కీర్తనలలో క్రీస్తు : 22 వ కీర్తన : డాక్టర్ పాల్ కట్టుపల్లి

ఈ రోజు 22 వ కీర్తన మనం ధ్యానిద్దాం. 22 వ కీర్తనలో చాలా గొప్ప సత్యాలు దాగివున్నాయి. మొదటి వచనం చూద్దాం:

నా దేవా నా దేవా, నీవు నన్నేల విడనాడితివి? నన్ను రక్షింపక నా ఆర్తధ్వని వినక నీవేల దూరముగానున్నావు?కీర్తన 22:1

ప్రవచన కీర్తనలను మనం ధ్యానిస్తున్నాం. అంటే, ఈ కీర్తనలు  యేసు క్రీస్తు ప్రభువు గురించి వ్రాయబడినవి. ఆయన యొక్క రూపం చూడడమే మనకు భాగ్యం. 119 కీర్తనలో మనం చదువుతాం.

నేను నీ ధర్మశాస్త్రమునందు ఆశ్చర్యమైన సంగతులను చూచునట్లు నా కన్నులు తెరువుము.

Open Thou mine eyes, that I may behold wondrous things out of Thy law.

కన్నులు అంటే ఈ భౌతిక కన్నులు కాదు. అవి మనోనేత్రాలు. భౌతిక కన్నులు తెరచివున్నప్పటికీ మన మనో నేత్రాలు మూసుకొనివుంటే యేసు క్రీస్తు మనకు కనిపించడు. ఉదాహరణకు, యేసు ప్రభువు సిలువవేయబడిన తరువాత ఇద్దరు శిష్యులు ఎమ్మాయి వైపుకు నడచివెళ్తున్నారు. వారితో ఒక వ్యక్తి దారిలో కలిసాడు. ఆయన ఎవరంటే యేసు క్రీస్తే. ఆయనను వారు గుర్తుపట్టలేకపోయారు. అప్పుడు యేసు ప్రభువు వారికి ఒక లెక్చర్ ఇచ్చాడు. లూకా సువార్త 24 అధ్యాయములో మనం చదువుతాం.

లూకా సువార్త 24: 44

 1. మోషేయు సమస్త ప్రవక్తలును మొదలు కొని లేఖనములన్నిటిలో తన్ను గూర్చిన వచనముల భావము వారికి తెలిపెను.
 1. అంతట ఆయన మోషే ధర్మశాస్త్రములోను ప్రవక్తల గ్రంథములలోను, కీర్తనలలోను నన్నుగూర్చి వ్రాయబడిన వన్నియు నెరవేరవలెనని నేను మీయొద్ద ఉండినప్పుడు మీతో చెప్పిన మాటలు నెరవేరినవని వారితో చెప్పెను

యేసు ప్రభువు వారితో అంటున్నాడు మోషే వ్రాసిన ధర్మశాస్త్రం చదవండి ప్రవక్తల గ్రంధాలు చదవండి; కీర్తన గ్రంధం చదవండి; వాటన్నిటిలో నా గురించి వ్రాయబడింది. ఆ రోజు ఎమ్మాయి వైపుకు నడచి వెళ్తున్న ఆ ఇద్దరు శిష్యులకు యేసు ప్రభువు ఈ కీర్తన 22 లో చెప్పబడిన మాటలు తప్పకుండా ప్రస్తావించే ఉంటాడు. పౌలు గారు చెప్పటం కాదు, పేతురు గారు చెప్పటం కాదు, స్వయానా యేసు ప్రభువే మనకు ఈ కీర్తనలు ఎవరి గురించి వ్రాయబడ్డాయో తెలియజేశాడు.

