దేవుడు నిజముగా ఉన్నాడా?  నాస్తికత్వం, హేతువాదం

netisandesham2.png

ఈ వారము కొంతమంది నాస్తికులు నాకు ఉత్తరాలు వ్రాశారు. నువ్వు దేవుణ్ణి ఎందుకు నమ్ముతున్నావు?  హేతు వాదాన్ని నువ్వు నమ్మాలి అని నాకు వ్రాశారు. ఈ రోజు కార్యక్రమములో 

వారి ప్రశ్నలకు సమాధానము ఇవ్వాలని నేను ఆశ పడుచున్నాను. నైతిక విలువలు హేతువాదము నుండి పుట్టాయి, అవి దేవుని నుండి పుట్టలేదు అని ఈ నాస్తికులు అంటున్నారు. విశ్వాసానికి, హేతు వాదానికి సంభందం లేదు అవి ఒక దానికొకటి వ్యతిరేకం అని వీరు అంటున్నారు. ఈ రోజు వారికి నేను 

4 విషయాలు చెప్పదలుచుకొన్నాను. 

     మొదటిగా, దేవుడు హేతువుకు వ్యతిరేకము కాదు. క్రైస్తవులు హేతువాదానికి వ్యతిరేకం కాదు. తత్వశాస్త్రానికి వ్యతిరేకము కాదు. అపోస్తలుడైన పౌలు గారు ఏథెన్సు నగరములో గ్రీకు తత్వవేత్తలతో సంభాషించాడు. సెయింట్ అగస్టీన్, బొయితియస్, యాన్సెల్మ్, పీటర్ అబిలార్డ్, బోనవెంటర్, థామస్ 

అక్వినాస్, జాన్ డన్స్ స్కోటస్, విలియం ఆఫ్ ఒకామ్ మొదలగు క్రైస్తవ తత్వవేత్తలు విశ్వాసానికి, హేతువాదానికి మధ్య ఉన్న  సంభందాన్ని శోధించారు. రేషనలిజం, అంటే హేతుబద్ధముగా ఆలోచించడము మనకు నేర్పించింది దేవుడే. మత్తయి సువార్త 22:36-38 లో మనము చూస్తే అక్కడ ఒక వ్యక్తి యేసు ప్రభువును అడిగాడు: 

     బోధకుడా, ధర్మ శాస్త్రములో ముఖ్యమైన ఆజ్ఞ ఏమిటి? యేసు ప్రభువు ఏమని చెప్పాడు? 

నీ పూర్ణహృదయముతోను నీ పూర్ణాత్మతోను నీ పూర్ణమనస్సుతోను నీ దేవుడైన ప్రభువును ప్రేమింప

 వలెననునదియే. ఇది ముఖ్య మైనదియు మొదటిదియునైన ఆజ్ఞ.

దేవుని ఎలా ప్రేమించాలి? 

నీ పూర్ణహృదయముతోను, నీ పూర్ణాత్మతోను, నీ పూర్ణమనస్సుతోను 

నీ పూర్ణ మనస్సు…. మనస్సు అంటే మైండ్. నీ మైండ్ ని పూర్తిగా వాడు, నీ పూర్ణ మనస్సుతో దేవుని ప్రేమించు అన్నాడు. పాత నిబంధనలో దేవుడు ఇచ్చిన ఆజ్ఞ యేసు ప్రభువు ఆ వ్యక్తికి గుర్తుచేశాడు. ద్వితీయోప దేశ కాండము 6:4-5 వచనాల్లోమనము చదువుతాము.

  1. ఇశ్రాయేలూ వినుము. మన దేవుడైన యెహోవా అద్వితీయుడగు యెహోవా.
  2. నీ పూర్ణహృదయముతోను నీ పూర్ణాత్మతోను నీ పూర్ణశక్తితోను నీ దేవుడైన యెహో వాను ప్రేమింపవలెను.

హెబ్రీ భాషలో ఏమని ఉందంటే, 

షెమ ఇజ్రాయెల్, వెయహబ్ ట 

యెట్ యాహువే ఎలోహేక, 

బెకాల్ లెబాబేక

ఉబెకల్ నాప్షేక

ఉబెకల్ మెయోదేక.

