
బైబిల్ లో ఉన్న 66 పుస్తకాలు మనం ధ్యానం చేస్తున్నాము. ఈ రోజు యోవేలు ప్రవక్త గ్రంథం మనం చూద్దాము. ఇంతకు ముందు ధ్యానించిన పుస్తకాలు మీరు మిస్ అయితే, మా యూ ట్యూబ్ ఛానల్ కి వెళ్లి ఆ వీడియో సందేశాలు చూడండి. ఈ రోజు యోవేలు గ్రంథము లో నుండి కొన్ని సత్యాలు మనం చూద్దాము. ఈ బైబిల్ లో యోవేలు గ్రంథం 2 అధ్యాయం చూడండి.
11 యెహోవా తన సైన్యమును నడిపించుచు ఉరుమువలె గర్జించుచున్నాడు ఆయన దండు బహు గొప్పదైయున్నది ఆయన ఆజ్ఞను నెరవేర్చునది బలముగలది యెహోవా దినము బహు భయంకరము, దానికి తాళ గలవాడెవడు?12 ఇప్పుడైనను మీరు ఉపవాసముండి కన్నీరు విడుచుచు దుఃఖించుచు మనఃపూర్వకముగా తిరిగి నాయొద్దకు రండి. ఇదే యెహోవా వాక్కు. 13 మీ దేవుడైన యెహోవా కరుణావాత్సల్యములుగల వాడును,శాంతమూర్తియు అత్యంతకృపగలవాడునైయుండి, తాను చేయనుద్దేశించిన కీడును చేయక పశ్చాత్తాపపడును గనుక మీ వస్త్రములను కాక మీ హృదయములను చింపుకొని ఆయనతట్టు తిరుగుడి. యోవేలు గ్రంథం 2 అధ్యాయం
ప్రవక్త అయిన యోవేలు ద్వారా దేవుడు ఇక్కడ మనతో మాట్లాడుతున్నాడు. ఈ ప్రవక్త ఎవరు? ఎప్పుడు జీవించాడు? ఎక్కడ జీవించాడు? ఎవరి మధ్య జీవించాడు? అనే ప్రశ్నలు మీకు రావచ్చు. ‘పాత నిబంధన ప్రవక్తలు’ అనే చార్ట్ నేను తయారు చేశాను. ఈ చార్ట్ చూడండి. ఏ ప్రవక్త ఎప్పుడు, ఎక్కడ జీవించాడో ఈ చార్ట్ లో మనకు కనిపిస్తుంది. ఈ చార్ట్ కావలసిన వారు మా వెబ్ సైట్ www.doctorpaul.org కి వెళ్లి డౌన్ లోడ్ చేసుకోండి. ఈ చార్ట్ లో చూస్తే యోవేలు ప్రవక్త క్రీ.పూ 835 – 796 సంవత్సరముల మధ్య యూదా ప్రజల మధ్య జీవించాడు. ఇశ్రాయేలు ప్రజలు రెండు దేశాలుగా విడిపోయారు. ఉత్తర దేశం ఇశ్రాయేలు దేశం, దక్షిణ దేశం యూదా దేశం.
యోవేలు ప్రవక్త ఈ దక్షిణ దేశములో యూదా ప్రజల మధ్య జీవించాడు. ఈ గ్రంథములో 3 అధ్యాయాలు ఉన్నాయి. ఈ పుస్తకములో ముఖ్య అంశం ‘యెహోవా దినం’ the Day of the Lord ఇంతకు ముందు మనం చూశాము: ‘యెహోవా దినము బహు భయంకరము, దానికి తాళ గలవాడెవడు?’
యెహోవా దినం బహు భయంకరమైనది, దానిని తట్టుకొనే శక్తి మీకు ఉందా? దేశం పరిస్థితి ఎలా ఉంది? ప్రవక్త మొదటి అధ్యాయములో ప్రజలతో ఒక మాట అన్నాడు:
4 గొంగళిపురుగులు విడిచినదానిని మిడుతలు తినివేసి యున్నవి. మిడుతలు విడిచినదానిని పసరుపురుగులు తినివేసి యున్నవి.పసరుపురుగులు విడిచిన దానిని చీడపురుగులు తినివేసి యున్నవి.
