ఈ రోజు ఆదికాండము 49 అధ్యాయము నుండి కొన్ని ప్రవచనాలు చూద్దాము. యాకోబు చివరి దశలో ఉన్నప్పుడు తన 12 మంది కుమారులను తన మంచం దగ్గరకు పిలిచాడు.
రూబేను
షిమ్యోను,
లేవి
యూదా
జెబూలూను
ఇశ్శాఖారు
దాను
గాదు
ఆషేరు
నఫ్తాలి
యోసేపు
బెన్యామీను
ఈ 12 మంది 12 గోత్రాలుగా వృద్ధిచెందారు
ఈ 12 గోత్రాల గొడవ మనకు ఎందుకు? అని మీరు అనుకోవచ్చు.అయితే దేవుని రక్షణ ప్రణాళికలో 12 మంది ముఖ్య పాత్ర పోషిస్తున్నారు. ఈ 12 మంది లో నుండి దేవుడు 12 గోత్రాలను తీసుకువచ్చాడు.12 మందిలో ఒకరు చనిపోయినా దేవుని మాటలు వ్యర్ధమయ్యేవి. దేవుడు పలికిన ఏ మాటా నిరర్థకము కాదు. ఆ 12 మందిని దేవుడు భద్రపరచాడు. వారిలో నుండి 12 గోత్రాలు తీసుకువచ్చాడు.ఇశ్రాయేలు దేశములో వారు ఎక్కడెక్కడ జీవించాలో దేవుడు నిర్ణయించాడు. వారు ఏ ఏ పనులు చేయాలో దేవుడు వారికి నియమించాడు. వారిని ఆశీర్వదించాడు. వారు పాపము చేసినప్పుడు శిక్షించాడు. అయితే వారిని ఎప్పుడూ వదిలిపెట్టలేదు. 1948 లో వారికి తిరిగి ఇశ్రాయేలు దేశమును అప్పగించాడు.ఈ రోజు ఇశ్రాయేలు దేశం దినదినాభి వృద్ధి చెందుతూ ముందుకు వెళ్తున్నది.
కొద్ది రోజుల క్రితం అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ గోలాన్ హైట్స్ ప్రాంతాన్ని ఇశ్రాయేలు దేశములో భాగముగా గుర్తించాడు.అది యోసేపు సంతానమునకు ఇవ్వబడింది. ప్రతి గోత్రానికి దేవుడు ఇచ్చిన భూమి ఆ గోత్రానికి ఇవ్వబడుతుంది. యెహెఙ్కేలు గ్రంథం 48 అధ్యాయములో మీరు చూడండి. అక్కడ భవిష్యత్తులో ఈ 12 గోత్రాలు ఇశ్రాయేలు దేశములో ఎలా స్థిరపడుతాయో మనం చూస్తాము. కాబట్టి ఈ 12 గోత్రాల కథ ఎప్పుడో చరిత్రలో ముగిసిపోయిన సంఘటనలు కాదు.ఇది నడుస్తున్న చరిత్ర. భవిష్యత్తులో కూడా దేవుడు 12 గోత్రాల ప్రజలను తన సేవకు వాడుకొంటాడు. ప్రకటన గ్రంథం
7 అధ్యాయములో మనం చూస్తాము.ఏడేండ్ల శ్రమల కాలములో దేవుడు ఇశ్రాయేలు గోత్రముల వారిని తన సేవకు పిలుస్తాడు. ఒక్కొక్క గోత్రములో నుండి 12 వేల మంది చొప్పున పండ్రెండు గోత్రముల నుండి 1 లక్ష, 44 వేల మందిని దేవుడు పిలుస్తాడు. వారు ప్రపంచమంతా సువార్త ప్రకటిస్తారు. అప్పుడు ఏమి జరిగింది?
ప్రకటన 7:9 చూడండి.
ఇదిగో, ప్రతి జనములోనుండియు ప్రతి వంశములోనుండియు
ప్రజలలోనుండియు, ఆయా భాషలు మాటలాడువారిలో నుండియు వచ్చి,
యెవడును లెక్కింపజాలని యొక గొప్ప సమూహము కనబడెను.
