మరణం ఒక పెద్ద మిస్టరీ. మరణం తరువాత ఏమిటీ? అనే ప్రశ్న మనకు వచ్చే పెద్ద ప్రశ్నల్లో ఒకటి. ఈ ప్రపంచం అనేక మంది నాయకులను చూసింది. మత స్థాపకులను చూసింది చక్రవర్తులను చూసింది
ఐశ్వర్యవంతులను చూసింది. ప్రవక్తలను చూసింది. తత్వవేత్తలను చూసింది. బలవంతులను చూసింది. అయితే వారందరూ మరణం ముందు తల వంచి, ఓడిపోయి నిష్క్రమించినవారే. ఒక్క యేసు క్రీస్తు మాత్రమే మరణాన్ని ఎదిరించాడు, దానిని ఓడించాడు జీవముతో మరణం నుండి తిరిగి లేచాడు.
ఈస్టర్ దేవుడు మరణానికి యేసు క్రీస్తు ద్వారా ఇచ్చిన సమాధానము. మనిషి అనేక రంగాల్లో ఎంతో పురోగతి సాధించాడు.ఒక హాస్పిటల్ కి వెళ్తే ICU లోకి వెళ్తే ఒక పేషెంట్ కి రకరకాల ట్యూబ్ లు పెడుతారు. నోట్లో ఒకటి, ముక్కులో ఒకటి, చెవిలో ఒకటి రకరకాల సెన్సార్లు, ఇంట్రావీనస్ లైన్లు పెడతారు.
మనిషి శరీరం గురించి అనేక విషయాలు తెలుసుకొంటారు, మందులు, ఇంజక్షన్ లు ఇస్తారు.ఎంత చేసినా మరణాన్ని కొంతవరకు మాత్రమే వాయిదా వేయగలరు. దానిని శాశ్వతముగా దూరం చేయలేరు. మరణాన్ని మనకు శాశ్వతముగా దూరము యేసు క్రీస్తు ఈ ప్రపంచానికి వచ్చాడు. ప్రభువైన యేసు క్రీస్తు మృతులలో నుండి తిరిగి లేచాడు. ఆ విషయం మనం గుర్తుపెట్టుకోవాలి. అపొస్తలుడైన పౌలు తిమోతికి వ్రాశాడు. 2 తిమోతి 2 అధ్యాయములో 8 వచనంలో మనం చదువుతాము.
మృతులలో నుండి లేచిన
యేసుక్రీస్తును
జ్ఞాపకము చేసికొనుము.
2 తిమోతి 2: 8
ఎంత చక్కటి మాటలు!
Remember that Jesus Christ
who was raised from the dead
జ్ఞాపకము చేసుకో అని పౌలు గారు ఇక్కడ చెబుతున్నాడు.ఎందుకంటే మరచిపోవడం చాలా తేలిక. నిన్న నేను ఒక మెడికల్ ఎక్సమ్ వ్రాశాను. ఉదయం 8 గంటలు నుండి సాయంత్రం 4 గంటల వరకు – 320 ప్రశ్నలు ఉన్నాయి. పరీక్ష వ్రాసేటప్పుడు కొన్ని ప్రశ్నలకు ఆన్సర్స్ గుర్తురాలేదు. ఇది నేను చదివిందే కదా, మరచిపోయాను ఏంటి? దీని దుంప తెగ? పోయిన వారమే కదా నేను చదివింది, అప్పుడే
మరచిపోయాను ఏమిటి? అని నాలో నేను అనుకొన్నాను. మరచిపోవటం చాలా ఈజీ. ఒక ఎక్సమ్ కి ప్రిపేర్ అయేటప్పుడు ఒక సారి చదివితే సరిపోదు. రివిసన్ చెయ్యాలి, రివిసన్ చేయకపోతే పరీక్ష రోజున మనకు గుర్తుకురాక ఇబ్బందులు పడుతాము. మన జీవితములో కూడా మనం అనేక పరీక్షలు ఎదుర్కొంటాము.ఆ పరీక్షలో దేవుని సత్యాలు మనకు గుర్తుకురాకపోతే మనం ఫెయిల్ అయిపోతాము, ఓడిపోతాము. జీవితం మన మీద విసిరే పరీక్షలకు తట్టుకొని నిలబడాలంటే మనం దేవుని సత్యాలను రివిసన్ చేయాలి, వాటిని నెమరు వేయాలి, వాటిని జ్ఞాపకం చేసుకోవాలి.
