మొదటి క్రైస్తవ హతసాక్షి : స్తెఫెను

The Stoning of Stephen

 

   నేడు క్రైస్తవ సంఘము ప్రపంచ చరిత్రలో ఇంతకు ముందెన్నడూ లేనటువంటి శ్రమలను అనేక దేశాల్లో ఎదుర్కొంటున్నది. ఇటువంటి సమయములో మొదటి క్రైస్తవ హతసాక్షి స్తెఫెను గురించి నేర్చుకొంటే మనకు ఎన్నో మంచి సత్యాలు తెలుస్తాయి. అపోస్తలుల కార్యములు 6,7 అధ్యాయాల్లో స్తెఫెను గురించిన సంగతులు మనము చదువుతున్నాము.స్తెఫెను మొదటి క్రైస్తవ హతసాక్షి. ఆయన జీవితము నుండి ప్రతి క్రైస్తవుడు నేర్చుకొనవలసిన పాఠములు ఉన్నాయి.స్తెఫెను నుండి మనము 10 పాఠములు నేర్చుకోవచ్చు. 

1.స్తెఫెను యొక్క సేవ

     తొలి తరములో క్రైస్తవులందరూ యూదులే.ఆ యూదులలో హెబ్రీ భాష మాట్లాడేవారు, గ్రీకు భాష మాట్లాడేవారు ఉన్నారు. వారిద్దరి మధ్య ఒక వివాదము వచ్చింది.గ్రీకు భాష మాట్లాడే యూదులు ఒక ఆరోపణ చేశారు: అనుదిన పరిచర్యలో మమ్ములను చిన్న చూపు చూస్తున్నారు. మా విధవరాండ్రకు సరిగ్గా ఆహారము అందుట లేదు. 

    12 మంది అపోస్తలులు ఆ సమస్య గురించి ఆలోచించారు. ‘ఒక పరిష్కార మార్గము మేము కనుగొన్నాము. మేము వాక్యము ప్రకటించకుండా ఆహారము పంచటము మంచిది కాదు. మీకు న్యాయమైన పద్దతిలో ఆహారము పంచి పెట్టుటకు 7 మంచి విశ్వాసులను మేము నియమిస్తాము’ అన్నారు. ఆ ఏడుగురిలో ఈ స్తెఫెను ఒకడు. ఆయన అపోస్తలుడు కాదు. కానీ ఆయన దేవుని చేత బలముగా వాడబడుచున్నాడు. 

8 వచనము: 

 స్తెఫను కృపతోను బలముతోను నిండినవాడై  ప్రజల మధ్య మహత్కార్యములను గొప్ప సూచక క్రియలను చేయుచుండెను. ఆయన మహత్కార్యములు చేస్తూ ఉన్నాడు.గొప్ప సూచక క్రియలు చేస్తూ ఉన్నాడు. అపోస్తలులు ఆయనను పిలిచి, ‘స్తెఫను, నువ్వు విధవరాళ్లకు ఆహారము పెట్టు’ అని అడిగినప్పుడు స్తెఫెను వారితో గొడవపెట్టుకోలేదు. ‘నేను మీకు ఏ విషయములో తక్కువ? నేను కూడా మీకు లాగానే ప్రజల మధ్య మహత్కార్యములు చేస్తున్నాను.గొప్ప సూచక క్రియలు చేస్తున్నాను. నేను విధవరాండ్రకు ఆహారము వడ్డించటం ఏమిటి?’ అని అపొస్తలులను ఎదిరించలేదు.సంతోషముగా ఆ బాధ్యత స్వీకరించాడు.ఆయనలోని దీనత్వము, సేవాతత్పరత మనకు అక్కడ కనిపిస్తున్నాయి. క్రైస్తవ పరిచర్యలో సూపర్ స్టార్ లు ఉండరు.ఈ పని నా స్థాయికి తక్కువ అని మనము ఎప్పుడూ అనుకోకూడదు. మందిరము ఊడవాలి అంటే ఊడువు, కూరగాయలు కోయాలి అంటే కూర గాయాలు కోయి, వంట చేయాలి అంటే వంట చేయి, వడ్డించాలంటే వడ్డించు, మంచాలు వేయాలంటే మంచాలు వేయి, సువార్త ప్రకటించాలంటే సువార్త ప్రకటించు. ప్రభువైన యేసు క్రీస్తు ఈ పాఠము మనకు నేర్పించడానికే ఆయన తన నడుముకు తువాలు కట్టుకొని తన శిష్యులు పాదములు కడిగాడు.మీరు కూడా ఇలా సేవ చేయాలి అని వారికి ఆయన నేర్పించాడు. స్తెఫెను ఆ పాఠము చక్కగా నేర్చుకొన్నాడు. ఇది నా స్థాయికి తక్కువ అనుకోకుండా ఆయన సేవ చేశాడు. 

2. స్తెఫెను యొక్క విశ్వాసము 

6:5 వచనము లో  మనము చదువుతున్నాము. విశ్వాసముతోను పరిశుద్ధాత్మతోను నిండుకొనినవాడైన స్తెఫను

A man full of faith and the Holy Spirit 

     స్తెఫను విశ్వాసముతో నిండిపోయిఉన్నాడు, పరిశుద్దాత్మ తో నిండిపోయి ఉన్నాడు. 5 శాతము కాదు, 10 శాతము కాదు, 50 శాతము కాదు, 100 శాతము విశ్వాసముతో నిండి ఉన్నాడు.అతని జీవితములో సంశయము లేదు, డౌట్ లేదు, అనుమానము లేదు, ఆందోళన లేదు, ఎందుకంటే ఆయన పూర్తిగా దేవుని యందు విశ్వాసముతో నిండిపోయి ఉన్నాడు. అలాంటి జీవితము నిజముగా ఎంత ధన్యకరమైనదో మీరొక సారి ఆలోచించండి.విశ్వాసము ఎక్కువ ఉంటే సంశయము తక్కువగా ఉంటుంది, విశ్వాసము తక్కువ ఉంటే సంశయము ఎక్కువగా ఉంటుంది.

