2 దినవృత్తాంతములు గ్రంథ పరిచయం

Hezekiahtelugu.jpg

పరిచయం:ఆదిమ హెబ్రీ గ్రంధములో 1 దినవృత్తాంతములు, 2 దినవృత్తాంతములు రెండూ ఏక గ్రంధముగా ఉన్నవి. మొదటి దినవృత్తాంతములు గ్రంధములో మొదలైన చరిత్ర ఈ గ్రంధములో కొనసాగింది. దక్షిణ యూదయ దేశము, దాని రాజుల చరిత్ర మాత్రమే ఈ గ్రంధములో వ్రాయబడింది. ఉత్తర దేశము (10 గోత్రాలు) యొక్క చరిత్ర ఈ గ్రంధములో లేదు. సొలొమోను రాజు నుండి సిద్కియా రాజు వరకు జరిగిన కార్యములు మనకు తెలియుచున్నవి. సొలొమోను క్రింద స్వర్ణ యుగాన్ని అనుభవించిన ఇశ్రాయేలీయులు సిద్కియా రాజు కాలము నాటికి శత్రువుల దాస్యములోనికి వెళ్లిపోవు బాధాకరమైన సంఘటనలతో ఈ పుస్తకము ముగుస్తుంది. అయినప్పటికీ దేవుడు తన ప్రజలను తిరిగి వాగ్దాన దేశమునకు రప్పించి, తన విశ్వసనీయతను చాటుకున్నాడు.

రచయిత: ఎజ్రా అయి ఉండవచ్చు, కానీ ఖచ్చితముగా చెప్పలేము

వ్రాయబడిన కాలము: క్రీ. పూ 970 – 538 ల మధ్య జరిగిన సంఘటనలను ఈ పుస్తకములు వివరించుచున్నవి గనుక ఈ పుస్తకములు క్రీ. పూ 538 తరువాత వ్రాయబడినవని తెలియుచున్నది.

వ్రాయబడిన స్థలము: బబులోను లేక ఇశ్రాయేలు దేశము

ముఖ్య అంశాలు:

ఆరాధన: ఈ గ్రంథ రచయిత పదే, పదే దేవాలయమును ప్రస్తావిస్తాడు. సొలొమోను తన గొప్ప దేవాలయమును ఇశ్రాయేలీయుల మధ్య నిర్మించాడు. దేవుని ఆరాధించుట మన జీవితానికి కేంద్రముగా ఉండాలి.

దేవుని ఆలయము: చాలా మంది రాజులు దేవుని ఆలయాన్ని నిర్లక్ష్యం చేశారు. ఉజ్జియా రాజు చేయకూడని అర్పణ చేసి ఆలయాన్ని అపవిత్రం చేసాడు (26). మనష్షే రాజు దేవుని ఆలయములో అన్యదేవతలను ప్రతిష్టించి, పూజించాడు. కానీ, ఆసా, యోవాషు, హిజ్కియా, యోషీయా రాజులు ఆలయమునకు మరమత్తులు చేయించారు.  మన వ్యక్తిగత జీవితములో మనం దేవునికి ఇచ్చే స్థానము, దేవుని ఆలయమునకు మనం ఇచ్చే ప్రాధాన్యత ను ప్రభావితం చేస్తుంది.

దేవాలయం నాశనం: సొలొమోను చేత ఎంతో వైభవముగా, మహిమాన్వితముగా నిర్మించబడిన యెరూషలేము దేవాలయము చివరకు అవమానకరమైన రీతిలో బబులోనీయుల చేత నిర్మూలించబడింది. దేవుని ప్రజలు దేవుని వాక్యాన్ని, సత్యాన్ని, నిజమైన ఆరాధనను నిర్లక్ష్యం చేస్తే పరిణామాలు ఏ విధముగా ఉంటాయో దీని వలన గ్రహిస్తున్నాము.

మానవ దుష్టత్వము: చాలా మంది రాజులు దుష్టులుగా మారుట ఈ గ్రంధములో చూస్తాము. అతల్యా రాజ వంశస్తులనందరినీ హతము చేసింది (22). యెహోరాము కూడా తన సోదరుల నందరినీ సింహాసనం కోసము హత్యలు చేయించాడు (21). అధికారం, డబ్బు కోసం మనుష్యులు ఎంత దుష్టత్వానికి పాల్పడుతారో ఈ రాజుల చరిత్రలో మనం గమనిస్తాము.

దేవుని విశ్వసనీయత: 35-36 అధ్యాయాల్లో యిర్మీయా ప్రవక్త 4 సార్లు ప్రస్తావించబడ్డాడు. యూదులు బబులోనులో 70 సంవత్సరాలు బందీలుగా ఉంటారని యిర్మీయా ప్రవచించాడు (36:21). దేవుడు ఆ ప్రవక్త ద్వారా తెలియజేసిన ప్రవచనాలు తగిన కాలములో యూదుల పట్ల నెరవేర్చాడు. దేవుని యొక్క విశ్వసనీయత ఇక్కడ మనకు కనిపించుచున్నది.

