ప్రత్యక్ష గుడారము – బలిపీఠము   by డాక్టర్ పాల్ కట్టుపల్లి

                                      ఇక్కడ క్లిక్ చేసి డౌన్ లోడ్ చేసుకోండి

tabernaclegoodsalt.jpg

ప్రత్యక్ష గుడారం అంటే అది దేవుడు తన ప్రజల మధ్య  స్థలం. ఈ ప్రత్యక్ష గుడారం తూర్పున ఒక పెద్ద ద్వారం ఉన్నది. దేవుని ప్రజలు ఆ ద్వారం లో గుండా వెళ్లి దేవుని సన్నిధిలో గడిపారు. తూర్పు సూర్యుడు ఉదయించే దిక్కు. ప్రభువైన యేసు క్రీస్తు మన నీతి సూర్యుడు. ఇశ్రాయేలీయులు ప్రత్యక్ష గుడారాన్ని ఎంతో ప్రేమించారు. ఉదాహరణకు,

కీర్తనలు 27 లో మనం చదువుతాము.

 1. యెహోవాయొద్ద ఒక్క వరము అడిగితిని.  దానిని నేను వెదకుచున్నాను. యెహోవా ప్రసన్నతను చూచుటకును ఆయన ఆల యములో ధ్యానించుటకును, నా జీవితకాలమంతయు నేను యెహోవా

మందిర ములో నివసింప గోరుచున్నాను.

ప్రత్యక్ష గుడారాన్ని, అందులోని దేవుని సన్నిధిని దావీదు ఎంతో ప్రేమించాడు. దావీదు కుమారుడైన సొలొమోను దేవునికి ఒక పెద్ద ఆలయాన్ని కట్టించాడు. ఈ ఆలయం కట్టక మునుపు దేవుని మందిరం అంటే ప్రత్యక్ష గుడారమే.

26 వ కీర్తన, 8 వచనం చూద్దాం.

యెహోవా, నీ నివాసమందిరమును నీ తేజోమహిమ నిలుచు స్థలమును నేను ప్రేమించు చున్నాను.

కీర్తనలు 84:1-2 కూడా చూద్దాం.

 1. సైన్యములకధిపతివగు యెహోవా, నీ నివాసములు ఎంత రమ్యములు. 2. యెహోవా మందిరావరణములను

చూడవలెనని నా ప్రాణము ఎంతో ఆశపడుచున్నది. అది సొమ్మ సిల్లుచున్నది. జీవముగల దేవుని దర్శించుటకు నా హృదయమును,  నా శరీరమును ఆనందముతో కేకలు వేయు చున్నవి.

ఈ వచనాలు చదివితే, ఈ కీర్తనాకారుడు దేవుని మందిరానికి వెళ్లాలని ఎంతగా ఇష్టపడుచున్నాడో మనకు అర్ధమవుచున్నది. ప్రత్యక్ష గుడారం ఆవరణములను చూడవలెనని అతని ప్రాణం ఎంతో ఆశపడినది. ప్రత్యక్ష గుడారం లో దేవుని సన్నిధి ఇశ్రాయేలీయుల ఆత్మ దాహాన్ని తీర్చినట్లుగా నేడు మన యొక్క ఆత్మల దాహాన్ని ప్రభువైన యేసు క్రీస్తు తీర్చుచున్నాడు.

యోహాను సువార్త 4:13-14

అందుకు యేసు ఈ నీళ్లు త్రాగు ప్రతివాడును మరల దప్పిగొనును; నేనిచ్చు నీళ్లు త్రాగు వాడెప్పుడును దప్పిగొనడు; నేను వానికిచ్చు నీళ్లు నిత్యజీవమునకై వానిలో ఊరెడి నీటి బుగ్గగా ఉండునని ఆమెతో చెప్పెను.

ప్రత్యక్ష గుడారం చుట్టూ ఒక పెద్ద ఆవరణం ఉంది.

నిర్గామకాండము 27:9

మరియు నీవు మందిరమునకు ఆవరణము ఏర్పరచవలెను. కుడివైపున, అనగా దక్షిణదిక్కున ఆవరణముగా నూరు మూరల పొడుగుగలదై పేనిన సన్న నార యవనికలు ఒక ప్రక్కకు ఉండవలెను.