3.స్తెఫెను యొక్క ధైర్యము 

     అవిశ్వాసులు స్తెఫనును చూసి ఓర్చుకోలేకపోయారు.ఆయనతో వాదించడము మొదలుపెట్టారు. ప్రధాన యాజకులు, వారి మనుష్యులు అక్కడ ఉన్నారు. యేసు ప్రభువును సిలువ వేసిన మూక అది. అది ఒక అల్లరి మూక. ‘వీళ్ళతో పెట్టుకుంటే నన్ను కూడా చంపేస్తారేమో, బ్రతికుంటే బలుసాకు తినవచ్చు, నోరు మూసుకొని నా పని నేను చేసుకొంటాను’ అని స్తెఫెను అనుకోలేదు.ధైర్యముగా వారితో మాట్లాడాడు. యేసు క్రీస్తు రక్షకుడు అని వారికి వాక్యము చెప్పాడు.మా అమ్మ రాజాబాయిమ్మ గారు ఎంతటి వాడి కయినా సువార్త చెప్పేది. గుంటూరు జనరల్ హాస్పిటల్ లో ఆమె పనిచేసేటప్పుడు పెద్ద పెద్ద డాక్టర్ల తో ఆమె పనిచేస్తూ ఉండేది. వారందరికీ సువార్త చెప్పేది. వాళ్ళు ఏమన్నా అనుకుంటారేమో అని సంశయించేది కాదు.ఆమె జీవితము వాక్యముతో నిండిపోయింది.అందుకనే ధైర్యముగా బోధించేది. స్తెఫెను కూడా విశ్వాసముతో నిండిపోయి ఉన్నాడు.అందుకనే ఆయనలో  ధైర్యము ఉంది. అబ్రహాము ధైర్యముగా తన దేశము వదలి వాగ్దాన దేశము వైపు వెళ్ళాడు. ఆయన విశ్వాసము ఆయనకు ధైర్యాన్ని ఇచ్చింది

మోషే ధైర్యముగా ఫరో ముందుకు వెళ్ళాడు, ఆయన విశ్వాసము ఆయనకు ధైర్యాన్ని ఇచ్చింది

యెహోషువ ధైర్యముగా కనాను మీదకు వెళ్ళాడు. ఆయన విశ్వాసము ఆయనకు ధైర్యాన్ని ఇచ్చింది

ఫిలిష్తీయుల ముందు అందరూ వణకిపోతున్నారు.వారి మధ్యలో నుండి ఒక కుర్రవాడు బయటకు వచ్చాడు, అతనిలో వణుకు లేదు, బెణుకు లేదు.గొల్యాతు భీకరమైన రూపములో గర్జిస్తున్నాడు. దావీదు అతని పట్టించుకోలేదు, కొన్ని రాళ్లు వడిసెలలో వేసుకోవటానికి చాలా కూల్ గా నడచివెళ్ళాడు. గొల్యాతును చూసి అందరూ వణకిపోతున్నప్పుడు దావీదు అంత ధైర్యముగా ఎలా ఉండగలిగాడు? అతని విశ్వాసమే అతనికి ఆ ధైర్యాన్ని ఇచ్చింది. గలిలయ సముద్రములో తుఫాను వచ్చినప్పుడు శిష్యులు ఒక పడవలో వెళ్ళుతున్నారు. యేసు ప్రభువు నిద్ర పోతూ ఉన్నాడు. తుఫానును చూసి శిష్యులు అల్లాడిపోయారు.బిగ్గరగా కేకలు వేయడము మొదలుపెట్టారు. యేసు ప్రభువు వారిని చూసి ‘అల్పవిశ్వాసులారా’ అని గద్దించాడు. వారిలో విశ్వాసము అల్పముగా ఉంది కాబట్టి భయము అధికముగా వుంది.ఇక్కడ స్తెఫెను యేసు క్రీస్తు హంతకుల ముందు కూడా ఇంత ధైర్యముగా ఎలా ఉండగలిగాడు అంటే ఆయన విశ్వాసముతో, పరిశుద్ధాత్మతో నిండిపోయి ఉన్నాడు.

2 తిమోతి పత్రికలో అపోస్తలుడైన పౌలు వ్రాశాడు.

1: 7. దేవుడు మనకు శక్తియు ప్రేమయు, ఇంద్రియ నిగ్రహమునుగల ఆత్మనే యిచ్చెను గాని పిరికితనముగల ఆత్మ నియ్యలేదు.పరిశుద్దాత్మ ఉన్న వ్యక్తికి పిరికితనం లేదు. 

అతడు స్తెఫెను వలె శక్తి, ప్రేమ, ఇంద్రియ నిగ్రహము కలిగి ఉంటాడు.

For God hath not given us

the spirit of fear; but of power,

and of love, and of a sound mind.

    స్తెఫెను కు సౌండ్ మైండ్ ఉంది. పిరికి తనము ఉన్నప్పుడు  మన మైండ్ కూడా సరిగ్గా పనిచేయదు. మన హృదయములో ప్రేమ ఉండదు. మనకు శక్తి ఉండదు. స్తెఫెను లో ధైర్యము, ప్రేమ, మంచి మానసిక స్థితి మనకు కనిపిస్తున్నాయి. ఎందుకంటే అతను పరిశుద్ధాత్మతో, విశ్వాసముతో నిండిఉన్నాడు.

4.స్తెఫెను యొక్క జ్ఞానము 

3 వచనములో మనము చదువుతున్నాము

    స్తెఫెను ఆత్మతోను, జ్ఞానముతోను నిండుకొనిఉన్నాడు. ఈ అవిశ్వాసులైన యూదులు ఆయనతో వాదించడం మొదలుపెట్టారు. వాళ్ళ పరిస్థితి ఏమయ్యింది? 10 వచనము: 

మాటలాడుటయందు అతడు అగపరచిన జ్ఞానమును

 అతనిని ప్రేరేపించిన ఆత్మను వారెదిరింపలేకపోయిరి. 

    స్తెఫెను జ్ఞానము ముందు వారు నోరు వెళ్ళబెట్టాల్సిన పరిస్థితి  వచ్చింది. సత్యము లేకుండా జ్ఞానము లేదు. గ్రీకు సంసృతి జ్ఞానము వెదకుటకు ఎంతో మేధోశక్తి ని కేటాయించింది. గ్రీకులు జ్ఞానమును వెదుకుతున్నారు. 

అపోస్తలుల కార్యములు 17 అధ్యాయములో పౌలు గారు గ్రీకులతో ఏమన్నాడు? 30. ఆ అజ్ఞానకాలములను దేవుడు చూచి చూడనట్టుగా ఉండెను; ఇప్పుడైతే అంతటను అందరును  మారుమనస్సు పొందవలెనని మనుష్యులకు ఆజ్ఞాపించుచున్నాడు.31. ఎందుకనగా తాను నియమించిన మనుష్యునిచేత నీతి ననుసరించి భూలోకమునకు తీర్పుతీర్చ బోయెడి యొక దినమును నిర్ణయించి యున్నాడు. మృతులలోనుండి ఆయనను లేపినందున దీని నమ్ముటకు అందరికిని ఆధారము కలుగజేసియున్నాడు.

