డబ్బుతో కొనలేనివి, డబ్బు కోసము అమ్మలేనివి

ఈ రోజు ‘డబ్బుతో కొనలేనివి’ అనే సందేశం మీకివ్వాలని నేను ఆశపడుచున్నాను.అపొస్తలుల కార్యములు 8 అధ్యాయము లో కొన్ని వచనాలు చూద్దాము.

  1. అపొస్తలులు చేతులుంచుటవలన పరిశుద్ధాత్మ అనుగ్రహింపబడెనని సీమోను చూచి 
  2. వారియెదుట ద్రవ్యము పెట్టి నేనెవనిమీద చేతులుంచుదునో వాడు పరిశుద్ధాత్మను పొందునట్లు

 ఈ అధికారము నాకియ్యుడని అడిగెను.

Screen Shot 2019-11-30 at 9.53.31 AM.png

     ఇక్కడ సీమోను అనే ఒక గారడీవాడు మనకు కనిపిస్తున్నాడు. అతడు అపొస్తలులును వెంబడిస్తూ ఉన్నాడు. యూదయ, సమరయ, భూదిగంతముల వరకు సువార్త ప్రకటించండి అని యేసు ప్రభువు ఇచ్చిన ఆజ్ఞకు లోబడుచూ ఈ అపొస్తలులు యెరూషలేము నుండి సమరయ ప్రాంతానికి వచ్చారు. సువార్త ప్రకటిస్తున్నారు. వారు చేతులు పెట్టినప్పుడు ప్రజలు పరిశుద్ధాత్ముని పొందుతున్నారు. ఈ ప్రపంచములో రెండు శక్తులు ఉన్నాయి.ఒకటి సాతాను శక్తి, రెండవది పరిశుద్దాత్మ శక్తి. 

Screen Shot 2019-11-30 at 9.58.37 AM.png

     ఈ వారము డాక్టర్ ప్రియాంక దారుణ హత్య మనం చూశాము. ఈ డాక్టర్ ని దారుణముగా కిడ్నాప్ చేసి, రేప్ చేసి, చంపి వేసి, కిరసనాయిలు పోసి కాల్చి వేశారు. మన సమాజములో ఎంత దుష్టత్వము ఉంది అని మనకు అనిపిస్తుంది. చిన్న చిన్న పిల్లల మీద కూడా అత్యాచారాలు చేస్తూ ఉన్నారు. పాపము యొక్క భయంకరమైన దుష్టత్వము ఈ సంఘటనల్లో మనము చూస్తున్నాము. ఈ ఘోరానికి పాల్పడినవారిని కఠినముగా శిక్షించవలసిన బాధ్యత ప్రభుత్వము మీద, న్యాయ వ్యవస్థ మీద ఉంది. అమెరికా దేశములో చాలా రాష్ట్రాల్లో ఇలాంటి నేరాలకు మరణ శిక్ష విధిస్తున్నారు. శిక్షను చక్కగా అమలుచేస్తున్నారు. అమెరికాను ఆదర్శముగా తీసుకొని మన దేశములో కూడా ఇలాంటి నేరాలకు పాల్పడిన వారికి మరణ శిక్ష విధించాలి.

Screen Shot 2019-11-30 at 3.18.22 PM.png

ఆ శిక్షను లైవ్ లో ప్రజలందరికీ చూపిస్తే, ఈ రేపిస్టులు, హంతకులు చట్టాలను గౌరవిస్తారు, నేరాలు తగ్గే అవకాశము ఉంటుంది. ఈ డాక్టర్ స్కూటికీ పంక్చర్ వేసింది వాళ్ళే, పంక్చర్ రిపేర్ చేస్తాము అని నాటకము ఆడారు, రేప్ చేశారు, హత్య చేశారు, పిరికిపందల్లా పారిపోయారు.

