సొదొమ – నేటి సమాజం లో బైబిల్ ప్రవచనాలు: డాక్టర్ పాల్ కట్టుపల్లి

ఆదికాండము 19 అధ్యాయము నుండి ఈ రోజు కొన్ని సత్యాలు మనం ధ్యానిద్దాము.సొదొమ, గొమొఱ్ఱా – ఈ జంట నగరాలను దేవుడు సర్వనాశనం చేసాడు. పరలోకం నుండి అగ్ని, గంధకాలు కురిపించి అక్కడ గడ్డి పరక కూడా మొలవని పరిస్థితి కలిపించాడు. అక్కడ ఏమి మిగిలింది? ఒక పెద్ద మృత సముద్రం ఈ రోజున అక్కడ ఉంది. ఈ రోజున మృత సముద్రములో మీరు స్నానానికి దిగితే ఆ నీళ్లు గంధకము వాసన వస్తాయి. మృత సముద్రములో స్నానాలు చేసి వస్తే లాభం లేదు, అసలు దేవుడు ఆ సముద్రాన్ని ఎందుకు చేసాడు అని మనం ఆలోచించాలి. అక్కడ ఉన్న సొదొమ, గొమొఱ్ఱాలను ఎందుకు నాశనం చేసాడు అని మనం ఆలోచించాలి. ఈ రెండు పట్టణాల నాశనం ద్వారా దేవుడు మానవాళికి హెచ్చరిక చేశాడు. అందుకనే బైబిల్ ప్రవచనాల్లో సొదొమ, గొమొఱ్ఱాలకు ప్రత్యేక స్థానం ఉంది. బైబిల్ ప్రవచనాల్లో సొదొమ, గొమొఱ్ఱాలు అని ఈ లిస్ట్ నేను తయారు చేసాను. మా వెబ్ సైట్ www.doctorpaul.org కి వెళ్లి ఈ లిస్ట్ డౌన్ లోడ్ చేసుకోండి. ఈ లిస్ట్ చూస్తే మీకు ఎన్నో సత్యాలు అర్ధం అవుతాయి. చదువుదాము:

ఆదికాండము 19:1

ఆ సాయంకాలమందు ఆ ఇద్దరు దేవదూతలు సొదొమ చేరునప్పటికి లోతు సొదొమ గవినియొద్ద కూర్చుండియుండెను.

    దేవుడు ఇద్దరు దేవదూతలను సొదొమకు పంపించాడు. లోతు సొదొమ గవిని యొద్ద కూర్చొని ఉన్నాడు. సొదొమ లోతు కళ్ళకు ఎంతో అందముగా కనిపించింది. కోరుకొని అక్కడకు వెళ్ళాడు. అయితే సొదొమ చాలా పాపములో జీవిస్తున్న నగరం. దానిలో దేవుని భయం లేదు. అది చేసిన పాపములు ఏమిటి?

యెహెఙ్కేలు గ్రంథం 16:48-50  

నీ చెల్లెలైన సొదొమ చేసిన దోషమేదనగా, దానికిని దాని

కుమార్తెల కును కలిగిన గర్వమును ఆహార సమృద్ధియు నిర్విచారమైన సుఖస్థితియు ననునదియే;

అది దీనులకును దరిద్రులకును సహాయము చేయకుండెను.

  1. వారు అహంకరించి నా దృష్టికి హేయక్రియలు చేసిరి గనుక నేను దాని చూచి వారిని వెళ్లగొట్టితిని.

సొదొమ చేసిన పాపాలు ఇక్కడ మనం చూస్తున్నాము.

సొదొమ చేసిన పాపాలు
1 . దేవుని మరచిపోయింది
2 . కృతజ్ఞత లేకుండా జీవించింది

  1. నిర్విచారమైన సుఖః స్థితి
  2. దీనులను అణచివేసింది
  3. హేయ క్రియలు చేసింది

అది చేసిన మొదటి పాపం ఏమిటంటే అది దేవుని మరచిపోయింది. దేవుడు మాకు అక్కరలేదు అని ఆ పట్టణస్తులు గర్జించారు.