ఈ 22 వ కీర్తన మనం చదివితే యేసు క్రీస్తు యొక్క సిలువ మనకు ఎంతో స్పష్టముగా కనిపిస్తుంది. Prophecy is History  Prewritten అన్నారు. ప్రవచనాలు ముందుగా వ్రాయబడిన చరిత్ర అన్నారు. యేసు ప్రభువు ఏ విధంగా సిలువవేయబడతాడో దేవుడు ముందుగానే, వెయ్యి సంవత్సరాలు ముందుగా దావీదు ద్వారా తన వాక్యంలో తెలియజేశాడు. దావీదు తన ఆవేదనను ఈ కీర్తనలో తెలియజేస్తున్నాడు. సహాయం కోసం దేవుని అభ్యర్దిస్తున్నాడు. పరిశుద్దాత్మ ప్రేరేపణతో అతడు రాబోయే రక్షకుడు పొందే శ్రమలను కూడా ఇక్కడ వర్ణిస్తున్నాడు. ప్రవచనాల్లో ప్రస్తుత అన్వయింపు, భవిష్యత్తు అన్వయింపు రెండూ ఉంటాయి.

22 వ కీర్తన అది వ్రాయబడినప్ప్పుడు దావీదు యొక్క శ్రమలను కొంతమేరకు తెలియజేసింది. అయితే దాని భవిష్యత్తు అన్వయింపు రక్షకుని గురించే, యేసు క్రీస్తు గురించే. వారు నా చేతులను నా పాదములను పొడిచియున్నారు అని 16 వచనంలో మనం చదువుతున్నాం. ఆ మాటలు దావీదుకు వర్తించవు. ఆయన చేతులు, పాదములు పొడవబడలేదు. బైనాక్యూలర్స్ లో రెండు కళ్ళముందు రెండు అద్దాలు ఉంటాయి. ఈ కీర్తనను ఆ విధంగా మనం ఊహించవచ్చు. ఒక కంటిముందు దావీదు ఉంటే, మరొక కంటి ముందు యేసు ప్రభువును మనం చూడవచ్చు. దావీదు ప్రవక్త. అపొస్తలుల కార్యములు 2 అధ్యాయం 30 వచనంలో పేతురు గారు దావీదును ప్రవక్త అని పిలిచాడు. దావీదు పరిశుద్దాత్మ చేత ప్రేరేపించబడి భవిష్యత్తులోకి చూచి యేసు ప్రభువును వీక్షించాడు. క్రొత్త నిబంధనలో ఏడు సార్లు ఈ 22 వ కీర్తన ప్రస్తావించబడింది. ఏడు సార్లు యేసు ప్రభువు ను దృష్టిలో పెట్టుకొనే ఈ కీర్తన ఉదాహరించబడింది. ఈ అధ్యాయములో 12 విషయాలు మీకు చూపించాలని నేను ఆశ పడుచున్నాను

 1. Scream
 2. Snub
 3. Spectacle
 4. Slaughter
 5. Sacrifice
 6. Sponge
 7. Spear
 8. Skeleton
 9. Shroud
 10. Synthesis
 11. Sketch
 12. Song

 

 

 • Scream

 

మొదటి వచనం చూద్దాం:

నా దేవా నా దేవా, నీవు నన్నేల విడనాడితివి? నన్ను రక్షింపక నా ఆర్తధ్వని వినక నీవేల దూరముగానున్నావు?కీర్తన 22:1

మార్కు సువార్త 15 అధ్యాయం కూడా చూద్దాం. యేసు ప్రభువు సిలువమీద ఈ మాటలు పలికాడు.

 1. మధ్యాహ్నము మొదలుకొని మూడు గంటలవరకు ఆ దేశమంతటను చీకటి కమ్మెను.34. మూడు గంటలకు యేసు ఎలోయీ, ఎలోయీ, లామా సబక్తానీ అని బిగ్గరగా కేక వేసెను; aa మాటలకు నా దేవా, నా దేవా, నన్ను ఎందుకు చెయ్యివిడిచితివని అర్థము. 

