యాకోబు మోసం: డాక్టర్ పాల్ కట్టుపల్లి సందేశం

ఈ రోజు ఆదికాండము 27 అధ్యాయము నుండి మనం కొన్ని సత్యాలు చూద్దాము. అబ్రహాము,ఇస్సాకు, యాకోబు – వీరు పితరులు, patriarchs. వారి జీవితముల గురించి దేవుడు ఎన్నో వివరాలు బైబిల్ లో వ్రాశాడు. వారి జీవితాలు చదివి నేర్చుకోండి అని దేవుడు మనతో అంటున్నాడు. వాటిని చదివి, ధ్యానిస్తే మనం నేర్చుకొనవలసిన అనేక సత్యాలు మనకు కనిపిస్తాయి. ఆ సత్యాలు మన జీవితానికి ఎంతో ఆశీర్వాదము కలిగిస్తాయి.

    ముందు నేను వ్రాసిన ఒక క్రొత్త పాట మీకు పాడి వినిపిస్తాను. చాలా మంది ‘నేను రక్షణ పొందానా? లేదా? నా రక్షణ నిలబడుతుందో లేదో? అటువంటి ప్రశ్నలతో వేదన పడుతూ ఉంటారు.వారి కోసం ఈ పాట వ్రాశాను. మా వెబ్ సైట్ కి వెళ్లి ఈ పాట డౌన్ లోడ్ చేసుకోండి. మళ్ళీ, మళ్ళీ విని నేర్చుకొంటే మంచిది.

   ఈ పాట లిరిక్స్ కావలసిన వారు యూట్యూబ్  లో మా ప్రేమసందేశము ఛానల్ కి వెళ్ళండి, లేకపోతే  మా వెబ్ సైట్ www.doctorpaul.org ని సందర్శించండి. రక్షణ నిశ్చయిత లేని వారు ఈ పాట పాడుకోండి. ఈ పాటలోని మాటలు అర్ధం చేసుకొంటే మీరు  రక్షణ పొందారు అనే ధైర్యం మీకు కలుగుతుంది.

చెల్లించి వేసెను – నా పాప క్రయధనం

ఆ సిలువ రక్తమే – నా  పాపం కడిగెను

ప్రభువైన యేసు క్రీస్తు సిలువ మీద మన పాప క్రయధనం చెల్లించివేశాడు. ఆయన రక్తములో మన పాపాలు కడుగ బడ్డాయి.

ఆనంద గానం చేసెదను

విమోచన గీతం పాడెదను

మీరు  ఇక ఆనందించవచ్చు ఎందుకంటే ఆయన మీ పాపముల శిక్ష కొట్టివేశాడు. విమోచన గీతం పాడుకో ఎందుకంటే మిమ్ములను ఆయన సంపూర్ణముగా విమోచించాడు.

దేవుడు లోకమును ఎంతో ప్రేమించెను

తన సొంత కుమారుని మన కోసం ఇచ్చెను

విశ్వసించినప్పుడే నిత్యజీవమిచ్చెను

క్రీస్తు లో నన్ను క్రొత్త సృష్టి చేసెను

   ఈ రోజు (15/2/2019) వార్తల్లో మనం చూశాము. కాశ్మీర్ లో టెర్రరిస్టులు 44 మంది సైనికులను ఆత్మాహుతి దళాలతో చంపివేశారు. ఈ సైనికుల కుటుంబాలకు తీరని వేదన మిగిల్చారు. వారి కుటుంబాలను దేవుడు ఆదరించాలని మీరు ప్రార్ధన చేయండి. ఈ దేశములోమనం సురక్షితముగా ఉన్నామంటే ఈ సైనికుల త్యాగాల వలనే. ఎండకు ఎండి, వానకు తడిసి మంచులో నిలబడి ఈ సైనికులు దేశాన్ని కాపాడుతారు.ఈ సైనికుల బస్సు మీద ఆత్మాహుతి దాడి చేసిన టెర్రరిస్ట్ ఒక వీడియో రిలీజ్ చేశాడు.ఆ వీడియోలో అతను ఏమన్నాడంటే, ‘మీరు ఈ వీడియో చూసే సమయానికి

నేను పరలోకములో ఉంటాను’ ఈ రోజు సాతానుడు చెబుతున్న పెద్ద అబద్దాల్లో అది ఒకటి.మీరు

దేవుని పేరు మీద జనాన్ని చంపండి.మీరు పరలోకం వెళ్తారు.చాలామంది యువతీ యువకులు ఈ అబద్దాన్ని నమ్మి తమ ప్రాణాలు తీసుకొంటున్నారు, ఇతరుల ప్రాణాలు తీస్తున్నారు.వాస్తవానికి జరిగింది ఏమిటి?