   రెండోదిగా వారికి కృతజ్ఞత లేదు. ఆహార సమృద్ధి వారికి కలిగింది. మన మందరం ఆహార సమృద్ధి

కావాలని కోరుకొంటాము. అందులో తప్పు లేదు. అయితే, దేవుని పట్ల కృతజ్ఞత లేని సమృద్ధి మంచిది కాదు. రెస్టారెంట్ లలో చూడండి. చికెన్ బిర్యాని, మటన్ బిర్యాని, ఫిష్ ఫ్రై, చికెన్ 65 రకరకాల ఆర్డర్లు పెడతారు. వాళ్ళల్లో ఒక్కడన్నా ప్రార్ధన చేస్తాడా? తినే ముందు దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించేది ఎంత మంది? సొదొమ చేసిన పాపము అదే. దాని ఆహార సమృద్ధి లో అది దేవుని పట్ల కృతజ్ఞత లేకుండా జీవించింది.

    మూడోదిగా నిర్విచారమైన సుఖ స్థితి. Abundance of Idleness. ప్రస్తుత సమాజములో ఇది పెరిగిపోతూ ఉంది. సుఖ స్థితి లో తప్పులేదు. అయితే అది నిర్విచారముగా ఉంది. దేవుడు, నరకం, పరలోకం, పాపక్షమాపణ, మారు మనస్సు వాటి గురించి ఆలోచించే సమయం లేదు. ఇద్దరు దేవదూతలు సొదొమ వచ్చారు. వీళ్ళు మన ఊరు ఎందుకు వచ్చారు? మనం చేసిన పాపం ఏమిటి? అని ఆలోచించకుండా సొదొమ ప్రజలు వారి మీదకే దౌర్జన్యానికి దిగారు. ఈ రోజు క్లైమేట్ చేంజ్ అని చాలా మంది ధర్నాలు, ప్రదర్శనలు చేస్తున్నారు. భూమి ఉష్ణోగ్రత పెరిగిపోతున్నది, మనం దానిని అరికట్టకపోతే భూమి మీద మానవ జాతి మరో 10 సంవత్సరాల్లో అంతరించిపోతుంది అని వీరి ఆందోళన. భూమి గురించి, చెట్ల గురించి, జంతువుల గురించి, నదుల గురించి, హిమ పర్వతాల గురించి ఆలోచించే వీరు మనుష్యుల ఆత్మల గురించి ఆలోచిస్తున్నారా? దేవుని తీర్పు గురించి ఆలోచిస్తున్నారా? లండన్ నగరము చూడండి. సెయింట్ పాల్ కేథడ్రాల్ అని వుంది. 1666 లో ఒక గొప్ప అగ్ని ప్రమాదంలో లండన్ నగరం బూడిద అయ్యింది. ఈ లోక సంబంధమైనవి తాత్కాలికమైనవి, మనం దేవుని మీద దృష్టి పెట్టాలి అని లండన్ వాసులు సెయింట్ పాల్ చర్చి కట్టారు. సర్ క్రిస్టోఫర్ రెన్ అని గొప్ప శాస్త్రవేత్త ఉండేవాడు. ఆయన 52 చర్చిలు కట్టాడు. వాటిల్లో అత్యంత వైభవముగా సెయింట్ పాల్ కేథడ్రాల్ కట్టించాడు. లండన్ లో ఎక్కడ నుండి చూసినా ఈ చర్చి వారికి కనిపించేది. అయితే ఇంగ్లాండ్ ప్రజలు దేవుని మరచిపోయారు. పెద్ద పెద్ద పార్లమెంట్ భవనాలు కట్టుకున్నారు, మెట్రో లైన్లు వేసుకున్నారు. ఆకాశాన్ని అంటే భవనాలు కట్టుకున్నారు. లైబ్రరీలు కట్టుకున్నారు. మ్యూజియములు కట్టుకున్నారు. మంచి రోడ్డులు వేసుకొన్నారు. పార్కులు, ఉద్యాన వనాలు నాటుకున్నారు. పెద్ద పెద్ద సినిమా హాళ్లు కట్టుకున్నారు. పెద్ద, పెద్ద స్టేడియం లు కట్టుకున్నారు. ఆటల పోటీలు, సంగీత కచేరీలు అంటే కొన్ని వేల మందితో ఈ స్టేడియం లు నిండిపోతున్నాయి.

