అంత్య క్రీస్తు స్వభావము, పాలన

antichristsatanworld.jpg

ప్రభువయిన యేసు క్రీస్తు రెండవ రాకడకు ముందు, తన ఉక్కు పిడికిలితో  ఈ ప్రపంచాన్ని అణువణువునా నిరంకుశత్వముతొ శాసించబోయే ఒక మహా నియంత గురించి బైబిలు ప్రవచనాలు హెచ్చరిస్తున్నాయి. నెబుకద్నెజరు నుండి నెపోలియన్ వరకు ఈ ప్రపంచం ఎంతో మంది నియంతలను చూసింది. కాని, రాజ్యాధికారాన్ని తన పాదాక్రాంతం చేసుకోవటములో, వ్యవస్థ లను తన కనుచూపుతోనియంత్రించడములో, ప్రపంచ ప్రజలను తన సమ్మోహన శక్తితో మభ్య పెట్టడములో వారందరూ అతని ముందు దిగదుడుపే.   ఇప్పటి వరకూ చరిత్ర చూసిన నియంతలు ఒక దేశానికో,ఒక ఖండానికో పరిమిత మయ్యారు, కాని ఈ మహా నియంత ప్రపంచ దేశాలన్నింటిని శాసిస్తాడు. రాజకీయ వ్యవస్థలతో పాటు, ఆర్ధిక,సామాజిక,

విద్య, వైద్యం, ఆహారం, మతం మొదలగు అన్ని వ్యవస్తలనూ తన గుప్పిట బిగిస్తాడు. ప్రభువైన యేసు క్రీస్తు తో పాటు, బైబిలు లోని ముఖ్య మయిన ప్రవక్త లందరూ ఇతని గురించి తెలియజేసారు.

   ఈ మహా నియంత కు  బైబిలులో అనేక పేరులు వున్నాయి. ‘పేరులో ఏముంది’ అంటారు కానీ,

అతని స్వభావము ఎలా వుంటుందో, అతని క్రియలు ఎలా ఉంటాయో అతని పేరులే చెబుతాయి.

 1. పాపపురుషుడు (2 థెస్సలొనీక 2:3)
 2. నాశన పాత్రుడు (2 థెస్సలొనీక 2:3)
 3. ధర్మవిరోధి (2 థెస్సలొనీక 2:8)
 4. ఒక చిన్న కొమ్ము (దానియేలు 7:8)
 5. వచ్చునట్టి రాజు (దానియేలు 9:26)
 6. ఇష్టానుసారముగా జరిగించే రాజు (దానియేలు 11:36)
 7. బుద్ధిలేని, పనికిమాలిన కాపరి (జెకర్యా 11:15-17)
 8. క్రూరమృగము (ప్రకటన 11:7)
 9. క్రీస్తు విరోధి (1 యోహాను 2:18)
 10. మాగోగు దేశపువాడగు గోగు, రోషు, మెషెకు,తుబాలుకు అధిపతి (యెహేజ్కేలు 38:2)

   ఒక దేశంలో కాని, ప్రపంచములో కాని ఏర్పడే సంక్షోబాన్ని స్వప్రయోజనాలకు వాడుకొనుట నియంతలకు వెన్నతో పెట్టిన విద్య. యూరప్ లో ఫ్రెంచ్ విప్లవము మిగిల్చిన గందరగోళాన్ని,

నెపోలియన్ తన నిరంకుశత్వానికి దారిగా మార్చుకొన్నాడు. మొదటి ప్రపంచ యుద్ధం తరువాత జర్మనీ లో మిగిలిన ఆవేదన రగిల్చిన మంటల్లో, చలి కాచుకొంటూ, చివరకు ప్రపంచం మొత్తాన్ని ప్రత్యక్షముగా, పరోక్షముగా దహించిన నాజీ సామ్రాజ్యాన్ని ఏర్పరిచాడు.  చైనా లో మాంచు సామ్రాజ్యం కూలిన తరువాత,1919 ‘కొత్త సాంస్కృతిక ఉద్యమం’ మిగిల్చిన నిరాశా, నిస్పృహలను ఆసరాగా చేసుకొని మావ్ జిడాంగ్ తన నిరంకుశ పాలన కట్టుకొన్నాడు.  ఆ కాలములోనే, జార్ చక్రవర్తుల పాలన రష్యా దేశములో మిగిల్చిన నైరాశ్యము ను లెనిన్ వంటి కమ్యూనిస్టులు తమ ఏక చత్రాధిపత్యానికి మార్గముగా మార్చుకొన్నారు. క్రీస్తు విరోధి కూడా, యుద్దాలు, అశాంతి తో ఉడిగిపోయి, విసిగిపోయి ఉన్న ఆధునిక ప్రపంచాన్ని శాంతి పేరుతొ కల్లబొల్లి కబుర్లు చెప్పి, తన వశం చేసుకొంటాడు.