Loveyourlordhebrew.png

పూర్ణ ఆత్మతో దేవుని ప్రేమించాలి.

ఆత్మ…హెబ్రీ భాషలో నెఫెస్ అనే పదము వాడబడింది.

మత్తయి 22 లో యేసు ప్రభువు ఏమన్నాడంటే, 

హోలే టే కార్డియా

హోలే టే సైకే

హోలే టే డయనోయా

LoveyourlordGreek.png

ఇక్కడ  సైకే అనే గ్రీకు పదము వాడబడింది అంటే ఆత్మ.అక్కడ నుండే సైకాలజీ అనే పదము వచ్చింది. క్రైస్తవులు సైకాలజీ ని ఎంతో అభివృద్ధి చేశారు.మనము మన ఆత్మ గురించి, మన మైండ్ గురించి తెలుసుకోవాలి అన్న లక్ష్యముగా ఇప్పుడు సైకాలజీ పనిచేస్తున్నది. మనకు మైండ్ ని, 

హేతువును, లాజిక్ ను ఇచ్చింది దేవుడే, కాబట్టి మనము వాటిని వాడుకోవాలి అని క్రైస్తవులు ముందు నుండి నమ్మారు. కాబట్టి, మొదటిగా దేవుడు, విశ్వాసము – హేతువుకు వ్యతిరేకము కాదు. 

  1. రెండవదిగా దేవుడు లేకుండా హేతువుకు ఆధారము లేదు.

నాస్తికులు ఏమని చెబుతారంటే, మేము కోతుల వంటి, లేక చింపాంజీల వంటి జంతువులలో నుండి ఉద్భవించాము. చింపాంజీ వంటి జంతువులో నుండి మీరు పరిణామము చెందితే, మీ మైండ్ కూడా చింపాంజీ వంటి జంతువు నుండి వచ్చినదే.ఆ చింపాంజీ మైండ్ ని మీరు నమ్మగలరా? ఆ 

చింపాంజీ మైండ్ కి ఆధారము ఏమిటి? ఆ మైండ్ ఖచ్చితమైన సమాచారాన్ని మీకు అందిస్తున్నది అని మీరు ఎలా నమ్మగలరు? డార్విన్ చెప్పినట్లు మనము చింపాంజీల వంటి జంతువులలో నుండి

జన్మిస్తే మన మైండ్ కి ఆధారము లేదు. అది మనకు తప్పుడు సమాచారము ఇస్తుండవచ్చు. మన లాజిక్ కూడా మనకు నమ్మకాన్ని కలిగించదు. క్రైస్తవ్యములో హేతువుకు ఆధారము ఉంది.

     ఫ్రాన్స్ దేశములో రెనె డేకార్ట్ అనే తత్వవేత్త జీవించాడు.ఆయన 1596 – 1650  ల మధ్య జీవించాడు. మానసిక శాస్త్రములో ఆయన చాలా గొప్ప ఫిలాసఫర్. ఆయన కోజిటో ఎర్గో సమ్ అన్నాడు.

I think, therefore I am.

Descartestelugu9719a.png

నా అస్తిత్వానికి ఆధారము నా ఆలోచన. అయితే, ఆలోచనకు ఆధారము ఏమిటి? మనము ప్రొద్దునే లేస్తాము,  పళ్ళు తోముకొంటాము, టిఫిన్ చేస్తాము, ఉద్యోగానికి వెళ్తాము, కుటుంబ, సభ్యులతో 

స్నేహితులతో గడుపుతాము. ఆ అనుభూతులను మీరు ఎంజాయ్ చేస్తూ ఉండవచ్చు. ఆ అనుభూతులు, ఆలోచనలు నిజమైనవేనా? రెనె డేకార్ట్ కి ఆ అనుమానము వచ్చింది. నా మైండ్ లో ఈ ఆలోచనలు సాతానుడు పెట్టాడేమో? ఈ ఆలోచనలు నావికాదేమో, ఏదన్నా దెయ్యము నా మైండ్ 