ఈ ప్రత్యక్ష గుడారము తెల్లటి ప్రాకారముతో చుట్టబడింది. ఆ ప్రాకారం సన్న నారతో చేయబడింది. ఆ తెలుపులో దేవుని యొక్క నీతి, పరిశుద్ధత మనకు కనిపిస్తున్నాయి.

ప్రకటన గ్రంథము 19:8.

మరియు ఆమె ధరించుకొనుటకు ప్రకాశములును నిర్మల ములునైన సన్నపు నారబట్టలు ఆమెకియ్యబడెను; అవి పరిశుద్ధుల నీతిక్రియలు.

దేవుని యొక్క పరిశుద్ధత

   సిలువ యొక్క విలువ మనకు అర్ధం కావాలంటే దేవుడు పరిశుద్ధుడు అన్న విషయం ముందు మనం తెలుసుకోవాలి. Pantheism సర్వదైవత్వం యేమని భోధిస్తుందంటే, అన్నిటిలో దేవుడు ఉన్నాడు. కొన్ని మతాలు ఏమంటాయంటే, అన్నిటిలో దేవుడు ఉన్నాడు. దేవుడు అన్ని వస్తువుల్లో వున్నాడు అని భోదిస్తాయి. అందుకనే దేవుడు పరిశుద్ధుడు అనే సత్యం ఆ మతాలు గ్రహించలేకపోయాయి.

    బైబిల్లో సర్వదైవత్వం లేదు. దేవుడు వేరు. సృష్టి వేరు. దేవుడు పరిపూర్ణముగా పరిశుద్ధుడు. ఆ పరిపూర్ణమయిన పరిశుద్ధత దేవుని సృష్టిలోని సమస్త వ్యక్తుల నుండి, వస్తువుల నుండి ఆయనను వేరుచేసింది. ప్రత్యక్ష గుడారము యొక్క ప్రాకారం మనం చూస్తే దేవుని యొక్క పరిశుద్ధత అక్కడ మనకు కనిపిస్తున్నది. ఆయన ప్రత్యేకత మనకు కనిపిస్తున్నది. క్రైస్తవ సత్యాల్లో మొదటి సత్యం: దేవుడు పరిశుద్ధుడు. ఆ సత్యం ప్రత్యక్ష గుడారము యొక్క ప్రాకారం చూస్తే మనకు అర్ధం అగుచున్నది.

ఆ ప్రాకారం ఫ్రైగుండా చూస్తే ఆ ఆవరణ లోపల మనకు ఒక బలిపీఠం కనిపిస్తున్నది. ఈ బలిపీఠం యొక్క ప్రాధాన్యత

    మనకు అర్ధం కావాలంటే ముందు మనకు ఆ ప్రాకారం  యొక్క ఉద్దేశ్యం తెలియాలి. ఈ ప్రపంచానికి సిలువ అర్ధం కాకపోవటానికి కారణం ఏమిటంటే, దేవుడు పరిశుద్ధుడు అన్న సత్యం అది గ్రహించలేకపోయింది.

అపొస్తలుడయిన పౌలు కొరింధీయులకు వ్రాసాడు:

1 కొరింథీయులకు 1:18 – సిలువనుగూర్చిన వార్త, నశించుచున్న వారికి వెఱ్ఱి తనము గాని రక్షింపబడుచున్న మనకు దేవుని శక్తి.

ఈ ప్రపంచానికి యేసు క్రీస్తు యొక్క సిలువ వెర్రితనం లాగా ఉంది, ఎందుకంటే, దేవుడు పరిశుద్ధుడు అన్న విషయం అది తెలుసుకోలేదు.

గ్రీసు దేశములోని కొరింథు పట్టనస్తులకు పౌలు గారు ఈ పత్రిక వ్రాసాడు.

1 కొరింథీయులకు 1

 1. యూదులు సూచక క్రియలు చేయుమని అడుగుచున్నారు, గ్రీసుదేశస్థులు జ్ఞానము వెదకు చున్నారు.
 2. అయితే మేము సిలువ వేయబడిన క్రీస్తును ప్రకటించుచున్నాము.

