యెహెఙ్కేలు గ్రంథం పరిచయం 

యెహెఙ్కేలు గ్రంథం నుండి కొన్ని సత్యాలు ఈ రోజు మీతో పంచుకోవాలని నేను ఆశ పడుతున్నాను. మీ బైబిల్ గ్రంథములో యెహెఙ్కేలు గ్రంథం 1 మొదటి అధ్యాయము నుండి కొన్ని మాటలు చూద్దాము: 

1. ముప్పదియవ సంవత్సరము నాలుగవ నెల అయిదవ దినమున నేను కెబారు నదీప్రదేశమున చెరలోని వారి మధ్య కాపురముంటిని; ఆ కాలమున ఆకాశము తెరవ బడగా దేవునిగూర్చిన దర్శనములు నాకు కలిగెను. యెహోయాకీను చెరపట్టబడిన అయిదవ సంవత్సరము ఆ నెలలో అయిదవ దినమున కల్దీయుల దేశమందున్న కెబారు నదీప్రదేశమున యెహోవా వాక్కు బూజీ కుమారుడును, యాజకుడునగు యెహెజ్కేలునకు ప్రత్యక్షముకాగా అక్కడనే యెహోవా హస్తము అతనిమీదికి వచ్చెను.

                      యెహెఙ్కేలు గ్రంథం 1:1-3

    ఈ వాక్య భాగాన్ని మీరు గమనిస్తే దేవుడు యెహెఙ్కేలు ప్రవక్తకు ఒక గొప్ప దర్శనం అనుగ్రహించాడు. అప్పుడు ఆయనకు 30 సంవత్సరాల వయస్సు. దేవుడు తన ప్రజలను వారి కష్టాల్లో దర్శించాడు. తన ప్రవక్తలకు ఆయన తన దర్శనాలు అనుగ్రహించాడు. మోషే కు మండుచున్న పొదలో దేవుడు ప్రత్యక్షమయ్యాడు. యిర్మీయా ప్రవక్తకు ఆయన ప్రత్యక్షమయ్యాడు. యెషయా ప్రవక్తకుఆయన ప్రత్యక్షమయ్యాడు. యెషయా గ్రంథం 6 అధ్యాయములో మనం ఆ విషయం చూస్తాము.ఇక్కడ యెహెఙ్కేలుకు దేవుడు తన దర్శనాన్ని ఇచ్చాడు. ఆయన బబులోను దేశములో కెబారు నది ఒడ్డున ఉన్నాడు. ఇశ్రాయేలు దేశములో యొర్దాను నది ఒడ్డున ఉండవలసిన వ్యక్తి బబులోను దేశములో కెబారు నది ఒడ్డునఎందుకు ఉన్నాడు? ఇది అర్ధం చేసుకోవాలంటే మనం కొంత చరిత్రలోకి చూడాలి. దావీదు, సొలొమోను లాంటి మహా మహులు పాలించిన ఇశ్రాయేలు దేశం వారి కుమారుల కాలములో రెండు ముక్కలు అయ్యింది. ఉత్తరాన ఇశ్రాయేలు దేశం, దక్షిణాన యూదా దేశం. అషూరు సామ్రాజ్యం చక్రవర్తులు రెండు దేశాలను వేధించారు. క్రీ.పూ 722 లో ఉత్తర దేశం అంతరించింది. అషూరు చక్రవర్తి సర్గోన్ దాని రాజధాని సమరయ ను ధ్వంసం చేశాడు.దక్షిణాన యూదా దేశం కూడా అషూరు రాజులకు చాలా కాలం బానిసగా ఉంది.అహాజు రాజు అశూరు వారికి సామంత రాజుగా మారాడు. వారికి కప్పం కట్టాడు.అయితే, హిజ్కియా రాజు క్రీ.పూ 705 లో అషూరు వారికి ఎదురు తిరిగాడు.వారికి చెల్లించాల్సిన భత్యం చెల్లించలేదు.హిజ్కియా కుమారుడు మనష్షే ఆ పద్దతికి స్వస్తి పలికాడు. అషూరు వారితో తిరిగి శాంతి ఒప్పందం చేసుకొన్నాడు. ఆ తరువాత వచ్చిన యోషీయా రాజు హిజ్కియా వలె అషూరు వారికి ఎదురు తిరిగాడు. ఆ సమయములో ఐగుప్తు కూడా బలమైన దేశముగా ఎదిగింది.అషూరు తరువాత బబులోను రాజులు ఈ ప్రాంతం మీద ఆధిపత్యం సాధించారు. ఒక వైపు ఐగుప్తు, మరొక వైపు బబులోను: ఈ రెండు బలమైన దేశాల మధ్య యూదా దేశం నలిగింది. కొంత కాలం ఐగుప్తు తో కలిశారు, కొంత కాలం బబులోను తో కలిశారు. చివరి 20 సంవత్సరాల్లో 6 సార్లు యూదా ప్రజలు ఈ ఒప్పందాలు మార్చుకొన్నారు. అంటే వారు ఎంత గందర గోళం లో ఉన్నారో మనం ఊహించ వచ్చు. 

    చివరకు క్రీ.పూ 586 లో యూదా దేశాన్ని బబులోను చక్రవర్తి నెబుకద్నెజరు పూర్తిగా ధ్వంసం చేశాడు. ఈ సమయములో యిర్మీయా, దానియేలు, యెహెఙ్కేలు ప్రవక్తలు జీవించారు.విగ్రహారాధన మానుకోండి, మారు మనస్సు పొందండి అని ఈ ప్రవక్తలు ప్రజలకు బోధించారు. యెరూషలేము పతనం తరువాత యిర్మీయా ప్రవక్త యూదా ప్రాంతములోనే ఉండి దేవుని వాక్యాన్ని ప్రకటించాడు. యెహెఙ్కేలు దానియేలు ప్రవక్తలు బబులోను దేశములో ఉండి దేవుని వాక్యం ప్రకటించారు.బబులోను వారు మూడు బృందాలుగా యూదులను చెర పట్టి తీసుకొని వెళ్లారు.మొదటి గుంపులో క్రీ.పూ 597 సంవత్సరం యెహెఙ్కేలు చెరపట్టి తీసుకొని వెళ్ళబడ్డాడు.బబులోను ను నెబుకద్నెజరు ఎంతో సుందరముగా తీర్చిదిద్దాడు. అక్కడ అనేక ఉద్యాన వనాలు నాటాడు. ప్రకృతి సౌందర్యముతో కూడిన చక్కటి ప్యాలస్ లు నిర్మించాడు. గొప్ప, గొప్ప కళా ఖండాలు నిర్మించాడు. వాటి శిధిలాలు ఈ రోజుకు కూడా మనం చూడవచ్చు. నెబుకద్నెజరు ఇష్టార్ దేవతకు ఒక గొప్ప ద్వారం నిర్మించాడు. దీనిని ఇస్టార్ ద్వారం అని పిలుస్తున్నాము. జర్మనీ దేశం రాజధాని బెర్లిన్ నగరములో ఉన్నటు వంటి పెర్గమాన్ మ్యూసియం లో ఇది భద్రపరచబడింది. నెబుకద్నెజరు క్రీ.పూ 575 లో దీనిని నిర్మించడం ప్రారంభించాడు. యెహెఙ్కేలు ఈ ద్వారాన్ని బబులోను లో ఉన్నప్పుడు చూసే ఉంటాడు.ఈ ద్వారం మీద అనేక జంతువుల బొమ్మలు గీయించాడు. ఈ జంతువులు బబులోను దేవతలు మారుడూక్, అదాద్ లకు చిహ్నములుగా ఉన్నాయి. చాలా మంది యూదులు – అబ్బా, ఇక్కడే చాలా బావుంది.మనం ఇక్కడే స్థిరపడుదాం అనుకొన్నారు. అక్కడ యూదా మతాన్ని వారు అవలంబించారు. బబులోను దేశములో ఉన్నప్పుడే ‘సినగాగ్’ అనే పదం మొదలయింది. 

    యెహెఙ్కేలు గ్రంథములో మొదటి సారి ‘సినగాగ్’ అనే పదం మనం చూస్తున్నాము. ఈ సినగాగ్ లో పూర్వం వున్నట్లుగా బలులు, అర్పణలు, దేవుని మందసము ఉండవు. అక్కడ సమావేశాలు, ప్రసంగాలు మాత్రమే ఉంటాయి. బబులోను చెర యూదులను అనేక రకాలుగా మార్చివేసింది. ఈ విషయం గమనించండి.యెహెఙ్కేలు క్రీ.పూ 597 లో బబులోను చెరకు వెళ్ళాడు. యెరూషలేము పతనం క్రీ.పూ 586 లో జరిగింది. అంటే, బబులోనులో ఆయన 11 సంవత్సరాలు జీవించిన తరువాత యెరూషలేము నాశనం కావడం, దేవుని మందిరం అగ్ని ఆహుతి కావడం జరిగింది. 11 సంవత్సరాల పాటు బబులోనులో ఉన్న యూదులు యెరూషలేముకు ఏ హానీ జరుగదు అనే అపోహలో ఉన్నారు. ఆ 11 సంవత్సరాలు యిర్మీయా ప్రవక్త ప్రజలను హెచ్చరించినట్లు, బబులోనులో యెహెఙ్కేలు ప్రజలను హెచ్చరించాడు. దేవుని నిబంధనను మీరు ఉల్లంఘించారు కాబట్టి దేవుని శిక్ష మీ మీదకు రావడం ఖాయం అని అటు యిర్మీయా, ఇటు యెహెఙ్కేలు దేవుని ప్రవచనాలు ప్రజలకు వినిపిస్తున్నారు. వారు చెప్పినట్లే క్రీ.పూ 586 లో దేవుడు యెరూషలేమును అగ్ని చేత తగులబెట్టించాడు. దేవుని ఆలయం తగులబడింది. ఆ దృశ్యం చూసి యూదాలో యిర్మీయా ప్రవక్త విలపించినట్లే, ఆ వార్త విని బబులోను లో ఉన్న యెహెఙ్కేలు దుఃఖించాడు.