లో ఈ ఆలోచనలు పెట్టింది ఏమో? నాకేమి తెలుసు? అటువంటి ప్రశ్నలు రెనె డేకార్ట్ ని వేధించాయి. అయితే రెనె డేకార్ట్ ఆ అనుమానాలను జయించగలిగాడు. ఎలాగంటే, దేవుడు నన్ను సృష్టించాడు కాబట్టి నేను నా మైండ్ ని, హేతువు ను నమ్మవచ్చు.దేవుడు మంచివాడు కాబట్టి ఆయన సృష్టించిన మైండ్ కూడా మంచిదే అన్నాడు. ఆ విధముగా క్రైస్తవ్యములో మనిషి  స్వభావము, దేవుని స్వభావముతో లింక్ చేయబడింది.మన మైండ్ స్వభావము కూడా దేవుని స్వభావముతో లింక్ చేయబడింది. ఆ విధముగా హేతువుకు ఆధారం దేవుడే.దేవుడు లేకుండా హేతువుకు ఆధారము లేదు.మేము జంతువుల్లో నుండి పుట్టాము అని చెప్పుకొనే నాస్తికులకు వారి మైండ్ కి ఆధారము లేదు.

  1. దేవుడు లేకుండా, హేతువుకు విలువ లేదు. జర్మనీ దేశములో ఫ్రెడరిక్ నీచా అనే తత్వవేత్త జీవించాడు. 1844 – 1900 సంవత్సరాల మధ్య ఆయన జీవితము గడిచింది.ఆయన ఒక నాస్తికుడు.’God is dead’ అన్నాడు.‘దేవుడు చనిపోయాడు’.నీచా డార్విన్ సిద్ధాంతాన్ని నమ్మాడు. ఆయన ఏమన్నాడంటే, ‘ఈ హేతువును తెచ్చింది క్రైస్తవులు. ఈ ప్రపంచము మీద హేతువును రుద్దింది క్రైస్తవులే. డార్విన్ చెప్పినట్లు మనము జంతువులలో నుండి వచ్చాము. మనము జంతువుల లాగానే జీవించాలి. జంతువులు హేతుబద్ధముగా ఆలోచించవు, మనము కూడా హేతుబద్ధముగా

ఆలోచించవలసిన అవసరము లేదు.’ నీచా దృక్పధము సైకాలజీ ని ఎంతో ప్రభావితము చేసింది.      సిగ్మన్డ్ ఫ్రొయిడ్ 1856 – 1939 ల మధ్య ఆస్ట్రియా దేశములో జీవించాడు. ఆయన గొప్ప మానసిక శాస్త్రవేత్త. నాస్తికుడు. డార్విన్ సిద్ధాంతాన్ని నమ్మాడు. ఆయన ఏమన్నాడంటే, డార్విన్ చెప్పినట్లు మనము జంతువులలో నుండి పుట్టాము. మన ప్రవర్తన మన సబ్ కాన్షస్ మీద, అంటే మన అంత రంగము చేత ప్రభావితము చేయబడుతుంది, మనిషి ఆలోచనల్లో, మనిషి ప్రవర్తనలో హేతువుకు స్థానము లేదు.’ 

SigmundFreud91319a.png

ఇవాన్ పావ్లోవ్ రష్యా దేశానికి చెందిన శాస్త్రవేత్త. కుక్కల మీద ఆయన అనేక పరిశోధనలు చేశాడు. నోబెల్ బహుమానము కూడా ఆయనకు వచ్చింది. ఆయన నాస్తికుడు. ఈ రోజు కుక్క ముందు బెల్ కొట్టు, దానికి ఆహారము పెట్టు. రేపు కూడా కుక్క ముందు బెల్ కొట్టు, దానికి ఆహారము పెట్టు. ఎల్లుండి కూడా కుక్క ముందు బెల్ కొట్టు, దానికి ఆహారము పెట్టు. నాలుగో రోజు నువ్వు బెల్ కొట్టినప్పుడు అది ఏమిచేస్తుంది? అది సొల్లు కార్చుతుంది. ఆహారము కోసము ఎదురు చూస్తుంది. ఎందుకు? బెల్ కి, ఆహారానికి ఒక సంభందాన్ని నువ్వు దానికి అలవాటు చేశావు. దీనిని పావ్లోవ్ రిఫ్లెక్స్ అన్నారు. అది నరాల మీద ఆధారపడి ఉండేది. పావ్లోవ్ ఏమన్నాడంటే, మనిషి కి, కుక్కకి తేడా లేదు. మనిషి ప్రవర్తనలో హేతువుకు స్థానము లేదు. 