    పౌలు గారు ఏమంటున్నాడో చూడండి: యూదులు సూచక క్రియలు చేయుమని అడుగుచున్నారు. ఉదాహరణకు, పేతురు గారిని చూడండి. యేసు ప్రభువు చేసే అద్భుతాలు, సూచక క్రియలు చూసి ఆయన ఆనందిస్తావున్నాడు.

   యేసు ప్రభువు కొన్ని వేలమందికి ఆహారం పెట్టడం, రోగులను స్వస్థపరచడం, మృతులను తిరిగిలేపడం, నీళ్ల మీద నడవడం, తుఫానులను గద్దించడం అవన్నీ చూసి పేతురు గారు సంతోషపడ్డాడు. ఎప్పుడయితే యేసు ప్రభువు సిలువ గురించి మాట్లాడాడో అప్పుడు పేతురు గారు అసహనం చెందాడు. మత్తయి సువార్త 16:21-22  చదువుదాం:

 1. అప్పటినుండి తాను యెరూషలేమునకు వెళ్లి పెద్దలచేతను ప్రధాన యాజకులచేతను శాస్త్రులచేతను అనేక హింసలు పొంది, చంపబడి, మూడవదినమున లేచుట అగత్యమని  యేసు తన శిష్యులకు తెలియచేయ మొదలుపెట్టగా 22. పేతురు ఆయన చేయి పట్టుకొని ప్రభువా, అది నీకు దూరమగుగాక, అది నీ కెన్నడును కలుగదని ఆయనను గద్దింపసాగెను.

యేసు ప్రభువు తన సిలువ గురించి మాట్లాడడం మొదలుపెట్టినప్పుడు, పేతురు గారు ఏమి చేస్తావున్నాడో చూడండి. యేసు ప్రభువు చేయి పట్టుకొని – నీకు ఎందుకు నాయనా, ఆ సిలువ గొడవ? నా మాట విని నీ శ్రమల గురించి మాట్లాడడం మానుకో అన్నాడు. పేతురు మాటలకు ప్రభువైన యేసు క్రీస్తు చాలా తీవ్రముగా స్పందించాడు.

 1. అయితే ఆయన పేతురు వైపు తిరిగి సాతానా, నా వెనుకకు పొమ్ము; నీవు నాకు అభ్యంతర కారణమైయున్నావు; నీవు మనుష్యుల సంగతులనే తలంచుచున్నావు గాని దేవుని సంగతులను తలంపక యున్నావని పేతురుతో చెప్పెను

సాతానా, నా వెనుకకు పొమ్ము అని యేసు ప్రభువు ఇక్కడ పేతురును గద్దించాడు. సిలువను వ్యతిరేకించడం సాతాను పని. సాతానుడు ఈ ప్రపంచాన్ని  అనేక మతాలతో నింపివేసాడు. వాళ్లందరికీ సాతానుడు యేమని చెప్పాడంటే – 1. దేవుడు పరిశుద్ధుడు కాదు 2. మనిషి పాపాత్ముడు కాదు. ఆ రెండు విషయాలు మరచిపోయాడు. సాతాను మాట ప్రకారం మనిషి దేవునికి, మానవులకు మధ్య వున్న ప్రాకారాన్ని మరచిపోయాడు. రకరకాల దేవుళ్లను తయారుచేసాడు.

అయితే ప్రత్యక్ష గుడారము చుట్టూ దేవుడు ఒక తెల్లని ప్రాకారాన్ని కట్టాడు. ఆ తెల్లటి ప్రాకారం దేవుని యొక్క పరిశుద్దతను, ప్రత్యేకతను మనకు తెలియజేస్తావున్నది. హెబ్రీయులకు వ్రాసిన పత్రిక 7:26  లో మనం చదువుతాము:‘పవిత్రుడును, నిర్దోషియు, నిష్కల్మషుడును, పాపులలో చేరక ప్రత్యేకముగా ఉన్నవాడును’.