  దేవుని యొద్ద నుండి నరావతారములో వచ్చిన వాడు ప్రభువయిన యేసు క్రీస్తు కాగా, సాతాను యొద్ద నుండి నరావతారములో వచ్చేవాడు ఈ అంత్య క్రీస్తు.

ఈ అంత్య క్రీస్తు లేక క్రీస్తు విరోధి గురించి ఈ రోజు కొన్ని సంగతులు చూద్దాము.

పాప పురుషుడు ఎప్పుడు బయలు పడతాడు?

2 థెస్సలొనీక 2:3 లో ఒక వచనము చూద్దాము

‘మొదట భ్రష్టత్వము సంభవించి నాశన పాత్రుడగు పాపపురుషుడు బయలుపడితేనే గాని ఆ దినము రాదు’.

                         2 థెస్సలొనీక 2:3

మొదటి శతాబ్దములో థెస్సలొనీక సంఘము వారు క్రీస్తు నామము నిమిత్తము చాలా

శ్రమపెట్టబడ్డారు. యేసు ప్రభువు రెండవ రాకడ లో తాము ఎత్తబడలేదని, తామంతా ఏడేండ్ల శ్రమల కాలములో ప్రవేశించామని వారు చాలా వ్యధ చెందారు. ఉగ్రత దినమయిన  ప్రభువు దినము (ది డే అఫ్ ది లార్డ్/the Day of the Lord ) తమ మీదకు ముంచుకొస్తున్నదని వారు బెంబేలెత్తారు.ఆ సమయములో వారి అనుమానాలు నివృత్తి చేసి, వారు ఆందోళన చెందకుండా చేయాలని

అపోస్తలుడయిన పౌలు వారికి ఒక పత్రికను వ్రాసాడు. ‘మొదట భ్రష్టత్వము సంభవించి నాశన పాత్రుడగు పాపపురుషుడు బయలుపడితేనేగాని ఆ దినము రాదు’ అని వారికి స్పష్టము చేశాడు.

ప్రభువు దినము రాకమునుపు రెండు ఘటనలు జరుగుతాయి.

 1.  భ్రష్టత్వము సంభవిస్తుంది
 2. నాశన పాత్రుడగు పాపపురుషుడు బయలుపడతాడు

దీనినిబట్టి, ప్రభువు దినమునకు ముందే పాపపురుషుడు బయలుపడతాడు.

మొదట భ్రష్టత్వము సంభవిస్తుంది. భ్రష్టత్వము అనగా మొదట ఉన్న విశ్వాసమును కోల్పోవుట. ఆఖరి రోజులలో భ్రష్టత్వము విపరీతముగా పెరిగిపోతుంది. భ్రష్టత్వము మనిషి యొక్క స్వార్ధములొ నుండి పుడుతుంది. దేవుని ఆజ్ఞల కంటే, తన ఇష్టా ఇష్టాలే ముఖ్యమైనవని భావించి మనుష్యులు దేవుని వాక్యమును విసర్జించుట వలన కలిగేదే భ్రష్టత్వము. భ్రష్టత్వము ఆది నుండి ఉన్నప్పటికీ, క్రీస్తు విరోధి కాలములో అది పరాకాష్టకు చేరుకొంటుంది.

‘ఏది దేవుడనబడునో, ఏది పూజింపబడునో, దాని నంతటిని ఎదిరించుచూ, దానికంతటికి పైగా

వాడు తన్నుతానే, హెచ్చించు కొనుచు, తాను దేవుడనని తన్ను కనుపరచుకొనుచు, దేవుని ఆలయములో కూర్చుండును’ (2 థెస్స 2:4).

కాబట్టి, క్రీస్తు విరోధి బ్రష్టత్వానికి పరిపూర్ణ రూపముగా మారతాడు. సరా సరి వెళ్లి, యెరూషలేములో నిర్మించబోయే దేవుని ఆలయములో కూర్చుంటాడు. అతడు ఎంతటికి తెగిస్తాడో చూడండి:

‘ఏది దేవుడనబడునో, ఏది పూజింపబడునో, దాని నంతటిని ఎదిరించుచూ, దానికంతటికి పైగా వాడు తన్నుతానే, హెచ్చించు కొనుచు…..

  కొంత కాలము క్రితము నేను హవాయి దీవులలోని బిగ్ ఐలాండ్ కి వెళ్ళాను. కారులో డ్రైవ్ చేసుకొంటూ వెళ్తున్నాను. రోడ్డు ప్రక్కన కొబ్బరి కాయల షాపు కనిపించింది.కొబ్బరి నీరు త్రాగుదామని కార్ రోడ్డు ప్రక్కన ఆపి షాపు లోకి వెళ్ళాను. షాపు యజమానిని అడిగాను: ‘ఈ దీవులకు ఎప్పుడు, ఎందుకు వచ్చావు?’