Pavlovtelugu.png

B.F.స్కిన్నర్ అమెరికా దేశానికి చెందిన శాస్త్రవేత్త.1904 – 1990 సంవత్సరాల మధ్య ఆయన జీవించాడు. ఆయన ఒక నాస్తికుడు.ఆయన పావ్లోవ్ చేసిన ప్రయోగాల చేత ప్రభావితము చెందాడు. మానసిక శాస్త్రములో ఆయన బిహేవియరిజం అనే ఉద్యమాన్ని ఆయన తీసుకువచ్చాడు. డార్విన్ చెప్పినట్లు మానవుడు జంతువులలో నుండి ఉద్భవించాడు. కాబట్టి జంతువు లాగానే మనిషి జీవిస్తాడు.హేతువు ను బట్టి జీవించాడు. ఈ మానవ జంతువులను ఇలాగే వదిలేస్తే సమాజము బాగుపడదు. మనం వీరిని కంట్రోల్ చేయాలి. 1971 లో టైమ్ మ్యాగజైన్ స్కిన్నర్ ని ముఖ చిత్రము మీద వేసింది. We Can’t Afford Freedom అని వ్యాసము వ్రాశారు. మనుష్యులకు  స్వాతంత్రము కూడా వుండకూడదు అని స్కిన్నర్ వాదించాడు. 

BFSkinnertelugu2.png

మీరు గమనించండి: 

డేవిడ్ హ్యూమ్ , ఫ్రెడెరిక్ నీచా,, విలియం జేమ్స్, సిగ్మన్డ్ ఫ్రొయిడ్, B.F.స్కిన్నర్, ఇవాన్ పావ్లోవ్ వాళ్ళందరూ నాస్తికులు, వాళ్ళందరూ హేతువుకు విలువ లేదు, దానిని అవతల పడేయండి అన్నారు. దానిని బట్టి, హేతువుకు విలువిచ్చిందే దేవుడు. మీ పూర్ణ మనస్సుతో నన్ను సేవించు అని మనకు దేవుడు ఆజ్ఞాపించాడు. దేవుడు లేకుండా హేతువుకు విలువ లేదు. నీ మైండ్ మొత్తము నా సేవలో వాడు అని మనకు ఆజ్ఞాపించి హేతువుకు విలువిచ్చింది దేవుడు మాత్రమే. చివరిగా, దేవుడు లేకుండా హేతువు నైతిక  విలువలు ఇవ్వలేదు. 

డేవిడ్ హ్యూమ్: ఆయన స్కాట్లాండ్ దేశములో జీవించాడు.1711 – 1776 ల మధ్య ఆయన జీవించాడు. ఆయన చాలా ప్రసిద్ధి చెందిన తత్వవేత్త, చరిత్ర కారుడు. నాస్తికుడు.A Treatise of Human Nature, మానవ స్వభావము మీద ఒక గ్రంథము అని పుస్తకము వ్రాశాడు. ఒక చాప్టర్ కి Moral Distinctions Not Derived From Reason. డేవిడ్ హ్యూమ్ ఒక నాస్తికుడు. ఆయన నాస్తికులతో ఏమంటున్నాడంటే, ‘మీరు హేతువును నెత్తి మీద పెట్టుకొని తిరగబాకండి, హేతువు నైతిక విలువలు నేర్పించలేదు. ఏది విలువైనదో హేతువు నేర్పించలేదు, మన మైండ్ మనకు చెప్పలేదు. హ్యూమ్ యేమని వ్రాశాడంటే, 

“‘Tis not contrary 

to reason to prefer

the destruction of

 the whole world

to the scratching 

of my finger.”