   పేతురు గారు యేసు ప్రభువుతో తిరిగినంత కాలం సిలువ యొక్క ప్రాధాన్యత ఆయనకు అర్ధం కాలేదు. ఆ తరువాత యేసు ప్రభువు సిలువ వేయబడి, మరణించి, తిరిగిలేచిన తరువాత సిలువ యెంత ముఖ్యమో ఆయన అర్ధం చేసుకొన్నాడు. 1 పేతురు పత్రికలో ఆయన యేమని వ్రాశాడంటే,

మనము పాపముల విషయమై చనిపోయి, నీతివిషయమై జీవించునట్లు, ఆయన తానే తన శరీరమందు మన పాపములను మ్రానుమీద మోసి కొనెను. ఆయన పొందిన గాయములచేత మీరు స్వస్థత నొందితిరి.(1 పేతురు 2:24)

   యేసు ప్రభువుతో కలిసి తిరిగిన పేతురు గారి లాంటి యూదునికే సిలువ యొక్క ప్రాముఖ్యత అర్ధం కావటానికి చాలా కాలం పట్టింది. ఇక అన్య జనుల పరిస్థితి ఏమిటి?

యూదులు సూచక క్రియలు చేయుమని అడుగుచున్నారు, గ్రీసుదేశస్థులు జ్ఞానము వెదకు చున్నారు. అయితే మేము సిలువవేయబడిన క్రీస్తును ప్రకటించుచున్నాము. 1 కొరింథీయులకు 1:22-23

   గ్రీకు చక్రవర్తి అలెగ్జాండర్ ఐగుప్తు దేశము మీద దండయాత్ర చేసాడు. అక్కడ తన పేరు మీద అలెగ్జాండ్రియా అనే నగరాన్ని స్థాపించాడు. ఆ నగరములో ప్రపంచములోనే పెద్ద లైబ్రరీ కట్టారు. గ్రీకులు జ్ఞానాన్ని వెదికారు. పోయిన సారి నేను టర్కీ దేశం వెళ్ళినప్పుడు అక్కడ ఎఫెసు అనే పట్టణం వెళ్ళాను. అక్కడ గ్రీకులు నిర్మించిన గొప్ప సెల్సస్ లైబ్రరీ శిధిలాలు చూసాను. అనేక గొప్ప గ్రంధాలను గ్రీకులు ఆ లైబ్రరీ లో భద్రపరిచారు. దాని ప్రక్కనే డయానా దేవతకు గొప్ప ఆలయాన్ని కట్టారు. ఆ ఆలయములో దేవదాసీలతో వ్యభిచారం విచ్చలవిడిగా జరిగేది. గ్రీకులు జ్ఞానాన్ని అన్వేషించారు కానీ వారికి దేవుని పరిశుద్ధత గురించి అవగాహన లేదు. అందుకనే వారు పౌలు గారు బోధించిన క్రీస్తు సువార్తను  అపహాస్యం చేశారు.

మృతుల పునరుత్థానమును గూర్చి వారు వినినప్పుడు కొందరు అపహాస్యముచేసిరి;

అపొ. కార్యములు17:32

ఏంటి ఈ పిచ్చివాడు, పాపం  అంటాడు,పరిశుద్ధత అంటాడు, సిలువ అంటాడు, పునరుత్తానము అంటాడు అని పౌలు సువార్తను వారు గేలి చేశారు. గ్రీకులు జ్ఞానం వెదికారు. దేవుడు పరిశుద్ధుడు అన్న సత్యం వారికి అర్ధం కాలేదు.

   ప్రత్యక్ష గుడారము లోకి వెళ్తే మనకు ముందుగా కనిపించేది ఇత్తడి బలిపీఠము. పరిశుద్ధుడయిన దేవుని సన్నిధి లోకి వెళ్లాలంటే, ఎంతటివారయినా సరే, ముందుగా బలిపీఠం దగ్గరకు రావాల్సిందే.

నిర్గామకాండము 38:1-2

మరియు అతడు తుమ్మకఱ్ఱతో దహనబలిపీఠమును చేసెను. దాని పొడుగు అయిదు మూరలు దాని వెడల్పు

అయిదు మూరలు, అది చచ్చౌకమైనది. దాని యెత్తు మూడు మూరలు దాని నాలుగు మూలలను కొమ్ములను చేసెను. దాని కొమ్ములు దానితో ఏకాండమైనవి; దానికి ఇత్తడిరేకు పొదిగించెను.

   ఈ దహన బలిపీఠం తుమ్మకఱ్ఱతో చేయబడింది. ఆ తుమ్మ కఱ్ఱ మీద ఇత్తడి రేకు పొడిగించబడింది. ఇక్కడ ఇత్తడి దేవుని తీర్పును సూచిస్తున్నది. సంఖ్యా కాండము లో ఒక సంఘటన చూస్తే మనకు ఈ ఇత్తడి యొక్క అర్ధం ఏమిటో స్పష్టమవుతుంది.

