తిరుగు లేని మనిషి : డాక్టర్ రవి జకరియస్

Ravititle1

ఈ వారము చాలా దుఃఖపెట్టే వార్త విన్నాము. డాక్టర్ రవి జకరియస్ గారు అకస్మాత్తుగా మరణించారు.ఈ రోజు ఆ మహనీయుని గురించి కొన్ని విషయాలు మీతో పంచుకొంటాను.డాక్టర్ రవి జకరియస్ గురించి ఈ రోజు కొన్ని విషయాలు చూద్దాము.మొన్న 19 తేదీ నా జన్మ దినం. నా భార్య నా కోసం మంచి విందు చేసింది. ఉదయం నుండి ఎంతో సంతోషముగా గడుపుతున్నాను.ఆ సమయములో ఒక దుర్వార్త విన్నాను. డాక్టర్ రవి జకరియస్ గారు మరణించారు.ఆ వార్త విని నాకు చాలా బాధ వేసింది.

దేవా, నా బర్త్ డే రోజు నాకు ఇలాంటి బ్యాడ్ న్యూస్ వినిపించావు ఏంటి అని అక్కడే కూర్చుని కాసేపు ఏడ్చాను. ఒక మంచి మనిషి మన మధ్యలోనుండి వెళ్ళిపోయాడు. కరోనా వైరస్ వలన ఒక వైపు అంతా గందర గోళముగా ఉంది. ఈ సమయములో ఇది ఇంకొక విషాదకరమైన వార్త. ఆయన అంత్య క్రియలు రేపు జరుగబోతున్నాయి. ఈ సమయములో ఆయన జీవితాన్ని ఒక సారి చూద్దాము. క్రైస్తవులే కాకుండా, క్రైస్తవేతరులు కూడా నేర్చుకొనవలసిన అనేక పాఠాలు ఆయన జీవితములో మనకు కనిపిస్తాయి. కేవలము మాటలు మాత్రమే చెప్పకుండా మనం ఇతరులకు సహాయం చేయాలి, వారికి యేసు క్రీస్తు గురించి చెప్పాలి, ఆయన ప్రేమను వారికి చూపించాలి అనే దృక్పథముతో ఆయన ముందుకు వెళ్ళాడు.

     1946 లో చెన్నై నగరములో రవి జకారియస్ ఒక ఉన్నత క్రైస్తవ కుటుంబములో జన్మించాడు. ఆయన తండ్రి భారత ప్రభుత్వములో పెద్ద అధికారి. తన లాగే తన కుమారుడు రవి కూడా పెద్ద ఆఫీసర్ కావాలని ఆయన కోరుకున్నాడు. అయితే రవి మనస్సు ఎప్పుడు చూసినా క్రికెట్ ఆటల మీదే ఉండేది. వాళ్ళ నాన్న రవి ని చూసి విసికిపోయాడు.‘నువ్వు దేనికీ పనికిరావురా అని రవిని అనేక సందర్భాల్లో తిట్టాడు. జీవితము మీద విసిగిపోయి రవి జకరియస్ విషం త్రాగి ఆత్మ హత్యకు ప్రయత్నించాడు.

హాస్పిటల్ లో ప్రాణాపాయములో ఉన్నప్పుడు ఒక పాస్టర్ గారు ఆయన దగ్గరకు వెళ్లి యేసు ప్రభువు గురించి చెప్పాడు. యేసు ప్రభువు చెప్పిన ఒక మాట రవి హృదయాన్ని తాకింది. 

Because I live you shall live also

నేను జీవించు చున్నాను గనుక మీరు కూడా జీవిస్తారు. నేను జీవము కలిగిన రక్షకుణ్ణి, నన్ను నమ్మితే నీవు కూడా జీవిస్తావు. యేసు ప్రభువు చెప్పిన ఆ మాటలు రవి జకరియస్ కి నిరీక్షణ కలిగించాయి.ఆయన రక్షణ పొందాడు. యేసు క్రీస్తు శిష్యుడు అయ్యాడు. ఆయన వాక్యం ప్రకటించడం మొదలుపెట్టాడు. 