మనుష్యులను నమ్ముకొంటే మనం భంగపడక తప్పదు. ఇప్పుడు ఎలక్షన్స్ జరుగుతున్నాయి కదా. రాజకీయ నాయకులు ఎన్నో వాగ్దానాలు చేస్తూ ఉన్నారు. మీకు అది ఇస్తాము, ఇది ఇస్తాము అని చెబుతున్నారు. ఈ మధ్యలో నేను ఒక కార్టూన్ చూశాను. ఆ కార్టూన్ లో రాజ కీయ నాయకుడు ఒక బోర్డు మెడలో తగిలించుకొంటాడు. ‘తిండి, ఇల్లు అన్నీ ఫ్రీ, పనిలేకున్నా పది వేల జీతం, మా పార్టీకే ఓటెయ్యండి, పార్టీ గుర్తు ‘చెవిలో పువ్వు’ అధికారం కోసం అన్నీ ఫ్రీ గా ఇస్తాము అనే నాయకులు ఇప్పుడు పెరిగిపోయారు. వాళ్ళు ప్రజల చెవుల్లో పువ్వులు పెడుతున్నారు. శక్తికి మించిన వాగ్దానాలు
చేస్తున్నారు. ప్రభుత్వ ఖజానా మొత్తం ఖాళీ చేసినా ఆ వాగ్దానాలు తీర్చలేరు. ఈ రోజు అమెరికా గవర్నమెంట్ దివాళా తీసింది. సంక్షేమ పథకాల పేర అక్కడ రాజకీయ నాయకులు విపరీతముగా ఖర్చు పెట్టి ఆ దేశాన్ని సంక్షోభములోకి నెట్టివేశారు.
ఈ రోజు అమెరికా ప్రభుత్వం అప్పు 22 ట్రిలియన్ డాలర్లు. అంటే 1526 లక్షల కోట్లు. ఊహకంద నంత డబ్బు.1526 లక్షల కోట్ల అప్పుల ఊబిలో ఆ దేశం కూరుకుపోయింది. ఆ పరిస్థితి భారత దేశానికి రాకూడదని కోరుకొందాము. మానవులు ఎన్నో వాగ్దానాలు చేస్తారు, అవి తీర్చటానికి వారి ఖజానాల్లో అంత డబ్బు లేదు. అయితే దేవుడు చేసే వాగ్దానాలు వేరు. ఆయన ఖజానా నిండుగా ఉంది, ఆయన ఖజానా ఎంతో సమృద్ధిగా ఉంది.ఆయన ఖజానా విస్తారముగా ఉంది. యేసుక్రీస్తు ద్వారా దేవుడు ఆ ఖజానాను మనకు అందుబాటులోకి తెచ్చ్చాడు.మనం చేసే పొరపాటు ఏమిటంటే, దేవుడు ఏర్పాటుచేసిన సమృద్ధి మనం మరచిపోతాము. అపోస్తలుడైన పౌలు ఇక్కడ అదే మనకు బోధిస్తున్నాడు.
నా సువార్త ప్రకారము,
దావీదు సంతానములో పుట్టి
మృతులలో నుండి లేచిన
యేసుక్రీస్తును
జ్ఞాపకము చేసికొనుము.
2 తిమోతి 2:8
ఈ ఈస్టర్ సమయములో యేసు క్రీస్తును జ్ఞాపకం చేసుకోండి. మృతులలో నుండి లేచిన యేసు
క్రీస్తును మీరు జ్ఞాపకం చేసుకోండి. ప్రభువైన యేసు క్రీస్తుకు అనేక పేరులు బైబిల్ లో ఇవ్వబడ్డాయి.
ఆయన మన ఆది, అంతము
ఆయన మన జీవాహారము
ఆయన మన మూల రాయి
ఆయన మన గొఱ్ఱెల కాపరి
ఆయన మన మంచి కాపరి
ఆయన మన ప్రధాన కాపరి
ఆయన మన ఇమ్మానుయేలు
ఆయన మన ప్రధాన యాజకుడు
ఆయన మన రక్షకుడు
ఆయన మన విమోచకుడు
ఆయన మన మధ్యవర్తి
ఆయన మన ప్రవక్త
ఆయన మన పరమ వైద్యుడు
ఆయన మన ఆల్ఫా, ఒమేగా
ఆ మృతులలో నుండి లేచిన యేసు క్రీస్తును జ్ఞాపకము చేసుకో అని పౌలు తన శిష్యుడైన తిమోతికి ఉపదేశిస్తున్నాడు. దావీదు సంతానంలో ఆయన పుట్టాడు. ఆదికాండము 49 అధ్యాయము మనం ధ్యానం చేసినప్పుడు ఇశ్రాయేలు 12 గోత్రములకు దేవుడు వారి తండ్రి అయిన యాకోబు ద్వారా చేసిన ప్రవచనాలు మనం చూశాము. పాత నిబంధనలో అనేక ప్రవచనాలు దేవుడు ముందుగా ప్రవక్తల ద్వారా తెలియజేశాడు.
