చాలా హాస్పిటల్ లలో పేషెంట్ లకు సరిపోయినంత సంఖ్యలో వెంటిలేటర్ లు లేవు. అమెరికా లో కొన్ని చోట్ల పరిస్థితి ఎలా తయారయ్యిందంటే, ఎవరికి వెంటిలేటర్ ఇవ్వాలో, ఎవరికి ఇవ్వకూడదో డాక్టర్లు, అధికారులు నిర్ణయిస్తున్నారు. వారిని చూసినప్పుడు నాకు నాజీ అధికారులు గుర్తుకు వచ్చారు. పోయిన సారి నేను పోలాండ్ వెళ్ళినప్పుడు ఔస్క్ విట్జ్ కాన్సంట్రేషన్ క్యాంపుకు వెళ్ళాను. అక్కడ రైలు పట్టాల దగ్గర నడిచాను. రెండో ప్రపంచ యుద్ధములో హిట్లర్, అతని నాజీ సైన్యము లక్షలాది మంది యూదులను అక్కడకు తరలించారు. రైలు పెట్టెల్లో వారిని అక్కడకు తీసుకొని వచ్చేవారు. వారు రైలు దిగగానే అక్కడ ఒక నాజీ అధికారి నిలబడి ఉండేవాడు. కాస్త బలముగా, తక్కువ వయస్సు ఉన్న వారిని ఆ అధికారి ఒక ప్రక్కకు పంపేవాడు. వారందరినీ బానిసలుగా చేసుకొని వెట్టి చాకిరీ చేయించుకునేవారు. కాస్త బలహీనముగా కనిపించిన వారిని, వృద్ధులను ఇంకో వైపుకు పంపేవాడు. వాళ్లందరినీ గ్యాస్ ఛాంబర్లలో వేసి విషవాయువులు వదలి వారి ప్రాణాలు తీసేవారు. ఎవరు బ్రతకాలో, ఎవరు చనిపోవాలో ఆ అధికారి నిర్ణయించేవాడు. ఇప్పుడు కూడా అటువంటి మనస్తత్వము మనము చూస్తున్నాము. బలహీనముగా ఉన్న వారికి, పని చేయలేని వారికి వెంటిలేటర్లు ఇవ్వటం లేదు. బలముగా ఉన్న వారికి, పనిచేయగలడు అనుకొనే వారికి వెంటిలేటర్ ఇవ్వటం లేదు. ఆ విధముగా ఎవరు బ్రతకాలో, ఎవరు చనిపోవాలో కొంత మంది డాక్టర్లు, అధికారులు నిర్ణయిస్తున్నారు. అది చాలా తప్పు. దీనిని యుటిలిటేరియనిజం ( Utilitarianism) అంటారు. ఈ ఫిలాసఫీ ఏమంటదంటే, ఒక వ్యక్తి విలువ అతని ఆర్థిక స్థోమత మీద ఆధారపడి ఉంటుంది. ఒక వ్యక్తి విలువ ఆ వ్యక్తి సమాజానికి ఎంత ఉపయోగపడతాడు అనే దాని మీద ఆధారపడివుంటుంది. ఈ ఫిలాసఫీ ఇప్పుడు ప్రపంచాన్ని నడిపిస్తున్నది. ఇది చాలా ప్రమాదకరం.
వ్యక్తి విలువ దేవుడు నిర్ణయించాడు.దానిని మనిషి తన చేతుల్లోకి తీసుకోకూడదు.దేవుడు తన స్వరూపమందు నరుని సృష్టించెను అని ఆదికాండము 1:26 లో మనము చదువుతున్నాము.దేవుడు తన స్వరూపమందు ప్రతి వ్యక్తిని సృష్టించి వారికి ఒక ప్రత్యేకమైన, స్థిరమైన, శాశ్వతమైన విలువ ఇచ్చాడు. యేసు ప్రభువు అడిగాడు: ‘ఒక సర్వలోకమును సంపాదించుకొని తన ఆత్మను పోగొట్టుకొనుట వాని కేమి ప్రయోజనము?’. సర్వలోకము కంటే ఒక వ్యక్తి యొక్క ఆత్మ విలువైనది. కాబట్టి సరిపోయినన్ని వెంటిలేటర్లు లేవని చెప్పి కొంతమందిని చావుకు వదిలివేయడం చాలా తప్పు. నా ముక్కు బాగా లేదు, నా బుగ్గలు బాగా లేదు, నా కళ్ళు బాగా లేదు, నా పొట్ట బాగా లేదు అని ప్లాస్టిక్ సర్జరీల మీద కొన్ని వేల కోట్లు ఖర్చు పెడుతున్నారు. ఆ డబ్బుతో పేషెంట్ లకు ఉపయోగపడే వెంటిలేటర్ లు కొంటే మంచిది. ప్రభుత్వాలు కూడా యుద్ధ ప్రాతిపదిక మీద వెంటిలేటర్ లు తయారు చేసి ఆయాసము వచ్చిన వారందరికీ వాటిని అందుబాటులోకి తెస్తే మంచిది. రోడ్ల మీద నిలబెట్టి జనం మీద కెమికల్స్ స్ప్రే చేస్తున్నారు. అది చాలా దారుణము.ఈ కరోనా సమయములో కూడా వ్యక్తి యొక్క విలువ, గౌరవం లను మనము మరచిపోకూడదు. వాటిని నిర్లక్ష్యం చేయకుండానే మనం ఆరోగ్యాన్ని కాపాడు కోవచ్చు.