   ఈ సంఘంటనల వెలుగులో మనం యెహెఙ్కేలు గ్రంథాన్ని చదవాలి. ఈ గ్రంథమును మనం రెండు భాగాలుగా చూడవచ్చు. మొదటి భాగములో దేవుడు ఇశ్రాయేలీయులకు ఎందుకు అటువంటి దురవస్థ తెచ్చాడో యెహెఙ్కేలు మనకు తెలియజేశాడు.యెహెఙ్కేలు గ్రంథం 

మొదటి భాగం: ఇశ్రాయేలు మీద శిక్ష 

రెండవ భాగం: ఇశ్రాయేలు పునరుద్ధరణ 

   యూదా చేసిన పాపాలు దేవుని సన్నిధికి వెళ్లాయి. యెరూషలేము పతనానికి అప్పుడే బీజాలు పడ్డాయి. యెరూషలేమునుఎందుకు శిక్షించ వలసి వచ్చిందో దేవుడు యెహెఙ్కేలు చెప్పాడు: మరియు సామాన్య జనులు బలాత్కారము చేయుచు దొంగిలించుదురు, వారు దీనులను దరిద్రులను హింసించుదురు,అన్యాయముగా వారు పరదేశులను బాధించుదురు.కావున నేను నా క్రోధమును వారిమీద కుమ్మరింతును, వారి ప్రవర్తన ఫలమువారిమీదికి రప్పించి నా ఉగ్రతాగ్నిచేత వారిని దహింతును; ఇదే ప్రభువైన యెహోవా వాక్కు.

                       యెహెఙ్కేలు 22:29-31 

   మీరు దొంగతనాలు చేస్తున్నారు, దీనులను దరిద్రులను హింసించారు. పరదేశులను బాధించారు, అందుకనే నా ఉగ్రత అగ్ని చేత నేను మిమ్మును దహించ వలసి వచ్చింది. ఈ రోజు ఇద్దరు కార్మికులు నా హాస్పిటల్ కి వచ్చారు. ఇద్దరికీ భుజాలు నెప్పులు. తీవ్రమైన నెప్పులతో వారు బాధ పడుతున్నారు. నేను వారి నొప్పి తగ్గించటానికి ఇంజెక్షన్ ఇవ్వాల్సి వచ్చింది. ఎందుకు మీరు ఇంత బాధలో ఉన్నారు అని వారిని అడిగాను.నాలుగు సంవత్సరాల నుండి రోజుకు 12 గంటలు పనిచేస్తున్నాము. ఒక్క రోజు కూడా సెలవు లేదు. మా భుజాలు బరువులు మోయ లేక నొప్పులు వస్తున్నాయి.అని వారు నాకు చెప్పారు.కొంత మంది వ్యాపారస్తులు డబ్బు సంపాదనే ధ్యేయముగా కార్మికుల రక్తాన్ని పీలుస్తున్నారు. అటువంటి అన్యాయాలనే దేవుడు ఈ యెహెఙ్కేలు గ్రంథములో ప్రశ్నించాడు. అందుకనే మార్టిన్ లూథర్ కింగ్ జూనియర్ యెహెఙ్కేలు గ్రంథాన్ని ఎంతో ఇష్టపడేవాడు. ఆయన అమెరికా దేశములో మానవ హక్కుల ఉద్యమం చేపట్టాడు.సమాజము లో అన్యాయాన్ని ప్రశ్నించాడు. దేవుడు తన సన్నిధిని కూడా యూదా వారి మధ్య నుండి తొలంగించాడు. 

    8 అధ్యాయములో మీరు చూస్తే, యెహెఙ్కేలు బబులోను లో ఉన్నాడు.అప్పటికి యెరూషలేము లో దేవుని మందిరం ఇంకా నిలిచే ఉంది. దేవుడు ఒక దేవదూతను పంపి యెహెఙ్కేలును బబులోను లో నుండి యెరూషలేములో ఉన్న దేవుని మందిరము దగ్గరకు తీసుకొని వెళ్ళాడు. ఆ దేవుని మందిరములో జరుగుతున్న ఘోరాలు, పాపాలు, అవినీతి, అక్రమాలు, విగ్రహారాధన, అన్య బలులు యెహెఙ్కేలు కు చూపించాడు.9 అధ్యాయము 3 వచనంలో చూస్తే, దేవుని మహిమ ఆ మందిరాన్ని విడిచి వెళ్ళిపోతున్నది.ఇశ్రాయేలీయుల దేవుని మహిమ తానున్న కెరూబు పైనుండి దిగి మందిరపు గడప దగ్గరకు వచ్చెను. 

                    యెహెఙ్కేలు 9:3 

  అది ఎంత విచారకరమైన సంఘటన.అది ఎంత హృదయవిదారకమైనదృశ్యం. సొలొమోను రాజు ఆ ఆలయాన్ని ప్రతిష్టించినప్పుడు దేవుని మహిమ అందులోకి దిగివచ్చింది. ఇశ్రాయేలీయుల మధ్య దేవుడు నివసించాడు. ఆ దేవుని మహిమ ఆ మందిరాన్ని విడిచి వెళ్ళిపోతూ ఉంది. యాజకుడైన యెహేజ్కెలుకు ఆ దృశ్యం ఎంత బాధ కలిగించిందో మనం ఊహించ వచ్చు.ఆ ఆలయం కూడా త్వరలో అగ్నికి ఆహుతి కాబోతున్నది. ఇశ్రాయేలీయల మీదకు దేవుని శిక్ష వచ్చింది. వారిని శిక్షించడం దేవునికి ఇష్టం లేదు.18:23 లో మనం చూస్తే, దుష్టులు మరణము నొందుటచేత నా కేమాత్రమైన సంతోషము కలుగునా? వారు తమ ప్రవర్తనను దిద్దుకొని బ్రదుకుటయే నాకు సంతోషము; ఇదే ప్రభువగు యెహోవా వాక్కు.

               యెహేజ్కెలు 18:23

   దేవుడు ఏమంటున్నాడంటే, దుష్టులు మరణం నొందుట చూసి నాకు ఏ మాత్రం సంతోషం కలుగదు.వారు తమ ప్రవర్తన సరిచేసుకోవడం నాకు సంతోషం.ఈ రోజు కూడా, పాపాత్ములను నరకానికి పంపించడం దేవునికి ఏ మాత్రం సంతోషం కలిగించదు. పాపాత్ములు తమ పాపాలు ఒప్పుకోవాలి, ప్రభువైన యేసు క్రీస్తు సిలువ దగ్గరకు వచ్చి రక్షణ పొందాలి, మారు మనస్సునకు తగిన ఫలములు ఫలించాలి అని దేవుడు కోరుకొంటున్నాడు. ఆ విధముగా  యెహేజ్కెలు మొదటి భాగములో దేవుడు తన ప్రజలను ఎందుకు శిక్షించాల్సి వచ్చిందో మనకు వివరించాడు.

 రెండవ భాగములో దేవుడు తన ప్రజలకు నిరీక్షణ, మారు మనస్సు, సంక్షేమము వాగ్దానం చేశాడు.మొదటి అధ్యాయము 16 ఆ దర్శనములో దేవుడు యెహేజ్కెలుకు ఒక సింహాసనం, ఒక రథం, దాని  చక్రాలు, 4 జీవులను  చూపించాడు.

20. ఆత్మ యెక్కడికి పోవునో అక్కడికే, అది పోవలసిన వైపునకే అవియు పోవుచుండెను; జీవికున్న ఆత్మ, చక్రములకును ఉండెను గనుక అవి లేవగానే చక్రములును లేచుచుండెను.

            యెహేజ్కెలు 1:16 

దేవుడు యెహెఙ్కేలు కు ఒక రథాన్ని,  చక్రాలు చూపించాడు. మీరు ఎక్కడ ఉంటే నేను అక్కడకు వస్తాను. నా సన్నిధి యెరూషలేము లో ఉంది కాబట్టి నేను యెరూషలేముకే పరిమితం అనుకోవద్దు. నేను సర్వ సృష్టికి దేవుణ్ణి. మీ కోసం బబులోను కూడా వస్తాను అనే సందేశం వారికి ఆ దర్శనములో దేవుడు ఇచ్చాడు.మైమోనిడిస్ గొప్ప యూదు తత్వవేత్త.ఆయన క్రీస్తు శకం 1138 – 1204 ల మధ్య ప్రస్తుత స్పెయిన్ దేశము ఉన్న ప్రాంతములో జీవించాడు. బైబిల్ మీద గొప్ప గ్రంథాలు వ్రాశాడు. ఇశ్రాయేలు దేశములో గలిలయ సముద్రం ఒడ్డున టైబీరియస్ పట్టణములో ఆయన సమాధి ఉంది. గ్రీకు తత్వవేత్తలు అడిగిన ప్రశ్నలకు బైబిల్ ఇచ్చే సమాధానము ఏమిటి? అనే ప్రశ్న ఆయనను వేధించింది.సోక్రటీస్, ప్లేటో, అరిస్టాటిల్ మొదలగు తత్వవేత్తలు మానవ జీవితాన్ని ప్రశ్నించారు.ఈ సృష్టిలో మనిషి స్థానం ఏమిటి? మనిషి జీవితానికి అర్ధం ఉందా? ప్రపంచ చరిత్రకు అర్థం ఉందా? సైన్స్ కి, ఫిలసోఫీ కి ఏమన్నా సంబంధం ఉందా? అనే ప్రశ్నలకు మైమోనిడిస్ సమాధానం ఇచ్చాడు. Guide to the Perplexed‘ఆలోచించేవానికి మార్గదర్శి’అనే పుస్తకం వ్రాశాడు. ‘ఆలోచించేవానికి మార్గదర్శి’. ఆ పుస్తకములో రెండు వాక్య భాగములను కేంద్రముగా చేసుకొన్నాడు.ఆదికాండము లో ఉన్న దేవుని సృష్టి.యెహెఙ్కేలు గ్రంథము లో ఉన్న దేవుని దర్శనం.ఆదికాండములో సృష్టికర్తగా ఉన్న దేవుడు, యెహెఙ్కేలు దర్శనములో తన సింహాసనం మీద ఒక రథం మీద కూర్చుని మనకు కనిపిస్తున్నాడు. ఆది కాండములో ‘ఫిజిక్స్’ ఉంటే, యెహెఙ్కేలు గ్రంథము లో మెటా ఫిజిక్స్ ఉంది అన్నాడు. ఆదికాండములో సైన్స్ ఉంటే,  యెహెఙ్కేలు గ్రంథము లో ఫిలాసఫీ ఉంది అన్నాడు.

     ఆదికాండములో సృష్టికర్త గా కనిపిస్తున్న దేవుడు యెహెఙ్కేలు గ్రంథము లో ఒక రథం మీద మానవ చరిత్ర లోకి దూసుకు వస్తున్నాడు. ‘మనిషి అన్వేషణ కు అక్కడే సమాధానం ఉంది’ అన్నాడు మైమోనిడిస్. ఈ దేవుడు సృష్టికర్త మాత్రమే కాదు, తన ప్రజల మధ్యలోకి వచ్చి వారితో జీవించేవాడు.

