డాక్టర్ పాల్ కట్టుపల్లి సందేశం
ఈ రెండవ కీర్తన క్రొత్త నిభంధనలో అనేక సార్లు ప్రస్తావించబడింది.
- అన్యజనులు ఏల అల్లరి రేపుచున్నారు?జనములు ఏల వ్యర్థమైన దానిని తలంచుచున్నవి?
- మనము వారి కట్లు తెంపుదము రండి, వారి పాశములను మనయొద్దనుండి పారవేయుదము రండి అని చెప్పుకొనుచు
- భూరాజులు యెహోవాకును ఆయన అభిషిక్తునికిని విరోధముగా నిలువబడుచున్నారు.
ఏలికలు ఏకీభవించి ఆలోచన చేయుచున్నారు.
- ఆకాశమందు ఆసీనుడగువాడు నవ్వుచున్నాడు.
ప్రభువు వారినిచూచి అపహసించుచున్నాడు
- ఆయన ఉగ్రుడై వారితో పలుకును. ప్రచండకోపముచేత వారిని తల్లడింపజేయును
- నేను నా పరిశుద్ధ పర్వతమైన సీయోను మీద నా రాజును ఆసీనునిగా చేసియున్నాను
- కట్టడను నేను వివరించెదనుయెహోవా నాకీలాగు సెలవిచ్చెను
నీవు నా కుమారుడవునేడు నిన్ను కనియున్నాను.
- నన్ను అడుగుము, జనములను నీకు స్వాస్థ్యముగాను
భూమిని దిగంతములవరకు సొత్తుగాను ఇచ్చెదను.
- ఇనుపదండముతో నీవు వారిని నలుగగొట్టెదవు
కుండను పగులగొట్టినట్టు వారిని ముక్క చెక్కలుగాపగులగొట్టెదవు
- కాబట్టి రాజులారా, వివేకులై యుండుడి
భూపతులారా, బోధనొందుడి.
- భయభక్తులు కలిగి యెహోవాను సేవించుడి
గడగడ వణకుచు సంతోషించుడి.
- ఆయన కోపము త్వరగా రగులుకొనును
కుమారుని ముద్దుపెట్టుకొనుడి;
లేనియెడల ఆయన కోపించును అప్పుడు మీరు త్రోవ తప్పి నశించెదరు.
ఆయనను ఆశ్రయించువారందరు ధన్యులు.
ఈ రెండవ కీర్తన క్రొత్త నిబంధనలో అనేక సార్లు ప్రస్తావించబడింది. అపోస్తలుల కార్యములు 4 అధ్యాయములో చూస్తే, అక్కడ అపోస్తలులు ప్రార్ధన చేస్తూ ఈ కీర్తన జ్ఞాపకం చేసుకొన్నారు. 13 అధ్యాయములో చూస్తే, అపొస్తలుడైన పౌలు అక్కడ యూదులకు ప్రసంగం చేస్తూ రెండవ కీర్తనలో దేవుడు చేసిన ప్రవచనాలు యేసు క్రీస్తులో నెరవేరినవి అని అన్నాడు.
1.అల్లరి
కీర్తనలు 2:1
అన్యజనులు ఏల అల్లరి రేపుచున్నారు?
అన్యజనులు ఇక్కడ అల్లరి చేస్తూ ఉన్నారు. అల్లరి దేవుని యొద్ద నుండి వచ్చేది కాదు.
1 కొరింథీయులకు 14:33
దేవుడు సమాధానమునకే కర్త గాని అల్లరికి కర్త కాడు.