ప్రభువైన యేసు క్రీస్తు సిలువమీద ఆ మాటలు పలికాడు. శుక్రవారం ఉదయం అర్ధరాత్రి ఒంటి గంట ప్రాంతములో యేసు ప్రభువును అరెస్ట్ చేశారు. ప్రధాన యాజకులు అన్న, కయపల ముందు ఆయనను హాజరు పరచారు. ఆయన చేయని నేరాలు ఆయన మీద మోపారు. ఆయనను హత్య చేయాలని వారు కుట్ర పన్నారు. కానీ మరణ శిక్ష వేసే అధికారం యూదా మతాధికారులకు లేదు. రోమన్ గవర్నర్ మాత్రమే మరణ శిక్ష విధించగలడు. యేసు ప్రభువును రోమన్ గవర్నర్ పిలాతు ముందు నిలబెట్టారు. అబద్ద సాక్షులను రెచ్చగొట్టారు. పిలాతు అధికార కాంక్షతో యూదులను తిరస్కరించి యేసు ప్రభువుకు న్యాయం చేయలేకపోయాడు. ఆయనకు మరణశిక్ష విధించాడు. ఉదయం 9 గంటలకు యేసు ప్రభువును సిలువ వేశారు.సిలువ మీద యేసు ప్రభువు ఏడు సార్లు మాట్లాడాడు.  9 గంటల నుండి మధ్యాహ్నం 12 గంటల వరకు ఆయన మూడు సార్లు మాట్లాడాడు.

తండ్రీ, వీరేమి చేయుచున్నారో వీరెరుగరు కనుక వీరిని క్షమించుము అని తన హంతకుల క్షమాపణ కోసం ఆయన ప్రార్ధన చేసాడు. రెండవ సారి, ‘నేడు నీవు నాతో  కూడా పరదైసులో ఉందువు’ అని తన ప్రక్క సిలువ మీద ఉన్న దొంగకు రక్షణ, నిరీక్షణ అనుగ్రహించాడు. మూడవ సారి, ‘అమ్మా, నీ కుమారుడు’ అని తన తల్లి మరియమ్మతో చెప్పి, ఆమె యోగక్షేమాలు తన శిష్యుడయిన యోహానుకు అప్పగించాడు. మధ్యాహ్నం 12 గంటల నుండి 3 గంటల వరకు ఆ దేశం మీద చీకటి కమ్మింది. మూడు గంటలకు నాలుగు సారి ఆయన మాట్లాడాడు. ఈ సారి ఆయన బిగ్గరగా కేక వేశాడు. 34 వ వచనంలో మనం చదివాము.

మూడు గంటలకు యేసు ఎలోయీ, ఎలోయీ, లామా సబక్తానీ అని బిగ్గరగా కేక వేసెను; ఇది ఆరామిక్ భాష. యేసు క్రీస్తు మాతృ భాష హీబ్రూ కాదు, గ్రీకు కాదు, లాటిన్ కాదు. గలిలయ ప్రాంతములో మాట్లాడే అరామిక్ భాషలో ఆయన ఈ మాటలు అన్నాడు. అందుకనే యెరూషలేములో ఆయన సిలువ చుట్టూ ఉన్న వారికి ఆయన మాటలు అర్ధం కాలేదు.

నా దేవా, నా దేవా, నన్ను ఎందుకు చెయ్యి విడిచితివి? కుమారుడవైన దేవుడు తండ్రి అయిన దేవుని నుండి వేరుచేయబడ్డాడు. ఆ ఎడబాటు భరించలేనిది. ప్రభువైన యేసు క్రీస్తుకు  తన తండ్రితో ఉన్న సహవాసం సిలువ మీద తెగిపోయింది.

ఒక చిన్న పిల్లవాడు తన తండ్రి దగ్గర ఉన్నంత సేపు నిశ్శబ్దముగా, సంతోషముగా ఉంటాడు. నేను వర్క్ కి వెళ్ళాలి అని ఆ తండ్రి ఆ పిల్లవానిని క్రిందకు దించితే ఆ పిల్లవాడు ఏడవటం మొదలుపెడతాడు. తండ్రి వేరయి  పోయి, వెళ్ళిపోవటం పిల్లవాడు భరించలేడు. యేసు ప్రభువు కూడా సిలువ మీద అటువంటి పరిస్థితినే ఎదుర్కొంటున్నాడు. ఆయన చేతులు, కాళ్లలో మేకులు గ్రుచ్చబడి, ఆయన సిలువకు బంధించబడ్డాడు. ఆయనకు ప్రియమయిన వారంతా ఆయనను వదలి  వెళ్లిపోయారు. ఎవరు వెళ్ళిపోయినా ఆయన తండ్రి ఆయనతో వుండే వాడు కాబట్టి ఆయన ధైర్యముగా ఉండేవాడు. కాని, సిలువ మీద తండ్రి కూడా ఆయనను

