కట్టుపల్లి యోహాను గారి జ్ఞాపకార్ధ సందేశం: డాక్టర్ పాల్ కట్టుపల్లి

Fatheryohan2019a.jpeg

Brother K. Yohan memorial speech by Dr.Paul Kattupalli, November 2, 2018, Bible Home, Ithanagar, Tenali.

కట్టుపల్లి యోహాను గారి జ్ఞాపకార్ధ కూటమునకు విచ్చేసిన మీ  అందరికి వందనాలు తెలియజేస్తున్నాము. ఒక పూడ్చ లేని లోటును యోహాను గారు మన మధ్యలో మిగిల్చి వెళ్లిపోయారు. ఈ జ్ఞాపకార్ధ కూటం ఎందుకు ఏర్పాటు చేసాం అని కొంతమంది అడిగారు. ఈ రోజు నాలుగు విషయాలు మీతో చెప్పాలని నేను ఆశపడుచున్నాను.

మొదటిగా,

A Time to Praise

69 కీర్తనలో మనం చదువుతాము:

  1. కీర్తనలతో నేను దేవుని నామమును

స్తుతించెదను కృతజ్ఞతాస్తుతులతో

నేనాయనను ఘనపరచెదను.

  1. ఎద్దుకంటెను, కొమ్ములును

డెక్కలునుగల కోడె కంటెను

అది యెహోవాకు ప్రీతికరము

అన్నిటి కంటే దేవునికి ప్రీతికరమైనది ఆయనకు మనం స్తుతులు చెల్లించుట, కృతజ్ఞతా స్తుతులు చెల్లించి ఘనపరచుట.

యోహాను గారి జీవితం మీద దేవుడు అనేక దీవెనలు కుమ్మరించాడు.

భూలోక సంభందముగా మంచి ఉద్యోగం, మంచి కుటుంబం, మంచి బంధువులు, మంచి మిత్రులు, మంచి సంఘస్తులను దేవుడు ఆయనకు ఇచ్చాడు. ఆత్మ సంభందముగా ఆయనకు యేసు క్రీస్తు నందు రక్షణ ఇచ్చాడు. అది అన్నిటికంటే ముఖ్యమైనది. వాటన్నిటిని బట్టి మనం దేవునికి స్తుతులు చెల్లించాలి.

యోహాను గారు ఎదుర్కొన్న కష్టాలు, జబ్బులు, శ్రమలను బట్టి కూడా మనం దేవుని స్తుతించాలి. ఆగష్టు నెలలో నేను చివరి సారి యోహాను గారిని హాస్పిటల్ కి తీసుకొని వెళ్ళాను. కాన్సర్ బాగా ముదిరిపోయింది, మందులు కూడా పనిచేయటం లేదు అని డాక్టర్ మాతో అన్నాడు. ఆ రోజు విజయవాడ లో నాగార్జున హాస్పిటల్ లో ఒక గదిలో నేను వీడ్కోలు చెప్పాను. ఆ సమయములో మేము కొంత సేపు దేవుని స్తుతిలో గడిపాము.

1995 లో ఆయన సంఘ సేవ నిమిత్తం తాడేపల్లి గూడెం వెళ్లుచు ఉన్నాడు. రైలులో ప్రయాణికుల మధ్యలో నిలబడి ఉన్నప్పుడు ఆయనకు హార్ట్ ఎటాక్ వచ్చింది. సుమారు గంట సేపు గుండె నొప్పిని ఓర్చుకొన్నాడు. అక్కడ ఉన్న సోదరులు అప్పుడు వచ్చి వెంటనే ఆయనను తణుకులో ఒక మంచి హాస్పిటల్ కి తీసుకొని వెళ్లి ఆయన ప్రాణాలు కాపాడటం జరిగింది. ఆ సంఘటన తరువాత 24 ఏళ్ళ ఆయుష్షు ను దేవుడు ఆయనకు ఇచ్చాడు.

2011 లో యోహాను గారు అమెరికా వచ్చాడు. నేను, జాన్ ఉండే పెన్సిల్వేనియా రాష్ట్రం వచ్చాడు. బైబిల్ పనుల మీద ఇండియానా అనే రాష్ట్రం వెళ్ళాడు. అక్కడ ఒక రాత్రి ఒంటరిగా ఉన్నాడు. ఆ సమయములో ఆయనకు మరొక హార్ట్ ఎటాక్ వచ్చింది. ‘గుండె నొప్పి’ గా ఉంది అని ఆ సమయములో ఆయన నాకు ఫోన్ చేసాడు. వెంటనే నేను హోటల్ వాళ్ళతో మాట్లాడి ఒక అంబులెన్సు తెప్పించి ఆయనను హాస్పిటల్ కి తరలించి వైద్య సహాయం చేయించాము. ఆ సంఘటన తరువాత దేవుడు మరొక 7 సంవత్సరాలు ఆయనకు ఆయుష్షు ఇచ్చాడు. దానిని బట్టి మేము దేవునికి కృతజ్ఞతా స్తుతులు చెల్లిస్తున్నాము.

2014 నవంబర్ నెలలో ఆయనకు కాన్సర్ వచ్చింది. Multiple Myeloma అనే ఆ జబ్బు గురించి నేను టెక్స్ట్ బుక్స్ లో చదివాను కానీ ఇండియా లో ఎక్కడా చూడలేదు. అది బయట పడినప్పుడే స్టేజ్ 3 లో బయటపడింది. డాక్టర్ లు నాతో ఏమన్నారంటే, ఇంకో 3 సంవత్సరాలే బ్రతుకుతాడు. మందులు పనిచేయని పరిస్థితిని, చాలా బాధాకరమైన స్థితిని ఆయన ఎదుర్కొన్నాడు. ఆ సమయములో కూడా మేము దేవుని స్తుతించాము. అది బైబిల్ లో ఉన్న పద్దతే.

యోబు తన శ్రమల్లో దేవుని స్తుతించాడు.

అపొస్తలుడైన పౌలు, సీలలు – వారు కొట్టబడి, జైలులో వేయబడ్డారు. అపొస్తలుల కార్యములు 16 అధ్యాయములో మనం చదువుతాము. వారు ఫిలిప్పీ పట్టణములో జైలులో వేయబడ్డారు. వారి కాళ్ళు బొండవేసి బిగించారు. ఆ సమయములో వారు ఏమిచేస్తున్నారు. కీర్తనలు పాడుచూ ఉన్నారు. యోహాను గారు శ్రమల్లో వున్నప్పుడు, నేను దేవుని కీర్తిస్తూ ఒక పాట వ్రాసాను.

ఆ పాట పాడి మీకు వినిపిస్తాను.

