కట్టుపల్లి యోహాను గారి భూస్థాపన సందేశం

F4367780-2341-4F20-AA69-ABA055E2862C.jpeg

Brother K.Yohan funeral sermon by Dr.Paul Kattupalli.

మా నాన్న, మన ప్రియమైన సహోదరుడు కట్టుపల్లి యోహాను గారి భూస్థాపన కార్యక్రమానికి విచ్చేసిన మీ అందరికి మేము వందనాలు తెలియజేస్తున్నాము. చాలా మంది దూర ప్రాంతాల నుండి ప్రయాణం చేసి వచ్చారు. మీరు చూపిస్తున్న ప్రేమకు, ఆదరణకు మేము కృతఙ్ఞులం.

2014 లో కాన్సర్ ఆయన శరీరములో బయటపడింది. గత నాలుగు సంవత్సరాలు కాన్సర్ తో పోరాడిన తరువాత దేవుడు యోహాను గారిని తన ఇంటికి పిలుచుకొన్నాడు.

  1999 లో నేను గుంటూరు లో MBBS చదివే రోజుల్లో Davidson’s Textbook of Medicine అని ఉండేది. ఒక రోజు multiple myeloma అనే జబ్బు గురించి చదువుతూ ఉన్నాను. ఒక  skull x ray అందులో ఉంచారు. ఆ కాన్సర్ వలన కొంతమందికి skull లో రంధ్రాలు పడతాయి. ఆ రోజుల్లో నేను – ఈ జబ్బు నాకు తెలిసినవారికి ఎవరికీ రాకూడదు అని అనుకొంటూ ఉండేవాణ్ణి.   

Fast forward to 15 years.

2014 నవంబర్ నెలలో మా నాన్న నాకు ఫోన్ చేసాడు. ఒంటిలో నొప్పులు, కొన్ని అడుగులు కూడా ఆయాసము, లేకుండా వేయ లేకపోవుచున్నాను అన్నాడు.

ఆ రోజు నేను ఢిల్లీ లో  ఉన్నాను. గాంధీ గారి మీద ఒక TV కార్యక్రమం రికార్డు చేస్తావున్నాను. ఢిల్లీ లో గాంధీ గడిపిన బిర్లా హౌస్ లో ఉన్నాను. నాధూరాం గాడ్సే గాంధీ ని కాల్చి చంపిన ప్రదేశానికి కొన్ని అడుగుల దూరములో ఉన్నాను. అక్కడ గోడ మీద గాంధీ చెప్పిన మాట ఒకటి వ్రాయబడి వుంది.  

I CLAIM to be a

man of faith and prayer,

and even if I were cut to pieces,

I trust God would give me the strength

not to deny Him and

to assert that He is

నా శరీరం ముక్కలయి పోయినప్పటికి కూడా దేవుని వ్యతిరేకించను,

దేవుని యందు నమ్మకాన్ని వదిలిపెట్టను.

యోహాను గారు కూడా ఆయన శరీరం కాన్సర్ తో యెంత బాధ పడుతున్నప్పటికీ దేవుని స్తుతించడము మానుకోలేదు. ఆఖరి సారి గురువారం మాట్లాడాను. ఆ సమయములో ఎంతో ఆయాసముతో బాధ పడుచున్నాడు. అప్పుడు కూడా దేవుని స్తుతిస్తానేవున్నాడు.

ఇదిగో ఆయన నన్ను చంపినను, నేను ఆయన కొరకు కనిపెట్టుచున్నాను. యోబు గ్రంధం 13:15

Thou he slay me, yet will I trust in Him

2 తిమోతికి 4:7 లో అపొస్తలుడైన పౌలు అన్న మాటలు యోహాను గారికి వర్తిస్తాయి

మంచి పోరాటము పోరాడితిని,

నా పరుగు కడ ముట్టించితిని,

విశ్వాసము కాపాడుకొంటిని.

యోహాను గారి పోరాటం ముగిసింది

ఆయన పరుగు ముగిసింది

ప్రభువైన యేసు క్రీస్తు నందు విశ్వాసముతో ఆ పోరాటం ముగించాడు,

నిరీక్షణతో ఆ పరుగు ముగించాడు.

IMG_0925.JPG

నేను హోటల్ కి వెళ్లి వస్తువులన్నీ సర్దుకొని విజయవాడ వెళ్ళాను. అక్కడ హాస్పిటల్ కి వెళ్ళాను. డాక్టర్ రాజశేఖర్, డాక్టర్ శివ ప్రసాద్ అక్కడ ఉన్నారు. అనేక పరీక్షలు వారు చేయించారు. గత 4 సంవత్సరాలు డాక్టర్ రాజశేఖర్ మా నాన్నకు ఎంతో సహాయం చేసాడు. 24 గంటలు బిజీ గా వుండే డాక్టర్. అయినప్పటికీ మా ఇంటికి కూడా వచ్చి అనేక సార్లు మా నాన్నకు సహాయం చేసాడు.రాత్రి కూడా వచ్చాడు. ‘నేను ఈ రోజు 3 ఆపరేషన్స్ చేయాలి, అవి పోస్ట్ పోన్ చేసుకొని మీ ఫాదర్ ని చూద్దామని వచ్చాను’ అన్నాడు.

అటువంటి అభిమానాన్ని చూపించిన ఆయనకు మేము ఋణస్తులం.  Dr. శివ ప్రసాద్ ఒక రోజు ఫోన్ చేసాడు. మీ ఫాదర్ కి బోన్ మారో టెస్ట్ చేయించాము. కాన్సర్ అన్నాడు. నేను ఆ మాట విని షాక్ తిన్నాను. కాన్సర్ స్టేట్ 3 లో వుంది అన్నాడు. అవేరేజ్ గా ఇంకో 3 సంవత్సరాలే బ్రతికేది అన్నాడు.ఏడవాల్సిన సమయం వచ్చింది అని నేను వెంటనే ఈ హ్యాండ్ కర్ చీఫ్ కొనుకొన్నాను.  

దేవుడు కాన్సర్ లో కూడా యోహాను గారికి 4 సంవత్సరాల ఆయుస్సు ఇచ్చాడు. అవేరేజ్ 3 సంవత్సరాల కన్నా ఇంకో సంవత్సరం ఎక్కువే ఇచ్చాడు. దానిని బట్టి మేము దేవుని స్తుతిస్తున్నాము.