వదలివేసాడు.నరావతారం ఎత్తినప్పుడే,  పరలోకం నుండి భూమి మీదకు వచ్చినప్పుడే తండ్రి యొద్ద ఉన్న మహిమను వదలి  వేసి ఆయన ఈ లోకానికి వచ్చాడు. అయితే సిలువ మీద తండ్రితో ఉన్న సహవాసాన్ని ఆయన కోల్పోయాడు. ఎందుకంటే మన పాపాలు ఆయన మీద మోపబడ్డాయి.

2 కొరింథీయులకు 5:21 లో మనం చదువుతాం.

ఎందుకనగా మనమాయనయందు దేవుని నీతి అగునట్లు

పాపమెరుగని ఆయనను మనకోసము పాపముగాచేసెను.

మన కోసం ఆయన పాపముగా చేయబడ్డాడు. 3 గంటల పాటు సిలువ మీద చీకటి కమ్మింది. మన పాప రుణాన్ని యేసు క్రీస్తు చెల్లించివేశాడు. దేవునితో తన కున్న బంధాన్ని కూడా వదలివేసాడు. ఆదాము, హవ్వలు పాపము చేసినప్పుడు దేవుని సముఖములోనుండి ఏదెను వనములో నుండి వారు వెళ్లగొట్టబడ్డారు. పాపం వారిని దేవుని సహవాసం నుండి వేరుచేసింది. ఆదాము సంతానముగా మనందరి స్థితి అదే. మనం దేవుని యొద్ద నుండి సెపరేట్ చేయబడ్డాం. ఆయనతో మన సహవాసం తెగిపోయింది. యేసు క్రీస్తు రెండవ ఆదాము. మనతో దేవుని సహవాసాన్ని పునరుద్దరించటానికి యేసు క్రీస్తు దేవునితో ఆయనకు ఉన్న సహవాసాన్ని సిలువ మీద త్యాగం చేసాడు.

నా దేవా, నా దేవా, నన్ను ఎందుకు చెయ్యివిడిచితివి ? మన రక్షణ కోసం ఆయన యెంత విలువ చెల్లించాడో మీరొకసారి ఆలోచించండి. మన విమోచన కోసం ఆయన ఎంతటి క్రయదనము చెల్లించాడో మీరొకసారి ఆలోచించండి. మనకు పాపక్షమాపణ అనుగ్రహించటానికి ఆయన యెంతటి మూల్యం చెల్లించాడో మీరొకసారి ఆలోచించండి. మనలను దేవుని యొద్దకు తేవటానికి ఆయన ఎంతటి ఎడబాటును సహించాడో మీరొకసారి ఆలోచించండి.

యేసు ప్రభువు ఆ మాటలు అన్నప్పుడు చీకటి వెళ్ళిపోయి వెలుగు వచ్చింది. అదే మనకు శుభవార్త. అదే మనకు గుడ్ న్యూస్. మన మీద ఉన్న  పాప శిక్ష పూర్తిగా తొలగిపోయింది. మన మీద ఉన్న దేవుని ఉగ్రత పూర్తిగా తొలగిపోయింది.

2.A Snub

ఆ తరువాత రెండవది గా A  Snub; తృణీకారం. 6 వచనం చూద్దాం.

 1. నేను నరుడను కాను నేను పురుగును నరులచేత నిందింపబడినవాడను;  ప్రజలచేత తృణీకరింపబడిన వాడను.

