
మీకా ప్రవక్త గురించి ఈ రోజు కొన్ని సత్యాలు మీతో పంచుకోవాలని నేను ఆశ పడుతున్నాను. మీ బైబిల్ లో మీకా గ్రంథం ఓపెన్ చేయండి. ఈ గ్రంథములో 7 అధ్యాయాలు మనకు కనిపిస్తున్నాయి. మొదటి అధ్యాయములో కొన్ని మాటలు చదువుదాము.
1. యోతాము ఆహాజు హిజ్కియా అను యూదా రాజుల దినములలో షోమ్రోనును గూర్చియు యెరూషలేమును గూర్చియు దర్శనరీతిగా మోరష్తీయుడైన మీకాకు ప్రత్యక్షమైన యెహోవా వాక్కు.
2. సకల జనులారా, ఆలకించుడి, భూమీ, నీవును నీలో నున్న సమస్తమును చెవి యొగ్గి వినుడి; ప్రభువగు యెహోవా మీమీద సాక్ష్యము పలుకబోవుచున్నాడు, పరిశుద్దాలయములో నుండి ప్రభువు మీమీద సాక్ష్యము పలుకబోవుచున్నాడు.
3. ఇదిగో యెహోవా తన స్థలము విడిచి బయలుదేరుచున్నాడు, ఆయన దిగి భూమి యొక్క ఉన్నతస్థలముల మీద నడువబోవుచున్నాడు.
4. ఆయన నడువగా అగ్నికి మైనము కరుగునట్లు పర్వతములు కరిగి పోవును, లోయలు విడిపోవును, వాటముమీద పోసిన నీరు పారునట్లు అవి కరిగి పారును
5. యాకోబు సంతతి చేసిన తిరుగుబాటునుబట్టియు, ఇశ్రాయేలు సంతతి వారి పాపములను బట్టియు ఇదంతయు సంభవించును. యాకోబు సంతతివారు తిరుగుబాటు చేయుటకు మూలమేది? అది షోమ్రోనేగదా; యూదా వారి ఉన్నతస్థలములు ఎక్కడివి? యెరూషలేములోనివే కావా?
మీకా 1
ఈ వాక్య భాగం మనకు అర్ధం కావాలంటే ముందుగా మీకా ప్రవక్త ను ప్రవక్తల లిస్ట్ లో చూడండి. పాత నిబంధన ప్రవక్తలు అని ఒక చార్ట్ నేను తయారు చేశాను. ఈ చార్ట్ కావలసిన వారు మా వెబ్ సైట్ www.doctorpaul.org కి వెళ్లి పాత నిబంధన ప్రవక్తల చార్టులు అనే పేజీ కి వెళ్ళండి. అక్కడ ఈ చార్ట్ మీరు ఉచితముగా డౌన్ లోడ్ చేసుకోవచ్చు.
యెషయా ప్రవక్త, మీకా ప్రవక్త ఒకే కాలములో జీవించారు అని మనం చూడవచ్చు. ఇద్దరూ యూదా దేశానికి తమ సందేశం వినిపించారు. పైన ఇశ్రాయేలు దేశములో అదే సమయములో హోషేయ ప్రవక్త సేవ చేస్తున్నాడు. అంటే, హోషేయ, యెషయా, మీకా ఈ ముగ్గురు పాత నిబంధన ప్రవక్తలు ఒకే కాలములో జీవించారని మనకు అర్థమవుచున్నది. మీకా క్రీ.పూ 735 – 710 సంవత్సరముల మధ్య జీవించాడు. యూదా రాజులు యోతాము ఆహాజు హిజ్కియా ల కాలములో మీకా ప్రవచించాడు. మోరెషెతు అనే గ్రామములో మీకా ప్రవక్త జీవించాడు. ఆ గ్రామం యెరూషలేముకు దక్షిణాన ఫిలిస్తీయా ప్రాంతం గాతు పట్టణానికి దగ్గరగా ఉంది.
