కొర్నేలీ : మొదటి అన్య క్రైస్తవ విశ్వాసి

     అపోస్తలుల కార్యములు 10 అధ్యాయములో ఒక గొప్ప చారిత్రిక సంఘటన మనము చూస్తాము. యూదులను, అన్యులను ప్రభువైన యేసు క్రీస్తు నందు దేవుడు ఏకము చేస్తున్నాడు. ప్రపంచ చరిత్రలోనే అది ఒక గొప్ప సంఘటన. 

    ఇద్దరు ముఖ్య వ్యక్తులు ఇక్కడ మనకు కనిపిస్తున్నారు: పేతురు, కొర్నేలీ. పేతురు ఒక యూదుడు, కొర్నేలీ ఒక అన్యుడు. వీరిద్దరికీ దేవుడు రెండు దర్శనాలు అనుగ్రహించాడు. ఆ దర్శనాల ద్వారా దేవుడు వారితో మాట్లాడాడు. ఇవి కలలు కాదు. కలలు మన మైండ్ లో నుండి పుట్టేవే. దర్శనాలు దేవుని మైండ్ లో నుండి పుట్టేవి. మనం కనే కలల్లో మన కోరికలు, భయాలు ఉంటాయి. దేవుని దర్శనాల్లో దేవుని ప్రణాళికలు, దేవుని ఉద్దేశ్యాలు ఉంటాయి. 

     ఒక రోజు ఉదయం భార్య భర్తతో అందంట.

‘ఏమండీ, రాత్రి నాకు చాలా మంచి కల వచ్చింది’ 

‘ఏంటో చెప్పు’ అన్నాడు భర్త

‘నా కలలో మీరు బంగారం దుకాణానికి వెళ్లారు. నా కోసం మంచి బంగారు గొలుసు కొని తీసుకు వచ్చారు.అది చాలా చక్కగా వుంది. ఆ బంగారు గొలుసుకు డైమండ్ కూడా ఉంది’ 

భర్త అన్నాడంట: ‘భలే కల కన్నావే. ఈ రోజు నుండి ఆ గొలుసు వేసుకున్నట్లు కలలు కంటూ ఉండు!’ 

     మనం కనే కలల్లో మన కోరికలు ఉంటాయి. అయితే దేవుని దర్శనాలు ఆ విధముగా ఉండవు. కొంత మంది అంటూ ఉంటారు: ‘దేవుడు నాకు దర్శనము ఇచ్చాడు. ఆ దర్శనములో నేను కోటీశ్వరుణ్ణి అయినట్లు కనిపించింది’. అటువంటి దర్శనాలు దేవుని యొద్ద నుండి రావు. అవి మన శరీరములో నుండి, మన మైండ్ లో నుండి పుట్టేవే.దేవుని యొద్ద నుండి వచ్చే దర్శనము దేవుని ఉద్దేశ్యములతో నిండి ఉంటుంది. మన ఉద్దేశ్యములతో కాదు. 

     యూదులను, అన్యులను యేసు క్రీస్తు నందు ఏకము చేయాలని దేవుడు కాంక్షించాడు. యూదులు, అన్యులు కలువరు. ఇశ్రాయేలు దేశములో 3 వర్గాల ప్రజలు ఉంటారు. యూదులు, అన్యులు, సమరయులు. సమరయులు యూదులు, అన్యులకు పుట్టిన మిశ్రమ జాతి వారు.యూదులు చెర లోనికి వెళ్లిన తరువాత అన్యులను పెండ్లి చేసుకొన్నారు. వారి సంతానము ఈ సమరయులు.యోహాను సువార్త 4 అధ్యాయములో యేసు ప్రభువు సమరయ మార్గమున వెళ్తున్నాడు. ఒక సమరయ స్త్రీ దగ్గరకు వెళ్లి, యేసు ప్రభువు ఆమెతో, ‘అమ్మా, దాహముగా ఉంది. కొంచెం మంచి నీళ్లు ఇవ్వు’ అన్నాడు. ఆమె ఆశ్చర్యపోయింది. యూదుడవైన నీవు సమరయ స్త్రీ ని మంచి నీళ్లు అడుగుతున్నావా? అని ఆమె ఆశ్చర్యపోయింది. 