 

     అపొస్తలుడైన పౌలు గలతీ 5 అధ్యాయములో పరిశుద్ధాత్ముడు ఉన్న స్థితి, పరిశుద్ధాత్ముడు లేని స్థితులను వివరించాడు. పాపము పరిపక్వమయ్యేకొందీ అది అనేక కోణాల్లో విస్తరిస్తుంది. అబద్దాలు, కపటము, మోసము, ద్వేషము, మత్సరము, అసూయ, హింస, రక్తపాతము, పిరికితనం అన్నీ పాపములో ఉంటాయి. పరిశుద్దాత్మలో వాటికి స్థానము లేదు. పరిశుద్దాత్మ ఫలాలు ఏమిటో గలతీ 5:22 లో మనము చదువుతాము: 

ప్రేమ, సంతోషము,

 సమాధానము, దీర్ఘశాంతము, 

దయా ళుత్వము, మంచితనము, 

విశ్వాసము, సాత్వికము, 

ఆశా నిగ్రహము. 

మొదటిది  ప్రేమ, చివరిది ఆశా నిగ్రహము. temperance. శోధనలు తట్టుకొనే శక్తిని ఆశానిగ్రహాన్ని ఇచ్చేది పరిశుద్దాత్ముడే. రక్షణ పొందిన ప్రతి విశ్వాసికి దేవుడు తన పరిశుద్ధాత్మను ఉచితముగా ఇస్తున్నాడు.అపొస్తలులు సమరయ ప్రాంతములో రక్షణ పొందిన వారి మీద చేతులు ఉంచి వారికి పరిశుద్ధాత్మను ఇచ్చారు.అవన్నీ చూస్తూ సీమోను ఆశ్చర్యపోయాడు. నాకు కూడా ఇలాంటి శక్తి కావాలి. నేను చేయి పెడితే చాలు – పరిశుద్ధాత్ముడు వారి మీదకు రావాలి. ఆ శక్తిని ఎలా పొందగలను అని సీమోను మధనపడ్డాడు. తన దగ్గర ఉన్న డబ్బును ఒక సంచిలో పెట్టాడు. అపొస్తలుల ముందుకు వెళ్ళాడు. ‘అయ్యా, మీరు ప్రజల తలల మీద చేతులు పెడితే వారి మీదకు పరిశుద్ధాత్ముడు దిగి వస్తున్నాడు. ఎంతో ముచ్చటగా ఉంది, ఆశ్చర్యముగా ఉంది, ఈ డబ్బు తీసుకోండి, నాకు కూడా ఈ వరం ఇవ్వండి. నాకు ఈ శక్తిని ఇవ్వండి’ అని వారిని అడిగాడు. సీమోను హృదయము దేవుని ఎదుట సరిగా లేదు. జనం తలల మీద చేతులు పెడతాను, పరిశుద్ధాత్మ శక్తి వారికి కలుగుతుంది, నాకు పేరు కావాలి, డబ్బు సంపాయించుకొంటాను అని అనుకొన్నాడు. దేవునికి మహిమ కలగాలి, దేవుని ప్రజలకు క్షేమము కలగాలి అని అతను కోరుకోలేదు. సీమోను ను చూసి పేతురు గారికి ఒళ్ళు మండింది. సీమోనును అందరి ముందుకడిగిపడేశాడు.

Screen Shot 2019-11-30 at 3.18.57 PM.png

నీవు ద్రవ్యమిచ్చి దేవుని వరము 

సంపాదించు కొందునని తలంచుకొనినందున

 నీ వెండి నీతోకూడ నశించునుగాక.

నీ హృదయము దేవునియెదుట 

సరియైనది కాదు గనుక 

యీ కార్యమందు నీకు పాలుపంపులు లేవు.

కాబట్టి యీ నీ చెడుతనము మానుకొని

 మారు మనస్సునొంది ప్రభువును వేడుకొనుము; 

ఒకవేళ నీ హృదయాలోచన 

క్షమింపబడవచ్చును; 

నీవు ఘోర దుష్టత్వములోను దుర్నీతి 

బంధకములోను ఉన్నట్టు నాకు కనబడుచున్నదని

 చెప్పెను. నువ్వు డబ్బుతో దేవుని వరమును పొందలేవు, 

ఆ డబ్బుతోనే నాశనము అయిపోతావు. 