విజయవాడ, హైదరాబాద్, CMC వెల్లూరు అనేక హాస్పిటల్స్ కి తిరిగాడు.ఎంతో మంది డాక్టర్ లను, స్పెషలిస్ట్ లను చూసాడు. కాన్సర్ మందులు వేసుకొన్నాడు. వాటి యొక్క సైడ్-ఎఫెక్ట్ లు ఓపికతో ఓర్చుకొన్నాడు. చివరి దశలో ఆ మందులు కూడా పనిచేయని పరిస్థితి వచ్చింది. పోయిన నెలలో నేను వున్నప్పుడు విజయవాడలో నాగార్జున హాస్పిటల్ కి తీసుకొనివెళ్ళాము. అప్పటికే హిమోగ్లోబిన్ లెవెల్ పడిపోతావుంది. ప్లేట్ లెట్ ల లెవెల్ పడిపోతా ఉంది. ఫ్రాక్చర్స్ అవుతాయేమో, బ్లీడింగ్ అవుతుందేమో అని నేను చాలా భయపడ్డాను. ఆ యాతన పడకుండా, ఆయాసముతో ఉన్నప్పుడే  దేవుడు ఆయనను తన ఇంటికి పిలుచుకొన్నాడు. దానిని బట్టి కూడా మేము దేవుని స్తుతిస్తున్నాము.

   ఈ సందర్భములో సమూయేలు జీవితము నుండి కొన్ని సంగతులు మీతో పంచుకోవాలని నేను ఆశపడుచున్నాను.

1 సమూయేలు 25:1 లో ఒక మాట చూద్దాము

  1. సమూయేలు మృతినొందగా ఇశ్రాయేలీయులందరు…. కూడుకొని అతడు చనిపోయెనని ప్రలాపించుచు, రామా లోనున్న అతని ఇంటి నివేశనములో అతని సమాధిచేసిన తరువాత దావీదు లేచి పారాను అరణ్యమునకు వెళ్ళెను.

సమూయేలు మరణించినప్పుడు ఇశ్రాయేలీయులందరూ అతని ఇంటికి వచ్చి ఏడ్చారు. దాదాపు 100 సంవత్సరాలు అనేక విధాలుగా సమూయేలు దేవుని ప్రజలకు సేవ చేసాడు.  

A great man of God has died,

a great servant of God has died.

దేవుని యొక్క గొప్ప సేవకుడు మరణించాడు.

సమూయేలు తల్లి హన్నా చాలా కాలము సంతానము లేకుండా ఉంది.

దేవుని మందిరానికి వెళ్ళింది.

అక్కడ లేవీ యాజకునిగా ఉన్నాడు.

హన్నా దేవుని సన్నిధిలో నిలబడి ప్రార్ధన చేసింది: ‘దేవా, నాకొక బిడ్డను ఇవ్వు. ఆ బిడ్డను నీకు ప్రతిష్ఠిస్తాను. ఆ బిడ్డ తన జీవితమంతా నీకు సేవ చేస్తాడు’ అని  మొఱ్ఱ పెడుచూ ఉన్నది.

ఏలీ ఆమెను గమనించాడు. ‘ఏమ్మా, ఏంటి బాగా మత్తుగా ఉన్నట్లు ఉన్నావు. ద్రాక్షారసము బాగా త్రాగావా? అని అడిగాడు. హన్నా ఆయనతో ఏమందంటే, ‘ఏలీ గారు, ఇది మత్తు కాదు, మనో వేదన. దేవుని ముందు నా బాధను వెళ్లబోసు కొంటున్నాను.’

ఏది ప్రార్ధనో , ఏది మత్తో కూడా చెప్పలేని స్థితిలో ఏలీ ఉన్నాడు.

ఈ రోజు హన్నా పేరు పెట్టుకొనే ఆడవాళ్లు చాలా మంది ఉన్నారు.

ఏలీ పేరు పెట్టుకొనే మగవాడు ఒక్కడన్నా వున్నాడా?

ఆ సమయములో దేవుడు పరిస్థితులను తన చేతుల్లోకి తీసుకొన్నాడు.

దేవుడు హన్నా ప్రార్ధన విన్నాడు.

ఆమెకు ఒక మగబిడ్డను ఇచ్చాడు.

ఆ బిడ్డకు ‘యెహోవాకు మ్రొక్కుకొని వీనిని అడిగితిననుకొని’  సమూయేలను పేరు పెట్టింది. (1 సమూ 1:20).

అడుగుడి మీకియ్యబడును అన్నాడు యేసు ప్రభువు.

హన్నా విశ్వాసముతో అడిగి ఒక కుమారుణ్ణి పొందింది.

అయితే, దేవునికి ఇచ్చిన మాట ఆమె మరచిపోలేదు.

సమూయేలు పాలు విడిచిన పసివాడుగా ఉన్నాడు. అతని తీసుకొని ఏలీ దగ్గరకు వెళ్ళింది.

‘ఏలీ గారు, కొంతకాలం క్రితం ఈ మందిరములో ప్రార్ధన చేసింది నేనే. దేవుడు నా మొఱ్ఱ విని, ఈ బిడ్డను నాకు అనుగ్రహించాడు.  ఈ బిడ్డను దేవునికి ప్రతిష్టించాను. ఈ బిడ్డ భూమి మీద బ్రతికినన్ని రోజులు దేవుని పనిచేస్తాడు. దేవుని మందిరములోనే బ్రతుకుతాడు’ అంది.

EliSamuelHannah2.png

సమూయేలు ఒక ఏఫోదు ధరించుకొని దేవుని మందిరములో సేవ చేస్తూ ఉన్నాడు. ఆ రోజుల్లో దేవుని ప్రత్యక్షత అరుదుగా ఉంది. ఒక రాత్రి సమూయేలు ఏలీ కి దగ్గరలోనే పండుకొని ఉన్నాడు.

సమూయేలు, సమూయేలు – అని ఒక పిలుపు అతనికి వినిపించింది. సమూయేలు లేచి ఏలీ దగ్గరకు వెళ్ళాడు. ‘నన్ను పిలిచారా’ అని అడిగాడు. ‘నేను పిలవలేదు, వెళ్లి పండుకో’ అన్నాడు.

