హోలోకాస్ట్ మ్యూజియం సందర్శన: దేవుడు నిజముగా వున్నాడా?

Download Telugu Transcript of this Message by Dr.Paul Kattupalli netisandeshamholocaust2.jpg

ప్రేమ సందేశం వీక్షకులకు వాషింగ్టన్ డీసీ, హోలోకాస్ట్ మ్యూజియం దగ్గర నుండి శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం. హత్యలు, మాన భంగాలు,  అల్లర్లు,ఉద్రిక్తతలు, ఎటు చూసినా హింస. దేవుడు ఉంటే ఇన్ని ఘోరాలు జరుగవు అని నాస్తికులు అంటూ వుంటారు. ప్రపంచములో ఇన్ని ఘోరాలు జరుగుతున్నాయి కాబట్టి దేవుడు లేడు అని ఈ నాస్తికులు వాదిస్తారు.

   మన ప్రాంతములో కూడా బాబు గోగినేని గారు ఇటువంటి వాదన చేస్తూఉంటాడు. రెండ్రోజుల క్రితం ఆయనను అరెస్ట్ చేశారు. ఆయన ఏవయినా చట్టాలను అతిక్రమిస్తే ఆయనను విచారించటంలో తప్పు లేదు.

కానీ, ఆయన వాక్ స్వాతంత్య్రాన్ని అడ్డుకోవటమే ఈ కేసుల యొక్క ఉద్దేశ్యమయితే అది చాలా తప్పు. వాక్ స్వతంత్రం ప్రతి వ్యక్తికీ దేవుడు ఇచ్చిన హక్కు. అన్ని మతాల వారు,నాస్తికులు అందరూ తమ అభిప్రాయాలు వ్యక్తపరచగలగాలి. నిజమయిన ప్రజాస్వామ్యం అంటే అదే. ‘ఆయన మాటల వలన మా మనోభావాలు దెబ్బతిన్నాయి’ అనే వాళ్ళు ఉన్నారు. ‘నాకు నచ్చిందే చెప్పాలి, నాకు నచ్చనిది చెప్పకూడదు’ అంటే  ఏ ఆలోచనను విమర్శించలేము. ఏ దృక్పధాన్ని ఖండించలేము. ఈ పార్టీ వాళ్ళు ఏమన్నా అంటే, ఆ పార్టీ వాళ్ళ మనోభావాలు దెబ్బ తింటాయి. ఆ పార్టీ వాళ్ళు ఏమన్నా అంటే, ఈ పార్టీ వాళ్ళ మనోభావాలు దెబ్బతింటాయి. మనోభావాల గురించి పట్టించుకొంటే అందరం నోరు మూసుకొని కూర్చోవాలి. ప్రజాస్వామ్యములో జర్నలిజంది

ఒక ముఖ్యమయిన పాత్ర. ‘ఫలానా జర్నలిస్ట్ నన్ను విమర్శించాడు అతన్ని కొట్టిరండి’ అంటే, జర్నలిస్టులు వాళ్ళ పని సరిగా చేయలేరు. వాక్ స్వాతంత్రం మనకు దేవుడు ఇచ్చిన వరం, మానవులు ఇచ్చిన బహుమానం కాదు. యెషయా గ్రంధములో దేవుడు ఏమన్నాడు? ‘రండి మన వివాదము తీర్చుకొందము’ (యెషయా 1:18) Come let us reason together. ‘మీకు నా మీద కోపం ఉంటే, రండి మాట్లాడుకొందాం’ అని దేవుడు మానవులతో అంటున్నాడు. Let us reason together reasonable గా, హేతుబద్ధముగా చర్చించుకొందాము రండి అని దేవుడు పిలుపునిచ్చాడు. దేవుడు ఉంటే ఈ లోకములో ఇన్ని ఘోరాలు జరుగవు అని నాస్తికులు అంటున్నారు. ఈ రోజు ఆ విషయం చూద్దాం.  