     ఒక యూదుడు సమరయ ప్రాంతము గుండా నడవటమే ఆశ్చర్యం.ఒక సమరయ స్త్రీతో మాట్లాడటం ఇంకా ఆశ్చర్యం. ఆమెను మంచి నీళ్లు అడగటం ఊహించలేనిది. యూదులు ఏమనుకొంటారంటే, అన్యజనులు అంటుకొన్నది కూడా నేను అంటుకోకూడదు. నేను అపవిత్రం అయిపోతాను. ‘అంతకయితే దాహముతో చావనన్నా చస్తా కానీ నువ్వు ఇచ్చే నీళ్లు త్రాగను’. అందుకనే యేసు ప్రభువు సమరయ స్త్రీతో మాట్లాడుట చూసి శిష్యులందరితో పాటుగా పేతురు కూడా ఆశ్చర్యపోయాడు (యోహాను 4:27). యేసు ప్రభువు ఒక సమరయ స్త్రీతో మాట్లాడుతున్నాడేమిటి అని పేతురు ఆశ్చర్యపోయాడు. ‘పేతురు, నేను ఆమె ఇచ్చిన నీళ్లు కూడా త్రాగాను’ అని ప్రభువు చెప్పి ఉంటే పేతురు దిమ్మ తిరిగి క్రిందపడిపోయేవాడే. 

     యోహాను సువార్త 10 లో యేసు ప్రభువు శిష్యులతో చెప్పాడు: 

“ఈ దొడ్డివి కాని వేరే గొఱ్ఱెలును నాకు కలవు.

వాటిని కూడా నేను తోడుకొని రావలెను.

అవి నా స్వరము వినును.

అప్పుడు మంద ఒక్కటియు, గొర్రెల కాపరి ఒక్కడును అగును”  (యోహాను 10:16) 

     ‘ఈ దొడ్డివి కాని  వేరే గొఱ్ఱెలు కూడా నాకు ఉన్నాయి’. ఆ గొర్రెలు ఎవరంటే అన్యజనులు. మనమే. 

వాటిని కూడా నేను తోడుకొని రావాలి.అవి నా స్వరము వింటాయి. అప్పుడు మంద ఒక్కటి, గొర్రెల కాపరి ఒక్కడు అవుతారు. యూదులను, అన్యులను ఒక్క మందగా చేస్తాను.వారికి ఒక్క కాపరిగా ఉంటాను అని యేసు ప్రభువు ఇక్కడ అంటున్నాడు. ఆ మాటలు శిష్యులకు అర్థము కాలేదు.పెంతెకోస్తు దినము రోజు  యెరూషలేములో ప్రపంచము మొత్తము నుండి వచ్చిన యూదులు దేవాలయము దగ్గర కూడుకొని ఉన్నారు. అప్పుడు వారి మీదకు పరిశుద్ధాత్ముడు దిగి వచ్చాడు. శిష్యులు ఏమనుకొన్నారంటే, ‘ఈ యేసు క్రీస్తు యూదులకు మాత్రమే రక్షకుడు. ఈ పరిశుద్ధాత్ముడు యూదుల మీదకే దిగివచ్చాడు’.యేసు ప్రభువు మాటలు వారికి గుర్తుకు రాలేదు.

    ‘దేవుడు లోకమును ఎంతో ప్రేమించెను’, ‘మీరు సర్వలోకమునకు వెళ్లి, సర్వ సృష్టికి సువార్త ప్రకటించుడి’ అని యేసు ప్రభువు వారికి స్పష్టముగా చెప్పాడు. అయితే ఆ మాటలు ఇంకా వారి హృదయాలను చేరలేదు.అటువంటి పరిస్థితుల్లో దేవుడు రెండు దర్శనాలను పేతురుకు, కొర్నేలీకి ఇచ్చాడు.యూదుడైన పేతురు అన్యుడైన కొర్నేలీకి రక్షణ సువార్త చెప్పబోవుతున్నాడు. అన్యుల మీదకు అప్పుడు పరిశుద్ధాత్మ దేవుడు దిగిరాబోవుచున్నాడు. అపోస్తలుల కార్యములు 2 అధ్యాయములో జరిగినది ‘యూదుల పెంతెకోస్తు’ పండుగ అయితే, 10 అధ్యాయములో జరిగినది ‘అన్యుల పెంతెకోస్తు’ అని మనము చెప్పుకోవచ్చు.