సీమోను హృదయము యూదా ఇస్కరియోతు మనస్తత్వముతో నిండిఉంది. యూదా ఇస్కరియోతు యేసు ప్రభువు ను చూశాడు, ఆయన మహిమ కార్యాలు చూశాడు, ఆయన అద్భుత కార్యాలు చూశాడు, ఆయన స్వస్థత క్రియలు  చూశాడు. జనము విస్తారముగా ఆయనను వెంబడించడం చూశాడు. డబ్బు సంపాదించు కోవాలంటే ఈ యేసు క్రీస్తు ప్రక్కన తిరగాలి అనుకొన్నాడు. ఆయన శిష్యుడిగా అవతారం ఎత్తుతాను అనుకొన్నాడు. యేసు ప్రభువు దగ్గరకు వెళ్ళాడు. ‘బోధకుడా, ఎంతో  మంచి మాటలు చెబుతున్నావు. నన్ను కూడా నీ శిష్యునిగా చేసుకో’ అని అభ్యర్దించాడు. యూదా మనస్సు డబ్బు మీద ఉంది అని ప్రభువైన యేసు క్రీస్తుకు తెలుసు. యూదా డబ్బు సంచి నా దగ్గర పెట్టుకొంటాను అన్నప్పుడు ఆయన అభ్యంతరము పెట్టలేదు. అతని హృదయము దేవుని సంగతుల మీద లేదు కాబట్టే అతడు డబ్బు సంచి అడుగుతున్నాడు అని, డబ్బు వ్యవహారాలు యూదాకే ఆయన అప్పజెప్పాడు. ఆ డబ్బు కోసమే యూదా యేసు ప్రభువుకు నమ్మక ద్రోహము చేశాడు. ఆత్మ హత్య చేసుకొని నాశనము చెందాడు, నరకానికి వెళ్ళిపోయాడు. 

     ఇక్కడ సీమోను కూడా యూదా సంస్కృతి లోనే నడుస్తున్నాడు. అతని పేరులోనుండే ‘సీమోనీ’ అనే ఇంగ్లీష్ పదము ఉద్భవించింది.‘సిమోని’ అంటే ఏమిటంటే, డబ్బులు ఇచ్చి పదవులు కొనుక్కోవటం. క్రైస్తవ సంఘ చరిత్రలో అనేక మంది సీమోను అడుగు జాడల్లో నడిచారు. పోప్ పదవి కోసము, బిషప్ పదవి కోసం, పాస్టర్ పదవి కోసము డబ్బు సంచులు ఇచ్చుకొన్న వాళ్ళు ఎంతో మంది ఉన్నారు. భారత రాజ్యాంగము వ్రాసి 70 సంవత్సరాలు అయ్యింది. అయితే రాజ్యాంగ స్ఫూర్తి మన రాజకీయాల్లో ఇంకా తగ్గువగానే ఉంది. రాజ్యాంగ పదవులు డబ్బుతో కొనుక్కొనే పరిస్థితి ఇప్పుడు ఉంది. మీకు నిజముగా ప్రజలకు సేవ చేయాలని ఉంటే, ఒక కోటి రూపాయలు పెట్టి MLA సీటు కొనుక్కోరు. ఆ కోటి రూపాయలు ఖర్చు పెట్టి MLA ని అయి, రెండు కోట్లు సంపాయించు కొంటాను అనుకొంటారు. 

    అయితే దేవుని సంఘములో వరములు, బాధ్యతలు, పదవులు డబ్బుతో కొనేవి కాదు.డబ్బుతో మంచి పనులు చేయవచ్చు. రెండో ప్రపంచ యుద్ధములో యూదుల ప్రాణాలకు అపాయము కలిగింది. జర్మనీ దేశములో యూదులను కాన్సంట్రేషన్ క్యాంపులలో పెట్టి హిట్లర్ సేనలు చంపివేస్తూ ఉన్నాయి.