సంఖ్యాకాండము 21: 7-9

 1. కాబట్టి ప్రజలు మోషే యొద్దకు వచ్చిమేము యెహోవాకును నీకును విరోధముగా మాటలాడి పాపము చేసితివిు; యెహోవా మా మధ్య నుండి ఈ సర్పములను తొలగించునట్లు ఆయనను వేడుకొనుమనిరి .8. మోషే ప్రజలకొరకు ప్రార్థన చేయగా యెహోవా నీవు తాపకరమైన సర్పము వంటి ప్రతిమను చేయించి స్తంభముమీద పెట్టుము; అప్పుడు కరవబడిన ప్రతివాడును దానివైపుచూచి బ్రదుకునని మోషేకు సెలవిచ్చెను.
 2. కాబట్టి మోషే ఇత్తడి సర్ప మొకటి చేయించి స్తంభముమీద దానిని పెట్టెను. అప్పుడు సర్పపుకాటు తినిన

ప్రతివాడు ఆ యిత్తడి సర్పమును నిదానించి చూచినందున బ్రదికెను.

  ఇశ్రాయేలీయులు పాపము చేసినప్పుడు దేవుని తీర్పు వారి మీదకు వచ్చి పాములు వారిని కరిచాయి. మోషే వారి  ఒక ఇత్తడి సర్పాన్ని చేయించి వారి ముందు పెట్టాడు. ఇత్తడి ఇక్కడ దేవుని తీర్పుకు గుర్తుగా ఉంది.

ద్వితియోపదేశకాండము 28 లో దేవుడు ఇశ్రాయేలీయులను శాపం గురించి హెచ్చరించాడు.

 1. నీ తలపైని ఆకాశము ఇత్తడివలె ఉండును, నీ క్రిందనున్న నేల యినుమువలె ఉండును.

   దేవుడు ఇక్కడ ఇశ్రాయేలీయులతో ఏమంటున్నాడంటే, మీ మీదకు శాపం వచ్చినప్పుడు, మీ తల మీద ఆకాశం ఇత్తడి వలె మారుతుంది. ఆ విధముగా ఇత్తడి దేవుని శాపానికి గుర్తుగా ఉంది.

ప్రత్యక్ష గుడారము లోని ఈ బలిపీఠం మీద ఇత్తడి కూడా దేవుని తీర్పుకు, శాపానికి గుర్తుగా ఉంది.

   అదే విధముగా సిలువ మీద దేవుని యొక్క తీర్పును, దేవుని శాపాన్ని మన స్థానములో ప్రభువైన యేసు క్రీస్తు భరించాడు. ప్రత్యక్ష గుడారము లోని ఈ బలిపీఠం ఇత్తడి రేకు తో కప్పబడినప్పటికీ, ఆ రేకు క్రింద తుమ్మ కఱ్ఱ ఉంది. ఆ తుమ్మ కఱ్ఱ యేసు క్రీస్తు యొక్క శరీరానికి సాదృశ్యముగా ఉంది.

ఇంతకు ముందు 1 పేతురు 2:24 లో మనం చదివాము:

   మనము పాపముల విషయమై చనిపోయి, నీతి విషయమై జీవించునట్లు, ఆయన తానే తన శరీరమందు మన పాపములను మ్రానుమీద మోసి కొనెను. ఆయన పొందిన గాయములచేత మీరు

స్వస్థత నొందితిరి.

  ఇశ్రాయేలీయుల పాపాలు ఆ బలిపీఠం మోసింది. యేసు క్రీస్తు యొక్క శరీరం మన పాపములను మోసింది. ఆ బలిపీఠం యొద్ద బలులు ఎలా అర్పించారో చూద్దాం.

