నా చిన్నతనములో మా ఇంట్లో ఫ్యామిలీ ప్రేయర్ లో బైబిల్ మొదటి నుండి చివరి వరకు చదివే వాళ్ళం. నిర్గమ కాండం మొదటి భాగం చాలా ఆసక్తికరంగా ఉండేది. కానీ, 25 అధ్యాయం నుండి విసుగుపుట్టేది. ప్రత్యక్ష గుడారం అంటే భయం వేసేది. ఈ అధ్యాయాలు ఎప్పుడు ముగుస్తాయా అని నేను ఎదురు చూసేవాణ్ణి. అయితే, ప్రత్యక్ష గుడారం యొక్క బిగ్ పిక్చర్ (big picture) మనం చూడాల్సివుంది. పక్షి రాజు నేత్రాలతో (Birds eye view ) చూస్తే, మనకు యేసు ప్రభువు రూపం స్పష్టముగా కనిపిస్తుంది. ప్రత్యక్ష గుడారం అంటే దేవుడు తన ప్రజల మధ్య నివసించిన స్థలం. God’s Dwelling Place Among His People.
ఆ విషయములో అది యేసు ప్రభువుకు సాదృశ్యముగా వున్నది. ప్రత్యక్ష గుడారములో దేవుడు తన ప్రజల మధ్య నివసించాడు. యేసు క్రీస్తు లో కూడా దేవుడు తన ప్రజల మధ్య నివసించాడు. యోహాను సువార్త మొదటి అధ్యాయములో మనం చదువుతాము.
- ఆదియందు వాక్యముండెను, వాక్యము దేవునియొద్ద ఉండెను, వాక్యము దేవుడై యుండెను.
- ఆ వాక్యము శరీరధారియై, కృపాసత్యసంపూర్ణుడుగా మనమధ్య నివసించెను;
The Word became flesh and tabernacled among us.
ఇక్కడ నివసించెను అన్న పదానికి గ్రీకు భాషలో eskenosen ఎస్కెనోసెన్ అనే మాట వాడాడు. ప్రత్యక్ష గుడారానికి కూడా అదే మాట వాడబడింది. skenon/స్కెనోన్ అంటే ప్రత్యక్షగుడారం కాబట్టి, గ్రీకు భాషలో ప్రత్యక్షగుడారానికి యేసు క్రీస్తు మన మధ్యలో మాట వాడబడింది. పాత నిబంధనలో దేవుడు ప్రత్యక్ష గుడారములో తన ప్రజల మధ్య నివసిస్తే, నేడు యేసు క్రీస్తు నందు తన ప్రజల మధ్య నివసిస్తున్నాడు.
కొలస్సయులకు 2:9 లో మనం చదువుతాము : ఏలయనగా దేవత్వముయొక్క సర్వపరిపూర్ణత శరీరముగా క్రీస్తునందు నివసించు చున్నది;
For in Him all the fullness of Deity dwells in bodily form.
కొంచెం, కొంచెం కాదు; అక్కడ, ఇక్కడ కాదు; అప్పుడు, ఇప్పుడు కాదు – అన్ని రకాలుగా అన్ని వేళలా దేవత్వముయొక్క సర్వపరిపూర్ణత శరీరముగా క్రీస్తునందు నివసించు చున్నది. ప్రత్యక్ష గుడారం ఇశ్రాయేలీయుల మధ్య నిర్మించబడినప్పుడు దేవుని సన్నిధి వారి మధ్యలోకి వచ్చింది. బేత్లెహేములో యేసు ప్రభువు జన్మించినప్పుడు, దేవుని యొక్క పరిపూర్ణ మయిన మూర్తిమంతం మానవుల మధ్యలోకి దిగివచ్చింది.
మత్తయి 18:20 లో మనం చదువుతాము: ఏలయనగా ఇద్దరు ముగ్గురు నా నామమున ఎక్కడ కూడి యుందురో అక్కడ నేను వారి మధ్యన ఉందునని చెప్పెను.
ప్రత్యక్ష గుడారం ప్రభువైన యేసు క్రీస్తు యొక్క సాదృశ్యం. ఇంగ్లీష్ లో ‘type of christ’ అంటాము.
ద్వారం
ఈ ప్రత్యక్ష గుడారం చుట్టూ ఒక పెద్ద ప్రాకారం వున్నది. ఆ ప్రాకారానికి తూర్పున ఒక ద్వారం ఉన్నది.
నిర్గమకాండము 27
- ఆవరణపు ద్వారమునకు నీల ధూమ్ర రక్తవర్ణములుగల యిరువది మూరల తెర యుండవలెను. అవి పేనిన సన్ననారతో చిత్రకారుని పనిగా ఉండవలెను; వాటి స్తంభములు నాలుగు; వాటి దిమ్మలు నాలుగు.
ప్రత్యక్ష గుడారానికి ఒకే ఒక ద్వారం వున్నది. నాలుగు వైపులా నాలుగు ద్వారాలు నిర్మిస్తే, నాలుగు వైపుల నుండి వెళ్ళటానికి అనుకూలముగా ఉంటుంది కదా అని మనం అనుకోవచ్చు. కానీ దేవుడు మాత్రం ఈ ప్రత్యక్ష గుడారానికి ఒకే ఒక్క ద్వారం పెట్టాడు. ఎవరైనా సరే ఆ ద్వారం గుండా లోపలి వెళ్లాల్సిందే. ఇక్కడ యేసు ప్రభువు స్వరూపం మనకు కనిపిస్తున్నది. దేవుని సముఖానికి వెళ్ళడానికి ఆయన ఒక్కడే మార్గం.