వాస్తవానికి, ఆ ప్రశ్న మనల్నందరినీ బాధిస్తుంది. ఇన్ని ఘోరాలు జరుగుతున్నాయి, దేవా ఎక్కడున్నావు? అని మనం కూడా చాలా సార్లు ప్రశ్నిస్తాము. మీ మధ్యలో నేను వాషింగ్టన్ DC వెళ్ళాను. అమెరికా దేశానికి ఈ నగరం రాజధానిగా ఉంది. అక్కడ ఉన్న హోలోకాస్ట్ మెమోరియల్ మ్యూసియం కి వెళ్ళాను. నాకు ప్రపంచ చరిత్ర అంటే ఇష్టం. చరిత్ర మ్యూజియం లకు వెళ్లి అప్పుడప్పుడు కొంత సమయం గడుపుతావుంటాను. ఈ హోలోకాస్ట్ మ్యూజియం – చాలా చక్కగా దానిని నిర్మించారు. కొన్ని గంటల పాటు లోపల నేను గడిపాను. రెండో ప్రపంచ యుద్ధ కాలములో యూరప్ లో నాజీ నియంత అడాల్ఫ్ హిట్లర్ నాయకత్వములో 60 లక్షల మంది యూదులు చాలా కిరాతకంగా చంపబడ్డారు. పది మంది హత్య చేయబడితే ఫ్రంట్ పేజ్ లో పెద్ద న్యూస్ అవుతుంది. 60 లక్షల మందిని చంపితే దిక్కేంటి? అది యెంత ఘోరం? హిట్లర్ లక్షల మందిని బానిసత్వములోకి పంపాడు. గ్యాస్ చాంబర్స్ లో పెట్టి విష వాయువులు వదలి లక్షల మంది ప్రాణాలు తీసాడు. చిన్న పిల్లల మీద అత్యాచారాలు జరిపించాడు. నాజీ సైంటిస్టులు వీరి మీద సైన్స్ ప్రయోగాలు చేసుకొన్నారు. వారి ఆస్తులు దొంగిలించారు. హిట్లర్ చేసిన ఘోరాలు చూసి చాలా మంది దేవుని మీద నమ్మకం వదిలివేశారు. ‘దేవుడు ఉంటే ఇలాంటి ఘోరాలు జరగనే జరుగవు, కాబట్టి దేవుడు లేడు’ అని కొంతమంది అన్నారు.

    ‘అవుస్క్ విట్జ్ కాన్సంట్రేషన్ క్యాంపు’ లో ఒక యూదుడు ప్రాణాలు కోల్పోయే ముందు తన చెరసాల గోడ మీద ఒక మాట వ్రాసాడు: “If there is a God, he should beg for my forgiveness”‘దేవుడు ఉంటే, ఆయన వచ్చి ‘నన్ను క్షమించు’అని నన్ను ప్రాధేయపడాలి’. మ్యూజియం లోపలికి వెళ్ళాను. ముందు ఇద్దరు మహిళలతో మాట్లాడాను. హిట్లర్ చేసిన ఘోరాలు వారు ప్రత్యక్షంగా చూశారు. రెండో ప్రపంచ యుద్దములో వారు పడిన నరక యాతన నాకు వివరించారు. అన్నా గ్రోట్జ్ (Anna Grosz) 1926 లో ఆమె జన్మించింది. ఇప్పుడు ఆమె వయస్సు 92 సంవత్సరాలు. 1944 లో, ఆమెకు 18 సంవత్సరాల వయస్సు. హిట్లర్ సైనికులు ఆమె ఇంటికి వెళ్లి ఆమె కుటుంబం మీద ఎన్నో అఘాయిత్యాలు చేశారు. రోమానియా దేశములో ఆమె జన్మించింది. ఆమెకు తల్లిదండ్రులు, 5 అక్కాచెల్లెళ్లు ఉన్నారు. 1944 లో నాజీ జర్మనీ వారు ఉన్న ప్రాంతాన్ని ఆక్రమించుకొన్నది. వారి పొలాలు తీసివేసుకొన్నారు. ఆమె తండ్రిని బానిసగా తీసుకొనిపోయారు. మిగిలిన కుటుంబాన్ని రైలు బండిలో ఔస్క్ విట్జ్ కాన్సంట్రేషన్ క్యాంపు కి పంపించారు. ఆమె తల్లిని, ఇద్దరు చెల్లెళ్లను గ్యాస్ ఛాంబర్లో పెట్టి చంపివేశారు. వారి దేహాలు ఒక పెద్ద శవాల గుట్టలో పారవేసారు. ఆమెను, మిగిలిన సోదరీలను కూలీలుగా చేసుకొని కఠినమయిన పనులు చేయించుకున్నారు. ఆమె సోదరి ఎలిజబెత్ ని కాల్చిచంపారు. ఆమె ముందు కూర్చొని నేను విన్నాను. ఆమె, ఆమె కుటుంబం పడిన నరక యాతన నాకు వివరించింది. 84 సంవత్సరాల క్రితం జరిగిన సంఘటనలను ఇంకా గుర్తు పెట్టుకొంది. నాతో ఆమె ఏమిచెప్పిందంటే,  ‘ఏ రోజు మమ్ములను ఎలా హింసించారో, ఈ రోజుకు కూడా పూస గుచ్చినట్లు చెప్పగలను’ అంది. ఆమె వెనుక ఒక పెద్ద గోడ వుంది. ఆ గోడ నల్లటి రాతి పలకలతో కప్పబడివుంది. యెషయా గ్రంధం 43:10 అక్కడ చెక్కబడివుంది.