    ముందుగా ఈ కొర్నేలీ ఎవరో చూడండి.ఈయన రోమన్ సైన్యములో ఒక శతాధిపతి.ఒక మిలిటరీ ఆఫీసర్.ఈ మిలిటరీ ఆఫీసర్లు చాలామంది దేవుని జ్ఞానము సంపాదించుకొన్నారు. లూకా సువార్త 7 లో ఒక శతాధిపతి తన దాసుని స్వస్థత కోసం యేసు ప్రభువును అభ్యర్దించాడు. ఆ శతాధిపతి యెహోవా దేవుని గురించి తెలుసుకొన్నాడు.యూదుల కోసం ఒక ప్రార్ధన మందిరము కూడా కట్టించి ఇచ్చాడు. ఆ శతాధిపతి విశ్వాసము చూసి యేసు ప్రభువే ఆశ్చర్యపోయాడు. ‘అబ్బా, ఇశ్రాయేలు లో కూడా ఇంత గొప్ప విశ్వాసము కలిగిన వాడిని నేను చూడలేదు’ అన్నాడు.

   లూకా 23 లో యేసు ప్రభువు సిలువ మీద ఉన్నప్పుడు మరొక శతాధిపతి ఆయనమీద విశ్వాసముంచాడు.’ఈ మనుష్యుడు నిజముగా నీతిమంతుడై ఉన్నాడు’ అని చెప్పి దేవుని మహిమపరచాడు. ఇక్కడ కొర్నేలీ కూడా ఒక శతాధిపతి. ఆయన దేవుని యందు భయభక్తులు పెంచుకున్నాడు. రోమన్ సైన్యములో ఉండే మిలిటరీ అధికారులకు ప్రపంచమంతా ఎరుకే. రోమన్ సామ్రాజ్యములో ఏ ప్రాంతములో ఏ ప్రజలు ఉంటారు? వారి నమ్మకాలు ఏమిటి? అని వారు తెలుసుకొంటారు.కొర్నేలీ రోమన్ సామ్రాజ్యములో అనేక దేశాలను, ప్రజలను, వారి విశ్వాసాలను చూశాడు. యూదుల దేవుడు ప్రత్యేకమైనవాడు అని ఆయన గుర్తించాడు.

    ఈ దేవుడు ఒక నూరేళ్ళ వయస్సు ఉన్న వ్యక్తిలో నుండి గొప్ప జాతిని నిర్మించాడు, 

మోషే  ద్వారా వారిని ఐగుప్తు బానిసత్వములో నుండి విడిపించాడు.

అరణ్యములో వారిని నడిపించాడు

వారికి ధర్మ శాస్త్రాన్ని ఇచ్చి, తన నీతిని వారికి తెలియజేశాడు

ఈయన పరిశుద్దుడైన, ప్రత్యేకమైన దేవుడు

ఇలాంటి దేవుడు నాకు కావాలి, నేను ఆయనను విశ్వసిస్తాను అనుకొన్నాడు.

     అపోస్తలుల కార్యములు 10:2 లో చూద్దాము: ‘అతడు అతడు తన ఇంటి వారందరిలో కూడా దేవునియందు భయభక్తులు కలవాడై ఉండి ప్రజలకు బహు ధర్మము చేయుచూ ఎల్లప్పుడు దేవునికి ప్రార్థన చేయు వాడు’. 