యోహాను సువార్త 14:6 లో మనం చదువుతాము. అక్కడ యేసు ప్రభువు ఏమన్నాడంటే, నేనే మార్గమును, సత్యమును, జీవమును; నా ద్వారానే తప్ప యెవడును తండ్రియొద్దకు రాడు.
మార్గం, సత్యం, జీవం – ఆయన సత్యం కాబట్టి, జీవం కాబట్టి, మనకు మార్గం అయ్యాడు. ఇంకా ఎవ్వరూ మనకు మార్గం కాలేరు. ఎందుకంటే, వారిలో సత్యం లేదు, జీవం లేదు. ప్రవక్తగా చెప్పుకొన్న మహమ్మద్ ‘మీకు తిన్నని మార్గం’ (Straight Path) చూపిస్తాను’ అని తన అనుచరులకు చెప్పాడు. ‘నాకు జ్ఞానోదయం కలిగింది’ అని చెప్పుకొన్న బుద్ధుడు ‘మీకు గొప్ప మార్గం (Nobel Path ) చూపిస్తాను’ రండి అని తన అనుచరులకు చెప్పాడు. అయితే, ‘నేనే మార్గమును’ అని మానవాళికి తనను తాను చూపించుకొన్న ఒకే ఒక్క రక్షకుడు ప్రభువైన యేసు క్రీస్తు మాత్రమే. నాడు దేవుని కలవాలంటే ప్రత్యక్ష గుడారానికి వెళ్లాల్సిందే. నేడు దేవుని కలవాలంటే యేసు క్రీస్తు ద్వారా వెళ్లాల్సిందే.
నాడు ప్రత్యక్ష గుడారం దేవుడు, మానవుడు కలుసుకున్న ప్రదేశం. నేడు యేసు క్రీస్తు దేవుడు, మానవుడిని కలిపిన మధ్యవర్తి. ‘దేవుడొక్కడే, దేవునికిని నరులకును మధ్య వర్తియు ఒక్కడే; ఆయన క్రీస్తుయేసను నరుడు’ అని 1 తిమోతి 2:5 లో మనం చదువుతాము.
యోహాను సువార్త 10:9 లో ‘నేనే ద్వారమును’ అని యేసు ప్రభువు చెప్పాడు. యేసు క్రీస్తు ఒక్కడే దేవునికి మార్గం. దేవుని దగ్గరకు రక రకాల మతాలు రక రకాల మార్గాలు అని నమ్మటం అసత్యం. అపొ. కార్యములు 4:12 లో పేతురు గారు స్పష్టముగా చెప్పారు:
‘మరి ఎవనివలనను రక్షణ కలుగదు; ఈ నామముననే మనము రక్షణ పొందవలెను గాని, ఆకాశము క్రింద మనుష్యులలో ఇయ్యబడిన మరి ఏ నామమున రక్షణ పొందలేము’ అనెను. ప్రత్యక్ష గుడారం ఇశ్రాయేలీయుల పాలెం మధ్యలో ఉన్నది. ఇశ్రాయేలీయుల 12 గోత్రాల ప్రజలు దాని చుట్టూ ఒక క్రమములో అమర్చబడ్డారు. తూర్పు దిక్కున యూదా గోత్రం వారు నివసించారు. ప్రత్యక్ష గుడారం యొక్క ద్వారం కూడా తూర్పు దిక్కునే ఉన్నది.
సంఖ్యాకాండము 2 వ అధ్యాయములో దేవుడు యేమని చెప్పాడంటే, ‘3. సూర్యుడు ఉదయించు తూర్పు దిక్కున యూదా పాళెపు ధ్వజము గలవారు తమ తమ సేనల చొప్పున దిగవలెను’. నాడు ప్రత్యక్ష గుడారములో దేవుని సన్నిధికి వెళ్లాలంటే యూదా గోత్రికుల మధ్యలో గుండా నడచి వెళ్లాల్సిందే. నేడు దేవుని సన్నిధికి వెళ్లాలంటే యూదా గోత్రపు సింహం ప్రభువైన యేసు క్రీస్తు ద్వారా వెళ్లాల్సిందే.
ముగింపు: Tabernacle is God’s dwelling place among his people; ప్రత్యక్ష గుడారం దేవుడు తన ప్రజల మధ్య నివసించిన ప్రదేశం. ప్రభువైన యేసు క్రీస్తు మనకు అక్కడ కనిపిస్తున్నాడు. ఆయన పేరు ఇమ్మానుయేలు. అనగా మనతో వున్న దేవుడు అని అర్ధం. ప్రత్యక్ష గుడారం లోనికి ఒకే ఒక్క ద్వారం వున్నది. దేవుని యొద్దకు ఒకే ఒక్క ద్వారం వున్నది. ఆ ద్వారం పేరు ప్రభువైన యేసు క్రీస్తు. ఆ ద్వారం గుండా మీరు దేవుని యొద్దకు రావాలన్నదే నేటి మా ప్రేమ సందేశం.
డాక్టర్ పాల్ కట్టుపల్లి