ఆస్కార్ స్కిండ్లెర్ అనే వ్యాపారవేత్త యూదులను కాపాడాలి అనుకొన్నాడు. ఆయనకు చాలా ఫ్యాక్టరీ లు ఉన్నాయి. వాటిలో లేని ఉద్యోగాలు కల్పించి మరీ వారికి ఆశ్రయం ఇచ్చాడు. వారిని రక్షించడానికి తన ఆస్తులు కూడా కోల్పోయాడు.డబ్బు కోసము నీచమైన పనులు కూడా చేయవచ్చు. మార్టిన్ స్రెకేళి అనే మందుల వ్యాపారి ఉన్నాడు. డారా ప్రైమ్ అనే ఒక మందు ఆయన అమ్ముతున్నాడు.ఆ మందు ధర 5455 శాతము పెంచాడు. ఒక్కొక్క  మందు బిళ్ళ – 50 రూపాయలకు అమ్మాల్సిన దానిని 50,000 రూపాయలకు అమ్ముతున్నాడు. అతని దురాశ వలన జైలుకు వెళ్ళాడు, కానీ, ఆ మందు ధర మాత్రము అలాగే ఉంది. 

Screen Shot 2019-11-30 at 3.19.26 PM.png

     డబ్బుతో కొనలేనివి దేవుడు అనేకమైన విలువలు ఈ ప్రపంచములో పెట్టాడు. డబ్బుతో కొన్నిటిని కొనగలము, కొన్నిటిని కొనలేము.ఆ వ్యత్యాసాన్ని మనము అర్థం చేసుకోవాలి.

డబ్బుతో ఒక బెడ్ కొనుక్కోగలము, కానీ

నిద్రను కొనలేము.

డబ్బుతో ఎంటర్టైన్మెంట్ కొనుక్కోగలము, కానీ 

ఆనందాన్ని కొనలేము.

డబ్బుతో మందులు కొనుక్కోగలము, కానీ 

ఆరోగ్యాన్ని కొనలేము

డబ్బుతో  సైకియాట్రిస్ట్ ను చూడగలము, 

కానీ మనశ్శాంతిని కొనలేము 

డబ్బుతో సెక్స్ ని కొనగలము, కానీ ప్రేమను

కొనలేము

డబ్బుతో వెడ్డింగ్ పార్టీ కొనగలము, కానీ మంచి 

వైవాహిక జీవితాన్నిను కొనలేము 

డబ్బుతో చదువును కొనగలము, కానీ 

జ్ఞానాన్ని కొనలేము 

డబ్బుతో బైబిల్ కొనగలము, కానీ భక్తిని

కొనలేము 

డబ్బుతో మతాన్ని కొనగలము, కానీ 

పరలోకమును కొనలేము.

     యేసు ప్రభువు ఆ సత్యాలను మనకు బోధించాడు. మత్తయి సువార్త 19 అధ్యాయము లో ఒక ధనవంతుడు యేసు ప్రభువు దగ్గరకు వెళ్లి, ఆయనను అడిగాడు: ‘బోధకుడా, నేను ధర్మశాస్త్రము నెర వేర్చుచున్నాను. నాలో లోపం ఏమిటి’ యేసు ప్రభువు ఆ ధనవంతునితో అన్నాడు: ‘నీకు ఉన్న లోపము ఏమిటంటే, విస్తారముగా డబ్బులు పోగుచేసుకొన్నావు. నీ ఆస్తులు అమ్మి పేదలకు ఇవ్వు. ఆ పని చేస్తే పరలోకములో దేవుడు నీకు ఆస్తి ఇస్తాడు.’ 

Screen Shot 2019-11-30 at 3.19.35 PM.png

యేసు ప్రభువు మాటలు ఆ ధనవంతునికి రుచించ లేదు. గొణుగు కుంటూ వెళ్ళిపోయాడు. పరలోకములో ఉండే ఆస్తి కన్నా భూలోకములో ఆస్తే నాకు ముఖ్యము అనుకొన్నాడు. భూలోకములో ఆస్తి తాత్కాలికమైనది, చెదలు పట్టేది, పాడైపోయేది, క్షీణించేది, వదలి పెట్టి ఒట్టిచేతులతో వెళ్లిపోయేది. పరలోకములో నేను ఇచ్చే ఆస్తి శాశ్వతమైనది, చెదలు పట్టనిది, క్షీణించనిది, దానిని సంపాయించుకోండి అనే యేసు ప్రభువు మాటలు మనకు రుచించవు.

మత్తయి 6:24 లో మనము చదువుతాము.

మీరు దేవునికిని సిరికిని దాసులుగా నుండనేరరు.