     కొర్నేలీకి దేవుని మీద భయభక్తులు ఉన్నాయి. అతడు ప్రజలకు బహు ధర్మము చేస్తున్నాడు. దేవుని మీద భయభక్తులు ఉంటే మనం ఇతరులకు ధర్మము చేస్తాము. దేవుని మీద భయభక్తులు లేకపోతే మనం ఇతరులకు కీడు చేస్తాము. కొర్నేలీకీ దేవుని భయం ఉంది. దేవుని దూత కొర్నేలీ దగ్గరకు వచ్చాడు. ‘కొర్నేలీ, నీ ప్రార్థనలు, నీ ధర్మ కార్యములు దేవుని సన్నిధికి జ్ఞాపకార్థముగా చేరినవి. నువ్వు యొప్పేకు మనుష్యులను పంపు. అక్కడ పేతురు అనే వ్యక్తి ఉన్నాడు. మీరిద్దరూ కలవాలి’. 

     కొర్నేలీ తన దగ్గర పనిచేసే ఒక భక్తిగల సైనికుని పిలిచాడు. కొర్నేలీ విశ్వాసము ఆయన క్రింద పనిచేసే సైనికుల మీద కూడా పడింది. విశ్వాసము ఒకరిలో ఆగిపోదు. మీ విశ్వాసము యొక్క ప్రభావము మీ ప్రక్కన ఉన్న  వారి మీద కూడా పడుతుంది. కొర్నేలీ యొక్క విశ్వాసము ఆయన ప్రక్క ఉన్న సైనికుల మీద కూడా పడింది. ఆ సైనికుని, మరొక ఇద్దరిని  కలిపి – ముగ్గురినీ కైసరియ నుండి యొప్పేకు పంపించాడు. వారు యొప్పేకు సమీపించినప్పుడు, పేతురు గారు ప్రార్ధన చేయటానికి మిద్దె మీద ఎక్కాడు. ఆయనకు చాలా ఆకలిగా ఉంది. అప్పుడు దేవుడు ఆయనకు ఒక దర్శనము ఇచ్చాడు. ఆకాశము తెరువబడింది, నాలుగు చెంగులతో భూమి మీదకు ఒక పెద్ద  దుప్పటి దిగివచ్చింది. అందులో అనేకమైన జంతువులు, పురుగులు, ఆకాశ పక్షులు ఉన్నాయి. ‘పేతురూ, లేచి, వాటిని చంపుకొని తిను’ అని ఒక స్వరము ఆదేశించింది. మూడు పనులు చేయమన్నాడు: నీవు లే, వాటిని చంపు, తిను. పేతురు ‘ప్రభువా, అపవిత్రమైనది నేను తినలేను’ అన్నాడు. ‘దేవుడు పవిత్రము చేసిన వాటిని నీవు నిషిద్దమైన వాటిగా ఎంచవద్దు’ అని సమాధానము వచ్చింది. మూడు సార్లు ఆ దర్శనము కనిపించింది. ‘ఏంటి ఈ దర్శనము యొక్క భావము?’ అని పేతురు ఆలోచిస్తూ ఉన్నాడు. 

పరిశుద్ధాత్ముడు – ఇదిగో, ముగ్గురు మనుష్యులు నీ కోసం వెదకుచున్నారు. నీవు సందేహింపక వారితో కలిసి వెళ్ళు. వారిని పంపించింది నేనే అన్నాడు. 

     పేతురు ఆలోచించాడు. దేవుని యొద్ద నుండి మూడు సార్లు దర్శనము వచ్చింది. మూడు పనులు చేయమన్నాడు. ముగ్గురు మనుష్యులు నా కోసం వచ్చారు. మూడు అనే సంఖ్య వింటే పేతురు గారికి గుండె జల్లుమంటుంది. ‘మూడు సార్లు ఆయన ఎవరో కూడా నాకు తెలియదు’ అని నీవు అబద్ధము చెబుతావు అని యేసు ప్రభువు పేతురుతో అన్నాడు. ‘యేసు ప్రభువు తో నేను ఎప్పుడూ కలిసి తిరుగులేదు. ఆయన ఎవరో కూడా నాకు తెలియదు’ అని మూడు సార్లు పేతురు అబద్దం చెప్పాడు. ఇక్కడ ‘మూడు’ లో దేవుడు పేతురుతో మాటలాడుచున్నాడు. 

