సమ్సోను దెలీలా అనే స్త్రీని మోహించాడు. ఆమె అతని జీవితమును నాశనం చేయబోతున్నది. ఎందుకంటే దెలీలాకు సమ్సోను పట్ల ఎలాంటి ప్రేమ లేదు. ఫిలిష్తీయులు దెలీలా ను అడిగారు:
‘నీకు కావలసినంత డబ్బు ముట్టజెప్పుతాము. వాణ్ని మాకు అప్పజెప్పు’ ఏ మాత్రం సంకోచించకుండా దెలీలా సమ్సోను తల మీద బేరం పెట్టింది, అతని ప్రాణము ఖరీదు ఎంతో నిర్ణయించింది.
సమ్సోను ను లాలించింది. నీ శక్తి యొక్క రహస్యము ఏమిటో చెప్పు అంది.నన్ను ఏడు నిరవంజి చువ్వల చేత బంధిస్తే ఓడిపోతాను అని సమ్సోను చెప్పాడు. ఫిలిష్తీయులు అతని బంధించినప్పుడు సమ్సోను ఆ చువ్వలను తెంపివేశాడు. నన్నెందుకు ఎగతాళి చేస్తున్నావు? నీ శక్తి రహస్యం చెప్పు అని అడిగింది.నన్ను క్రొత్త త్రాళ్లతో బంధిస్తే నేను ఓడిపోతాను అని సమ్సోను దెలీలాకు చెప్పాడు.
ఫిలిష్తీయులు సమ్సోనును బలమైన త్రాళ్లతో బంధించారు. సమ్సోను వాటిని కూడా త్రెంచివేశాడు.దెలీలా రెండవసారి భంగపడింది. నన్నెందుకు మోసం చేస్తున్నావు? నీ శక్తి రహస్యం చెప్పు అని సమ్సోనును నిలదీసింది. నా తల మీద ఉన్న ఏడు జడలను అల్లితే నేను ఓడిపోతాను అని సమ్సోను ఆమెకు చెప్పాడు. ఫిలిష్తీయులు వచ్చి సమ్సోను నిద్రిస్తున్నప్పుడు అతని జాడలు అల్లి వాటిని మేకుతో నేలకు దిగగొట్టారు. ఫిలిష్తీయులు అతని మీద అప్పుడు దాడి చేశారు. అప్పుడు కూడా సమ్సోను సునాయాసముగా తప్పించుకొని వెళ్ళిపోయాడు.
దెలీలాకు చిర్రెక్కింది. సమ్సోను మీద అరిచింది: ‘3 సార్లు నాకు నువ్వు అబద్ధాలు చెప్పావు. నన్ను ప్రేమిస్తున్నావు అని చెబుతావు. ఇదేనా నీకు నా మీద ఉన్న ప్రేమ? నన్నెందుకు మోసం చేస్తున్నావు? అని సమ్సోను ను ప్రశ్నించింది. సమ్సోను ఆమెను అడగలేకపోయాడు.‘నేను నిన్ను మోసము చేస్తున్నానా? లేక నువ్వు నన్ను మోసం చేస్తున్నావా? నువ్వు నన్ను నా శత్రువులకు అప్పగిస్తున్నావు అది మోసం కాదా? అది ద్రోహంకాదా? అని దెలీలాను గద్దించలేకపోయాడు.పాపములో మెడ దాకా మునిగిపోయినప్పుడు మనము కూడా సమ్సోను వలె ఒకలాంటి మైకము లోకి వెళ్ళిపోతాము. మన డబ్బులు గుల్ల అవుతాయి. మన ఆరోగ్యము దెబ్బతినుతుంది, మన కుటుంబము ఛిద్రమవుతుంది, మనకు ప్రాణాపాయము కూడా కలుగుతుంది.
అయితే ఆ మోహము యొక్క మైకము వల్ల మనము జరుగుతున్న మోసము పసిగట్టలేము. దెలీలాతో విసిగిపోయి సమ్సోను చివరికి ఆమెకు తన శక్తి రహస్యము చెప్పి వేశాడు. నేను దేవుని చేత ఎన్నుకోబడినవాడిని, నాజీరు చేయబడినవాడిని, నా బలము నా జుట్టులో ఉంది.అన్నాడు.