     నా స్నేహితురాలు కాన్సర్ తో భాధపడుచున్నప్పుడు ఆమె  పిలుపు అందుకొని ఇక్కడకు వచ్చాను అన్నాడు. ‘ఇప్పుడు నీ జీవితము ఎలా ఉంది?’ అని అడిగాను. ‘చాలా బావుంది, ఇక్కడ 40 ఎకరాలు పొలము కొన్నాను. దగ్గరలోని అగ్ని పర్వతాలు ప్రేలి లావా బయటకు వస్తున్నది. ప్రజలు దాని నుండి పారి పోవుచూ ఈ వైపుకు వస్తున్నారు. వారికి నా పొలాలు అమ్మి, లాభాలు పొందాలని చూస్తున్నాను’

    ‘ఇది నాకొక ఆత్మీయ ప్రయాణము.లావా చెడ్డవారిని తొలగిస్తుంది, మంచి వారికి భూమి ఇస్తుంది.లావా ఒక శక్తి’ అన్నాడు.

   అతనికి ఒక ప్రశ్న వేశాను. ‘దేవుణ్ణి నమ్ముతావా?’. అతడు సమాధానం చెప్పాడు: ‘దేవుడు అంటే నాకు నమ్మకము ఉంది. కానీ దేవుడు యేసు క్రీస్తు గా లేక మొహమ్మద్ గా, లేక బుద్ధుడు గా వచ్చాడంటే నమ్మను’

   నేను అతనికి చెప్పాను. ‘నువ్వు అగ్ని పర్వతాలు, లావా ఇక్కడ చూస్తున్నావు. ప్రకృతిలో ఎంతో శక్తి ఉంది. ఆ ప్రకృతి మీద తన శక్తిని చూపించిన వాడు యేసు క్రీస్తు. ప్రకృతి ని మనము ఆరాధించకూడదు, ఆ ప్రకృతిని సృష్టించిన దేవుని ఆరాధించాలి’

   అతను నా వైపు చూసి, ‘నీవు క్రైస్తవుడివా?’ అని అడిగాడు. ‘అవును’ అని చెప్పాను. అప్పుడు అతను ఏమన్నాడంటే, ‘నేను లూసియానా రాష్ట్రము నుండి వచ్చాను. మా అమ్మ నాకు చిన్నతనములో యేసు క్రీస్తు గురించి ఎన్నో విషయాలు చెప్పేది. కొంత కాలము నేను కూడా ఆయనను నమ్మాను. ఇప్పుడు విశ్వాసము నుండి తొలగిపోయాను. యేసు క్రీస్తు చాలా కష్టము (Jesus is difficult for me)’

  నేను అతనితో చెప్పాను: ‘నీవు యేసు క్రీస్తును నమ్ముకో. నీ పాపములు ఒప్పుకొని ఆయన ఇచ్చే క్షమాపణ పొందు.అప్పుడు నువ్వు పరలోకము వెళ్తావు.మీ అమ్మను తిరిగి చూస్తావు’

అతను నాకు ఏమీ సమాధానము ఇవ్వలేదు. ‘మీ అమ్మ దేవుని దగ్గరకు తిరిగి రమ్ము’ అని నవ్వుతూ అతనికి చెప్పాను. తల్లి చెప్పిన యేసు ప్రభువును మరచిపోయి ఈ వ్యక్తి ప్రకృతినే తల్లిగా కొలుస్తున్నాడు.

 బిగ్ ఐలాండ్ లో నేను గొప్ప దేవుని సృష్టిని చూశాను.

చక్కటి నీలి రంగులో మెరిచే మహా సముద్రం చుట్టూ ఉంది

పెద్ద పెద్ద అలలు తీరములోని కొండ రాళ్లను ఢీకొట్టుచూ పెద్ద ఘోషను కలిగిస్తున్నాయి.

వీధులలో సునామీ హెచ్చరికలు బోర్డుల మీద వ్రాసి ఉన్నాయి

పెద్ద పెద్ద అగ్నిపర్వతాలను అక్కడ చూశాను

వాటిలో నుండి లావా బయటకు వచ్చి భూమిని కంపించటము చూశాను

నల్లటి పొలాల్లోఅరటి తోటలు, పైన్ ఆపిల్ చెట్లు, జామ తోటలు, కొబ్బరి తోటలు చూసాను.

లావా వందల మైళ్ళ ప్రాంతాన్ని కబళించుకొంటూ పోతున్నది.

వాటిని చూసు కొంటూ వెళ్ళుచూ నేను దేవుని ఆరాధించాను. ఇలాంటి గొప్ప భూగోళాన్ని సృష్టించిన దేవుని శక్తిని తలపోశాను. వాటిని చూసిన కొబ్బరి కాయల షాప్ యజమాని మరొక వైపుకు వెళ్ళాడు.

సృష్టికర్తను మరచిపోయి సృష్టిని ఆరాధించుట మొదలు పెట్టాడు. చిన్నప్పుడు అతని తల్లి క్రీస్తు గురించి చెప్పిన సత్యాలు వదలివేసి భ్రష్టుడై పోయాడు.