God is not the author of confusion, but of peace
వీరికి సమాధానం లేదు, అల్లరి చేస్తూ ఉన్నారు. ఎందుకంటే వీరు సాతాను మాట వింటున్నారు. దేవుని మాటను వీరు పెడచెవిన బెట్టారు. దేవుని పనిని అడ్డుకొంటూ ఉన్నారు. ఈ కీర్తన దావీదు వ్రాసాడు. దావీదు వ్రాశాడని నీకెవరు చెప్పారు? అని మీరు అడుగవచ్చు. అపొస్తలుల కార్యములు 4 అధ్యాయం చూస్తే, అక్కడ పేతురు, యోహాను సువార్త ప్రకటిస్తున్నారు. అవిశ్వాసులు వారిని చూచి ఓర్చుకోలేకపోయారు. వారిని బెదిరించారు, కొట్టారు, జైల్లో వేసి హింసించారు. వారు విడుదల పొంది విశ్వాసులతో కలిసి ప్రార్ధన చేశారు.
అపొ. కార్యములు 4
24.నాథా, నీవు ఆకాశమును భూమిని సముద్రమును వాటిలోని సమస్తమును కలుగజేసినవాడవు.
- అన్యజనులు ఏల అల్లరి చేసిరి? ప్రజలెందుకు వ్యర్థమైన ఆలోచనలు పెట్టుకొనిరి?
- ప్రభువుమీదను ఆయన క్రీస్తుమీదను 3 భూరాజులు లేచిరి, అధికారులును ఏకముగా కూడుకొనిరి అని నీవు
పరిశుద్ధాత్మద్వారా మా తండ్రియు నీ సేవకుడునైన దావీదు నోట పలికించితివి.
2 కీర్తన దావీదు వ్రాసిన కీర్తన అని దీనినిబట్టి మనకు అర్ధం అవుతుంది. అన్యజనులు అల్లరి చేస్తూ యేసు క్రీస్తు సువార్తను అడ్డుకోవటం అపొస్తలుల కాలములోనే మొదలయ్యింది.
ఈ రోజు మనం దానిని చూసి ఆశ్చర్యపోవలసిన అవసరం లేదు.
2.అజ్ఞానం
అన్యజనులు ఎందుకు అల్లరి చేస్తూ ఉన్నారు?
జనములు ఏల వ్యర్థమైన దానిని తలంచుచున్నవి?
- మనము వారి కట్లు తెంపుదము రండి
వారి పాశములను మనయొద్దనుండి పారవేయుదము రండి అని చెప్పుకొనుచు…అవిశ్వాసుల యొక్క అజ్ఞానం మనకు ఇక్కడ కనిపిస్తున్నది. వీళ్ళు ఏమనుకొంటున్నారంటే, ఈ క్రైస్తవులు మతం మత్తులో పడిపోయారు. యేసు క్రీస్తుకు బానిసలు అయిపోయారు. వారి కట్లు విప్పుదాం రండి, వారి పాశములు విప్పుదాం రండి అని అనుకొంటున్నారు. ఈ రోజున నాస్తికులతో మాట్లాడితే వారు ఏమంటారంటే, ఈ క్రైస్తవులు మతం కాడి క్రింద ఉన్నారు. వారి కట్లు విప్పుదాం రండి. తార్సు వాడైన సౌలు చేసింది అదే. క్రైస్తవ్యాన్ని అణచివేసి నేను ప్రజలకు సేవ చేస్తాను అని భ్రమ పడ్డాడు. హోషేయా గ్రంథములో మనం చదువుతాము.
హోషేయా 11:1
ఇశ్రాయేలు బాలుడైయుండగా నేను అతనియెడల ప్రేమగలిగి నా కుమారుని ఐగుప్తు దేశములోనుండి పిలిచితిని. దేవుడు ఏమంటున్నాడంటే, నేను మిమ్ములను ప్రేమతో పిలిచాను.
హోషేయా 11:3
ఎఫ్రా యిమును చెయ్యిపట్టుకొని వానికి నడక నేర్పినవాడను నేనే;
వారిని కౌగలించు కొనినవాడను నేనే;
నేనే వారిని స్వస్థపరచినవాడనైనను ఆ సంగతి వారికి మనస్సున పట్ట లేదు.
మీ చెయ్యి పట్టుకొని మిమ్ములను నడిపించింది నేను కాదా?
మీకు నడక నేర్పించింది నేను కాదా?
మిమ్ములను కౌగలించుకొన్నది నేను కాదా?