ఆ మాటలు విని దెలీలా నవ్వుకొంది. నా చేతికి బాగా చిక్కావు అనుకొంది. సమ్సోనును తన ఒడిలో పెట్టుకొని అతని తలకు క్షవరం చేయించింది. దేవుని శక్తి అప్పుడు సమ్సోనును వదలి వెళ్ళిపోయింది. ఫిలిష్తీయులువచ్చి అతని మీద పడ్డారు. సమ్సోను ఎప్పటిలాగే వారిని ప్రతిఘటించాడు.అయితే వారి దెబ్బకు మట్టికరచాడు.
20 వ వచనము:
అయితే యెహోవా తనను ఎడబాసెనని అతనికి తెలియలేదు.
ఎంత విచారకమైన మాటలు! దెలీలా మోహములో పడిపోయి, సమ్సోను దేవుని పనిని మరచిపోయాడు.దేవుడు ఆయనను వదలిపెట్టి వెళ్లాల్సి వచ్చింది, ఎందుకంటే ఆయన దేవుని చిత్తములో నుండి తొలగిపోయాడు. దెలీలా అందచందాలకు ముగ్దుడైదేవుని ప్రణాళిక మరచిపోయాడు. దెలీలా ను చూసినప్పుడు, సమ్సోను ఆమెను కొన్ని ప్రశ్నలు అడిగితే బాగుండేది. ‘దెలీలా, నీ బ్యాక్ గ్రౌండ్ ఏమిటి? నీకు దేవుని మీద భక్తి ఉందా? యెహోవా దేవుని నమ్ముతావా? ధర్మ శాస్త్రము చదువుతావా? ఆ ప్రశ్నలు అడగకుండా, ఈమె నా కంటికి నచ్చింది చాలు అని ఆమె మైకములోకి వెళ్ళిపోయాడు.
అదే సమ్సోను పతనానికి దారి తీసింది. ఈ రోజు చాలామంది క్రైస్తవులు చేసే తప్పు కూడా అదే. సమ్సోను వలె వారు చూపులకే ప్రాధాన్యము ఇస్తున్నారు. ‘నీ బ్యాక్ గ్రౌండ్ ఏమిటి? యేసు ప్రభువును నమ్ము కున్నావా? రక్షణ పొందావా? బైబిల్ చదువుకుంటావా? ప్రార్ధన చేసుకొంటావా? ఆదివారము మందిరానికి వెళ్తావా?’ ఆ ప్రశ్నలు అడగరు. ఈ అమ్మాయి నా కంటికి నచ్చింది చాలు, ఈ అబ్బాయి నా కంటికి నచ్చాడు చాలు అని అనుకొంటున్నారు. వారి అంతము కూడా సమ్సోను లాగానే ఉంటుంది. ఈ రోజు ఫిల్మ్ ఇండస్ట్రీ లో చూడండి. డైరెక్టర్లు, ప్రొడ్యూసర్స్, హీరోలు, హీరోయిన్లు, మ్యూజిక్ డైరెక్టర్లు, ఫైట్ మాస్టర్లు, రచయితలు.. క్రైస్తవ కుటుంబాల్లో పుట్టి పెరిగిన వారు చాలా మంది ఉన్నారు.
దేవుడు వారికిచ్చిన టాలేంట్స్ ని దేవుని కొరకు వాడకుండా వారు సినిమాలు తీస్తూ, సాతాను సేవలో గడుపుతున్నారు. సమ్సోను చేసింది అదే.
ఫిలిష్తీయులు సమ్సోనును బంధించి, తమ దేవతకు పండుగ చేశారు, తమ దేవతకు పూజలు చేశారు, తమ దేవతను స్తుతించారు. సమ్సోను పతనం యెహోవా దేవునికి అవమానము తెచ్చింది, దాగోను దేవతకు మహిమ తెచ్చింది. ఈ రోజు మనము విఫలం అయ్యితే, దేవుని నామానికి అవమానము, సాతానుకు మహిమ.