5 మత్తులారా, మేలుకొని కన్నీరు విడువుడి ద్రాక్షారసపానము చేయువారలారా, రోదనము చేయుడి.క్రొత్త ద్రాక్షారసము మీ నోటికి రాకుండ నాశ మాయెను
ఇశ్రాయేలు దేశం మొత్తం ప్రకృతి భీభత్సం లో చిక్కుకొంది. గొంగళి పురుగులు, మిడుతలు, పసరు పురుగులు, చీడ పురుగులు పంటలను తినివేస్తున్నాయి. ఈ రోజు కరోనా వైరస్ ప్రపంచాన్ని కప్పింది, జన జీవితాన్ని అతలాకుతలం చేసింది. ఆర్ధిక వ్యవస్థను చిన్నాభిన్నం చేసింది. పంటలకు సరైన రాబడి లేకుండా చేసింది. ఈ ప్రకృతి వైపరీత్యాలలో దేవుడు మనతో మాట్లాడుతున్నాడు. యోవేలు ప్రవక్త ఇశ్రాయేలు వారితో చెప్పాడు: మత్తులారా, మేలుకొని కన్నీరు విడువుడి. ప్రజలు మద్యపానం చేసి మత్తులో ఉన్నారు. వారి చుట్టూ ఏమి జరుగుతున్నదో గ్రహించలేని స్థితిలో ఉన్నారు. ద్రాక్షారస పానము చేయువారలారా, రోదనము చేయుడి.నువ్వు చేయాల్సింది మద్యం తాగటం కాదు రోదన చేయి, కాసేపు ఏడువు. నీ పాపములను బట్టి కన్నీరు పెట్టు. క్రొత్త ద్రాక్షారసము మీ నోటికి రాకుండ నాశన మాయెను
ప్రకృతి భీభత్సం చాలా తీవ్రముగా వచ్చింది, ద్రాక్షా కాయలు కూడా పండని పరిస్థితి వచ్చింది. ఈ పరిస్థితిలో మీరు ఏమి చేస్తున్నారు? 2 అధ్యాయములో మనం ఇంతకు ముందు చూసాము. ప్రవక్త ఏమన్నాడు? ఇప్పుడైనను మీరు ఉపవాసముండి కన్నీరు విడుచుచు దుఃఖించుచు మనఃపూర్వకముగా తిరిగి నాయొద్దకు రండి.మీ దేవుడైన యెహోవా కరుణా వాత్సల్యములుగల వాడును,శాంతమూర్తియు అత్యంత కృపగలవాడునైయుండి, తాను చేయనుద్దేశించిన కీడును చేయక పశ్చాత్తాపపడును గనుక మీ వస్త్రములను కాక మీ హృదయములను చింపుకొని ఆయనతట్టు తిరుగుడి. మనలను క్షమించటానికి సిద్ధముగా ఉన్న దేవుడు, కరుణా వాత్సల్యములుగల దేవుడు, శాంతమూర్తియు అయిన దేవుడు అత్యంత కృప గలిగిన దేవుడు మన కొరకు వేచి ఉన్నాడు. మత్తులారా, మేలు కొండి. దేవుని వైపు చూడండి. ఈ రోజు మన ప్రపంచములో కూడా మనం అటువంటి పరిస్థితే చూస్తున్నాము. మన ప్రపంచ ప్రజలు మత్తులో ఉన్నారు. ప్రొద్దునే 6 గంటల కల్లా వెళ్లి బార్ ల ముందు, మద్యం దుకాణాల ముందు నిలబడుతున్నారు. మాకు మందు లేదు, మాకు మందు పోసేది ఎవరు? మద్యం దొరికితే చాలు, వేరే విషయాలు మాకు పట్టవు అని కొంతమంది అంటున్నారు. ఒక సారి ఒక వ్యక్తిని నేను అడిగాను: రక్షణ పొందావా? యేసు ప్రభువును నమ్ముకొన్నావా? అతడు నాతో మాట్లాడుతున్నప్పుడు, అతని నోటిలో నుండి మద్యం వాసన వస్తున్నది. ‘నాకు ఈ మందు బాటిల్ చాలండి. నేనింకా ఏ విషయం పట్టించుకోను’ అని ఆయన నాతో అన్నాడు. మద్యం మత్తులో కూరుకుపోయి అతను తన ఆత్మ గురించి ఆలోచించ లేని స్థితిలో ఉన్నాడు. తమ చుట్టూ జరుగుతున్న సంఘటనలు వారిని కదిపించలేక పోతున్నాయి.