హోషేయా 11
- ఒకడు మనుష్యులను తోడుకొని పోవునట్లుగా
స్నేహబంధములతో నేను వారిని బంధించి అకర్షించితిని;
ఒకడు పశువులమీదికి కాడిని తీసినట్లు నేను వారి కాడిని తీసి వారి యెదుట భోజనము పెట్టితిని. స్నేహబంధాలతో నేను మిమ్ములను బంధించాను. మిమ్ములను ఆకర్షించాను. మీ మీద కాడి తీసి భోజనం పెట్టాను అని దేవుడు వారితో అంటున్నాడు. అయితే వారు ఆ ప్రేమ బంధాన్ని అర్ధం చేసుకోలేకపోయారు.
యేసు ప్రభువు పిలుపు ఎలా ఉంది?
మత్తయి సువార్త 11
- ప్రయాసపడి భారము మోసికొనుచున్న సమస్త జనులారా,నా యొద్దకు రండి; నేను మీకు విశ్రాంతి కలుగ జేతును.
- నేను సాత్వికుడను దీనమనస్సు గలవాడను గనుక మీమీద నా కాడి ఎత్తికొని నాయొద్ద నేర్చు కొనుడి;
అప్పుడు మీ ప్రాణములకు విశ్రాంతి దొరకును.
- ఏలయనగా నా కాడి సుళువుగాను నా భారము తేలిక గాను ఉన్నవి.
నాది ప్రేమ బంధం, నాది స్నేహ బంధం, నా కాడి సుళువు, నా భారం తేలిక. అయితే అన్యజనులకు ఆ మాటలు అర్ధం కావడం లేదు. అది బానిసత్వం, అవి సంకెళ్లు, అవి బంధాలు, అవి పాశాలు అని వాళ్ళు అల్లరి చేస్తూ ఉన్నారు. వారి అజ్ఞానం అక్కడ మనకు కనిపిస్తున్నది.
3.అవిధేయత
3 వచనం చూద్దాం:
కీర్తనలు 2:3 భూరాజులు యెహోవాకును ఆయన అభిషిక్తునికిని విరోధముగా నిలువబడుచున్నారు
వారి అజ్ఞానములో నుండి అవిధేయత పుట్టింది. దేవుని చిత్తానికి, దేవుని మార్గానికి, దేవుని ప్రణాళికకు, దేవుని అభిషిక్తునికి వ్యతిరేకముగా వారు తిరుగుబాటు చేస్తున్నారు.
4.అభిషిక్తుడు
నాలుగవదిగా ఇక్కడ మనకు అభిషిక్తుడు కనిపిస్తున్నాడు. The Anointed. ఈ అభిషిక్తుడు ఎవరంటే ప్రభువైన యేసు క్రీస్తే. క్రీస్తు అంటేనే అభిషిక్తుడు అని అర్ధం. హెబ్రీ భాషలో Al Yahweh weal Masihow అని ఉంది.
‘మషిహో’ అంటే మెస్సియా. దేవుడు మానవ జాతికి రక్షకుడిగా పంపిన అభిషిక్తుడు, మెస్సియా ఎవరంటే యేసు క్రీస్తే.
దైవిక త్రిత్వం కూడా మనకు ఇక్కడ కనిపిస్తున్నది.
….. యెహోవాకును ఆయన అభిషిక్తునికిని
The Lord and His Anointed
తండ్రి అయిన దేవుడు యెహోవా, కుమారుడు అయిన దేవుడు అభిషిక్తుడు అంటే ప్రభువైన యేసు క్రీస్తే.
5.అపహాస్యం
కీర్తనలు 2: 4. ఆకాశమందు ఆసీనుడగువాడు నవ్వుచున్నాడు. ప్రభువు వారిని చూచి అపహసించుచున్నాడు
వారిని చూసి దేవుడు నవ్వుకొంటున్నాడు. వారిని చూసి అపహాస్యం చేస్తున్నాడు. ఎందుకంటే దేవుని శక్తి వారికి తెలియదు. అపొస్తలుల కార్యములు 4 అధ్యాయములో ఇంతకు ముందు మనం చూశాము.
