అవిశ్వాసం….అసంతృప్తి….అవిధేయత….అలజడి
ఇశ్రాయేలీయుల జనాభా లెక్కలతో సంఖ్యాకాండము మొదలవుతుంది. హెబ్రీ భాషలో ఈ పుస్తకము పేరు ‘అరణ్యములో’. ఇశ్రాయేలీయులు అరణ్య యాత్ర విషాద యాత్రగా మారింది. వారు తమ దృష్టిని దేవుడు, వాగ్దాన దేశము మీద కాకుండా తాము విడచివచ్చిన ఐగుప్తు మీద పెట్టారు. వారి అవిశ్వాసం అసంతృప్తికి దారి తీసింది. సణుగుడు, గొణుగుడు వారి దినచర్యగా మారింది. త్వరితగతిన వారు అవిధేయతతో దేవుని మీద తిరుగుబాటు చేశారు. వారి సమాజములో అలజడి మొదలయ్యింది. దేవుడు వారి పట్ల ఎంతో సహనాన్ని చూపించాడు. నలభై సంవత్సరాలు వారు అరణ్యములోనే ఉండాల్సి వచ్చింది, ఎందుకంటే కనాను లో ప్రవేశించటానికి కావలసిన విశ్వాసం వారికి లేదు. ఇశ్రాయేలీయుల అవిశ్వాసం, అవిధేయత వారికి అవరోధం, అడ్డంకులుగా మారాయి. దేవుడు వారి కోసం ఉద్దేశించినవి వారు పొందలేకపోయారు.
అయినప్పటికీ, దేవుడు తాను అబ్రాహాముకు ఇచ్చిన మాట చొప్పున ఇశ్రాయేలీయులను వాగ్దాన దేశము వైపు నడిపించాడు. వారు యెరికో పట్టణము సమీపములో, యొర్దాను నదికి తూర్పున మోయాబు మైదానములో ప్రవేశించుటతో ఈ పుస్తకము ముగుస్తుంది.
రచయిత: మోషే
వ్రాయబడిన కాలము: క్రీ. పూ 1450 – 1410
వ్రాయబడిన స్థలము: సీనాయి అరణ్యము
ముఖ్య అంశాలు:
- జనాభా లెక్కలు: దేవుడు తన ప్రజలను లెక్కించాడు. ప్రతి వ్యక్తికి ఆయన విలువ ఇస్తాడు.
- అవిధేయత: ఇశ్రాయేలీయులు, మిర్యాము, బిలాము, మోషే అందరూ దేవునికి అవిధేయులుగా మారుటను ఈ పుస్తకములో చూస్తాము.
- దేవుని క్రమశిక్షణ: దేవుని యందు విశ్వాసముంచని ఇశ్రాయేలీయులందరూ అరణ్యములో రాలిపోయారు. ఇశ్రాయేలీయులు వ్యభిచారము చేసినప్పుడు కూడా దేవుడు వారిని శిక్షించాడు. 40 రోజుల పాటు కనాను దేశమును వేగులు చూసిన 12 మందిలో పది మంది ససేమిరా అన్నారు. అవిశ్వాసముతో దేవుని ప్రణాలికను వారు, ఇశ్రాయేలీయులు తిరస్కరించారు. 40 రోజులకు, రోజుకు ఒక సంవత్సరము చొప్పున, 40 సంవత్సరాలు ఇశ్రాయేలీయులు అరణ్యములో నిష్ప్రయోజనముగా తిరుగులాడవలసి వచ్చింది.
- దేవుని ఆశీర్వాదము: బాలాకు, బిలాము లు ఇశ్రాయేలీయులను శపించాలని వ్యర్ధ ప్రయత్నము చేసి విఫలులయ్యారు. దేవుడు తన స్నేహితుడయిన అబ్రాహాముతో చేసిన వాగ్దానాన్ని మరచిపోడు.
- నిరీక్షణ: ఇశ్రాయేలీయులు అవిధేయులయినప్పటికీ దేవుడు వారి రెండవ తరమును తన విశ్వసనీయతతో వాగ్దాన దేశమునకు నడిపించాడు.
- దేవుని నాయకత్వము: అహరోను, మిర్యాములు మోషే మీద తిరుగు బాటు చేశారు. అప్పుడు దేవుడు మోషే ని, అతని నమ్మకమైన నాయకత్వాన్ని బలపరచాడు.