ఆ మాటలు మీరు గమనించండి. ఈ పండ్రెండు గోత్రముల వారు సువార్త ప్రకటించినప్పుడు, కొన్ని వందల కోట్ల మంది – లెక్కింపజాలని గొప్ప సమూహము యేసు ప్రభువును నమ్ముకొంటారు. 12 గోత్రాల వారిని దేవుడు ఈ ప్రపంచము ముందు తనకు సాక్ష్యులుగా, తన వాక్యము ప్రకటించేవారుగా పిలుచుకొన్నాడు. గతములో వారు విఫలమయిపోయారు. అయితే భవిష్యత్తులో దేవుడు వారిని
నిలబెట్టి తన పని చేయించుకొంటాడు. ప్రభువైన యేసు క్రీస్తు తన వెయ్యేళ్ళ పాలనలో కూడా వారికి ప్రముఖ స్థానము ఇస్తాడు. యెహెఙ్కేలు గ్రంథము 48 అధ్యాయము లో మీరు చూస్తే, 12 గోత్రముల వారికి దేవుడు ఇశ్రాయేలు దేశాన్ని విభజించి ఇస్తాడు. అప్పుడు యెరూషలేము కూడా కట్టబడుతుంది. ఆ నగరానికి 12 గుమ్మములు ఉంటాయి. ఆ పండ్రెండు గుమ్మముల మీద ఈ పండ్రెండు మంది పేరులు వ్రాయబడుతాయి. అంతే కాకుండా, పరలోకము మీద కూడా వీరి పేరులు వ్రాయబడుతాయి.
ప్రకటన గ్రంథము 21 అధ్యాయము లో మనం చదువుతాము. ‘నూతనమైన యెరూషలేము’ అక్కడ మనకు కనిపిస్తుంది. అది పరలోకం.12 వచనంలో మనం చదువుతాము.
ప్రకటన 21: 2,12
నేను నూతనమైన యెరూషలేము………
ఆ పట్టణమునకు ఎత్తయిన గొప్ప ప్రాకారమును పండ్రెండు గుమ్మములును ఉండెను;
ఇశ్రాయేలీయుల పండ్రెండు గోత్రముల నామములు ఆ గుమ్మముల మీద వ్రాయబడియున్నవి.
పరలోకము యొక్క 12 గుమ్మముల మీద ఈ పండ్రెండు మంది పేరులు వ్రాయబడ్డాయి. దేవుడు పరలోకం మీద వీరి పేరులు వ్రాయించాడు అంటే అది సామాన్యమైన విషయం కాదు కదా! ఇక్కడ ఆదికాండము 49 అధ్యాయములో యాకోబు మంచం చుట్టూ నిలబడిన ఈ 12 మంది సాధారణ వ్యక్తులు కాదు. దేవుడు ప్రపంచ చరిత్రను వీరి సంతానము ద్వారా ప్రభావితం చేశాడు. వీరిలో నుండి మోషే, యెహోషువ లాంటి గొప్ప నాయకులు రాబోవుచున్నారు. వీరిలో నుండి దావీదు, సొలొమోను లాంటి గొప్ప రాజులు రాబోవుచున్నారు. వీరిలో నుండి దానియేలు, యెహెఙ్కేలు లాంటి గొప్ప ప్రవక్తలు రాబోవుచున్నారు. వీరిలో నుండి పౌలు, పేతురు లాంటి గొప్ప భక్తులు రాబోవుచున్నారు. అందరికంటే ముఖ్యముగా దైవ నరుడు యేసు ప్రభువు వీరిలో నుండి రాబోవుచున్నాడు. పోయిన వారము 4 గోత్రాలు గురించి మనం చూశాము. ఈ రోజు మరొక 4 గోత్రాలు గురించి మనం చూద్దాము.