అపొ. కార్యములు 4
- నాథా, నీవు ఆకాశమును భూమిని సముద్రమును వాటిలోని సమస్తమును కలుగజేసినవాడవు.
- అన్యజనులు ఏల అల్లరి చేసిరి?
దేవుడు ఆకాశమును, భూమిని, సముద్రమును సృష్టించినవాడు. ఆయన మీద యుద్ధం చేసి గెలిచే శక్తి మీకు ఉందా? పేట రౌడీలు, వీధి రౌడీలు ప్రధాన మంత్రితో తలపెడితే ఎలా ఉంటుంది? ప్రధాన మంత్రి ఆదేశిస్తే భారత సైన్యం మొత్తం కదలివస్తుంది. ప్రధాన మంత్రికి ఫోన్ చేసి, ‘సర్ మీద, మీ మీద మా వూరిలో కొంత మంది రౌడీలు యుద్ధం ప్రకటించారు’ అని చెబితే, ప్రధాన మంత్రి ఏమను కొంటాడు? ‘మన దేశములో ఇలాంటి జనం కూడా ఉన్నారా? నా శక్తి ఏమిటో వారికి తెలుసా?’ అని నవ్వుకొంటాడు. అదేవిధముగా మనుష్యుల యొక్క తిరుగుబాటు చూసి దేవుడు నవ్వు కొంటున్నాడు. విశ్వాన్ని సృష్టించిన నా మీద వీళ్ళు యుద్ధం ప్రకటించారా? అని ఆయన వారిని చూసి అపహాస్యం చేస్తున్నాడు.
6.అభినందన
కీర్తనలు 2:6 : నేను నా పరిశుద్ధ పర్వతమైన సీయోను మీద నా రాజును ఆసీనునిగా చేసియున్నాను
I will set My King upon my Holy hill of Zion.
దేవుడు తన దాసుడైన దావీదును యెరూషలేము మీద ఆసీనునిగా చేసాడు.
2 సమూయేలు 7
- కాబట్టి నీవు నా సేవకుడగు దావీదుతో ఈలాగు చెప్పుముసైన్యముల కధిపతియగు యెహోవా నీకు సెలవిచ్చునదేమనగాగొఱ్ఱెల కాపులోనున్న నిన్ను గొఱ్ఱెలదొడ్డిలోనుండి తీసి ఇశ్రాయేలీయులను నా జనులమీద అధిపతిగా నియమించి తిని.
- నీవు పోవు చోట్లనెల్లను నీకు తోడుగానుండి నీ శత్రువులనందరిని నీ యెదుట నిలువకుండ నిర్మూలముచేసి, లోకము లోని ఘనులైన వారికి కలుగు పేరు నీకు కలుగజేసి యున్నాను.
దావీదు కుమారుడు అయిన యేసు క్రీస్తు కూడా యెరూషలేములో రాజ్యం చేస్తాడు. పరిశుద్ధ పర్వతమైన సీయోను మీద యేసు క్రీస్తు ప్రభువుగా రాజ్యం చేస్తాడు.
యెరూషలేము నుండి యేసు క్రీస్తు ఈ ప్రపంచాన్ని పాలించే రోజు దగ్గర పడింది. ఎందుకంటే, దేవుడు ఆయనను సీయోను మీద రాజుగా నియమించాడు. ఫిలిప్పీయులకు వ్రాసిన పత్రికలో మనం చదువుతాము.
యేసు క్రీస్తు పరలోక మహిమను వదలిపెట్టి మానవ రూపం ధరించాడు.
మన పాపములను తన మీద వేసుకొని సిలువ మీద మరణించాడు. సమాధి చేయబడ్డాడు. తిరిగిలేచాడు.
దేవుడు ఇప్పుడు ఆయనను హెచ్చించాడు. అన్ని నామముల కంటే పై నామమును ఆయనకు అనుగ్రహించాడు. పరిశుద్ధ పర్వతమైన సీయోను మీద ఆయనను రాజుగా కూర్చోబెట్టాడు.