- అప్పుడు ఫిలిష్తీయులు అతని పట్టుకొని అతని కన్నులను ఊడదీసి గాజాకు అతని తీసికొని వచ్చి యిత్తడి సంకెళ్లచేత అతని బంధించిరి.
సమ్సోను కు దురవస్థ ఇక్కడ మనం చూస్తున్నాము. ఫిలిష్తీయులు అతని కన్నులు ఊడదీసారు. గాజా పట్టణానికి తీసుకొని వెళ్లి ఇత్తడి సంకెళ్ళ చేత అతని బంధించారు. అతని ఒక బానిసగా చేసుకొని తిరుగలి విసిరే వానిగా మార్చారు. ఒక గ్రుడ్డి వాడుగా సమ్సోను మనకు ఇక్కడ కనిపిస్తున్నాడు. అతని జీవితమంతా కంటి చూపుల మీదే నడిచింది. తన కంటికి ఎవరు నచ్చితే వారి వెంట పరుగెత్తాడు. ఇప్పుడు అతనికి ఆ కళ్ళే లేకుండా పోయినాయి.
తార్సు వాడైన సౌలు దమస్కు మార్గములో ప్రభువైన యేసు క్రీస్తు దర్శనము పొందాడు. ఆయన మహిమను చూసి గ్రుడ్డి వాడై పోయాడు. అంధునిగా ఒక గదిలో పడివున్నాడు. (అపో.కార్య 9:1-8) ఆయన మనోనేత్రాలతో ఒక పరలోక దర్శనము చూశాడు. కళ్ళు కనిపించక పోయినా ఈ ప్రపంచాన్ని యేసు క్రీస్తు సువార్తతో నింపే గొప్ప దర్శనము ఆయన చూస్తూ ఉన్నాడు.
సమ్సోను పట్ల కూడా దేవునికి గొప్ప ప్రణాళిక ఉంది. తన ప్రజలను విడిపించే వానిగా దేవుడు అతని పంపించాడు.అయితే, సమ్సోను ఇతరులను విడిపించే సంగతి తరువాత, తానే శత్రువులకు ఒక బానిస అయిపోయాడు.మనము దేవునికి బానిసలం కాకుండా ప్రపంచాన్ని విడిపించలేము. పౌలు ముందు క్రీస్తుకు బానిస అయ్యాడు, ఆ తరువాత ప్రపంచాన్ని విడిపించాడు. సమ్సోను దేవునికి బానిస కాలేదు, తన స్వంత నిర్ణయాలకు బానిస అయ్యాడు, చివరికి లోకానికి బానిస అయ్యాడు.
ఒక రోజు ఫిలిష్తీయులు తమ దేవతకు పండుగ చేసుకొంటున్నారు. వారు ఉత్సవాలు చేసుకొంటున్నప్పుడు వారికి సమ్సోను గుర్తుకువచ్చాడు. ఆ గ్రుడ్డి వాడిని ఇక్కడకు తీసుకు రండి. వాడితో ఆడుకుందాము, జోక్స్ వేసుకొని నవ్వుకుందాము అనుకొన్నారు. సమ్సోను ను తెచ్చి వారి ఆలయములో రెండు స్థంబముల మధ్య నిలబెట్టారు. కొన్ని వేల మంది ప్రజలు అక్కడ చేరి సమ్సోను ను ఎగతాళి చేస్తూ సంతోషిస్తూ ఉన్నారు.సమ్సోను ఆ పరిస్థితిలో దేవుని ప్రార్ధించాడు.‘దేవా, నన్ను జ్ఞాపకము చేసుకో, నాకు మరొక్క సారి నీ శక్తిని అనుగ్రహించు. నా రెండు కళ్ళు పీకి, నన్ను బాధపెట్టుచూ వేధిస్తున్నారు, వీరి మీద నేను పగ తీర్చుకొంటాను’ దేవునికి మొఱ్ఱ పెట్టాడు. సమ్సోను శరీరానుసారుడైనప్పటికీ అతడు దేవుని మీద విశ్వాసము గల వాడే.