ప = పాడెదను నేనెల్లప్పుడు –

నీ మహిమ గురించి

ప్రభువా – ఎల్లప్పుడు

ఘనత మహిమ నీకేనయ్యా

యుగయుగములు నిను కీర్తించెదన్

  1. ఆకాశ మహాకాశమ్

నీ ఐశ్వర్యము చూపించెను  

భూమియు దాని సంపూర్ణత

నీ జ్ఞానమునే బోధించెను

  1. అల్ఫాయు ఒమెగాయు

ఆది అంతము లేనివాడవు

మానవ జన్మను ఎత్తావయ్యా

దాసుని రూపం పొందావయ్యా

  1. మార్గము, సత్యము, జీవముగా

పరమ వెలుగై  వచ్చావయ్యా

లోక పాపము మోసావయ్యా

ప్రేమను నాకు  చూపావయ్యా

  1. సాతాను వాని బలమంతయు

సిలువ మీద ఓడించినావు

మరణము గెల్చి లేచావయ్యా

నిత్యము మాతో ఉంటావయ్యా

  1. గొర్రెలకు మంచి కాపరివి

ప్రాణ మిచ్చి రక్షించినావు

నీ కృప నాకు చాలునయ్యా  

నీ మాటే నా బలమయ్యా

సామెతలు గ్రంధం 10:7 లో మనం చదువుతాము:  

నీతిమంతుని జ్ఞాపకముచేసికొనుట ఆశీర్వాదకర మగును

కీర్తన 116:15

యెహోవా భక్తుల మరణము ఆయన దృష్టికి విలువ గలది

Psalm 116:15 Precious in the sight of the LORD is the death of His saints.

దేవుని ప్రభావం వలన మన దృష్టిలో కూడా ఆయన భక్తుల మరణం విలువైనదే.

మా నాన్న మా నలుగురు తో చాలా సార్లు ఏమన్నాడంటే,, మార్టిన్, మాథ్యూ, పాల్, జాన్, మీ నలుగురు నా సమాధి మోయాలి. యోహాను గారి కల మొన్న నెరవేర్చాము. ఆయన మరణం మా కుటుంబములో అందరినీ ఒక చోటకు చేర్చింది.

2014 లో యోహాను గారికి కాన్సర్, 2016 లో మా అమ్మకు రొమ్ము కాన్సర్ వచ్చింది.

మా ఇంట్లో అందరూ ముందుకు వచ్చి వారికి సహాయం చేశారు.

షారోన్, మార్టిన్ వారికి సమయం దొరికి నప్పుడు వచ్చి సహాయం చేశారు.

మాథ్యూ హెన్రీ ఎంతో బిజీ గా ఉండే వ్యక్తి. ఆయన కూడా తన పనులు ప్రక్కన పెట్టి ఒక వారం మా అమ్మను హాస్పిటల్ కి తీసుకొని వెళ్తే, మరొక వారం మా నాన్నను తీసుకొని వెళ్ళాడు.

వారిని దగ్గరగా చూసి ఎన్నో నేర్చుకున్నాను అని చెప్పాడు.

మా అమ్మను కాన్సర్ ట్రీట్మెంట్ లకు తీసుకొని వెళ్ళాడు. ఆమె ఏ హాస్పిటల్ కి వెళ్లినా తనకు ఎదురయ్యే ప్రతి నర్స్, డాక్టర్, ప్యూన్, కంపౌండర్, టెక్నిషియన్ ప్రతి ఒక్కరికి సువార్త చెబుతా ఉంది. మాథ్యూ ఏమన్నాడంటే,

‘మా అమ్మ బాధలో ఉండి సువార్త చెబుతా ఉంది, నేను ఆరోగ్యముగా ఉండి ఎందుకు చెప్పకూడదు?’

కనక మార్సెల్లా – కెనడా దేశములో ఉద్యోగం మానుకొని వచ్చి మా అమ్మకు సేవ చేసింది.

మిరియం మా నాన్న, మా అమ్మ ఇద్దరికీ సేవ చేసింది

జాన్ నెల్సన్ అమెరికా లో మంచి ఉద్యోగం వదలిపెట్టుకొని వచ్చి మా నాన్నకు సేవ చేసాడు.

అదే విధముగా ఇక్కడ తెనాలి లో అనేక మంది వారికి సహాయం చేసారు. ఎంతో మంది సహాయాన్ని దేవుడు యోహాను గారికి సమకూర్చాడు. మీలో ప్రతి ఒక్కరికి మేము థాంక్స్ చెబుతున్నాము.

బైబిల్ లో, క్రొత్త నిబంధనలో సమాధికి mnemeion అనే గ్రీకు పదం వాడబడింది. మనకు ఇంగ్లీష్ లో mnemonics అనే పదం అందులో నుండి వచ్చిందే. అంటే ‘గుర్తుపెట్టుకొనేది’. ఒక సమాధి రాయిని మనం గుర్తుపెట్టుకోవాలి. మన కంటే ముందు చనిపోయిన వ్యక్తుల జీవితాలు మనం గుర్తుపెట్టుకోవాలి. ఈ ఆధునిక యుగములో మనకు తీరిక లేదు.

 నేను 2001 లో అమెరికా దేశం వెళ్ళాను. ఒకాయన నన్ను ‘నా స్నేహితుడు ఒకాయన చనిపోయాడు. సమాధి కార్యక్రమం కు వెళదాం పద’ అన్నాడు. ఆయనతో కలిసి నేను ఆ సమాధి కార్యక్రమానికి వెళ్ళాను. ఒక పెద్ద హాల్ లో ఒక ప్రక్క సమాధి పెట్టె, దాని కవర్ ప్రక్కకు పెట్టి ఉంది. అందులో ఒకాయన మృత దేహం ఉంది. చుట్టూ చాలా మంది వారి కబుర్లు వారు చెప్పుకొంటున్నారు. ‘నీ ఫామిలీ ఎలా ఉంది, నీ జాబ్ ఎలా ఉంది, నీకు ప్రమోషన్ వస్తుందా, మీ కుక్క ఎలా వుంది, మీ పిల్లి ఎలా ఉంది?’ అని వారు రకరకాల కబుర్లు చెప్పుకొంటున్నారు కానీ చనిపోయిన వ్యక్తి గురించి వారు మాట్లాడుకోవటం లేదు.

నా నాన్న చనిపోయాడు, మా బంధువు చనిపోయాడు అని ఒక్కడు కూడా అక్కడ ఏడిచేవాడు లేడు. అమెరికా లో వారి పద్ధతులు చూసి నాకు ఆశ్చర్యం వేసింది.