    1966 లో కెనడా దేశం వెళ్ళాడు. అక్కడ కాలేజీ విద్య ముగించుకొని, బైబిల్ కళాశాలల్లో బోధించాడు. చివరిగా అమెరికా దేశములోని జార్జియా రాష్ట్రములో అట్లాంటా నగరములో స్థిరపడ్డాడు. బిల్లీ గ్రాహము గారు ఆంస్టర్ డామ్ లో జరిగిన సువార్తికుల కాన్ఫరెన్స్ లో రవి గారిని స్పీకర్ గా ఆహ్వానించాడు. బిల్లీ గ్రాహం గారు సువార్త ప్రకటించేవాడు, సామాజిక సేవ కూడా చేసేవాడు. ఆయన ప్రభావము రవి జకరియస్ మీద కూడా పడింది. బిల్లీ గ్రాహము గారి కుమారుడు ఫ్రాంక్లిన్ గ్రాహం గారితో కొన్ని నిమిషాలు మాట్లాడాను. ఆయన మాటలు కూడా విందాము.

     “రవి జకరియస్ పాస్టర్లకు, విశ్వాసులకు ఆదర్శప్రాయుడు. ఒక అరుదైన వ్యక్తి

 అలాంటి వాడు ఏ రెండోదాల ఏళ్లకు ఒక సారి మాత్రమేపుడతాడు. అతడి మేధస్సు గొప్పది.దేవుని సత్యాలను ఎంతో చక్కగా వివరిస్తాడు. చదువు లేని సామాన్యులకు కూడా ఆయన మాటలు అర్థం అవుతాయి.Ph D చేసిన మేధావులను ఆయన పలుకులు ఉత్తేజపరుస్తాయి. యేసు క్రీస్తు సువార్త అందరికీ చేరాలని ఆయన పరితపించాడు.క్రైస్తవ సంఘము ఆయన వాక్యముతో ఎదిగింది. ఆయన లేని లోటు పూడ్చలేము.సంఘములోని అందరికీ ఆయన ఆదర్శప్రాయుడు.ప్రపంచ మంతా సువార్త తీసుకు వెళ్ళాడు.

     రవి జకరియస్ లాంటి వాడు మన వైపు ఉండుట మనకు వరం లాంటింది.క్రైస్తవ్యాన్ని విమర్శించే వారికి, నాస్తికులకు ఆయన ఇచ్చే సమాధానాలు అమోఘము.అందుకే దేవుడు ఆయనను పిలిచాడు.దేవుడు అందుకే ఆయనను సృష్టించాడు.మనలో ప్రతి ఒక్కరినీ దేవుడు ఒక ప్రత్యేక ఉద్దేశ్యముతో సృష్టించాడు. రవి కి దేవుడు ప్రత్యేక వరాలు ఇచ్చాడు. మనము ఆయనను చూసి అసూయ పడి, ఈర్ష్య పడ నక్కరలేదు. దేవుడు మనకు కూడా కొన్ని వరములు ఇచ్చాడు, సామర్ధ్యములు ఇచ్చాడు. వాటిని మనము దేవుని కోసం ఉపయోగించాలి. దేవుని మహిమ కోసం వాటిని వాడాలి. మనిషి అడిగే ప్రశ్నలన్నిటికీ సమాధానము చెప్పగలిగే వరమును దేవుడు రవి జకరియస్ కి ఇచ్చాడు. దేవునికి వ్యతిరేకముగా లేచే ప్రతి విమర్శను, క్రీస్తు సందేశమును అడ్డగించే ప్రతి వాదనను ఖండించి, ఓడించే అద్భుత జ్ఞానము ఆయన సొంతము.ప్రేమతో, దీన మనస్సుతో ఆ మాటలు పలికేవాడు. అలాంటి దేవుని సేవకుడు మనకు గర్వ కారణము. ఆయన మొదలు పెట్టిన సువార్త సేవను ఆయన అనుచరులు ముందుకు తీసుకువెళ్లాలి. పాస్టర్ సామీ డాగర్ లెబనాన్ దేశములో సువార్త ప్రకటిస్తున్నాడు. రవి జకరియస్ లెబనాన్ వెళ్లి అక్కడి సంఘములలో దేవుని వాక్యము బోధించాడు. ఆ ప్రాంతములో పాస్టర్ సామీ డాగర్ గొప్ప దేవుని సేవకుడు.సిరియా, ఇరాక్, జోర్డాన్ లాంటి కష్టమైన ప్రాంతములలో ఆయన సువార్త ప్రకటిస్తున్నాడు.రవి జకరియస్, సామీ డాగర్ ఇద్దరూ మన తరములో గొప్ప దైవజనులు.వారితో స్నేహం చేయడం నాకు ఇవ్వబడిన ఒక ఘనత.”