     ‘నీ పాత జీవితములో నువ్వు మూడు సార్లు నేనెవరినో ఒప్పుకోలేదు. ఇప్పుడు నువ్వు నా గురించి ఎంతో తెలుసుకొన్నావు. నా ఆత్మను పొందావు. నా చిత్తాన్ని నువ్వు చేయాలి’. నాకు ఇష్టము లేకపోయినా నేను ఇప్పుడు దేవుని చిత్తాన్ని చేస్తాను అని పేతురు అనుకొన్నాడు. ఈ ముగ్గురు మనుష్యులు ఎవరు? దేని కోసం వస్తున్నారు? నన్ను ఎక్కడకు తీసుకెళ్తారు? ఏమి చేయమని అంటారు? దేనికైనా నేను సిద్ధమే అని పేతురు సిద్ధపడ్డాడు. ‘మూడు’ విషయములో ఇంతకు ముందు విఫలమయ్యాడు, ఇప్పుడు సఫలము కాబోచున్నాడు. ఆయన తలుపు తట్టబడింది. తలుపు తీసి చూస్తే ముగ్గురు మనుష్యులు కనిపించారు. 

     పేతురు అనే వ్యకి కోసం మేము వచ్చాము. నీతి మంతుడు, దేవుని భయపడువాడు ప్రజలలో మంచి పేరు పొందిన శతాధిపతి కొర్నేలీ మమ్ములను పంపించాడు. 

22 వచనము : అప్పుడు అతడు వారిని లోపలికి పిలిచి ఆతిధ్యమిచ్చెను. ‘ఏయ్, మీరు అన్యజనులు, మా ఇంట్లోకి రావద్దు. నేనే బయటికి వచ్చి మీతో మాట్లాడుతాను’ అని ఆయన అనలేదు. వారిని లోపలికి పిలిచి, భోజనం పెట్టి ఆతిధ్యము ఇచ్చాడు. పేతురు గారిలో మార్పు వెంటనే వచ్చింది.తరువాత రోజు వారితో కలిసి కైసరయకు వెళ్ళాడు.అక్కడ కొర్నేలీ తన బంధువులను, స్నేహితులను పిలిచి తన ఇంటిలో పేతురు కోసం ఎదురుచూస్తున్నాడు.

     సువార్తను మన దగ్గరే ఉంచుకోకూడదు. మన బంధువులకు, స్నేహితులకు, ఇతరులకు చెప్పాలి. సమరయ స్త్రీ తన ఊరు మొత్తాన్ని యేసుప్రభువు యొద్దకు తీసుకు వచ్చింది.ఇక్కడ కొర్నేలీ తన ఇంటి వారినందరినీ తీసుకు వచ్చాడు. 

    కొర్నేలీ పేతురు వచ్చినప్పుడు ఆయన కాళ్ళ మీద పడ్డాడు. పేతురు ఆయనను వారించి నేను కూడా మానవునే. నా పాదముల మీద పడవద్దు అన్నాడు. నన్ను ఎందుకు పిలిపించావు అని అడిగాడు. కొర్నేలీ తనకు దేవదూత చెప్పిన మాటలు పేతురుకు చెప్పాడు. నీ మాటలు వినాలని మేమంతా ఇక్కడ కూడుకొన్నాము అన్నాడు. 

     అప్పుడు పేతురు గారు వారికి రక్షణ వర్తమానము అందించాడు. 5 గొప్ప సత్యాలు వారికి చెప్పాడు.

  1. ఈ దేవుడు సమానత్వాన్ని చూపించేవాడు. 

34 వ: దేవుడు పక్షపాతి కాదని నిజముగా గ్రహించి ఉన్నాను. 

   దేవునికి పక్షపాతము లేదు. యూదులని, అన్యజనులని, ఈ జాతి వారు, ఆ జాతి వారని, ఈ దేశమని, ఆ దేశమని, ఈ కులమని, ఆ కులమని, ఈ ప్రాంతము, ఆ ప్రాంతము అని, ఈ బాష, ఆ బాష  అని ఆయన వివక్ష చూపించడు. ఆయనకు అందరూ సమానమే. ప్రతి జనములోను ఆయనకు భయపడి, నీతిగా నడుచుకొను వానిని ఆయన అంగీకరించును. 

