న్యాయాధిపతులు, గ్రంథ పరిచయం: డాక్టర్ పాల్ కట్టుపల్లి

 

పరిచయం: యెహోషువ ద్వారా ఇశ్రాయేలీయులు ఎన్నో ఘన విజయాలు అందుకొని కనాను దేశమును ఆక్రమించుకున్నారు. శత్రువులందరినీ పూర్తిగా నిర్మూలించండి అని దేవుడు ఇచ్చిన ఆజ్ఞను వారు నిర్లక్ష్యము చేశారు. వారిని తమ ప్రక్కనే ఉండనిచ్చారు. వారిని పెండ్లి చేసుకొని, బంధువులు అయ్యారు. వారి దేవతలను పూజించి, యెహోవా దేవుని మరచిపోయి విగ్రహారాధనలోకి ఈడ్చబడ్డారు. వారి ఆలయాల్లో వ్యభిచారం చేసి, నరబలులు, శిశుబలులు చేశారు. అన్యులతో వ్యాపారము చేసి, ఐశ్వర్యము పొంది, మాకు ఇది చాలు అనుకొన్నారు. దేవుని ధర్మ శాస్త్రమును విసర్జించి, తమ దృష్టిలో ఏది నచ్చితే అది చేశారు.

    ఇశ్రాయేలీయుల నైతిక పతనము వారి దేశాన్ని సైనికముగా బలహీనపరచింది. వారి శత్రువులు వారిని మొత్తి బాధపెట్టినప్పుడు, దేవునికి మొఱ్ఱ పెట్టారు. దేవుడు వారిని కరుణించి న్యాయాధిపతులను పంపి వారిని విడిపించాడు. యెహోషువ కాలము (క్రీ.పూ 1398) నుండి దావీదు కాలము (క్రీ. పూ 1043) ల మధ్య దాదాపు 350 సంవత్సరాల కాలములో దేవుడు 14 మంది న్యాయాధిపతులను ఇశ్రాయేలీయులకు అనుగ్రహించాడు. ప్రజలకు విశ్వాసము లేకపోయినప్పుడు కూడా దేవుడు తన నమ్మకత్వాన్ని వారి పట్ల చూపించాడు.

రచయిత: ఖచ్చితముగా చెప్పలేము, యూదుల తాల్ముడ్ ప్రకారము సమూయేలు

వ్రాయబడిన కాలము: క్రీ. పూ 1045

వ్రాయబడిన స్థలము: కనాను దేశము

ముఖ్య అంశాలు:

అవిధేయత: ఇశ్రాయేలీయులు దేవుని మార్గముల నుండి తొలగిపోయారు. భ్రష్టత్వములో మునిగిపోయారు. వారి దేశము బలహీనంగా మారింది.

అపజయం: వారి శత్రువులు ఇశ్రాయేలీయులను ఓడించి, ఆక్రమించుకొని, బాధ పెట్టారు.

పశ్చాత్తాపము: బాధలో ఉండి  ఇశ్రాయేలీయులు దేవునికి మొఱ్ఱ పెట్టారు.

దేవుని సహాయము: దేవుడు వారి మొఱ్ఱ విని, న్యాయాధిపతులను పంపి వారిని శత్రువుల నుండి విడిపించి సహాయము చేసాడు.

వివక్ష చూపని దేవుడు: యెఫ్తా వేశ్య కుమారుడు అయినప్పటికీ దేవుడు ఆయనను తన పనిలో ఉపయోగించుకున్నాడు. దెబోరా స్త్రీ అయినప్పటికీ దేవుడు ఆమెను తన పనికి పిలుచుకొన్నాడు. దేవుడు పక్షపాతి కాదు, ఆయనకు అందరూ సమానమే.

హింస: ఒక వ్యక్తి తన భార్యను చంపి పండ్రెండు ముక్కలు చేసి, ఆ ముక్కలను దేశమంతా పంపించిన భయంకర సంఘటనను 19 అధ్యాయములో చదువుతాము. దేవుని భయము లేని సమాజములో హింస పెరిగిపోతుంది. ప్రజల ప్రాణాలకు విలువ ఉండదు.

ముఖ్య వ్యక్తులు: ఒత్నీయేలు, ఏహూదు, షంగరు, దెబోరా, బారాకు,గిద్యోను,తోలా, యాయీరు,యెఫ్తా, ఇబ్సాను, ఏలోను, అబ్దోను,సమ్సోను

గ్రంథ విభజన:

ఇశ్రాయేలీయుల అవిధేయత (1:1 – 3:6)

మొదటి అంకం (1:1 – 2:5)

రెండవ అంకం (2:6 – 3:6)

న్యాయాధిపతుల కాలము (3:7 – 16:31)

మొదటి తరం: ఒత్నీయేలు (3:7-11)

రెండవ తరం: ఏహూదు, షంగరు (3:12 – 30)

మూడవ తరం: దెబోరా, బారాకు (4:1 – 5:31)

నాలుగవ తరం: గిద్యోను (6:1 – 8:32)

ఐదవ తరం: తోలా, యాయీరు (8:33 – 10:5)

ఆరవ తరం: యెఫ్తా, ఇబ్సాను, ఏలోను, అబ్దోను (10:6 – 12:15)

ఏడవ తరం: సమ్సోను (13:1 – 16:31)

ఇశ్రాయేలు నైతిక పతనము (17 – 21)

మీకా విగ్రహారాధన (17-18)