    గ్రీకులు గర్విస్తున్నారు. ఈ ప్రపంచానికి సోక్రటీస్, ప్లేటో, అరిస్టాటిల్ లాంటి గొప్ప తత్వవేత్తలను మేము అందించాము. పౌలు వారితో ఏమన్నాడు? ఒరేయ్, అజ్ఞానులారా, క్రీస్తు లేకుండా ఆ తత్వ శాస్త్రాలు దేనికీ పనికిరావు. ఇక్కడ యూదులు స్తెఫెను ముందు గర్విస్తున్నారు. మోషేని, ధర్మశాస్త్రాన్ని, దేవాలయాన్ని మేము అందించాము. స్తెఫెను వారితో ఏమన్నాడంటే, క్రీస్తు లేకుండా మీ మోషే, మీ ధర్మశాస్త్రము, మీ దేవాలయము దేనికీ పనికిరావు. స్తెఫెను కు శాంతియుతముగా సమాధానము చెప్పే జ్ఞానము, సహనము వారికి లేవు.ఆయనను హింసతో తుదముట్టించాలని వారు పన్నాగము పన్నారు. 

     6:11-15 వచనాలు చూస్తే వారు స్తెఫెను మీద 6 నేరాలు మోపారు. స్తెఫెనును మహాసభ యొద్దకు ఈడ్చుకొని వెళ్లారు.అబద్ద సాక్షులను నిలువబెట్టారు. స్తెఫెనులో సత్యము, ప్రేమ ఉంటే వారిలో అసత్యము, ద్వేషము ఉన్నాయి. అందుకనే వారు అబద్ధాలు సృష్టించారు. ఒక పని చేయటానికి మనము అబద్ధ సాక్షులను నిలబెడితే మనము సాతాను పని చేస్తున్నట్లే.

అది దేవుని పని కాదు.వారు స్తెఫెను మీద 6 ఆరోపణలు చేశారు.

1.దేవునిమీదను దూషణవాక్యములు పలుకుతున్నాడు

2.మోషేమీద దూషణ వాక్యములు పలుకుతున్నాడు

3. ఈ పరిశుద్ధ స్థలమునకును విరోధముగా మాటలాడుచున్నాడు 

4. మన ధర్మ శాస్త్రమునకును విరోధముగా మాటలాడుచున్నాడు 

5. నజరేయుడైన యేసు ఈ చోటును పాడుచేస్తాడు అని చెబుతున్నాడు

6. యేసు క్రీస్తు మోషే మనకిచ్చిన ఆచారములను మార్చును అని చెబుతున్నాడు.

    మీరు ఆ ఆరోపణలను గమనిస్తే, ప్రభువైన యేసు క్రీస్తు  మీద ఏ నేరాలు మోపారో స్తెఫెను  మీద కూడా అదే నేరాలు మోపారు. యేసు  ప్రభువు యోహాను సువార్త  15 అధ్యాయములో చెప్పిన మాటలు ఈ సందర్భములో మనము జ్ఞాపకము చేసుకోవాలి: దాసుడు తన యజమానుని కంటె గొప్పవాడు కాడని నేను మీతో చెప్పినమాట జ్ఞాపకము చేసికొనుడి. లోకులు నన్ను హింసించినయెడల మిమ్మును కూడ హింసింతురు

    స్తెఫెను  విషయములో ఆ మాటలు నెరవేరినాయి. ప్రధాన యాజకులు, పరిసయ్యులు యేసు ప్రభువు మీద కూడా దేవదూషణ, ఆలయ దూషణ నేరాలు మోపారు. దేవుని కుమారుడు అని పిలుచుకొన్నాడు, దేవాలయమును కూల్చి మూడు రోజుల్లో నిలబెడతాను అన్నాడు అని యేసు ప్రభువు మీద నేరాలు మోపారు. ఇప్పుడు స్తెఫెను  మీద అవే నేరాలు మోపారు. దేవ దూషణ చేస్తున్నాడు, దేవుని ఆలయాన్ని అపవిత్రము చేస్తున్నాడు. క్రైస్తవులు ఈ రోజుకీ ఈ ఆరోపణలు ఎదుర్కొంటూనే ఉన్నారు. యేసు క్రీస్తు దేవుడు అని నమ్మినందుకు ముస్లిం దేశాల్లో దేవ దూషణ అని కేసులు పెట్టడం మనము చూస్తున్నాము. తిరుపతి లో సువార్త చెపితే, క్రైస్తవులు తిరుమల ఆలయము పవిత్రత్రను పాడుచేస్తున్నారు అని కేకలు పెడుతున్నారు. క్రైస్తవ సంఘము మొదటి నుండి ఈ ఆరోపణలు ఎదుర్కొంటూనే ఉంది. 

5. స్తెఫెను యొక్క మహిమ 

15. సభలో కూర్చున్న వారందరు అతనివైపు తేరిచూడగా అతని ముఖము దేవదూత ముఖమువలె వారికి కనబడెను.

    వారందరూ షాక్ తిని ఉంటారు. వారు గుండెలు బాదుకోవాల్సింది.’మనము ఏమి చేస్తున్నాము? 

అతని మాటల్లో ఎంత జ్ఞానము ఉంది!  

అతని ముఖము దేవదూత ముఖము వలె వెలిగిపోతుంది!

అతని మీద నేరాలు మోపి మనము తప్పు చేస్తున్నాము!

 మనము మారుమనస్సు పొందుదాము అని వారు అనుకోలేదు. దేవదూత గద్దించినా బిలాము వెనక్కి తిరిగివెళ్ళలేదు, ఎందుకంటే దేవుని వాక్యము కంటే అతనికి తాను కోరుకొన్నదే ముఖ్యము. ఇక్కడ వీరికి కూడా దేవుని వాక్యము కంటే తాము కోరుకొన్నదే  ముఖ్యము. వీరిది ఎంత మూర్కత్వం. దేవుని మహిమను చూసి కూడా వీరు తమ ప్రవర్తన మార్చుకోలేదు.