  తమ పాప జీవితములో కొనసాగుటకు గాను ఇంతకు ముందు నమ్మిన సత్యాలను వదలి వెళ్ళుటయే భ్రష్టత్వము. యూదా పత్రికలో మనము ఈ భ్రష్టత్వము గురించి చదువుతాము.

కయీను దేవుని మార్గము వదలి తన మార్గములో వెళ్ళాడు.కోరహు మోషే మీద తిరగబడ్డాడు.బిలాము నాలుగు డబ్బులు కోసము సత్యాన్ని అమ్ముకున్న అల్ప ప్రాణిగా మిగిలిపోయాడు.

  దేవుడు ఆదేశిస్తే సముద్రము సిద్ధముగా ఉంది, ఆయన ఆదేశిస్తే అగ్ని పర్వతాలు ప్రేలిపోతాయి, ఆయన ఆదేశిస్తే సూర్యుడు భగ్గుమంటానికి సిద్ధముగా ఉన్నాడు, ఆయన ఆదేశిస్తే నరకము నోరు తెరుస్తుంది, అటువంటి మహా దేవుని ముందే పిడికిలి బిగించటానికి పాపాత్ములు తెగిస్తారు. అటువంటి అవిధేయతకు పరాకాష్ట క్రీస్తు విరోధిలో కనిపిస్తుంది.

   ప్రభువయిన యేసు క్రీస్తు సంపూర్ణముగా ముగించిన రక్షణ కార్యమును ఇహలోక సంబంధమయిన మత వ్యవస్థ ససేమిరా వప్పుకోదు. ఆది నుండి ఈ మత వ్యవస్థ సువార్తికులను హింసిస్తూనే వున్నది.కడవరి దినాల్లో ఈ మత వ్యవస్థ మరింత బరితెగిస్తుంది. ప్రకటన గ్రంథములో ఇది ‘పరిశుద్ధుల రక్తముచేతను, యేసుయొక్క హతసాక్షుల రక్తముచేతను మత్తిల్లిన’ మహావేశ్య గా పిలువబడింది.

సత్యాన్ని పూర్తిగా విస్మరించి, విసర్జించి ఈ వేశ్య పూర్తిగా భ్రష్టత్వములో మునిగిపోతుంది. అంత్య క్రీస్తు ఈ వ్యవస్థ లోనుండే జన్మిస్తాడు. ‘వెలుగుదూత వేషము ధరించుకొని’ ఇంతవరకు ప్రపంచాన్ని మోసం చేసిన సాతాను పంపే ప్రత్యేక వ్యక్తి ఈ పాప పురుషుడు.

  సాతాను దగ్గర నుండి వస్తాడు కాబట్టి ఈ క్రీస్తు వ్యతిరేకి వికృతమైనరూపములో ఉంటాడు అని మనము అనుకోకూడదు. కన్నులకు అందముగా చూపించి మనుష్యులను వెన్నుపోటు పొడవడము సాతానుకు వెన్నతో పెట్టిన విద్య.ఏదెను వనములోనే సాతాను ఆ మోసము ను ఉపయోగించాడు. క్రీస్తు విరోధి కూడా తన అందంతో ప్రజలను ఆకర్షించే సమ్మోహన శక్తి కలిగి ఉంటాడు.

  పాప పురుషుని లోకం మీదకు వదలాలని సాతానుడు ఎంతో కాలం నుండి తాపత్రయ పడుచున్నాడు. అయితే దేవుడు తన ప్రవచన క్యాలెండర్ కు అనుగుణముగా పాప పురుషుడు బయలు పడకుండా అడ్డు కుంటున్నాడు.

2 థెస్సలొనీ 2:7-8 లో ఒక మాట చూద్దాము.

‘అడ్డగించుచున్నవాడు మధ్యనుండి తీసి వేయబడు వరకే అడ్డగించును.అప్పుడా ధర్మవిరోధి బయలుపరచబడును’

అడ్డగించుచున్నవాడు పరిశుద్దాత్మ దేవుడు. ఆయన ప్రక్కకు జరిగిన తరువాత, అంత్య క్రీస్తు లోకం మీదకు విరుచుకు పడతాడు. పాప పురుషుడు ఎప్పుడు బయలు పడతాడో,

దానియేలు ప్రవక్త మనకు తెలియ జేశాడు.

“వచ్చునట్టి రాజు….. ఒక వారమువరకు అనేకులకు నిబంధనను స్థిరపరచును; అర్ధవారమునకు బలిని నైవేద్యమును నిలిపివేయును హేయమైనది నిలుచువరకు నాశనము చేయువాడు వచ్చును నాశనము చేయువానికి రావలెనని నిర్ణయించిన నాశనము ముగించువరకు ఈలాగున జరుగును”.