5జెబూలూను
6ఇశ్శాఖారు
7దాను
8గాదు
9ఆషేరు
10నఫ్తాలి
11యోసేపు
12బెన్యామీను
5జెబూలూను
49:13ఐదవ కుమారుడు జెబూలూను. యాకోబు జెబూలూను కు చేసిన ప్రవచనం 13 వచనములో చూస్తున్నాము.
- జెబూలూను సముద్రపు రేవున నివసించును అతడు ఓడలకు రేవుగా ఉండును అతని పొలిమేర సీదోను వరకు నుండును. ఈ మ్యాప్ చూడండి. ఈ మ్యాప్ కావలసిన వారు మా వెబ్సైట్ www.doctorpaul.org కి వెళ్లి డౌన్ లోడ్ చేసుకోండి. జెబూలూనుకు దేవుడు మంచి ప్రాంతము ఇచ్చాడు. గలిలయ సముద్రము నుండి, మధ్యధరా సముద్రం మధ్య ఉన్న ప్రాంతాన్ని జెబూలూనుకు ఇచ్చాడు.ఇది యేసు ప్రభువు సేవచేయబోయే ప్రాంతము. జెబూలూను పుట్టినప్పుడు ఆయన తల్లి లేయా ఏమనుకొందంటే, ఆదికాండము 30:20 లో మనం చూస్తాము, దేవుడు మంచి బహుమతి
నాకు దయచేసెను అని చెప్పి అతనికి జెబూలూను అని పేరుపెట్టింది. యేసుప్రభువు జెబూలూనులో సేవ చేయబోచున్నాడు.ఆయన దేవుడు మనకు ఇచ్చిన మంచి బహుమతి.ఈ జెబూలూను ప్రాంతము ఏ విధముగా ఆశీర్వదించబడుతుందో యెషయా ప్రవక్త మనకు తెలియజేశాడు. యెషయా గ్రంథము 9 అధ్యాయములో మనం చదువుతాము.
పూర్వకాలమున ఆయన జెబూలూను దేశమును
నఫ్తాలి దేశమును అవమానపరచెను
అంత్యకాలమున ఆయన సముద్రప్రాంతమును, అనగా
యొర్దాను అద్దరిని అన్యజనుల గలిలయ ప్రదేశమును మహిమ గలదానిగా చేయుచున్నాడు.
- చీకటిలో నడుచు జనులు గొప్ప వెలుగును చూచు చున్నారు
మరణచ్ఛాయగల దేశనివాసులమీద వెలుగు ప్రకాశించును.
- నీవు జనమును విస్తరింప జేయుచున్నావు
వారి సంతోషమును వృద్ధిపరచుచున్నావు. యెషయా 9:1-3
యెషయా ప్రవక్త ఏమంటున్నాడంటే, ఈ జెబూలూను ప్రాంతము ఆశీర్వదించబడుతుంది. అక్కడ ఉన్న గలిలయ ప్రదేశము దేవుని మహిమను చూస్తుంది. చీకటిలో నడిచేవారు గొప్ప వెలుగు చూస్తారు. మరణపు నీడలో బ్రతుకుతున్న వారి మీద దేవుని వెలుగు ప్రకాశిస్తుంది. ఈ మాటలు యేసు ప్రభువులో నెరవేరినాయి. ఆయన గలిలయ ప్రాంతములో 30 సంవత్సరాలు జీవించి, దేవుని వెలుగును, జీవమును వారికి అనుగ్రహించాడు. 12 మంది శిష్యులలో11 మంది గలిలయ ప్రాంతము వారే. ఒక్క యూదా ఇస్కరియోతు మాత్రమే పరాయి వాడు.జెబూలూను కు దేవుడు ఓడ రేవులు ఇచ్చాడు. ఈ శిష్యులు ఇక్కడ నుండి ఓడలలో బయలుదేరి ప్రపంచమంతా వెళ్లి యేసు క్రీస్తుసువార్త ప్రకటించారు.
6ఇశ్శాఖారు
ఆరో కుమారుడు ఇశ్శాఖారు. యాకోబు అతనికి ఇచ్చిన ప్రవచనం చూద్దాము.