మీకా మన ప్రభువైన యేసు క్రీస్తు గురించి ప్రవచించాడు. క్రిస్మస్ సమయములో మనం తూర్పు దేశపు జ్ఞానుల గురించి చెప్పుకొంటాము. ఈ తూర్పు దేశము జ్ఞానులు యెరూషలేము వెళ్లారు. ‘యూదుల రాజుగా పుట్టినవాడు ఎక్కడ ఉన్నాడు?’ అని హేరోదును అడిగారు. ఆ ప్రశ్న విని హేరోదు కలవరం చెందాడు. యూదుల రాజును నేను. నాకు పోటీ ఏంటి? ప్రధాన యాజకులను, శాస్త్రులను పిలిపించి అడిగాడు. ‘క్రీస్తు పుట్టేది ఎక్కడ?’ అని వారిని అడిగాడు. అందుకు వారు యూదయ బేత్లెహేములోనే;
ఏలయనగా యూదయదేశపు బేత్లెహేమా నీవు యూదా ప్రధానులలో ఎంతమాత్రమును అల్పమైనదానవు కావు;ఇశ్రాయేలను నా ప్రజలను పరిపాలించు అధిపతి నీలోనుండి వచ్చును అని ప్రవక్తద్వారా వ్రాయబడియున్నదనిరి.
మీకా చేసిన ప్రవచనం హేరోదు రాజుకు వారు చెప్పారు. యూదా దేశములో బేత్లెహేము అనే గ్రామములో క్రీస్తు జన్మిస్తాడు. 700 సంవత్సరాలకు ముందే ప్రభువైన యేసు క్రీస్తు ఎక్కడ జన్మిస్తాడో కూడా మీకా ప్రవక్త తెలియజేశాడు. మీకా గ్రంథములో దేవుడు మనకు రాజుగా కనిపిస్తున్నాడు. ఇశ్రాయేలీయులకు ఆయన రాజుగా ఉండాలని ఆకాంక్షించాడు. అయితే ఇశ్రాయేలీయులు ఆ రాజును తిరస్కరించారు. దేవుడు రాజుగా లేని మత వ్యవస్థను వారు సృష్టించుకొన్నారు. హేరోదు చేసింది కూడా అదే. ఒక వైపు, యెరూషలేము లో ఉన్న దేవుని ఆలయమునకు మరమత్తులు చేసి, దానిని ఎంతో అభివృద్ధి చేసి, ఎంతో వైభవముగా దానిని నిర్మించాడు. ఇంకో వైపు, ‘క్రీస్తును చంపే సేయండి. నాకు పోటీ వద్దు’ అన్నాడు. క్రీస్తు లేని ఆలయం అతను కోరుకున్నాడు. దేవుడు లేని మత వ్యవస్థ ను అతను కోరుకున్నాడు. అందుకనే, మీకా ప్రవక్త చేసిన ప్రవచనం హేరోదు రాజు పట్టించుకోలేదు. దేవాలయం లో ఉన్న ప్రధాన యాజకులు, శాస్త్రులు కూడా దేవుడు లేని మత వ్యవస్థ ని పెంచి పోషించారు.
అందుకనే వారు యేసు క్రీస్తును వారి దగ్గరకు అనుమతించ లేదు. యేసు క్రీస్తు ప్రభువు కూడా వారిని ఎండగట్టాడు. పూర్వం ఇశ్రాయేలీయులు చేసిన పాపం కూడా అదే. దేవుడు లేని మత వ్యవస్థ ను వారు నిర్మించుకున్నారు. పైన పది గోత్రాలు ఇశ్రాయేలు దేశము గా, క్రింద రెండు గోత్రాలు యూదా దేశముగా ఉన్నాయి. రెండు దేశాలను వారు విగ్రహాలతో నింపి వేశారు. మీకా ప్రవక్త జీవించిన కాలములో రెండు దేశాల్లో విగ్రహారాధన పరాకాష్ట కు చేరింది. దేవుని నిబంధన ను వారు నిర్లక్ష్యం చేశారు.
ప్రభువైన యేసు క్రీస్తు స్పష్టముగా చెప్పాడు: ఒకసారి ప్రజలు ఆయనను అడిగారు, బోధకుడా, ధర్మ శాస్త్రములో అన్నిటి కంటే ముఖ్యమైన ఆజ్ఞ ఏమిటి? ఆయన వారికి ఏమని చెప్పాడంటే, నీ పూర్ణహృదయముతోను నీ పూర్ణాత్మతోను నీ పూర్ణమనస్సుతోను నీ దేవుడైన ప్రభువును ప్రేమింపవలెననునదియే.