                                                                                        (దానియేలు 9: 26-27)

ఇక్కడ ‘వచ్చునట్టి రాజు’ అనగా అంత్య క్రీస్తు. దానియేలు 9 వ అధ్యాయములో గల ‘డెబ్బది వారములప్రవచనము’ లో చివరి వారము డెబ్బైయవ వారము.  దేవుని ప్రవచన క్యాలెండర్ లో 69 వారములుగడచిపోయినవి. ఇంకొక వారము మాత్రమే మిగిలివున్నది. ప్రస్తుతము మనము 69 వారము ముగింపుకు, 70 వ వారము ప్రారంభమునకు మధ్య ఉన్నాము. ఈ డెబ్బైయవ వారము 7 సంవత్సరముల ‘శ్రమల కాలము’.

    అంత్య క్రీస్తు ఈ 7 సంవత్సరములు యూదులతో నిబంధన చేసుకొంటాడు. అతడు చెప్పే కల్లబొల్లికబుర్లు నమ్మి, యూదులు అతనితో శాంతి ఒప్పందం కుదుర్చుకొంటారు. దేవుని యొద్ద నుండివచ్చిన నిజమయిన రక్షకుడు, ఇశ్రాయేలు అధిపతిగా ఉండుటకు వచ్చిన నిజమయిన దావీదు రాజ కుమారుడు ప్రభువైనయేసు క్రీస్తును యూదులు తిరస్కరించారు. వారు ఆయనను విసర్జించుట చూచి ఆయన హృదయము ఘోషించింది. “యెరూషలేమా, యెరూషలేమా, ప్రవక్తలను చంపుచును నీయొద్దకు పంపబడినవారిని రాళ్లతో కొట్టుచును ఉండు దానా, కోడి తన పిల్లలను రెక్కలక్రింది కేలాగు చేర్చు కొనునో ఆలాగే నేనును నీ పిల్లలను ఎన్నోమారులు చేర్చు కొనవలెనని యుంటిని గాని మీరుఒల్లకపోతిరి” అని ప్రభువు యెరూషలేము తనను నిరాకరించడము చూసి కన్నీరు పెట్టాడు.

    నిజ రక్షకుని కాదను కున్న ఇశ్రాయేలు , తమను నిలువునా భక్షించే పాప పురుషుని ఆలింగనం చేసుకొని ఒప్పందం కుడుర్చుకోవటం యూదుల చరిత్ర లో జరగబోయే మరొక విషాద ఘట్టం.

“అర్ధవారమునకు బలిని నైవేద్య మును నిలిపివేయును” : అయితే, అర్ధవారమునకు, అనగా మూడున్నర సంవత్సరముల తరువాత, అతని అసలు స్వరూపం బయటపడుతుంది. నమ్మి ఒప్పందం కుదుర్చుకొన్న యూదుల పట్ల నమ్మక ద్రోహానికి పాల్పడతాడు. ‘హేయమైనది నిలుచువరకు నాశనము చేయువాడు వచ్చును’ దేవుని ఆలయములో  హేయమయినది ప్రతిష్టిస్తాడు. యేసు ప్రభువు కూడా దానియేలు ప్రవక్త చెప్పిన ప్రవచనమును పునరుద్ఘాటించాడు. ఒలీవల కొండ  మీద చేసిన ప్రసంగములో ఆయన చెప్పాడు:  ‘కాబట్టి ప్రవక్తయైన దానియేలుద్వారా చెప్పబడిన నాశనకరమైన హేయవస్తువు పరిశుద్ధస్థలమందు నిలుచుట మీరు చూడగానే..’ (మత్తయి 24:15) నాశనకరమైన హేయవస్తువు – The Abomination of Desolation – అంత్య క్రీస్తు నాశనకరమైన హేయవస్తువు ను పరిశుద్ధస్థలమందు నిలిపిన తరువాత మహా శ్రమల కాలము మొదలవుతుంది. ఆ కాలము యెంత దారుణముగా ఉంటుందో ప్రభువైన యేసు క్రీస్తు హెచ్చరించాడు. “అప్పుడు మహా శ్రమ కలుగును. లోకారంభము నుండి ఇప్పటివరకును అట్టి శ్రమ కలుగలేదు, ఇక ఎప్పు డును కలుగబోదు. ఆ దినములు తక్కువ చేయబడక పోయిన యెడల ఏ శరీరియు తప్పించుకొనడు”

                                                            మత్తయి 24:20-22

పాప పురుషుడు ఎలా ఉంటాడు? ‘’ఈ కొమ్మునకు మానవుల కన్నులవంటి కన్నులును, గర్వముగా మాటలాడు నోరును ఉండెను” (దానియేలు 7:8). క్రీస్తు విరోధి గుణగణాల గురించి మొదటగా మనకు తెలిపిన ప్రవక్త దానియేలు.

మానవుల కన్నుల వంటి కన్నులు: అంత్య క్రీస్తు మానవ ఆకృతి కలిగి ఉంటాడు. అతడు చాలా తెలివి కలవాడై  ఉంటాడు. గర్వముగా మాటలాడు నోరు: చాలా గర్వముతో, అతిశయముతో మాట్లాడుచూ మనుష్యులను లోపరచుకొంటాడు.

పాప పురుషుడు చేసే పనులు ఏమిటి?