- ఇశ్శాఖారు రెండు దొడ్ల మధ్యను పండుకొనియున్న బలమైన గార్దభము.15. అతడు విశ్రాంతి మంచిదగుటయు ఆ భూమి రమ్యమైనదగుటయు చూచెను గనుక అతడు మోయుటకు భుజము వంచుకొని వెట్టిచేయు దాసుడగును.
ఇశ్శాఖారు లేయా యొక్క దాసికి జన్మించాడు. అతడు ఒక గాడిద వలె సేవ చేస్తాడు. గాడిద అంటే తెలివితక్కువ వాడు అనికాదు. దేవుడు అతని సంతానానికి ఎంతో జ్ఞానము ఇచ్చాడు. ఉదాహరణకు,
1 దినవృత్తాంతములు 12 అధ్యాయము లో మనం చదువుతాము.
- ఇశ్శాఖారీయులలో సమయోచిత జ్ఞానముకలిగి ఇశ్రాయేలీయులు
చేయతగినదేదో దాని నెరిగియున్న అధిపతులు రెండువందలు
ఇశ్శాఖారీయులకు సమయోచితమైన జ్ఞానము ఉంది.
Understanding of the times
ఎంత చక్కటి మాట!
Understanding of the times,
సమయోచితమైన జ్ఞానము మనకు రావాలంటే బైబిల్ ప్రవచనాలు చదవాలి.
7.దాను
ఏడవ కుమారుడు దాను.అతనిగురించిన
ప్రవచనం చూద్దాము:
- దాను ఇశ్రాయేలు గోత్రికులవలె తన ప్రజలకు న్యాయము తీర్చును.
దేవుడు దాను గోత్రములో నుండి అనేక న్యాయాధిపతులను తీసుకొనివచ్చాడు. సమ్సోను దాను గోత్రములో నుండి వచ్చిన వాడే. (న్యాయాధిపతులు13:2 )
ఇశ్రాయేలీయులు అరణ్యములో ఉన్నప్పుడు వారికి ఒక ప్రత్యక్ష గుడారము దేవుడు ఇచ్చాడు. ఆయన సన్నిధిని వారి మధ్యలో ఉంచాడు. ఆ ప్రత్యక్ష గుడారము ఇద్దరు వ్యక్తుల పర్యవేక్షణలో నిర్మించబడింది. వారి పేరులు బెసలేలు, అహోలీయాబు. అహోలీయాబు దాను గోత్రములోనుండి వచ్చిన వాడు. ఆయన తన జ్ఞానముతో తన నైపుణ్యముతో ఒక చక్కటి మందిరాన్ని దేవుని ప్రజలకు నిర్మించాడు.
నిర్గమ కాండము 31:6. మరియు నేను దాను గోత్రములోని అహీ సామాకు కుమారుడైన అహోలీయాబును అతనికి తోడు చేసి తిని. నేను నీకాజ్ఞాపించినవన్నియు చేయునట్లు జ్ఞాన హృదయులందరి హృదయములలో జ్ఞానమును ఉంచి యున్నాను.
నిర్గమ కాండము 38:23. దాను గోత్రికుడును అహీసామాకు కుమారుడునైన అహోలీయాబు అతనికి తోడైయుండెను. ఇతడు చెక్కువాడును విచిత్ర మైనపని కల్పించువాడును నీల ధూమ్ర రక్తవర్ణములతోను సన్ననారతోను బుటాపని చేయువాడునై యుండెను.
17 వచనము:
- దాను త్రోవలో సర్పముగాను దారిలో కట్లపాముగాను ఉండును. అది గుఱ్ఱపు మడిమెలు కరచును అందువలన ఎక్కువాడు వెనుకకు పడును.
- యెహోవా, నీ రక్షణకొరకు కనిపెట్టి యున్నాను.
దాను సర్పము లాగా, కట్ల పాములాగా అయిపోయాడు. దానీయులు చేసిన ఘోర పాపము ఏమిటంటే వారు ఇశ్రాయేలీయుల మధ్యకు విగ్రహారాధన తీసుకువచ్చారు.