YOU ARE MY WITNESSES. ISAIAH 43:10

అక్కడ నుండి మరొక హాల్ లోనికి వెళ్ళాను. అక్కడ డేనియల్ అనే బాలుడు నాజీ జర్మనీ లో అతని కుటుంబం పడిన బాధలను వివరించే ప్రదర్శన వున్నది. ఆ బాలుడు తన డైరీ లో వ్రాసుకొన్న మాటలు చదివితే, ఎవరి హృదయమయినా ద్రవించును. అక్కడ నుండి మెయిన్ హాల్లోకి వెళ్ళాను. అక్కడ గోడ మీద ఎలీ వీసిల్ (Elie Wiesel) అన్న మాటలు వ్రాయబడ్డాయి.

This Museum is not an answer.It is a question

‘ఈ మ్యూజియం ఒక సమాధానము కాదు, అది ఒక ప్రశ్న’

ఈ మ్యూజియం లో కొంత సమయం గడిపితే మనకు చాలా ప్రశ్నలు వస్తాయి. అక్కడ ఒక బుక్ షాప్ వుంది. చాలా మంది మేధావులు వ్రాసిన పుస్తకాలు అక్కడ వున్నాయి. హోలోకాస్ట్ ని ప్రత్యక్షంగా అనుభవించి వారు ఆ పుస్తకాలు వ్రాసారు. ప్రైమో లెవీ (Primo Levi) వ్రాసిన Survival in Auschwitz అనే పుస్తకం నేను చూసాను. ఆయన ఒక గొప్ప రసాయన శాస్త్రవేత్త. రెండో ప్రపంచ యుద్ధం తరువాత ఆయన ఎంతో కాలం డిప్రెషన్ తో బాధపడ్డాడు. 1987 లో ఇంటి మీద నుండి దూకి ఆత్మ హత్య చేసుకొన్నాడు. హిట్లర్ ని తప్పించుకోగలిగాడు. కానీ, అతడు మిగిల్చిన మానసిక వేధనను ఓర్చుకోలేకపోయాడు. Elie Wisel said, ‘Primo Levi died at Auschwitz forty years later”. మరొక పుస్తకం విక్టర్ ఫ్రాంకెల్ వ్రాసిన Man’s Search for Meaning‘జీవిత పరమార్ధం కోసం మనిషి చేసే అన్వేషణ’. ప్రపంచ వ్యాప్తముగా కొన్ని కోట్ల ప్రతులు ఆ పుస్తకం అమ్ముడుపోయింది. మన జీవితానికి ఏమన్నా అర్ధం ఉందా?

కష్టాలు వచ్చినప్పుడు ఆ ప్రశ్న చాలా మందికి వస్తుంది. మనిషి అడిగే ప్రశ్నలతో పాటు దేవుడు అడిగే ప్రశ్నలు కూడా ఈ మ్యూజియం లో నాకు కనిపించాయి. నేను సంస్మరణ వేదిక ఉన్న Hall of Remembrance లోకి వెళ్ళాను. అక్కడ హోలోకాస్ట్ లో హతం చేయబడిన యూదుల జ్ఞాపకార్ధం ఒక నిత్య జ్యోతి వెలుగుతా ఉన్నది. ఎడమ వైపు ఆదికాండము 4:10 వ్రాయబడివుంది.

WHAT HAVE YOU DONE?

HARK, THY BROTHER’S BLOOD CRIES OUT TO ME FROM THE GROUND!