పాప పురుషుని చేత ఈ లోక ప్రజలను వంచించ టానికి సాతానుడు ప్రకృతి విరుద్దమయిన తన సమస్త శక్తి యుక్తుల్నీ వినియోగిస్తాడు.

“వారి రాక అబద్ధ విషయమైన సమస్త బలముతోను, నానావిధములైన సూచకక్రియలతోను,

మహత్కార్యములతోను, దుర్నీతిని పుట్టించు సమస్త మోసముతోను, నశించుచున్న వారిలో

సాతాను కనుపరచు బలమును అనుసరించియుండును”

                                                                              2 థెస్సలొనీక 2:9,10

 

నానావిధములైన సూచకక్రియలతో, మహత్కార్యములతో అంత్య క్రీస్తు ప్రపంచ ప్రజలను అబ్బురపరచి

ఆకట్టుకొని లోపరచుకొంటాడు. దేవుడు మాత్రమే కాదు, సాతానుడు కూడా అద్భుత కార్యములు చేయగలడు. అయితే అతని అద్భుతాలు మనుష్యులను మోసము చేయుటకు ఉద్దేశించినవి. వారి కార్యములు ‘దుర్నీతిని పుట్టించు సమస్త మోసముతో’ కూడుకొని వుంటాయి. 

   దేవుని యొద్ద నుండి నరావతారములో వచ్చిన ప్రభువైన  యేసు క్రీస్తు తాను చేసిన సూచకక్రియలు, మహత్కార్యములతో ప్రజలను నిజ దేవుని వైపుకు త్రిప్పగా, సాతాను యొద్ద నుండి

నరావతారములో వచ్చిన క్రీస్తు విరోధి తాను చేసే  సూచకక్రియలు , మహత్కార్యములతో ప్రజలను సాతానుని ఆరాధన కు పురికొల్పుతాడు.

పాప పురుషుడు చేసే మహత్కార్యములు చూసి జనులంతా ఆశ్చర్య పడుచూ అతనికి సాష్టాంగ పడతారు.

భూజనులందరు మృగము వెంట వెళ్ళుచు ఆశ్చర్యపడుచుండిరి.

మరియు వారు ఈ మృగ ముతో సాటి యెవడు?

దానితో యుద్ధము చేయగల వాడెవడు? అని చెప్పుకొనుచు ఆ మృగమునకు

నమస్కా రముచేసిరి. (ప్రకటన 13:3,4)

 

సాతానుడు, అబద్ద ప్రవక్త ల తోడ్పాటుతో అంత్య క్రీస్తు ప్రపంచ మంతటినీ తనను ఆరాధించ వలసినదిగా ఆదేశిస్తాడు. మానవులందరి చేత ఆరాధించ బడ వలెనన్న దురాశ సాతానునికి

ముందు నుండి ఉన్నదే (యెషయ 14:13-14). ఆ కోరికను అంత్య క్రీస్తు రూపములో సాతానుడు కొద్దికాలం తీర్చుకొంటాడు.

   సాతానుడు అబద్ధి కుడు, నర హంతకుడని ప్రభువు మనకు తెలియ చేసాడు:

“ఆదినుండి వాడు నరహంత కుడైయుండి సత్యమందు నిలిచినవాడు కాడు; వానియందు సత్యమేలేదు; వాడు అబద్ధమాడునప్పుడు తన స్వభావము అనుసరించియే మాటలాడును;

వాడు అబద్ధి కుడును అబద్ధమునకు జనకుడునై యున్నాడు” (యోహాను 8:44).

తన గురువు లాగానే, అంత్య క్రీస్తు కూడా తన అబద్దములతో  ‘సర్వలోకమును మోస పుచ్చుచు’ (ప్రకటన 12:9) కోట్లాది మందిని హతమారుస్తాడు. క్రీస్తు విరోధి చాలా శక్తివంతుడు. అమెరికా, భారత్, చైనా ల అధిపతులు చాలా శక్తికలిగిన నాయకులు. అయితే క్రీస్తు విరోధి ముందు వీరు దిగదుడుపే. అతని ముందు వీరు గోళీ కాయలు ఆడుకొనే చిన్నపిల్లల లాంటి వారే.

 అతని శక్తి ఎలా ఉంటుందో దానియేలు ప్రవక్త తెలియజేశాడు.

‘అది సమస్తమును అణగ ద్రొక్కుచు పగులగొట్టుచు లోకమంతయూ భక్షించును’ (దానియేలు 7:23)

  అంత్య క్రీస్తు శక్తి ని నిలువరించే వారు ఎవరూ వుండరు. ఒక పెద్ద బుల్ డోజర్ తన దారి లో ఉన్న

వాటన్ని తిని చితక్కోట్టుకొంటూ ముందుకు సాగినట్లు, పాప పురుషుడు తన కు అడ్డువచ్చిన వారి నందరిని అణగ ద్రొక్కు కొంటూ ముందుకు సాగుతాడు. ప్రపంచమంతటిని తన కాళ్ళ క్రిందకు తెచ్చుకొంటాడు.