  ‘మీరు ఈ వీడియో చూసే సమయానికి నేను పరలోకములో ఉంటాను’ జరిగింది అది కాదు.

‘మీరు ఈ వీడియో చూసే సమయానికి నేను నరకములో ఉంటాను’ జరిగింది అది. ఏ నరహంతకుడు పరలోకం వెళ్ళవాడు. మనిషి దేవుని కోసం చేసే పనులు- మత వ్యవస్థ.దేవుడు మనకోసం చేసిన పనులు – క్రైస్తవ్యం.

    దేవుడు తన సొంత కుమారుని సిలువ మీద మన కోసం అర్పించాడు. ఆయన రక్తం వలన మనకు పాప క్షమాపణ కలిగింది. నిత్యజీవము, పరలోకం ఇవ్వబడ్డాయి.ఇప్పుడు ఎవరూ తమ రక్తం చిందించవలసిన అవసరం లేదు, ఇతరుల రక్తం చిందించవలసిన అవసరం లేదు, జంతువుల రక్తం చిందించ వలసిన అవసరం లేదు.

   ఆ తరువాత ఏమని పాడాను?

సమాప్తం అని ఆయన అరచిన్నప్పుడే

నా పాప ఋణమంతా తీర్చివేసెను

ఆ రక్తధారలే నా నిత్యజీవము

యేసయ్య చేతిలో నేనెంతో భద్రము

    యేసు ప్రభువు సిలువ మీద సమాప్తము అని కేక వేసినప్పుడు దేవుడు మన పాప ఋణాన్ని

కొట్టివేశాడు.

శ్రమయైనను బాధయైనను

హింసయైనను మరణమైనను

జీవమైనను దేవదూతలైనను

క్రీస్తు ప్రేమ నుండి నన్ను వేరుచేయనేరవు

ఇప్పుడు క్రీస్తు ప్రేమలో ఉండి మీరు శాంతిని పొందవచ్చు, సమాధానాన్ని పొందవచ్చు. నెమ్మది పొందవచ్చు.

27:1 ఇక్కడ ఆదికాండము 27 అధ్యాయము లో నెమ్మది లేని ఒక యువకుని మనం చూస్తున్నాము. అతని పేరు యాకోబు. అతనికి నెమ్మది లేదు ఎందుకంటే దేవుని పనులను యాకోబు తన చేతుల్లోకి తీసుకొన్నాడు. ఇక్కడ ఒక కుటుంబం మనకు కనిపిస్తున్నది.ఇస్సాకు అతనిభార్య రిబ్కా, వారి ఇద్దరు కుమారులు: ఏశావు,యాకోబు.

27:2 ఇస్సాకు తన కుమారుడు ఏశావును పిలిచాడు. నీవు అడవికి వెళ్లి, వేటాడి మాంసము తీసుకురా.చక్కగా వండి నాకు పెట్టు.నేను తిని, నిన్ను ఆశీర్వదించి చనిపోతాను అన్నాడు.ఇస్సాకు చేసిన తప్పు ఏమిటంటే దేవుని ఆశీర్వాదానికి, తిండికి లింక్ పెట్టాడు. అతడు ప్రార్ధన చేయవలసినది. దేవుడు ఇద్దరు కుమారులను ఆయనకు ఇచ్చాడు. విమోచన కార్యములో యాకోబును దేవుడు ఎన్నుకున్నాడు. ఇస్సాకు అది గుర్తుపెట్టుకోలేదు. తన తిండికి, దేవుని ఆశీర్వాదానికి లింక్ పెట్టాడు. మన తిండి కోసం మనం దేవుని చిత్తాన్ని నీరుకార్చకూడదు.