   నీవు చేసిన పని యేమిటి? నీ తమ్ముని రక్తము యొక్క స్వరము నేలలో నుండి నాకు మొరపెట్టుచున్నది.కయీను తన తమ్ముడయిన హేబెలు మీద అసూయపడ్డాడు. ఆ తరువాత అతని హత్య చేసాడు. మానవ చరిత్రలో మొదటి హత్య జరిగినప్పుడు దేవుడు దిగి వచ్చాడు. కయీనును నిలదీసాడు. ‘నీ తమ్ముడయిన హేబెలు ఎక్కడ వున్నాడు?’ కయీను దేవుణ్ణే ఎదిరించాడు: ‘నాకు తెలియదు, నేను నా తమ్మునికి కావలి వాడనా?’ అని దేవుని ప్రశ్నించాడు. దేవుడు ఏమన్నాడంటే, ‘కయీను, నీవు చేసిన పని ఏమిటి? నీ తమ్ముని రక్తం యొక్క స్వరం నెలలో నుండి నాకు మొఱ్ఱపెట్టుచున్నది’ దేవుడు లేకపోతె మనిషిని ప్రశ్నించేది ఎవరు? దేవుడు లేకపోతే బలవంతుడిదే రాజ్యం.

   కేంద్ర మంత్రి సత్యపాల్ సింగ్ గారు ఈ మధ్యలో ఒక మాట అన్నాడు: “నేనయితే కోతి నుంచి పుట్టలేదు. ఈ భూమి మీద పుట్టడం పుట్టడమే మనిషి నేటి రూపంలోనే పుట్టాడు. ఒక ఇరవై ఏళ్ళు ఆగండి, డార్విన్ సిద్ధాంతం అబద్దమని రుజువు అవుతుంది” ఆ మాటలు అన్నందుకు ఈ మంత్రి గారిని అపహాస్యం చేస్తా వున్నారు. ఈ రోజు వార్తా పత్రికలో నేను చదివాను:  ‘ఏమి విజ్ఞానం, ఏమి వివేకం’ అని గేలి చేస్తా వున్నారు. ఆయన కెమిస్ట్రీ లో Ph.D చేసాడు. ఆయన అన్న దానిలో తప్పేమి లేదు. నేను చెప్పేది కూడా అదే, బైబిల్ గ్రంధం చెప్పేది కూడా అదే. మనిషి కోతి నుండి పుట్టలేదు. ఈ భూమి మీద పుట్టడం పుట్టడమే. మనిషి నేటి రూపంలోనే పుట్టాడు. మనిషి కోతి నుండి పుట్టాడు అని మన స్కూళ్లలో, కాలేజీల్లో, యూనివర్సిటీ ల్లో తప్పుడు సిద్ధాంతాలు చెబుతావున్నారు. ఈ కేంద్ర మంత్రి సత్యపాల్ గారు ధైర్యముగా దానిని తప్పు పట్టాడు. ఆయనను యెగతాళి చేయాల్సిన అవసరం లేదు. అలాంటి మంత్రులు మనకు కావాలి.

  హిట్లర్ అతని నాజీ సైనికులు డార్విన్ సిద్ధాంతాలను ఆచరణలో పెట్టారు. దానిని Social Darwinism అన్నారు. డార్విన్ ఏమన్నాడు? సృష్టికర్త లేదు, దేవుడు లేడు, ప్రకృతిలో బలమున్నవాడిదే రాజ్యం. బలహీనులు రాలిపోవటమే. హిట్లర్ డార్విన్ సిద్ధాంతాల ఆధారంగానే తన ప్రభుత్వ విధానాలను రూపొందించాడు. ‘ఈ యూదులు, ఈ వికలాంగులు, ఈ  మానసిక రోగులు వీళ్ళు రాలిపోవాలి. వీళ్ళని చావగొట్టండి’ అన్నాడు. దేవుడు లేని ప్రకృతి వాదంలో ఏ హతుని యొక్క రక్తం న్యాయం కోసం భూమిలో నుండి మొఱ్ఱపెట్టదు. దేవుడే లేకపోతే మనిషిని నిలదీసేది ఎవరు? మనిషి పాపాలను ప్రశ్నించేది ఎవరు? మ్యూజియం లో ఒక చోట గోడ మీద ఈ మాటలు వ్రాయబడ్డాయి:

All men are created equal …They are endowed by their Creator with certain inalienable rights; Among these are life, liberty, and the pursuit of happiness.