6.స్తెఫెను యొక్క సందేశము 

7:1 లో ప్రధాన యాజకుడు స్తెఫెనును ప్రశ్నించాడు: మీ మాటలు నిజమేనా? అని అడిగాడు. స్తెఫెను అప్పుడు వారికి ఒక గొప్ప సందేశము ఇచ్చాడు. స్తెఫెను యొక్క జ్ఞానము ఈ ప్రసంగములో మనకు కనిపిస్తుంది. ఆయన సామాన్యమైన క్రైస్తవుడే అయితే ఆయనకు మంచి బైబిల్ జ్ఞానము ఉంది. అపోస్తలుల సంఘాలు అలా ఉండేవి. మన సంఘాల్లో విశ్వాసులు కూడా స్తెఫెను వలె బైబిల్ పరిజ్ఞానము తో నిండి ఉండాలి. స్తెఫెను బోధకుడు కాదు, అయితే ఆయన ఇక్కడ  అపోస్తలుల గ్రంథములో అతి పెద్ద ప్రసంగము వారికి చేశాడు.

తన ప్రసంగాన్ని అబ్రాహాముతో మొదలుపెట్టాడు.మహిమ గల దేవుడు అబ్రాహాముకు ప్రత్యక్షమయ్యాడు. బైబిల్ గ్రంథములో ఇక్కడ మాత్రమే కనిపించే ఒక చక్కటి పేరుతో స్తెఫెను తన ప్రసంగాన్ని మొదలుపెట్టాడు. 

మహిమ గల దేవుడు 

The God of Glory 

theos tes doxes 

     ఆ మహిమ కలిగిన దేవుని తో మొదలు పెట్టి అబ్రహాము, యోసేపు, మోషేల గుండా ఇశ్రాయేలు చరిత్ర వారికి వివరించి మహిమలో ఉన్న యేసు క్రీస్తును వారికి చూపించాడు. అబ్రహామును దేవుడు పిలిచినప్పుడు ఆయన విధేయతతో దేవుని మాటను నమ్మి, వాగ్దాన దేశము వైపు వెళ్ళాడు. అబ్రహాము పిల్లలము అని మీరు చెప్పుకొంటున్నారు.ఆయన విధేయత మీలో లేదేమి?  ఆ తరువాత యోసేపు జీవితము చూడండి.ఈ రోజు మీరు మీ సోదరుడైన క్రీస్తును తిరస్కరించినట్లు ఆ రోజు మీ తండ్రులు యోసేపును తిరస్కరించారు. ఆ రోజు మీ తండ్రులు తమ సోదరుడైన యోసేపును చూసి అసూయపడ్డారు, ఈ రోజు మీరు మీ సోదరుడైన క్రీస్తును చూసి అసూయపడ్డారు. 

   స్తెఫెను వారికి యోసేపు జీవితములో యేసు ప్రభువును చూపిస్తున్నాడు.

*యోసేపు తండ్రిచేత ప్రేమించబడిన కుమారుడు – యేసుప్రభువు తండ్రిచేత ప్రేమించబడిన కుమారుడు.

*యోసేపు గొర్రెల కాపరి, యేసు ప్రభువు మంచి గొర్రెల కాపరి

*యోసేపు తన సహోదరులచేత ద్వేషించబడ్డాడు, యేసు ప్రభువు తన సహోదరుల చేత ద్వేషించబడ్డాడు.

*యోసేపు తన అన్నల పాపాలు బయటపెట్టాడు; యేసు ప్రభువు కూడా తన సహోదరుల పాపాలు

వారికి చూపించాడు.

*నేను మిమ్ములను ఏలుతాను అని యోసేపు ప్రవచించాడు, నేను మిమ్ములను రాజుగా ఏలుతాను అని యేసు ప్రభువు ప్రవచించాడు. 

*యోసేపు అసూయ పరుల బాధితుడు, యేసు ప్రభువు కూడా అసూయ పరుల బాధితుడే.

*యోసేపు తండ్రి చేత సహోదరుల యొద్దకు పంపబడ్డాడు, యేసుప్రభువు కూడా తండ్రి చేత తన సహోదరుల యొద్దకు పంపబడ్డాడు. 

*యోసేపు తన సహోదరుల చేత అపహసించబడ్డాడు, యేసు ప్రభువు తన సహోదరుల చేత అపహసించబడ్డాడు. 

*యోసేపు 20 వెండి నాణెములకు బానిసవలె అమ్మివేయబడ్డాడు. యేసు ప్రభువు 30 వెండి నాణెములకు బానిస వలె అమ్మివేయబడ్డాడు.

*యోసేపు నిలువుటంగీ మేకపిల్ల రక్తముతో రక్తసిక్తమయ్యింది. యేసు ప్రభువు నిలువుటంగీ ఆయన రక్తముతోనే తడిసింది.

*యోసేపు కనాను నుండి ఐగుప్తుకు వెళ్ళాడు, యేసు ప్రభువు కూడా కనాను నుండి ఐగుప్తుకు వెళ్ళాడు.

*యోసేపు ఒక దాసునిగా పోతీఫరు ఇంటిలో పనిచేశాడు.యేసు ప్రభువు కూడా దాసుని స్వరూపం ధరించాడు. 

*యోసేపు పాపము చేయకుండా తన పవిత్రతను కాపాడుకున్నాడు. యేసు ప్రభువు కూడా పాపము లేకుండా జీవించాడు. 

*చేయని నేరాలకు యోసేపు శిక్షించబడ్డాడు; యేసు ప్రభువు కూడా ఆయన చేయని నేరాలకు శిక్షించబడ్డాడు. 

*యోసేపు తో జైలులో ఉన్న ఇద్దరు ఖైదీలలో ఒకరు రక్షించబడ్డాడు, మరొకరు నశించారు. యేసు ప్రభువుతో సిలువ వేయబడిన ఇద్దరిలో ఒక దొంగ రక్షించబడ్డాడు, మరొక దొంగ నశించాడు.

*యోసేపు జైలులో నుండి ఐగుప్తులో అత్యున్నత స్థానానికి హెచ్చించబడ్డాడు. యేసు ప్రభువు సిలువ మరణం నుండి అత్యున్నత నామమునకు హెచ్చించబడ్డాడు.

*ముప్పై సంవత్సరాల వయస్సులో యోసేపు ఐగుప్తీయుల ఎదుటకు వచ్చాడు. ముప్పై సంవత్సరాల

వయస్సులో యేసు ప్రభువు యూదుల ముందుకు వచ్చాడు. 

*ప్రపంచమంతా కరువు వచ్చినప్పుడు యోసేపు తన జ్ఞానముతో అందరినీ రక్షించాడు. యేసు ప్రభువు ఈ రోజు ప్రపంచ ప్రజలందరికీ రక్షకుడు. 

