1 రాజులు: గ్రంథ పరిచయం

SolomonQueenofSheba.png

పరిచయం: 1 సమూయేలు, 2 సమూయేలు ఆదిమ హెబ్రీ బైబిలులో ఏక గ్రంధముగా ఉన్నది. అదే విధముగా, 1 రాజులు, 2 రాజులు ఆదిమ హెబ్రీ బైబిలులో ఏక గ్రంధముగా ఉన్నది. సెప్టూగింటు (గ్రీకు భాషలోకి అనువదించబడిన హెబ్రీ బైబిలు, క్రీ. పూ 3 శతాబ్దము) ఆ ఏక గ్రంధములను సౌలభ్యము కొరకు రెండింటిగా విభజించింది.

    దావీదు జీవితము యొక్క చరమాంకంలో (క్రీ. పూ 971) ఈ పుస్తకము మొదలవుతుంది. ఆయన మరణం తరువాత ఆయన కుమారుడైన సొలొమోను రాజ్యములో ఇశ్రాయేలు దేశం అనేక రంగాల్లో స్థిరపరచబడి, అభివృద్ధి చెంది గొప్ప దేశముగా అవతరించింది. క్రీ. పూ 931 లో,సొలొమోను మరణం తరువాత కొన్ని సంవత్సరాలకు, ఐక్య ఇశ్రాయేలు దేశము ఉత్తర దేశము (ఇశ్రాయేలు దేశము/ 10 గోత్రాలు), దక్షిణ దేశము (యూదా దేశము/2 గోత్రాలు) గా విడిపోయింది. మొదటి రాజుల గ్రంధములో ఈ విడిపోయిన రెండు దేశాల యొక్క చరిత్ర క్రీ. పూ 853 వరకు వివరించబడింది.

రచయిత: రచయిత ఎవరో ఖచ్చితముగా చెప్పలేము. కానీ ఆయన అనేక చారిత్రిక గ్రంధములను తరచి చూచి, వాటి ఆధారముగా పరిశుద్దాత్ముని సహాయముతో ఈ గ్రంధము వ్రాసాడు.

వ్రాయబడిన కాలము: యూదులు బబులోను చెరలో ఉన్నప్పుడు వ్రాయబడి ఉండవచ్చును.

వ్రాయబడిన స్థలము: బబులోను దేశములో వ్రాయబడి ఉండవచ్చును. కానీ ఖచ్చితముగా చెప్పలేము.

ముఖ్య అంశాలు:

సొలొమోను రాజ్యం: సొలొమోను ఇశ్రాయేలు దేశానికి గొప్ప రాజు అయ్యాడు. యెరూషలేములో గొప్ప దేవుని ఆలయాన్ని నిర్మించి, ప్రతిష్టించాడు.

సొలొమోను పతనం: సొలొమోనును దేవుడు ఎంతో ఆశీర్వదించాడు. ఎంతో జ్ఞానము, ఐశ్వర్యము, కీర్తి ప్రతిష్టతలు పొందాడు. అయితే అతను క్రమ శిక్షణను కోల్పోయాడు. రాజు ‘తన హృదయము తొలగి పోకుండునట్లు అతడు అనేక స్త్రీలను వివాహము చేసికొనకూడదు’ (ద్వితీయోప 17:17) అని దేవుడు ఇచ్చిన ఆజ్ఞను నిర్లక్ష్యం చేసి ఏడు వందలమంది రాజకుమార్తెలైన భార్యలను మూడువందల మంది ఉప పత్నులను తెచ్చుకొన్నాడు. వారు అతని హృదయమును దేవుని వైపు నుండి తమ దేవతల తట్టు తిప్పివేశారు. ‘సొలొమోను యెహోవా దృష్టికి చెడు నడత నడచి తన తండ్రియైన దావీదు అనుసరించినట్లు యథార్థహృదయముతో యెహోవాను అనుసరింపలేదు’ (1 రాజులు 11:6)

రాజుల పాపాలు – ప్రజల కష్టాలు: సొలొమోను, అతని తరువాత వచ్చిన రాజులు దేవుని ఆజ్ఞలు విడిచిపెట్టి పాపాలు చేసి, దేశాన్ని విగ్రహారాధనతో నింపివేసారు. దేవుని తీర్పు వచ్చింది, వారి పాపాలు ప్రజలను కూడా కష్టాల పాలు చేసినాయి. రాజుల నాయకత్వం విఫలమైతే ప్రజలు శ్రమ పడుతారు.