- ఇకను ఏమి చెప్పుదును?
గిద్యోను, బారాకు, సమ్సోను, యెఫ్తా, దావీదు,
సమూయేలను వారిని గూర్చియు,
ప్రవక్తలనుగూర్చియు వివరించుటకు
సమయము చాలదు. హెబ్రీ 11:32
హెబ్రీ 11 అధ్యాయమును మనము ‘Hall of Faith’ అంటాము. అంటే విశ్వాస వీరుల పట్టిక. ఆ పట్టిక లో మనకు సమ్సోను పేరు కనిపిస్తున్నది. సమ్సోను విశ్వాసముతో ప్రార్ధన చేశాడు. తన శక్తినంతా కూడగట్టుకొని ఆ ఆలయము ఆ ఆలయము యొక్క స్తంభములు కూల్చివేశాడు. ఆలయము లోపల, బయట ఉన్న వేలాది మంది ప్రజలు ఆ శిధిలాలలో పడి ప్రాణాలు కోల్పోయారు. ఇశ్రాయేలీయులు అప్పుడు సమ్సోనును తన తండ్రి సమాధిలో పాతిపెట్టారు.సమ్సోనును చూస్తే మనకు జాలి వేస్తుంది, బాధ వేస్తుంది.దేవుడు అతనికి వాగ్దానాలు ఇచ్చాడు, శక్తిని ఇచ్చాడు, నాయకత్వాన్ని ఇచ్చాడు, అవకాశాలు ఇచ్చాడు, అయితే సమ్సోను వాటిని వినియోగించుకోలేకపోయాడు. ఎందుకంటే అతను ఆత్మ సంభందమైన క్రమ శిక్షణ కంటే`శరీర సంభందమైన కంటి చూపుతోనే తన జీవితాన్ని నడిపించాడు. ఆయన కాలములో ఇశ్రాయేలు దేశము ఎలా ఉందో న్యాయాధిపతులు గ్రంథము
21:25 లో మనము చూశాము:
ఆ దినములలో ఇశ్రాయేలీయులకు రాజు లేడు;
ప్రతి వాడును తన తన ఇష్టానుసారముగా
ప్రవర్తించుచువచ్చెను.
In those days there was no king
in Israel; every man did that
which was right in his own eyes
ఇశ్రాయేలు ప్రజలు ఎలా ఉన్నారంటే, తమ కంటికి నచ్చింది చేశారు, దేవుని వాక్యం వారు పట్టించుకోలేదు. సమ్సోను కూడా అదేవిధముగా జీవించాడు. తన కంటికి నచ్చింది చేశాడు. దేవుని వాక్యము ఆయన పట్టించుకోలేదు. ఈ రోజున మనము ఆ ప్రశ్న వేసుకోవాలి? ఈ పని నేను ఎందుకు చేస్తున్నాను? నా కంటికి నచ్చింది కాబట్టి చేస్తున్నానా? నేను ఇష్టపడ్డాను కాబట్టి చేస్తున్నానా? లేక ఇది దేవుని వాక్యము ప్రకారం చేస్తున్నానా? దేవుని చిత్తాన్ని బట్టి చేస్తున్నానా? అని మనల్ని మనం ప్రశ్నించుకొంటే మంచిది. నాలుగు సార్లు దెలీలా సమ్సోనును మోసము చేసింది. సమ్సోను ఏంటి ఇంత అమాయకుడు అని మనము అనుకొంటాము. మనము కూడా అనేక సార్లు చేసిన తప్పులే చేస్తాము.