మన దేశములో కూడా పద్ధతులు మారిపోవుతున్నాయి. నా చిన్న తనములో అంటే 30 ఏళ్ళ క్రితం మనిషి చనిపోతే రోజంతా ఏడ్చేవాళ్ళు. గుండెలు బాదుకొనేవాళ్ళు. సమాధికి తీసుకు వెళ్తా ఏడ్చేవాళ్ళు, ఇంటికి వెళ్తా ఏడ్చేవాళ్ళు. ఆ తరువాత చాలా రోజులు ఏడ్చేవాళ్ళు. ఇప్పుడు ఒక 5 నిమిషాలు ఏడ్చి ముగించివేస్తున్నారు.

లైఫ్ బిజీ గా మారింది.

మరణాన్ని మనం ఏ విధముగా చూస్తున్నాము అనేది మన ఆత్మీయ స్థితి మీద ఆధారపడి ఉంటుంది. దేవుడు లేని నాస్తికునికి మరణం ఒక ముగింపు. దాని తరువాత ఏమీ ఉండదు.

విశ్వాసికి మరణం ముగింపు కాదు. అది ఒక మలుపు మాత్రమే.

ప్రాశ్చత్య దేశాల్లో ఇప్పుడు చాలా మంది క్రెమేషన్ ను వాడుకొంటున్నారు. సమాధి కార్యక్రమం, సమాధి పెట్టె అయితే చాలా ఖర్చు తో కూడుకొన్న వ్యవహారం, 10 వేల డాలర్లు కావాలి. అదే మిషన్ లో పెట్టి కాల్చి వేస్తే, 1000 డాలర్లు చాలు అంటున్నారు.

తల్లి దండ్రులను సమాధి చేయించటానికి డబ్బులు లేవు అంటారు, వాళ్ళే మళ్ళీ ఏ లాస్ వేగాస్, సింగపూర్, మలేషియా నో విహార యాత్రలకు వెళ్తారు. వాటిలికి డబ్బులు ఉంటాయి. మరణించేవారికి మనం ఇచ్చే విలువ, మన పద్ధతులు సమాజములో మారుతున్నాయి. అయితే దేవుని దృష్టి, దేవుని పద్ధతులు మారవు.

క్రొత్త నిబంధనలో సమాధికి mnemeion అనే గ్రీకు పదం వాడబడింది. అంటే ‘గుర్తుపెట్టుకొనేది’.

యెహోవా భక్తుల మరణము ఆయన దృష్టికి విలువ గలది

Psalm 116:15 Precious in the sight of the LORD is the death of His saints.

లాజరు సమాధి దగ్గరకు వెళ్లి యేసు ప్రభువు కన్నీరు పెట్టుకొన్నాడు.

ఆ రాయిని తీసివేయండి అన్నాడు.

లాజరు, బయటికి రా అని లాజరును మరణం నుండి లేపాడు.

అది లాజరు సమాధి: ఏ సమాధిలో ఏ విశ్వాసి ఉన్నాడో దేవునికి తెలుసు,

ఆయన భక్తుల మరణం ఆయన దృష్టికి విలువగలిగినది.

A Time to Practice

గాంధీ గారు ఒక సారి క్రైస్తవులను విమర్శించాడు: ‘మీ యేసు క్రీస్తు అంటే నాకు చాలా ఇష్టం. కానీ మీ క్రైస్తవులంటే నాకు ఇష్టం లేదు అన్నాడు. మనం చాలా సార్లు యేసు క్రీస్తును మన జీవితాల్లో ప్రతిఫలింపజేయడములో విఫలం అవుతాము.

యోహాను గారు తన శక్తి కొలది యేసు క్రీస్తు ప్రేమను తన క్రియల్లో చూపించేవాడు.

నెల్లూరుకు చెందిన ఒక వ్యక్తి కొంత కాలం క్రితం మా నాన్నకు వ్యతిరేకముగా చాలా గందర గోళం సృష్టించాడు. తరువాత కొంతకాలానికి ఆయనే వచ్చి మా నాన్నను క్షమాపణ అడిగాడు. యోహాను గారు ఆయనను వెంటనే క్షమించాడు.

ప్రేమ, క్షమాపణ క్రైస్తవ్యానికి మూల పునాదులు.

అమెరికా దేశములో ఇప్పుడు జాతుల మధ్య వైషమ్యాలు పెరిగిపోతావున్నాయి.

2015 లో ఆఫ్రికన్ అమెరికన్ నల్లజాతి చెందిన కొంతమంది క్రైస్తవులు ఒక చర్చి (మదర్ ఇమ్మానుయేల్ చర్చి) లో ప్రార్ధన చేసుకొంటూ ఉన్నారు. వారి చర్చి కి ఒక తెల్లజాతి యువకుడు వచ్చాడు. ఆ యువకుని పేరు డైలాన్ రూఫ్.  యేసు ప్రభువు అంటే నాకూ ఇష్టమే అని వారి మధ్య కూర్చున్నాడు. వారంతా ప్రార్ధన చేసుకొంటున్నప్పుడు ఒక తుపాకీ తీసుకొని కాల్పులు జరిపాడు. వారిలో తొమ్మిది మంది అక్కడే ప్రాణాలు కోల్పోయారు. కోర్ట్ లో మృతుల కుటుంబీకులు డైలాన్ రూఫ్ కి ఎదురుపడ్డారు. వారు డైలాన్ రూఫ్ తో ఏమన్నారంటే, ‘డైలాన్ రూఫ్, నువ్వు చాలా ఘోరానికి ఒడిగట్టావు. మా కుటుంబీకుల ప్రాణాలు తీసావు. అయినప్పటికీ యేసు ప్రభువును బట్టి మేము నిన్ను క్షమించి వేసాము. వారి యొక్క క్షమాపణ చాలామందిని ఆకట్టుకొంది.

    గత వారం అమెరికా లోనే కొంతమంది యూదులు వారి ప్రార్ధన మందిరములో ప్రార్ధన చేసుకొంటున్నారు. ఒక తెల్ల జాతి యువకుడు లోపలికి వెళ్లి 11 మందిని కాల్చిచంపాడు. యూదులను తీవ్రముగా ద్వేషించాడు.  వారిని చంపేటప్పుడు ఆ తెల్ల జాతి యువకునికి కూడా కొన్ని గాయాలు అయినాయి. అతన్ని పోలీసులు అరెస్ట్ చేసి దగ్గరలోనే ఒక హాస్పిటల్ లో చేర్పించారు. అక్కడ యూదు డాక్టర్లు ఆ యువకునికి చికిత్స చేశారు. నా పేరు Dr.Cohen అని ఒక యూదు డాక్టర్ ఆ హంతుకునికి పరిచయం చేసుకొని చికిత్స చేసాడు.