*తన అన్నల కోసం యోసేపు కన్నీరు పెట్టాడు.తన సహోదరుల కోసం యేసు ప్రభువు అనేక సార్లు ఏడ్చాడు. 

*తనకు ద్రోహం చేసిన అన్నలను యోసేపు క్షమించి ప్రేమించాడు. యేసు ప్రభువు కూడా తనకు ద్రోహం చేసిన వారిని క్షమించి, ప్రేమించాడు.

*యోసేపు అన్నలు మొదటి సారి యోసేపును ఐగుప్తులో చూసినప్పుడు అతని గుర్తుపట్టలేకపోయారు. అయితే రెండవసారి వారు యోసేపును కలిసినప్పుడు యోసేపు వారికి తనను బయలుపరచు కొన్నప్పుడు ఆయనను గుర్తుపట్టారు.యేసు ప్రభువు కూడా ఆయన మొదటి రాకడలో యూదులు ఆయనను రక్షకుడు అని గుర్తుపట్టలేకపోయారు.అయితే ఆయన రెండవ సారి వచ్చినప్పుడు, ఆయన తనను వారికి బయలుపరచుకొన్నప్పుడు వారు ఆయనను మెస్సియాగా గుర్తిస్తారు. 

     ఆ తరువాత స్తెఫెను మోషే గురించి చెప్పాడు.మోషే లో ఉన్న క్రీస్తు స్వరూపాన్ని వారికి చూపించాడు. మోషే పుట్టినప్పుడు అతని ప్రాణము తీయాలని రాజైన ఫరో చూశాడు;ఈ క్రీస్తు పుట్టినప్పుడు ఆయన ప్రాణము తీయాలని రాజైన హేరోదు ప్రయత్నించాడు. మోషే తన ప్రజలను రక్షించడానికి ఫరో అంతఃపురమును, దాని సుఖాలను వదలి వెళ్ళాడు.ఈ క్రీస్తు తన ప్రజలను విమోచించడానికి పరలోకమును, దాని మహిమను వదలి పెట్టి వచ్చాడు.మోషే మొదటి సారి ఇశ్రాయేలీయుల యొద్దకు వెళ్ళినప్పుడు వారు ఆయనను తిరస్కరించారు, రెండవసారి వెళ్ళినప్పుడు హత్తుకున్నారు. ఈ క్రీస్తు మొదటి సారి వచ్చినప్పుడు ఇశ్రాయేలీయులు ఆయనను తిరస్కరించారు, ఆయన రెండవ సారివచ్చినప్పుడు వారు ఆయనను హత్తుకొంటారు.మోషే ఫరో శక్తి నుండి ఇశ్రాయేలీయులను విడిపించి, ఎఱ్ఱ సముద్రాన్ని చీల్చి వాగ్దాన దేశమువైపుకు వారిని తోడ్కొనివెళ్ళాడు.ఈ క్రీస్తు సాతాను శక్తి నుండి మనలను విడిపించి, మనకు అడ్డుగా ఉన్న పాపపు సముద్రాన్ని చీల్చి పరలోకము వైపుకు మనలను నడిపించాడు.

-మోషే లో క్రీస్తు స్వరూపాన్ని మీరు చూడండి.మోషే, మోషే అని మీరు కలవరిస్తున్నారు.నా వంటి గొప్ప ప్రవక్త దేవుడు మీ యొద్దకు పంపుతాడు అని మోషే ప్రవచించింది ఎవరి గురించి? ఈ క్రీస్తు గురించే. 

మోషే….దేవుని చేత మీ యొద్దకు పంపబడిన మోషే, ఐగుప్తు నుండి మిమ్మును విడిపించిన మోషే

ధర్మశాస్త్రాన్ని మీకిచ్చిన మోషే, అరణ్యములో మిమ్మును నడిపించిన మోషే, ఆ మోషే ప్రవచించిన క్రీస్తును మీరు తిరస్కరిస్తున్నారు. నాడు మీ తండ్రులు మోషేని తిరస్కరించినట్లే, నేడు మీరు క్రీస్తును తిరస్కరిస్తున్నారు.

మీ చరిత్ర మొత్తము ఏమిటి? అవిధేయత – హింస

 యోసేపుకు అవిధేయులయ్యారు, 

మోషేకు అవిధేయులయ్యారు, 

ప్రవక్తలకు అవిధేయులయ్యారు, 

ఇప్పుడు క్రీస్తుకు కూడా అవిధేయులయ్యారు.

యోసేపును హింసించారు, 

మోషేను హింసించారు, 

ప్రవక్తలను హింసించారు, 

ఇప్పుడు క్రీస్తును కూడా హింసించారు.

వేషధారులారా, మీరా దేవుని గురించి మాట్లాడేది? 

     ఆ తరువాత స్తెఫెను వారి దృష్టిని సొలొమోను మందిరము వైపుకు నడిపించాడు.ఆ రాతి కట్టడము పట్టుకొని మీరు వేలాడుతున్నారు. ఆయన మహిమ కలిగిన దేవుడు, హస్తకృతాలయములలో నివసింపని సర్వోన్నతుడు 

ఆయన మానవ నిర్మితమైన ఆలయాల్లో నివసించడు.

ఎక్కడ హారాను? 

ఎక్కడ మెసొపొతమియ? 

ఎక్కడ కనాను? 

ఎక్కడ ఐగుప్తు? 

అనేక ప్రాంతాలలో తన దాసుల ద్వారా తన పనులు ఆయన నిర్వహిస్తాడు.

ఈయన ఒక ప్రాంతానికో, ఒక దేశానికో, ఒక జాతికో పరిమితమైన దేవుడు కాదు. దేవుని గురించి ఈ దృక్పధాన్ని 

మార్చుకోండి 

ఆ అబ్రహాము 

ఆ యోసేపు

ఆ మోషే

ఆ ధర్మశాస్త్రము

ఆ ప్రత్యక్ష గుడారము 

ఆ దేవాలయము… అవన్నీ యేసు క్రీస్తును చూపిస్తున్నాయి.

ఆ నీతిమంతుని మీరు హత్య చేశారు. 

దేవ దూషణ చేసింది నేను కాదు, మీరు.

దేవుని కుమారుని హత్య చేసిన హంతకులు మీరు.

 ప్రభువైన యేసు క్రీస్తు ఈ లోకములో జీవించిన రోజుల్లో యెరూషలేములో హేరోదు రాజు నిర్మించిన గొప్ప దేవాలయము ఉండేది. ఆ దేవాలయాన్ని యూదులు ఎంతో పవిత్రముగా భావించేవారు.