కాసేపటి తరువాత,

సమూయేలు, సమూయేలు – అని రెండవ సారి అతనికి వినిపించింది. సమూయేలు లేచి ఏలీ దగ్గరకు వెళ్ళాడు. ‘నన్ను పిలిచారా’ అని అడిగాడు. ‘నేను నిన్ను పిలువలేదు, వెళ్లి పండుకో’ అన్నాడు.

సమూయేలు, సమూయేలు – అని మూడవ సారి పిలుపు వినిపించింది. సమూయేలు లేచి వెళ్లి, ‘ఏలీ గారు, నాకు స్పష్టముగా ఆ పిలుపు వినిపిస్తా ఉంది.’ ఏలీ కి జరుగుతున్నది ఏమిటో అప్పుడు అర్ధమయ్యింది.

‘సమూయేలు, దేవుడు నిన్ను పిలుస్తున్నాడు.’

ఈ సారి ఆ స్వరం వినబడినప్పుడు, ‘నీ దాసుడు ఆలకించుచున్నాడు. ఆజ్ఞ ఇమ్ము’ అని బదులు చెప్పు అన్నాడు.

సమూయేలు, సమూయేలు – నాలుగవ సారి దేవుడు పిలిచాడు. సమూయేలు లేచి,

‘ప్రభువా, నీ దాసుడు ఆలకించుచున్నాడు. ఆజ్ఞ ఇమ్ము’

Speak Lord , for thy servant heareth

దేవుడు తన ప్రవచనాలను సమూయేలుకు తెలియచేసాడు.

దేవుని ప్రత్యక్షత మరోసారి సమూయేలు ద్వారా ఇశ్రాయేలీయులకు లభించింది.

The voice of God came back.

SamuelGettyImages-157731458.jpg

సమూయేలు ప్రవచనాలు విని ఇశ్రాయేలీయులంతా ఆయనను తమ ప్రవక్తగా గుర్తించారు.

యాజకునిగా పంపబడిన ఈ బాలున్ని దేవుడు ఒక సేవకునిగా, ఒక ప్రవక్తను కూడా చేసాడు.

ఆ రోజుల్లో ఇశ్రాయేలీయులకు రాజులు లేరు. ప్రజలంతా మాకు న్యాయం చెప్పు అని సమూయేలు దగ్గరకు వెళ్లారు. సమూయేలు వారికి న్యాయాధి పతి కూడా అయ్యాడు.

ఆ తరువాత ఇశ్రాయేలీయులకు, ఫిలిష్తీయులకు మధ్య యుద్ధం వచ్చింది. ఇశ్రాయేలీయులు ఘోరముగా ఓడిపోయారు. దేవుని మందసాన్ని శత్రువులు తీసుకొని వెళ్లిపోయారు.

ఒక సంవత్సరం, రెండు సంవత్సరాలు, ఇరవై సంవత్సరాలు గడిచిపోయినాయి.

ఇశ్రాయేలీయులందరూ సమూయేలు దగ్గరకు వెళ్లారు. ‘మాకు దేవుని మందసము కావాలి. మాకు దేవుని సన్నిధి కావాలి. ఎంత కాలం మందసము లేకుండా జీవించాలి?’ అని ఆవేదన చెందారు.

సమూయేలు ఇశ్రాయేలీయులందరినీ ఒక చోటుకు రప్పించాడు. వారితో ఏమన్నాడంటే,

‘మీకు దేవుని మందసము కావాలంటే,

దేవుని సన్నిధి కావాలంటే,

నీళ్లు తీసుకొని దేవుని ఆలయాన్ని కడగండి

మీ పాపాలు ఒప్పుకొని, పాప క్షమాపణ పొందండి .

ఉపవాసం చేయండి, దేవుని తట్టు తిరగండి అన్నాడు.

ఇశ్రాయేలీయులు సమూయేలు చెప్పినట్లు చేశారు.

సమూయేలు ఇశ్రాయేలీయుల పక్షాన విజ్ఞాపన చేసాడు.

దేవుడు వారి  మొఱ్ఱను ఆలకించి వారి

మధ్యలోకి తన సన్నిధిని తీసుకొని వచ్చాడు.

యాజకునిగా, ప్రవక్తగా,

న్యాయాధిపతిగా ఉన్న

సమూయేలు ప్రజల తరుపున

విజ్ఞాపన చేసే వానిగా కూడా మారాడు.

ఆ తరువాత ఫిలిష్తీయులు ఇశ్రాయేలీయుల మీదకు యుద్ధానికి వచ్చారు. వారి ముందు నిలబడలేక పారిపోయే పరిస్థితి ఇశ్రాయేలీయులకు కలిగింది. వారందరూ సమూయేలునకు  మొఱ్ఱ పెట్టారు.

‘సమూయేలు, మేము ఓడిపోవుచున్నాము, దేవుని ఎదుట నిలబడి మాకు సహాయం చెయ్యి’ అన్నారు.

సమూయేలు వారి మధ్య ఒక స్తంభమును నిలిపి ‘ఎబినేజర్’ అని పేరుపెట్టాడు. దాని అర్ధం ‘దేవుని సహాయం’.

సమూయేలును చూసి దేవుడు ఇశ్రాయేలీయులను రక్షించాడు.

ఆ విధంగా సమూయేలు ఇశ్రాయేలీయులను రక్షించేవాడు, విడిపించే వాడు కూడా అయ్యాడు.

ఆ సమయములో ఇశ్రాయేలీయులు సమూయేలు దగ్గరకు వచ్చి మాకు రాజు కావాలి అని అడిగారు.

వారి కోరిక దేవుని హృదయాన్ని బాధించింది.

సమూయేలు లాంటి సేవకుల ద్వారా వారిని నడిపించాలని దేవుని ఉద్దేశ్యం.

దేవుడు వారికి చెప్పాడు:  ‘మీరు మాకు రాజు కావాలి, రాజు కావాలి అని డిమాండ్ చేస్తున్నారు. మీకు కావలసినది సమూయేలు లాంటి సేవకుడు, రాజు కాదు. రాజు మిమ్మల్ని పీడిస్తాడు. మీ చేత సేవ చేయించుకొంటాడే కానీ మీకు సేవ చేయడు. తన స్వార్ధ ప్రయోజనాల కోసం మిమ్మల్ని ఉపయోగించుకొంటాడు. మీ మీద పన్నులు వేసి మీ డబ్బుతో సుఖపడతాడు. మీ పిల్లల్ని తన సేవకులుగా మార్చుకొంటాడు. ప్రజల డిమాండ్ ని కాదనకుండా దేవుడు వారికి ఒక రాజును నియమించాడు. సమూయేలు వెళ్లి సౌలును ఇశ్రాయేలు దేశానికి రాజుగా అభిషేకము చేసాడు. అయితే సౌలుకు సమూయేలు వలే సేవకుని హృదయం లేదు.