ఇశ్రాయేలీయులు దేవుని ప్రేమించడములో విఫలమయ్యారు. దేవునికి దూరముగా వెళ్ళిపోయిన తరువాత వారి ప్రవర్తనలో కూడా చాలా మార్పు వచ్చింది. వారు చేసిన పాపాలు ఏమిటో మీకా ప్రవక్త మనకు తెలియజేశాడు.
2:1 – వారు మోసాలు చేస్తున్నారు.
దుష్కార్యములు చేస్తున్నారు
2:2 ఇతరుల భూములు ఆక్రమించుకొంటున్నారు
ఇతరుల ఇళ్ళు ఆక్రమించుకొంటున్నారు
ఇతరుల ఆస్తులను అన్యాయముగా
దొంగిలిస్తున్నారు
2:8 దొంగతనాలు చేస్తున్నారు
2:9 స్త్రీల మీద అత్యాచారాలు
విధవరాళ్ల ను ఇళ్ల నుండి వెళ్లగొట్టుతున్నారు
3:1 మంచిని ద్వేషిస్తున్నారు , దుష్టత్వాన్ని
ప్రేమిస్తున్నారు
3:9 న్యాయమును తృణీకరిస్తున్నారు, దుర్నీతిని
హత్తుకొంటున్నారు
3:10 నరహత్యలు చేస్తున్నారు
3:11 లంచాలు తీసుకొంటున్నారు
మీకా ప్రవక్త ఇశ్రాయేలీయుల పాపములను వారి ముందు ఉంచాడు. వారి పాపాల తీవ్రత ఎలా ఉంది?
నా జనుల చర్మము ఊడదీసి వారి యెముకల మీది మాంసము చీల్చుచుందురు.
మీకా 3:2
అహాబు రాజు, అతని భార్య యెజెబెలు ఇద్దరూ కలిసి నాబోతు పొలం కాజేశారు. అంతే కాకుండా అతని మీద దొంగ సాక్షులను నిలబెట్టి, అన్యాయపు తీర్పు అతని మీద విధించి అతని రాళ్ళ చేత కొట్టి చంపించారు. దురాశ, అధికార దుర్వినియోగం, అవినీతి, అబద్ధ సాక్ష్యం, దొంగ తనం, దురాక్రమణ, హత్య…. అన్ని పాపాలు అహాబు రాజు, యెజెబెలు రాణి చేసిన ఆ హత్యలో మనకు కనిపిస్తున్నాయి. దేవుడు వారిని గద్దిస్తున్నాడు. నా జనుల చర్మము ఊడదీసి వారి యెముకలమీది మాంసము చీల్చుచుందురు.
ఇశ్రాయేలీయుల పాపములను బట్టి దేవుని శిక్ష వారి మీదకు దిగి వచ్చింది. మీకా ప్రవక్త ఆ ప్రవచనాలు వారికి చేసాడు. పైన ఉత్తర ఇశ్రాయేలు దేశం, క్రింద దక్షిణ యూదా దేశం – రెండింటినీ దేవుడు శిక్షించబోతున్నాడు అని మీకా ప్రవచించాడు.
ఒకటవ అధ్యాయం, 6 వచనంలో ఒక మాట చూద్దాము: కాబట్టి నేను షోమ్రోనును చేనిలోనున్న రాళ్లకుప్పవలె చేసెదను. షోమ్రోను అంటే సమరయ. సమరయ ఉత్తర ఇశ్రాయేలు దేశం యొక్క రాజధాని.
క్రీ పూ 722 లో దేవుడు ఆ దేశాన్ని శిక్షించాడు. మీకా జీవిస్తున్న రోజుల్లోనే మీకా చేసిన ప్రవచనం నెరవేరింది. మీకా యూదయ దేశస్తులకు చెప్పాడు: సమరయ కు దేవుడు ఏమి చేశాడో చూడండి, మారు మనస్సు పొందకపోతే మీ మీదకు కూడా దేవుని శిక్ష రావడం ఖాయం. ప్రతి పట్టణాన్ని, వాటి నగర వాసులను ఆయన హెచ్చరించాడు.