   ఈ దేవుడు సమానత్వము కలిగిన వాడు. దేవుడు లేకుండా సమానత్వము లేదు. ఈ రోజున నాస్తిక మేధావులు ఆ సత్యాన్ని గ్రహించలేకపోతున్నారు. దేవుడు ఇచ్చే సమానత్వాన్ని అనేక చోట్ల మనము చూస్తున్నాము. 

  1. దేవుని సృష్టిలో సమానత్వము ఉంది: మనమందరమూ ఆదాము, హవ్వ దంపతుల సంతానమే. ‘యావద్భూమిమీద కాపుర ముండుటకు ఆయన యొకనినుండి ప్రతి జాతిమనుష్యులను సృష్టించెను’ (అపో కార్య 17:26) 
  2. దేవుని తీర్పులో సమానత్వము ఉంది: ‘ఏ భేదమును లేదు, అందరూ పాపము చేసి దేవుడు అనుగ్రహించు మహిమను పొందలేకపోవుచున్నారు’. దేవుడు మన వైపు చూసినప్పుడు మనుష్యులందరూ పాపులుగానే కనిపిస్తున్నారు. 
  3. దేవుని ప్రేమలో సమానత్వము ఉంది: ‘దేవుడు లోకమును ఎంతో ప్రేమించెను’. దేవుడు లోకమును ఎంతో ప్రేమించెను. కాగా ఆయన తన అద్వితీయకుమారునిగా పుట్టిన వానియందు విశ్వాసముంచు ప్రతివాడును నశింపక నిత్యజీవము పొందునట్లు ఆయనను అనుగ్రహించెను (యోహాను 3:16). .ప్రపంచ ప్రజలందరినీ దేవుడు సమానముగా ప్రేమించాడు. 
  4. దేవుని పిలుపులో సమానత్వము ఉంది:   ‘ఆ అజ్ఞానకాలములను దేవుడు చూచి చూడనట్టుగా ఉండెను; ఇప్పుడైతే అంతటను అందరును మారుమనస్సు పొందవలెనని మనుష్యులకు ఆజ్ఞాపించుచున్నాడు.’ (అపో కా 17:30) ప్రపంచ ప్రజలందరినీ దేవుడు సమానముగా సువార్త పిలుపుతో పిలిచాడు. 
  5. దేవుని కాపుదలలో సమానత్వము ఉంది: దేవుడు యూదుల కోసము యేసు ప్రభువును, మన కోసము ఏ ప్రవక్తనో, దేవదూతనో పంపించలేదు. ఒక్క కాపరినే మన ఇద్దరికీ ఇచ్చాడు. ఈ దొడ్డివికాని వేరే గొఱ్ఱెలును నాకు కలవు; వాటినికూడ నేను తోడుకొని రావలెను, అవి నా స్వరము వినును, అప్పుడు మంద ఒక్కటియు గొఱ్ఱెల కాపరి ఒక్కడును అగును. (యోహాను 10:16) 
  6. దేవుని సహవాసములో సమానత్వము ఉంది: అపోస్తలుడైన పౌలు గలతీ పత్రికలో వ్రాశాడు.’ఇందులో యూదుడని గ్రీసుదేశస్థుడని లేదు, దాసుడని స్వతంత్రుడని లేదు, పురుషుడని స్త్రీ అని లేదు; యేసుక్రీస్తునందు మీరందరును ఏకముగా ఉన్నారు.’ (గలతీ 3:28) 

    ఆ విధముగా దేవుడు తన సృష్టిలో, తీర్పులో, ప్రేమలో, పిలుపులో, కాపుదలలో, సహవాసములో మానవుల పట్ల సమానత్వాన్ని చూపించాడు. పేతురు ఈ సత్యాన్ని గ్రహించి, కొర్నేలీ ఇంటి వారికి ‘యేసు క్రీస్తు అందరికీ ప్రభువు’ అని బోధించాడు. 

2. ఈ దేవుడు సమాధానం మనకు అనుగ్రహించే వాడు: 

36 వచనము: యేసుక్రీస్తు అందరికి ప్రభువు. 