దేవుడు అందరిని సమానముగా సృష్టించాడు. వారికి దేవుడు ప్రాణాన్ని, స్వేచ్ఛను, సంతోషాన్ని హక్కులుగా అనుగ్రహించాడు. దేవుడు లేకపోతె సమానత్వం ఉండదు. సమానత్వం లేకుండా మానవ హక్కులు వుండవు. దేవుడు లేకపోతే మానవ హక్కులే వుండవు. నాస్తికులు పాలించిన కమ్యూనిస్ట్ దేశాల్లో మానవ హక్కులు పూర్తిగా కాలరాచారు. దేవుడే లేకపోతే మనం దేనినీ  ఘోరం అని పిలవలేము. ఏది మంచో, ఏది చెడో మనకు చెప్పింది దేవుడే.

   హోలోకాస్ట్ ని చూసి మనం ‘అమ్మో, యెంత ఘోరం’ అంటాం. హిట్లర్, నాజీలకు అవి ఘోరాలుగా కనిపించలేదు. వాళ్ళు వారి పనులను మంచిపనులుగా చెప్పుకొన్నారు. ‘ఈ యూదులను చావగొడితే మన దేశం బాగుపడుద్ది, మన దేశం అభివృద్ధి చెందుతుంది. మేము చేసేవి మంచి పనులు’ అని నాజీలు చెప్పుకొన్నారు. మనం చెడ్డ పని అనే దానిని మరొక వ్యక్తి మంచి పని అంటాడు. దేవుడు లేకపోతే మంచి, చెడులు కేవలం మన అభిప్రాయాలు గానే మిగిలిపోతాయి. దేవుని యొక్క ఆజ్ఞల వలన మాత్రమే ఏది మంచో, ఏది చెడో మనం గ్రహించగలుగుతాము.

   ఈ ప్రపంచములో జరిగే ఘోరాలకు మనం దేవుని తప్పు పట్టలేము. ఆ హాల్ లో, ఆ జ్యోతి కి మీదుగా ద్వితీయోపదేశ కాండం లోని మాటలు వ్రాయబడ్డాయి. Only Guard yourself and guard your soul carefully – అయితే నీవు జాగ్రత్తపడుము; నీవు కన్నులార చూచినవాటిని మరువక యుండునట్లును, అవి నీ జీవిత కాల మంతయు నీ హృదయములోనుండి తొలగిపోకుండు నట్లును, నీ మనస్సును బహు జాగ్రత్తగా కాపాడుకొనుము.

నా వాక్యాన్ని జాగ్రత్తగా నీ హృదయములో ఉంచుకో అని దేవుడు మనిషిని ఆజ్ఞాపించాడు. అయితే, దేవుని ఆజ్ఞలను మనిషి తిరస్కరించి ఘోరాలకు పాల్పడుతున్నాడు. కుడి ప్రక్క గోడ మీద మరొక వాక్యం వ్రాయబడింది.

I CALL HEAVEN AND EARTH TO WITNESS THIS DAY;

I HAVE PUT BEFORE YOU LIFE AND DEATH, BLESSING AND

CURSE CHOOSE LIFE – THAT YOU AND YOUR OFFSPRING SHALL LIVE

                                                     DEUTERONOMY 30:19

నేడు జీవమును మరణమును, ఆశీర్వాదమును శాపమును నేను నీ యెదుటను ఉంచి, భూమ్యాకాశములనుమీ మీద సాక్షులుగా పిలుచుచున్నాను.కాబట్టి నీవును నీ సంతానమును బ్రదుకుచు, జీవమును కోరుకొనుడి.