1: 13 చూద్దాము:
లాకీషు నివాసులారా, రథములకు యుద్ధపు గుఱ్ఱములను కట్టుడి; ఇశ్రాయేలు వారు చేసిన తిరుగుబాటు క్రియలు నీయందు కనబడినవి అది సీయోను కుమార్తె పాపమునకు ప్రథమకారణముగా ఉండును.
మీకా 1:13
లాకీషు నివాసులను ఆయన ఇక్కడ హెచ్చరిస్తున్నాడు. ఈ లాకీషు యూదయ దేశములో యెరూషలేము తరువాత అతి పెద్ద పట్టణం. మీకా ప్రవక్త ఆ పట్టణ వాసులను హెచ్చరిస్తున్నాడు. ఇశ్రాయేలు వారు చేసిన తిరుగు బాటు క్రియలు నీ యందు నాకు కనిపించినవి. సీయోను కుమార్తె పాపమునకు నీవు ప్రథమ కారణముగా నువ్వు ఉన్నావు. మీకా చెప్పినట్లే లాకీషు మీదకు దేవుని తీర్పు దిగి వచ్చింది. క్రీ పూ 701 లో హిజ్కియా రాజు పాలనలో, అషూరు రాజు సన్నెకరీబు దానిని ముట్టడించాడు. దానిని సర్వ నాశనం చేసాడు. ఇశ్రాయేలీయులను అషూరు దేశానికి బానిసలుగా తీసుకొని వెళ్ళాడు. వారిని ఎలా జయించాడో, వేధించాడో నినివే నగరములోని తన ప్యాలస్ లో చిత్రాలు గీయించుకొన్నాడు. పురాతత్వ శాస్త్రవేత్తలు భూమి ని త్రవ్వి చరిత్రను శోధిస్తారు. నినివే నగరములో వారు చేసిన త్రవ్వకాల్లో లాకీషు ను గురించిన చిత్రాలు బయట పడ్డాయి. ఇశ్రాయేలీయులు తన ముందు బానిసలుగా మోకరిల్లినట్లు గీయించుకొన్నాడు. త్రవ్వకాల్లో బయటపడిన ఈ చిత్రాలను మనం ఇప్పుడు లండన్ లో బ్రిటిష్ మ్యూసియం లో చూడవచ్చు. అక్కడ లాకీషు దండయాత్ర మీద పెద్ద హాల్ ఉంది. బైబిల్ లో వ్రాయబడిన సంఘటనలు కట్టు కథలు కాదు. అవి వాస్తవ సంఘటనలు. మీకా చేసిన ప్రవచనం ఆ రోజు నెరవేరింది. మీకా యెరూషలేము నగర వాసులకు హెచ్చరిక చేసాడు. 5 అధ్యాయం మొదటి వచనం లో ఆ సంగతి మనం చూస్తాము. శత్రువులు మన పట్టణము ముట్టడి వేయుచున్నారు. వారు ఇశ్రాయేలీయుల న్యాయాధిపతిని కఱ్ఱతో చెంపమీద కొట్టుచున్నారు.
మీకా 5:1
యెరూషలేము తప్పించుకోలేదు, దాని డబ్బు, దాని సైన్యం, దాని రాజు దానిని కాపాడ లేవు.
అమెరికా దేశములో న్యూ యార్క్ నగరము మీద సెప్టెంబర్ 11, 2001 లో టెర్రరిస్టులు దాడి చేశారు. అవి జరిగి 20 సంవత్సరాలు ముగిసినవి. ఒక నగరము మీదకు అపాయం ముంచుకొస్తే ఆ నగర వాసులు ఎంత కంగారు పడతారు! అనే విషయం ఆ రోజు మనకు అర్థం అయ్యింది. ముస్లిం టెర్రరిస్టులు రెండు విమానాలను హైజాక్ చేసి న్యూ యార్క్ నగరములో రెండు పెద్ద భవనాలను ఢీకొట్టారు. ఆ భవనాలు ఒక్కొక్క దానిలో 110 అంతస్తులు ఉన్నాయి. వేలాది మంది ప్రజలు వాటిలో ఆ రోజు పనిచేస్తూ ఉన్నారు. విమానాలు వాటిని ఢీ కొట్టిన తరువాత ఏమి చేయాలో వారికి పాలుపోలేదు. ఆ భవనం పొగతో నిండుకొంది. కిటికీల్లో నిలబడి వారు సహాయం కోసం ఆర్త నాదాలు చేశారు. ఏమి చేయాలో పాలు పోక కొంత మంది క్రిందకు దూకారు. వేలాది మంది ప్రజలు ఎటు వెళ్లాలో కూడా తెలియక కేకలు వేశారు.