    ఇశ్రాయేలీయులు ప్రపంచమంతా చెల్లాచెదురయిపోయారు. జీవం లేని మృత దేహం వలె అయిపోయారు.వారితో దేవుడు ఒక మాట అన్నాడు.37 అధ్యాయము, 14 వచనం చూద్దాము: 

నా ప్రజలారా, నేను సమాధులను తెరచి సమాధులలోనున్న మిమ్మును బయటికి రప్పించగా నేను యెహోవానై యున్నానని మీరు తెలిసికొందురు, మీరు బ్రదుకునట్లు నా ఆత్మను మీలో ఉంచి మీ దేశములో మిమ్మును నివసింపజేసెదను, యెహోవానగు నేను మాట ఇచ్చి దానిని నెరవేర్తునని మీరు తెలిసికొందురు; ఇదే యెహోవా వాక్కు.

                           యెహెఙ్కేలు 37:14 

    నేను సమాధులను తెరచి, సమాధులలో ఉన్న మిమ్మును బయటికి రప్పిస్తాను.ఈయన ఎంత శక్తి కలిగిన దేవుడో మీరు ఒక సారి ఆలోచించండి. ఏ మాత్రం నిరీక్షణ లేకుండా, మృతులుగా పడి ఉన్న ప్రజలకు దేవుడు తన నిరీక్షణ ఇచ్చాడు. వారిని తిరిగి చేర దీశాడు. పోయిన సారి నేను ఇశ్రాయేలు దేశం వెళ్ళినప్పుడు యెరూషలేము లో యాడ్ వాషెమ్ అనే మ్యూజియం కు వెళ్ళాను. రెండో ప్రపంచ యుద్ధములో మరణించిన యూదులకు స్మారక చిహ్నముగా అది నిర్మించబడింది.దాని ఎంట్రన్స్ లో ఉన్న ద్వారం మీద యెహెఙ్కేలు వాక్యం చెక్కబడింది.

I will put my breath into you

and you shall live again, 

and I will set you 

upon your own soil…

మీరు బ్రదుకునట్లు నా ఆత్మను మీలో ఉంచి మీ దేశములో మిమ్మును నివసింపజేసెదను. మీ దేశానికి నేను మిమ్ములను తిరిగి తీసుకొని వెళ్తాను అని దేవుడు వారికి వాగ్దానం చేశాడు. అంతే కాకుండా వారి స్వభావాన్ని మార్చి వేస్తాను అన్నాడు.

36 అధ్యాయం, 26 వచనం: 

 నూతన హృదయము మీ కిచ్చెదను, నూతన స్వభావము మీకు కలుగజేసెదను,రాతిగుండె మీలోనుండి తీసివేసి మాంసపు గుండెను మీకిచ్చెదను. యెహెఙ్కేలు 36:26 

దేవుడు ఒక నూతన నిబంధన వారితో చేశాడు. దాని ప్రకారం వారికి నూతన హృదయం, నూతన స్వభావం ఇస్తాను అన్నాడు. బబులోను దేశములో ఉన్న యెహేజ్కెలుకు దేవుడు కనిపించాడు.తన సింహాసనం మీద కూర్చొని ఒక రథము మీద కనిపించాడు. దానికి 4 చక్రాలు ఉన్నాయి. ఆయన యెరూషలేముకు పరిమితమైన దేవుడు కాదు. తన రథం మీద తన ప్రజలు ఎక్కడ ఉంటే అక్కడకు వెళ్లే దేవునిగా ఆయన మనకు కనిపిస్తున్నాడు. తన ప్రజల మధ్యలోకి దిగి వచ్చే దేవుడు ఆ దర్శనములో మనకు కనిపిస్తున్నాడు.ప్రభువైన యేసు క్రీస్తు మన మధ్యలోకి దిగి వచ్చిన దేవుడు.

ఆ వాక్యము శరీరధారియై, కృపాసత్య సంపూర్ణు డుగా మనమధ్య నివసించెను; తండ్రివలన కలిగిన అద్వి తీయకుమారుని మహిమవలె మనము ఆయన మహిమను కనుగొంటిమి

(యోహాను 1:12) 

  యెహెఙ్కేలు ప్రవక్త ఎదురుచూసిన రక్షకుడు ఈ యేసు క్రీస్తే. ఆయన శరీర ధారిగా మన మధ్యలోకి వచ్చాడు. దేవుని మహిమ ఆయన మోహములో మనం చూశాము. దేవుని మహిమ దేవుని మందిరాన్ని వదలి వెళ్లిపోయే విచారకరమైన దృశ్యాన్ని యెహెఙ్కేలు చూశాడు. అయితే సంతోషకరమైన వార్త ఏమిటంటే, దేవుని మహిమ మన ప్రభువైన యేసు క్రీస్తు నందు మన మధ్యలోకి దిగి వచ్చింది. అక్కడ నాలుగు జీవులు మనకు కనిపిస్తున్నాయి. ఆ నాలుగు జీవులకు 4 ముఖాలు ఉన్నాయి. 

సింహం ముఖం

ఎద్దు ముఖం

మానవ ముఖం

పక్షి రాజు ముఖం 

    ఆ నాలుగు మొహల్లో మనకు యేసు ప్రభువు రూపం కనిపిస్తున్నది. సింహం ముఖములో ఆయన యూదా రాజ సింహముగా కనిపిస్తున్నాడు. ఆయన రాజ రికం అక్కడ కనిపిస్తున్నది. ఎద్దు ముఖములో ఆయన సేవకునిగా మనకు కనిపిస్తున్నాడు. ఆయన దీనత్వం అక్కడ మనకు కనిపిస్తున్నది. మానవ ముఖములో ఆయన మానవత్వం మనకు కనిపిస్తున్నది. పక్షి రాజు ముఖములో ఆయన ఆకాశానికి చెందినవాడిగా మనకు కనిపిస్తున్నాడు. అంటే, ఆయన దైవత్వం మనకు కనిపిస్తున్నది. అంటే, క్రొత్త నిబంధనలో ఉన్న నాలుగు సువార్తలు అక్కడ మనకు కనిపిస్తున్నాయి. 

మత్తయి సువార్త లో ప్రభువైన యేసు క్రీస్తు రాజుగా మనకు కనిపిస్తున్నాడు 

మార్కు సువార్తలో ఆయన సేవకునిగా మనకు కనిపిస్తున్నాడు 

లూకా సువార్తలో ఆయన మనుష్య కుమారునిగా కనిపిస్తున్నాడు 

యోహాను సువార్తలో ఆయన దేవునిగా కనిపిస్తున్నాడు. 

2 భాగం: 

బైబిల్  లో యెహెఙ్కేలు గ్రంథము చాలా గొప్ప పుస్తకం. యెహెఙ్కేలు పరిచర్య యెరూషలేము, బబులోను లలో సాగింది. మొదట ఆయన ఒక యాజకునిగా ఉన్నాడు. యెరూషలేములో దేవుని ఆలయములో ఆయన యాజకునిగా పనిచేసి ఉండవచ్చును. క్రీ.పూ 597 లో ఆయన బబులోనుకు చెరగా తీసుకొని వెళ్ళబడ్డాడు. కేబారు నది ఒడ్డున, నిప్పూరు పట్టణము దగ్గరలోని టెల్ అబీబ్ అనే ప్రాంతానికి ఆయన వెళ్ళాడు. 

జులై నెల, క్రీ. పూ 592 సంవత్సరము దేవుడు యెహెఙ్కేలు కు గొప్ప దర్శనం ఇచ్చాడు. ఒక రథము మీద సింహాసనాసీనుడుగా దేవుడు ఆయనకు కనిపించాడు. అప్పటి నుండి ఈ యాజకుడు దేవుని ప్రవక్తగా పనిచేశాడు.

     యెహెఙ్కేలు ఇశ్రాయేలీయులకు ఒక పనోరమా ఇచ్చాడు. పనోరమా అంటే ఏమిటంటే ఒక సుదీర్ఘ చిత్రం. మన ఫోన్ తీసుకొని కెమెరా ఆన్ చేసి చుట్టూ తిరిగాము అనుకోండి, 360 డిగ్రీల ఫోటో తీయొచ్చు. మనకు అన్ని వైపులా ఉన్న వస్తువులను మనం ఫోటో తీసుకోవచ్చు. యెహెఙ్కేలు ప్రవక్త తన గ్రంథములో ఒక పనోరమా పాఠకులకు ఇస్తున్నాడు. ఇప్పటి వరకు జరిగింది ఇది, ఇక జరుగబోయేది ఇది అని ఆయన ఇశ్రాయేలీయుల ముందు ఒక చిత్రాన్ని గీస్తున్నాడు. మీరు బబులోను ఎందుకు వచ్చారు? ఇక్కడ ఎంత కాలం ఉంటారు? తిరిగి ఇశ్రాయేలు దేశం ఎప్పుడు వెళ్తారు? భవిష్యత్తులో మీకు ఏమి జరుగుతుంది? అనే ప్రశ్నలకు ఆయన పుస్తకములో జవాబులు ఉన్నాయి. 

యెహెఙ్కేలు 36,37 అధ్యాయాలు  చదివితే, దేవుడు ప్రపంచం నలుమూలల నుండి యూదులను ఇశ్రాయేలు దేశానికి సమకూర్చుతాడు అని యెహెఙ్కేలు ప్రవచించాడు. 1948 లో ఇశ్రాయేలు దేశం ఏర్పడిన తరువాత ఆ ప్రవచనం నెరవేరింది. వంద సంవత్సరాల క్రితం ఇశ్రాయేలు దేశం తిరిగి ఏర్పడుతుంది అని మీరు అంటే, జనం మిమ్మును చూసి నవ్వే పరిస్థితి ఉండేది. ‘ఏంటయ్యా, ఏమి  మాట్లాడుతున్నావు,

 యూదులు ప్రపంచం మొత్తం చెదిరిపోయి ఉన్నారు. ఇశ్రాయేలు ప్రాంతము మొత్తం అరబ్బుల హస్తాల్లో ఉంది. యెరూషలేము ముస్లిముల క్రింద ఉంది. యూదులు తిరిగి రావడం, యెరూషలేము ను తిరిగి పొందడం అసంభవం’ అని వారు అంటూ ఉండేవారు. అయితే, దేవుడు చెప్పిన ఏ మాటా వ్యర్థం కాదు, దేవుడు చేసిన ఏ ప్రవచనమూ నిరర్ధకం కాదు. 2600 సంవత్సరముల క్రితం దేవుడు యెహెఙ్కేలు ద్వారా చెప్పిన ప్రవచనం మన ఆధునిక కాలములో నెరవేరింది. యెహెఙ్కేలు: ఆయన పేరుకు ‘దేవుడు శక్తిమంతుడు’ అని అర్ధం. ఇశ్రాయేలీయులు చెరలో ఉన్నారు. వారికి ఆ దుస్థితి ఎందుకు కలిగిందో చెప్పాలంటే ఆయనకు ధైర్యం కావాలి. వారికి ఆదరణ కలిగించాలంటే దేవుని శక్తి ఆయనకు అవసరం. దేవుని శక్తి ఎంత?