You cannot serve God and Money 

 

    దేవుని పరిశుద్ధతను డబ్బుతో కొనలేము. ఇప్పుడు అనేక చోట్ల కాల్ మనీ వ్యవహారాలు నడుస్తూ ఉన్నాయి. వడ్డీ వ్యాపారులు ఆర్ధిక ఇబ్బందులలో ఉన్న వారిని టార్గెట్ గా చేసుకొంటున్నారు.అవసరాల్లో ఉన్న మహిళలను వేధిస్తున్నారు. నీకు అప్పు కావాలంటే నాతో గడపాలి అని వారిని లొంగదీసుకొంటున్నారు. ఒకవైపు అధిక వడ్డీలతో ప్రజల రక్తాన్ని పిండటమే కాకుండా, మరొకవైపు మా కోరిక తీర్చు అని వారిని వేధింపులకు గురిచేస్తున్నారు.యేసు ప్రభువు ధనవంతునికి చెప్పింది అదే. నీ డబ్బులు అవసరాల్లో ఉన్న వారికి ఇవ్వు. క్రైస్తవ వివాహాన్ని Holy Matrimonial పరిశుద్ధ వివాహము అంటాము. డబ్బు కోసము దానిని అమ్ముకోకూడదు. ఒక పవిత్ర బంధాన్ని డబ్బు కోసము తెంచుకోకూడదు.

Screen Shot 2019-11-30 at 3.20.01 PM.png

 

ఆత్మ సంబంధమైనవి డబ్బుతో కొనలేనివి.యేసు ప్రభువు యెరూషలేములో దేవాలయము లోనికి వెళ్లి అక్కడ ఉన్న వ్యాపారస్తులను వెళ్ళగొట్టాడు. వారు దేవుని సన్నిధికి వచ్చిన ప్రజలను నిర్దాక్షిణ్యముగా దోచుకొంటున్నారు. ‘నా తండ్రి ఇంటిని మీరు దొంగల గుహగా చేశారు’ అని ఆయన వారిని వెళ్ళగొట్టాడు. సీమోను చేసిన తప్పు కూడా అదే. పరిశుద్ధాత్మ వరము కొంటాను, అమ్ముకొంటాను అని అనుకొన్నాడు.కొన్నిటిని డబ్బుతో కొనలేము, కొన్నిటిని డబ్బు కోసం అమ్మలేము.

Screen Shot 2019-11-30 at 3.20.10 PM.png

మార్గరెట్ జేన్ రెడిన్: ఈమె మిషిగన్ న్యాయకళాశాలలో అధ్యాపకురాలు.‘మార్కెట్ ఇన్ అలైనబిలిటీ’ అనే సూత్రము ఈమె బోధిస్తూ ఉంది. కొన్నిటిని మార్కెట్లో అమ్మకూడదు. కొనేవాళ్ళు ఉన్న అమ్మకూడదు. మన శరీరాన్ని అమ్మకూడదు. మన శరీర భాగాలు అమ్మకూడదు. ఎవరికైనా రక్తము కావాలంటే ఒక బాటిల్ రక్తదానం చేయండి, కానీ రక్తాన్ని అమ్ముకోబాకండి.ఎవరికన్నా సహాయము చేయాలంటే, మీ కిడ్నీ దానము చేయండి, మీ లివర్ దానం చేయండి, అంతే కానీ వాటిని అమ్ముకోబాకండి. మీ పిల్లలను పెంచలేక పోతే దత్తతకు ఇవ్వండి, కానీ వారిని అమ్ముకోబాకండి. 

     ఈ రోజు కొంత మంది మేధావులు ఏమంటున్నారంటే, మనము కుక్క పిల్లలు అమ్ముతున్నాము కదా, గేదె పిల్లలను అమ్ముతున్నాము కదా, పిల్లి పిల్లలను అమ్ముతున్నాము కదా, మనిషి పిల్లలను అమ్మితే తప్పు ఏమిటి? డార్విన్ మహాశయుడి వల్ల మన ప్రపంచం ఇలా తయారయ్యింది. డార్విన్ ఏమన్నాడంటే, దేవుడు మనలను ప్రత్యేకముగా సృష్టించలేదు, మనమందరమూ జంతువులమే.ఆ భావ జాలము ఒంటబట్టించుకొని, మనమందరమూ జంతువులమే అయినప్పుడు, కుక్క పిల్లలను అమ్ముకొన్నట్లు, మన పిల్లలను మనము ఎందుకు అమ్ముకోకూడదు అని ఈ మేధావులు ప్రశ్నిస్తూ ఉన్నారు.