‘ఈ కొమ్ము పరిశుద్దులతో యుద్ధము చేయుచూ వారిని గెలుచునదాయెను’

                                                                                             (దానియేలు 7:21)

అంత్య క్రీస్తు కు దేవుని పట్ల తనకు ఉన్న ద్వేషాన్ని ఆయన యొక్క పరిశుద్దులతో యుద్ధం చేయుచూ బహిర్గతం చేస్తాడు. వారి మీద గెలుస్తాడు అంటే అతని యొక్క బలం ఎంతో మనం అర్ధం చేసుకోవచ్చు. అతని విరోధించే దేవుని దాసుల మీద క్రోధముతో విరుచుకుపడతాడు.

‘ఆ రాజు మహోన్నతునికి విరోధముగా మాటలాడుచు మహోన్నతుని భక్తులను నలుగ గొట్టును.

అతడు పండుగ కాలములను న్యాయ పద్దతులను నివారణ చేయబూనుకొనును’.

                                                                                                (దానియేలు 7:25)

అంత్య క్రీస్తు పండుగ కాలములను మారుస్తాడు. అనగా ప్రపంచ మత వ్యవస్థ తన చుట్టూ తిరిగేలా

చూసుకొంటాడు. న్యాయ పద్దతులు మారుస్తాడు: అతనికి ఏ చట్టాల పట్ల కూడా ఎటువంటి

గౌరవము వుండదు. తాను చెప్పిందే వేదం, తన నోటి మాటే చట్టం అన్నట్లు ప్రవర్తిస్తాడు.

ఈ క్రీస్తు విరోధి యూదులను కూడా నరకయాతనకు గురిచేస్తాడు. జెకర్యా ప్రవక్త ఏమని వ్రాశాడంటే,

“దేశమంతట జనులలో రెండు భాగములవారు తెగవేయబడి చత్తురు,

మూడవ భాగము వారు శేషింతురు”

                                                                 జెకర్యా 13:8.

ఇప్పుడు ఒక చిన్న లెక్క చేద్దాం. మీ దగ్గర కాల్కులెటర్ ఉంటే తీసుకొని 100 ను 3 చేత విభజించండి.

33.33333333333333 వస్తుంది. దానిని 2 చేత భాగించండి. ఏమి వచ్చిన్నది? 66.66666666666666. యూదులలో రెండు భాగములు వారు, 66.6 శాతం మంది అంత్య క్రీస్తు చేతిలో హతమవుతారు.

66.6: అది ఎవరి సంఖ్య? సాతాను సంఖ్య. పాప పురుషుని సంఖ్య. హిట్లర్ 6 లక్షల యూదులను

మట్టుపెట్టాడు. అయితే క్రీస్తు విరోధి 66.66 శాతము మంది యూదులను హతమారుస్తాడు.

  పోయిన సారి నేను పోలాండ్ దేశము వెళ్ళినప్పుడు అక్కడ ఔస్కు విట్జ్ కాన్సంట్రేషన్ క్యాంపు కు వెళ్ళాను.అక్కడ రెండవ ప్రపంచ యుద్ధ కాలములో హిట్లర్, నాజీలు యూదుల మీద చేసిన ఘోరాలకు నిలయమైన ప్రదేశాలను స్వయముగా చూశాను. ఆ ఒక్క క్యాంపు లోనే హిట్లర్ సేనలు 10 లక్షల మందిని దారుణముగా గ్యాస్ ఛాంబర్లలో విష వాయువులు ఇచ్చి చంపాడు.వారి చిన్న పిల్లల మీద సైన్స్ ప్రయోగాలు చేశారు. వారి స్త్రీల మీద అత్యాచారాలు చేశారు.

    కానీ, యూదులను హింసిచటములో అంత్య క్రీస్తు హిట్లర్ ని మించిపోతాడు. ప్రస్తుత జనాభా లెక్కల ప్రకారం చెప్పాలంటే, మన ప్రపంచములో ఒక కోటి నలభై లక్షల మంది యూదులు వున్నారు.

వీరిలో 66.6 శాతం, అనగా 90 లక్షల మంది దాకా పాప పురుషుని చేతిలో హతమవుతారన్న మాట.

పాప పురుషుడు ఎంత కాలం పాలిస్తాడు?

పాప పురుషుని ఆగడాలు ఎంత కాలం కొనసాగుతాయో దేవుడు మనకు తన వాక్యములో తెలియ జేశాడు. ‘శ్రమల కాలము’ ఏడేండ్ల పాటు వుంటే, అందులో రెండవ భాగము, మూడున్నర సంవత్సరముల పాటు అంత్య క్రీస్తు విరుచుకుపడతాడు.

‘వారు ఒక కాలము కాలములు అర్థకాలము అతని వశమున నుంచబడుదురు’ (దానియేలు 7:25).