37 అధ్యాయములో దేవుడు యెహెఙ్కేలుకు ఇచ్చిన గొప్ప దర్శనం మనం చూస్తాము. ఎండిన ఎముకలతో కూడిన ఒక గొప్ప లోయ అక్కడ ఉంది. ఆ ఎముకలలో జీవం లేదు. అప్పుడు దేవుని శక్తి వచ్చి ఆ ఎముకలలో ప్రవేశించింది. దేవుని జీవం ఆ ఎముకలలో ప్రవేశించింది. అప్పుడు అవి ఒకదాని నొకటి కలుసుకొని జీవముతో తిరిగి లేచినవి. దేవుని శక్తి అలాంటిది. 

    అనేక చిహ్నాలు, ఉపమానాలు, వింత చేష్టలతో యెహెఙ్కేలు దేవుని సందేశాన్ని ప్రజలకు అందించాడు. క్రీ. పూ 597 లో యెహెఙ్కేలు 3000 మంది యూదు సోదరులతో బబులోను కు చెరగా తీసుకొని వెళ్ళబడ్డాడు. బబులోనులో ఉండి దేవుని ప్రజలకు ఆయన గొప్ప నిరీక్షణ సందేశం ఇచ్చాడు: దేవుడు మరొక సారి మిమ్ములను దర్శిస్తాడు. ప్రపంచం నలుమూలల నుండి దేవుడు మిమ్ములను తన వద్దకు, యెరూషలేముకు చేకూర్చుతాడు. అనేక ప్రవచనాలు ఈ యెహెఙ్కేలు గ్రంథము లో మనకు కనిపిస్తాయి. 

ముఖ్య ప్రవచనాలు: 

-యూదా, యెరూషలేము శిక్షించబడుట  (యెహెఙ్కేలు 4-24) 

-దేవుడు తన ప్రజలతో చేసే నిత్య నిబంధన (యెహెఙ్కేలు 16:60-63) 

-చెదరిపోయిన యూదులు స్వదేశం చేరుకొంటారు (యెహెఙ్కేలు 20:33-44) 

-అన్య దేశములకు వ్యతిరేకముగా దేవుని ప్రవచనాలు (యెహెఙ్కేలు 25-32) 

-ఇశ్రాయేలు పశ్చాత్తాప పడుట (యెహెఙ్కేలు 33) 

-ఇశ్రాయేలుకు రాబోయే నిజమైన కాపరి (యెహెఙ్కేలు 34:11-31) 

-ఇశ్రాయేలు తిరిగి జన్మించుట ((యెహెఙ్కేలు 36-37) 

-దేవుని నామము పరిశుద్ధపరచబడుట (యెహెఙ్కేలు 36:22-32) 

-గోగు, మాగోగు ల నుండి ఇశ్రాయేలు రక్షణ (యెహెఙ్కేలు 38-39) 

-వెయ్యేళ్ళ పాలనలో నిర్మించబడే దేవుని ఆలయం (యెహెఙ్కేలు 40-46) 

-దేవుని ఆలయములో గొప్ప నది ప్రవహిస్తుంది (యెహెఙ్కేలు 47:1-12) 

-వెయ్యేళ్ళ పాలనలోఇశ్రాయేలు గోత్రముల మధ్య స్థల విభజన (యెహెఙ్కేలు 48:1-29) 

ప్రభువైన యేసు క్రీస్తు రూపం: 

తరువాత మనం అడగవలసిన ప్రశ్న: యెహెఙ్కేలు గ్రంథము లో ప్రభువైన 

యేసు క్రీస్తు మనకు ఎలా కనిపిస్తున్నాడు? 

దేవుని మహిమ: యెహెఙ్కేలు గ్రంథములోమనకు ప్రాముఖ్యముగా కనిపిస్తుంది.

 దేవుని మహిమ యెరూషలేము లోని ఆలయము నకు వచ్చుట యెహెఙ్కేలు ప్రవక్త చూశాడు.ఆ దేవుని మహిమ మన మధ్యలోకి ఎలా వచ్చింది? ప్రభువైన యేసు క్రీస్తు గా వచ్చింది.

ఆ వాక్యము శరీరధారియై, కృపాసత్యసంపూర్ణు డుగా మనమధ్య నివసించెను; తండ్రివలన కలిగిన అద్వి తీయకుమారుని మహిమవలె మనము ఆయన మహిమను కనుగొంటిమి.

                    యోహాను 1:14 

మన మధ్యలోకి దిగి వచ్చిన ఆ దేవుని మహిమ ఎవరంటే ప్రభువైన యేసు క్రీస్తే. ఆయన దివ్యమైనదైవిక మోహములో దేవుని మహిమ మనకు కనిపించింది.

Son of Man in Ezekiel 

ఆ తరువాత యెహెఙ్కేలు లో యేసు క్రీస్తు: మనుష్య కుమారుడు

    దానియేలు గ్రంథములొ, యెహెఙ్కేలు గ్రంథము లో ‘మనుష్య కుమారుడు’ అనే పేరు మనకు కనిపిస్తుంది. సెయింట్ అగస్టీన్ ‘సిటీ అఫ్ గాడ్’ ‘దేవుని నగరము’ అనే పుస్తకం వ్రాశాడు. ఆ పుస్తకములో దానియేలు, యెహెఙ్కేలు గ్రంథాలను ఆయన ప్రస్తావించాడు. 

the  city of man, and the city of God.

The City of Man: మనిషి కట్టే నగరం, దేవుడు కట్టే నగరం.మనిషి కట్టే నగరం ఎలా ఉంది? హింస, రక్త పాతం, ద్వేషం, అసూయ, హత్యలు, మాన భంగాలు, కరువులు, కరోనాలు, బెడ్లు లేని హాస్పిటల్ లు, ఆక్సిజన్ లేని సిలిండర్ లు, నిండిపోతున్న శ్మశాన వాటికలు స్థలం లేని సమాధుల తోటలు. అది City of Man. అందులో నిరీక్షణ లేదు, జీవం లేదు, భవిష్యత్తు లేదు వెలుగు లేదు.

City of God: దేవుని నగరములో జీవం ఉంది, నిరీక్షణ ఉంది, వెలుగు ఉంది, భవిష్యత్తు ఉంది. ఆ దేవుని నగరాన్ని నిర్మించడానికి మనుష్య కుమారుడుమన మధ్యలోకి వచ్చాడు.‘మనుష్య కుమారుడు’ అనే మాట ఎంతో ప్రశస్తమైనది. ప్రభువైన యేసు క్రీస్తు అనేక సార్లు తనను తాను ‘మనుష్య కుమారుడు’ అని పిలుచుకొన్నాడు. యెహెఙ్కేలు, దానియేలు గ్రంథములలో ‘మనుష్య కుమారుడు’ మనకు స్పష్టముగా కనిపిస్తున్నాడు.దేవుడు భూమి మీదకు ‘మనుష్య కుమారుడు’ గా వచ్చే సమయము దగ్గరపడింది. యెహెఙ్కేలు అనేక సూచక క్రియలు చేసి ఇశ్రాయేలీయులకు దేవుని సందేశం ఇచ్చాడు. యేసు ప్రభువు కూడా అనేక సూచక క్రియలు చేసి యూదులకు దేవుని వాక్యం ప్రకటించాడు.యెరూషలేములో ఉన్న దేవుని మందిరం లో జరుగుతున్న అక్రమాలను దేవుడు యెహెఙ్కేలుకు చూపించాడు. యేసు ప్రభువు కూడా యెరూషలేములోని దేవుని మందిరము లోకి వెళ్లి అక్కడ జరుగుతున్న అక్రమాలను ఎండగట్టాడు. ‘మీరు నా తండ్రి ఆలయాన్ని దొంగల గుహగా మార్చి వేశారు’ అని అక్కడ ఉన్న వ్యాపారస్తులను ఆయన వెళ్ళగొట్టాడు.ఆ తరువాత ఆయన మనకు కాపరి గా కనిపిస్తున్నాడు.

యెహెఙ్కేలు 34: అధ్యాయములో దేవుడు మనకు ఒక కాపరి గా కనిపిస్తున్నాడు.  అక్కడ కొన్ని మాటలు చూద్దాము: 

2. నరపుత్రుడా, ఇశ్రాయేలీయుల కాపరులనుగూర్చి ఈ మాట ప్రవచింపుము, ఆ కాపరులతో ఇట్లనుము ప్రభువగు యెహోవా సెలవిచ్చున దేమనగా తమ కడుపు నింపుకొను ఇశ్రాయేలీయుల కాపరులకు శ్రమ; కాపరులు గొఱ్ఱెలను మేపవలెను గదా.3. మీరు క్రొవ్విన గొఱ్ఱెలను వధించి క్రొవ్వును తిని బొచ్చును కప్పుకొందురు గాని గొఱ్ఱ లను మేపరు,4. బలహీనమైనవాటిని మీరు బలపరచరు, రోగముగలవాటిని స్వస్థపరచరు, గాయపడిన వాటికి కట్టుకట్టరు, తోలివేసిన వాటిని మరల తోలుకొనిరారు, తప్పిపోయినవాటిని వెదకరు, అది మాత్రమేగాక మీరుకఠినమనస్కులై బలాత్కారముతో వాటిని ఏలుదురు.5. కాబట్టి కాపరులు లేకయే అవి చెదరిపోయెను,చెదరి పోయి సకల అడవి మృగములకు ఆహారమాయెను.11. ప్రభువైన యెహోవా సెలవిచ్చునదేమనగా ఇదిగో నేను నేనే నా గొఱ్ఱెలను వెదకి వాటిని కనుగొందును.

                               యెహెఙ్కేలు 34 

     ఇక్కడ దేవుడు చాలా కోపముతో మాట్లాడుతున్నాడు. ఇశ్రాయేలు కాపరులతో ఆయన మాట్లాడుతున్నాడు. మీరు దొంగ కాపరులు, మీ కడుపు నింపుకోవటమే తప్ప మీరు నా గొఱ్ఱెలను పట్టించుకోరు. మీరు గొఱ్ఱెలను భక్షించే వారే కానీ రక్షించే వారు కాదు. బలహీనమైనవాటిని మీరు బలపరచరు, రోగముగలవాటిని స్వస్థపరచరు, గాయపడిన వాటికి కట్టుకట్టరు, తోలివేసిన వాటిని మరల తోలుకొనిరారు, తప్పిపోయిన వాటిని వెదకరు. ఇదిగో నేను నేనే నా గొఱ్ఱెలను వెదకి వాటిని కనుగొందును.