7.అనుబంధం
ఏడవదిగా అనుబంధం.
కీర్తనలు 2 :7
యెహోవా నాకీలాగు సెలవిచ్చెను. నీవు నా కుమారుడవు. నేడు నిన్ను కనియున్నాను.
Thou art My Son; this day have I begotten Thee.
త్రిత్వం లోని వ్యక్తుల మధ్య ఉన్న అనుబంధం మనకు ఇక్కడ కనిపిస్తున్నది. యేసు క్రీస్తు బాప్తిస్మము పొందిన తరువాత పరలోకం నుండి ఏమని వినిపించింది?
మత్తయి 3:17
ఇదిగో ఈయనే నా ప్రియ కుమారుడు,ఈయనయందు నేనానందించు చున్నాను. రూపాంతరపు కొండ మీద యేసు క్రీస్తు ప్రభువు మోషే, ఏలీయాలతో మాట్లాడడం మనం చూస్తాము. యేసు క్రీస్తు మహిమను ఆయన ముగ్గురు శిష్యులు చూసినప్పుడు, పరలోకములో నుండి దేవుడు ఏమన్నాడు?
మత్తయి 17: 5
ఇదిగో ఈయన నా ప్రియకుమారుడు, ఈయనయందు నేనానందించు చున్నాను, ఈయన మాట వినుడి.
యేసు క్రీస్తుతో నతనియేలు ఏమన్నాడు?
యోహాను 1:49
బోధకుడా, నీవు దేవుని కుమారుడవు, ఇశ్రాయేలు రాజవు అని ఆయనకు ఉత్తరమిచ్చెను.
You are the Son of God, You are the King of Israel
యేసు క్రీస్తు దేవుని కుమారుడు అంటే దేవునికి పుట్టాడు అని కాదు. యేసు క్రీస్తు ఆది, అంతము లేని నిత్యుడగు దేవుడు. దైవిక త్రిత్వములో తండ్రి, కుమారుడు, పరిశుద్ధాత్ముడు అని ముగ్గురు వ్యక్తులు ఉన్నారు. ఆ ముగ్గురు వ్యక్తుల మధ్య ఒక అనుబంధం ఉంది, ఒక ప్రేమ బంధం ఉంది. ఆ అనుబంధాన్ని చాటుకోవటానికి తండ్రి, కుమారుడు, అని పేరుపెట్టుకొన్నారే కానీ తండ్రి, కుమారుడు అంటే కుమారుడు తండ్రికి పుట్టినవాడు అని కాదు.
8.అద్భుతం
ఎనిమిదవదిగా అద్భుతం.
నీవు నా కుమారుడవు, నేడు నిన్ను కనియున్నాను.
క్రిస్టియానిటీ అర్ధం కావాలంటే ఈ మాటలు మనకు స్పష్టముగా అర్ధం కావాలి. రెండు అద్భుతాలు ఈ మాటల్లో మనకు కనిపిస్తున్నాయి. యేసు క్రీస్తు జననం, ఆయన పునరుత్తానం. Incarnation & Resurrection. హెబ్రీయులకు వ్రాసిన మొదటి పత్రికలో మనం చదువుతాము.
పూర్వకాలమందు నానాసమయములలోను నానా విధములుగాను ప్రవక్తలద్వారా మన పితరులతో
మాటలాడిన దేవుడు ఈ దినముల అంతమందు కుమారుని ద్వారా మనతో మాటలాడెను.
- ఏలయనగా నీవు నా కుమారుడవు, నేను నేడు నిన్ను కని యున్నాను అనియు, ఇదియుగాక నేను ఆయనకు తండ్రినైయుందును, ఆయన నాకు కుమారుడై యుండును అనియు ఆ దూతలలో ఎవనితోనైన ఎప్పుడైనను చెప్పెనా ?