యేసు క్రీస్తు యూదా గోత్రములో జన్మిస్తాడు.
ఆయన యాకోబులో ఉదయించే నక్షత్రం.
ఆయన బేత్లెహేము గ్రామములో జన్మిస్తాడు.
ఆయన దాసుని రూపము ధరిస్తాడు.
ఆయన గలిలయ ప్రాంతములో సేవ చేస్తాడు.
ఆయన అద్భుతాలు చేస్తాడు.
ఆయన తిరస్కరించబడుతాడు.
ఆయన శ్రమపెట్టబడి, సిలువ వేయబడుతాడు.
ఆయన సమాధి చేయబడి, తిరిగిలేస్తాడు.
ప్రవక్తలు చేసిన అనేక ప్రవచనాలు యేసుక్రీస్తు ప్రభువు జీవితములో నెరవేరినాయి.
దావీదు యేసు క్రీస్తు గురించి చేసిన ప్రవచనం కీర్తనల గ్రంథము 16 అధ్యాయములో మనం చదువుతాము. 16 కీర్తన, 10 వచనం మనం చూద్దాము.
ఎందుకనగా నీవు నా ఆత్మను
పాతాళములో విడచిపెట్టవు
నీ పరిశుద్ధుని కుళ్లుపట్టనియ్యవు
16 కీర్తన, 10 వచనం
ఆ మాటలు మీరు దయచేసి గమనించండి.దావీదు ఏమంటున్నాడంటే, దేవుని యొక్క పరిశుద్ధుడు కుళ్లుపట్టడు. దావీదు ఈ మాటలు తన గురించి వ్రాసుకోలేదు.అందరి లాగానే ఆయన సమాధిచేయబడి, క్షీణించిపోయాడు. ఈ మాటలు దావీదు యేసు క్రీస్తు గురించి వ్రాశాడు. కుళ్లుపట్టకుండా సమాధిని జయించి తిరిగి లేచిన దేవుని యొక్క పరిశుద్ధుడు ప్రభువైన యేసు క్రీస్తే. ఒక ఖాళీ సమాధిని ఆయన మన మధ్య వదలి పరలోకానికి వెళ్ళాడు. యెరూషలేములో Church of the Holy Sepulchre లో ఇప్పటికి కూడా ఆ ఖాళీ సమాధిని మనం చూడవచ్చు. క్రైస్తవులకు అతి ముఖ్యమైన పుణ్యక్షేతము అదే.
ప్రభువైన యేసు క్రీస్తు యొక్క ఖాళీ సమాధి.
The Empty Tomb ఖాళీ సమాధి.
ఈ empty tomb దగ్గరకు రాకపోతే మీ జీవితం ఎప్పటికీ empty గానే ఉంటుంది.
ఈ ఖాళీ సమాధి దగ్గరకు రాకపోతే మీ జీవితం ఎప్పటికీ ఖాళీగానే ఉంటుంది.
ఈ ఖాళీ సమాధి దగ్గరకు రాని వారి జీవితాలను సాతానుడు తన చెత్తతో నింపివేస్తున్నాడు.ఈ మధ్యలో ఒకాయన నన్ను అడిగాడు.గంజాయి త్రాగవచ్చా? గంజాయి ఆరోగ్యానికి మంచిదేనా? అని అడిగాడు. ఆయన ఆ ప్రశ్న ఎందుకు అడిగాడంటే, ఈ మధ్యలో కొంత మంది స్వార్థపరులు ఒక దుష్ప్రచారము మొదలుపెట్టారు.ఆరోగ్యానికి గంజాయి మంచింది. Medical Marijuana అని పేరుపెట్టారు. ఏదన్నా అమ్ముకోవాలంటే ముందు ‘మెడికల్’ అని తగిలిస్తున్నారు. ఈ గంజాయి వ్యాపారులు ఆరోగ్యము కోసం గంజాయి త్రాగండి అని ప్రజల డబ్బులు దోచుకొంటున్నారు.చాలా మందికి గంజాయి త్రాగి ఉన్న ఆరోగ్యము కూడా పోతున్నది. ఈ ఖాళీ సమాధి దగ్గరకు రాని వారి ఖాళీ హృదయాలను సాతానుడు తన దగ్గర ఉన్న చెత్త, చెదారముతో నింపివేస్తాడు. విశ్వాసులు కూడా జాగ్రత్తగా ఉండాలి.