ఆయనద్వారా దేవుడు సమాధానకరమైన సువార్తను ప్రకటించి 

ఇశ్రాయేలీయులకు పంపిన వర్తమానము మీరెరుగు దురు.

పాపము మనకు, దేవునికి మధ్య శత్రుత్వము నెలకొల్పింది. 

మనకు, దేవునికి మధ్య అడ్డుగోడ నిర్మించింది. 

   దేవుడు తన సమాధాన సువార్తను పంపి ఈ శత్రుత్వమును తీసివేస్తున్నాడు. ఈ అడ్డుగోడను నిర్మూలిస్తున్నాడు. ఈ సమాధాన సువార్త ఏమి చేసింది? అపోస్తలుడైన  పౌలు అన్యజనులకు వ్రాశాడు. 

“కాబట్టి మునుపు శరీరవిషయములో అన్యజనులైయుండి, శరీరమందు చేతితో చేయబడిన సున్నతి గలవారు అనబడిన వారిచేత సున్నతిలేనివారనబడిన మీరు ఆ కాలమందు ఇశ్రాయేలుతో సహపౌరులుకాక, పరదేశులును, వాగ్దాన నిబంధనలు లేని పరజనులును, నిరీక్షణలేనివారును, లోక మందు దేవుడు లేనివారునైయుండి, క్రీస్తుకు దూరస్థులై యుంటిరని మీరు జ్ఞాపకము చేసికొనుడి. అయినను మునుపు దూరస్థులైన మీరు ఇప్పుడు క్రీస్తుయేసునందు క్రీస్తు రక్తమువలన సమీపస్థులై యున్నారు. ఆయన మన సమాధానమైయుండి మీకును మాకును ఉండిన ద్వేషమును, అనగా విధిరూపకమైన ఆజ్ఞలుగల ధర్మశాస్త్ర మును తన శరీరమందు కొట్టివేయుటచేత మధ్యగోడను పడగొట్టి, మన ఉభయులను ఏకముచేసెను.”  (ఎఫెసీ 2:11-15) 

 పేతురు, కొర్నేలీ – 

యూదుడు, అన్యుడు 

ఇప్పుడు ఒక్కచోటకు రాగలిగారు, 

ఒక్కమందలో చేరగలిగారు, 

ఒక్క ఆత్మను పానము చేయుచున్నారు

ఒక్క కాపరిని పొందగలిగారు

ఒక్క సహవాసం పొందగలిగారు 

ఎందుకంటే యేసు క్రీస్తు రక్తము వారిని సమీపస్తులుగా  చేసింది, వారి మధ్య ఉన్న అడ్డుగోడను కూల్చివేసింది.

3.ఈ దేవుడు సశరీరుడు గా మనకు ప్రత్యక్షమయ్యాడు.

38 – 39  వచనములు:  అదేదనగా దేవుడు నజరేయుడైన యేసును పరిశుద్ధాత్మతోను శక్తితోను అభిషేకించెనను నదియే. దేవుడాయనకు తోడైయుండెను గనుక ఆయన మేలు చేయుచు, అపవాదిచేత పీడింపబడిన వారినందరిని స్వస్థపరచుచు సంచరించుచుండెను.ఆయన యూదుల దేశమందును యెరూషలేమునందును చేసినవాటికన్నిటికిని మేము సాక్షులము. 

   ఈ దేవుడు సశరీరుడుగా, శరీరములో ఈ భూలోకానికి వచ్చాడు. పేతురు అనే నేను ఆయన చేసిన గొప్ప కార్యాలు చూశాను. రూపాంతరపు కొండ మీద ఆయన దైవిక మహిమను నేను చూశాను. అని పేతురు వారికి తెలియజేశాడు. 

4. ఈ దేవుడు సజీవుడిగా తిరిగి లేచాడు: 

39 – 40 వచనములు: ఆయనను వారు మ్రానున వ్రేలాడదీసి చంపిరి.దేవుడాయనను మూడవ దినమున లేపెను. 