యోహాను 2 లో మనము చదువుతాము: 

19. యేసు ఈ దేవాలయమును పడగొట్టుడి, 

మూడు దినములలో దాని లేపుదునని వారితో చెప్పెను.

20. యూదులు ఈ దేవాలయము నలువదియారు సంవత్సరములు కట్టిరే; 

నీవు మూడు దిన ములలో దానిని లేపుదువా అనిరి.

21. అయితే ఆయన తన శరీరమను దేవాలయమును

 గూర్చి యీ మాట చెప్పెను.

22. ఆయన మృతులలోనుండి లేచిన తరువాత ఆయన

 ఈ మాట చెప్పెనని ఆయన శిష్యులు జ్ఞాపకము చేసికొని, 

లేఖనమును యేసు చెప్పిన మాటను నమ్మిరి.

ఒక రోజు ప్రభువైన యేసు క్రీస్తు ఆ దేవాలయము దగ్గర ప్రజలతో ఏమన్నాడంటే, ‘ఈ దేవాలయమును పడగొట్టుడి, మూడు దినములలో దాని లేపుదును’.వారంతా ఆశ్చర్యపోయారు. గొప్ప ఇంజినీర్లు 46 సంవత్సరాలు కడితే ఈ దేవాలయము నిర్మించబడింది. మూడు రోజుల్లో దానిని ఎలా లేపుతావు? అని ఆయనను ప్రశ్నించారు. అయితే ఆయన తన శరీరము అనే దేవాలయము గూర్చి మాటలాడుచున్నాడు అనే సత్యము వారు గ్రహించలేకపోయారు.

రోమన్లకు ప్రీతిపాత్రుడైన హేరోదు నీడలో ఆ ఆలయము కొనసాగుచున్నది. ఆ మహా ఆలయము కూల్చివేయబడుతుంది అనే ఆలోచనే వారి ఊహకు అందనిది. కానీ కాలము మన చేతుల్లో ఉండదు కదా! క్రీ.శ 70 లో రోమన్ జనరల్ టైటస్ ఆ ఆలయాన్ని నేలమట్టము చేశాడు. అంతకు 40 సంవత్సరాలకు మునుపు రోమన్లు యేసు క్రీస్తు ను కూడా హతమార్చి నేలమట్టము చేశారు. ఆ రెండు ఆలయాల్లో చివరికి ఏది మిగిలింది. రాతితో చేయబడిన దేవాలయము ఇంకా రాళ్లు గానే ఆ ప్రదేశములో పడి ఉంది. కానీ ప్రభువైన యేసు క్రీస్తు సమాధి నుండి తిరిగి లేచి ఆయన కట్టే ఆలయము ఎలాంటిదో ప్రపంచానికి చూపించాడు. రోమన్ సామ్రాజ్యము ఆయన సంఘాన్ని కూకటి వేళ్లతో సహా పెకలించాలని ప్రయత్నించి విఫలమయ్యింది. చివరకు రోమన్ సామ్రాజ్యాధిపతే క్రీస్తు దాసునిగా మారాడు.

      భూలోక సామ్రాజ్యాలే కాదు, సాతాను సామ్రాజ్యము, నరకపు శక్తులు కూడా ఈ క్రైస్తవ సంఘాన్ని నాశనము చేయలేవు. ఆయన పేతురుతో అన్నాడు, “మరియు నీవు పేతురువు; ఈ బండమీద నా సంఘమును కట్టుదును, పాతాళలోక ద్వారములు దాని యెదుట నిలువనేరవని నేను నీతో చెప్పుచున్నాను.” మత్తయి 16:18 

7.స్తెఫెను యొక్క నిరీక్షణ 

     స్తెఫెను ప్రసంగము వినిన తరువాత వారు కోపముతో మండిపోయారు, పండ్లు కొరికారు. స్తెఫెను పరలోకము 

వైపు చూశాడు. ఆకాశము తెరువబడింది. మనుష్య కుమారుడు దేవుని కుడి పార్శ్వమందు నిలబడి కనిపించాడు. సజీవుడైన యేసు క్రీస్తు స్తెఫెను కు కనిపించాడు. ఆ మాటలు విని వారు పిచ్చిపట్టినట్లు ప్రవర్తించారు. పెద్ద, పెద్దగా కేకలు వేస్తూ స్తెఫెనును  ఊరి బయటకు లాక్కువెళ్లారు. ఆయనను చంపటానికి వారు రాళ్లు తీసుకొన్నారు. అప్పుడు ‘యేసు ప్రభువా, నా ఆత్మను చేర్చుకో’ అని పలికాడు.ఆయన ఎంత గొప్ప నిరీక్షణతో మరణించాడో ఇక్కడ మనకు కనిపిస్తున్నది. అతని మాటలు యేసు ప్రభువు సిలువ మీద పలికిన మాటలు మనకు గుర్తుకుతెస్తున్నాయి. అప్పుడు యేసు గొప్ప శబ్దముతో కేకవేసి–తండ్రీ, నీ చేతికి నా ఆత్మను అప్పగించుకొనుచున్నాననెను. (లూకా 23:46) సిలువ మీద ప్రభువైన యేసు క్రీస్తు ఎంత రూఢిగా తన ప్రాణము తండ్రికి అప్పగించాడో, ఈ రోజు ప్రతి విశ్వాసి అంత రూఢిగా తన ఆత్మను ప్రభువైన యేసు క్రీస్తుకు అప్పగించవచ్చు. 

స్తెఫెను ఇప్పుడు ‘యేసు ప్రభువా, నా ఆత్మను చేర్చుకో’ అని ప్రార్ధించాడు. యేసూ, యేసూ అని మనము పిలవకూడదు. స్తెఫెను వలె యేసు ప్రభువు, ప్రభువైన యేసు క్రీస్తు అని మనము పిలవాలి. గొప్ప నిరీక్షణతో, గొప్పనిశ్చయతతో స్తెఫెను కన్నుమూశాడు.

8.స్తెఫెను యొక్క క్షమాపణ 

     వారు ఎంతో ద్వేషముతో స్తెఫెను మీద రాళ్లు వేస్తున్నారు. అతని శరీరము రక్తసిక్తమవుతున్నది.కనీసము న్యాయ విచారణ కూడా జరుపకుండా వారు స్తెఫెను ప్రాణము తీస్తున్నారు. అయితే స్తెఫెను – ఈ పాపము వారి మీద మోపవద్దు అని పలికి ప్రాణము వదిలాడు. భూమి మీద అతడు చేసిన చివరి పనిలో, భూమి మీద

అతడు పలికిన చివరి మాటల్లో యేసు ప్రభువు మనస్సును ప్రతిబింబించాడు.సిలువ మీద యేసు ప్రభువు తన హంతకులను క్షమించాడు.