27:6 రిబ్కా ఆ మాటలు వింది. టెన్షన్ పడింది.తన కుమారుడు యాకోబును పిలిచింది.’ఒరేయ్, మీ నాన్న ఏశావుతో ఏమి చెప్పాడంటే, అడవికి వెళ్లి వేటాడి, మాంసము తెచ్చి విందు చేయి. నేను నిన్ను ఆశీర్వదిస్తాను.’ నువ్వు మందలోనుండి రెండు మేక పిల్లలు తీసుకురా.నేను మీ నాన్నకు ఇష్టమైనవి

వండుతాను.వాటిని నువ్వు మీ నాన్న దగ్గరకు తీసుకొని వెళ్ళు.ఏశావులాగా నటించు.అప్పుడు ఆయన నిన్ను ఆశీర్వదిస్తాడు’ అని చెప్పింది.ఆ మాటలు విని యాకోబు ఇబ్బంది పడ్డాడు.’అమ్మా, ఏశావు వంటి మీద వెండ్రుకలు ఉంటాయి.నేను నున్నటి వాడను.నాన్నకు అనుమానం వస్తే కొంప మునుగుతుంది. నన్ను గుర్తుపట్టితే శపిస్తాడు.’ రిబ్కా యాకోబును వారించింది.‘నిన్ను శపిస్తే ఆ శాపం నామీదకువస్తుంది. నా మాట విను నాన్నా.మీ నాన్నకు మంచి విందు భోజనంచేద్దాము. కాసేపు నటించు’ అంది.రిబ్కా కొడుకు మీద ప్రేమతో భర్తనుమోసము చేసింది.అది కూడా తప్పే.ఒక భార్య యొక్క commitment భర్తతో ఉండాలి. ఆమె కర్తవ్యము పిల్లల కంటే ముందు భర్త పట్లఉండాలి. రిబ్కా ఆ సమయములో ప్రార్ధన చేసి తన పరిస్థితులను దేవుని చేతులకు అప్పగిస్తే బావుండేది.అయితే ఆమె భర్తను మోసం చేద్దామని నిర్ణయించుకొంది. నటించమని కొడుకును ప్రోత్సహించింది.అబద్దాలు చెప్పమని యాకోబును పురికొల్పింది. మనం దేవుని చిత్తములో ఉన్నప్పుడు అబద్దాలు చెప్పవలసిన

అవసరం లేదు. నటించవలసినఅవసరం లేదు. తల్లి మాటలు విని యాకోబు ఏమిచేసాడంటే,

ఏశావు బట్టలు వేసుకొన్నాడు.మేకపిల్లల చర్మముతో తన మెడను, చేతులను కప్పుకొన్నాడు. భోజనం

తీసుకొని ఇస్సాకు దగ్గరకు వెళ్ళాడు. ‘నాన్నా, నేను ఏశావును, నీ పెద్ద కుమారుని.నువ్వు చెప్పినట్లు

అడవికి వెళ్ళాను.వేటాడాను.మాంసము తెచ్చి నీ కోసం విందుచేసాను.లేచి తిను.నన్ను ఆశీర్వదించు

అన్నాడు.ఇస్సాకు ఆశ్చర్యపోయాడు. అంతతొందరగా ఎలా వచ్చావు? అని అడిగాడు.దేవుడు నాకు సహాయం చేసాడు నాన్నా.వేటలో నాకు తోడ్పడ్డాడు అన్నాడు.మన మోసములో యాకోబు దేవుని పేరు కూడా వాడుకున్నాడు.తండ్రి దగ్గరకు వెళ్ళాడు. ఇస్సాకు యాకోబును తడివి చూసాడు.ఆ మేక చర్మముల మీద చేతులు పెట్టి ఏశావు అనుకొన్నాడు.స్వరము యాకోబు లాగా ఉంది, ఒళ్ళు మాత్రం ఏశావులా ఉంది అన్నాడు.యాకోబును ముద్దు పెట్టుకొన్నాడు.యాకోబును ఆశీర్వ దించాడు.

ఆకాశపుమంచును భూసారమును

విస్తారమైన ధాన్యమును

ద్రాక్షారసమును దేవుడు  

నీ కనుగ్రహించుగాక

జనములు నీకు దాసులగుదురు

జనములు నీకు సాగిలపడుదురు

నీ బంధుజనులకు నీవు

ఏలికవై యుండుము

నీ తల్లి పుత్రులు నీకు సాగిలపడుదురు

నిన్ను శపించువారు

శపింపబడుదురు నిన్ను

దీవించువారు దీవింపబడుదురుగాక

   ఇశ్రాయేలీయుల చరిత్రలో ఈ ప్రవచనం యాకోబు సంతానము ద్వారా నెరవేరింది. తండ్రి ఆశీర్వాదము పొంది యాకోబు వెళ్ళిపోయాడు.అప్పుడు ఏశావువచ్చాడు.’నాన్నా, నీకోసం విందు

చేశాను, లేచి తిని నన్ను ఆశీర్వదించు’ అన్నాడు.ఇస్సాకు ‘ఎవరవయ్యా నీవు’ అనిఅడిగాడు. ‘నేను ఏశావును, నీ పెద్ద కుమారుని’ అని సమాధానం వచ్చింది. ఇస్సాకు వణకిపోయాడు.ఇంతకు ముందు నా దగ్గరకు వచ్చింది ఎవరు? నేను ఆశీర్వాదములు మొత్తం అతనికి ఇచ్చివేశాను అన్నాడు.