గిబియా లో హత్య (19)

అంతర్గత యుద్ధము (20-21)

ముఖ్య ప్రవచనాలు:

కనానీయుల మీద విజయము (1:1-4)

అసంపూర్తిగా మిగిలిన కనాను దేశ ఆక్రమణ (2:1-3)

ఇశ్రాయేలీయులు మారుమనస్సు పొందితే విడుదల వస్తుంది (10:13 -14)

ప్రభువైన యేసు క్రీస్తు రూపం: తన ప్రజలను రక్షించటానికి దేవుడు న్యాయాధిపతులను పంపాడు. కాలము సంపూర్ణమయినప్పుడు దేవుడు తానే మనమధ్యకు ఒక న్యాయాధి పతిగా వచ్చాడు. ఈ 14 మంది న్యాయాధి పతులు బలహీనులు, అసంపూర్ణులు, పాపాలు చేసిన వారు. యేసు క్రీస్తు బలవంతుడైన, పరిపూర్ణుడైన, పాపములేని న్యాయాధిపతి. ఆయన మనలను విమోచించి, రక్షించి, విజయము అనుగ్రహించాడు. ‘అయినను మన ప్రభువైన యేసుక్రీస్తు మూలముగా మనకు జయము అనుగ్రహించుచున్న దేవునికి స్తోత్రము కలుగును గాక’ (1 కొరింథీ 15:57).

మనం నేర్చుకోవలసిన పాఠాలు:

  1. దేవుడు లేని సమాజము: ఆ దినములలో ఇశ్రాయేలీయులకు రాజు లేడు; ప్రతి వాడును తన తన ఇష్టానుసారముగా ప్రవర్తించుచువచ్చెను (న్యాయాధిపతులు 21:25). నేడు మన సమాజము కూడా ఇలానే ఉంది. ప్రతి ఒక్కరూ వారి ఇష్టానుసారం జీవిస్తున్నారే కానీ, దేవుడు ఏమనుకొంటాడు అని ఆలోచించేవాళ్ళు తగ్గిపోతూ ఉన్నారు.
  2. దేవుని భయం: దేవుని భయము పోయిన తరువాత మనము నైతికంగా పతనములోకి వెళ్ళిపోతాము. మన జీవితములో దేవుని భయము ఉందా?
  3. పాపము తెచ్చే పతనము: ఇశ్రాయేలీయుల పాపాలు వారిని పతనము నకు నడిపించాయి. మన జీవితములో పాపమును మనం ఒప్పుకొని, విడిచిపెట్టామా?
  4. అన్యులతో మత కలయికలు: ఇశ్రాయేలీయులు అన్యులతో కలిసి వారి మతాలను అవలంబించారు. వారి పరిశుద్దతను కోల్పోయారు. అన్యులతో స్నేహము చేయవచ్చు, కానీ వారి మతమును క్రైస్తవ్యములో కలిపే ప్రమాదాన్ని మనం గుర్తించామా? అన్ని మతాలూ ఒక్కటే అనే సాతాను అబద్దాన్ని నమ్ముచున్నామా?
  5. విగ్రహారాధన: ఇశ్రాయేలీయులు దేవుని వదలిపెట్టి విగ్రహాలు చేసుకొన్నారు. మన జీవితములో డబ్బు, స్టేటస్, కీర్తి, పదవులు లాంటి విగ్రహాలు మనలను దేవుని ప్రేమించకుండా చేసే అవకాశం ఉంది. ఆ విషయములో మనము జాగ్రత్తగా ఉన్నామా?
  6. అక్రమ సంభందాలు: గిద్యోను ఒక స్త్రీ తో అక్రమ సంభందాన్ని పెట్టుకొని అబీమెలెకును కన్నాడు. అబీమెలెకు గిద్యోను కుటుంబాన్ని వేధించాడు. అతని 69 మంది కుమారులను హతమార్చాడు. అక్రమ సంబంధాలు మన సమాజములో ఎన్నో కుటుంబ కలహాలకు, హత్యలకు కారణమవుచున్నాయని గుర్తించామా?
  7. సెక్స్ పాపాలు: సమ్సోను శారీరకంగా బలాఢ్యుడు. దేవుని మీద గురి పెట్టకుండా, స్త్రీల మీద వ్యామోహాన్ని పెంచుకొని చివరకు తన ప్రియురాలు చేసిన నమ్మక ద్రోహము వలెనే ప్రాణాలు కోల్పోయాడు. మన జీవితములో సెక్స్ పాపాలు ఉంటే, వాటిని గుర్తించి, ఒప్పుకొని, విడిచిపెట్టామా? దెలీలా లాంటి స్త్రీలను సాతాను మన జీవితములోకి పంపే అవకాశము ఉంది. మనం స్నేహాలు, సహవాసాలు, సంబంధాలు పెట్టుకొనే ముందు అవి దేవునితో మన సంబంధాన్ని ఎలా ప్రభావితము చేస్తాయో ఆలోచిస్తున్నామా?
  8. తొందరపడి శపధాలు: యెఫ్తా తొందరపడి శపథం చేసాడు (11 అధ్యాయము). తరువాత చాలా విచారించాడు. మన మాటలు జాగ్రత్తగా మాట్లాడుచున్నామా?

Please make a donation to our ministry

We are sustained by donations averaging about $20. Only a tiny portion of our readers give. Please support us to keep us online and growing. Thank you.

$20.00

Leave a Reply