పూర్వకాలము ప్రవక్తలతో మాట్లాడిన దేవుడు ఇప్పుడు తన కుమారుడైన యేసు క్రీస్తు ద్వారా మనతో మాట్లాడాడు. నీవు నా కుమారుడవు, నేను నేడు నిన్ను కనియున్నాను అని దేవుడు దూతలతో ఎప్పుడయినా అన్నాడా? ప్రవక్తలతో ఎప్పుడయినా అన్నాడా? అని రచయిత ప్రశ్నిస్తున్నాడు. గ్రీకు భాషలో మోనోజెని ‘monogene’ అనే పదం వాడాడు: the only begotten. ఈయన దేవుని కుమారుడు, దేవుని అద్వితీయ కుమారుడు.
The Divine Son. మానవ రూపం ఎత్తిన దేవుడు. ఆయన మానవ జన్మ మొదటి అద్భుతం అయితే ఆయన పునరుత్తానం రెండవ అద్భుతం.
అపొస్తలుల కార్యములు 13 అధ్యాయం చూద్దాం.
అపొ. కార్యములు 13
- దేవుడు యేసును లేపి, పితరులకు చేసిన వాగ్దానమును మన పిల్లలకు నెరవేర్చియున్నాడని
మేమును మీకు సువార్త ప్రకటించుచున్నాము.
- ఆలాగే నీవు నా కుమారుడవు నేడు నేను నిన్ను కంటిని అని రెండవ కీర్తనయందు వ్రాయబడియున్నది.
ఇక్కడ అపొస్తలుడైన పౌలు యూదులకు ప్రసంగం చేస్తున్నాడు. వారితో ఏమంటున్నాడంటే, ఈ యేసు క్రీస్తు ద్వారా రక్షణ సువార్త మీ యొద్దకు పంపబడింది. మీ పితరులకు చేసిన వాగ్దానం చొప్పున దేవుడు ఆయనను మృతులలో నుండి లేపాడు. రెండవ కీర్తనలో వ్రాయబడిన మాటలు ఆయన పునరుత్తానము గురించే అన్నాడు.
ఆ విధముగా యేసు క్రీస్తు జీవితములోని రెండు అద్భుతాలు ఇక్కడ మనకు కనిపిస్తున్నాయి. కన్యక గర్భం ద్వారా జన్మించిన మానవుడు యేసు క్రీస్తు ఒక్కడే. మరణం నుండి తిరిగిలేచిన పునరుత్తానుడు కూడా యేసు క్రీస్తు ఒక్కడే.
9.అప్పగింత
తొమ్మిదవదిగా అప్పగింత. 8 వచనం చూద్దాము.
కీర్తనలు 2:8. నన్ను అడుగుము, జనములను నీకు స్వాస్థ్యముగాను, భూమిని దిగంతముల వరకు సొత్తుగాను ఇచ్చెదను.
ప్రపంచ దేశాలు యేసు క్రీస్తుకు సొత్తుగా ఇవ్వబడ్డాయి. ఈ రోజు ప్రపంచములోని అన్ని దేశాల వాళ్ళు ఆయనను తమ రక్షకుడిగా, ప్రభువుగా అంగీకరిస్తున్నారు. వెయ్యేళ్ళ పాలనలో ప్రపంచ దేశాలకు ఆయన రాజుగా ఉండ బోవుచున్నాడు. గ్రీకు ఆర్థోడాక్స్ డేనామినేషన్ వారు నిర్మించిన చర్చి భవనాల్లో యేసు క్రీస్తును ‘Christ Pantocrator’ గా వారు చిత్రీకరిస్తారు. అంటే యేసు క్రీస్తు అందరికి, అన్నిటికి ప్రభువు అని అర్ధం.
10.అధికారం
పదోడిగా అధికారం.
కీర్తనలు 2:9
ఇనుపదండముతో నీవు వారిని నలుగగొట్టెదవు
కుండను పగులగొట్టినట్టు వారిని ముక్క చెక్కలుగా పగులగొట్టెదవు
ఐరన్ రాడ్ తీసుకొని మట్టి కుండలను కొడితే అవి ఏ విధముగా పగిలి పోతాయి?