   ఆ మాటలు విని ఏశావు గుండెలు బాదుకొన్నాడు.యాకోబు నన్ను ఎప్పుడూ మోసం చేస్తూనే

ఉన్నాడు. నాకు రావలసిన దీవెనలు దొంగిలించాడు.నాన్నా, నాకు ఏ దీవెన మిగల్లేదా అని దీనంగా అడిగాడు.ఇస్సాకు ఏమన్నాడంటే, ‘ నా కుమారుడా, దీవెనలన్నీ యాకోబుకు ఇచ్చివేశాను.నీ నివాసము భూసారము లేకయు పైనుండిపడు ఆకాశపు మంచు లేకయు నుండును. నీవు నీకత్తిచేత బ్రదుకుదువు.  నీ సహోదరునికి దాసుడవగుదువు ఆ మాటలు విని ఏశావు కోపముతో రగిలిపోయాడు. నా తండ్రి ఎంతో కాలం బ్రతకడు. ఆ తరువాత నా తమ్ముణ్ణి చంపివేస్తాను. యాకోబు

మీద పగ తీర్చుకొంటాను అని ప్రతిజ్ఞ చేశాడు.రిబ్కా ఆ మాటలు వింది. వెంటనే యాకోబును పిలిచింది. ‘యాకోబూ, నీ అన్న ఏశావు నీ మీద పగబట్టాడు.నిన్ను చంపుతాను అంటున్నాడు.

నువ్వు వెంటనే ఇక్కడ నుండి పారిపో.హారానులో నీ మావయ్య లాబాను ఉన్నాడు. నువ్వు అక్కడకు

పారిపోయి కొంతకాలం అక్కడ ఉండు.నీ అన్న కోపం చల్లారిన తరువాతనీవు తిరిగి రావచ్చు అంది.

యాకోబు అప్పుడు తల్లి దండ్రులను వదలిపెట్టి పారిపోయాడు.

   ఒక చక్కటి కుటుంబం ఏవిధముగా ముక్కలయిపోయిందో ఈ అధ్యాయములో మనం చూస్తున్నాము. ఇస్సాకు అతని భార్య రిబ్కా వారి ఇద్దరు కుమారులు ఏశావు, యాకోబు.ఇస్సాకు, అతని భార్యల మధ్య సరైన సహకారం లేదు.వారు దేవుని నడిపింపు కోసం వేచిచూడలేదు.దేవుడు తన వాగ్దానాలు వారికి ఇచ్చాడు. దేవుడు ఆ వాగ్దానాలు ఆయన సమయములో, ఆయన ఉద్దేశించిన

క్రమములో నెరవేర్చేవరకు వారు ఓపిక పట్టలేకపోయారు. అబ్రహాము, శారా చేసిన తప్పు వీరు కూడా చేశారు. దేవుడు అబ్రహాము, శారా లకు ఒక కుమారుణ్ణి వాగ్దానము చేశాడు.ఆ కుమారుని కోసం మరో పాతిక సంవత్సరాలు వారు ఓపికతో వేచిచూడాలి. అయితే వారు అసహనం చెందారు. అబ్రహాము శారా సలహాతో తన దాసిని పెండ్లి చేసుకొన్నాడు. ఆమె ద్వారా ఒక కుమారుణ్ణి  పొందాడు. ఆ పని వలన అబ్రహాము కుటుంబం అతలాకుతలం అయి పోయింది. దేవుని సమయము కోసం ఎదురుచూడకుండా అబ్రహాము, శారాలు తమ జీవితాలను తమ చేతుల్లోకి తీసుకొన్నారు.దాని వలన నష్టపోయింది వారే. ఇక్కడ ఇస్సాకు, రిబ్కాలు కూడా అదే తప్పు చేశారు. దేవుడు వారికి వాగ్దనాలు చేసాడు.ఏ కొడుకుకు ఏమి ఇవ్వాలో దేవుడు తన సమయములో వారికి తెలియజేసేవాడే. అయితే దేవుని సమయం కోసం ఎదురుచూసే ఓపిక వారికి కొరవడింది. దేవుని పద్ధతుల్లో వెళ్లే విశ్వాసం,