ఆయనను వారు పురుగులాగా చూసారు. వారు కొట్టిన దెబ్బల వాళ్ళ ఆయన స్వరూపం పూర్తిగా మారిపోయింది. యెషయా 52 అధ్యాయం 14 వచనంలో మనం చదువుతాం.

నిన్ను చూచి యే మనిషి రూపముకంటె అతని ముఖ మును, నరరూపము కంటె అతని రూపమును చాల వికారమని చాలమంది యేలాగు విస్మయమొందిరొ

His visage was so marred more than any man

సిలువ మీద ఆయన రూపం అంత వికారంగా మారిపోయింది.

యెషయా 53 అధ్యాయంలో మనం చదువుతాం.

అతనికి సురూపమైనను సోగసైనను లేదు మనమతని చూచి, అపేక్షించునట్లుగా అతని యందు సురూపము లేదు. అతడు తృణీకరింపబడిన వాడును ఆయెను; మనుష్యులవలన విసర్జింపబడిన వాడును వ్యసనాక్రాంతుడుగాను వ్యాధి ననుభవించినవాడు గాను మనుష్యులు చూడనొల్లనివాడుగాను ఉండెను. అతడు తృణీకరింపబడినవాడు గనుక మనము అతనిని ఎన్నికచేయకపోతిమి

ఒక విద్యార్థి గ్రాడ్యుయేషన్ కి వెళ్ళాడు. డిగ్రీ అందుకొన్నాడు.అందరితో కలిసి ఆనందిస్తూ ఫోటోలు దిగుతావున్నాడంటా. ఆ విద్యార్థి తండ్రి కూడా తన కుమారునితో ఫోటో దిగుదామని వెళ్లాడంట. అయితే కుమారుడు ఆ తండ్రితో కలిసి ఫోటో దిగటానికి ఇష్టపడలేదంట. అతని తల్లి అతన్ని అడిగిందట. మీ నాన్నతో ఫోటో ఎందుకు ఇష్టపడలేదు? అని కుమారుణ్ణి ప్రశ్నించిందంత. కుమారుడు నాన్న మొహం అంతాబాగాలేదు అన్నాడంట. అతని తల్లి ఆ విద్యార్థితో అప్పుడు చెప్పిందట: ‘నీ చదువుల కోసం ఆయన ఎన్నో సంవత్సరాలు ఎండలో పనిచేశాడు. నీ ఫీజులు కట్టడానికి ఆయన మండుటెండలో చాకిరీ పనులు చేసాడు. నిన్ను చదివించటానికి ఆయన తన మంచిరూపాన్ని కోల్పోయాడు. ఆయన తో  ఫోటో దిగటానికి సిగ్గుపడుతున్నావా? తప్పు కదా నాన్న?’ అని కుమారునికి చెప్పిందట.

మనం కూడా కొన్ని సార్లు ఆ విద్యార్థి లాగానే యేసు క్రీస్తు పట్ల ప్రవర్తిస్తాం. సిలువను గూర్చి సిగ్గుపడతాం. రక్తసిక్తమయిన యేసు క్రీస్తుతో కలవడం మనకు ఇష్టం ఉండదు. యేసు క్రీస్తు కు చెందినవారమని చెప్పుకోవడానికి మనం సంశయిస్తాం. అయితే ఆయన తన సురూపాన్ని కోల్పోయింది మన కోసమే అని మనం గుర్తించాలి. ఆయన సిలువ గురించి మనం సిగ్గుపడకూడదు. రోమీయులకు వ్రాసిన పత్రిక మొదటి అధ్యాయములో అపొస్తలుడయిన పౌలు యేమని వ్రాశాడంటే, 

సువార్తను గూర్చి నేను సిగ్గుపడువాడను కాను. ఏలయనగా నమ్ము ప్రతివానికి, మొదట యూదునికి, గ్రీసుదేశస్థునికి కూడ రక్షణ కలుగజేయుటకు అది దేవుని శక్తియై యున్నది. 1:16

For I am not ashamed of the Gospel of Christ, for it is the power of God unto salvation to every one who believeth, to the Jew first and also to the Greek.