ఆ సమయములో అమెరికా అధ్యక్షుడు జార్జ్ బుష్ ఫ్లోరిడా రాష్ట్రములో ఒక స్కూల్ దర్శిస్తున్నాడు. ఆయనకు ఆ వార్త చెప్పారు. ఆయన ఎంతో ఆందోళన చెందాడు. వైట్ హౌస్ కి తిరిగివెళ్ళడానికి కూడా ఆయన ఇష్టపడలేదు. ఎయిర్ ఫోర్స్ వన్ లో బయలుదేరి offutt ఎయిర్ ఫోర్స్ బేస్ కి వెళ్ళాడు. భూ గర్భములో ఒక బంకర్ లోకి చేరుకొన్నాడు. అణుబాంబులు కూడా తట్టుకొనే శక్తి ఆ బంకర్ లకు ఉంటుంది. అందులో కూర్చున్న తరువాత కానీ ఆయన మనస్సు కుదుటపడలేదు. ఒక ఉపద్రవం వచ్చినప్పుడు దేశ అధ్యక్షుడు తో సహా ప్రతి ఒక్కరూ పారిపోయే పరిస్థితి ఆ రోజు మనం చూసాం. యెరూషలేముకు అటువంటి పరిస్థితి వస్తుంది, దాని రాజు కూడా పారిపోతాడు అని మీకా ప్రవక్త చెప్పాడు. దేవుని శిక్ష విరుచుకుపడ్డప్పుడు దేశ అధ్యక్షుడు, ప్రధాన మంత్రి, ముఖ్య మంత్రి ఎవరూ కాపాడలేరు.
సెప్టెంబర్ 11 న ఆ సంఘటనలు దగ్గరుండి చూసిన ఇద్దరు జర్నలిస్టులు కొన్ని రోజుల క్రితం ఇంటర్వ్యూ చేశారు. స్కాట్ పెల్లి ఒక మాట అన్నాడు. ఆ విమానాలు ఆ భవనాలను గ్రుద్దినప్పుడు నేను వెంటనే నా మోకాళ్ళ మీద క్రింద పడ్డాను. వేలాది మంది ప్రాణాలు పోయే పరిస్థితి. దేవా కనీసం వారికి ప్రశాంతమైన మరణాన్ని అనుగ్రహించు.
స్కాట్ పెల్లి వీధిలోనే రోడ్డుమీద మోకాళ్ళ మీద పడి దేవునికి మొఱ్ఱ పెట్టాడు. దేవా, మమ్మును కరుణించు అని దేవుని వేడుకొన్నాడు. దేవుని శిక్ష వచ్చినప్పుడు తమ్మును తాము తగ్గించుకొని దేవుని వైపు తిరిగే వారు కొంతమందే. ఎక్కువ మంది దేవుని హెచ్చరికలు పట్టించుకోరు. లాకీషు నగరం నాశనం అవటం చూసి యెరూషలేము లో ఎంత మంది దేవునికి మొఱ్ఱ పెట్టారు? చాలా తక్కువ మంది మాత్రమే. ఎక్కువ మంది తమ పాపాల్లోనే కొనసాగారు.
బైరాన్ పిట్స్ ఒక మాట అన్నాడు. ఆ రోజు సంఘటనలు వివరించడానికి జర్నలిజం లో నేను నేర్చుకొన్న ఒక ముఖ్య పాఠం నాకు ఉపయోగపడింది.
KISS – Keep it Simple, Stupid
Keep it simple, stupid
నీవు చెప్పదలుచుకున్నది సింపుల్ గా చెప్పు.