SaulanointedbySamuelGettyImages-813655624 (1).jpg

తన స్వార్ధం చూసుకొన్నాడే కానీ సేవ చేయలేదు. చాలా తొందరగా దేవుని చిత్తం నుండి తొలగిపోయాడు. అమాలేకీయులను నిర్మూలము చేయి అని దేవుడు ఇచ్చిన ఆజ్ఞను సౌలు పాటించలేదు.

సమూయేలు అప్పుడు వెళ్లి సౌలును గద్దించాడు.

దేవుడు నీకు చెప్పింది ఏంటి?

నువ్వు చేసింది ఏంటి? అని సౌలును నిలదీసాడు.

హన్నా దగ్గర పెరిగిన ఈ చిన్న బాలున్ని దేవుడు king maker ని చేశాడు.

సౌలు, దావీదు లాంటి రాజులను అభిషేకించేవాడిగా, వారు తప్పు చేస్తే నిర్మొహమాటముగా గద్దించి నిలదీసే వాడిగా చేసాడు.

సమూయేలు అటువంటి మంచి సేవకుడు.

Lord, speak, for thy servant heareth

ప్రభువా, ఆజ్ఞ ఇవ్వు, నీ సేవకుడు పాటిస్తాడు

నువ్వు, చెపితే ఏ పని అయినా చేస్తాను.

సమూయేలు అనేక రకాలుగా దేవుని ప్రజలకు సేవ చేసాడు.

కట్టుపల్లి యోహాను గారు కూడా అనేక రకాలుగా దేవుని ప్రజలకు సేవ చేసాడు.

సమూయేలు దేవుడు చెప్పిన ప్రతి పనిని మనస్ఫూర్తిగా చేసాడు.

ఈ పని చెప్పావుగా, ఇది చాల్లే అనలేదు.

ఒక యాజకునిగా

ఒక సేవకునిగా

ఒక ప్రవక్తగా

ఒక న్యాయాధిపతిగా

ఒక విజ్ఞాపన కర్తగా

ఒక రక్షకునిగా

రాజులను అభిషేకించేవానిగా

రాజులను విమర్శించేవానిగా

దేవుడు చెప్పిన ప్రతి పనీ చేశాడు.

‘నీ దాసుడు ఆలకించుచున్నాడు. ఆజ్ఞ ఇవ్వు’ అని దేవునికి చెప్పాడు.

ఒక గొప్ప దేవుని సేవకుని మనం సమూయేలులో చూస్తున్నాము.

యోహాను గారు కూడా దేవుడు ఇచ్చిన అనేక పనులను ఒక సేవకునిలాగా చేసాడు.

ప్రభుత్వ ఉద్యోగిగా సేవలందించాడు

సువార్త చెప్పాడు.

యేసు ప్రభువు ప్రేమ మనం మన పనుల్లో చూపించాలి అని అనాధ బాల బాలికల కోసం ఒక అనాధ

శరణాలయం పెట్టాడు.

వృద్ధుల కోసం వృద్ధాశ్రయం పెట్టాడు.

రోగుల కోసం హాస్పిటల్ పెట్టాడు.

పుస్తక ప్రచురణ కోసం ప్రింటింగ్ ప్రెస్ పెట్టాడు.

సంఘాలు పెట్టాడు.

దేవుడు ఇచ్చిన అనేక పనులు తన శక్తి కొలది చేసాడు.

మొదటిగా సువార్త: ఆంధ్ర ప్రదేశ్ ప్రభుత్వములో విద్యుత్ శాఖలో ఒక క్లర్క్ గా పనిచేసుకొంటానే సువార్త ప్రకటించడం మొదలుపెట్టాడు. ఎన్నో వందల గ్రామాలు కాలి నడకన వెళ్లి సువార్త ప్రకటించాడు.

ఈ రోజు నేను మిమ్మల్ని ఒక ప్రశ్న అడుగుతాను.

మీ రోజు మీరు మరణిస్తే మీరు పరలోకం వెళ్తారా?

మీ పాపాలు క్షమించబడ్డాయా?

యేసు క్రీస్తు ఈ భూలోకానికి వచ్చింది అందుకే.

సిలువ వేయబడింది అందుకే.

మరణించి, సమాధి చేయబడి, తిరిగి లేచింది అందుకే.

యేసు క్రీస్తు దగ్గరకు వచ్చి, మీ పాపాలు ఒప్పుకొని

మీరు రక్షణ పొందాలి. అప్పుడే మీరు పరలోకం వెళ్ళగలరు.

యోహాను గారు తనకు సమయం దొరికినప్పుడు సువార్త కరపత్రాలు వ్రాసి, ప్రింట్ చేయించి, పంచేవాడు.

సువార్తకు ప్రాధాన్యం ఇచ్చాడు.

Bible: యోహాను గారు బైబిల్ ని ఎంతో ప్రేమించాడు. తన కెరీర్ లో కొన్ని లక్షల బైబిల్ ప్రతులు ప్రజలకు పంచాడు. మా స్కూల్ కి వచ్చేవాడు, టీచర్స్ కి బైబిల్ ప్రతులు ఇచ్చేవాడు. బైబిల్ లో దేవుని వెలుగు ఉంది. బైబిల్ చదవండి అని వారికి చెప్పేవాడు. ఉదయాన్నే లేచి బైబిల్ చదివేవాడు. ఫ్యామిలీ ప్రేయర్ పెట్టేవాడు. మా అందర్నీ పిలిచేవాడు. షారోన్, మార్టిన్, మాథ్యూ, మార్సెల్లా, పాళీ, జాన్, మిరియం. మా ఏడుగురిని పేరు పెట్టి పిలిచేవాడు. ‘నిద్ర పోనివ్వకుండా ప్రొద్దునే ఏ ప్రార్ధనలు ఏమిటి బాబూ’ అని మేము మనస్సులో తిట్టుకొంటానే వెళ్ళేవాళ్ళం. వెనక్కి తిరిగి చూస్తే ఆ ఫామిలీ ప్రార్ధనలు మా కుటుంబానికి ఏంటో ఉపయోగపడ్డాయి. మొన్నొకసారి ఏమన్నాడంటే, ‘ఆ రోజుల్లో అనేక సంవత్సరాలు మనం చేసిన ప్రార్థనలే మిమ్ములను ఇంకా కాపాడుచున్నాయి’.