 1. Spectacle

మూడోదిగా A Spectacle అక్కడ అపహాస్యం మనం చూస్తున్నాం. 7 వచనం నుండి చదువుదాం.

 1. నన్ను చూచు వారందరు పెదవులు విరిచి తల ఆడించుచు నన్ను అపహసించుచున్నారు.8. యెహోవామీద నీ భారము మోపుము ఆయన వానిని విడిపించునేమోవాడు ఆయనకు ఇష్టుడు గదా ఆయన వానిని తప్పించునేమో అందురు.

వారు ఆయన చుట్టూ చేరి,పెదాలు చిట్లిస్తా వున్నారు. తల ఆడిస్తావున్నారు. నవ్వుతూ ఆయనను అపహాస్యం చేస్తావున్నారు. దేవుడు, దేవుడు అంటావు కదా, ఎక్కడ నీ దేవుడు అని ఆయనను యెగతాళి చేస్తావున్నారు.

మత్తయి సువార్త 27 అధ్యాయములో మనం చదువుతాం.

 1. వారు ఆయన వస్త్రములు తీసి వేసి, ఆయనకు ఎఱ్ఱని అంగీ తొడిగించి
 2. ముండ్ల కిరీట మును అల్లి ఆయన తలకు పెట్టి, ఒక రెల్లు ఆయన కుడి చేతిలోనుంచి, ఆయనయెదుట మోకాళ్లూని యూదుల రాజా, నీకు శుభమని ఆయనను అపహసించి
 3. ఆయన మీద ఉమ్మివేసి, ఆ రెల్లును తీసికొని దానితో ఆయనను తలమీద కొట్టిరి.
 4. ఆయనను అపహసించిన తరువాత ఆయన మీదనున్న ఆ అంగీని తీసివేసి ఆయన వస్త్రములాయనకు తొడిగించి, సిలువ వేయుటకు ఆయనను తీసికొని పోయిరి.
 5. ఆ మార్గమున వెళ్లుచుండిన వారు తలలూచుచు
 6. దేవాలయమును పడగొట్టి మూడు దినములలో కట్టు వాడా, నిన్ను నీవే రక్షించుకొనుము;

నీవు దేవుని కుమారుడవైతే సిలువమీదనుండి  దిగుమని చెప్పుచు ఆయనను దూషించిరి. ఆయనకు ఒక యెర్రని అంగీని వారు తొడిగించారు. A Scarlet Robe

ముళ్లకిరీటం అయన తల మీద పెట్టి నొక్కారు. రక్తం ఆయన మొహం మీద కారుతావుంది. వారి హృదయాలు ఏ మాత్రం కనికరించలేదు. ఆయన తల మీద కొట్టారు. ఆయన మీద ఉమ్మివేశారు. దేవుని కుమారుడు అదంతా ఓర్చుకొన్నాడు. వారి అవమానాలను,వారి అపహాస్యాలను ఆయన దిగమింగుకొన్నాడు. వారి ఏవగింపులను ఆయన భరించాడు. ఎందుకంటే మనల్ని రక్షించటానికి వేరే మార్గం లేదు. రాజు కావటం ఆయనకు చాలా తేలిక. సాతానుడు ఆయనను రాజును చేస్తాను రా అన్నాడు. యూదులు ఆయనను మాకు రాజువు అవ్వు అని ఆయనను బలవంతం చేశారు. కానీ వారి ప్రయత్నాలను ఆయన తిరస్కరించాడు. రక్తం చిందించకుండా ఆయన రాజు అయితే, మనకు రక్షణ ఉండేది కాదు. మనల్ని ప్రేమించాడు కాబట్టే రాజ్యాధికారాన్ని ఆయన ప్రక్కనపెట్టాడు. రాజ్యాధికారం కన్నా మన ఆత్మ రక్షణ ఆయనకు ముఖ్యం.