న్యాయాధిపతులు 18:30 లో మనం చదువుతాము.
దానీయులు చెక్కబడిన ఆ ప్రతి మను నిలుపుకొనిరి.
యరొబాము రెండు బంగారు దూడలు చేయించి ఒకటి బేతేలులో, మరొకటి దాను లో పెట్టించాడు.
యెరూషలేము వెళ్ళబాకండి, దేవుని మందిరానికి వెళ్ళబాకండి, ఈ విగ్రహాలను పూజించండి, ఈ బంగారు దూడలకు పూజలు చేసి, దండము పెట్టుకోండి చాలు అన్నాడు. వారి దేశము విగ్రహారాధనతో నిండిపోయింది. అహోలీయాబు, ప్రత్యక్ష గుడారము నిర్మించిన దానీయుడు.
అంతటి ఘన చరిత్ర కలిగిన దానీయులు ఇప్పుడు హీన మైన స్థితికి దిగజారిపోయారు.
1 రాజులు 12 యరొబాము రెండు బంగారు దూడలుచేయించి ఒకటి బేతేలులో, మరొకటి దానులో పెట్టించాడు.
దేవుని తీర్పు కూడా దానులోనే మొదలయ్యింది. యిర్మీయా గ్రంథము 8 అధ్యాయము లో
మనం చదువుతాము:
యిర్మీయా 8:16 16. దానునుండి వచ్చువారి గుఱ్ఱముల బుసలు వినబడెను, వారి గుఱ్ఱముల సకిలింపు ధ్వనిచేత దేశమంతయు కంపించుచున్నది, వారు వచ్చి దేశ మును అందులోనున్న యావత్తును నాశనము చేయు దురు, పట్టణమును అందులో నివసించువారిని నాశనము చేయుదురు.
- నేను మిడునాగులను మీ లోనికి పంపు చున్నాను,
అవి మిమ్మును కరచును, వాటికి మంత్రము లేదు; ఇదే యెహోవా వాక్కు.ఇశ్రాయేలీయుల మీదకు వచ్చే తీర్పు గురించి ఇక్కడ యిర్మీయా ప్రవక్త ప్రవచించాడు.
బబులోను నుండి నెబుకద్నెజరు వస్తున్నాడు. ఈ నెబుకద్నెజరు మిమ్ములను చెరలోనికి తీసుకొనివెళ్తాడు. నెబుకద్నెజరు తన దండ యాత్ర ఎక్కడ మొదలుపెడతాడు?
దానునుండి వచ్చువారి గుఱ్ఱముల బుసలు వినబడెను.
నెబుకద్నెజరు దానులో తన దండయాత్ర మొదలు పెడతాడు, ఎందుకంటే దేవుని ప్రజలను విగ్రహారాధన వైపు మొదటిగా తీసుకొని వెళ్ళింది వారే.
8.గాదు
ఆ తరువాత కుమారుడు గాదు.ఇక్కడ మ్యాప్ లో చూస్తే, రూబేను, గాదు, మనష్షే అర్ధగోత్రము ఈ ముగ్గురూ యొర్దాను నదికి తూర్పున స్థిరపడ్డారు.గాదును గురించిన ప్రవచనం 19 వచనంలో మనం
చదువుతాము.
- బంటుల గుంపు గాదును కొట్టును అతడు మడిమెను కొట్టును.
ఈ గాదీయులు చాలా గొప్ప యుద్ధ వీరులు అవుతారు అని యాకోబు ఇక్కడ చెప్పాడు. అతడి మీద దాడి జరిగితే, చేతులు ఎత్తేయడు.
యెహోషువా కనాను దేశమును జయించేటప్పుడు గాదు వారిని తన సైన్యములో వాడుకొన్నాడు.(యెహోషువ 22:1)
దావీదు రాజు సైన్యానికి వీరు అధిపతులుగా ఉన్నారు.