      దేవుడు తానే మన మధ్యలోకి ఒక గొఱ్ఱెల కాపరిగా వచ్చాడు. మన ప్రభువైన యేసు క్రీస్తు గా మన మధ్యలోకి వచ్చాడు. ఆయన మంచి గొఱ్ఱెల కాపరి, గొప్ప గొఱ్ఱెల కాపరి, ప్రధాన కాపరి. ఈయన గొఱ్ఱెల కోసము తన ప్రాణం పెట్టే కాపరి. నేను గొఱ్ఱెలకు మంచి కాపరిని; మంచి కాపరి గొఱ్ఱెలకొరకు తన ప్రాణము పెట్టును. 

              యోహాను10:11 

ప్రభువైన యేసు క్రీస్తు మంచి గొఱ్ఱెల కాపరి, గొఱ్ఱెల కొరకు తన ప్రాణం పెట్టే కాపరి.బలహీనమైన గొఱ్ఱెలను బలపరచే కాపరి రోగము గల వాటిని స్వస్థపరచే కాపరి గాయపడిన వాటికి కట్టుకట్టే కాపరి తోలివేసిన వాటిని సమకూర్చే కాపరితప్పి పోయిన వాటిని వెదికే కాపరి ఈ మంచి కాపరి యొద్దకు నీవు వచ్చావా? 

21. ప్రభువైన యెహోవా సెలవిచ్చున దేమనగా ఏయే అన్యజనులలోఇశ్రాయేలీయులు చెదరిపోయిరో ఆ యా అన్యజనులలోనుండి వారిని రక్షించి, వారు ఎచ్చటెచ్చట ఉన్నారో అచ్చటనుండి వారిని సమకూర్చి వారి స్వదేశములోనికి తోడుకొనివచ్చి 

22. వారికమీదట ఎన్నటికిని రెండు జనములుగాను రెండు రాజ్యములుగాను ఉండ కుండునట్లు ఆ దేశములో ఇశ్రాయేలీయుల పర్వతముల మీద 

23. వారిని ఏకజనముగా చేసి, వారికందరికి ఒక రాజునే నియమించెదను. 

26. నేను వారితో సమాధా నార్థమైన నిబంధన చేసెదను, అది నాకును వారికిని నిత్య నిబంధనగా ఉండును

    దేవుడు ఇశ్రాయేలీయులకు గొప్ప వాగ్దానము చేస్తున్నాడు. ప్రపంచమంతా చెదరిపోయిన నా ప్రజలను సమకూర్చుతాను.వారిక రెండు జనములుగా ఉండరు, రెండు రాజ్యములుగా ఉండరు.వారిని ఏక జనముగా చేస్తాను.వారికి ఒక రాజునే నియమిస్తాను.వారితో సమాధాన నిబంధన చేస్తాను. వారితో నిత్య నిబంధన చేస్తాను.

    దేవుడు ఆ వాగ్దానం నెరవేర్చాడు. ప్రపంచమంతా చెదరి పోయిన తన ప్రజలను తిరిగి యెరూషలేముకు తీసుకువచ్చాడు.మీరు ఆలోచిస్తే దేవుని కార్యములు చాలా గొప్పవి.యాకోబుకు 12 మంది కుమారులు. ఆ 12 మంది కుమారులలో నుండి12 గోత్రాలు దేవుడు చేసాడు. 12 మంది పిల్లల్ని పెంచి పెద్ద వారిని చేయడం సామాన్యమైన విషయం కాదు. 4 వేల సంవత్సరాల క్రితం శిశు మరణాలు చాలా ఎక్కువగా ఉండేవి. అలాంటి సమయములో 12 పిల్లలు మొత్తం బ్రతకడం గొప్ప విషయమే. ఈ రోజు కరోనా పాండమిక్ లో కుటుంబాలు, కుటుంబాలే కనుమరుగు అవుతున్నాయి. 21 శతాబ్దములో, ఈ ఆధునిక యుగములో ఎంత కాలము బ్రతుకుతామో మనకే తెలియని పరిస్థితి మనకు కలిగింది. 4 వేల సంవత్సరాలుగా యూదులు అనేక వ్యాధులు, బాధలు, కరువులు, భూకంపాలు, యుద్ధాలు, దోపీడీలు చవిచూశారు. దేవుడు వారిని కాపాడుకొంటూ వస్తున్నాడు. అది చాలా గొప్ప అద్భుతం. నన్నడిగితే, ప్రపంచ చరిత్రలోనే గొప్ప అద్భుతం. అబ్రహాము కు ఇచ్చిన మాటను దేవుడు ఈ రోజుకూ నిలబెడుతున్నాడు. అది నిత్య నిబంధన, సమాధాన నిబంధన.

దేవుని ఆలయము: 

దేవుని ఆలయం: యెహెఙ్కేలు 41 – 46 అధ్యాయాల్లో యెరూషలేములో నిర్మించబడే దేవుని ఆలయం మనకు కనిపిస్తుంది. ఈ ప్రవచనము మనకు అర్థం కావాలంటే మనము దానియేలు గ్రంథం కూడా చూడాలి. దానియేలు 9 అధ్యాయములో మనం 70 వారములు ప్రవచనం చూస్తున్నాము. 

  తిరుగుబాటును మాన్పుటకును, పాపమును నివారణ చేయుటకును, దోషము నిమిత్తము ప్రాయశ్చిత్తము చేయుటకును, యుగాంతము వరకుండునట్టి నీతిని బయలు పరచుటకును, దర్శనమును ప్రవచనమును ముద్రించుటకును, అతి పరిశుద్ధ స్థలమును అభిషేకించుటకును, నీ జనమునకును పరిశుద్ధ పట్టణమునకును డెబ్బదివారములు విధింపబడెను.

                   దానియేలు 9

   నీ జనమునకును పరిశుద్ధ పట్టణమునకును డెబ్బదివారములు విధింపబడెను: ఈ 70 వారముల ప్రవచనము దేవుడు యూదులకు, యెరూషలేముకు విధించాడు. ఈ 70 వారములలో మనకు 490 సంవత్సరాలు కనిపిస్తున్నాయి. ఆ 490 సంవత్సరాల తరువాత 6 కార్యములు జరుగుతాయి.

1.తిరుగుబాటును మాన్పుటకును: ఇశ్రాయేలీయులు ప్రభువైన యేసు క్రీస్తు మీద తిరుగు బాటు చేశారు. ఆయనను సిలువ వేసి చంపారు. అయితే, ఆయన రెండవ సారి తిరిగి వచ్చినప్పుడు వారు ఆయన మీద తిరుగు బాటు చేయరు. ఆయనను తమ రక్షకునిగా మెస్సియా గా అంగీకరిస్తారు. 

2.పాపమును నివారణ చేయుటకును: ప్రభువైన యేసు క్రీస్తు ను నమ్ముకొనిన తరువాత ఇశ్రాయేలీయుల పాపము నివారణ చేయబడుతుంది.

3.దోషము నిమిత్తము ప్రాయశ్చిత్తము చేయుటకును: యేసు క్రీస్తు రెండవ సారి వచ్చినప్పుడు ఇశ్రాయేలీయులు ఆయనను నమ్ముకొనుట మాత్రమే కాక ఆయన సిలువ కార్యాన్ని కూడా అంగీకరిస్తారు. అప్పుడు వారు చేసిన దోషానికి ప్రాయశ్చిత్తము కలుగుతుంది.

4.యుగాంతము వరకుండునట్టి నీతిని బయలు పరచుటకును: వెయ్యేళ్ళ పాలనలో యేసు క్రీస్తు తన ప్రజలకు పరిపూర్ణమైన నీతిని ఇస్తాడు.

5.దర్శనమును ప్రవచనమును ముద్రించుటకు: సమస్త దర్శనములు, ప్రవచనములు యేసు క్రీస్తు రెండవ సారి వచ్చినప్పుడు ముద్రించబడతాయి. అంటే అవన్నీ నెరవేరుతాయి. ఇంకా నెరవేరని దర్శనము అంటూ ఉండదు, ఇంకా నెరవేరని ప్రవచనము అంటూ ఉండదు.

6.అతి పరిశుద్ధ స్థలమును అభిషేకించుటకు: దేవుని అతి పరిశుద్ధ స్థలము అభిషేకించబడుతుంది. అంటే దేవుని మందిరము నిర్మించబడుతుంది. రెండు వేల సంవత్సరములుగా యెరూషలేములో దేవుని మందిరం లేదు. యేసు క్రీస్తు తిరిగి వచ్చినప్పుడు అది తిరిగి నిర్మించబడుతుంది. 

     ఈ యెహెఙ్కేలు గ్రంథములో ‘దేవుని ఆలయము’ నకు చాలా ప్రాముఖ్యత ఉన్నది. మొదటి భాగములో, దేవుని ఆలయము ను మీరు చూస్తే ఇశ్రాయేలీయులు దానిని అపవిత్రం చేయడం మనం చూస్తున్నాము. దేవుడు వారిని  చూసినప్పుడు దేవుని హృదయానికి  సంతోషం  లేదు.ఇశ్రాయేలీయులు పేదలకు సహాయం చేయకపోగా, దేవుని ఆలయాన్నే ఒక వ్యాపార కేంద్రముగా మార్చివేశారు.అందుకనే దేవుడు ఆ ఆలయమును నిర్మూలించాడు. వారిని తమ స్వదేశములో నుండి వెళ్ళగొట్టాడు. ‘దేవుని ఆలయము’ కేంద్రముగా వారికి శిక్ష విధించబడింది. 