1931 లో గాంధీ గారు రెండవ రౌండ్ టేబుల్ కాన్ఫరెన్స్ కోసం లండన్ వెళ్ళాడు. విన్స్టన్  చర్చిల్ అనే బ్రిటిష్ రాజకీయ నాయకుడు, ఆ తరువాత ఆయన ఇంగ్లాండ్ దేశానికి ప్రధాన మంత్రి కూడా అయ్యాడు. గాంధీ ని చూసి ఆయన హాఫ్-నేకేడ్ ఫకీర్ Half -naked fakir అని గెలిచేసాడు. భారతీయుల స్వాతంత్రం కోసం ఎన్ని అవమానాలయినా ఓర్చుకొంటాను అని గాంధీ గారు అన్నాడు. మన ఆత్మలకు స్వాతంత్రం ఇవ్వడానికి యేసు ప్రభువు కూడా అవమానాలను ఓర్చుకొన్నాడు.

హెబ్రీయులకు వ్రాసిన పత్రిక 12 అధ్యాయములో మనం చదువుతాం 

ఆయన తనయెదుట ఉంచబడిన ఆనందముకొరకై అవమానమును నిర్లక్ష్యపెట్టి, సిలువను సహించి, దేవుని సింహాసనముయొక్క  కుడి పార్శ్వమున ఆసీనుడైయున్నాడు. 12:2

For the joy that was set before Him endured the cross despising the shame

మనల్ని దేవుని కుటుంబములో చూడాలన్న ఆనందం కోసం ఆయన సిలువను సహించాడు అవమానమును నిర్లక్ష్యం చేసాడు.

 1. Slaughter

నాలుగోది గా A Slaughter

 1. వృషభములు అనేకములు నన్ను చుట్టుకొని యున్నవి  బాషానుదేశపు బలమైన వృషభములు నన్ను ఆవరించి యున్నవి.

వృషభములు అనే పెద్ద మాట ఇక్కడ వాడాడు. వృషభములు అంటే దున్నపోతులు అని చెప్పుకోవచ్చు. ఇశ్రాయేల్ దేశములో గలిలయ చుట్టూ వుండే ప్రాంతం బాషాను. ఈ బాషాను చాలా పచ్చ గడ్డితో నిండివుంది. ఇక్కడ పెరిగే దున్నపోతులు చాలా బలముగా ఉంటాయి. వాటిని ఉపయోగించి ఈ ప్రాంతం వారు ఐశ్వర్యవంతులయ్యారు. ఈ ప్రాంతం విగ్రహారాధన తో కూడా నిండిపోయింది. బాషానులో ఐశ్వర్యం, విగ్రహారాధన రెండూ వున్నాయి. ఆమోసు ప్రవక్త ఈ బాషాను వారిని నిలదీసాడు. ఆమోసు గ్రంధం 4 అధ్యాయం లో మనం చదువుతాం.

షోమ్రోను పర్వతముననున్న బాషాను ఆవులారా,

దరిద్రులను బాధపెట్టుచు బీదలను నలుగగొట్టువారలారా….

బాషాను వారి యొక్క క్రూరత్వం ఇక్కడ మనకు కనిపిస్తున్నది.

పరిసయ్యులు, శాస్త్రులు అటువంటి క్రూరత్వాన్ని యేసు ప్రభువు మీద చూపించారు. దేవాలయములో వ్యాపారం చేసి వారు బాగా డబ్బు సంపాయించారు. యేసు ప్రభువు వారి వ్యాపార దురాశను నిలదీసాడు, విమర్శించాడు.

2 కొరింథీ 8:9 లో మనం చదువుతాం:

మీరు మన ప్రభువైన యేసుక్రీస్తు కృపను ఎరుగుదురుగదా? ఆయన ధన వంతుడై యుండియు మీరు తన దారిద్ర్యమువలన ధనవంతులు కావలెనని, మీ నిమిత్తము దరిద్రుడాయెను. ఒక పేదవాడుగా ప్రభువైన యేసు క్రీస్తు యెరూషము వెళ్ళాడు. అక్కడ ఉన్న  శాస్త్రులు, పరిసయ్యులు తమ డబ్బుతో అబద్ద సాక్షులను యేసు ప్రభువు మీద ప్రేరేపించారు. దేవుని కుమారుణ్ణి హత్య చేయటానికి వారు సంకల్పించారు. వారి యొక్క క్రూరత్వం అక్కడ మనకు కనిపిస్తున్నది.