కరోనా భీభత్సం మనం చూశాము. లక్షల మంది ప్రాణాలు కోల్పోవటం మనం చూశాం. హాస్పిటల్ లో స్థలము లేని పరిస్థితి మనం చూశాం. ఆక్సిజన్ సీలిండర్ లు లేక ప్రజలు గగ్గోలు పెట్టడం చూశాం. కర్ఫ్యూ లు పెట్టడం చూశాం. శ్మశాన వాటికలు నిండిపోవడం మనం చూసాము. గంగా నది శవములతో నిండిపోవడం మనం చూశాము. మన జీవితములో ఎప్పుడూ ఊహించని దృశ్యాలు మనం చూశాము. ప్రవక్త మనతో ఏమంటున్నాడంటే, మత్తులారా, మేలుకొని, కన్నీరు విడువుడి. ఎందుకని. 15 వచనంలో చెబుతున్నాడు.
15 ఆహా, యెహోవా దినము వచ్చెనే అది ఎంత భయంకరమైన దినము! అది ప్రళయమువలెనే సర్వశక్తునియొద్దనుండి వచ్చును.
యోవేలు గ్రంథం 1 అధ్యాయం
యెహోవా దినము అది భయంకరమైన దినము. అది ప్రళయం వలె ఈ ప్రపంచం మీదకు దిగి వస్తుంది. హిరానిమస్ బాస్చ్ గొప్ప చిత్రకారుడు. 1450 – 1516 సంవత్సరముల మధ్య ఆయన జీవించాడు. నెదర్లాండ్స్ దేశములో ఆయన జన్మించాడు. ఆయన గొప్ప చిత్రాలు గీచాడు. ప్రసిద్ధ మ్యూసియం లకు వెళ్లి మనం ఈ రోజుకూ ఆయన గీసిన చిత్రాలు చూడవచ్చు. 1516 లో ఆయన haywain హే వెయిన్ అనే చిత్రం గీశాడు. అందులో మూడు భాగాలు ఉంటాయి. మొదటి భాగములో దేవుడు పరలోకములో నుండి దేవదూతలను వెళ్లగొట్టడం మనం చూస్తాము. ఆ దేవదూతలు దేవుని మీద తిరుగుబాటు చేసిన తరువాత దెయ్యాలు గా మారారు. ఆ దెయ్యాలను బాస్చ్ పురుగులుగా చూపించాడు. ఆ పురుగులు ఈ ప్రపంచం మీద దండెత్తినట్లుగా చూపించాడు. మధ్య భాగములో దేవుడు ఆదాము, హవ్వలను సృష్టించుట మనం చూస్తాము. ఆ తరువాత సాతాను వారి దగ్గరకు వెళ్లి వారికి మాయ మాటలు చెప్పి, వారిని మోసం చేస్తాడు. ఆ తరువాత వారు ఏదెను వనములో నుండి వెళ్ళగొడబడతారు.