ముఖ్య వ్యక్తులు: మోషే, అహరోను, మిర్యాము, యెహోషువ, కాలేబు, కోరహు, ఎలియాజరు, బిలాము
గ్రంథ విభజన:
మొదటి జనాభా లెక్కలు (1-4)
పాళెము యొక్క పవిత్రత (5)
నాజీరు చేయబడు విధానము (6)
ప్రత్యక్ష గుడారము విధులు (7-10)
ఇశ్రాయేలీయుల సణుగుడు (11-12)
కనాను దేశమునకు వెళ్లిన 12 మంది వేగుల వారు (13-14)
అరణ్యములో బలులు, అర్పణలు (15-19)
కాదేషులో సణుగుడు (20)
దేవుని ఉగ్రత, ఇత్తడి సర్పము ద్వారా చికిత్స (21)
బిలాము ప్రవచనాలు (22,23,24)
షిత్తీము లో వ్యభిచారము, దేవుని శిక్ష (25)
కనానును జయించుటకు ఇశ్రాయేలీయుల సిద్ధపాటు (26 – 36)
ముఖ్య ప్రవచనాలు:
సంఖ్యా 21 – మోషే చేయించిన ఇత్తడి సర్పము రాబోయే యేసు క్రీస్తు సిలువ మరణాన్ని ప్రవచించింది (యోహాను 3:14)
సంఖ్యా 24: ‘నక్షత్రము యాకోబులో ఉదయించును, రాజదండము ఇశ్రాయేలులో నుండి లేచును’ అని బిలాము ప్రవచించాడు. ఆ ప్రవచనము ప్రభువైన యేసు క్రీస్తు లో నెరవేరింది.
ప్రభువైన యేసు క్రీస్తు రూపం:
- (సంఖ్యా 21) – ఇశ్రాయేలీయుల రక్షణ కొరకు మోషే ఇత్తడి సర్పము ఎత్తాడు. మన రక్షణ కొరకు ప్రభువైన యేసు క్రీస్తు సిలువ మీద ఎత్తబడ్డాడు (యోహాను 3:14). ఇశ్రాయేలీయులు ఆ ఇత్తడి సర్పము వైపు చూసి జీవించారు. యేసు క్రీస్తు సిలువ వైపు చూసి మనము నిత్యజీవము పొందాము.
- యాకోబులో ఉదయించిన నక్షత్రము మన ప్రభువైన యేసు క్రీస్తే. ఇశ్రాయేలుకు నిజమయిన రాజు ఆయనే.
- మోషే దేవుని ఇల్లంతటిలో నమ్మకమైన సేవకుడు. యేసు క్రీస్తు దేవుని ఇల్లంతటిలో నమ్మకమైన కుమారుడు (హెబ్రీ 3:6)
- బిలాము దేవుని పిల్లల మీదకు శాపము తెచ్చుటకు ప్రయత్నించాడు. యేసు క్రీస్తు మన మీద ఉన్న శాపమును తీసివేసి ఆశీర్వాదమును అనుగ్రహించాడు.
మనం నేర్చుకోవలసిన పాఠాలు:
- ఇశ్రాయేలీయులు తమ కాళ్ళు కనాను వైపుకు నడుస్తున్నప్పటికీ, తమ కళ్ళను మాత్రం ఐగుప్తు వైపే ఉంచారు. మనం లోకం వైపు చూస్తున్నామా? పరలోకం వైపు, క్రీస్తు వైపు చూస్తున్నామా?
- ఇశ్రాయేలీయులు దేవుని యొక్క మంచితనాన్ని అనుభవిస్తూనే, ‘ఇది బాగాలేదు, అది బాగాలేదు’ అంటూ సణుగుతూ, గొణుగుతూ దేవుని స్తుతించ లేకపోయారు. మన హృదయములో దేవుని పట్ల కృతజ్ఞత లేకపోతే, మనం కూడా దేవుని స్తుతించలేము. సణుగుతూ, గొణుగుతూ దేవుని ఆత్మను మనం వేదనకు గురిచేస్తాము.
- ‘నా సేవకుడైన మోషే నా ఇల్లంతటిలో నమ్మకమైనవాడు.’ (సంఖ్యాకాండం 12:7) అని దేవుడు మోషే గురించి చెప్పాడు. దేవుడు మన గురించి ఎలాంటి అభిప్రాయము కలిగి ఉన్నాడు?
- కనాను దేశమును వేగు చూసిన 12 మందిలో కాలేబు, యెహోషువాలు మాత్రమే విశ్వాసముతో నిలిచారు. మన వైపు కొద్దిమంది మాత్రమే ఉన్నప్పుడు విశ్వాసముతో దేవుని వైపు నిలబడే ధైర్యము మనకు ఉండాలి.
- సంఖ్యా 25: ఇశ్రాయేలీయులు మోయాబు స్త్రీలతో వ్యభిచారము చేశారు. అప్పుడు దేవుడు వారిని తీవ్రముగా శిక్షించాడు. సెక్స్ పాపాలను మన జీవితము నుండి తొలగించామా?
Numbers: An Introduction by Paul Kattupalli

Please make a donation to our ministry
We are sustained by donations averaging about $20. Only a tiny portion of our readers give. Please support us to keep us online and growing. Thank you.
$20.00
చాలా బాగున్నాయి. వందనాలు బ్రదర్