యూదులయినా, అన్యులయినా సజీవుడైన క్రీస్తు దగ్గరకు రావలసినదే. పెంతెకోస్తు దినము రోజున యూదులకు పేతురు అదే చెప్పాడు. యేసు క్రీస్తు ప్రభువు మృతులలో నుండి లేచి తన తండ్రి అయిన దావీదు 16 కీర్తనలో చేసిన ప్రవచనము నెరవేర్చాడు. ఇక్కడ అన్యజనులు కూడా మృతులలో నుండి లేచిన యేసు క్రీస్తు దగ్గరకు రావలసినదే. 

మరణాన్ని జయిస్తాము అని కొన్ని సార్లు మనిషి ప్రగల్బాలు పలుకుతాడు. మనిషి బలహీనతను కరోనా వైరస్ బయటపెట్టింది. అమెరికా దేశములో కరోనా సమయములో మృత్యువు స్వైర్య విహారం చేసింది. మృత్యువుకు సమాధానము చెప్పినవాడు మన ప్రభువైన యేసు క్రీస్తు మాత్రమే. 

5. ఈ దేవుడు సహవాసము మనతో కోరుకొంటున్నాడు:  

     41 వచనము:  ప్రజలకందరికి కాక దేవునిచేత ముందుగా ఏర్పరచబడిన సాక్షులకే, అనగా ఆయన మృతులలోనుండి లేచిన తరువాత ఆయనతో కూడ అన్నపానములు పుచ్చుకొనిన మాకే, ఆయన ప్రత్యక్షముగా కనబడునట్లు అనుగ్రహించెను.

     ఈ దేవుడు మనతో సహవాసము కోరుకొంటున్నాడు. మృతులలో నుండి లేచిన తరువాత ప్రభువైన యేసు క్రీస్తు తన శిష్యులకు మాత్రమే కనిపించాడు. అవిశ్వాసులకు ఆయన కనిపించలేదు. ఆయన యందు నమ్మకము ఉంచిన వారితో ఆయన తన సమయము గడిపాడు, వారితో కలిసి అన్నపానములు పుచ్చుకొన్నాడు. వారితో సహవాసము చేశాడు. 

దేవుని గురించిన ఆ 5 గొప్ప సత్యాలు పేతురు కొర్నేలీ ఇంటిలో అన్యజనులకు వివరించాడు 

ఈ దేవుడు సమానత్వాన్ని చూపించేవాడు. 

ఈ దేవుడు సమాధానం మనకు అనుగ్రహించే వాడు: 

ఈ దేవుడు సశరీరుడు గా మనకు ప్రత్యక్షమయ్యాడు.

ఈ దేవుడు సజీవుడిగా తిరిగి లేచాడు: 

ఈ దేవుడు సహవాసము మనతో కోరుకొంటున్నాడు

రక్షణ పిలుపును వారికి ఇచ్చాడు: 43 వచనము: ఆయనయందు విశ్వాసముంచువాడెవడో వాడు ఆయన నామము మూలముగా పాపక్షమాపణ పొందునని ప్రవక్త లందరు ఆయననుగూర్చి సాక్ష్య మిచ్చుచున్నారనెను.

ప్రభువైన యేసు క్రీస్తు నందు నమ్మకముంచండి, పాపక్షమాపణ పొందండి అని పేతురు ప్రకటించినప్పుడు వారందరూ నమ్మి రక్షణ పొందారు. పరిశుద్ధాత్ముడు అప్పుడు వారి మీదకు దిగి వచ్చాడు. అపోస్తలుల కార్యములు 2 అధ్యాయములో కనిపించినది ‘యూదుల పెంతెకోస్తు’ అయితే, 10 అధ్యాయములో కనిపించేది ‘అన్యుల పెంతెకోస్తు’ గా మనము చెప్పుకోవచ్చు. అప్పుడు వారు బాప్తిస్మము పొందారు. రక్షణ పొందిన వారు వెంటనే పరిశుద్ధాత్మను పొందుతారు, బాప్తిస్మము పొందుతారు. 

    కొర్నేలీ ఇంటిలో ఆ రోజు మొదలైన అన్యజనుల రక్షణ కార్యము ప్రపంచము మొత్తము విస్తరించింది. ప్రపంచ చరిత్రను ఊహించలేని విధముగా మార్చివేసింది.