చాలా మంది ఆ భవనాల దగ్గర గుమికూడి ఉన్నారు. షాక్ కి గురై కళ్లప్పగించి చూస్తున్నారు. ఆ బిల్డింగులు కొద్ది సేపట్లో కూలిపోతాయి. వెంటనే ఇక్కడ నుండి పారిపోండి. పారిపోయిన వారందరూ ప్రాణాలు కాపాడుకున్నారు. అక్కడే ఉన్న వారు శిధిలాల క్రింద పడి నలిగిపోయారు.
యేసు క్రీస్తు సువార్త కూడా సింపుల్ గా చెప్పవచ్చు. దేవుని శిక్ష నీ మీదకు దిగిరాక ముందే పారిపో. సిలువ దగ్గరకు వెళ్లి యేసు క్రీస్తు అనుగ్రహించే రక్షణ పొందు, నీ ఆత్మను కాపాడుకో. ఆ భవనాలు పడిపోయిన తరువాత అగ్ని మాపక సిబ్బంది వారు వచ్చారు. వారు పొడుగాటి రాడ్స్ తీసుకొని ఆ శిధిలాల క్రింద పొడవడం కనిపించింది. ఇంకా ఎవరైనా ఆ శిధిలాల క్రింద ఉంటే రక్షిద్దాము అని వారు అంతా తిరిగారు కానీ అప్పటికే వాటి క్రింద పడిన వారందరూ ప్రాణాలు కోల్పోయారు.
చెల్సీ పయర్స్ ప్రాంతములో అనేక ఎమర్జెన్సీ బెడ్స్ ఏర్పాటు చేశారు. వేలాది మంది గాయాలతో వస్తారు అని వారు సిద్ధపడ్డారు. అయితే ఎవరూ అక్కడికి వెళ్ళలేదు. బ్రతికిన వారు సురక్షితముగా బయటపడ్డారు. బయటపడలేని వారు ప్రాణాలు కోల్పోయారు. సువార్త లో కూడా రెండే గ్రూపులు. రక్షణ పొందిన వారు ఒక గ్రూపు. నశించిన వారు రెండవ గ్రూపు. మూడో గ్రూప్ లేదు. ఈ రోజు మీరు ఏ గ్రూప్ లో ఉన్నారో మీరు ఆలోచించాలి.
మీకా దుర్వార్త తో పాటు సువార్త కూడా తన ప్రజలకు అందించాడు. యాకోబు సంతతీ, తప్పక నేను మిమ్మునందరిని పోగు చేయుదును, ఇశ్రాయేలీయులలో శేషించిన వారిని తప్పక సమకూర్చుదును. బొస్రా గొఱ్ఱెలు కూడునట్లు వారిని సమకూర్చుదును, తమ మేతస్థలములలో వారిని పోగు చేతును, గొప్ప ధ్వని పుట్టునట్లుగా మనుష్యులు విస్తారముగా కూడుదురు
మీకా 2:12
దేవుడు ఆ ప్రవచనం నెరవేర్చాడు. అన్య దేశాల్లో చెదిరిపోయిన యూదులను తిరిగి ఇశ్రాయేలు దేశంలో పోగు చేసాడు. అంత మాత్రమే కాదు, వారికి ఒక గొప్ప రాజును దేవుడు వాగ్దానం చేసాడు.
బేత్లెహేము ఎఫ్రాతా, యూదావారి కుటుంబము లలో నీవు స్వల్పగ్రామమైనను నాకొరకు ఇశ్రాయేలీ యులను ఏలబోవువాడు నీలోనుండి వచ్చును; పురాతన కాలము మొదలుకొని శాశ్వతకాలము ఆయన ప్రత్యక్ష మగుచుండెను. మీకా 5:2
దేవుని యొక్క గొప్ప వాగ్దానం మీకా వారికి అందించాడు. యెరూషలేములో కాదు, లాకీషు లో కాదు, బెత్లెహేము అనే చిన్న గ్రామములో ఇశ్రాయేలీయులను ఏలబోవు రాజు పుట్టబోవుచున్నాడు. రాజైన దావీదు పుట్టి పెరిగిన గ్రామములోనే ఈయన దావీదు కుమారుడిగా పుట్టబోవుచున్నాడు. పురాతన కాలము మొదలుకొని శాశ్వతకాలము ఆయన ప్రత్యక్ష మగుచుండెను.ప్రభువైన యేసు క్రీస్తు యొక్క దైవత్వము కూడా మనకు ఇక్కడ కనిపిస్తున్నది. ఆయన భౌతిక జీవితం బేత్లెహేములో మొదలయినప్పటి ఆయన ఉనికి శాశ్వతమైనది. శాశ్వతకాలము ఆయన ప్రత్యక్షమవుచున్నవాడు.