Dr.Cohen ని ప్రశ్నించారు: ‘మీ యూదులను చంపిన వానికి వైద్యం చేస్తున్నావు ఏమిటి?’ ఆయన ఏమన్నాడంటే, ‘2015 లో మదర్ ఇమ్మానుయేల్ చర్చి లో కాల్పులు జరిపినప్పుడు ఆ హంతకుణ్ణి క్రైస్తవులు క్షమించలేదా? నా సంఘటన నాకు గుర్తుకువచ్చింది. నేను కూడా ఈ హంతకుణ్ణి క్షమించాను’.

ఆ విధంగా క్రైస్తవుల యొక్క క్షమాపణ గుణం ఒక యూదు డాక్టర్ ని ప్రభావితం చేసింది.

పల్లెకోన లో స్కూల్ ని వారికి ఇవ్వలేదని జర్మనీ వారు యోహాను గారిని చాలా వేధించారు. వారిని కూడా అయన క్షమించాడు. యేసు క్రీస్తు విశ్వాసాన్ని తన క్రియల్లో చూపించాడు.

  2011 లో ఒక సారి అమెరికా వచ్చాడు. నా క్లినిక్ కి వచ్చాడు. ‘ఒక్కొక్క పేషెంట్ దగ్గర యెంత ఫీజు తీసుకొంటావు’ అని నన్ను అడిగాడు. ‘70 డాలర్లు’ అని నేను చెప్పాను.

‘పేదలను 30 డాలర్లకు చూడు. మరీ పేదలను ఉచితముగా చూడు’ అని నాకు చెప్పాడు.

అమెరికా లో కూడా పేదలు ఉంటారు అనే అవగాహన ఆయనకు ఉంది.

నేను ఈ రోజుకు ధనవంతుల దగ్గర 70 డాలర్లు ఫీజు తీసుకొంటాను. పేదలకు 30 డాలర్లు లేకపోతే ఉచితముగా చూస్తున్నాను. అవసరాల్లో ఉన్న వారికి మనం దేవుని ప్రేమ చూపిస్తున్నామా?

   డబ్బుతో కూడా క్రమశిక్షణ పాటించేవాడు. మన దగ్గర డబ్బులు పెరిగే కొద్దీ శోధనలు పెరుగుతాయి. శోధనలు తట్టుకోవటం తేలిక కాదు. సొలొమోను రాజు జీవితములో మనం చూస్తే ఆయన ప్రారంభములో దేవుని యెడల భయభక్తులతో జీవించాడు. యెరూషలేములో ఒక గొప్ప దేవాలయం కట్టించాడు. అయితే, ఆయన ఐశ్వర్యం పెరిగిన తరువాత దేవునికి పూర్తిగా దూరం అయిపోయాడు.

    యోహాను గారికి ఒక రోజుల్లో లక్షలు, లక్షలు విరాళాలుగా వచ్చేవి. ఆయన దగ్గర నల్ల సంచి ఉండేది. అది బయట నల్లగా ఉండేది, లోపల తెల్లగా ఉండేది. డబ్బులు అందులో పెట్టి తీసుకొని వెళ్ళేవాడు. ఈ డబ్బు నల్లది అయినా దానిని తెల్లటి పనుల కోసం వాడుతున్నాం అనేవాడు. అంత డబ్బు ఆయన చేతుల్లో ఉన్నప్పటికీ క్రమశిక్షణ పాటించేవాడు. చాలా మంది యువతీయువకులు నాతో చెప్పారు. నేను యోహాను గారి హాస్టల్ లో ఉండి, ఆయన ప్రారంభించిన స్కూల్ లో చదువుకున్నాను. ఈ రోజు ఒక లెక్చరర్ గా పనిచేస్తున్నాను, ఒక టీచర్ గా పనిచేస్తున్నాను, ఒక ఇంజనీర్ గా పనిచేస్తున్నాను, ఒక పోలీస్ ఆఫీసర్ ని అయ్యాను, ఒక బ్యాంకు లో పనిచేసున్నాను. అని వారు చెపుతా ఉంటే, మాకు చాలా సంతోషముగా ఉంది,  యోహాను గారు పడిన శ్రమ వృధా కాలేదు అని మాకు అనిపిస్తున్నది.

A Time to Pray

చాలా మంది ప్రార్ధన చేయండి అని యోహాను గారిని అడుగుతా ఉండేవారు. ఆయన వారి కోసం ప్రార్ధన చేసేవాడు కానీ వారికి స్పష్టముగా యేమని చెప్పేవాడంటే, నా ప్రార్థనకు ప్రత్యేకమైన శక్తి ఏమీ లేదు. దేవుడు మీ ప్రార్ధన ఎలా వింటాడో నా ప్రార్ధన కూడా అలాగే వింటాడు. అటువంటి యదార్థత ఆయనలో ఉండేది. లేనిది నాకు ఉంది అని చెప్పుకొనేవాడు కాదు. ‘నాకేదో వరం ఉంది, నా దగ్గర ప్రత్యేకత ఉంది’ అని ఆయన చెప్పుకొనే వాడు కాదు.

  సెల్ఫ్-డిగ్నిటీ కూడా బాగానే ఉండేది. ఆయన జీవితం చివరి దశలో విదేశీయులు ఆయనను కంట్రోల్ చేయాలని చూసారు. వారు ఏ దశకు వెళ్లారంటే, ‘మా మాట వినకపోతే, విరాళాలు ఇవ్వం’ అన్నారు.’మీరు మీ సేవ చేసుకొని వెళ్ళండి, నన్ను మాత్రం కంట్రోల్ చేయాలని చూడబాకండి. మీ విరాళాలు కూడా నాకు అక్కరలేదు’ అని వారికి తేల్చిచెప్పాడు. విదేశియుల ముందు తన ఆత్మ గౌరవాన్ని కాపాడుకున్నాడు. ‘ఈయన మా మాట వినలేదు’ అని విదేశీయులు డబ్బుతో చాలా సంఘాల్లో ఆందోళనలను సృష్టించారు.         ఇలాంటి పరిస్థితుల్లో మనం ఏమి చేయాలి? ఈ వారం నేను బైబిల్ లో నెహెమ్యా గ్రంధం చదువుతున్నాను.

ఇశ్రాయేలీయులను దేవుడు కనాను దేశములో చాలా సమృద్ధికరముగా ఉంచాడు. అయితే వారు దేవుని నిబంధనలను, ఆజ్ఞలను పూర్తిగా ఉల్లంఘించారు. దేవుని తీర్పు వారి మీదకు వచ్చింది. ఉత్తరాన 10 గోత్రాలు అశూరీయులకు దాసులు అయిపోయి, అనేక దేశాల్లో చెల్లాచెదురు అయిపోయారు. దక్షిణాన రెండు గోత్రాల వారు బబులోనుకు చెరగా తీసుకొనివెళ్ళబడ్డారు.