‘ తండ్రీ, వీరేమి చేయుచున్నారో వీరెరుగరు గనుక వీరిని క్షమించుమని చెప్పెను. (లూకా 23:34) 

ఇప్పుడు స్తెఫెను అదే విధముగా తన హంతకులను క్షమిస్తున్నాడు. స్తెఫెను యొక్క క్షమాపణను మనము కూడా 

నేర్చుకోవాలి. 

‘వాడు నన్ను అంత మాట అంటాడా?’

‘ వాడి అంతు చూస్తా.ఆమె నన్ను విమర్శించిందా? జీవితములో ఇంకో సారి దాని మొహం కూడా చూడను’

‘నువ్వు నాకు ఇది చేశావు కదా. నీ మీద ఎప్పటికైనా పగ తీర్చుకొంటా.’

‘అవును క్షమించాలి. కానీ ఈ ఒక్క విషయములో వాడిని క్షమించలేను’

 ఇలా మాట్లాడే క్రైస్తవులు మన మధ్యలో చాలా మంది ఉన్నారు. అయితే మనము స్తెఫెను నుండి క్షమాపణను నేర్చు కోవాలి. సిలువ మీద క్రీస్తు వలె ఆయన తన హంతకులను కూడా క్షమించాడు.

9.స్తెఫెను యొక్క ఘనత

55 వచనము చూద్దాము: 

55. అయితే అతడు పరిశుద్ధాత్మతో నిండుకొనినవాడై

 ఆకాశమువైపు తేరిచూచి, దేవుని మహిమను యేసు దేవుని 

కుడిపార్శ్వమందు నిలిచి యుండుటను చూచుచున్నానని చెప్పెను. 

    స్తెఫెను ఆకాశము వైపు చూచినప్పుడు దేవుని మహిమను చూశాడు. అక్కడ ప్రభువైన యేసు క్రీస్తును మనుష్య కుమారునిగా దేవుని కుడిపార్శ్వమందు చూస్తున్నాడు.ఆయన తన సందేశాన్ని మహిమ గల దేవుడు అని ప్రారంభించాడు. ఇప్పుడు దేవుని మహిమ అతను చూస్తున్నాడు. 

    God of Glory and the Glory of God 

     మహిమ గల దేవుడు – దేవుని మహిమ 

    ఒక పర్వతము మీద నిలబడిచూస్తే క్రింద ఉన్న పట్టణము ఆ చివరి నుండి ఈ చివరివరకు మనకు కనిపిస్తుంది. ఇక్కడ స్తెఫెను అటువంటి ఒక మనోహరమైన దృశ్యాన్ని చూస్తున్నాడు. నాడు మహిమ గల దేవుడు అబ్రహాము కు ప్రత్యక్షమై మొదలుపెట్టిన విమోచన కార్యము ఇప్పుడు అబ్రహాము కుమారుడు, మనుష్య కుమారుడు ప్రభువైన యేసు క్రీస్తు దేవుని మహిమలో నిలబడి ఉండుటతో ముగిసింది.‘మనుష్య కుమారుడు’ అని యేసు ప్రభువు తనను

తాను సువార్తలలో అనేక సార్లు పిలుచుకొన్నాడు.ఆయన కాకుండా ఆయనను ఆ పేరుతో పిలిచిన వాడు స్తెఫెను మాత్రమే. యేసు ప్రభువు ప్రధాన యాజకులతో చెప్పాడు, మీరు మనుష్యకుమారుడు సర్వశక్తిమంతుని కుడిపార్శ్వమున కూర్చుండుటయు ఆకాశమేఘారూఢుడై వచ్చుటయు చూచెదరని చెప్పెను.

                                                                                                                మార్కు 14:62 

   ఇప్పుడు స్తెఫెను ఆ దృశ్యాన్ని వారి సమక్షములో ఉండే చూస్తున్నాడు. ఇంకొక ఆసక్తికరమైన సంగతి ఏమిటంటే, బైబిల్ లో అనేక చోట్ల మనుష్యకుమారుడు దేవుని కుడి పార్శ్వమందు కూర్చొని ఉండుట మనకు కనిపిస్తుంది.(కీర్తన 110:1; మార్కు 14:62; కొలొస్సయిలకు 3:1; హెబ్రీ 1:3, 13; 8:1; 10:12; 12:2). ఇక్కడ ఒక్క చోట మాత్రమే

ఆయన నిలబడి ఉండుట మనము చూస్తున్నాము.తన నామము కొరకు ప్రాణ త్యాగము చేసిన ఈ విశ్వాస వీరునికి స్వాగతము చెప్పటానికి సాక్షాత్తూ ప్రభువైన యేసు క్రీస్తే నిలబడ్డాడు.ఎంత ప్రత్యేకమైన రీతిలో స్తెఫెను పరలోకమునకు ఆహ్వానించబడుతున్నాడో ఇక్కడ మనము చూస్తున్నాము. దేవుడు స్తెఫెనుకు ఇచ్చిన అరుదైన ఘనత ఇక్కడ మనకు కనిపిస్తున్నది.

10.స్తెఫెను యొక్క విజయము 

   స్తెఫెను ను చూసి వారు పండ్లు కొరికారు. రేపు వారు వెళ్లే నిత్య నరకములో పండ్లు కొరుకుతానే ఉంటారు. ‘అక్కడ ఏడ్పును, పండ్లు కొరుకుటయు ఉండును’. చివరిగా స్తెఫెను యొక్క విజయము.వారు స్తెఫెను సందేశము విని కోపముతో రగిలిపోయారు.పళ్ళు కొరికారు. రాళ్లు రువ్వారు. రక్తపు మడుగులో స్తెఫెను ప్రాణము విడవడము చూసి వారు సంతృప్తితో తిరిగి వెళ్లారు. మేము గెలిచాము అని వారు అనుకొన్నారు. అయితే వారు

ఓడిపోయారు. సత్యాన్ని హింసతో, రక్తపాతముతో ఎదుర్కోవటము గెలుపు కాదు, అది ఓటమి.స్తెఫెను మీద పళ్ళు కొరికిన ఈ మనుష్యులు నిత్యత్వమంతా పళ్ళు కొరుకుతూనే ఉంటారు. యేసు ప్రభువు నరకమును ఎలా వర్ణించాడు: 

అక్కడ ఏడ్పును, పండ్లు కొరుకుటయు ఉండును

లూకా సువార్త 13:28 

 అబ్రాహాము ఇస్సాకు యాకోబులును సకల ప్రవక్తలును దేవుని రాజ్యములో ఉండుటయు, 

మీరు వెలుపలికి త్రోయబడుటయు, మీరు చూచునప్పుడు మీరు ఏడ్చుచు పండ్లు కొరుకుదురు. 