‘వారు నలువది రెండు నెలలు’ (ప్రకటన 11:2)

‘మరియు నలువదిరెండు నెలలు తన కార్యము జరుప నధికారము దానికి ఏర్పా టాయెను’ (ప్రకటన 13:5)

    31/2 సంవత్సరాలు లేక 42 నెలలు లేక 1260 రోజులు క్రీస్తు విరోధి చరిత్ర లో  ఏ నియంతా అనుభవించ నంత అధికారం తన గుప్పిట్లో ఉంచుకొని ఈ ప్రపంచాన్ని పాలిస్తాడు.  

పాప పురుషుని అంతం ఎలా వస్తుంది?

పాప పురుషుడు తన అధికారమునకు అడ్డు, అదుపూ లేదని భావించే సమయములో అతని అంతం హటాత్తుగా  వస్తుంది.

“అతని యధికారము నశింపజేయుటకును నిర్మూలముచేయుటకును తీర్పు విధింపబడెను

గనుక అది కొట్టి వేయబడును. ఆకాశమంతటి క్రిందనున్న రాజ్యమును అధికారమును రాజ్య మహాత్మ్యమును మహోన్నతుని పరి శుద్ధులకు చెందును. ఆయన రాజ్యము నిత్యము నిలుచును,

అధికారులందరును దానికి దాసులై విధేయులగుదురు. ఇంతలో సంగతి సమాప్తమాయెను

అని చెప్పెను” (దానియేలు 7:26,27)

అతడు అతి శయపడి తన్నుతాను హెచ్చించుకొనును; క్షేమముగా నున్న కాలమందు

అనేకులను సంహరించును; అతడు రాజాధిరాజుతో యుద్ధముచేయును

                                                                                     (దానియేలు 8:25)

   అంత్య క్రీస్తు గర్వాంధకారమునకు నిలువెత్తు రూపముగా ఉంటాడు. అతని జనకుడు సాతాను

ఏ విధంగా దేవుని మీదే అతిశయముతో  విర్రవీగాడో (యెషయా 14:12-14), అదే విధముగా

అంత్య క్రీస్తు కూడా అహంభా వాన్ని తలకెక్కించుకొని,  రాజాధిరాజు ప్రభువైన యేసు క్రీస్తు తోనే

యుద్ధానికి సిద్ధపడతాడు. (ప్రకటన 19:11-21).

   ‘అప్పుడా మృగమును, దానియెదుట సూచక క్రియలు చేసి దాని ముద్రను వేయించుకొనిన వారిని

ఆ మృగపు ప్రతిమకు నమస్కరించినవారిని మోసపరచిన ఆ అబద్ధప్రవక్తయు, పట్టబడి వారిద్దరు

గంధకముతో మండు అగ్ని గుండములో ప్రాణము తోనే వేయబడిరి’ (ప్రకటన 19:11-21).

 

ఏడేండ్ల శ్రమల కాలము తరువాత పాప పురుషుడు అంతము చేయబడతాడు. ప్రభువయిన యేసు క్రీస్తు తిరిగి వచ్చి అతని దుర్మార్గములకు ముగింపు పలికి, అతని, అతని పరివారమును నిత్య నరకాగ్ని గుండములోనికి త్రోసివేస్తాడు.

 

‘అప్పుడా మృగమును, దానియెదుట సూచక క్రియలు చేసి దాని ముద్రను వేయించుకొనిన

వారిని ఆ మృగపు ప్రతిమకు నమస్కరించిన వారిని మోసపరచిన ఆ అబద్ధప్రవక్తయు,

పట్టబడి వారిద్దరు గంధకముతో మండు అగ్ని గుండములో ప్రాణము తోనే వేయబడిరి’

                                                                                            (ప్రకటన 19:11-21).

సాతాను అనుగ్రహించిన అపూర్వ మయిన శక్తి యుక్తులతో ప్రపంచ ప్రజలందరినీ గజ గజ లాడించిన అంత్య క్రీస్తు చివరకు ప్రభువయిన యేసు క్రీస్తు చేతిలో చావు దెబ్బ తింటాడు.

‘ప్రభువైన యేసు తన నోటియూపిరిచేత వానిని సంహరించి తన ఆగమన ప్రకాశముచేత నాశనము

చేయును’   2 థెస్సలొనీక 2:8.

దేవుని సింహాసనం మీద కలకాలం కూర్చోవాలని తాపత్రయ పడిన అతని చివరి ప్రస్తానం గంధకములతో

మండే అగ్నిగుండం అవుతుంది. ఇంతకు ముందు చెప్పినట్లు, ప్రభువయిన యేసు క్రీస్తు నరావతారములో దేవుడు పంపిన రక్షకుడు అయితే, అంత్య క్రీస్తు నరావతారములో సాతానుడు పంపిన భక్షకుడు.

దేవుడు క్రీస్తును సర్వోన్నత స్తానమునకు హెచ్చించి, అంత్య క్రీస్తును లోతు తెలియని అగ్ని గుండం లో విసరి వేస్తాడు.

Feed a Hungry Child with as little as $10 per month

Give a helping hand to feed the hungry children and to provide them health care and education

$10.00

Leave a Reply