    లండన్ ఐ అని ఒకటి కట్టారు. థేమ్స్ నది ప్రక్కన ఇది ఒక పెద్ద రంగుల రాట్నం. 300 అడుగుల ఎత్తు. పైకివెళ్ళాలంటే 15 నిమిషాలు పడుతుంది. పైకి వెళ్లి లండన్ నగరం మొత్తం చూడవచ్చు. ఆ అడ్డాల గదుల్లో ఒక పాతిక మందిదాకా నిలబడి పైకి వెళ్తున్నారు.  జీవితం అంటే అది ఒక చక్రం లాంటిది. సుఖంగా ఉండడమే జీవిత పరమార్ధం అనే అర్ధం దాని ద్వారా తెలియజేస్తున్నారు. కట్టుకోవడములో తప్పులేదు. ఆదివారం వస్తే స్టేడియం లు, సినిమా హాళ్లు ఈ బిల్డింగ్ లు, పార్కులు నిండిపోతున్నాయి. వారిలో దేవుని జ్ఞాపకం చేసుకొని, కొద్ది సేపు ఆరాధనలో గడుపుదాము అనుకునేవారు చాలా తక్కువగా ఉన్నారు. ఒక రోజుల్లో ఆదివారం అన్ని వ్యాపారాలు, అన్ని వినోదాలు మూసివేసేవారు. ఇప్పుడు ఆదివారం అంటే అన్ని తెరచిపెడుతున్నారు. ఒక రోజుల్లో  సెయింట్ పాల్ చర్చి లండన్ లో అందరికీ కనిపిస్తా ఉండేది. ఇప్పుడు ఈ రంగుల రాట్నం కనిపిస్తా ఉండేది. చర్చి కి వెళ్లే వాళ్ళు తగ్గిపోతా ఉన్నారు, రంగుల రాట్నాల్లో తిరిగేవాళ్లు పెరిగిపోతా ఉన్నారు. నిర్విచారమైన సుఖస్థితి అంటే అదే. లండన్ వాసులు నిర్విచారమైన సుఖస్థితి లో ఉన్నారు. వారి దృష్టిని ఆకర్షించాలంటే దేవునికి 5 నిమిషాలు పట్టదు. 1666 లో అగ్ని ప్రమాదం పంపి లండన్ నగరాన్ని బుగ్గి పాలు చేసిన దేవుడు ఇప్పుడు ఆ పని చేయలేడా?

    దేవుడు సొదొమను మనకు చూపిస్తుంది అందుకే. పరలోకములో నుండి అగ్ని గంధకాలు కురిపించి దానిని నాశనం చేశాను. పాపాన్ని అరికట్టడం నాకు పెద్ద కష్టమైన పని కాదు అని మనలను హెచ్చరిస్తున్నాడు.

మత్తయి సువార్త 10:15 లో యేసు ప్రభువు ఏమన్నాడంటే,

విమర్శదినమందు ఆ పట్టణపు గతికంటె సొదొమ గొమొఱ్ఱా ప్రదేశముల

గతి ఓర్వతగినదై యుండునని నిశ్చయముగా మీతో చెప్పు చున్నాను.

యేసు ప్రభువు వారితో ఏమంటున్నాడు?

