘పాతిపెట్టు టకు స్థలము లేకపోవువరకు తోఫెతులో శవములు పాతి పెట్టబడును’ అన్న మాటలు కూడా మనకు కనిపిస్తున్నాయి. ఇటలీ లో వేల మంది చనిపోయిన మాట వాస్తవమే. అయితే పాతి పెట్టుటకు స్థలము లేనంత ఘోరముగా వారి పరిస్థితి లేదు. వారందరినీ సమాధి పెట్టెల్లో పెట్టి అంతిమ సంస్కారాలు బాగానే చేస్తున్నారు. కాబట్టి, యిర్మీయా 7:32 కి ఇటలీ లోని తోఫెతుకు ఎలాంటి సంభందము లేదు.

    మరొక ప్రశ్న, కరోనా లో 666 సంఖ్య ఉందా? ఇది సోషల్ మీడియా లో విపరీతముగా వైరల్ అయ్యింది. CORONA లో 6 అక్షరాలు ఉన్నాయి. ఇంకో వైపు C అంటే 3, O అంటే15, R అంటే18, O అంటే15, N అంటే 14, A అంటే 1, మొత్తం కలిపితే 66. దీనిని బట్టి కరోనా లో 666 ఉంది అని అంటున్నారు. అయితే, కరోనా కి 666 కి ఎలాంటి సంభందం లేదని మనం గ్రహించాలి. ఇలాంటి గణాంకాలు చరిత్రలో చాలా మంది, చాలా సార్లు చేశారు. గ్రీకు, హెబ్రీ, లాటిన్ భాషల్లో అక్షరాలకు సంఖ్యలు పెట్టి 666 ను రకరకాలుగా చూపించవచ్చు. HITLER పేరులో 6 అక్షరాలు ఉన్నాయి కాబట్టి ఆయనే అంత్య క్రీస్తు అని చాలా కాలము అన్నారు. నీరో, కలిగ్యుల, డయోక్లిషియన్, హిట్లర్, స్టాలిన్, ముస్సోలిని, జాన్ కెన్నెడీ, డోనాల్డ్ ట్రంప్ ఇలా చాలా మందికి ఈ 666 కలిపి అంత్య క్రీస్తు అని పిలిచారు. మనకు కనిపించే ప్రతి ప్రముఖ నాయకుణ్ణి ఈయనే అంత్య క్రీస్తు అని చెబితే మనం నవ్వుల పాలు అవుతాము తప్ప మనకు ఎలాంటి ప్రయోజనం ఉండదు. 666 అనేది అంత్య క్రీస్తు సంఖ్య.  క్రైస్తవ సంఘము భూమి మీద ఉన్నంత కాలము అంత్య క్రీస్తు కనిపించడు. సంఘము ఎత్తబడిన తరువాత ఏడేండ్ల శ్రమలు భూమి మీదకు వస్తాయి. ఈ విషయాలు మీకు సుళువుగా అర్థం కావాలంటే మా వెబ్ సైట్ www.doctorpaul.org కి వెళ్లి బైబిలు ప్రవచనాలు చార్టులు అనే పేజీ కి వెళ్లి ఈ చార్టు డౌన్ లోడ్ చేసుకోండి. నేను వ్రాసిన ‘ఆఖరి రోజులు’ పుస్తకం చదవండి. 666 ఎప్పుడు వస్తుందో ఈ పుస్తకములో నేను వివరించాను. కొంతమంది పూర్వము నెరవేరిన ప్రవచనాలను ఇప్పుడు కరోనాకు రుద్దుతున్నారు. మరికొంతమంది భవిష్యత్తులో నెరవేరబోయే ప్రవచనాలను ఇప్పుడు కరోనాకు రుద్దుతున్నారు. రెండుకోణాలు మంచివి కాదు. 

     నిన్న ఒక క్రూజ్ షిప్ సముద్రములో చిక్కుకొంది.అందులో వందలాది మంది ప్రయాణికులుఉన్నారు. వారిలో ఎంతో మందికి కరోనా వైరస్ సోకింది. జ్వరం తట్టుకోలేక కొంతమంది ప్రాణాలు కోల్పోయారు. ‘రక్షించండి’ ‘రక్షించండి’ అని అనేక  మంది ఓడ కిటికీలు ఎక్కి కేకలు వేస్తున్నారు. అనేక దేశాలు ఈ ఓడను తమ తీరానికి రావటానికి వీల్లేదు అని తిరస్కరిస్తున్నాయి. వారిని రక్షించేది ఎవరు? ఈ లోకం మొత్తము పాపము అనే వైరస్ తో నిండిన ఓడ వలె ఉంది. మనలను రక్షించేది ఎవరు? యేసు క్రీస్తు సువార్త  అదే.పాప రోగముతో నిండి ఉన్న ఈ ఓడలో నుండి మనలను రక్షించడానికే ప్రభువైన యేసు క్రీస్తు ఈ లోకానికి వచ్చాడు. ఆయన సిలువ వేయబడింది అందుకే. మరణించి, తిరిగి లేచింది అందుకే.ఈ రోజు మీరు ఆ సిలువ దగ్గరకు వచ్చి, పాప క్షమాపణ పొంది, ప్రభువైన యేసు క్రీస్తును మీ రక్షకునిగా, ప్రభువుగా అంగీకరించి, ఆయన ఇచ్చే గొప్ప నిరీక్షణను, ఆదరణను పొందాలన్నదే నేటి  మా ప్రేమ సందేశం.