   బబులోను లో యూదుల 70 సంవత్సరాల చెర తరువాత, వారు మూడు గుంపులుగా యెరూషలేము తిరిగివెళ్ళారు. మొదటి రెండు గుంపులు జెరుబ్బాబెలు, ఎజ్రా నాయకత్వములో తిరిగి వెళ్లగా, మూడవ గుంపు నెహెమ్యా నాయకత్వములో తిరిగివెళ్ళింది.

  బబులోనీయుల తరువాత ప్రపంచ ఆధిపత్యం పర్షియనులకు సంక్రమించింది.  పర్షియా లోని షూష ను కోటలో అర్తహషస్త చక్రవర్తి (క్రీ పూ 464 – 423) క్రింద నెహెమ్యా పనిచేయుచున్నాడు. చక్రవర్తి క్రింద గవర్నర్ గా, ద్రాక్షారస పాత్ర అందించేవానిగా ఆయన ఉన్నాడు.  ఆ సమయములో యెరూషలేము చాలా హీనమైన, శిధిలావస్థలో ఉన్నది. దాని స్థితి ని గూర్చి వినిన నెహెమ్యాకు గుండె బద్దలయ్యింది. క్రీ. పూ 445 లో ఆయన రాజు యొక్క అనుమతితో యెరూషలేము పయన మయ్యాడు.

  అనేక వ్యవప్రయాసలు, శత్రువుల యొక్క అపహాస్యాలు, అవరోధాలు ఎదుర్కొని ఆయన యెరూషలేము ప్రాకారాలు నిర్మించాడు. శాస్త్రి అయిన ఎజ్రా తో కలిసి దేవుని ప్రజలను ఆత్మీయముగా మేలుకొలిపాడు. నెహెమ్యా రెండు పర్యాయాలు – మొదటి సారి క్రీ. పూ  445 – 433 ల మధ్య, రెండవ సారి క్రీ. పూ 424 – 410 ల మధ్య – పర్షియాలో గవర్నర్ గా ఉన్నాడు. ‘నేను ఒక గవర్నర్ గా సుఖముగా జీవిస్తున్నాను, యెరూషలేము ఏమయిపోతే నాకెందుకు?’ అని నెహెమ్యా అనుకోలేదు.

నెహెమ్యా గ్రంధములో 4 ముఖ్య అంశాలు నాకు కనిపించాయి.

  1. నాయకత్వము: నెహెమ్యాను దేవుడు ఒక నాయకునిగా పంపించాడు. ఆయన నాయకత్వములో తన ప్రజల కొరకు గొప్ప కార్యాలు చేసాడు. దేవుడు ఈ రోజు కూడా మంచి నాయకుల మీద ఆధారపడతాడు. బైబిల్లో స్థానిక సంఘాలకు స్వయం ప్రతిపత్తి ఉంది.

ఎక్కడో జర్మనీ లో, లేక ముంబై లోనో కూర్చొని ఈ రోజు స్థానిక సంఘాల మీద కొంతమంది పెత్తనం చేస్తావున్నారు. భూలోక కేంద్రాలు నిర్మించుకున్నారు. ఆ కేంద్రాల్లో ఉన్న సంస్కృతే స్థానిక సంఘాలలోకి కూడా ప్రాకుతున్నది.

అటు తెల్లదొరలు, ఇటు నల్ల దొరలు – ఏ దొరలైనా సమస్యలే.

దేవుడు స్థానిక సంఘాలకు స్వయం ప్రతిపత్తిని ఉద్దేశించాడు. వాటిల్లో మంచి నాయకులను ఆయన

కోరుకొంటున్నాడు. ఆత్మ గౌరవము, స్వయం ప్రతిపత్తి వీటితో మనం ముందుకు వెళ్ళాలి.

  1. పునర్నిర్మాణము: యెరూషలేము చరిత్ర మీరు చూస్తే ఆ నగరాన్ని

ఒకడు పడగొడతాడు, ఇంకొకడు కడుతాడు

ఒకడు పడగొడతాడు, ఇంకొకడు కడుతాడు

ఒకడు పడగొడతాడు, ఇంకొకడు కడుతాడు

దేవుడు పిలుస్తాడు: అయ్యా, ఒక దుష్టుడు నా నగరాన్ని కూల్చివేసాడు, నువ్వు వచ్చి దానిని కట్టు.

నెహెమ్యా దేవుని యొద్ద నుండి ఆ పిలుపు అందుకొన్నాడు.

దేవుని సహాయముతో 52 రోజుల్లో నెహెమ్యా యెరూషలేము ప్రాకారములు పునర్నిర్మించాడు.

52 రోజుల్లో యెరూషలేము ప్రాకారములు మొత్తం తిరిగి కట్టించాడంటే ఆయనకు ఎంత ఫోకస్ ఉండి ఉండాలి?

పరిస్థితులు ఎంత అధ్వానంగా ఉన్నా,

భవనాలు ఎంత శిధిలావస్థలో ఉన్నా,

మనం దేవుని మీద ఆధారపడితే దేవుడు

తన కార్యములను తిరిగి మొదలుపెడతాడు.

దేవుడు మనతో  ఉన్నప్పుడు మనం

ఎన్నిసార్లయినా పునర్నిర్మించవచ్చు.

నిరాశ పడటానికి ఆస్కారమే లేదు.

  1. శత్రువు దాడులు: నెహెమ్యా యెరూషలేమును

బాగుచేయాలని చూసినప్పుడు దాని

పొరుగువారి నుండి తీవ్ర వ్యతిరేకతను, ధిక్కారాన్ని ఎదుర్కొన్నాడు.

దేవుని పని ఏదీ శత్రువు యొక్క అవరోధాలు

లేకుండా జరుగదు. ‘కుక్కలు, నక్కలు గంతేసినా ఆయన కట్టే గోడలు కూలిపోతాయి’ అని నెహెమ్యాను అపహాస్యం చేశారు. ఆయన మీద, యూదుల మీద దాడులు చేశారు.

నెహెమ్యా శత్రువు మన మీద దాడి చేస్తాడని ఊహించి సిద్ధపడ్డాడు. అంతేకాని శత్రువులను చూసి బెంబేలెత్తలేదు.

నెహెమ్యా 4:17 లో మనం చదువుతాం:

“గోడ కట్టువారును

బరువులు మోయువారును

బరువులు ఎత్తువారును,

ఒక్కొక్కరు ఒక చేతితో పనిచేసి ఒక చేతితో

ఆయుధము పట్టుకొని యుండిరి.”