సొదొమ, గొమొఱ్ఱా ల కంటే మీ పరిస్థితి ఇంకా దారుణముగా ఉంటుంది, ఎందుకంటే నేను స్వయముగా మిమ్ములను హెచ్చరించినా మీరు పట్టించుకోవటం లేదు.

    సొదొమ నాలువగ పాపము ఏమిటంటేఅది దీనులకును దరిద్రులకును సహాయము చేయకుండెను.సొదొమ దీనులను, దరిద్రులను అణచివేసింది. నేనొక సారి లండన్ లో నడచివెళ్తున్నాను. అక్కడ సాల్వేషన్ ఆర్మీ హెడ్ క్వార్టర్స్ నాకు కనిపించింది. సాల్వేషన్ ఆర్మీ సంస్థను మహానుభావుడు విలియం బూత్ స్థాపించాడు. 1865 లో ఆయన ఏమన్నాడంటే, యేసు క్రీస్తు ప్రేమను మనం పేదలకు చూపించాలి. ప్రపంచమంతా కోట్ల మంది పేదలకు సాల్వేషన్ ఆర్మీ సంస్థ సేవలు ఈ రోజుకూ అందిస్తానే ఉంది. అయితే దానికి డబ్బులు, విరాళాలు ఇచ్చేవారు తగ్గిపోతున్నారు.

దేవుని మీద ప్రేమ లేనివారికి పేదల మీద కూడా ప్రేమ ఉండదు. చాలా మంది సినిమాలకు, స్టేడియం లకు పెట్టే డబ్బుల్లో సగం కూడా పేదలకు ఇవ్వటల్లేదు. నాస్తికులకన్నా క్రైస్తవులు పేదలకు ఎక్కువ సహాయం చేస్తారు. అది చాలా స్టడీస్ లో బయటపడింది.

    సొదొమ చేసిన 5 పాపము ఏమిటంటే, ‘వారు అహంకరించి నా దృష్టికి హేయక్రియలు చేసిరి’

సొదొమ ప్రజలు ఎంత హేయమైన క్రియలు చేశారో ఆదికాండము 19 లో మనం చూస్తాము. వారందరూ లోతు ఇంటికి వచ్చారు. ‘లోతూ, నీ ఇంటికి వచ్చిన ఇద్దరినీ బయటకి తీసుకురా, మేము వారిని అనుభవించాలి’ అన్నారు. సొదొమ స్వలింగసంపర్కులతో నిండిపోయింది. వారు లోతు మీద

బలాత్కారానికి దిగారు. లండన్ లో ఒక రోజుల్లో స్వలింగసంపర్కులకు జైలు శిక్ష వేసే వారు. ఆస్కార్ వైల్డ్ అని ఒక రచయిత ఏమి చేసేడంటే, బైబిల్ ల్లో మాటలు పట్టించుకోబాకండి, మీకు నచ్చితే చేసేయండి అని ఆయన కూడా స్వలింగ సంపర్కుడు అయ్యాడు. అయితే దేవుని దృష్టిలో అది పాపం అనే సత్యాన్ని వారు మరచిపోయారు.  లోతు వారితో ఏమన్నాడంటే, ‘నాకు ఇద్దరు కూతురులు ఉన్నారు. వారిని మీకు ఇస్తాను, మీ ఇష్టమొచ్చినట్లు చేసుకోండి’. లోతు ఏ స్థితికి దిగజారిపోయాడో ఇక్కడ మనం