Family prays together stays together అనే వాడు.

స్పీకింగ్ ని కూడా ప్రోత్సహించాడు. నేను కాలేజీ లో ఉన్న రోజుల్లో కొలకలూరు లో మీటింగ్స్ జరుగుచున్నాయి.

‘పాలీ, నువ్వు కాసేపు వాక్యం చెప్పు’ అన్నాడు. నాకు ఒళ్ళు జలదరించింది.

పొరపాటున అన్నాడేమోలే అని నేను మెదలకుండా కూర్చున్నాను.

‘చూస్తావే, లేచి కాసేపు వాక్యం చెప్పు’ అన్నాడు.

‘ఆమ్మో, నా వల్ల కాదు. నలుగురి ముందు నేను నోరు మెదపలేను’ అన్నాను.

ఆ రోజు రాత్రి నాతో ఏమన్నాడంటే, ‘నీ చేతిలో ఉన్నది దేవుని వాక్యం. అది దేవుని ఖడ్గం. Sword of the Lord.

అది నీ చేతిలో ఉన్నప్పుడు నువ్వు భయపడకూడదు’ అన్నాడు.

Christian literature: క్రైస్తవ సాహిత్యం మీద కూడా ఎంతో ఆసక్తి చూపించేవాడు.

ప్రపంచములో ఎన్నో దేశాల నుండి రక రకాల పుస్తకాలు తెప్పించేవాడు. నేను నా స్వంత ఇంటర్ ప్రెటేషన్ లు ఇస్తావుండే వాణ్ని. ‘నువ్వు వాక్యాన్ని సరిగ్గా విభజించాలి. Rightly dividing the Word of God. ఈ concordance చదువు అని నాకు ఒక concordance ఇచ్చాడు. క్రైస్తవ పుస్తకాలు పంచుటకు బుక్ షాప్ లు తెరిచాడు. ఏ పుస్తకం పడితే ఆ పుస్తకం అమ్మేవాడు కాదు. ‘ఈ పుస్తకం చాలా పాపులర్ అయ్యింది, అయినా ఇందులో అసత్యం ఉంది. దీనిని నేను అమ్మను’ అనే వాడు.

Education: కి కూడా ఎంతో ప్రాధాన్యమిచ్చాడు. పేద, గ్రామీణ విద్యార్థుల కోసం ఒక హై స్కూల్ నెలకొల్పాడు. విద్యార్థులకు leading by example గా ఉండేవాడు.

నా చిన్నతనములో మా నాన్న నరసరావు పేటలో పనిచేస్తా ఉండేవాడు.

ఒక సారి లక్ష్మి డీలక్స్ లో ఒక సినిమా విడుదల అయ్యింది. మా నాన్న డ్యూటీ కి వెళ్లిన తరువాత నేను సినిమా కి వెళ్తాను అని అనుకొన్నాను. 9 గంటలు, 10 గంటలు అయిపొయింది. మార్నింగ్ షో 11 గంటలకు మొదలవుతుంది.

నాన్న నువ్వు డ్యూటీ కి వెళ్ళటం లేదా? వెళ్తున్నారా అన్నాడు.

నరసరావు పేట బస్సు లేట్ కావటం లేదా? అని అడిగాను.

11 గంటలకు యర్రగొండపాలెం బస్సు కి వెళ్తున్నాను అన్నాడు.

నేను పుస్తకాలు తీసుకొని లక్షి డీలక్స్ లోపలి వెళ్ళాను.

టికెట్ తీసుకొందామని కౌంటర్ లో చేయిపెడుతున్నాను

పాలీ అని నా వెనుక నుండి ఒక పిలుపు వినబడింది. నాకు గుండె జల్లుమంది.

మా నాన్న వెనుక వచ్చి నా భుజం మీద చేయి వేసాడు.

నాకు చాలా భయం వేసింది. నాలుగు పీకుతాడు అనుకొన్నాను.

కానీ నా మీద కనికరం చూపించాడు.

చాలా మృదువైన మాటలతో నన్ను మార్చాడు.

‘బస్సు స్టాండ్ కి నడిచి వెళ్తావుంటే నువ్వు కనబడ్డావు. మీ హై స్కూల్ ఐతానగర్ కి ఆ వైపు ఉంటే నువ్వు పుస్తకాలు తీసుకొని ఈ వైపు నడుస్తున్నావు ఏంటి ? అని ఆసక్తిగా నీ వెనుకే నడుచు కొంటూ వచ్చాను.అరేయ్, నువ్వు స్కూల్ కి వెళ్తున్నాను అని చెప్పి పుస్తకాలు తీసుకొని సినిమా లకు వెళ్తున్నావా? స్కూల్ కి వెళ్తున్నాను అని నాకు చూపిస్తున్నావు. నువ్వు వెళ్ళేది సినిమాలకు. నేను ఎండలో, వానలో పల్లెకోన నుండి రోజు ఎన్నో మైళ్ళు నడిచి స్కూల్ కి వెళ్ళేవాణ్ణి’ అన్నాడు.ఆ విధముగా మంచి మాటలతో మార్చేవాడు.

Assemblies : సంఘాలను ఎంతో ప్రేమించేవాడు. నెలకు 20 రోజులు తక్కువకాకుండా సంఘాలను దర్శించేవాడు. ‘నీకు కాన్సర్ టెర్మినల్ స్టేజి లో ఉంది. నువ్వు ఇంకా తిరుగకుండా రెస్ట్ తీసుకో అని చెప్పినా వినేవాడు కాదు. శరీరములో ఏ మాత్రం శక్తి ఉన్నప్పటికీ ఏదో ఒక ఊరు వెళ్లి వాక్యం ప్రకటించేవాడు.

1994 లో ఒక సారి తణుకు సంఘాల్లో సేవ చేయడానికి వెళ్తున్నాడు. ట్రైన్ లో నిలబడి వున్నప్పుడు ఆయనకు గుండె పోటు వచ్చింది. ICU  లో చేర్పించాల్సివచ్చింది. గుండెలో స్టెంట్ లు వేయించాల్సి వచ్చింది. ‘నేను బతికి ఉంటే దేవునికి లాభం, చనిపోతే నాకు లాభం’ అన్నాడు.