DavidHumetelugu9719b.png

     ఒక వైపు నా వేలు మీద దురద పుడుతున్నది. ఇంకో వైపు ప్రపంచము తగులబడుతున్నది. వేలు గోక్కోవాలా?  లేక ప్రపంచాన్ని రక్షించాలా? హ్యూమ్ ఏమంటున్నాడంటే, ఏ నిర్ణయం తీసుకోవాలో హేతువు 

మీకు చెప్పలేదు. నీ వేలు గోక్కోవటము ఆపి ప్రపంచాన్ని రక్షించు అని హేతువు మీకు చెప్పలేదు. నా వేలు కోసము ప్రపంచ నాశనాన్ని కోరుకోవడము హేతువుకు వ్యతిరేకం కాదు. ప్రపంచము కోసము నా వేలు త్యాగము చేయాలా? ఆ నిర్ణయాన్ని నైతిక విలువలు నిర్ణయిస్తాయి. హేతువు నిర్ణయించదు. 

     ఈ మధ్యలో ఒక ఎయిర్ లైన్స్ ఉద్యోగి విమానములో నావిగేషన్ సిస్టమ్ లో ఒక ట్యూబ్ లో గోళీలు పెట్టాడు. విమానము రన్ వే మీదకు వెళ్లిన తరువాత పైలట్ తేరుకున్నాడు. పెద్ద ప్రమాదం తప్పింది. పోలీసులు ఆ ఉద్యోగి ని అరెస్ట్ చేశారు. ఎందుకు చేశావు ఈ పని అని నిలదీశారు. ఆ ఉద్యోగి ఏమన్నాడంటే, ‘ఎన్ని సార్లు అడిగినా నా జీతము పెంచలేదు. ఇలాంటి పని చేస్తే యాజమాన్యము నా మాట వింటుందని చేశాను’. నీ జీతం కోసము విమానము కూలిపోయినా ఫర్వాలేదా? నీ సెలరీ కోసము ఎంత  మంది జనము చచ్చినా ఫర్వాలేదా? నీ జీతము కోసము ఇంకొకరి ప్రాణాలు తీయొద్దు అని హేతువు చెప్పలేదు. మీరు నమ్మే నైతిక విలువల మీద అది ఆధారపడి ఉంటుంది. 

     ఈ మధ్యలో చంద్రయాన్ – 2 ప్రయోగము జరిగింది. అమెరికా, రష్యా, చైనా ల తరువాత చంద్రుని మీద ఒక ప్రయోగ యంత్రము పెట్టిన నాలుగో దేశముగా భారత దేశము ఎదగాలని మనమంతా కోరుకొన్నాము. భారత ప్రధాని నరేంద్ర మోడీ ఉత్సవాల్లో పాల్గొందామని బెంగుళూరు వెళ్ళాడు. ఆ లాండర్  దాదాపు చంద్రుని మీదకు వెళ్లిన తరువాత ఒక సాంకేతిక లోపం వలన అనుకున్నట్లుగా చంద్రుని మీద దిగలేకపోయింది. ISRO చైర్మన్ డాక్టర్ శివన్ చివరి 15 నిమిషాలు చాలా ఉత్కంఠ భరితమైనవి అన్నాడు. ఆ చంద్రయాన్ ప్రయోగము విఫలము కావటము చూసి ఆయన షాక్ కి గురయ్యాడు.దాదాపు16,000 వేలమంది శాస్త్రవేత్తలు 12 సంవత్సరాలు కష్టపడినా ఆ ప్రయోగము సక్సెస్ కాలేదు.అది చూసి డాక్టర్ శివన్ కన్నీరు పెట్టుకొన్నాడు. ప్రధాని నరేంద్ర మోడీ డాక్టర్ శివన్ దగ్గరకు వెళ్లి, ఆయనకు షేక్ హ్యాండ్ ఇచ్చి, కౌగలించుకొని ఓదార్చాడు. భారతీయులందరూ ఆ దృశ్యాలు చూసి మెచ్చుకొన్నారు. ఈ  శాస్త్ర వేత్తల మీద చాలా ఒత్తిడి ఉంటుంది. హిట్లర్, నాజీలు చాలా మంది సైంటిస్టులను చంపారు. ప్రయోగము ఫెయిల్ అయ్యిందా, మీ ప్రాణాలు తీస్తాను అని హెచ్చరించేవాడు.