మృతులలో నుండి లేచిన
యేసుక్రీస్తును జ్ఞాపకము చేసికొనుము.
ఒక విశ్వాసికి పౌలు ఈ మాటలు వ్రాశాడు.ఎందుకంటే మన బలహీనతలలో ఒకటి మతిమరుపు. అపొస్తలుడైన పౌలు ఇటలీ లోని రోమ్ నగరములో ఈ మాటలు వ్రాశాడు. ఆ సమయములో రోమ్ నగరములో నీరో చక్రవర్తి గా ఉన్నాడు.నీరో తనకు ఒక పెద్ద విగ్రహం కట్టుకున్నాడు. Domus Aurea అని ఒక చక్కటి ప్యాలస్ కట్టుకున్నాడు. దానికి Domus Aurea అంటే బంగారపు ఇల్లు అని పేరు పెట్టుకొన్నాడు. ఆ ప్యాలస్ కి దగ్గరలోనే అపొస్తలుడైన పౌలు ఒక చెఱసాలలో కూర్చొని ఈ మాటలు వ్రాశాడు. బంగారపు ఇంటిలో కూర్చొని ఈ మాటలు వ్రాయడం తేలికే. అయితే ఒక చెఱసాలలో కూర్చొని ఈ మాటలు వ్రాశాడు. రోమ్ నగరం వెళ్ళినప్పుడు నేను కూడా ఆ చెఱసాల దగ్గరకు వెళ్ళాను. Memartine Prison అని దానికి పేరు. చాలా చిన్న గది. చీకటిలో దోమలు, పురుగులు వస్తా ఉన్నాయి. అటువంటి చెఱసాలలో చలిలో కూర్చొని పౌలు తిమోతికి ఈ మాటలు వ్రాశాడు.
తిమోతీ, మృతులలో నుండి లేచిన యేసుక్రీస్తును జ్ఞాపకము చేసికొనుము.
యేసు క్రీస్తు మృతులలో నుండి లేచిన సజీవుడైన దేవుడు. ఆ సత్యాన్ని గుర్తుపెట్టుకొంటే మీరు ఎంతటి కష్టాన్నయినా ఓర్చుకోవచ్చు.ఆ సత్యాన్ని గుర్తుపెట్టుకొంటే మీరు ఎంతటి నష్టాన్ని అయినా ఓర్చుకోవచ్చు. ఆ సత్యాన్ని గుర్తుపెట్టుకొంటే మీరు ఎంత బాధ నైనా, ఎంత ఎడబాటైనా, ఎంత అవమానమైనా ఎంత నిందయినా ఓర్చుకోవచ్చు.
ఈ మధ్యలో నేను ఒక కారులో డ్రైవ్ చేసుకొంటూ హైవే మీద వెళ్తున్నాను. కాసేపటి తరువాత హైవే కొండలమీదకు వెళ్ళింది.చుట్టూ పెద్ద లోయలు ఉన్నాయి. అప్పుడు వర్షం మొదలయ్యింది. అది ఒక పెద్ద తుఫానులాగా మారింది. నా కారు ముందుకు వెళ్లలేని పరిస్థితి కలిగింది. ముందు ఏమిఉందో కూడా కనిపించని పరిస్థితి నాకు కలిగింది. నా కారు మీద నాకే కంట్రోల్ లేదు. ఈ లోయలో పడతానో అని భయం వేసింది. నా కారు మీదే నాకు కంట్రోల్ పోయింది, దేవా నన్ను కాపాడు అని ప్రార్ధన చేసుకొన్నాను. దేవుడు నన్ను ఆ తుఫానులో నుండి కాపాడాడు.తుఫాను కావాలని నేను కోరుకోలేదు, తుఫాను వస్తుందని తెలిస్తే ఆ వైపుకు వెళ్ళేవాణ్ణే కాదు, ఇంట్లోనే కూర్చొనేవాణ్ణి. అయితే జీవితములో మనకు తుఫానులు వస్తాయి, వాటిని మనం ఆపలేము. మన జీవితము, మన పరిస్థితుల మీద మనకు కంట్రోల్ ఉండదు.