నెహెమ్యా శత్రువులను చూసి పారిపోలేదు.

‘తమ్ముల్లూ, ఒక చేతిలో తాపీ తీసుకోండి, ఇంకో చేతిలో కత్తి తీసుకోండి. ఎవడు వస్తాడో చూద్దాం’ అన్నాడు.

ఒక చేత్తో కడుతున్నారు, మరొక చేత్తో ఆయుధం పట్టుకొన్నారు.

ఒక చేత్తో నిర్మిస్తున్నారు, మరొక చేత్తో పోరాడుతున్నారు.

ఈ రోజు మనం కూడా ఒక చేత్తో కట్టాలి, మరొక చేత్తో పోరాడాలి.

Building & Battling రెండూ చేయాలి.

అపొస్తలుడైన పౌలు వ్రాసాడు:

ఏలయనగా మనము పోరాడునది శరీరులతో కాదు, గాని

ప్రధానులతోను, అధికారులతోను, ప్రస్తుత అంధకారసంబంధులగు

లోక నాథులతోను, ఆకాశమండలమందున్న దురాత్మల

సమూహ ములతోను పోరాడుచున్నాము.’ (ఎఫెసీ 6:12).

దేవుడిచ్చు సర్వాంగ కవచము ధరించుకొని మనము శత్రువును ఎదుర్కోవాలి.

   నేను బాప్తిస్మము పొందిన రోజున సాతానుడు నా గొంతు పట్టుకొన్నాడు. నేను మా నాన్నతో చెప్పాను. మా నాన్న ఏమన్నాడంటే, ‘సాతాను నీ మీద యుద్ధం ప్రకటించాడు. నీ చేతిలో ఉన్నది దేవుని ఆత్మ ఖడ్గం, Sword of the Lord. నువ్వు కూడా యుద్ధం ప్రకటించు’ అన్నాడు.

ఈ రోజు ప్రేమ సందేశం కార్యక్రమం 30 దేశాల్లో ప్రజలు వింటూవున్నారు. ప్రతి సోమ వారం సాయంత్రం 5:30 కు ఆరాధన టీవీ లో దేవుని వాక్యం ప్రకటించబడుతూ ఉన్నది. అది కూడా యోహాను గారు ఇండైరెక్ట్ గా ఇచ్చిన ప్రోత్సాహమే.

  లూకా సువార్త 14 అధ్యాయములో యేసు ప్రభువు ఒక ఉపమానం చెప్పాడు:

  1. మీలో ఎవ డైనను ఒక గోపురము కట్టింప గోరిన యెడల దానిని కొనసాగించుటకు కావలసినది తన యొద్ద ఉన్నదో లేదో అని కూర్చుండి తగులుబడి మొదట లెక్కచూచుకొనడా?
  2. చూచుకొననియెడల అతడు దాని పునాదివేసి, ఒకవేళ దానిని కొనసాగింప లేక పోయినందున
  3. చూచువారందరు ఈ మనుష్యుడు కట్ట మొదలుపెట్టెను గాని కొన సాగింపలేక పోయెనని అతని చూచి యెగతాళి చేయ సాగుదురు.
  4. మరియు ఏ రాజైనను మరియొక రాజుతో యుద్ధము చేయబోవునప్పుడు తనమీదికి ఇరువదివేల మందితో వచ్చువానిని పదివేలమందితో ఎదిరింప శక్తి తనకు కలదో లేదో అని కూర్చుండి మొదట ఆలో చింపడా?
  5. శక్తి లేనియెడల అతడింకను దూరముగా ఉన్నప్పుడే రాయబారము పంపి సమాధానము చేసికొన చూచును గదా.

కట్టేవాడు – పోరాడేవాడు ఇద్దరి గురించి ఆయన ఆ ఉపమానములో తెలియజేశాడు.

కట్టేవాడు తనకు శక్తి ఉందో లేదో చూసుకొని కట్టడం మొదలుపెట్టాలి.

పోరాడేవాడు తనకు శక్తి ఉందో లేదో చూసుకొని పోరాటం లోకి దిగాలి.

యోహాను గారు ఫౌండేషన్ వేసి వెళ్ళాడు. ఆ ఫౌండేషన్ మీద మనం కట్టాలి.

యోహాను గారు పోరాటం మొదలు పెట్టి వెళ్ళాడు. ఆ పోరాటాన్ని మనం కొనసాగించాలి.

నెహెమ్యా ఆ రెండూ చేసాడు. కట్టాడు, పోరాడాడు.

నెహెమ్యా, ఆయన సహచరుల్లో మనం ఎంతో ఐకమత్యం చూస్తున్నాము.

రెండ్రోజుల క్రితం గుజరాత్ లో సర్దార్ వల్లభాయ్ పటేల్ విగ్రహాన్ని ఆవిష్కరించారు. 597 అడుగుల ఎత్తుతో ప్రపంచము మొత్తం లోనే దానిని ఎత్తయిన విగ్రహముగా నిర్మించారు. దీనిని statue of unity ఐకమత్య విగ్రహం అని పిలుస్తున్నారు. మన దేశానికి స్వాతంత్రం వచ్చినప్పుడు ఇక్కడ 550 సంస్థానాలు ఉండేవి. వల్ల భాయ్ పటేల్ వాటన్నిటిని కలిపి ఒక ఐక్య భారత దేశాన్ని నిర్మించాడు.

ఐకమత్యం లేకుండా ఏ దేశం కూడా నిలబడలేదు. ఐకమత్యం లేకుండా క్రైస్తవ సంఘం కూడా నిలబడలేదు.

క్రైస్తవ సంఘాల్లో ఈ రోజు కులమని, ప్రాంతము అని, అంతస్తు, డబ్బు మొదలగు వాటి పేరు మీద ప్రజలు వర్గాలుగా విడిపోవుచున్నారు. ఈ వర్గ పోరాటాల వలన తమ చుట్టూ ఉన్న నశించుచున్న లోకాన్ని వీరు రక్షించలేకపోవుచున్నారు. గొడవల్లో, వివాదాల్లో మనం చాలా సమయాన్ని వృధా చేస్తున్నాము. మనం ఐకమత్యముతో పనిచేయడం చాలా ముఖ్యం.

  1. దేవుని సార్వభౌమాధికారము: నెహెమ్యా యొక్క ప్రయాసలు, శ్రమలు, శత్రువుల దాడులు అవన్నీ ఆయనను నిరాశపరిచి ఉండవచ్చు. అయితే దేవుని యొక్క హస్తము వాటన్నిటికంటే పైగా ఉండి ఆయనను నడిపించింది. నెహెమ్యా దేవుని సార్వభౌమాధికారమును నమ్మాడు.