అబ్రహాము, ఇస్సాకు, యాకోబు లు మా తాత, ముత్తాతలు అని వీరు గర్విస్తున్నారు. యేసు ప్రభువు వారితో ఏమన్నాడు? మీరు నన్ను తిరస్కరించారు కాబట్టి వారు వెళ్లే దేవుని రాజ్యమునకు మీరు వెళ్ళలేరు.వారిని చూసి మీరు ఏడ్చుచూ, పండ్లు కొరుకుతారు. అయ్యో, స్తెఫెను మాటలు మేము ఎందుకు వినలేదు అని యుగయుగాలు వారు పండ్లు కొరుకుతారు. ఆ విధముగా ఓడిపోయింది వారే. గెలిచింది స్తెఫెనే. ఆయన నిద్రించాడు అని ఇక్కడ మనము చదువుతున్నాము.విశ్వాసికి మరణము లేదు. ఆయన కార్చిన రక్తమును సౌలు చూశాడు.

టెర్ టులియన్ భక్తుడు అన్నాడు: 

the blood of the martyrs is the seed of the church

హతసాక్షి కార్చే ప్రతి రక్తపు బొట్టు క్రైస్తవ సంఘానికి ఒక బీజముగా మారుతుంది. వారు కార్చే రక్తమే క్రైస్తవ్యానికి విత్తనాలు వేస్తాయి. ఈ హత్యతో క్రైస్తవులు భయముతో వణకిపోతారు అని వారు అనుకొన్నారు. అయితే జరిగింది ఏమిటి?  ఆ క్రైస్తవులు యెరూషలేము నుండి చెదరిపోయి యూదయ, సమరయ, గలిలయ ప్రాంతములు, ఆ తర్వాత సర్వలోకానికి యేసు క్రీస్తు సువార్తను అందించారు. 

    అపోస్తలుల కార్యములు 22:20 లో మనము చదువుతాము. నీ సాక్షి అయిన స్తెఫెను రక్తము కార్చబడినప్పుడు నేను అక్కడే ఉన్నాను అని పౌలు అంటున్నాడు. స్తెఫెను సందేశము, హత సాక్ష్యము తార్సు వాడైన సౌలు మీద కూడా పనిచేసింది. క్రైస్తవ్యము యొక్క మొదటి హతసాక్షి ప్రభావములో నుండి క్రైస్తవ్యము యొక్క అతి గొప్ప మిషనరీ ఉద్భవించాడు.

 8:2 భక్తిగల మనుష్యులు స్తెఫనును సమాధిచేసి అతనిని గూర్చి బహుగా ప్రలాపించిరి.అక్కడ వారి సహోదర ప్రేమ మనకు కనిపిస్తుంది.సహోదర ప్రేమ లేకుండా మనము ఎన్ని కార్యక్రమాలు చేపట్టినా వ్యర్ధమే.   అపోస్తలులు ప్రేమతో నిండిన వ్యవస్థను నిర్మించారు. వారు వ్యక్తులను ప్రేమించారు. వ్యక్తులను ప్రేమించని వ్యవస్థను మనము కట్టకూడదు. 

ముగింపు: 

క్రైస్తవ్యము యొక్క తొలి హతసాక్షి స్తెఫెను జీవితము నుండి పది సత్యాలు మనము చూశాము. 

మొదటిగా స్తెఫెను యొక్క సేవ: స్తెఫెను యెరూషలేము సంఘస్తులకు సేవ చేశాడు. 

రెండవది గా ఆయన విశ్వాసము, ఆయన విశ్వాసముతో నింపబడిఉన్నాడు. సందేహాలు, అనుమానాలు ఆయనలో ఒక్క శాతము కూడా లేవు 

మూడవదిగా, ఆయన ధైర్యము, ఆయన విశ్వాసము ఆయనలో గొప్ప ధైర్యాన్ని నింపింది. 

నాలుగవదిగా, ఆయన జ్ఞానము, ఆయన స్వతహాగా బోధకుడు కాదు, అపోస్తలుడు కాదు, ఒక సామాన్య విశ్వాసి మాత్రమే, కానీ దేవుని జ్ఞానమును లేఖనములు చదివి గ్రహించాడు. 

ఐదవదిగా, ఆయన మహిమ. ఆయనను ద్వేషించిన వారు ఆయన మీద నేరములు మోపినప్పుడు దేవుడు ఆయన మొహములో తన మహిమను వారికి చూపించాడు 

ఆరవదిగా, ఆయన సందేశము. మహిమ గల దేవుడు తన విమోచన కార్యమును అబ్రహాముతో మొదలుపెట్టి క్రీస్తునందు ఏ విధముగా ముగించాడో తన సందేశములో వారికి తెలియజేశాడు 

ఏడవదిగా, ఆయన నిరీక్షణ, వారు రాళ్లు వేసి ఆయన ప్రాణము తీస్తున్నప్పుడు క్రీస్తు నందు విశ్వాసముతో, నిరీక్షణతో కన్ను మూశాడు

ఎనిమిదవదిగా, ఆయన క్షమాపణ. తన హంతకులను కూడా క్షమించమని దేవుని ప్రార్ధించాడు 

తొమ్మిదవదిగా, ఆయన ఘనత. సాక్షాత్తూ ప్రభువైన యేసు క్రీస్తే పరలోకములో నిలబడి ఆయనకు స్వాగతము పలికాడు 

పదియవ దిగా, అయన విజయము, ఆయన మరణము వృధా కాలేదు. ఆయన జీవితము వలన స్ఫూర్తిని పొంది విశ్వాసులు ప్రపంచమంతా చెదిరిపోయి, యేసు క్రీస్తు సువార్తతో ఈ ప్రపంచాన్ని జయించారు. ఈ రోజు మనము కూడా ఆయన జీవితము నుండి పాఠములు నేర్చుకొని, ప్రేరణ పొందుటకు దేవుడు మనకు సహాయము చేయును గాక .