చూస్తున్నాము. ఏ తండ్రీ చేయకూడని పనులు ఆయన చేస్తున్నాడు. తన కుమార్తెలను ఆ కామాంధులకు అప్పగించటానికి సిద్ధపడ్డాడు. అయితే వారు దానికి ఒప్పుకోలేదు. మాకు వాళ్ళే కావాలి అని వారి మీద దాడికి సిద్ధపడ్డారు. దేవదూతలు అప్పుడు సొదొమ ప్రజలకు అంధత్వాన్ని కలుగ జేసి వారిని అడ్డుకొన్నారు. లోతు తో వారు ఏమన్నారంటే,‘దేవుడు ఈ పట్టణమును నాశనం చేయబోతున్నాడు. లోతూ, నీకు ఎక్కువ సమయం లేదు, నీ భార్యను, నీ కుమార్తెలను, నీ అల్లుళ్లను, నీ బంధువులను తీసుకొని పారిపో.’లోతు తన అల్లుళ్ళ దగ్గరకి వెళ్లి ఆ మాటలు చెప్పాడు. లోతు మాటలు విని ఆయన అల్లుళ్ళు నవ్వుకొన్నారు. లోతు ను అపహాస్యం చేశారు. లోతు హెచ్చరికలు వారికి కామెడీ గా అనిపించాయి. ‘ఏంటయ్యా, నీ పిచ్చి వాగుడు, పోవయ్యా’ అన్నారు. లోతు అల్లుళ్ళు లాగా మన సమాజములో చాలా మంది ఉన్నారు. బైబిల్ ప్రవచనాలు వారికి చెబితే, ‘అంత బాగానే ఉంది కదా! ఏందయ్యా నీ గొడవ?’ అంటారు.

    లోతు తన భార్యను, కుమార్తెలను తీసుకొని సొదొమను విడిచి పారి పోయాడు. అప్పడు దేవుడు ఆకాశము నుండి అగ్నిని, గంధకములను కురిపించి సొదొమ ను నాశనం చేశాడు. ఆ నగరాల ప్రజలను బూడిద చేసాడు. సొదొమ కాలిపోయేటప్పుడు, వెనక్కి తిరిగి చూడబాకండి అని

దేవుడు లోతు కుటుంబానికి ఆజ్ఞాపించాడు. లోతు భార్య ఆ ఆజ్ఞను సీరియస్ గా తీసుకోలేదు. ఆమె వెనక్కి తిరిగి చూసింది. వెంటనే ఉప్పు స్తంభం అయిపోయింది.

    లూకా సువార్త 17 అధ్యాయములో యేసు ప్రభువు మనలను హెచ్చరించాడు. 28 వచనము నుండి నేను చదువుతాను.

  1. లోతు దినములలో జరిగి నట్టును జరుగును.

జనులు తినుచు త్రాగుచు కొనుచు అమ్ముచు

నారు నాటుచు ఇండ్లు కట్టుచు నుండిరి.

  1. అయితే లోతు సొదొమ విడిచిపోయిన దినమున

ఆకాశము నుండి అగ్ని గంధకములు కురిసి వారినందరిని నాశనము చేసెను.

  1. ఆ ప్రకారమే మనుష్యకుమారుడు ప్రత్యక్ష మగు దినమున జరుగును.
  2. ఆ దినమున మిద్దెమీద ఉండు వాడు ఇంట ఉండు తన సామగ్రిని తీసికొనిపోవుటకు దిగ కూడదు; ఆలాగే పొలములో ఉండువాడును తిరిగి రాకూడదు.
  3. లోతు భార్యను జ్ఞాపకము చేసికొనుడి.

ఇక్కడ యేసు ప్రభువు ఏమంటున్నాడంటే, అంత్య దినాల్లో కూడా సమాజం లోతు దినములలో వలే మారుతుంది. ప్రపంచం మొత్తం ఒక పెద్ద లండన్ లాగా మారుతుంది, సంపద పెరుగుతుంది, సుఖం పెరుగుతుంది, దేవుని మీద విశ్వాసం, దేవుని భయం, దేవుని పట్ల కృతజ్ఞత, ఆరాధన ఉండవు. అయితే లోతు సొదొమ విడిచిపోయిన దినమున ఆకాశము నుండి అగ్ని గంధకములు కురిసి వారినందరిని నాశనము చేసెను.

  1. ఆ ప్రకారమే మనుష్యకుమారుడు ప్రత్యక్ష మగు దినమున జరుగును.