రెండవ భాగములో ప్రస్తుత ప్రపంచాన్ని చూపించాడు. పైన పరలోకములో నుండి యేసు ప్రభువు క్రిందకు చూస్తున్నాడు. క్రింద ఒక్క దేవదూత మాత్రమే పైకి చూస్తున్నాడు. మిగిలిన వారందరూ ఎవరి గొడవలో వారు మునిగిపోయి ఉన్నారు. గడ్డిని మోసుకెళ్తున్న పెద్ద బండి అక్కడ మనకు కనిపిస్తుంది. అక్కడ ఉన్న వారందరూ ఆ గడ్డిని పీక్కోవటం మనం చూస్తాము. నేనెంత గడ్డి ని పోగుచేసుకొన్నాను, నువ్వెంత గడ్డి పోగుచేసుకొన్నావు అని వారు మాట్లాడుకొంటున్నారు. పరలోకములో నుండి క్రిందకు చూస్తున్న క్రీస్తు ను ఎవరూ పట్టించుకోవడం లేదు. వారి దృష్టి మొత్తం గడ్డి మీదే ఉంది. గడ్డి లాంటి తాత్కాలికమైన, అశాశ్వతమైన వాటి కోసం మనం మన జీవితాన్ని వ్యర్థం చేసుకొంటాము అనే సందేశాన్ని బాస్చ్ ఆ చిత్రములో మనకు చెబుతున్నాడు. కొంతమంది వ్యాపారాల్లో ముగిపోయారు. కొంతమంది వ్యభిచారంలో వున్నారు. కొంతమంది హింస, రక్త పాతములో ఉన్నారు. మత వ్యవస్థ కూడా పాడై పోయినట్లుగా బాస్చ్ ఆ చిత్రములో చూపించాడు. ఒక బిషప్ గారిని, ఆయన చుట్టూ కొంతమంది నన్స్ అంటే సన్యాసినులు. ఆ సన్యాసినులు గడ్డి ని పోగుచేసుకొంటూ కనిపిస్తారు. పాస్టర్ గారు అక్కడ కూర్చుని మద్యం త్రాగుతున్నాడు. అంటే క్రీస్తును పట్టించుకోకుండా పాస్టర్ గారితో సహా అందరూ మత్తులో ఉన్నట్లుగా బాస్చ్ ఆ చిత్రములో చూపించాడు.
మూడో భాగములో కుడి ప్రక్కన నరకము చూపించాడు. మధ్య భాగములో కనిపిస్తున్న వారందరూ నరకములో కి ఈడ్చుకొని వెళ్ళిపోతున్నట్లుగా చూపించాడు. యోవేలు ప్రవక్త మనకు ఇచ్చిన సందేశం కూడా అదే. పురుగుల దండు, మిడతల దండు ప్రపంచాన్ని చుట్టుముట్టింది. ఇది ప్రకృతి సంబంధమైనదే కాదు. ఆత్మ సంబంధ మైనది. సాతాను, దెయ్యాలు సమస్త వ్యవస్థలను చెద పురుగుల వలె భ్రష్ఠు పట్టించారు. అందరూ చేతికందినంత గడ్డి పోగుచేసుకొంటున్నారు. మత్తులారా, మేలుకొని కన్నీరు విడువుడి అన్నాడు.
యోవేలు ప్రవక్త దుర్వార్త తో పాటు, సువార్త కూడా మనకు చెబుతున్నాడు. 2 అధ్యాయం 29,30 వచనాలు చూద్దాము:
29 ఆ దినములలో నేను పనివారి మీదను పనికత్తెలమీదను నా ఆత్మను కుమ్మరింతును.
30 మరియు ఆకాశమందును భూమియందును మహత్కార్యములను, అనగా రక్తమును అగ్నిని ధూమ స్తంభములను కనుపరచెదను
పరిశుద్ధాత్ముడు ఈ ప్రపంచము మీదకు దిగి వస్తాడు అని యోవేలు ప్రవక్త ఇక్కడ ప్రవచించాడు. క్రొత్త నిబంధనలో ఆ ప్రవచనం నెరవేరింది. యేసు ప్రభువు తన శిష్యులకు వాగ్దానం చేసాడు. యోహాను సువార్త 14:16 లో మనం చదువుతాము:
మీయొద్ద ఎల్లప్పుడు నుండుటకై ఆయన వేరొక ఆదరణకర్తను,అనగా సత్యస్వరూపియగు ఆత్మను మీకనుగ్రహించును.
యోహాను సువార్త 14:16
మన యొద్ద ఎల్లప్పుడూ ఉండుటకై పరలోకం నుండి వచ్చిన ఆదరణ కర్త పరిశుద్ధాత్మ దేవుడు. పెంతెకోస్తు పండుగ రోజున పరిశుద్ధాత్ముడు యెరూషలేము లో క్రైస్తవ సంఘము మీదకు దిగివచ్చాడు. అందుకనే ఆ రోజు పేతురు గారు తాను చేసిన ప్రసంగములో యోవేలు ప్రవచనం గుర్తుచేసుకున్నాడు. అపోస్తలుల కార్యములు రెండో అధ్యాయం చూస్తే అక్కడ ఆ విషయాలు మనకు కనిపిస్తాయి.