పౌలుకు అలాంటి పరిస్థితే కలిగింది. నీరో ఆయనను చెరసాలలో వేసి బంధించాడు. పౌలు నిరుత్సాహపడివుండొచ్చు.నీరో, ఒక దుష్టుడు బంగారపు ఇంటిలో కూర్చొని వెండి గిన్నెలో భోజనం తింటుంటే, ఇక్కడ నేను చెరసాలలో కూర్చుని జైలు కూడు తింటున్నాను అని తన హృదయములో దేవుని మీద నోచుకోలేదు, కృంగిపోలేదు. మృతులలో నుండి లేచిన యేసు లేచిన యేసు క్రీస్తును జ్ఞాపకం చేసుకొన్నాడు. యేసుక్రీస్తు తనకు ఇచ్చిన గొప్ప దర్శనాన్ని, ఆయన యొక్క మహిమ ప్రత్యక్షతను
గుర్తుచేసుకున్నాడు.ఈ ఈస్టర్ సమయములో మీరు అటువంటి పరిస్థితిలో ఉండి ఉండవచ్చు.
ఆర్ధిక స్థితిమీద కంట్రోల్ పోయిన వాళ్ళు ఉన్నారు.
ఆరోగ్యం మీద కంట్రోల్ పోయిన వాళ్ళు ఉన్నారు.
పిల్లల మీద కంట్రోల్ పోయిన వాళ్ళు ఉన్నారు.
ఉద్యొగము మీద కంట్రోల్ పోయిన వాళ్ళు ఉన్నారు.
వివాహం మీద కంట్రోల్ పోయిన వాళ్ళు ఉన్నారు.
అయితే మీరు చింతించి, కృంగిపోయి డిప్రెషన్ లోకి వెళ్లిపోవలసిన అవసరం లేదు.
-మీ కోసం మృతులలో నుండి లేచిన యేసు క్రీస్తును జ్ఞాపకం చేసుకోండి.
-మీ కోసం సిలువ మీద ప్రాణం పెట్టిన యేసు క్రీస్తును జ్ఞాపకం చేసుకోండి.
-మీ విమోచన కోసం సిలువ మీద తన రక్తం చిందించిన యేసు క్రీస్తును జ్ఞాపకం చేసుకోండి.
-మీ కోసం పరలోకములో ఒక అందమైన భవంతిని నిర్మిస్తున్న యేసు క్రీస్తును జ్ఞాపకం చేసుకోండి.
-మీ కోసం త్వరలో తిరిగిరాబోవుచున్న యేసు క్రీస్తును జ్ఞాపకం చేసుకోండి.
-మీ కోసం మరణపు ముల్లును విరిచివేసిన యేసు క్రీస్తును జ్ఞాపకం చేసుకోండి.
-మీరు రక్షణ పొందిఉండక పొతే ఆయన సిలువ దగ్గరకు వచ్చి క్షమాపణ అడగండి.
మీ మధ్యలో జలియన్ వాలా బాగ్ సంఘటన మనం గుర్తుచేసుకొన్నాము. 1919 లో సరిగ్గా వంద సంవత్సరాల క్రితం ఆ ఘోరం జరిగింది. స్వాతంత్రం కోసం భారతీయులు పంజాబ్ లోని అమృతసర్ పట్టణములో ఒక మైదానములో ధర్నా చేస్తూఉన్నారు. బ్రిటిష్ జనరల్ డయ్యర్ తన సైనికులను అక్కడకు పంపించాడు.వారు విచక్షణారహితముగా భారతీయుల మీద కాల్పులు జరిపారు. 1000 మందికి పైగానే అమాయక ప్రజలు ప్రాణాలు కోల్పోయారు. బ్రిటిష్ ప్రభుత్వం గత వంద సంవత్సరాలుగా అనేక సార్లు ఆ సంఘటన పట్ల విచారం వ్యక్తం చేసింది. అయితే ఒక్కసారి కూడా భారతీయులను క్షమాపణ అడుగలేదు. జరిగిన దానికి చింతిస్తున్నాము, బాధ పడుతున్నాము, విచారిస్తున్నాము అంటున్నారే కానీ, ‘క్షమించండి’ అని అడగటానికి వారికి నోరు రావటల్లేదు.అహం అడ్డొచ్చి క్షమాపణ అడుగ లేకపోవుచున్నారు. సిలువ దగ్గర చాలా మంది ఆవిధముగానే ప్రవర్తిస్తారు. యేసు క్రీస్తును సిలువ మీద చూసి బాధ పడుతారు. చింతిస్తారు, విచార పడుతారు.‘నా పాపము వలనే ఆయన శిక్షించబడ్డాడు. దేవా, నా పాపములు క్షమించు అని మాత్రం అడుగరు.
ప్రభువైన యేసు క్రీస్తు సిలువ దగ్గర దేవుడు మనకు పాప క్షమాపణ అనుగ్రహించాడు. ఆయన ఖాళీ సమాధి దగ్గర మనకు నిత్యజీవాన్ని, నిరీక్షణను అనుగ్రహించాడు. అదే నేటి మా ప్రేమ సందేశం.