భూమి మీద నా సమయాన్ని దేవుని కోసం, ఇతరుల కోసం వెచ్చించాలి అనే దృక్పధాన్ని అలవర్చుకొన్నాడు.

IMG_2073.JPG

2011 లో జీవితములో ఒకే ఒక్క సారి అమెరికా వచ్చాడు. ‘నువ్వు, రాక రాక అమెరికా వచ్చావు, నేను నిన్ను ఒక ట్రైన్ లో అమెరికా దేశం చూపిస్తాను రా’ అన్నాను. ‘ టికెట్ యెంత అవుతుంది’ అన్నాడు.

‘వెయ్యి డాలర్లు దాకా అవుతుంది’ అన్నాను.

‘వెయ్యి డాలర్లా, అంత ఖర్చు నేను చేయ కూడదు, ఆ డబ్బుతో ఒక గ్రామములో మందిరానికి సహాయం చేద్దాం, ఒక మందిరానికి కప్పు వేయవచ్చు’ అని నా ఆఫర్ ను కూడా నిరాకరించాడు.

Self-dignity : ఆత్మ గౌరవం కూడా ఆయనకు ఎక్కువే. విదేశీయులు ఆయనను కంట్రోల్ చేయాలని చూసారు. ఆయన వాళ్లకు స్పష్టముగా చెప్పాడు, ‘నేను భక్త్ సింగ్ గారు, సైలస్ ఫాక్స్ గారు లాంటి మహానుభావుల దగ్గర బైబిల్ సత్యాలు నేర్చుకున్నాను. మీరు సేవ చేసుకొని వెళ్లిపోండి కానీ, మీ దగ్గర చాలా డబ్బు ఉందని నన్ను కంట్రోల్ చేయాలని చూడబాకండి అని వారికి స్పష్టం చేసాడు. విదేశీయులు పెట్టె,బేడా సర్దుకొని వెళ్ళిపోయినప్పటికీ ఆయన చలించలేదు. అలా ఆత్మ గౌరవముతో జీవించిన వ్యక్తి.

Faith : జీవిత చరమాంకములో కట్టుపల్లి యోహాను గారి విశ్వాసం టెస్ట్ చేయబడింది. శ్రమల థియోలజి చాలా మంది క్రైస్తవులకు అర్ధం కాలేదు.

ఒక వ్యక్తికి జబ్బు చేస్తే, ఆ వ్యక్తికి విశ్వాసం లేదు, ఆ వ్యక్తి తప్పు చేసాడు అనే విశ్వాసులు ఉన్నారు.

శ్రమల గురించి బైబిల్ యేమని చెబుతుంది?

1 పేతురు పత్రిక 1 అధ్యాయములో కొన్ని వచనాలు చూద్దాము:

  1. మన ప్రభువగు యేసుక్రీస్తు తండ్రియైన దేవుడు స్తుతింపబడును గాక

మృతులలోనుండి యేసుక్రీస్తు తిరిగి లేచుటవలన జీవముతో కూడిన నిరీక్షణ మనకు కలుగునట్లు, అనగా అక్షయమైనదియు, నిర్మలమైనదియు, వాడ బారనిదియునైన స్వాస్యము మనకు కలుగునట్లు, ఆయన తన విశేష కనికరముచొప్పున మనలను మరల జన్మింప జేసెను..

  1. కడవరి కాలమందు బయలుపరచబడుటకు సిద్ధ ముగానున్న రక్షణ మీకు కలుగునట్లు, విశ్వాసముద్వారా దేవుని శక్తిచేత కాపాడబడు మీకొరకు, ఆ స్వాస్థ్యము పరలోకమందు భద్రపరచబడియున్నది.
  2. ఇందువలన మీరు మిక్కిలి ఆనందించుచున్నారు గాని అవసరమునుబట్టి నానా విధములైన శోధనలచేత, ప్రస్తుతమున కొంచెము కాలము మీకు దుఃఖము కలుగుచున్నది.
  3. నశించిపోవు సువర్ణము అగ్నిపరీక్షవలన శుద్ధపరచబడుచున్నది గదా? దానికంటె అమూల్యమైన మీ విశ్వాసము ఈ శోధనలచేత పరీక్షకు నిలిచినదై, యేసుక్రీస్తు ప్రత్యక్షమైనప్పుడు మీకు మెప్పును మహిమయు ఘనతయు కలుగుటకు కారణ మగును.
  4. మీరాయనను చూడకపోయినను ఆయనను ప్రేమించుచున్నారు; ఇప్పుడు ఆయనను కన్నులార చూడకయే విశ్వసించుచు, మీ విశ్వాసమునకు ఫలమును,
  5. అనగా ఆత్మరక్షణను పొందుచు,చెప్పనశక్యమును మహిమా యుక్తమునైన సంతోషముగలవారై ఆనందించుచున్నారు – ఆ మాటలు గమనించండి: నానా విధమైన శ్రమలు మన విశ్వాసాన్ని పరీక్షిస్తాయి. మనం దేవుని యొద్ద ఘనత, మహిమ పొందటానికి అవి ఉద్దేశించబడినాయి. ఆగష్టు నెలలో డాక్టర్లు మేము చేయగలిగినది ఏమీ లేదు అన్నారు. ఆ సందర్భములో నేను ఒక పాట వ్రాసి, యోహాను గారికి అంకితం చేశాను.

 

ప = పాడెదను నేనెల్లప్పుడు –

నీ మహిమ గురించి

ప్రభువా – ఎల్లప్పుడు

 

ఘనత మహిమ నీకేనయ్యా

యుగయుగములు నిను కీర్తించెదన్

 

  1. ఆకాశ మహాకాశమ్

నీ ఐశ్వర్యము చూపించెను  

భూమియు దాని సంపూర్ణత

నీ జ్ఞానమునే బోధించెను

 

  1. అల్ఫాయు ఒమెగాయు

ఆది అంతము లేనివాడవు

మానవ జన్మను ఎత్తావయ్యా

దాసుని రూపం పొందావయ్యా

 

  1. మార్గము, సత్యము, జీవముగా

పరమ వెలుగై  వచ్చావయ్యా

లోక పాపము మోసావయ్యా

ప్రేమను నాకు  చూపావయ్యా

 

  1. సాతాను వాని బలమంతయు

సిలువ మీద ఓడించినావు

మరణము గెల్చి లేచావయ్యా

నిత్యము మాతో ఉంటావయ్యా

 

  1. గొర్రెలకు మంచి కాపరివి

ప్రాణ మిచ్చి రక్షించినావు

నీ కృప నాకు చాలునయ్యా  

నీ మాటే నా బలమయ్యా

 

ప్రతిదీ దేవుని మహిమ కొరకే.