    సొదొమ ను నాశనం చేయకమునుపు దేవుని లోతు కోసం దేవదూతలను పంపించాడు. ఈ లోకాన్ని నాశనం చేయబోయే ముందు దేవుడు తన కుమారుడైన యేసు క్రీస్తును, దేవ దూతలను పంపిస్తాడు. సంఘం ఎత్తబడిన తరువాత దేవుని తీర్పు ఈ భూమి మీదకు వస్తుంది. ఆ తీర్పు చాలా భయంకరముగా ఉంటుంది.

    ఇటలీ లో మౌంట్ వెసువియస్ అగ్ని పర్వతం ప్రేలి నప్పుడు పొంపే పట్టణ ప్రజలంతా అగ్నివాత పడ్డారు. ఇప్పుడు పొంపే లో త్రవ్వకాలలో నాడు జరిగిన విధ్వంసం మన కళ్ళకు కనిపిస్తాఉంది.ఎక్కడవాళ్ళు అక్కడ భూస్థాపితం అయిపోయారు. ఇంట్లో వాళ్ళు ఇంట్లోనే, పొలములో వాళ్ళు పొలములోనే, అగ్ని సమాధి అయ్యారు.

31 వచనము: ఆ దినమున మిద్దెమీద ఉండు వాడు ఇంట ఉండు తన సామగ్రిని తీసికొనిపోవుటకు దిగ కూడదు; ఆలాగే పొలములో ఉండువాడును తిరిగి రాకూడదు.ఇంటి కెళ్ళి సర్దుకోవటానికి కూడా సమయం ఉండదు.

ఈ సంగతులు మనకు ఎందుకు చెప్పబడ్డాయి? యేసు ప్రభువు ఏమన్నాడు?

  1. లోతు భార్యను జ్ఞాపకము చేసికొనుడి.

Remember Lot’s wife

లూకా 17:32

    ప్రస్తుత కాలములో ఉన్న మనం భవిష్యత్తులో జరుగనున్న సంఘటనలు అర్ధం చేసుకోవాలంటే

గతంలోకి చూడాలి అని యేసు ప్రభువు ఇక్కడ మనకు చెబుతున్నాడు. లోతు భార్యను జ్ఞాపకం చేసుకోండి అని ఆయన మనకు చెప్పాడు. లోతు భార్య దేవుని మాట ఆమె కొంతవరకే నమ్మింది. పారిపో అంటే పారిపోయింది. ‘వెనక్కి తిరిగి చూడొద్దు’ అని చెప్పిన మాట ఆమె పట్టించుకోలేదు. ‘ఒక్క

సారి చూస్తే ఏమి కాదులేబ్బా అని తిరిగి చూసింది’ తన ఆత్మను కోల్పోయింది. దేవుని మాటను కొంత వరకే నమ్మబాకు. చాలా మంది చేసే తప్పు అదే. దేవుడు ఉన్నాడు అని వారు నమ్ముతారు, దేవుని తీర్పు వస్తుంది అని కూడా నమ్ముతారు. అయితే రక్షణ పొందు అంటే, తరువాత చూద్దాం, ఇప్పుడు తొందర ఏముంది అంటారు. లోతు భార్య రెండో అవకాశం లేదు, తప్పు దిద్దుకొనే అవకాశం కూడా ఆమెకు లభించలేదు. ఉప్పు స్థంభం అయి పోయింది.