దేవుడు ఏమంటున్నాడంటే, Choose life -జీవమును కోరుకో. దేవుడు మనిషికి స్వేచ్ఛ నిచ్చాడు. జీవమును కోరుకో అని ఆజ్ఞ కూడా ఇచ్చాడు. అయితే మనిషి తన స్వేచ్ఛను దుర్వినియోగం చేస్తున్నాడు. దేవుని ఆజ్ఞలను పెడచెవిని పెడుచున్నాడు. అందుకనే మన సమాజములో ఘోరాలు పెరిగి పోతావున్నాయి.   మ్యూజియం లో నేను ఒక పుస్తకం చూసాను. ఆ పుస్తకం పేరు The Zookeeper’s Wife. యాన్ జబీన్స్కి Jan Zabinski, ఆయన భార్య ఆంటోనినా వారు క్రైస్తవ దంపతులు. 1939 లో హిట్లర్ పోలాండ్ దేశము మీద దండెత్తాడు. వార్సా నగరాన్ని నాజీలు ఆక్రమించు కొన్నారు. యూదుల హత్యాకాండకు ప్రణాళికలు సిద్ధం చేస్తున్నారు. వార్సా లో వున్నా జూ కి యాన్ జాబిన్ స్కి డైరెక్టర్ గా వున్నాడు. అప్పుడు ఆయన అనేక మంది యూదులను జూలో జంతువుల మధ్య ఉంచి ప్రాణాలు కాపాడాడు. క్రైస్తవులు ఎంతో మంది తమ ప్రాణాలకు తెగించి ఎన్నో వేల మంది యూదుల ప్రాణాలు కాపాడారు. దేవుడు ఈ ఘోరాలను ఆపకుండా ఏమి చేస్తున్నాడు? అని మనం ప్రశ్నించవచ్చు. దేవుడికి ఒక ప్లాన్ వుంది. ఆయనకు ఒక టైం టేబుల్ వుంది. ఆయనకు ఒక కేలండర్ వుంది. దేవుడు తాను నిర్ణయించిన రోజున మనిషి ఘోరాలకు ముగింపు పలుకుతాడు.

    హోలోకాస్ట్ మ్యూజియం నుండి నేను బయటికి నడిచి వెళ్ళేటప్పుడు కుడి వైపు, ఎడమ వైపు రెండు పెద్ద శిలాఫలకాలు చూసాను. ఎడమవైపు ఉన్న శిలాఫలకం మీద జనరల్ డ్వయిట్ డేవిడ్ ఐసెన్ హోవెర్  (Gen.Dwight David Eisenhower) అన్న మాటలు వ్రాయబడ్డాయి. హిట్లర్ సైన్యాలు మారణ హోమం సృష్టిస్తావున్నప్పుడు ఐసెన్ హోవెర్ అమెరికా దేశ సైన్యాధిపతిగా వున్నాడు. ‘నాజీలు చేస్తున్న ఘోరాలను నేను స్వయముగా చూడాలి’ అని ఒక నాజీ చెర శాలకు వెళ్ళాడు. నాజీలు యూదుల పట్ల చూపిన క్రూరత్వాన్ని చూసి ఆయన చలించాడు. ‘మనుష్యులు తోటి మనుష్యుల పట్ల ఇంత ఘోరముగా, అమానుషముగా ప్రవర్తిసారా?’ అని ఐసెన్ హోవెర్ ప్రశ్నించాడు. ఆ శిలాఫలకము మీద నేను ఐసెన్ హోవెర్ అన్న మాటలు చదివాను:

   I MADE THE VISIT DELIBERATELY

నేను స్వంత నిర్ణయముతో నాజీలు నిర్మించిన చెరసాలలకు వెళ్ళాను. వారు చేసిన దుర్మార్గాలను నా కన్నులతో చూసాను.

I MADE THE VISIT DELIBERATELY – ఆ మాటలు చదినప్పుడు నాకు ప్రభువైన యేసు క్రీస్తు గుర్తుకు వచ్చాడు. ఈ ప్రపంచములో జరుగుచున్న ఘోరాలను చూడడానికి యేసు క్రీస్తు స్వయముగా మన మధ్యలోకి వచ్చాడు. అప్పుడు ఉన్న హేరోదు రాజు హిట్లర్ లాంటి వాడు. యూదులను ఎంతో  క్రూరముగా హింసించాడు. యేసు క్రీస్తును హతమార్చాలని పాలు త్రాగే పిల్లలను కూడా చంపించాడు. సిలువ మీద యేసు క్రీస్తు మనిషి యొక్క అమానుషత్వాన్ని స్వయముగా అనుభవించాడు.  కుడి వైపున మరో శిలాఫలకం నేను చూసాను. దాని మీద యేమని వ్రాశారంటే,’ జనరల్ ఐసెన్ హోవెర్ గారికి కృతఙ్ఞతలు. ఆయన, ఆయన సైన్యం విరోచితముగా పోరాడి, హిట్లర్ యుగానికి ముగింపు పలికారు. నాజీల దుర్మార్గాలను అంతం చేశారు. వారి బందీలకు విడుదల ఇచ్చారు’