దేవుడు అబ్రాహాముతో చేసిన శాశ్వత నిబంధన ప్రవచనం నెహెమ్యాను దేవుని ప్రజలను ఆదు కొనుటకు పురికొల్పింది. పరిస్థితులు ఎంత ఘోరముగా ఉన్నప్పటికీ దేవుడు తన ప్రవచనములను విస్మరించడు అని నెహెమ్యా గ్రహించి దేవుని పనికి ఉపక్రమించాడు.

నెహెమ్యా తెచ్చిన ఆత్మీయ సంస్కరణలు ఇశ్రాయేలీయులను నడిపించాయి.  నెహెమ్యా, మలాకీల తరువాత 400 సంవత్సరాల నిశ్శబ్దము రాజ్యమేలింది. దేవుని యొద్ద నుండి ప్రత్యక్షతలు కలుగలేదు. తిరిగి బాప్తిస్మ మిచ్చు యోహాను,  ప్రభువైన యేసు క్రీస్తు కాలములో దేవుని ప్రత్యక్షత కలిగింది.

నెహెమ్యా పరిచర్య ప్రభావం యేసు ప్రభువు మొదటి రాకడ వరకు కొనసాగింది. నేటి మన పరిచర్య యేసు ప్రభువు రెండవ రాకడ వరకు కొనసాగాలి.

నెహెమ్యా ఒక సామాన్యుడు, ఏ మత సంస్థతో ఆయనకు సంభందాలు లేవు, ఒక గవర్నమెంట్ ఉద్యోగం చేసుకొని బ్రతుకుతున్నాడు. అయితే యెరూషలేము వెళ్లి దానిని నిర్మించాడు. యోహాను గారు కూడా ఒక సామాన్య కుటుంబములో జన్మించి, ప్రభుత్వ ఉద్యోగం చేసుకొంటూ బ్రతుకుతున్నవాడే. అయితే దేవుని పని చేయాలి అని సంకల్పించుకొని దేవుని సార్వభౌమాధికారము లో ఆయన ముందుకు నడిచాడు.

  1. A Time to Preach

మొన్న మంగళ వారం యోహాను గారిని భూస్థాపన చేసి నేను అక్కడ నుండి వస్తా ఉన్నాను. దీన బాబు గారు నాతో మాట్లాడాడు: ‘ఏలీయా ప్రారంభించింది ఎలీషా కొనసాగించాడు. ఏలీయా తన దుప్పటిని ఎలీషా మీద వేసాడు’ అన్నాడు.

ఆ రోజు మనం సమూయేలు గురించి మాట్లాడుకున్నాము. సమూయేలును దేవుడు నాలుగు సార్లు పిలిచాడు.

నాలుగో సారి సమూయేలు, ‘ప్రభువా, సెల విమ్ము, నీ దాసుడు ఆలకించుచున్నాడు’ అన్నాడు.

ఒక యాజకునిగా

ఒక సేవకునిగా

ఒక ప్రవక్తగా

ఒక న్యాయాధిపతిగా

ఒక విజ్ఞాపన కర్తగా

ఒక రక్షకునిగా

రాజులను అభిషేకించేవానిగా

రాజులను విమర్శించేవానిగా

దేవుడు చెప్పిన ప్రతి పనీ సమూయేలు చేశాడు.

ఒక గొప్ప దేవుని సేవకుని మనం సమూయేలులో చూస్తున్నాము.

యోహాను గారు కూడా దేవుడు ఇచ్చిన అనేక పనులను ఒక సేవకునిలాగా చేసాడు.

ప్రభుత్వ ఉద్యోగిగా సేవలందించాడు

సువార్త చెప్పాడు.

యూత్ క్యాంపులు పెట్టాడు

అనాధ బాల బాలికల కోసం ఒక అనాధ

శరణాలయం పెట్టాడు.

వృద్ధుల కోసం వృద్ధాశ్రయం పెట్టాడు.

రోగుల కోసం హాస్పిటల్ పెట్టాడు.

పుస్తక ప్రచురణ కోసం ప్రింటింగ్ ప్రెస్ పెట్టాడు.

బుక్ షాపులు పెట్టాడు.

సంఘాలు పెట్టాడు.

దేవుడు ఇచ్చిన అనేక పనులు తన శక్తి కొలది చేసాడు.

2 రాజులు గ్రంధం 2 అధ్యాయములో మనం చదువుతాం.

ఏలీయా ఎలీషాకు చెప్పాడు: ‘దేవుడు నన్ను పరలోకానికి తీసుకొని వెళ్లే సమయం వచ్చింది.

నేను నీయొద్దనుండి తీయబడకమునుపు నీకొరకు నేనేమి చేయకోరుదువో దాని నడుగు’

ఎలీషా ఏమడిగాడు: ‘నీకు కలిగిన ఆత్మలో రెండుపాళ్లు నా మీదికి వచ్చు నట్లు దయచేయుము’.

డబల్ పోర్షన్ కావాలి అన్నాడు.

నీకన్నా నేను డబల్ చేయాలి అన్నాడు.

  ఏలీయా ఏమన్నాడు? ‘ఓర్నీ , నువ్వు అడిగింది చాలా కష్టమైనది. ఐతే నేను పరలోకానికి వెళ్లిపోయేటప్పుడు నేను నీకు కనిపించితే నీ కోరిక నెరవేరుతుంది’ అన్నాడు. మారు మాట్లాడుకొంటూ నడచి వెళ్తున్నప్పుడు,

అగ్ని రథమును అగ్ని గుఱ్ఱములును కనబడి వారిద్దరిని వేరు చేసినాయి; అప్పుడు ఏలీయా సుడిగాలిచేత ఆకాశమునకు ఆరోహణమయ్యాడు.

  ఎలీషా అది చూచి

నా తండ్రీ నా తండ్రీ,

ఇశ్రాయేలువారికి రథమును రౌతులును నీవే

అని కేకలు వేసాడు.

  ఏలీయా దుప్పటి క్రింద పడింది, అది తీసుకొని తన పరిచర్య కొనసాగించాడు.

ఏలీయా కన్నా రెండు పాళ్ళు ఆత్మీయ కార్యాలు చేసాడు. యోహాను గారు చేసిన పనులే మనం చేయాలని లేదు. అయితే ఆయన కన్నా ఎక్కువ పనులు మనం చేయాలి. యోహాను గారి కన్నా మనం డబల్ చేయాలి. దేవుని పనులు చేయాలంటే ఎంతో డబ్బు కావాలి అని మనం అనుకొంటాము. అయితే అది పొరపాటు.