సహనము వారికి లోపించింది.రిబ్కా యాకోబుకు చెడు సలహాలు ఇచ్చింది. ఒకరి బట్టలు ఒకరికి

వేసింది. అబద్దాలు చెప్పమంది, నటించమని చెప్పింది, మోసం చేయమని చెప్పింది. చివరికి ఆమెకు ఏమి మిగిలింది? ఏశావు మాటలు విని వణకిపోయింది. తన ముద్దుల కుమారుడు యాకోబును

దూర ప్రాంతానికి పంపి వేసింది. అదే ఆమెకు చివరి చూపు. యాకోబును మరొకసారి చూడకముందే

చని పోయింది.

   యాకోబు ఏమి సాధించాడు? దేవుడు చేసిన వాగ్దానాలు అతడు నమ్మలేదు. దేవుని సమయం

కోసం ఎదురుచూడలేదు.పరిస్థితుల ప్రభావముతో అతని జీవితం నడిచిందే తప్ప దేవుని మీద చూపుతో ముందుకు సాగలేదు. తండ్రిని, అన్నను మోసం చేశాడు, అబద్దాలు చెప్పాడు, ఇంట్లో నుండి పారిపోయాడు. తల్లి దండ్రులతో జీవించే భాగ్యాన్ని కోల్పోయాడు. వాళ్ళ మావయ్య ఇంట్లో

పాచిపనులు చేసుకొంటూ బ్రతికాడు.  లాబాను అతని ఎంతో హీనంగా చూశాడు, ‘ఒరేయ్ యాకోబు

గొఱ్ఱెలను మేపు, ఒరేయ్ యాకోబు ఇల్లు ఊడువు రా, ఒరేయ్ యాకోబు పేడ ఎత్తురా, నీళ్లు కాయరా’.

తల్లి, దండ్రుల దగ్గర యాకోబు ఎంత సుఖముగా బ్రతికాడు? అన్న వేటాడి తెస్తే అమ్మ వండిపెట్టేది. అతని ఒళ్ళు నున్నగా తయారయ్యింది.అన్నను మోసం చేసి, అక్కడ నుండి పారిపోయి, మామ ఇంట్లో పేడ ఎత్తే పరిస్థితి అతనికి వచ్చింది. దేవుని కోసం ఎదురు చూస్తే అతని జీవితం ఆ స్థితికి వెళ్ళేది కాదు.

    ఎఱ్ఱ సముద్రము ఒడ్డున ఐగుప్తు సైన్యాలు ఇశ్రాయేలీయులమీదకు దూసుకు వచ్చినాయి.ఇశ్రాయేలీయులు వణకిపోయారు.మోషే గారు వారితో ఏమన్నాడు? యెహోవా మీ పక్షమున

యుద్ధము చేయును, మీరు ఊరకయే యుండవలెను నిర్గమ కాండము 14:14

The LORD shall fight for you,

and ye shall hold your peace.

ఈ రోజు మనమంతా నేర్చుకొనవలసిన సత్యము అదే. దేవుడు మన పక్షమున యుద్ధం చేస్తాడు, దేవుడు మన పక్షమున పనిచేస్తాడు. మనం ఆయన సమయం కోసం వేచిచూడాలి. ఓపికతో ప్రార్ధనలో గడపాలి. ఆ సత్యం పాటించక అబ్రహాము కుటుంబము విచ్చిన్నమయింది.ఆ సత్యం పాటించక ఇస్సాకు కుటుంబం ముక్కలయింది.

  ఆదికాండము 27 అధ్యాయమును ఈ రోజు మనం ధ్యానించాము.

దేవుని కోసం మనం ఎదురుచూస్తున్నామా? లేక యాకోబు వలె అబద్దాలు చెప్పి మారువేషాలు వేసుకొనిమోసాలు చేసి నష్టపోతున్నామా? దేవుడు ఆ విషయములో మనకు సహాయం చేయును గాక. అదే నేటి మా ప్రేమ సందేశం.

Feed a Hungry Child with as little as $10 per month

Give a helping hand to feed the hungry children and to provide them health care and education

$10.00

Leave a Reply