ముఖ్య వ్యక్తులు: సొలొమోను, ఆసా, యోవాషు, హిజ్కియా, మనష్షే, యోషీయా, సిద్కియా

గ్రంథ విభజన:

I. సొలొమోను రాజ్యం

పట్టాభిషేకం (1:1-17)

సొలొమోను నిర్మించిన ఆలయం (2:1-7:22)

సొలొమోను కట్టించిన పట్టణములు (8:1-18)

షేబ దేశపు రాణి సొలొమోను సందర్శన (9:1-28)

సొలొమోను మరణం (9:29-31)

II . యూదా రాజుల పాలన

  1. రెహబాము (10:1-12:16)
  2. అబీయా (13:1-22)
  3. ఆసా (14:1-16:14)
  4. యెహోషాపాతు (17:1-21:3)
  5. యెహోరాము (21:4-20)
  6. అహజ్యా (22:1-9)
  7. అతల్యా రాణి (22:10-23:21)
  8. యోవాషు (24:1-27)
  9. అమజ్యా (25:1-28)
  10. ఉజ్జియా (26:1-23)
  11. యోతాము (27:1-9)
  12. ఆహాజు (28:1-27)
  13. హిజ్కియా (29:1-32:33)
  14. మనష్షే (33:1 – 20)
  15. ఆమోను (33:21-25)
  16. యోషీయా (34:1-35:27)
  17. యెహోయాహాజు (36:1-4)
  18. యెహోయాకీము (36:5-8)
  19. యెహోయాకీను (36:9,10)
  20. సిద్కియా (36:11-21)

III. బబులోను చెర నుండి యూదుల విముక్తి (36:22-23)

ముఖ్య ప్రవచనాలు:

20:37 – యెహోషాపాతు ఓటమి గురించి ఎలియాజరు ప్రవచించుట

21:12-20 – యెహోరాము రాజు మీద శిక్షలను ప్రవచించిన ఏలీయా

24:20-25 – జెకర్యా యోవాషు మీద చేసిన ప్రవచనం

32:24 – హిజ్కియా ప్రార్ధన విని దేవుడు అతని జీవితం పొడిగించుట

ప్రభువైన యేసు క్రీస్తు రూపం: దేవుడు దావీదుకు  నిత్య రాజ్య వాగ్దానం చేసాడు. అతని సంతానము నిరంతరం పాలించేదిగా ఉంటుందని దేవుడు దావీదుకు మాట ఇచ్చాడు. అయితే దావీదు కుమారులు బబులోనుకు సంకెళ్లతో ఈడ్చుకొనివెల్లబడు హృదయ విదారక దృశ్యములతో ఈ గ్రంధము ముగుస్తుంది. దావీదు ఇతర కుమారులు విఫలమయినప్పటికీ, దేవుడు దావీదుకు మరొక గొప్ప కుమారుణ్ణి అనుగ్రహించబోవుచున్నాడు. ఆ కుమారుడైన ప్రభువైన యేసు క్రీస్తు ద్వారా దేవుడు దావీదు సింహాసనాన్ని నిత్య సింహాసనముగా, అతని రాజ్యాన్ని నిత్య రాజ్యముగా చేస్తాడు.

మనం నేర్చుకోవలసిన పాఠాలు:

-‘యెహోవాను హృదయ పూర్వకముగా వెదకిన యెహోషాపాతు’ (22:9): మనము దేవుని హృదయపూర్వకముగా వెదకి అనుసరిస్తున్నామా?

-తాను ప్రేమించి, ఏర్పరచుకొని నడిపించిన ఇశ్రాయేలీయులు కూడా పాపము చేసి, అవిధేయులై పోయినప్పుడు, దేవుడు వారిని శిక్షించాడు. దేవునిలో పక్షపాతం లేదని గ్రహించావా?

-ఇద్దరు రాజులు – హిజ్కియా, యోషీయా లు దేవుని ఆలయము విగ్రహములతో నిండి ఉండుట చూచి సహించలేకపోయారు. ఆలయములో ఉన్న విగ్రహములను తీసివేసి, దానిని పవిత్రం చేసి, మరమత్తులు చేసి జీవము గల దేవునికి పునః ప్రతిష్టించారు. అనేక లోక సంభంధమైన అసత్యాలు, అపవిత్రాలతో నిండిపోయిన నేటి క్రైస్తవ సంఘాలను పవిత్రం చేయాలనే కాంక్ష మనలో ఉందా?

Leave a Reply