     ఫ్రాంక్లిన్ గ్రాహం గారి మాటలు మనము విన్నాము.రవి జకరియస్ ప్రసంగాలు ఎవరినైనా ఆకట్టుకొంటాయి. ఆయన అమెరికా లో స్థిరపడినప్పటికీ భారత దేశాన్ని మరచిపోలేదు. భారతీయులకు కూడా అనేక సార్లు సువార్త ప్రకటించాడు. భారత దేశం మీద క్రైస్తవ్యము యొక్క  ప్రభావము గురించి ఎప్పుడూ చెబుతూ ఉండేవాడు. 

1991 లో నేను పదో తరగతి పరీక్షలు వ్రాశాను. మే నెలలో రవి జకరియస్ మీటింగ్స్ బెంగుళూరు లో జరుగుతున్నాయి. మా నాన్న యోహాను గారు నన్ను, నా సోదరులను రవి గారి మీటింగ్స్ కి తీసుకు వెళ్ళాడు.

   మే 21, 1991. ఆ రోజు నాకు బాగా గుర్తు ఎందుకంటే రాజీవ్ గాంధీ గారు హత్యకు గురయ్యాడు. రాజీవ్ గాంధీ నాకు చాలా ఇష్టం, నాకు చాలా బాధ వేసింది. ఆ రోజు సాయంత్రం రవి జకరియస్ మీటింగ్ కి వెళ్ళాను. రవి గారు ఏమని చెప్పాడంటే, రాజీవ్ గాంధీ హత్య చేయబడడం నాకు కూడా బాధగా ఉంది. మా నాన్న ఇందిరా గాంధీ దగ్గర పనిచేశాడు. నేను నా బాల్యములో రాజీవ్ గాంధీ తో కలిసి ఆడుకొంటూ ఉండేవాణ్ణి. ఆయన మరణం నాకు బాధగా ఉంది’ అన్నాడు. రాజీవ్ గాంధీ తో గడిపిన బాల్యము దాని ప్రభావము  కూడా ఆయన మీద పడింది. ప్రధాన మంత్రులకు, దేశాధ్యక్షులకు, గవర్నర్ లకు,  పెద్ద, పెద్ద గవర్నమెంట్ ఆఫీసర్ లకు సువార్త చెప్పాలి అని ఆయనకు ఉండేది. అనేక దేశ ప్రధానులకు, అధ్యక్షులకు ఆయన సువార్త ప్రకటించాడు.

    న్యూ యార్క్ లోని ఐక్య రాజ్య సమితి జనరల్ అసెంబ్లీ లో దేవుని వాక్యం ప్రకటించాడు. అనేక దేశ నాయకులను కలిసాడు.దేవుడు మీకు చాలా అధికారము ఇచ్చాడు.దానిని మీరు జాగ్రత్తగా వాడాలి. ఎందుకంటే దేవుడు మిమ్ములను లెక్క అడుగుతాడు అని చెప్పేవాడు. అమెరికా అధ్యక్షులు ఆయన వాక్యము విన్నారు. జార్జ్ బుష్ దగ్గర నుండి ఇప్పటి డోనాల్డ్ ట్రంప్ వరకు రవి జకరియస్ ని వైట్ హౌస్ కి ఆహ్వానించి ఆయన చేత ప్రార్థన చేయించుకొన్నారు. ఆఫ్రికా లో రాబర్ట్ ముగాబే జింబాబ్వే అధ్యక్షుడు అయిన తరువాత ఆ దేశములో అస్తవ్యస్తమైన పాలన తెచ్చాడు. ఆఫ్రికా వెళ్లి రాబర్ట్ ముగాబే కి రవి జకరియస్ దేవుని వాక్యం బోధించాడు. 