     బైబిల్ సత్యాలు వీరికి మనము చెప్పాలి.డబ్బుతో మనిషిని కొనకూడదు, డబ్బు కోసం మనిషి ని అమ్మకూడదు, ఎందుకంటే దేవుడు తన స్వరూపములో, ప్రత్యేకమైన రీతిలో ఒక శాశ్వతమైన ఆత్మతో ప్రతి మనిషిని సృష్టించాడు.

 

     డబ్బుతో కొనలేనిది మరొకటి ఏమిటంటే, మన వృత్తి ధర్మము. ఈ మధ్యలోకి నా దగ్గరకు ఒక పేషెంట్ వచ్చాడు. ‘డాక్టర్, నాకు ఒక జబ్బు ఉంది. ఎంత డబ్బయినా ఫర్వాలేదు. నాకు ట్రీట్ మెంట్ ఇవ్వండి’ అన్నాడు. నేను ఆయనను పరీక్షించి,‘నీకు ఆ జబ్బు లేదు, లేని జబ్బులు ఊహించుకొని, నీ డబ్బులు వదలించుకోవద్దు, ఇంటికి వెళ్లి రిలాక్స్ అవ్వు’ అన్నాను.ఆ పేషెంట్ నా మాటలు వినలేదు.

‘నాకు ఫలానా జబ్బు ఉంది, నాకు ఫలానా మందు కావాలి, ప్రిస్క్రిప్షన్ వ్రాయండి’ అని నా ప్రక్కన కూర్చున్నాడు. ‘నీకు ఆ జబ్బు లేదయ్యా, నీకు ఆ ప్రిస్క్రిప్షన్ వ్రాయను’ అని ఆయనకు చెప్పాను. ఆయన నా రూమ్ లో నుండి బయటికి వెళ్లి, వెంటనే తిరిగి వచ్చాడు, ‘డాక్టర్, ఒక్క ప్రిస్క్రిప్షన్ అడుగుతున్నాను, పాతిక వేలు ఇస్తాను, వ్రాయండి’ అన్నాడు.నేను వ్రాయను అని చెప్పాను.

‘డాక్టర్, డెబ్భై వేలు ఇస్తాను, వ్రాయండి’ అన్నాడు. ‘ఒక్క నిమిషములో 70 వేలు సంపాయించుకొనే అవకాశము నాకు వచ్చింది’ అని మనస్సులో అనుకొన్నాను. అయితే ఆశోధనను తట్టుకొన్నాను. ‘నువ్వు, 70 వేలు ఇచ్చినా అది వ్రాయను’ అని ఆయనకు చెప్పి పంపించాను. మీ మాట అవునంటే అవును, కాదంటే కాదు అని యుండవలెను; వీటికి మించునది దుష్టునినుండి పుట్టునది. అన్నాడు యేసు ప్రభువు మత్తయి సువార్త 5:37 లో.డబ్బులు చూసి మన మాట మార్చకూడదు, డబ్బులు చూసి మన వృత్తి ధర్మము వదలిపెట్టకూడదు. అది కూడా బైబిల్ సత్యమే.

Screen Shot 2019-11-30 at 3.20.35 PM.png

    మెక్ డొనాల్డ్స్ అని ఒక ఫాస్ట్ ఫుడ్ చైన్ ఉంది. దాని సీఈఓ ని ఈ మధ్యలో ఉద్యోగము నుండి తీసివేశారు. ఆయన చేసిన తప్పుఏమిటంటే, ఆయన క్రింద పనిచేసే ఒక అమ్మాయితో సంబంధము పెట్టుకొన్నాడు.ఇద్దరూ ఇష్టపడ్డారు కదా తప్పేంటి అని కొంతమంది అన్నారు. ఒక ఉన్నతోద్యోగి తన క్రింద పనిచేసే వారితో సంభందం పెట్టుకొంటే, వృత్తి ధర్మము దెబ్బతింటుంది.చూసే వాళ్ళు ఏమనుకొంటారంటే, ప్రమోషన్ ఊరికినే రాలేదులే అంటారు. డబ్బు కోసము, ప్రమోషన్ల కోసం కొన్ని గీతలు దాటకూడదు.