ముక్క చెక్కలుగా పడిపోతాయి. సాతాను చేత ప్రేరేపించబడిన ప్రపంచ దేశాలు యేసు క్రీస్తు మీద తిరుగబడినప్పుడు ఆయన ఇనుప దండముతో వారిని పగుల గొట్టాడు.
ప్రకటన 19:15 లో మనం చదువుతాము:
జనములను కొట్టుటకై ఆయన నోటనుండి వాడిగల ఖడ్గము బయలు వెడలు చున్నది. ఆయన యినుపదండముతో వారిని ఏలును; ఆయనే సర్వాధికారియగు దేవుని తీక్షణమైన ఉగ్రత అను మద్యపుతొట్టి త్రొక్కును.
యేసు క్రీస్తు ప్రభువు యొక్క గొప్ప అధికారం మనకు ఇక్కడ కనిపిస్తున్నది. ఆ అధికారముతో ఆయన సాతాను శక్తిని నాశనం చేస్తాడు. ఆ అధికారంతో ఆయన శత్రువులను కుండలుగా పగులగొడతాడు. ఆ అధికారముతో ఆయన దావీదు సింహాసనాన్ని అధిష్టిస్తాడు. ఆ అధికారముతో యెరూషలేమును తన రాజధానిగా చేసుకొంటాడు. ఆ అధికారముతో క్రీస్తు విరోధిని శిక్షిస్తాడు. ఆ అధికారముతో తన వారిని విడిపిస్తాడు. ప్రకటన గ్రంథం రెండవ అధ్యాయములో యేసు ప్రభువు ఏమన్నాడంటే, ప్రకటన గ్రంథం 2
27. అతడు ఇనుపదండముతో వారిని ఏలును; వారు కుమ్మరవాని పాత్రలవలె పగులగొట్టబడుదురు; అంతము వరకు నా క్రియలు జాగ్రత్తగా చేసే వానికి నా అధికారం ఇస్తాను. ఇనుప దండముతో అతడు ఏలుతాడు. కుమ్మరి వాని పాత్రల వలె పగులగొడతాడు. |
11.అనుగ్రహం
10 వచనం చూద్దాం:
- కాబట్టి రాజులారా, వివేకులై యుండుడి భూపతులారా, బోధనొందుడి.
- భయభక్తులు కలిగి యెహోవాను సేవించుడి గడగడ వణకుచు సంతోషించుడి.
చరిత్ర కారుడు పాల్ జాన్సన్ తన పుస్తకం ఆధునిక యుగం ‘Modern Times’ కు ముందు ఈ వచనం వ్రాసాడు. ఆధునిక యుగములో నాయకులకు దేవుని భయం లోపించింది. అటువంటి వైఖరి వలన తీవ్ర పరిణామాలు వస్తాయి. ఈ కీర్తన ముగిస్తూ దావీదు ఒక విన్నపం చేస్తున్నాడు.
మీరు అల్లరి చేస్తున్నారు. మీ అవిధేయతతో, మీ అజ్ఞానముతో అలజడి, అరాచకం సృష్టిస్తున్నారు. దేవుడు మిమ్ములను చూసి అపహాస్యం చేస్తున్నాడు. మీ మీదకు ఆయన ఉగ్రత రావడం ఖాయం. మిమ్ములను ఆయన కుండల వలె పగులగొట్టడం ఖాయం. యెహోవా దినం రాబోవుచున్నది. బైబిల్లో అనేక మంది ప్రవక్తలు దీనిని ప్రస్తావించారు. దీనిని యెహోవా దినం అన్నారు. The Day of the Lord. అది తీర్పు దినం. అది రాక ముందే మీరు మారుమనస్సు పొందండి. మీరు దేవుని అనుగ్రహం పొందండి.
- కాబట్టి రాజులారా, వివేకులై యుండుడి భూపతులారా, బోధనొందుడి.
- భయభక్తులు కలిగి యెహోవాను సేవించుడి
ఈ యెహోవా దినం చాలా భయంకరముగా ఉంటుంది. ప్రకటన 6:15-17 చదివితే ఒళ్ళు గగుర్పుచెందక మానదు. దేవుని కోపం భరించలేక మనుష్యులు చావును కోరుకొంటారు.