    రెండవ భాగములో కూడా ‘దేవుని ఆలయము’ మనకు స్పష్టముగా కనిపిస్తున్నది. 40-48 అధ్యాయాలు మీరు చదివితే, ఆ ఆలయము ఎలా నిర్మించబడుతుందో మనకు అనేక వివరములు ఇవ్వబడ్డాయి. దేవుడు వారితో ఏమన్నాడు? చెదరి పోయిన మీ అందరినీ నేను తిరిగి మీ స్వదేశానికి సమకూర్చుతాను. మీతో క్రొత్త నిబంధన చేస్తాను. మీకు ఒక క్రొత్త ఆలయము నిర్మించబడుతుంది. ‘దేవుని ఆలయము’ కేంద్రముగా వారికి నిరీక్షణ, ఆశీర్వాదం లభించినవి. దేవుని సమాజములో, దేవుని ప్రజలకు దేవుని ఆలయము కేంద్రముగా ఉంది. ఆ సత్యాన్ని మనం గుర్తుపెట్టుకోవాలి. ప్రతి ఆది వారం మనం దేవుని ఆలయమునకు వెళ్ళాలి. టీవీ లో దేవుని వాక్యం విన్నాను అది చాలు, యూట్యూబ్ లో దేవుని వాక్యం చూశాను అది చాలు అని మనం సరిపెట్ట కూడదు. దేవుని మందిరానికి వెళ్లి, దేవుని ప్రజల మధ్య గడపాలి.యెహెఙ్కేలు గ్రంథములో యేసు ప్రభువు రెండవ రాకడ చిహ్నాలు: 

        ఈ రోజు యెహెఙ్కేలు గ్రంథము 38, 39 అధ్యాయాలు ధ్యానము చేద్దాము.ఇక్కడ రెండు వేల ఐదు వందల సంవత్సరముల క్రితం దేవుడు తన ప్రవక్త అయిన యెహెఙ్కేలు ద్వారా ప్రస్తుత ప్రపంచము గురించి తెలియ జేశాడు. అక్కడ రష్యా దేశము, మధ్య ప్రాశ్చ్యదేశాలు ఇశ్రాయేలు దేశం మీద దాడి చేయడం మనం చూస్తున్నాము.

38:2 వచనము చూద్దాము.

నరపుత్రుడా, మాగోగు దేశపువాడగు గోగు, 

అనగా రోషునకును మెషెకునకును

తుబాలునకును అధిపతియైన 

వానితట్టు అభిముఖుడవై అతని గూర్చి ఈ మాట యెత్తి ప్రవచింపుము

                                యెహెఙ్కేలు 38:2 

    (మే నెల, 2021) ఈ వారం మనం చూశాము. ఇశ్రాయేలు, గాజా ల మధ్య యుద్ధము జరిగింది. యెరూషలేములో టెంపుల్ మౌంట్ మీద అల్ అక్సా మసీదు ఉంది.అందులోకి ఇశ్రాయేలు పోలీసులు వెళ్లారు. మా మందిరములోకి పోలీసులు రావడం ఏమిటి? అని అక్కడ అల్లర్లు జరిగినవి. ఆ కొట్లాటలు చిలికి, చిలికి గాలి వానగా మారాయి. ఇశ్రాయేలు దేశం ప్రక్కన గాజా ప్రాంతము ఉంది. హమాస్ అనే ఒక తీవ్ర వాద పార్టీ ఇక్కడ పాలన చేస్తూ ఉంది. హమాస్ అనే పేరుకు ‘హింస’ అని అర్థం. K.A.పాల్ గారి వలె ప్రజా శాంతి పార్టీ అని మంచి పేరుతో పార్టీ పెట్టి సమాజములో శాంతి కోసం ప్రయత్నించాలి కానీ, ‘హింస’ అనే పేరుతో పార్టీ లు పెట్టడం మంచిది కాదు.అది కూడా హెబ్రీ భాషలో ‘హింస’ అనే పదముతో వారు ఈ పార్టీ పెట్టారు. 

    హెబ్రీ భాష మాట్లాడుకొనే యూదులను భయపెట్టాలి అని వారి ఉద్దేశ్యం. ఈ గాజా ప్రాంతము 40 కి.మీ పొడుగు, 12 కిలోమీటర్లు వెడల్పు ఉంటుంది. 1967 లో జరిగిన 6 రోజుల యుద్ధములో ఇశ్రాయేలు దేశము గాజా ప్రాంతాన్ని ఈజిప్తు నుండి స్వాధీనం చేసుకొంది.  2005 లో ఇశ్రాయేలు ఈ ప్రాంతము నుండి వైదొలగింది. అప్పటి నుండి ఈ ప్రాంతము పాలస్తీనీయుల చేతిలో ఉంది. అక్కడ నుండి ఇశ్రాయేలు దేశము మీద వారు వేలాది బాంబులు, క్షిపణులు కుమ్మరించారు. అనేకమంది అమాయకులు ఆ దాడుల్లో ప్రాణాలు కోల్పోయారు. కోల్పోతున్నారు. ఎందుకు ఈ మారణ హోమము? యెరూషలేము కోసము. 

దేవుడు తన వాక్యంలో స్పష్టముగా చెప్పాడు.అబ్రహాము కు దేవుడు వాగ్దానం చేశాడు.అబ్రహాము జీవితములో రెండు సార్లు యెరూషలేము మనకు కనిపిస్తుంది.షాలేము రాజైన మెల్కిసెదెకు అబ్రాహామును యెరూషలేములో కలిసాడు. ఆదికాండము 14 అధ్యాయములో మనం ఆ సంగతులు చదువుతాము (ఆది14:18; కీర్తన76:2) యెరూషలేము రాజు మెల్కిసెదెకు అబ్రహామును ఆశీర్వదించాడు. ఆ ప్రాంతమును దేవుడు అబ్రహాము సంతానమునకు ఇవ్వబోతున్నాడు.అక్కడ రాజ రికం కూడా మనకు కనిపిస్తున్నది.అబ్రహాము సంతానంలో పుట్టే రాజులకు యెరూషలేము రాజధానిగా ఉండబోతున్నది.రెండో సారి అబ్రహాము యెరూషలేము ఎప్పుడు వెళ్ళాడు? 

   ఆదికాండము 22 అధ్యాయములో మనము చూస్తాము. అబ్రహాము తన కుమారుడైన ఇస్సాకును తీసుకొని మోరియాపర్వతము మీదకు వెళ్ళాడు. అక్కడ ఇస్సాకును అర్పించటానికి తన కత్తి ఎత్తాడు. దేవుడు అబ్రహామును చివరి నిమిషములో ఆపాడు.ఇస్సాకు స్థానములో ఒక పొట్టేలు ఆ బలి పీఠము మీద అర్పించబడింది. మన విమోచనకు అది సాదృశ్యముగా ఉంది.అదే మోరియా పర్వతము మీద మన విమోచన కొరకు యేసు క్రీస్తు ప్రభువు అర్పించబడ్డాడు. లోక పాపమును మోసుకొని పోవు దేవుని గొర్రెపిల్ల గా ఆ యెరూషలేము పర్వతము మీద ఆయన మన కొరకు అర్పించబడ్డాడు. ఆయన అబ్రహాము కుమారుడు, దావీదు కుమారుడు, మన రక్షకుడు, మన విమోచకుడు.

   యేసు ప్రభువు సిలువ వేయబడిన ఆ ప్రదేశములో ఇప్పుడు బాంబుల వర్షం ఎందుకు కురుస్తూ వుంది? సిలువ సందేశాన్ని తిరస్కరించిన పాపాత్ములు ఆ ప్రాంతాన్ని స్వాధీనం చేసుకొన్నారు. దేవుడు తన దాసుడైన అబ్రహాముకు ఇచ్చిన నగరము యెరూషలేము.యెరూషలేము అంటేనే ‘శాంతి నగరము’ అని అర్థము. the city of peace.ఆ శాంతి నగరములో ఈ రోజు ఎందుకు ఇంత అశాంతి నెలకొని ఉంది? 

యెరూషలేము చరిత్ర చూడండి.

   యెరూషలేముకు బైబిల్ గ్రంథములొ ఎంతో ప్రాముఖ్యత ఉంది.పాత నిబంధనలో యెరూషలేము 667 సార్లు, క్రొత్త నిబంధనలో 139 సార్లు ప్రస్తావించబడింది.క్రీ.పూ 1050 లో దావీదు యెరూషలేమును తన రాజధానిగా చేసుకొని ఇశ్రాయేలు దేశాన్ని పాలించాడు.ఆయన తరువాత ఆయన కుమారుడు సొలొమోను రాజుగా ఉన్నప్పుడు యెరూషలేములో కొండ మీద చక్కటి దేవుని మందిరాన్ని ఎంతో వైభవముగా, సౌందర్యముతో నిర్మించాడు. క్రీ.పూ 586 లో బబులోను వారు యూదా రాజ్యాన్ని నాశనం చేశారు.

   యెరూషలేమును తగలబెట్టారు. అక్కడ ఉన్న దేవుని మందిరాన్ని కూడా అగ్నికి ఆహుతి చేశారు.బబులోను చక్రవర్తి నెబుకద్నెజరు వేలాది మంది యూదులను చెర పట్టి తీసుకొని వెళ్ళాడు.బబులోను లో ఉన్నప్పుడే యెహెఙ్కేలు ప్రవక్త ఈ గ్రంథాన్ని వ్రాశాడు.నేను నా ప్రజలను విడిచిపెట్టను, వారిని మరొకసారి యెరూషలేము తీసుకు వెళ్తాను.ఎండిన ఎముకల వలె వారు పడిఉన్నారు.వారికి మళ్ళీ జీవం పోస్తాను. వారు తిరిగి వారి తండ్రి అయిన అబ్రహాముకు నేను వాగ్దానము చేసిన దేశానికి వెళ్తారు.అక్కడ మళ్ళీ స్థిరపడతారు. 

   యెహెఙ్కేలు చెప్పినట్లే యూదులు తిరిగి యెరూషలేము వెళ్లారు. స్థిరపడ్డారు, విస్తరించారు.రెండు వేల సంవత్సరాల క్రితం యేసు ప్రభువు వారి మధ్య జీవించాడు.యెరూషలేము లో ఆయన అనేక అద్భుత కార్యములు చేశాడు. బేతెస్థ చెరువు దగ్గర పక్షవాయువు గలిగిన వ్యక్తిని స్వస్థపరచాడు. సిలోయము కోనేటి దగ్గర గ్రుడ్డి వానికి చూపును ఇచ్చాడు.ఒక గాడిద మీద ఎక్కి యెరూషలేములో ప్రవేశించాడు. హోసన్నా, హోసన్నా కీర్తనలతో వారు ఆయనను మహిమ పరచారు.అక్కడ పస్కా పండుగను ఆచరించాడు.ఆయన సందేశాన్ని, రక్షణ కార్యాన్ని ప్రధాన యాజకులు వారు తిరస్కరించారు. ఆయనను సిలువ వేసి చంపారు. యెరూషలేములో ఆయన సమాధి చేయబడ్డాడు, మూడవ దినమున తిరిగి లేచాడు. యేసు ప్రభువు వారిని హెచ్చరించాడు. ‘రాయి మీద రాయి ఉండకుండా ఈ ఆలయము నిర్మూలించబడుతుంది’ అన్నాడు. 