Screen Shot 2019-11-30 at 3.20.48 PM.png

యోసేపు ఐగుప్తులో ఉన్నప్పుడు పోతీఫరు ఇంటిలో ఒక మేనేజర్ గా పనిచేస్తున్నాడు. పోతీఫరు భార్య యోసేపు మీద కన్ను వేసింది. యోసేపును లొంగ దీసుకోవాలని చూసింది. నాతో సంబంధము పెట్టుకో అని బెదిరించింది.యోసేపు అలోచించిఉంటాడు. ఈమె మాటవినకపోతే నన్ను వేధించుకొని తింటుంది, నా ఉద్యోగము పోతుందేమో, నన్ను జైలులో వేస్తారేమో, ఎందుకు వచ్చిన గొడవ, ఆమె మాట వింటే పోతుంది అని యోసేపు అనుకోలేదు.

Potipharswifelooksatjoseph.png

తన శరీరమును అనుసరించకుండా దేవుని యొక్క ఉన్నతమైన విలువలను పాటించాడు. దేవుడు గీచినగీతను దాటలేదు. ఆయన ఉద్యోగం పోయింది, నవ్వుల పాలు అయ్యాడు, అవమానాలు పొందాడు, జైలు పాలయ్యాడు, అయితే దేవుడు మహిమ పరచబడ్డాడు, దేవుని హృదయాన్ని సంతోషపెట్టాడు. కార్పొరేట్ రంగము బైబిల్ లో ఉన్న నైతిక విలువలు నేర్చుకోవాలి.మా దగ్గర డబ్బు ఉంది, మేము ఏమైనా చేస్తాము అనే దృక్పథాన్ని మారు వదులుకోవాలి.

    డబ్బుతో కొనలేనివి, డబ్బు కోసము అమ్మలేనివి అనే అంశాన్ని ఈ రోజు మనము చూశాము. కొన్నిటిని అమ్మేవాళ్ళు ఉన్నా మనము కొనకూడదు, కొన్నిటిని కొనేవారు ఉన్నా మనము అమ్మకూడదు, కొన్ని గీతలు దాటేవారు ఉన్నా మనం దాటకూడదు.ఎందుకంటే అవి దేవుడు పెట్టిన విలువలు.

Screen Shot 2019-11-30 at 3.21.03 PM.png

     ఒకడు సర్వలోకమును సంపాదించుకొని తన ఆత్మను పోగొట్టుకొనుట వానికేమి ప్రయోజనము? అని ప్రభువైన యేసు క్రీస్తు ప్రశ్నించాడు. ఎందుకంటే మానవ ఆత్మ అంత విలువైనది. డబ్బుతో మనం బైబిల్ కొనవచ్చు, కానీ భక్తిని కొనలేము, డబ్బుతో మనం మతాన్ని కొనవచ్చు, కానీ దేవుణ్ణి కొనలేము, డబ్బుతో మనం రక్షణ కొనలేము పరలోకాన్ని కొనలేము.సమరయలో సీమోను డబ్బుతో పరిశుద్దాత్మనుకొనాలని చూసాడు, భంగపడ్డాడు. డబ్బుతో పరిశుద్ధాత్మను మనము కొనలేము. ప్రభువైన యేసు క్రీస్తు దగ్గరకు రావాలి, మన పాపములు ఒప్పుకోవాలి, పాప క్షమాపణ పొందాలి, మారు మనస్సు పొందాలి, 

అప్పుడు దేవుడు ఉచితముగా పరిశుద్ధాత్ముని మనకు ఒక వరముగా, గిఫ్ట్ గా మనకు  అనుగ్రహిస్తున్నాడు. అది ఎంత గొప్ప శుభవార్త. అదే నేటి మా ప్రేమ సందేశం

 

డాక్టర్ పాల్ కట్టుపల్లి