దేవుడు ఈ యూనివర్స్ ని సృష్టించాడు. అది ఆయన మహిమ కోసమే.

దేవుడు ఈ భూమిని సృష్టించాడు. అది ఆయన మహిమ కోసమే.

దేవుడు మానవ జాతిని సృష్టించాడు. అది ఆయన మహిమ కోసమే.

దేవుడు అబ్రాహామును పిలిచి, అతనితో ఒక నిబంధన చేసాడు. అది ఆయన మహిమ కోసమే.

దేవుడు మోషే ను పంపి ఐగుప్తు దేశము నుండి ఇశ్రాయేలీయులను విడిపించాడు. అది ఆయన మహిమ కోసమే.

దేవుడు ప్రభువైన యేసు క్రీస్తును మన రక్షకునిగా పంపాడు. అది ఆయన మహిమ కోసమే.

దేవుడు ‘నా కృప నీకు చాలు’ అని స్వస్థత కోసం ప్రార్దించిన పౌలుతో అన్నాడు. అది ఆయన మహిమ కోసమే.

దేవుడు ఈ తరములో యోహాను గారిని సృష్టించాడు. అది ఆయన మహిమ కోసమే.

దేవుడు సుఖాలతో పాటు, కష్టాలను, రోగాలను, శ్రమలను, ప్రాణం తీసే కాన్సర్ ను కూడా యోహాను గారికి ఇచ్చాడు. అది ఆయన మహిమ కోసమే.

సమస్తం దేవుని మహిమ కోసమే.

“ఇందువలన మీరు మిక్కిలి ఆనందించుచున్నారు గాని అవసరమునుబట్టి నానా విధములైన శోధనలచేత, ప్రస్తుతమున కొంచెము కాలము మీకు దుఃఖము కలుగుచున్నది.

  1. నశించిపోవు సువర్ణము అగ్నిపరీక్షవలన శుద్ధపరచబడుచున్నది గదా? దానికంటె అమూల్యమైన మీ విశ్వాసము ఈ శోధనలచేత పరీక్షకు నిలిచినదై, యేసుక్రీస్తు ప్రత్యక్షమైనప్పుడు మీకు మెప్పును మహిమయు ఘనతయు కలుగుటకు కారణ మగును.
  2. మీరాయనను చూడకపోయినను ఆయనను ప్రేమించుచున్నారు; ఇప్పుడు ఆయనను కన్నులార చూడకయే విశ్వసించుచు, మీ విశ్వాసమునకు ఫలమును,
  3. అనగా ఆత్మరక్షణను పొందుచు, చెప్పనశక్యమును మహిమా యుక్తమునైన సంతోషముగలవారై ఆనందించుచున్నారు.”

అపొస్తలుడైన పౌలు, భక్త్ సింగ్, యోబు లాంటి గొప్ప భక్తులు కూడా రోగాలతో బాధ పడ్డారని మనం గుర్తించాలి. చెప్పనశక్యమును మహిమా యుక్తమునైన సంతోషము తో వారు తమ భూలోక జీవితమును ముగించారు. యోబు ఎంతో ధనవంతుడు. సాతానుడు దేవునితో ఏమన్నాడు? ‘ప్రపంచములో శ్రేష్టమైనవి మొత్తం యోబుకు ఇచ్చావు. రకానికి ఒకటి చొప్పున ప్రతి బ్లెస్సింగ్ లో ఒక బ్లెస్సింగ్ అతనికి ఇచ్చావు, అతని చుట్టూ ఒక కంచె వేశావు. అటువంటి వాడు నిన్ను స్తుతించక ఏమిచేస్తాడు?’ సాతాను విమర్శలు విని దేవుడు యోబుకు ఇచ్చిన దీవెనలు, ఆస్తి పాస్తులు, కుమార్తెలు, కుమారులు, సేవకులు అందరినీ తీసివేసాడు.

యోబు చాలా శ్రమలకు లోనయ్యాడు. ‘ఇప్పుడు ఉంటుంది చిత్రం’ అని సాతానుడు అనుకొన్నాడు.

యోబు సమస్తం కోల్పోయాడు. దేవుని శపించి చనిపో అని ఆయన భార్య సలహా ఇచ్చింది. కానీ యోబు ఆమె సలహా వినలేదు.

యెహోవా ఇచ్చెను,

యెహోవా తీసుకొని పోయెను,

యెహోవా నామమునకు స్తుతి కలుగును గాక అన్నాడు.

ఆ మాటలు విని సాతానుడు యెంత సిగ్గుపడి ఉంటాడు!

ఆ మాటలు విని సాతానుడు యెంత అవమానం పొంది ఉంటాడు!

యోహాను గారు కూడా తన జీవిత చివరి దశలో ఎన్నో కోల్పోయాడు.

కొంతమంది స్నేహితులను కోల్పోయాడు,

డబ్బు కోల్పోయాడు,

ఆరోగ్యం కోల్పోయాడు

ఆ సమయములో కూడా

దేవుడు ఇచ్చాడు,

దేవుడు తీసుకొని పోయాడు,

Praise the Lord అన్నాడు.

C. S. Lewis ఏమన్నాడంటే,

God whispers to us in our pleasure,

but shouts to us in our pain.

మనం సుఖంగా వున్నప్పుడు దేవుడు మన చెవిలో గుసగుస లాడుతాడు.

మనం బాధలో వున్నప్పుడు దేవుడు మన చెవిలో అరుస్తాడు

మా అమ్మ కాన్సర్ తో బాధపడి మరణించినప్పుడు,

మా నాన్న కాన్సర్ తో బాధపడి మరణించినప్పుడు, నేను దేవుని అరుపులు విన్నాను.

మా కుటుంబములో ప్రతి ఒక్కరూ దేవుని అరుపులు విన్నారు.