15 మీరు ఊహించునట్టు వీరు మత్తులు కారు, ప్రొద్దుబొడిచి జామయిన కాలేదు.
16 యోవేలు ప్రవక్త ద్వారా చెప్పబడిన సంగతి యిదే, ఏమనగా
17 అంత్య దినములయందు నేను మనుష్యులందరి మీద నా ఆత్మను కుమ్మరించెదను
అపోస్తలుల కార్యములు 2
పరలోకములో నుండి పరిశుద్ధాత్ముడు దిగి వచ్చినప్పుడు వారందరూ ఉత్తేజముతో ఊగిపోయారు. అక్కడ ఉన్న అవిశ్వాసులు వారిని ఎగతాళి చేశారు. ‘వీరందరూ క్రొత్త మద్యం త్రాగారు. ఆ మత్తులో ఉండి పిచ్చి, పిచ్చిగా మాట్లాడుతున్నారు’ పేతురు వారితో అన్నాడు: ఈ ప్రజలు మీరనుకొంటున్నట్లు మద్యం త్రాగలేదు, వారు మత్తులో లేరు, వారు పరిశుద్ధాత్మ తో నింపబడ్డారు. పరిశుద్ధాత్మ గురించి యోవేలు చేసిన ప్రవచనం ఈ రోజు నెరవేరింది అని వారికి చెప్పాడు. మతం మత్తులో, మానవ సంప్రదాయాల్లో మునిగిపోయింది వారు, వీరు కాదు. నాడు యోవేలు ప్రవక్త యెరూషలేములో నిలబడి ప్రజలకు చెప్పిన మాటలే, తరువాత పేతురు యెరూషలేము వాసులకు చెప్పాడు. మత్తులారా, మేల్కొనండి.
పరిశుద్ధాత్ముడు మీకు కావాలి. యెహోవా దినం మీ మీదకు రాక మునుపు మీరు రక్షణ పొందండి. ఇది యేసు క్రీస్తు దినం, రక్షణ దినం (ఫిలిప్పి 1:4,10; 1 కొరింథీ 1:8). యేసు క్రీస్తు దినము వేరు, యెహోవా దినం వేరు.
8 మన ప్రభువైన యేసుక్రీస్తు దినమందు మీరు నిరపరాధులై యుండునట్లు అంతమువరకు ఆయన మిమ్మును స్థిరపర చును.
1 కొరింథీ 1:8
మన ప్రభువైన యేసు క్రీస్తు దినం అనే వాక్యం ఇక్కడ మనం చూస్తున్నాము. The Day of our Lord Jesus Christ
అది ఆయన ప్రత్యక్షం కాబోయే గొప్ప రోజు
అది దేవుని మహిమతో నిండిన రోజు
అది మనం నిరీక్షణతో ఎదురు చూసే రోజు
అది మనం ఎత్తబడే రోజు
అది మనం ప్రభువైన యేసు క్రీస్తును చూసే రోజు
అది మన రక్షణ దినం
క్లుప్తముగా చెప్పుకోవాలంటే, మూడు రోజులు
మనిషి దినం (the Day of man)
యేసు క్రీస్తు దినం (the Day of Jesus Christ)
యెహోవా దినం (the Day of the Lord) ఉన్నాయి.
ప్రస్తుతము మనిషి దినములో మనం ఉన్నాము. దేవుడు మాకు అవసరం లేదు, మేమే ఈ ప్రపంచాన్ని బాగుచేసుకొంటాము. అని మనిషి ఈ రోజున భావిస్తున్నాడు. అయితే ఈ ‘మనిషి దినము’ లో ఎలాంటి నిరీక్షణ లేదు. చైనా దేశములో ఈ వారం కమ్యూనిస్ట్ పార్టీ 100 సంవత్సరాల వేడుకలు నిర్వహించుకొంది. ‘దేవుడు లేడు’ అనే నాస్తిక వాదం పునాదిగా ఆ పార్టీ ఏర్పడింది. ఆ దేశములో నుండి క్రైస్తవ్యాన్ని నిర్మూలించాలి అని ఆ పార్టీ నాయకులు నడుం బిగించారు. ఈ వేడుకల్లో చైనా అధ్యక్షుడు ఛీ జిన్ పింగ్ మాట్లాడుతూ, కరోనా బాధితుల పట్ల ఒక్క మాట కూడా సానుభూతితో చెప్పలేదు.