అన్యజనులతో సాంగత్యము చేయవద్దు, మీరు ప్రత్యేకముగా జీవించండి. పరిశుద్దులుగా ఉండండి’ అని దేవుడు ఇశ్రాయేలీయులకు ఆజ్ఞాపించాడు, సమ్సోనుకు ఆజ్ఞాపించాడు. దేవుని ఆజ్ఞను వారు పట్టించుకోలేదు. సమ్సోను ఏమనుకొన్నాడంటే, నేను చాలా శక్తిమంతుణ్ణి. నా కెపాసిటీ చాలా ఎక్కువ. ఎలాంటి శోధన అయినా తట్టుకోగలను’ ఫిలిష్తీయులతో సాంగత్యము చేశాడు, దెలీలా మాయ మాటలకు ముందు అబద్ధాలు చెప్పి తప్పించుకున్నాడు.కానీ చివరకు విసిగిపోయి ఆమెకు బలై పోయాడు. మోస పోకుడి, దేవుడు వెక్కిరింపబడడు; మనుష్యుడు ఏమివిత్తునో ఆ పంటనే కోయును అని అపొస్తలుడైన పౌలు గలతీ పత్రికలో వ్రాసిన మాటలు మనము గుర్తుపెట్టుకొంటే మంచిది.
సమ్సోను – యేసు క్రీస్తు ప్రభువు
ఇప్పుడు కొంత సేపు – సమ్సోను యేసు క్రీస్తు ప్రభువు – ఈ ఇద్దరు వ్యక్తులను పోల్చిచూద్దాము.
దేవుని దూత మానోహ భార్యకు ప్రత్యక్షమై సమ్సోను గూర్చిన వాగ్దానము ఇచ్చాడు. అదేవిధముగా, దేవుని దూత కన్య మరియకు ప్రత్యక్షమై ప్రభువైన యేసు క్రీస్తు గూర్చిన వాగ్దానము ఇచ్చాడు.
సమ్సోను తన ప్రజలైన ఇశ్రాయేలీయులను విడిపించేవాడిగా దేవుని చేత పంపబడ్డాడు. యేసు ప్రభువు తన ప్రజలను వారి పాపముల నుండి విమోచించేవాడిగా దేవుని చేత పంపబడ్డాడు.
సమ్సోను పుట్టినప్పటి నుండి నాజీరు చేయబడి దేవుని కొరకు ప్రత్యేక పరచబడ్డాడు. యేసు ప్రభువు కూడా పుట్టినప్పటి నుండి దేవుని కొరకు ప్రత్యేక పరచబడ్డాడు.
సమ్సోను ఎంతో శక్తిమంతుడు. ఇశ్రాయేలు దేశములో ఎవ్వరికీ లేని శక్తి ఆయనకు ఉంది. యుద్ధ సేనలను ఓడించే శక్తి పట్టణాలను జయించే శక్తి, పెద్ద భవనాలను కూల్చే శక్తి అతనికి ఉన్నాయి. యేసు ప్రభువు కూడా ఎంతో శక్తిమంతుడు. ఆయనకు ఉన్న శక్తి ఇంకెవ్వరికీ లేదు, సాతానును జయించే శక్తి, ప్రకృతిని జయించే శక్తి నరకమును జయించే శక్తి, మరణమును జయించే శక్తి ఆయనకు మాత్రమే ఉంది.
సమ్సోను కు అతని తల్లిదండ్రుల పట్ల, దేవుని పట్ల విధేయత లేవు, యేసు ప్రభువు తల్లిదండ్రులకు, దేవునికి విధేయునిగా జీవించాడు.
సమ్సోను ఒక్కసారి కూడా దేవునికి కృతఙ్ఞతలు చెల్లించలేదు, యేసుప్రభువు ప్రతి పనిలో దేవునికి కృతఙ్ఞతలు చెల్లించాడు.
సమ్సోను దేవుని వరములను తన స్వప్రయోజనములకు వాడుకొన్నాడు.యేసు ప్రభువు దేవుని వరములను ఎప్పుడూ తన కోసము వాడుకోలేదు.
సమ్సోను తన స్వంత మహిమను కోరుకున్నాడు, యేసు ప్రభువు దేవుని మహిమను కోరుకున్నాడు.
సమ్సోను శోధన వచ్చిందే తడవు, పాపములో పడిపోయేవాడు, యేసు ప్రభువు అనేక సార్లు శోధించబడినను పాపము లేనివాడుగా జీవించాడు.