ప్రార్ధన ప్రభావం: ప్రార్ధన ఎంత  ప్రభావం కలిగిఉంటుందో ఏలీయా ప్రవక్త జీవితంలో మనం చూడవచ్చు.  ‘ఏలీయా మనవంటి స్వభావముగల మనుష్యుడే; వర్షింపకుండునట్లు అతడు ఆసక్తితో ప్రార్థన చేయగా మూడున్నర సంవత్సరములవరకు భూమిమీద వర్షింపలేదు’ (యాకోబు 5:17; 1 రాజులు 17:1)

ముఖ్య వ్యక్తులు: దావీదు, సొలొమోను, షేబ దేశపు రాణి, యరొబాము, అహాబు, ఏలీయా, యెహోషాపాతు

గ్రంథ విభజన:

1 అధ్యాయము:  రాజ కుమారుల కుట్రలను వమ్ము చేసి, సొలొమోను ను రాజుగా చేసిన దావీదు

2 అధ్యాయము:  దావీదు మరణ వాక్కులు, చివరి కోరికలు

3 అధ్యాయము:  సొలొమోనుకు దేవుని ప్రత్యక్షత, అతని కోరిక మేరకు జ్ఞాన ప్రసాదం

4 అధ్యాయము:  సొలొమోను రాజ్య అభివృద్ధి, స్థాపన

5 అధ్యాయము:  తూరు రాజైన హీరాము సొలొమోను కు అందించిన నిర్మాణ సహకారం

6 అధ్యాయము:  సొలొమోను యెరూషలేములో దేవుని ఆలయము కట్టించుట

7 అధ్యాయము:  సొలొమోను అంతః పుర నిర్మాణం

8 అధ్యాయము:  సొలొమోను దేవుని ఆలయము ప్రతిష్టించుట, ప్రార్ధించుట

9 అధ్యాయము:  సొలొమోనుకు రెండవ సారి దేవుని ప్రత్యక్షత

10 అధ్యాయము: షేబ దేశపు రాణి సొలొమోనును సందర్శించుట

11 అధ్యాయము: సొలొమోను బహు భార్యత్వము, పతనము

12 అధ్యాయము: ఐక్య ఇశ్రాయేలు దేశము రెండు ముక్కలగుట

13 అధ్యాయము: అవిధేయుడయిన దైవ జనుడు

14 అధ్యాయము: యరొబాము, రెహబాముల పాలన, ఇశ్రాయేలులో విచ్చలవిడి విగ్రహారాధన

15 అధ్యాయము: అబీయాము, ఆసా, నాదాబు, బయెషా రాజుల పాలన

16 అధ్యాయము: ఏలా, జిమీ, ఒమీ, అహాబు రాజుల పాలన

17 అధ్యాయము: ఏలీయా ప్రవక్త సారెపతు విధవరాలికి చేసిన పరిచర్య

18 అధ్యాయము: ఏలీయా బయలు దేవత ప్రవక్తలను సవాలు చేయుట

19 అధ్యాయము: ఏలీయా యెజెబెలు యొద్ద నుండి పారిపోవుట

20 అధ్యాయము: అహాబు రాజు సిరియనుల మీద యుద్ధము, విజయము

21 అధ్యాయము: అహాబు, యెజెబెలు నాబోతు ద్రాక్ష తోటను ఆక్రమించుట

22 అధ్యాయము: యెహోషాపాతు రాజ్యం, అహాబు దుర్మరణం

ముఖ్య ప్రవచనాలు:

  1. సొలొమోను ఆశీర్వదించబడతాడని దేవుడు ప్రవచించాడు (1 రాజులు 9)
  2. సొలొమోను శిక్షించబడతాడని దేవుడు ప్రవచించాడు (1 రాజులు 11)
  3. యరొబాము ఉత్తర దేశానికి రాజు అవుతాడు (1 రాజులు 11:31-39)
  4. అవిధేయుడైన దైవ జనుడు శిక్షించబడతాడు (1 రాజులు 13)
  5. యరొబాము శిక్షించబడతాడు (1 రాజులు 14)
  6. ఏలీయా ప్రవక్త ఇశ్రాయేలు మీదకు కరువును తెస్తాడు (1 రాజులు 17:1)

ప్రభువైన యేసు క్రీస్తు రూపం:

    దావీదుకు ఎంతో జ్ఞానవంతుడైన, ఆశీర్వదించ బడిన కుమారుడుగా సొలొమోను తన జీవితమును, రాజ్య పాలనను మొదలుపెట్టాడు. అయితే తరువాత సొలొమోను బహు భార్యలను పొంది, వారి ప్రోద్బలముతో విగ్రహారాధికుడు అయిపోయాడు. అతని చూచి ఇశ్రాయేలు ప్రజలు కూడా దేవుని విడిచిపెట్టి అక్రమస్తులయ్యారు. దావీదు మరొక కుమారుడైన యేసు క్రీస్తు సొలొమోను వలె పతనం చెందక ప్రజలను దేవుని మార్గములో నడిపిస్తాడు. ఆయన రాజ్యములో ఈ ప్రపంచములో, ఇశ్రాయేలు దేశములో వెయ్యేళ్ళ స్వర్ణ యుగము నడుస్తుంది. లోకం నలుమూలల నుండి ప్రజలు నిజ దేవుని ఆరాధించుటకు యెరూషలేము వెళ్తారు.

మనం నేర్చుకోవలసిన పాఠాలు:

-ఆరంభ శూరత్వము: సొలొమోను దేవుని క్రమములో జీవితాన్ని మొదలు పెట్టి విగ్రహారాధకునిగా ముగించాడు. ఎలా విశ్వాస జీవితాన్ని ప్రారంభించామని మాత్రమే కాకుండా, ఎలా దానిని ముగించాము అనేది కూడా ముఖ్యమే.

-మన పాపాలు మనతో ఆగిపోవు: ఇశ్రాయేలు, యూదా రాజులు దేవుని ఆజ్ఞలను అతిక్రమించి పాపము చేసినప్పుడు, వారిని చూసి ప్రజలు కూడా పాడయిపోయారు. దేవుని తీర్పు, శిక్ష అందరి మీదకు వచ్చింది. మన పాపాల ప్రభావం మనమీదే కాకుండా మన ఇంటి వారి మీద, ఇతరుల మీద కూడా ఉంటుంది.

దురాక్రమణ: అహాబు రాజు, అతని భార్య యెజెబెలు నాబోతుకు చెందిన ద్రాక్ష తోటను ఆశించి, దానిని దౌర్జన్యముగా ఆక్రమించుకొని, నాబోతును చంపించారు. దేవుడు వారి దుర్మార్గాన్ని సహించలేదు. వారిని తీవ్రముగా శిక్షించాడు. ఇతరుల పొలాలను, స్థలాలను, ఆస్తులను ఆక్రమించుకొనటం పాపము అని గ్రహించావా?

-దుష్ట సాంగత్యము: యెహోషాపాతు దైవ భక్తి కలిగినవాడయినప్పటికీ దుష్టుడైన అహాబు రాజు తో స్నేహం చేసాడు. దుష్ట సాంగత్యము మంచి నడవడిని చెరిపివేస్తుంది. 

Introduction to the Book of First Kings by Dr.Paul Kattupalli

Please make a donation to our ministry

$25.00

Leave a Reply