    క్రీస్తు శకం 70 సంవత్సరములో ఆయన చెప్పిన మాట నెరవేరింది. రోమా సైన్యము వచ్చింది, యెరూషలేము ను నాశనం చేసింది. దేవుని మందిరాన్ని తగుల బెట్టింది.యూదులను చెర పట్టి తీసుకొని వెళ్ళింది.ఈ రోజుకు కూడా యెరూషలేము వెళ్తే హేరోదు ఆలయము నకు చెందిన పెద్ద పెద్ద రాళ్లు అక్కడ మనకు కనిపిస్తాయి.రోమ్ నగరములో కూడా ‘ఆర్చ్ అఫ్ టైటస్’ అక్కడ మనకు కనిపిస్తుంది. యూదులనుఏ విధముగా చెరపట్టి తీసుకొని వెళ్లారో, యెరూషలేము పతనం, దీపస్థంభం దాని మీద మనం చూడవచ్చు.

   యూదుల మీద మేము సాధించిన విజయానికి ఇది చిహ్నము అని రోమన్ చక్రవర్తి డొమిషియన్ దానిని క్రీస్తు శకం 81 సంవత్సరములో నిర్మించాడు. రోమన్ల దెబ్బకు ప్రపంచమంతా యూదులుచెల్లాచెదురు అయిపోయారు.వారి భవిష్యత్తు ఏమిటి? దేవుడు యెహెఙ్కేలు ప్రవక్తకు తెలియజేశాడు.37 అధ్యాయములో మనం చదువుతాము.

ప్రభువైన యెహోవా సెలవిచ్చునదేమనగా ఏయే అన్యజనులలో ఇశ్రాయేలీయులు చెదరిపోయిరో ఆ యా అన్యజనులలో నుండి వారిని రక్షించి, వారు ఎచ్చటెచ్చట ఉన్నారో అచ్చటనుండి వారిని సమకూర్చి వారి స్వదేశములోనికి తోడుకొనివచ్చి 22. వారికమీదట ఎన్నటికిని రెండు జనములుగాను రెండు రాజ్యములుగానుఉండ కుండునట్లు ఆ దేశములో ఇశ్రాయేలీయుల పర్వతముల మీద 23. వారిని ఏకజనముగా చేసి, వారికందరికి ఒక రాజునే నియమించెదను.

                           యెహెఙ్కేలు 37

1948 లో ఆ ప్రవచనం నెరవేరింది. ఇశ్రాయేలు దేశము తిరిగి స్థాపించబడింది.రెండు వేల సంవత్సరముల తరువాత యూదులు తమ దేశానికి తిరిగి వెళ్లారు.ప్రపంచ చరిత్రలోనే అది ఒక గొప్ప అద్భుతము.ఒక ప్రాంతము నుండి రెండు వేల సంవత్సరములు దూరం చేయబడి తిరిగి దానిని పొందిన ఏకైక ప్రజలు యూదులు మాత్రమే.దేవుని యొక్క మహా శక్తి వలన మాత్రమే అది సాధ్యపడింది.  ప్రపంచ చరిత్ర ఎన్నో మలుపులు తిరిగింది. అయినప్పటికీ యెరూషలేము దేవుని సార్వ భౌమాధికారము క్రిందే ఉంది.కీర్తన 76 లో మనం చదువుతాము.

1. యూదాలో దేవుడు ప్రసిద్ధుడు ఇశ్రాయేలులో ఆయన నామము గొప్పది.

2. షాలేములో ఆయన గుడారమున్నది సీయోనులో ఆయన ఆలయమున్నది.

3. అక్కడ వింటి అగ్ని బాణములను కేడెములను కత్తులను యుద్ధాయుధములను ఆయన విరుగగొట్టెను

                          కీర్తన 76

 షాలేములో ఆయన గుడారమున్నది.  సీయోనులో ఆయన ఆలయమున్నది.అక్కడ  ఆయన  తన గుడారము వేసుకొన్నాడు. అంటే ఆయన సన్నిధి ఉంది. అన్య జనులు యెరూషలేము మీద కు వెళ్లారు. ఐగుప్తు వారు, అశూరు వారు, బబులోను వారు, రోమీయులు యెరూషలేము మీద దాడులు చేసిన మాట వాస్తవమే.అది దేవుని అనుమతి ద్వారానే అది సాధ్యపడింది. దేవుని అనుమతి లేకుండా ఎవరూ యెరూషలేము మీద యుద్ధము చేయలేరు.అక్కడ వింటి అగ్ని బాణములను కేడెములను కత్తులను, యుద్ధాయుధములను ఆయన విరుగగొట్టెను బబులోను వారు, రోమీయులు అగ్ని బాణములతో యెరూషలేము మీద విరుచుకు పడ్డారు. నేటి అగ్ని బాణములు మిస్సైలు బాంబులు, అణు బాంబులు… ఎన్నో కోట్ల రెట్లు శక్తి కలిగినవి.ఆధునిక ఇశ్రాయేలు దేశానికి ఐరన్ డోమ్ ఉంది. ఐరన్ డోమ్ అంటే ఏమిటంటే, ఇశ్రాయేలు దేశము మీద ప్రయోగించబడే రాకెట్లు, మిస్సైల్ లను గాలి లోనే ఎదుర్కొని నిర్వీర్యం చేయడం. 2011 సంవత్సరములోఇశ్రాయేలు ఈ వ్యవస్థను నిర్మించింది.అప్పటి నుండి ఈ వ్యవస్థ అనేక దాడులను సమర్ధం గా ఎదుర్కొంది.

    ఇశ్రాయేలు దేశానికి బద్ద శత్రువులుగా ఉన్న దేశాలకు రష్యా దేశం తన టెక్నాలజీ పంపిస్తూ ఉంది. రష్యా దేశం తానే స్వయముగా ఇశ్రాయేలు దేశం మీద దాడి చేస్తే పరిస్థితి ఎలా ఉంటుంది? యెహెఙ్కేలు ప్రవక్త ఆ ప్రశ్నకు సమాధానం ఇస్తున్నాడు. రష్యా దేశం ఇశ్రాయేలు మీదకు యుద్ధానికి వెళ్తుంది అని 2500 సంవత్సరములకు ముందే యెహెఙ్కేలు తెలియజేశాడు. రష్యా దేశం ఎంతో శక్తి కలిగిన దేశం. ఇశ్రాయేలు దేశం కంటే 800 రెట్లు విస్తీర్ణం కలిగిన దేశము. దాని దగ్గర 20 లక్షల మంది సైనికులు ఉన్నారు.ప్రపంచం మొత్తము 14000 అణుబాంబులు ఉంటే, అందులో సగం కంటే ఎక్కువ 6400 ఒక్క రష్యా దగ్గరే ఉన్నాయి. ఇంకా 13000 ట్యాంకులు, 27,100 యుద్ధ వాహనాలు ఉన్నాయి.అంత శక్తివంతమైన దేశాన్ని ఇశ్రాయేలు వంటి బుల్లి దేశం ఎలా ఎదుర్కొనగలదు? రష్యా నాయకత్వములో అనేక దేశాలు ఇశ్రాయేలు మీద దురాక్రమణ కు పాల్పడతాయి అని యెహెఙ్కేలు ప్రవక్త 38 అధ్యాయములో మనకు తెలియజేస్తున్నాడు. రష్యా ఎందుకు ఇశ్రాయేలు మీద దాడి చేస్తుంది? 

11 వచనము చూద్దాము: 

నీవు దురాలోచనచేసి ఇట్లను కొందువు నేను ప్రాకారములులేని గ్రామములుగల దేశముమీదికి పోయెదను, ప్రాకారములును అడ్డగడియలును గవునులునులేని దేశము మీదికి పోయెదను, నిమ్మళముగాను నిర్భయముగాను నివసించువారి మీదికి పోయెదను.

12. వారిని దోచుకొని కొల్లసొమ్ముగా పట్టుకొనుటకై, పూర్వము పాడై మరల నివసింపబడిన స్థలములమీదికి తిరిగి పోయెదను, ఆ యా జనములలో నుండి సమకూర్చబడి, పశువులును సరకులును గలిగి, భూమి నట్టనడుమ నివసించు జనుల మీదికి తిరిగి పోయెదను.       యెహెఙ్కేలు 38 

    రష్యా, దాని మిత్ర దేశాలు చిన్న దేశమైన ఇశ్రాయేలు మీదకు వెళ్తాయి. ఆ దేశాన్ని దోచుకోవటానికి, దానిని నిర్మూలించడానికి రష్యా, దాని మిత్ర దేశాలు ఈ పనిచేస్తాయి.‘వారిని దోచుకొని కొల్లసొమ్ముగా పట్టుకొనుటకై’ ఇశ్రాయేలు దేశం ఎంతో ఐశ్వర్యముతో నిండి ఉంది. వారు ఎన్నో పరిశ్రమలు పెట్టుకొన్నారు, ఎడారి లాంటి ప్రాంతాన్ని పచ్చటి తోటవలె  మార్చారు. అనేక టెక్నాలజీ కంపెనీలు పెట్టారు. సముద్రములోని ఉప్పు నీటిని మంచి నీటిగా  మారుస్తున్నారు. వ్యవసాయ ఉత్పత్తి ని పెంచారు. వాక్సిన్ తయారీలో ముందున్నారు. ఎంతో ఐశ్వర్యం ఆ దేశములో ఉంది. దానిని దోచుకోవడానికి ఈ దేశాలు వెళ్తున్నాయి. ఈ యుద్ధము ఎప్పుడు జరుగుతుంది? 

8 వచనంలో మనం చదువుతాము.ఇశ్రాయేలీయుల పర్వతములమీద నివసించుటకై మరల సమకూర్చబడిన 

జనులయొద్దకును, ఆ యా జనులలోనుండి రప్పించబడి నిర్భయముగా నివసించు జనులందరియొద్దకును నీవు వచ్చెదవు.ఇక్కడ  మీరు గమనిస్తే, ‘ఆ యా జనులలోనుండి రప్పించబడి నిర్భయముగా నివసించు జనులందరి యొద్దకును నీవు వచ్చెదవు’. ఇది 1948 తరువాతే ఇది సాధ్యము ఎందుకంటే ఆ సంవత్సరం తరువాతే యూదులు ఇశ్రాయేలు దేశం ఏర్పరచుకున్నారు. 

“ఇశ్రాయేలీయుల పర్వతములమీద నివ సించుటకై” 1967 లో ఆరు రోజుల యుద్ధం తరువాత పర్వతముల  మీద అధికారం యూదులకు వచ్చింది. అప్పటి నుండి యూదులు ఇశ్రాయేలు పర్వతముల మీద నివసించడం ప్రారంభించారు. 