     ఐసెన్ హోవెర్ నాజీల దుర్మార్గాలు చూసి వెళ్లిపోలేదు. మీ దుర్మార్గాలు మానుకోండి అని వారిని శాంతి యుతముగా కోరాడు. అయితే నాజీలు ఆయన మాటలు పట్టించుకోలేదు. అప్పుడు ఐసెన్ హోవెర్ తన సైన్యం తో వారి మీద దండెత్తాడు. వారికి భూమి మీదే నరకం చూపించాడు. వారి దేశాలను ఆక్రమించుకున్నాడు. వారి చెరసాలలను బద్దలు కొట్టాడు. వారి బందీలకు విడుదల ఇచ్చాడు. దేవుని యొక్క ప్లాన్ లో ప్రభువైన యేసు క్రీస్తు చేసేది అదే. ఆయన ఈ ప్రపంచాన్ని చూసి వెళ్లిపోలేదు. ‘నేను మళ్ళీ వస్తాను’ అని చెప్పి పరలోకం వెళ్ళాడు. మొదటి సారి వచ్చినప్పడు మానవులు చేసే ఘోరాలు చూసి వెళ్ళాడు. వారిని అడ్డుకోలేదు. శాంతి యుతముగా మారుమనస్సు పొందమని వారిని వేడుకొన్నాడు. వారికి ప్రసంగాలు చేసాడు, వారి కోసం ప్రార్ధన చేసాడు. వారి కోసం ఉపవాసం చేసాడు.  యేసు క్రీస్తు రెండోసారి వచ్చినప్పడు ప్రసంగాలు, ప్రార్ధనలు, ఉపవాసాలు వుండవు. ఆయన ఉగ్రతతో వస్తాడు. భూమి మీద వున్న అవిధేయులను అణగద్రొక్కుతాడు. వారు చేసే ఘోరాలకు ముగింపు పలుకుతాడు. ఈ భూలోక రాజ్యాలను తన అధీనం లోకి తెచ్చుకొంటాడు. పరలోకం నుండి మన కోసం ఒక ఐసెన్ హోవెర్ రాబోవుచున్నాడు.

ముగింపు: ఎన్నో ఘోరాలు ఈ ప్రపంచములో జరుగుచున్నాయి. కాబట్టి దేవుడు లేడు అనే నాస్తికులు మన మధ్యలో చాలా మంది వున్నారు. దేవుడు భయం కాస్తో, కూస్తో వుంది కాబట్టే మన ప్రపంచం ఈ మాత్రంగా నన్నా వుంది. దేవుడు లేకపోతే  ఇంకా ఎంతో ఘోరముగా ఉండేది. డార్విన్ ప్రకృతి వాదంలో బలవంతుడిదే రాజ్యం. అందులో మంచి, చెడులు వుండవు. దేవుడు లేని ప్రపంచములో సమానత్వం ఉండదు, మానవ హక్కులు ఉండవు. దేవుడు లేకపోతే  మంచి, చెడులు కేవలం మన అభిప్రాయాలు గా మాత్రమే మిగిలిపోతాయి. ‘ఎవరి అభిప్రాయాలు వారివి’ అని మనం సర్దుకుపోతాం తప్ప దేనిని ఖండించే పరిస్థితి ఉండేది కాదు. దేవుని ఆజ్ఞలు పట్టించుకోకుండా, దేవుడు ఇచ్చిన స్వేచ్ఛను దుర్వినియోగం చేయటం మూలంగానే మన ప్రపంచములో దుష్టత్వం, అరాచకత్వం రాజ్యం చేస్తావున్నాయి. దేవుని ప్లాన్ ఇంకా పూర్తికాలేదు. జనరల్ ఐసెన్ హోవెర్ హిట్లర్ రాజ్యానికి ముగింపు పలికినట్లుగా, ప్రభువైన యేసు క్రీస్తు కూడా మనిషి, సాతానుడు చేస్తున్న దుర్మార్గాలకు ముగింపు పలుకుతాడు. హోలోకాస్ట్ మ్యూజియం లో మనం నేర్చుకోవలసిన సత్యాలు అవే. అదే నేటి మా ప్రేమ సందేశం.

డాక్టర్ పాల్ కట్టుపల్లి

Holocaust Museum Visit: Does God Really Exist by Paul Kattupalli

Download Telugu Transcript of this Message by Dr.Paul Kattupalli 

Leave a Reply