     సౌత్ ఆఫ్రికా లో పరిస్థితులు చాలా ఘోరముగా ఉండేవి. అక్కడ ఉన్న తెల్ల వారు నల్ల జాతి వారిని ఎంతో కాలము అణచి వేశారు. వివక్ష చూపించారు. నల్ల జాతి వారిని వేరుచేశారు. జాతి వైషమ్యాలు హింసకు, హత్యలకు దారి తీసినవి. ఆ దేశములో శాంతి సందేశం ఇవ్వమని రవి జకరియస్ ని పిలిచారు. రవి జకరియస్ తన ప్రసంగములో వారితో ఏమన్నాడంటే, ‘గాంధీ ఈ సౌత్ ఆఫ్రికా లో ఉద్యమాలు చేశాడు. అహింస మార్గాన్ని గాంధీ ఎంచుకున్నాడు. గాంధీ ఎక్కడికి వెళ్లినా క్రొత్త నిబంధన తీసుకు వెళ్ళేవాడు. ఆయన రూమ్ లో గోడ మీద యేసు ప్రభువు బొమ్మ ఉండేది. రవి జకరియస్ గుజరాత్ లో అహ్మదాబాద్ లో సబర్మతి ఆశ్రమముకు వెళ్ళాడు. గాంధీ అనేక సంవత్సరాలు ఆ ఇంటిలో ఉన్నాడు. ఇప్పుడు అది ఒక మ్యూసియం గా ఉంది. ఆ  గోడ మీద ఒక వాక్యం ఉంది. బెట్రాండ్ రస్సెల్ అనే నాస్తికుడు ఆ మాటలు అన్నాడు: 

“It is doubtful that the method

 employed by Gandhi would

 have ever succeeded, 

except that he was appealing

 to the conscience of a

 Christianized people”?

గాంధీ చేసిన ఉద్యమం ఫలించింది అంటే దానికి కారణము బ్రిటిష్ వారు క్రైస్తవులు కాబట్టే. వారు క్రెస్తవులు కాబట్టే గాంధీ మాటలు వారి హృదయాల్లోకి చొచ్చుకుపోయాయి. ఒక నాస్తికుడు బెర్ట్రాండ్ రస్సెల్ అన్న మాటలు రవి జకరియస్ వారికి గుర్తుకుచేశాడు. 

ఈ సౌత్ ఆఫ్రికా లో మీరు చేస్తున్నది ఏమిటి? తెల్లవారు ఒక ప్రక్క, నల్లవారు మరొక ప్రక్క, ఇద్దరూ క్రైస్తవులే, తెల్లారి లెగిసినదగ్గరి నుండి తన్నుకొంటారు. యేసు క్రీస్తు చెప్పింది ఇదేనా? అని వారిని నిలదీసాడు. రవి జకరియస్ మాటలు విని తెల్లవారు, నల్లవారు ఇద్దరూ ఆలోచించారు. ప్రభుత్వము తెల్లవారి చేతిలో ఉంది. నల్లవారి నాయకుడు నెల్సన్ మండేలా. నెల్సన్ మండేలా ని తీసుకొని వెళ్లి జైలులో వేశారు. నెల్సన్ మండేలా తన జైలు గదిలో గోడ మీద యేసు ప్రభువు ఫోటో పెట్టుకొన్నాడు. ఈ రోజు వరకు ఆ జైలులో ఆ ఫోటో అక్కడే ఉంది. గాంధీ తన గోడ మీద యేసు ప్రభువు ఫోటో పెట్టుకొన్నట్టు, నెల్సన్ మండేలా కూడా తన గోడ మీద యేసు ప్రభువు ఫోటో పెట్టుకొన్నాడు. అహింస మార్గములో బ్రిటిష్ వారితో పోరాడి నల్లజాతి వారు స్వాతంత్రం తెచ్చుకొన్నారు. ఆ విధముగా రవి జకరియస్ ఆఫ్రికా వెళ్లి వారికి గాంధీ మీద యేసు ప్రభువు ప్రభావము గురించి తెలియజేశాడు.