లేవీకాండము 1

 1. యెహోవా మోషేను పిలిచి ప్రత్యక్షపు గుడార ములో నుండి అతనికీలాగు సెలవిచ్చెను. 2. నీవు ఇశ్రా యేలీయులతో ఇట్లనుము. మీలో ఎవరైనను యెహో వాకు బలి అర్పించునప్పుడు, గోవుల మందలోనుండిగాని, గొఱ్ఱెల మందలోనుండి గాని, మేకల మందలోనుండి గాని దానిని తీసికొని రావలెను.3. అతడు దహనబలిరూపముగా అర్పించునది గోవులలోని దైనయెడల నిర్దోషమైన మగ దానిని తీసికొని రావలెను. తాను యెహోవా సన్నిధిని అంగీకరింపబడునట్లు ప్రత్యక్షపు గుడారముయొక్క ద్వారమునకు దానిని తీసికొని రావలెను.
 2. అతడు దహనబలిగా అర్పించు పశువు తలమీద తన చెయ్యి నుంచవలెను; అతని నిమిత్తము ప్రాయశ్చిత్తము కలుగునట్లు అది అతని పక్షముగా అంగీకరింపబడును. 5. అతడు యెహోవా సన్నిధిని ఆ కోడె దూడను వధించిన తరువాత యాజకులైన అహ రోను కుమారులు దాని రక్తమును తెచ్చి ప్రత్యక్షపు గుడారము ఎదుటనున్న బలిపీఠముచుట్టు ఆ రక్తమును ప్రోక్షింపవలెను.

   దేవుడు యేమని చెప్పాడంటే – నిర్దోషమయిన జంతువు, ఎద్దు లేక గొర్రె లేక మేక ప్రత్యక్ష గుడారము లోని బలిపీఠం దగ్గరకు తీసుకురండి. ఆ జంతువు తల మీద మీ చేతులు పెట్టండి. ఆ జంతువును వధించి, దాని రక్తాన్ని బలిపీఠం చుట్టూ ప్రోక్షించండి.

మీ చేతులు ఆ జంతువు మీద పెట్టండి అని దేవుడు చెప్పాడు. ఇక్కడ మనకు Substitution, అంటే ‘మనకు బదులుగా’ కనిపిస్తున్నది. మనకు బదులుగా అనే ముఖ్యమయిన క్రైస్తవ సత్యం ఇక్కడ మనకు కనిపిస్తున్నది. ఇది క్రొత్తదేమీ కాదు. ఆదాము, హవ్వలు ఏదెను వనములో పాపము చేసిన తరువాత, వారు తాము దిగంబరులము అని తెలుసుకొని అంజూరపు చెట్ల ఆకులతో వస్త్రాలు చేసుకొని తొడుగుకొన్నారు. అయితే దేవుడు ఏమి చేసాడంటే, వారికి ఒక జంతువును చంపి దాని చర్మముతో వారికి వస్త్రాలు చేసి తొడిగించాడు. ఏదెను వనములో, ‘మనకు బదులుగా’ ‘our substitution’ అన్న సత్యం మనకు కనిపిస్తున్నది.

  ఈ ప్రత్యక్ష గుడారము లో అదే సత్యము మనకు కనిపిస్తున్నది. ఆ జంతువు మీద ఇశ్రాయేలీయులు తమ చేతులు పెట్టి, ‘ఈ జంతువు మాకు బదులుగా’ అని పలికారు. సిలువ దగ్గర జరిగింది కూడా అదే కదా! మనమందరము దేవుని గొర్రెపిల్ల యేసు క్రీస్తు మీద మన చేతులు పెట్టాము. మీకు బదులుగా, నాకు బదులుగా ఆయన సిలువ మీద మన పాపముల కొరకు అర్పించబడ్డాడు.

  ఆ బలిపీఠం దగ్గర గొర్రెపిల్ల రక్తం చిందించబడినట్లు, మన కొరకు దేవుని గొర్రెపిల్ల యేసు క్రీస్తు రక్తం చిందింది. ఆ విధముగా ప్రత్యక్ష గుడారము లోని ఆవరణలో ఉన్న ఈ ఇత్తడి బలిపీఠం దగ్గర సిలువ మీద మన పాపముల కొరకు బలైన  యేసు క్రీస్తు కనిపిస్తున్నాడు.

  ఆయన సిలువ దగ్గరకు వచ్చి, నీ పాపములు ఒప్పుకొన్నావా? రక్షణ పొందావా?

డాక్టర్ పాల్ కట్టుపల్లి

www.doctorpaul.org

ఇక్కడ క్లిక్ చేసి డౌన్ లోడ్ చేసుకోండి

Leave a Reply