- భూరాజులును, ఘనులును, సవాస్రాధిపతులును, ధనికులును, బలిష్ఠులును, ప్రతి దాసుడును, ప్రతి స్వతంత్రుడును కొండ గుహలలోను
- బండల సందులలోను దాగుకొనిసింహాసనాసీనుడై యున్న వానియొక్కయు గొఱ్ఱపిల్లయొక్కయు ఉగ్రత మహాదినము వచ్చెను; దానికి తాళజాలినవాడెవడు?
- మీరు మామీద పడి ఆయన సన్నిధికిని గొఱ్ఱపిల్ల ఉగ్రతకును మమ్మును మరుగు చేయుడి అని పర్వతములతోను బండల తోను చెప్పుచున్నారు.
ఈ ప్రభువు దినం The Day of the Lord గురించి పాత నిబంధనలో కూడా ప్రవక్తలు హెచ్చరించారు.
యెషయా 2:10-11, 19-21
యెషయా 13:9 – 13
యెషయా 34:4,8
యెహెఙ్కేలు 32:7-8
హోషేయ 10:8
యోవేలు 2:11,30
జెఫన్యా 1:14
మలాకి 4:5
12.అభిమానం
చివరిగా అభిమానం. 12 వచనం చూద్దాం:
కీర్తనలు 2:12
కుమారుని ముద్దుపెట్టుకొనుడి
Kiss the Son
పూర్వం రాజుల చేతిని ముద్దుపెట్టుకొని తమ అభిమానాన్ని చాటుకొనేవారు. ఈ కీర్తన రాజ కీర్తన అని వ్రాయబడింది. Royal Psalm. ప్రభువైన యేసు క్రీస్తు మన రాజుగా ఈ కీర్తనలో కనిపిస్తున్నాడు. ఆ రాజును ముద్దుపెట్టుకోండి. నా కుమారుణ్ణి ముద్దు పెట్టుకోండి. మీ అభిమానాన్ని చూపించండి అని దేవుడు ఇక్కడ మానవాళిని ఆజ్ఞాపిస్తున్నాడు.
రెండవ కీర్తనలో 12 విషయాలు మనం చూసాము.
2 కీర్తనలో క్రీస్తు
1.అల్లరి
2.అజ్ఞానం
3.అవిధేయత
4.అభిషిక్తుడు
5.అపహాస్యం
6.అభినందన
7.అనుబంధం
8.అద్భుతం
9.అప్పగింత
10.అధికారం
11.అనుగ్రహం
12.అభిమానం
అన్యజనులు సువార్తను తిరస్కరించారు, అల్లరి చేస్తున్నారు, తమ అజ్ఞానముతో, తమ అవిధేయతతో దేవుని యొక్క అభిషిక్తుని మీద వారు తిరుగు బాటు చేశారు. దేవుడు వారిని చూసి అపహాస్యం చేస్తున్నాడు. ఎందుకంటే దేవుడు తన కుమారుణ్ణి హెచ్చించాడు. రాజులకు రాజుగా, ప్రభువులకు ప్రభువుగా చేసి ఆయనను అభినందించాడు. ఈయన నా ప్రియకుమారుడు అని చెప్పి తన అనుబంధాన్ని చాటుకున్నాడు. ఆయనను మరణం నుండి లేపి మన ముందు అద్భుతం చేసాడు. భూలోక రాజ్యాలను ఆయనకు అప్పగించాడు. తిరుగు లేని అధికారం ఆయన హస్తగతం చేసాడు. దేవుని ప్రణాళిక తెలుసుకోండి. మీ తిరుగుబాటు మానుకోండి. నా కుమారుని యొద్దకు వచ్చి రక్షణ పొందండి. ఆయన అనుగ్రహం పొందండి. నా కుమారుని ముద్దు పెట్టుకొని మీ అభిమానం చాటుకొండి అని దేవుడు మనలను కోరుచున్నాడు.