     బెర్లిన్ గోడ కూలిపోయిన తరువాత రవి జకరియస్ మాస్కో వెళ్ళాడు. రష్యా దేశములో ముఖ్య మిలిటరీ నాయకులు ఆ మీటింగ్ కు వెళ్లారు. వారంతా స్టాలిన్, కృష్చెవ్ లాంటి నియంతల క్రింద పనిచేసిన వారు. అధికారికముగా రష్యా దేశాన్ని ఒక నాస్తిక దేశముగా ప్రకటించి క్రైస్తవులను ఎంతో  హింసించారు. రవి జకరియస్ వారిని నిలదీశాడు. ‘దేవుడు లేకుండా మీరు సాధించింది ఏమిటి? రష్యా దేశాన్ని ఎందుకూ  పనికి రాకుండా చేశారు. కోట్లాది మంది అమాయక ప్రజల ప్రాణాలు తీశారు. అలెగ్జాండర్ సోల్జ నిస్తిన్  అనే గొప్ప మేధావిని రష్యా నాయకులు గులాగ్ జైలులో ఉంచి ఎంతో వేధించారు. సోల్జ నిస్తిన్ ఏమన్నాడంటే, దేవుడికి దూరముగా వెళ్ళిపోయి మా దేశం ఎంతో ఘోరమైన స్థితికి వెళ్ళింది. ఆ తప్పు  ఇతర దేశాలు చేయకూడదు. రవి జకరియస్ వారికి సోల్జ నిస్తిన్ మాటలు జ్ఞాపకం చేశాడు. ఆయన ప్రసంగము ముగించిన తరువాత రష్యా నాయకులు నిలబడి చప్పట్లు కొట్టారు. 

     యూరప్, అమెరికా నాయకులకు కూడా రవి జకరియస్ యేసు క్రీస్తు సువార్త ప్రకటించాడు. పోలాండ్ లోని ఔస్క్ విట్జ్ కి వెళ్ళాడు. అక్కడ రెండో ప్రపంచ యుద్ధ కాలములో హిట్లర్, నాజీ నాయకులు లక్షలాది మంది యూదులను, ఇతర బలహీన వర్గాల వారిని హతమార్చారు. నాజీ సైంటిస్టులు చిన్న పిల్లల మీద  సైన్స్ ప్రయోగాలు చేశారు. రవి జకరియస్ అవన్నీ చూసి ఎంతో ఆవేదన చెందాడు. యూరోప్, అమెరికా నాయకులకు ఆ సంఘటనలు వివరించాడు. యేసు క్రీస్తు వెలుగు మీకు లేకపోతే హిట్లర్ లాంటి దుష్టులను మీరు తయారు చేస్తారు. దేవుని వాక్యాన్ని మీరు నిర్లక్ష్యం చేశారు కాబట్టే ఔస్క్ విట్జ్ ని మీరు కట్టారు.ఆ విధముగా రవి జకరియస్ ప్రపంచమంతా తిరిగి అనేక దేశాల నాయకులకు యేసు క్రీస్తు సువార్త ప్రకటించాడు. 