కొద్ది రోజుల క్రితం అమెరికా లో నా క్లినిక్ లో కూర్చొని ఉన్నాను.

ఒక రోగి నా దగ్గరకు వచ్చాడు.

నాకు ఈ రోగం ఉంది, మందులు వ్రాయండి అన్నాడు.

ముందు ఫీజు కట్టి రండి, 70 డాలర్లు అని నేను ఆయనకు చెప్పాను.

ఆయన కట్టలేనండి అన్నాడు.

సరే, 30 డాలర్లు కట్టండి, డిస్కౌంట్ ఇస్తున్నాను అన్నాడు.

ఆయన కాసేపు అలోచించి, నా దగ్గర 30 డాలర్లు కూడా లేవు అన్నాడు.

ఫ్రీ గా చూడలేను అని చెప్పాను.

కొన్ని క్షణాల తరువాత దేవుని అరుపు నా హృదయములో వినిపించింది.

డబ్బులు లేవని ఒక వ్యక్తిని పంపించి వేసావా?

మీ నాన్న ఈ పని చేస్తాడా?

మీ అమ్మ ఈ పని చేస్తుందా?

దేవుని అరుపు విన్నాను. వెంటనే ఆయనతో ఏమన్నానంటే, మిమ్మల్ని ఫ్రీ గా చూస్తాను అని ఆయనకు మందులు వ్రాసి పంపించాను.

నేను గురువారం చివరి సారి మా నాన్నతో మాట్లాడాను. ఆ స్వరం విన్నప్పుడే ఎక్కువ రోజులు బ్రతుకడు అనుకొన్నాడు. చాలా ఆయాసముతో ఉన్నాడు. మాటకు, మాటకు బ్రేక్ తీసుకొంటున్నాడు.

‘అయ్యా, పాళీ, ఎలా ఉన్నావు? దేవుడు నిన్ను ఆశీర్వదించాలని, భారత దేశములో నీ పరిచర్య బలముగా జరుగాలని ప్రార్ధిస్తున్నాను.’

ఆ మాటలు విని నా హృదయం ద్రవించింది. అంత బాధలో ఉండి కూడా మా నాన్న ఆయన గురించి ఆలోచించడం లేదు, నా గురించి ఆలోచిస్తున్నాడు.

ఆ సమయములో నాకు దైవిక త్రిత్వం గుర్తుకు వచ్చింది. ట్రినిటీ, దేవుని లో ముగ్గురు వ్యక్తులు ఉన్నారు. ముగ్గురు మూడు వేర్వేరు వ్యక్తులు, కానీ వాళ్ళ స్వభావం ఒక్కటే. గుణగణాలు ఒక్కటే. మానవులకు మనల్ని ఎలా ఇంట్రడ్యూస్ చేసుకొందాం? మనల్ని ఏ పేరులతో మనుష్యులకు పరిచయం చేసుకొందాం అని వారు ఆలోచించారు.

చివరకు వారు ఏమనుకొన్నారంటే,

నన్ను తండ్రి అని పిలుచుకొంటాను

నువ్వు కుమారుడు అని పిలుచుకొంటావు

మూడో వ్యక్తి పరిశుద్ధాత్ముడు అని పిలువబడతాడు.

ఒక అపురూపమైన బంధం దైవిక త్రిత్వం లో మనకు కనిపిస్తున్నది.

తండ్రి కుమారుని కోసం ఆలోచిస్తూ ఉంటాడు.

కుమారుడు తండ్రి కోసం ఆలోచిస్తూ ఉంటాడు.

తండ్రి ఐన దేవుడు, నేను కాదు, నా కుమారుడు ముఖ్యం అనుకునేవాడు

కుమారుడైన దేవుడు, నేను కాదు, నా తండ్రి ముఖ్యం అనుకునేవాడు.

ఆ ముగ్గురు వ్యక్తులు మన కోసం సమర్పించుకున్నారు.

తండ్రి తన కుమారుని మన కోసం త్యాగం చేసాడు.

కుమారుడు యేసు క్రీస్తుగా సమస్తం త్యాగం చేసి, సిలువ మరణం పొందు నంతగా మన కోసం తగ్గించుకున్నాడు.

పరిశుద్ధాత్ముడు కూడా తగ్గించుకొని, పాపాత్ములమైన మన మధ్యలో జీవించటానికి ఒప్పుకున్నాడు.

దైవిక త్రిత్వం లో ఉన్న

ఆ ప్రేమను

ఆ దయను

ఆ కనికరాన్ని

ఆ క్షమాపణను

ఆ సహనాన్ని

ఆ దీర్ఘ శాంతాన్ని

ఆ మంచి తనాన్ని

ఆ సమర్పణను

ఆ త్యాగాన్ని

కట్టుపల్లి యోహాను గారు తన జీవితములో కొంత మేరకు ప్రతిఫలింప జేశారు. ఆయన జీవితం యొక్క ఆదర్శం మనల్ని కూడా ప్రభావితం చేయును గాక!  కట్టుపల్లి యోహాను గారి జీవితం మనందరికీ ఆదర్శప్రాయం అగును గాక!

Kattupalli Yohan Funeral message by his son, Dr.Paul Kattupalli,

Bible Home compound, Ithanagar, Tenali. October 23, 2018

8F83C90E-AC4B-4D38-AE90-5812CDCB476B.jpeg

 

One thought

  1. ప్రైస్ ది లార్డ్ !
    నా పేరు ఆకుల వెంకటేశ్వర రావు , విజయవాడ, గతం లో నేను మహీంద్రా కంపెనీ లో సేల్స్ మేనేజర్ గా ఉండేవాడిని . యోహాన్ సర్ కి నే నంటే చాలా ఇష్టం నాకు పితృ సమానులు . . వారికీ మహీంద్రా బస్సులు అంబులెన్సులు , వాటి కి ఫైనాన్స్ సంబంధిత పనులన్ని నా చేతే చేయించేవారు. ఎప్పుడు తెనాలి వైపు వెళ్లినా వారి పాదాలకి నమస్కారం చేసి వచ్చే వాడిని. నే చేసే అన్నదాన కార్యక్రమం వారికి తెలిసి చాలా సంతోష పడ్డారు .. వారి మరణం నాకు తీరని లోటు. వారి ఆత్మకు శాంతి కలగాలని కోరుకుంటున్నా ..
    avrao 98485 38366https: //www.facebook.com/venkateswararao.akula

Leave a Reply