క్రిస్మస్ చేసుకోవటం తప్పా? 

iStock-595745820.jpg

    మనము క్రిస్మస్ ఆచరించవచ్చా? అని కొంతమంది నన్ను ప్రశ్నించారు. మా నాన్న యోహాను గారు, మా అమ్మ రాజాబాయమ్మ గారు క్రిస్మస్ ఆచరించేవారు కాదు. నా చిన్నతనములో క్రిస్మస్ కు మా చుట్టూ చాలా సందడిగా ఉండేది కానీ మా ఇంట్లో ఏ కార్యక్రమాలు ఉండేవి కాదు. యోహాను గారు ఏమనేవాడంటే, డిసెంబర్ 25 న క్రిస్మస్ చేసుకోమని  బైబిల్ లో లేదు, దానిని మనము ఆచరించకూడదు. ఆ విధమైన నమ్మకాలు చాలా మందికి ఉంటాయి. రోమన్ సామ్రాజ్యములో డిసెంబర్ 25 న సటర్నలియా అనే పండుగ చేసుకొనేవారు. ఆ రోజున వారు శని దేవతకు పూజలు చేసేవారు. విందులు, వినోదాలతో గడిపేవారు. 4 శతాబ్దములో రోమన్ చక్రవర్తి కాన్స్టాంటైన్ క్రైస్తవ మతంలోకి వచ్చాడు. ఆ తరువాత రోమన్ సామ్రాజ్యములో క్రైస్తవ మతము ప్రధాన మతముగా మారింది. శని దేవత కనుమరుగయ్యాడు.శని దేవతకు కేటాయించిన డిసెంబర్ 25 ని ఎలా గడపాలి? అని ప్రశ్న వారికి వచ్చింది. వారేమి చేశారంటే, ఈ రోజున మనము మన ప్రభువైన యేసు క్రీస్తును జ్ఞాపకం చేసుకొందాము, ఆయన జన్మను జ్ఞాపకం చేసుకొందాము అనుకొని డిసెంబర్ 25 ను క్రిస్మస్ గా మార్చారు. రోమన్ల సాటర్నేలియా పండుగ డిసెంబర్ 25 నుండి క్రిస్మస్ వచ్చినప్పటికీ ఆ రోజున మనము మన రక్షకుడైన యేసు క్రీస్తును జ్ఞాపకము చేసుకొని ఆనందించడం మంచింది.

Constantinetelugu.jpg

    క్రైస్తవులు కాని వారు ఎప్పుడన్నా యేసు క్రీస్తు గురించి ఆలోచిస్తారా అంటే అది క్రిస్మస్ రోజునే. ఎవరన్నా నాకు ‘మెర్రి క్రిస్మస్’ అని చెబితే నేను దానిని వారితో మాట్లాడడానికి మంచి అవకాశముగా వాడుకొంటాను. ‘క్రిస్మస్ యొక్క సందేశం’ ఏమిటి? యేసు క్రీస్తు ఈ లోకానికి ఎందుకు వచ్చాడు?’ అని వారిని అడుగుతాను.మొన్న ఒకాయన నాతో చెప్పాడు: నేను క్రైస్తవుణ్ణి కాదు, కానీ మా తాత గారు మా ఊళ్ళో ఒక చర్చి నిర్మాణానికి విరాళం ఇచ్చాడు.‘మీ తాత గారు చర్చి నిర్మాణానికి విరాళము ఇచ్చాడు, మంచిదే. అయితే, ఈ రోజు నీ పరిస్థితి ఏమిటి? నీ జీవితములో యేసు క్రీస్తు ఉన్నాడా? లేదా? అని అతని అడిగాను. ఆ విధముగా ఈ క్రిస్మస్ సమయాన్ని యేసు క్రీస్తు సువార్త చెప్పడానికి ఉపయోగించుకోవాలి.

    విద్యార్థులు కూడా అంతే.గుంటూరు లో నేను MBBS చదివాను. మెడికల్ కాలేజీ లో క్రిస్మస్ ఫంక్షన్ లు పెట్టాను. క్రిస్మస్ ఫంక్షన్ కి రండి, ఫంక్షన్ తరువాత స్నాక్స్ ఇస్తాము. కూల్ డ్రింక్స్, ఐస్ క్రీం, కేకు ఇస్తాము అని చెప్పేవాణ్ణి. 400 మంది డాక్టర్లు, నర్సులు, మెడికల్ విద్యార్థులు వచ్చేవారు. వారందరికీ క్రిస్మస్ పాటలు పాడి, సువార్త చెప్పాము.‘సువార్త సభ’ పెట్టాను రండి అంటే అంతమంది రారు. ‘క్రిస్మస్ ఫంక్షన్’ పెట్టాను రండి, అంటే వారు వస్తారు. ఆ విధముగా క్రిస్మస్ సమయాన్ని మనము సువార్తకు వాడుకోవాలి.

    సాతాను లక్ష్యము ఏమిటంటే, క్రిస్మస్ లో యేసు క్రీస్తు లేకుండా చేయడం. పోయిన వారము నేనొక క్రిస్మస్ ప్రదర్శనకు వెళ్ళాను. అక్కడ నేటివిటీ సీన్ నాకు కనిపించింది. కన్య మరియ, యోసేపు, జ్ఞానులు, పశువుల పాక, పశువులు, ఒక చిన్న పరుపు – అన్నీ ఉన్నాయి. ఆ పరుపు మీద క్రీస్తు శిశువు లేడు. మన ప్రస్తుత పరిస్థితికి అది అద్దం కట్టినట్లు ఉంది.క్రిస్మస్ సంబరాల్లో అన్నీ ఉంటాయి.కానీ క్రీస్తు ఉండడు.క్రీస్తు ఉండే క్రిస్మస్ మనం చేసుకోవాలి.