     ఆయన గొప్ప అపాలజిస్టు. అంటే అపాలజీ, క్షమాపణ అడిగేవాడు అని కాదు.గ్రీకు భాషలో అపొలోగియా అంటే డిఫెండ్ అంటే సమర్ధించుట అని అర్థం. క్రైస్తవ్యాన్ని విమర్శించేవారికి గట్టి సమాధానము ఇవ్వగలిగే వాడు అని అర్థము. రవి జకరియస్ తో వాదించాలంటే నాస్తికులకు భయం వేసేది. ఆయన ఒక మంచి వాదన తయారు చేశాడు. ఆయన ఏమనేవాడంటే, ఏ వాదము అయినప్పటికీ, 4 ప్రశ్నలకు సమాధానం చెప్పాలి. origin, meaning, morality, destiny  

origin – నేను ఎలా ఉద్భవించాను? 

meaning – నా జీవితానికి అర్థం ఉందా? 

morality – నా నైతిక విలువలు ఏమిటి? 

destiny – నా గమ్యం ఏమిటి? 

ఏ మతమైనా, ఏ ఫిలాసఫీ అయినా ఆ నాలుగు ప్రశ్నలకు సమాధానం చెప్పాలి. 

ఆ నాలుగు ప్రశ్నలకు 3 పరీక్షలు పెట్టాడు. 

Logical Consistency, 

Empirical Adequacy 

Experiential Relevance 

ఆ నాలుగు ప్రశ్నలకు మీరు ఇచ్చే సమాధానాల్లో 

logical consistency అంటే హేతు బద్ధత ఉండాలి. 

empirical adequacy, అంటే భౌతిక ఆధారాలు ఉండాలి. 

experiential relevance, అంటే మన అనుభవాలకు అవి సరితూగాలి. 

    రవి జకరియస్ తయారు చేసిన ఈ ఆర్గుమెంట్ చాలా బలముగా పనిచేసింది. నాస్తికులు డార్విన్ సిద్ధాంతాన్ని నమ్మొచ్చు. కోతులు, చింపాంజీ ల లాంటి జంతువుల నుండి మేము ఉద్భవించాము, పరిణామం చెందాము అని వారు వాదించవచ్చు. అయితే వారికి నైతిక ప్రమాణాలు ఉండవు. అందరూ జంతువులు అయితే నైతిక ప్రమాణాలు ఎక్కడ నుండి వస్తాయి? దేవుడు లేకుండా నైతిక ప్రమాణాలు ఉండవు. ఆ నైతిక ప్రమాణాలు లేకుండా ఏది మంచో ఏది చెడో మనం చెప్పలేము. హిట్లర్ చేసింది తప్పు అని చెప్పటానికి నైతిక ప్రమాణాలు ఉండాలి, ఆ నైతిక ప్రమాణాలు ఉండాలంటే దేవుడు ఉండాలి అని చెప్పాడు. హార్వర్డ్, యేల్, ప్రిన్స్ టన్, ఆక్సఫర్డ్, కేంబ్రిడ్జి లాంటి పెద్ద పెద్ద యూనివర్సిటీ లలో ఈ వాదన చేశాడు. ఆయనతో వాదించాలంటే, రిచర్డ్ డాకిన్స్, క్రిస్టోఫర్ హిచెన్స్ లాంటి ప్రఖ్యాత నాస్తికులు కూడా వణకిపోయారు. 

    రవి జకరియస్ అంత ప్రఖ్యాతి గాంచినప్పటికీ ఆయనలో గర్వము మనకు కనిపించదు. అందరినీ తనతో సమానముగా చూసేవాడు. 2005 లో నేను న్యూ యార్క్ సిటీ వెళ్ళాను.అక్కడ లింకన్ హాస్పిటల్ లో డాక్టర్ ట్రైనింగ్ లో చేరాను. న్యూ యార్క్ లో కనిపించిన హింసను చూసి నాకు చాలా బాధ వేసింది. ఇక్కడకు వచ్చి నేను తప్పు చేసేనేమో అనుకొని బాధ పడుతూ ఉన్నాను. ఆ సమయములో కొలంబియా యూనివర్సిటీ లో రవి జకరియస్ మీటింగ్ పెట్టాడు. నేను ఆ మీటింగ్ కి వెళ్ళాను.మీటింగ్ తరువాత కొంతసేపు ఆయనతో మాట్లాడాను. ఆయన మాటలతో నాకు ఎంతో ప్రోత్సాహము ఇచ్చాడు. ఆయన చెప్పిన మాటలు ఇప్పటికి కూడా నాకు జ్ఞాపకం ఉన్నాయి. నా ట్రైనింగ్ అయిపోయిన తరువాత పెన్ స్టేట్ యూనివర్సిటీ కి దగ్గరలో నా హాస్పిటల్ ఓపెన్ చేసాను. ఆ యూనివర్సిటీ లో జెర్రీ సండస్కీ అనే ఫుట్ బాల్ కోచ్ ఉండేవాడు. ఆయన ఫుట్ బాల్ నేర్పిస్తాను రండి అని చెప్పి చిన్న పిల్లలను తన దగ్గరకు పిలిపించుకొని వారి మీద అత్యాచారాలు చేస్తూ ఉన్నాడు.ఆయన పాపాలు బయటపడకుండా యూనివర్సిటీ అధికారులు చాలా కాలము కవర్ చేశారు.