= అరణ్యములో అబ్రహాము దాసీ హాగరు కు ప్రత్యక్షమైనది ఎవరు? యేసు క్రీస్తే (ఆదికాండము 16)
= అబ్రహాము కు ప్రత్యక్షమైన ముగ్గురు అతిధులలో ఉన్న ఒక వ్యక్తి ఎవరు? యేసు క్రీస్తే (ఆదికాండము 18)
= మోరియా పర్వతము మీద ఇస్సాకును అర్పిస్తున్నప్పుడు అబ్రహామును ఆపింది ఎవరు? యేసు క్రీస్తే (ఆదికాండము 22)
= రాత్రంతా యాకోబుతో పోరాడిన దేవుని దూత ఎవరు? యేసు క్రీస్తే (ఆదికాండము 32)
= మండుచున్న పొదలో మోషేకు ప్రత్యక్ష మైన దేవుని అగ్ని ఎవరు? యేసు క్రీస్తే (నిర్గమ కాండం 3)
= అరణ్యములో 40 సంవత్సరములు ఇశ్రాయేలీయులను వెంబడించి వారిని పోషించిన రాయి ఎవరు? యేసు క్రీస్తే
= మిద్యానీయులను ఎదుర్కొనుటకు గిద్యోనును బలపరచిన దేవుని దూత ఎవరు? యేసు క్రీస్తే (న్యాయాధిపతులు 6)
= మానోహు దంపతులకు సమ్సోను జన్మ గురించి వాగ్దానము చేసిన దేవుని దూత ఎవరు? యేసు క్రీస్తే (న్యాయాధిపతులు 13)
= యెషయా చూసిన గొప్ప దర్శనములో కనిపించిన పరిశుద్దుడైన దేవుడు ఎవరు? యేసు క్రీస్తే (యెషయా 6)
= షడ్రకు, మెషెకు, అబేద్నెగోలతో అగ్ని గుండములో నడిచిన దేవుని దూత ఎవరు? యేసు క్రీస్తే (దానియేలు 6)
ఆయన శాశ్వత కాలము ప్రత్యక్షమగుచున్న వాడు. బెత్లెహేములో పుట్టబోవుచున్న ఇశ్రాయేలు రాజు సాక్షాత్తు మానవ రూపములో వచ్చిన దేవుడు.
మొదటి సారి వచ్చినప్పుడు ఈ రాజు తిరస్కరించబడ్డాడు. సిలువ వేయబడ్డాడు, చంపబడ్డాడు, సమాధి చేయబడ్డాడు. తిరిగి లేచాడు.
5:5 లో మీకా ప్రవక్త ఏమంటున్నాడంటే,
ఆయన సమాధానమునకు కారకుడగును. మీకా 5:5
ఈ రోజున మన ప్రపంచములో సమాధానం లేదు. యేసు క్రీస్తు ద్వారా మనకు దేవుడు సమాధానం అందిస్తున్నాడు. ముందు ఆయన యొక్క సిలువ వలన దేవునికి మనకు మధ్య శాంతి కలిగింది. దేవునికి, మనకు మధ్య ఉన్న శత్రుత్వం తొలగిపోయింది. ఆయన రెండవ సారి వచ్చినప్పుడు ఈ ప్రపంచ దేశాల మధ్య కూడా శాంతిని ఆయన స్థాపిస్తాడు. ఆ సమాధాన కర్త యొద్దకు ఈ రోజు మీరు రావాలన్నదే నేటి మా ప్రేమ సందేశం.