ఈ ప్రపంచం మీదకు కరోనా వ్యాపించటానికి మన నిర్లక్ష్య ధోరణి కారణం అయ్యింది అని వారు పశ్చాత్తాప పడకపోగా, మా అధికారానికి అడ్డొస్తే, తలకాయలు పగిలిపోతాయి అని బెదిరించాడు. దేవుని వాక్యాన్ని పట్టించు కోకుండా, మనిషి ప్రదర్శించే అహంకార ధోరణి మనకు అన్ని వైపులా కనిపిస్తుంది. అందుకనే మనం దీనిని ‘మనిషి దినం’ అని పిలుస్తున్నాము. ‘మనిషి దినం’ The Day of Man. తరువాత వచ్చేది యేసు క్రీస్తు దినం (the Day of Jesus Christ) మన ప్రభువైన యేసు క్రీస్తు తన గొప్ప మహిమతో ఈ ప్రపంచానికి తిరిగి వచ్చే గొప్ప దినం. విశ్వాసులు అందరూ ఎత్తబడే దినం. ఆ రోజు మీరు ఎత్తబడాలంటే మీరు రక్షణ పొంది, యేసు క్రీస్తు సువార్త ను అంగీకరించి ఉండాలి. యేసు క్రీస్తు దినం రక్షణ పొందిన వారికే. రక్షణ పొందని వారికి అందులో భాగం ఉండదు.
మూడో దినము: యెహోవా దినం (the Day of the Lord). అది ఉగ్రత దినము. దేవుని ఉగ్రత ఈ ప్రపంచం మీదకు దిగివచ్చే దినం. యోవేలు ప్రవక్త స్పష్టముగా వ్రాశాడు.
31 యెహోవాయొక్క భయంకరమైన ఆ మహాదినము రాకముందు సూర్యుడు తేజో హీనుడగును, చంద్రుడు రక్తవర్ణమగును.
యోవేలు 2:31
సూర్యుడు తన తేజాన్ని కోల్పోతాడు, చంద్రుడు రక్త వర్ణముగా మారుతాడు. అంటే ఆ దినం ఎంత భయంకరముగా ఉంటుందో మనం కొంతవరకు ఊహించవచ్చు. మత్తయి సువార్త 24 అధ్యాయములో ఆ రోజు ఎలా ఉంటుందో యేసు ప్రభువు మనకు వివరించాడు.
21 లోకారంభము నుండి ఇప్పటివరకును అట్టి శ్రమ కలుగలేదు,ఇక ఎప్పుడును కలుగబోదు.
22 ఆ దినములు తక్కువ చేయబడక పోయిన యెడల ఏ శరీరియు తప్పించుకొనడు.
మత్తయి సువార్త 24
లోకం పుట్టిన నాట నుండి నేటి వరకు అలాంటి శ్రమలు కలుగ లేదు, ఆ దినములు తక్కువ చేయబడక పోయిన యెడల ఒక్కడు కూడా తప్పించుకోలేడు అని యేసు ప్రభువు అంటున్నాడు. యేసు ప్రభువు చెప్పిన మాటలను కూడా పట్టించుకోని పరిస్థితి లో ఈ రోజు చాలా మంది ఉన్నారు.
ఆకాశమును భూమియు గతించును గాని నా మాటలు ఏ మాత్రమును గతింపవు.
మత్తయి సువార్త 24:35
ఆకాశం, భూమి వాటి కంటే యేసు ప్రభువు మాట శక్తి కలిగినది. ఆయన మాటలు మనం నమ్మాలి. యోవేలు గ్రంథము నుండి ఈ రోజు మనం భయంకరమైన యెహోవా దినం అనే అంశం గురించి చూశాము. ఆ రోజు దేవుని తీర్పు ఈ ప్రపంచం మీద కుమ్మరించబడబోయే దినము. దానిని మీరు తప్పించుకోవాలంటే మీరు వెంటనే యేసు క్రీస్తును మీ రక్షకునిగా అంగీకరించాలి. పాప క్షమాపణ పొందాలి. ఆయన రక్తం చేత కడుగబడాలి. అదే నేటి మా ప్రేమ సందేశం.