అమెరికాకు, రష్యా కు మధ్య ప్రచ్ఛన్న యుద్ధము జరుగుతున్న రోజుల్లో రష్యా ను పాలిస్తున్న స్టాలిన్ ప్రయోగాలు ఫెయిల్ అయినప్పుడు సైంటిస్టులను చంపేవాడు. ఈ రోజున నార్త్ కొరియా అధ్యక్షుడు కిమ్ జోంగ్ కూడా అంతే. ప్రయోగాలు సరిగ్గా చేయలేదు అని చాలా మంది సైంటిస్టుల ప్రాణాలు తీసాడు. భారత ప్రధాని కూడా, ‘మీరు ఏదో విరగతీస్తారు అని, నేను అన్ని పనులు మానుకొని ఢిల్లీ నుండి వచ్చాను. ప్రయోగము విఫలమయ్యింది, ఇంకా ఏడుస్తున్నావా?’ అని విమర్శించి వెళ్లిపోకుండా డాక్టర్ శివన్ ని ఓదార్చాడు. మనము ఎప్పుడు ఎలా స్పందిస్తామో మన నైతిక విలువలు నిర్ణయిస్తాయి.

    పిల్లలు ఇతర కులాల వాళ్ళని ప్రేమించారని, పెళ్లి చేసుకొన్నారని వారి ప్రాణాలు తీసే తల్లిదండ్రులు మన సమాజములో చాలా మంది ఉన్నారు. మా పిల్లల ప్రాణాల కన్నా మా కుల గౌరవమే మాకు ముఖ్యము అని వారు అనుకొంటారు. అది మంచా? చెడా? పిల్లల ప్రాణాల కన్నా కులము ముఖ్యం అనుకొనే వారు ఉన్నారు. కులము కన్నా మనిషి ప్రాణాలు ముఖ్యము అనుకునేవారు వారు ఉన్నారు.

     కొన్ని దేశాల్లో ఇద్దరు యువకులు పెళ్లి చేసుకొంటున్నారు. ఇద్దరు యువతులు పెళ్లి చేసుకొంటున్నారు. అది మంచా ? చెడా? అది మంచిదే అనేవాళ్ళు ఉన్నారు. అది చెడు అనేవాళ్ళు ఉన్నారు. ఏది మంచో, ఏది చెడో మనిషి నిర్ణయించలేడు. అది దేవుడు నిర్ణయించేది.

     ఆదికాండము మొదటి అధ్యాయములో మనము చదువుతాము.  ‘అది మంచిదని దేవుడు చూసెను’ And God saw that it was good

ప్రభువైన యేసు క్రీస్తు అడిగాడు: 

ఒకడు సర్వలోకమును సంపాదించుకొని

తన ఆత్మను పోగొట్టుకొనుట వానికేమి

ప్రయోజనము? 

మనిషి ఆత్మ యొక్క విలువ అక్కడ మనకు దేవుడు తెలియజేశాడు. అసలు ఆత్మే లేదు అనే నాస్తికులు మనిషి విలువెంతో చెప్పలేరు. కాబట్టి, దేవుడు లేకుండా హేతువు నైతిక విలువలు ఇవ్వలేదు.

హేతువు గురించి ఈ రోజు మనము 4 విషయాలు చూశాము.

1.దేవుడు హేతువుకు వ్యతిరేకము కాదు

2.దేవుడు లేకుండా హేతువుకు ఆధారము లేదు.

3.దేవుడు లేకుండా హేతువుకు విలువ లేదు

4.దేవుడు లేకుండా హేతువు నైతిక విలువలు ఇవ్వలేదు.

హేతువును మనం సరిగ్గా అర్ధము చేసుకొంటే అది మనలను దేవుని యొద్దకు నడిపిస్తుంది.దేవుని ఉనికిని మనకు చూపిస్తుంది.తన ఉనికి గురించి దేవుడు మనకు హేతువుతో పాటు అనేక ఆధారాలు ఇచ్చాడు.ప్రభువైన యేసు క్రీస్తు అనేక ప్రవచనాలు నెరవేర్చి, అనేక అబ్దుతాలు చేసి, సిలువ మీద మరణించి, సమాధి చేయబడి, మూడవ తిరిగి లేచి మనకు దేవుడు ఉన్నాడు, ఆయన మనలను ప్రేమిస్తున్నాడు అనే సత్యాన్ని తన జీవితములో మనకు చూపించాడు. ఆయనను మీ రక్షకునిగా తెలుసుకోవాలన్నదే నేటి మా ప్రేమ సందేశము.