(1 దిన వృత్తాంతములు 5:18 1 దిన వృత్తాంతములు 12:14)
గాదీయులగు వీరు సైన్యమునకు అధిపతులై యుండిరి; వారిలో అత్యల్పుడైనవాడు నూరు
మందికి అధిపతి, అత్యధికుడైన వాడు వెయ్యిమందికి అధిపతి.
ద్వితీయోప 33:20 గాదునుగూర్చి యిట్లనెను గాదును విశాలపరచువాడు స్తుతింపబడును అతడు ఆడు సింహమువలె పొంచియుండును బాహు వును నడినెత్తిని చీల్చివేయును.
వాళ్ళ యొక్క యుద్ధ ప్రావీణ్యము మనకు ఇక్కడ కనిపిస్తున్నది. వాళ్లలో అత్యధికుడు వెయ్యి మందికి అధిపతి ఐతే అత్యల్పుడు వంద మందికి అధిపతి. ఇశ్రాయేలు దేశము మీద దాడి జరిగితే ముందు తూర్పున ఉన్న గాదీయుల మీద దాడి జరుగుతుంది. వారు అప్రమత్తముగా ఉండాలి.
ఈ రోజు ప్రపంచములో ఎప్పుడూ అప్రమత్తముగా ఉండే సైన్యాలలో ఇశ్రాయేలు ముందు ఉంటుంది.
Airborne Early Warning & Control (AEW&C ) ని ఇశ్రాయేలు దేశము తయారు చేసింది.శత్రు దేశాలయొక్క యుద్ధ విమానాలు మన దేశము ఉపరితలం లో ప్రవేశించినప్పుడు ఆ వ్యవస్థ వెంటనే
ఆ సమాచారాన్ని ఎయిర్ ఫోర్స్ కి అందిస్తుంది. 2009 సంవత్సరములో ఇశ్రాయేలు దేశము ఈ వ్యవస్థను భారత దేశానికి అందించింది. దాని యొక్క విలువ ఈ మధ్యలో మనం చూశాము.పాకిస్తాన్ సైన్యం F-16 యుద్ధ విమానాలతో భారత దేశము మీద దాడికి వచ్చింది. ఇశ్రాయేలు దేశము భారత్ కి అందించిన AEW& C వ్యవస్థ ఈ సమాచారాన్ని భారత సైన్యానికి అందించింది. భారత పైలట్ లు మిగ్-21 విమానాల్లో వాటిని ఎదుర్కొన్నారు. F-16 మిగ్-21 కన్నా ఎంతో శక్తిమంతమైంది.అయినప్పటికీ ధైర్యముతో భారత పైలట్ అభినందన్ వారిని వెళ్ళగొట్టాడు.యుద్ధములో ఉండేవ్యక్తికి ధైర్యము, జ్ఞానము ఉండాలి. గాదీయులు అలాంటివారు. వారికి ధైర్యము, జ్ఞానము రెండూ ఉన్నాయి. అందుకనే దావీదు రాజు తన సైన్యాధిపతులుగా వారిని పెట్టుకొన్నాడు.
ఇశ్రాయేలు 12 గోత్రాలు గురించిన ప్రవచనాలను ఆదికాండము 49 అధ్యాయము నుండి మనం
ధ్యానం చేస్తున్నాము. ఈ రోజు జెబూలూను,ఇశ్శాఖారు, దాను, గాదు అనే నాలుగు గోత్రాల గురించి
మనం చూశాము.ప్రతి గోత్రానికి దేవుడు ప్రత్యేకమైన ధన్యతలు అనుగ్రహించాడు.వారి గురించి
చాలా విషయాలు మనం చెప్పుకోవచ్చు.అయితే ముఖ్యమైన సత్యము ఏమిటంటే యూదా గోత్రములో నుండి దేవుడు మనకు ఒక రక్షకుని అనుగ్రహించాడు. ఆ రక్షకుడు – మన ప్రభువైన యేసు క్రీస్తు దగ్గరకు మీరు రావాలన్నదే నేటి మా ప్రేమ సందేశం