సమ్సోను గాజా తలుపులు తెరచాడు, వాటిని హెబ్రోను ఎదుట పారవేశాడు.యేసు ప్రభువు మనలను బంధించిన నరకపు తలుపులను ధ్వంసం చేశాడు, మన ముందు పరలోకపు తలుపులు తెరచాడు.
దెలీలా మీద పెంచుకున్న మొహం సమ్సోను ప్రాణాలు తీసింది, మన మీద ఉన్న ప్రేమే, తన వధువు మీద ఉన్న ప్రేమే యేసు ప్రభువు ప్రాణాలు తీసింది.
సమ్సోను వెండి నాణెముల కోసము అప్పగించబడ్డాడు, యేసు ప్రభువు కూడా వెండి నాణెముల కోసము అప్పగించబడ్డాడు.
సమ్సోను ను చంపగలిగింది ఒక్కటే అది అతని జన్మ రహస్యం, యేసు ప్రభువు ను చంపగలిగింది కూడా ఒక్కటే, అది ఆయన జన్మ రహస్యం, అది ఏమిటంటే మనలను రక్షించుట
సమ్సోను తన స్వంత పాపాలకు బలయ్యాడు, యేసు ప్రభువు మన పాపముల కొరకు బలయ్యాడు
సమ్సోను తిరుగలి మోసేటప్పుడు అపహాస్యం చేయబడ్డాడు, యేసు ప్రభువు సిలువ మోసేటప్పుడు అపహాస్యం చేయబడ్డాడు.
సమ్సోను దప్పిక గొన్నప్పుడు దేవుడు అతని ప్రార్ధన విన్నాడు, అతని దాహం తీర్చాడు, యేసు ప్రభువు దప్పిగొన్నప్పుడు దేవుడు ఆయన ప్రార్ధన వినలేదు, ఆయన దాహం తీర్చలేదు.
చనిపోతూ సమ్సోను ఒక దేవాలయాన్ని కూల్చివేశాడు. యేసు ప్రభువు కూడా సిలువ మీద చనిపోతూ ఒక దేవాలయాన్ని కూల్చివేశాడు. ఆ దేవాలయము ఆయన శరీరమే, ఆ దేవాలయాన్ని కూల్చివేసి తన జీవాన్ని మన కిచ్చి మనలను సజీవమైన దేవుని ఆలయముగా ఆయన నిర్మించాడు.
సమ్సోను మరణించినప్పుడు, ఆ రాళ్ళ క్రింద అతని శరీరం చిక్కుకొంది. ఆ రాళ్లు తొలగించేటప్పుడు ఇశ్రాయేలీయులు ఎంత ఢీలాపడి ఉంటారు? తమ దేశ నాయకుడు, అత్యంత శక్తిమంతుడు నిర్జీవముగా అక్కడ పడిఉన్నాడు. అంతకంటే మరొక దుర్వార్త మరొకటి వారికి ఉండదు. తమ శత్రువుల చేతిలో నుండి వారిని విడిపించే నాయకుడు వారి చేతిలో మట్టికరచాడు. ఆ చల్లని సిలువ మీద నుండి యేసు ప్రభువు మృతదేహాన్ని దించేటప్పుడు శిష్యుల హృదయాలు ఎంతగా ద్రవించిఉంటాయి? మనలను రక్షిస్తాడు అనుకొన్న మెస్సియా వారి చేతుల్లో విగత జీవిగా కనిపించాడు. అయితే, ఆదివారము ఉదయము వారు సమాధి దగ్గరకు వెళ్ళినప్పుడు వారికి రాయి తొలగించబడి కనిపించింది. సజీవుడైన యేసు క్రీస్తు వారిని కలిశాడు. రక్షకుడైన యేసు క్రీస్తు సమ్సోను వలె బలహీనుడైన, పాపాత్ముడైన, తాత్కాలిక రక్షకుడు కాదు. ఆయన బలవంతుడైన, పరిశుద్దుడైన, శాశ్వతమైన రక్షకుడు. విమోచకుడు.