యెహెఙ్కేలు 36-37

యెహెఙ్కేలు 40-48

యెహెఙ్కేలు 38

 అధ్యాయాల్లో ఇశ్రాయేలు దేశం ఏర్పడుట గురించి యెహెఙ్కేలు ప్రవచించాడు. 40-48 అధ్యాయాల్లో వెయ్యేళ్ళ పాలన గురించి ప్రవచించాడు. మధ్యలో 38 అధ్యాయములో ఈ రష్యా యుద్ధం గురించి వ్రాశాడు. దీనిని బట్టి, 1967 కు వెయ్యేళ్ళ పాలనకు మధ్యలో ఈ యుద్ధం జరుగుతుంది అని మనకు అర్ధ మవుచున్నది. 

“ఆ యా జనులలోనుండి రప్పించబడి నిర్భయముగా నివసించు జనులందరియొద్దకును నీవు వచ్చెదవు.”ప్రస్తుతము యూదులు నిర్భయముగా నివసించే పరిస్థితి లేదు. వారు నిర్భయముగా ఎప్పుడు ఉంటారు? మత్తయి సువార్త 24 అధ్యాయములో యేసు ప్రభువు మనకు ఒలీవల కొండ ప్రసంగములో

అనేక సంగతులు చెప్పాడు.

7. జనముమీదికి జనమును రాజ్యముమీదికి రాజ్యమును లేచును.

8. అక్కడక్కడ కరవులును భూకంపములును కలుగును;ఇవన్నియు వేదనలకు ప్రారంభము.

14. మరియు ఈ రాజ్య సువార్త సకల జనములకు సాక్ష్యార్థమై లోకమందంతటను ప్రకటింపబడును; అటుతరువాత అంతము వచ్చును.

                       

15. కాబట్టి ప్రవక్తయైన దానియేలు ద్వారా చెప్పబడిన నాశనకరమైన హేయవస్తువు పరిశుద్ధస్థలమందు నిలుచుట మీరు చూడగానే చదువువాడు గ్రహించుగాక

                      మత్తయి 24

   ప్రపంచ అంతము లో జరుగబోయే కార్యాల గురించి మన ప్రభువైన యేసు క్రీస్తు ఇక్కడ మనకు తెలియజేస్తున్నాడు. యుద్ధాలు, హింస, అల్లర్లు, కరువులు, భూకంపాలు, రోగాలు ప్రపంచ మంతా విస్తరిస్తాయి. ప్రవక్తయైన దానియేలు ద్వారా చెప్పబడిన నాశనకరమైన హేయవస్తువు పరిశుద్ధస్థలమందు నిలుచుట మీరు చూస్తారు. అంత్య క్రీస్తు ఆ పని చేస్తాడు. యెరూషలేము లో నిర్మించబడి దేవుని ఆలయములో అంత్య క్రీస్తు ఒక హేయవస్తువును ఉంచుతాడు. అంత్య క్రీస్తు 7 సంవత్సరాల పాలనలో కొంత కాలము యూదులతో  శాంతి ఒప్పందం చేసుకొంటాడు. 

దానియేలు గ్రంథం  9:27 లో మనం ఆ సత్యం చదువుతాము.  అతడు ఒక వారమువరకు అనేకులకు నిబంధనను స్థిరపరచును;

   ఒక వారం.. అంటే 7 సంవత్సరములు అంత్య క్రీస్తు యూదులతో ఒప్పందం చేసుకొంటాడు. ఆ సమయములో ఇశ్రాయేలీయులు నిర్భయముగా నివసిస్తారు.అంత్య క్రీస్తు పాలనలో ఈ యుద్ధము జరుగుతుంది అని మనకు అర్ధం అవుతున్నది.ఇంత గొప్ప సైన్యాన్ని ఇశ్రాయేలు దేశం ఎలా ఎదుర్కొంటుంది? బబులోను లో యెహెఙ్కేలు ఈ ప్రవచనం చేసినప్పుడు దానిని వినిన వారు ఎంతో ఆందోళన చెంది ఉంటారు.బబులోను వారు యెరూషలేము వచ్చి రచ్చ రచ్చ చేసి ఎంతో కాలం కాలేదు. 

దేవా, మా దేశాన్ని నీవు రక్షించలేవా? అనే ప్రశ్న వారికి తప్పని సరిగా వస్తుంది.ఇక్కడ దేవుడు ఏమంటున్నాడంటే, ఇక యూదులను వారి దేశములో నుండి ఎవ్వరూ వెళ్లగొట్టలేరు. 18 వచనం చూద్దాము: 

ఆ దినమున, నా కోపము బహుగా రగులుకొనును తెగులు పంపి హత్య కలుగజేసి

అతనిమీదను అతని సైన్యపు వారి మీదను అతనితో కూడిన జనములనేకముల మీదను ప్రళయమైన వానను పెద్ద వడ గండ్లను అగ్నిగంధకములను కురిపించి నేను అతనితో వ్యాజ్యెమాడుదును.

                  యెహెఙ్కేలు 38:18-22

               ఇక్కడ దేవుడు ఒక సూపర్ నాటురల్ వార్ చేస్తున్నాడు. ఇంతకు ముందు ప్రపంచం చూడనటువంటి గొప్ప యుద్ధము అప్పుడు జరుగుతుంది. ప్రళయమైన వాన, పెద్ద వడగండ్లు అగ్ని గంధకములు కురిపిస్తాడు. నిర్గమ కాండములో మనం చూస్తే దేవుడు ఐగుప్తు మీద తన తీర్పులు కుమ్మరించాడు. ఇశ్రాయేలీయులను కాపాడాడు, వారి శత్రువులను శిక్షించాడు. ఇక్కడ కూడా అలాంటిదే జరుగుతుంది. పరలోకములో నుండి తన తీర్పులను కుమ్మరిస్తాడు. ఇశ్రాయేలీయులను కాపాడుచూ వారి శత్రువులను కఠినముగా శిక్షిస్తాడు. మృతుల సంఖ్య ఎలా ఉంటుంది? 39 అధ్యాయము 11,12 వచనాలు చదువుదాము.

ఆ దినమున గోగువారిని పాతిపెట్టుటకై సముద్రమునకు తూర్పుగా ప్రయాణస్థులుపోవు లోయలో ఇశ్రాయేలు దేశమున నేనొక స్థలము ఏర్పరచెదను.దేశమును పవిత్రపరచుచు ఇశ్రాయేలీయులు ఏడు నెలలు వారిని పాతిపెట్టుచుందురు.

           యెహెఙ్కేలు 39:11,12

  పాతి పెట్టడానికి  కూడా స్థలము లేదు. మృతులను పాతిపెట్టడానికే ఇశ్రాయేలీయులకు 7 నెలలు పట్టింది. ప్రపంచమంతా మైండ్ బ్లాక్ అయి కళ్లప్పగించి చూసే గొప్ప విజయాన్ని దేవుడు ఇశ్రాయేలు దేశానికి ఆ రోజు ఇస్తాడు.

నేను యెహోవానై యున్నానని 

అన్యజనులు అనేకులు తెలిసి కొనునట్లు 

నేను ఘనత వహించి నన్ను 

పరిశుద్ధపరచుకొని వారి యెదుట 

నన్ను తెలియపరచుకొందును.

                     యెహెఙ్కేలు 38:23 

   నిజముగా ఈయన ఎంత గొప్ప దేవుడు. రష్యా లాంటి ప్రపంచ శక్తి, తన మిత్ర దేశాలతో కలిసి వెళ్లి ఇశ్రాయేలు దేశము మీద దాడి చేస్తే, ఆ చిన్న దేశాన్ని తన ఆశ్చర్య కరమైన శక్తితో ఈ దేవుడు రక్షించాడు అని ప్రపంచ ప్రజలందరూ దేవుని మహిమపరుస్తారు. యెహెఙ్కేలు 38-39 అధ్యాయాల్లో మనం గ్రహించే సత్యం అదే. దేవుడు తన ప్రజలను ఎప్పుడూ విడిచి పెట్టడు.విపత్కర సమయాల్లో కూడా ఆయన వారిని రక్షిస్తాడు.

  ఈ రోజు మన ప్రపంచములో ఎటు చూసినా ఎంతో అనిశ్చితి మనకు కనిపిస్తున్నది. ఏ రోజు ఏ దుర్వార్త వినాలో అనే భయాందోళన అన్ని ప్రాంతాల్లో ఉంది. తీవ్రవాదులు చాలా చోట్ల రక్తపాతాన్ని సృష్టిస్తున్నారు. క్రైస్తవులకు అనేక చోట్ల శ్రమలు కలుగుతున్నాయి. కరోనా లాంటి అంటు వ్యాధులు ప్రపంచాన్ని పీడిస్తున్నాయి.కరోనా తో బయటపడితే, వైట్ ఫంగస్ అని, బ్లాక్ ఫంగస్ అని క్రొత్త రోగాలు అంటుకొంటున్నాయి.అనేక మంది కుటుంబ సభ్యులను కోల్పోతున్నారు.వందల మంది పాస్టర్లు చనిపోయారు.హాస్పిటల్ లో బెడ్ దొరకక అనేక మంది ఇబ్బందులు పడుతున్నారు.ఆక్సిజన్ సిలిండర్ దొరకక రోగులు ఇబ్బంది పడుతున్నారు.వెంటిలేటర్లు లేవు, వాక్సిన్ లు లేవు.ఎంతో మంది ఉద్యోగాలు కోల్పోయారు, హాస్పిటల్ బిల్లులు చెల్లించలేక ఆస్తి పాస్తులు అమ్ముకున్న వారిని నేను చూశాను. ఆందోళన తట్టుకోలేక అనేక మంది మానసిక రోగాలకు గురిఅవుతున్నారు.ఆత్మ హత్యలు చేసుకొంటున్నారు. నదుల్లో వందల మంది శవాలు తెలియాడుతున్నాయి. ఇలాంటి పరిస్థితుల్లో మనకు నిరీక్షణ ఎలా కలుగుతుంది? ఇలాంటి చీకటి రోజుల్లో కూడా మనం దేవుని యందు నిరీక్షణ ఉంచవచ్చు. హెబ్రీ 13:8 లో మనం చదువుతాము: 

 Jesus Christ is the same yesterday, and today, and for ever.

యేసుక్రీస్తు నిన్న, నేడు, ఒక్కటేరీతిగా ఉన్నాడు; అవును యుగయుగములకును

ఒక్కటే రీతిగా ఉండును. 

                    హెబ్రీ 13:8

ప్రభువైన యేసు క్రీస్తు నిన్న, నేడు, ఎల్లప్పుడూ ఒక్కటే రీతిగా ఉండే దేవుడు. యుగయుగములకు మార్పు లేని దేవుడు. అలాంటి దేవుడు చేతిని పట్టుకొని మిమ్ములను నడిపిస్తూ ఉన్నాడు. మీరు దేనిని చూసి భయపడవలసిన అవసరం లేదు.