అయితే చివరికి ఆయన పాపాలు బయటపడి అది చాలా పెద్ద సంచలనం కలిగించింది. రవి జకరియస్ పెన్ స్టేట్ యూనివర్సిటీ లో మీటింగ్ పెట్టాడు. నేను, నా భార్య వెళ్లి వెనుక కూర్చుని విన్నాము. ఆయన ఒక మాట అన్నాడు: 

The ultimate test of any 

civilization is how we treat the

most vulnerable…what we

do to our children. 

The world has lost its direction.

అక్కడ కూర్చున్నవారందరికి ఆయన మాటలు చాలా పవర్ ఫుల్ గా వినిపించినాయి.   ఏ సంస్కృతికి అయినా అసలైన పరీక్ష ఏమిటంటే, ఆ సంస్కృతి దానిలోని అత్యంత బలహీనుల పట్ల ఎలా ప్రవర్తించింది? దానిలోని చిన్న పిల్లల పట్ల అది ఎలా ప్రవర్తించింది.మన ప్రపంచం దిశ కోల్పోయింది’ అని ఆయన ఎంతో ఆవేదన చెందాడు. రవి జకరియస్ ఆ విధముగా ప్రభువైన యేసు క్రీస్తు సువార్తను ప్రకటించుట మాత్రమే కాకుండా, మన సమాజములో ఉన్న దుష్టత్వాన్ని, హింసను, అత్యాచారాలను ప్రశ్నించాడు. పేదరికం లో ఉన్న వారికి సహాయం చేశాడు. ముంబయి లాంటి నగరాల్లో వేశ్యా వాటికల్లో ఇరుక్కు పోయిన మహిళలకు విముక్తి కలిపించాడు. అనాధ పిల్లలకు ఆశ్రయం కల్పించాడు.అటువంటి గొప్ప వ్యక్తి మరణించడం బాధాకరం. దేవుడు ఆయన కుటుంబాన్ని ఆదరించాలని మనము ప్రార్ధన చేద్దాము.ఇందాక ఫ్రాంక్లిన్ గ్రాహం గారు చెప్పినట్లు, రవి జకరియస్ కు ఇచ్చిన వరములు దేవుడు మనకు ఇవ్వక పోవచ్చు. అయితే మనకు ఇచ్చిన వరములను మనము దేవుని మహిమ కోసము వాడుతూ వుండాలి. యేసు క్రీస్తు మహిమ సువార్త అందరికీ ప్రకటిస్తూ ఉండాలి. అదే నేటి మా ప్రేమ సందేశము.

‘ప్రియమైన యేసు ప్రభువా, మరో సారి మీ ఘనమైన

నామమునకు కృతజ్ఞతా స్తుతులు చెల్లిస్తూ ఉన్నాము.

ఆత్మహత్యకు ప్రయతించిన ఒక కుర్ర వానిని మీరు

రక్షించి అతని ద్వారా అనేక కోట్ల మందికి మీ 

రక్షణ సువార్త వినిపించినందుకు మీకు వందనములు 

చెల్లిస్తున్నాము. ఈ ప్రార్థన మీ ప్రియమైన నామములో

అడిగి వేడుకొనుచున్నాము. ఆమేన్’