 1. A Sacrifice

ఐదోదిగా ఇక్కడ ఒక sacrifice మనకు కనిపిస్తున్నది. 13 వచనం చూద్దాం.

 1. చీల్చుచును గర్జించుచునుండు సింహమువలె వారు నోళ్లు తెరచుచున్నారు

ఒక గొర్రెపిల్ల లాగా యేసు ప్రభువు యెరూషలేము వెళ్ళాడు. గొర్రెపిల్లను చీల్చటానికి గుమికూడిన సింహాల్లాగా వారంతా ఆయన చుట్టూ గుమికూడారు. ఆయన అమాయకత్వముతో వారి మధ్య చిక్కుకోలేదు. ఉద్దేశ్యపూర్వకంగానే వారికి తనను తాను అప్పగించుకొన్నాడు. యెరూషలేము ఆలయములో అర్పించబడే గొర్రెపిల్లలు బేత్లెహేము కొండలమీద పెంచబడతాయి. యేసు క్రీస్తు బేత్లెహేములో జన్మించిన దేవుని గొర్రెపిల్ల. నిష్కళంకమయిన గొర్రెపిల్లలే అర్పించబడతాయి. యేసు క్రీస్తు నిష్కళంకమయిన దేవుని గొర్రెపిల్ల. పస్కా పండుగ రోజున మూడు గంటలకు గొర్రెపిల్లలు వధించబడతాయి. యేసు క్రీస్తు కూడా పస్కా పండుగ రోజు మూడు గంటలకు దేవుని గొర్రెపిల్లగా మనకొరకు వధించబడ్డాడు.

22, 23, 24 కీర్తనలను కాపరి త్రయం అని పిలుస్తారు.

22 కీర్తనలో Good Shepherd గా

23 కీర్తనలో Great Shepherd గా

24 కీర్తనలో Chief Shepherd గా

ప్రభువైన యేసు క్రీస్తు మనకు కనిపిస్తున్నాడు.

22 కీర్తనలో మన కోసం ప్రాణం పెట్టిన మంచి కాపరి,

23 కీర్తనలో మనలను సంరక్షించే గొప్ప కాపరి,

24 కీర్తనలో మనకోసం ప్రత్యక్షమయ్యే ప్రధాన కాపరి.

అబ్రాహాము, తన కుమారుడయిన ఇస్సాకును తీసుకొని మోరియా పర్వతం మీదకు వెళ్తున్నాడు. ఇస్సాకు అబ్రాహామును అడిగాడు, ‘నిప్పును కట్టెలును ఉన్నవిగాని దహనబలికి గొఱ్ఱపిల్ల ఏది?’ఆ ప్రశ్న విన్నప్పుడు అబ్రాహాము గుండె బ్రద్దలయివుంటుంది. అబ్రాహాము తేరుకొని ఏమన్నాడంటే, నాకుమారుడా, దేవుడే దహనబలికి గొఱ్ఱపిల్లను చూచుకొనును

My son, God will provide Himself a lamb (ఆదికాండము 22:8)

ఇస్సాకు ఎక్కిన ఆ మోరియా పర్వతం మీదకే ప్రభువైన యేసు క్రీస్తు  ఎక్కాడు. యెహాను ఆయనను చూపించి ఏమన్నాడంటే, ఇదిగో లోకపాపమును మోసికొనిపోవు దేవుని గొఱ్ఱపిల్ల.(యోహాను 1:29)

Behold, the Lamb of God, who taketh away the sin of the world!

ఆ దేవుని గొర్రెపిల్ల యేసు క్రీస్తు యొద్దకు వచ్చి, మీ పాపాలు ఒప్పుకొని ఆయనన మీ రక్షకునిగా, ప్రభువుగా మీరు నమ్మాలి అన్నదే నేటి మా ప్రేమ సందేశం. 

Christ in Psalm 22, To be continued in Part 2