2 పేతురు పత్రిక 2:6 లో మనం చదువుతాము:

‘మరియు ఆయన సొదొమ గొమొఱ్ఱాలను పట్టణములను భస్మముచేసి, ముందుకు భక్తిహీనులగువారికి వాటిని దృష్టాంతముగా ఉంచుటకై వాటికి నాశనము విధించెను’

    దేవుడు సొదొమ గొమొఱ్ఱాలను దృష్టాంతములుగా మన ముందు ఉంచాడు అని పేతురు గారు ఇక్కడ మనకు చెబుతున్నాడు. లండన్ ప్రజలను చాలా మంది హెచ్చరించారు. చార్లెస్ స్పర్జన్ గొప్ప సువార్తికుడు, చాలా సంవత్సరాలు లండన్ ప్రజలను ఆయన హెచ్చరించాడు. లండన్ లో టేట్ గేలరీ అని ఒక మ్యూసియం ఉంది. అందులో జాన్ మార్టిన్ అనే చిత్రకారుడు గీసిన ఒక గొప్ప చిత్రం ఉంచారు. దాని పేరు The Great Day of His Wrath – ఆయన యొక్క ఉగ్రత దినం. అది ఎంత తీక్షణముగా ఉంటుందో జాన్ మార్టిన్ ఆ చిత్రములో గీశాడు. ఆయనే సొదొమ, గొమొఱ్ఱా ల మీద కూడా ఒక గొప్ప చిత్రం గీశాడు. బ్యాక్ గ్రౌండ్ లో సొదొమ, గొమొఱ్ఱాలు అగ్ని చేత దహించబడడం, ముందు లోతు కుటుంబం పారిపోవడం మనం ఆ చిత్రములో చూస్తాము.

    సొదొమ చేసిన పాపాలు ఈ రోజు మనం చూసాము. సొదొమకు దేవుడు ఇచ్చిన సమయం అయిపోయింది. లండన్ లో బిగ్ బెన్ అని ఒక ప్రఖ్యాత కట్టడం ఉంది. దాని మీద చుట్టూ పెద్ద, పెద్ద గడియారాలు ఉంటాయి. దేవుడు ఈ ప్రపంచం ముందు తన ప్రవచన గడియారం పెట్టాడు.

హెబ్రీయులకు వ్రాసిన పత్రిక 9:27 లో మనం చదువుతాము:

మనుష్యులొక్కసారే మృతిపొందవలెనని

నియమింపబడెను; ఆ తరువాత తీర్పు జరుగును.

And as it is appointed

unto men once to die,

but after this the Judgment

సొదొమ ప్రజలు ఏమనుకొన్నారంటే, అంతా బాగానే ఉంది, డోంట్ వర్రీ. ఈ రోజు చాలా మంది అదే తప్పు చేస్తారు. అంతా బాగానే ఉంది, డోంట్ వర్రీ అనుకొని దేవుని ప్రవచనాలు నిర్లక్ష్యం చేస్తారు.

దాని వలన నష్టపోయేది వారే. లోతు తన ప్రాణాలు కాపాడుకున్నాడు కానీ సొదొమ లో సమస్తాన్ని కోల్పోయాడు. అబ్రహాము సొదొమ వైపు వెళ్ళలేదు. దేవుడు ఉద్దేశించిన కనాను దేశము వైపు వెళ్ళాడు. అతని కన్నులు పరలోకం మీద ఉన్నాయి. అబ్రహాము ఆత్మ సంభందమైన విశ్వాసికి, లోతు శరీర సంబంధమైన విశ్వాసికి, లోతు భార్య నశించిన పాపులకు చిహ్నముగా ఉన్నారు. మనం అబ్రహాము వలె ఉన్నామా? లోతు వలె ఉన్నామా? లోతు భార్య వలె ఉన్నామా? అబ్రహాము వలె పరలోకాన్ని ప్రేమిస్తున్నామా? లోతు వలె నశించే లోకాన్ని ప్రేమిస్తున్నామా? లోతు భార్య వలె ఈ లోకం వైపు చూస్తూ నశిస్తున్నామా? సొదొమను, దేవుడు దాని మీద కురిపించిన ఉగ్రతను చూసి మీరు

ఈ రోజు మారు మనస్సు పొందాలి. అదే నేటి మా ప్రేమ సందేశం.

Feed a Hungry Child with as little as $10 per month

Give a helping hand to feed the hungry children and to provide them health care and education

$10.00

Leave a Reply