సిరియనుల దాస్యములో ఒక చిన్నది ఉంది. ఆ చిన్నది  నయమాను అనే ఒక సైన్యాధిపతి ఇంటిలో పనిచేస్తా ఉంది. నయమానుకు కుష్టు రోగం ఉందని గ్రహించింది. ఆయన భార్యతో చెప్పింది, ‘అయ్య గారి కుష్టు రోగం తగ్గాలంటే ఆయన ఇశ్రాయేలు దేశం వెళ్ళాలి. ఆయన ఎలీషా ప్రవక్తను కలవాలి. ఆయన దేవుని ప్రార్థిస్తే ఈ కుష్టు రోగం తగ్గుతుంది’.

    నయమాను ఆ చిన్న పిల్ల చెప్పిన మాటలు నమ్మాడు. ఇశ్రాయేలు దేశం వెళ్లి, ఎలిషా గారిని కలిసి, యొర్దాను నదిలో ఏడు సార్లు మునిగి స్వస్థత పొందాడు. ఆ చిన్న పిల్ల చేసిన పని మన మనమందరం చేయవచ్చు. ‘నీకు పాప రోగం ఉంది. ఆ రోగం తగ్గాలంటే నీవు యేసు క్రీస్తు సిలువ దగ్గరకు వెళ్ళాలి. యేసు రక్తము ప్రతి పాపము నుండి మనలను కడిగి పవిత్రులనుగా చేయును. ఆయన సిలువ దగ్గర నీ పాప రోగం నుండి నీకు స్వస్థత కలుగుతుంది’. ఒక్క రూపాయి కూడా ఖర్చు పెట్టకుండా మనం ఆ మాటలు చెప్పవచ్చు.

జనవరి లో మా అమ్మ చనిపోయింది, అక్టోబర్ లో మా నాన్న చనిపోయాడు. ఇద్దరి భౌతిక కాయాలను గుంటూరు లో జనరల్ హాస్పిటల్ లోని మార్చురీ లో పెట్టాల్సి వచ్చింది. రెండు సార్లు నేను ఆ మార్చురీ ముందు నిలబడ్డాను. ఒక స్ట్రెచర్ మీద పడుకోబెట్టి వారి మృత దేహాన్ని బయటికి తీసుకు వచ్చారు. ఇద్దరి విషయములో నేను ఎక్కువగా ఏడ్చింది మార్చురీ దగ్గరే. తెనాలి లో కానీ, పల్లెకోన లో కానీ నాకు పెద్దగా ఏడుపు రాలేదు. గుంటూరు లో మార్చురీ ముందే నాకు ఏడుపు వచ్చింది. వారి యొక్క నిస్సహాయస్థితి నా హృదయాన్ని కదిలించింది. జీవితమంతా నాకు సహాయం చేసిన వ్యక్తులు వారే నిర్జీవముగా, అచేతనంగా కనిపించారు. వారిని ఆ స్థితిలో చూసి నాకు జాలి, ఏడుపు వచ్చినవి.

  బైబిల్ లో, ఎఫెసీయులకు వ్రాసిన పత్రిక 2 అధ్యాయములో మనం యేమని చదువుతామంటే, ‘మీ అపరాధములచేతను పాపములచేతను మీరు చచ్చినవారై యుండగా, ఆయన మిమ్మును క్రీస్తుతో కూడ బ్రదికించెను.’  మన పాపములలో మనం నిర్జీవముగా, అచేతనంగా పడి ఉండుట చూసి దేవుడు మన మీద జాలి పడ్డాడు.

మన కోసం దేవుడు కన్నీరు పెట్టాడు.

మన కోసం ఒక రక్షకుని పంపించాడు.

4 వచనం: అయినను దేవుడు

కరుణాసంపన్నుడై యుండి,

మనము మన అపరాధములచేత చచ్చినవారమై

యుండినప్పుడు సయితము

మనయెడల చూపిన తన మహా ప్రేమచేత

మనలను క్రీసుతో కూడా బ్రతికించెను.

  1. కృపచేత మీరు రక్షింపబడియున్నారు.
  2. క్రీస్తుయేసునందు ఆయన మనకు చేసిన

ఉపకారముద్వారా

అత్యధికమైన తన కృపా మహదైశ్వర్యమును

రాబోవు యుగములలో కనుపరచునిమిత్తము,

  1. క్రీస్తుయేసునందు మనలను ఆయనతోకూడ లేపి,

పరలోకమందు ఆయనతోకూడ కూర్చుండబెట్టెను.

  1. మీరు విశ్వాసముద్వారా కృపచేతనే

రక్షింపబడియున్నారు;

ఇది మీవలన కలిగినది కాదు,

దేవుని వరమే.

  1. అది క్రియలవలన కలిగినదికాదు

దేవుడు కరుణాసంపన్నుడై ఉండి – యెంత చక్కని మాట!

God, who is rich in mercy

మన పాపములలో మనం నిర్జీవంగా,

చచ్చిన వారముగా పడి ఉన్నప్పుడు దేవుడు

మనలను చూచాడు. మనలను చూచి జాలిపడ్డాడు.

మనలను ప్రేమించి, యేసు క్రీస్తును

మన కొరకు రక్షకునిగా పంపించాడు.

Salvation is a gift of God

రక్షణ దేవుడు మనకు ఒక గిఫ్ట్ గా ఇచ్చాడు,

దానిని స్వంతగా పొందే శక్తి మనలో లేదు.

ఎందుకంటే మనం ప్రాణం లేని స్థితిలో,

పాపములో నశించిన స్థితిలో ఉన్నాము.

ఈ రోజు కట్టుపల్లి యోహాను గారి జ్ఞాపకార్ధ కూటము

సందర్భముగా మీరు రక్షించబడని స్థితిలో ఉంటే,

రక్షించబడాలని, రక్షించబడిన స్థితిలో ఉంటే

ప్రభువైన యేసు క్రీస్తు కృప యందు మీరు ఇంకా

వర్ధిల్లాలని మేము కోరుకొంటున్నాము.

నాలుగు విషయాలు ఈ రోజు మనం చూసాము.

A time to praise,

A time to practice,

A time to pray,

A time to preach

ఇంత వరకు మనలను నడిపించిన దేవునికి మనం స్తుతి చెల్లించాలి.

మన నమ్మకాలను క్రియలలో ప్రాక్టికల్ గా చూపించాలి

మన భవిష్యత్తు కార్యక్రమాల కోసం ప్రార్ధనలో సిద్ధపడాలి

దేవుని వాక్యాన్ని మనం ఇంకా ఎక్కువగా ప్రకటించాలి.

ఆ విషయాల్లో దేవుడు మనకు సహాయం చేయును గాక!

346619b3-fae0-447a-8aa7-28e6717f73a7 (1).jpg

Leave a Reply