గెలాపగోస్ దీవులు: డార్విన్ చేసిన మోసం, పార్ట్ 1

గత కొన్ని సంవత్సరాలుగా ప్రపంచములోని అనేక దేశాల్లో నేను డార్విన్ సిద్ధాంతము మీద చేసిన రీసెర్చ్ ని మీకు ఎప్పటికప్పుడు అందిస్తూనే ఉన్నాను. ఈ రోజు గెలాపెగోస్ దీవులలో చేస్తున్న రీసెర్చ్ మీకు తెలియజేస్తాను. ఈక్వడార్ దేశంలో విమానం ఎక్కి ఐలా బాల్ట్రా దీవికి వెళ్ళాను. లగేజి తీసుకోవటానికి లోపలి వెళ్ళాను. ఈ ద్వీపవాసులు చాలా జాగ్రత్తగా ఈ ఐలాండ్ లను పరిరక్షిస్తారు.

కుక్కలను తీసుకొని వచ్చి లగేజి ని చెక్ చేసి బయటికి పంపించారు. అక్కడి నుండి బస్సులో ప్రయాణము.టికెట్ తీసుకొని బస్సు ఎక్కాను. బస్సులో కొంత దూరము ప్రయాణము చేసిన తరువాత ఒక సముద్ర పాయ వచ్చింది.ఒక లాంచీలో ఆ సముద్ర పాయను దాటాను.అవతలి ఒడ్డుకు చేరి ఒక టాక్సీ లో పోర్టో అయోర పట్టణానికి బయలుదేరాను.రోడ్డు రెండు వైపులా ఎంతో చక్కటి చేతులు కనిపించాయి. మధ్యాహ్నానికి పోర్టో అయోరా పట్టణానికి చేరాను.

GalapagosfromEcuador.png

ఈ గెలాపెగోస్ దీవులు పసిఫిక్ మహాసముద్రములో ఉన్నాయి. ఇవి ఈక్వడార్ దేశములో భాగముగా ఉన్నాయి. ఆ దేశానికి 500 మైళ్ళ దూరములో పశ్చిమాన ఉన్నాయి. మొత్తము18 దీవులు ఇక్కడ ఉన్నాయి. ఇక్కడ అనేక రకాలైన పక్షులు, జంతువులు, చెట్లు ఉన్నాయి.వాటిలో కాలముతో పాటు వచ్చిన మార్పులను అధ్యయనము చేయుట ద్వారా మనము సృష్టి గురించి, డార్విన్ సిద్ధాంతము గురించి అనేక ఆసక్తికరమైన విషయాలు తెలుసుకోవచ్చు.

   చార్లెస్ డార్విన్ HMS బీగిల్ అనే పరిశోధన ఓడలో సెప్టెంబర్ 15, 1835 న ఈ దీవులకు వచ్చాడు. అక్టోబర్ 20 వ తేదీ వరకు ఈ దీవులలో ఆయన రీసెర్చ్ చేశాడు. తన జీవ పరిణామము సిద్ధాంతము వ్రాశాడు. ఈ భూమి ఉన్న జీవజాలాన్ని దేవుడు సృష్టించలేదు, అవి వాటన్నిటికవే పరిణామము చెందుతున్నాయి అన్నాడు. నన్ను చాలా మంది అడిగారు. నువ్వు, ప్రపంచ మంతా తిరిగి ఈ సబ్జెక్టు మీద ఎందుకు రీసెర్చ్ చేస్తున్నావు? ఎందుకు నీ సమయాన్ని ఎంతో దీనిమీద వెచ్చిస్తున్నావు? అది చాలా మంచి ప్రశ్న.How did we originate in this world? ఈ భూమి మీద మనము ఎలా ఉద్భవించాము? దానికన్నా గొప్ప ప్రశ్న మరొకటి లేదు. దానికి ఆన్సర్ చెప్పాలి. మిగిలిన ప్రశ్నలన్నింటికీ సమాధానాలు చెప్పాలంటే ముందు మనము ఆ ప్రశ్న కు సమాధానము చెప్పాలి.

   ఈ దీవులలో దాదాపు 35,000 మంది ప్రజలు జీవిస్తున్నారు. ఈ దీవులను వారు ఎంతో ప్రేమిస్తారు. వారు గీసే చిత్రాలలో ఈ దీవులలో జీవించే పక్షులు, జంతువులు స్పష్టముగా కనిపిస్తాయి. ఒక దీవి నుండి మరొక దీవికి వెళ్లాలంటే ఎక్కువగా బోట్ లను వినియోగిస్తారు. చేపలు ఇక్కడ విస్తారముగా ఉంటాయి. నేను చేపల మార్కెట్ కి వెళ్ళాను. వారు రోజంతా చేపలు పట్టి ఈ మార్కెట్ లో అమ్ముతారు. ప్రజలు చేపలు ఎక్కువగా తింటారు. వీళ్ళు వండే చేపల కూర, ఇతర వంటకాలు నేను మాత్రము తినలేకపోయాను కానీ ఎడ్జస్ట్ అయ్యాను. సాయంత్రము పూట  వాలీ బాల్ ఆడుచూ తమ సమయాన్ని గడుపుతారు.

 

Geography:

   సముద్రము ఇక్కడ చక్కటి తీర ప్రాంతాన్ని తయారు చేసింది. ముందు ఈ దీవులు ఎలా ఏర్పడ్డాయో చూద్దాము. 

Galapagosislandstelugu.png

మహాసముద్రములో ఎన్నో మైళ్ళ లోతు ఉంటుంది. ఆ సముద్రము మధ్యలో ఒక రాయి కనిపించినా వింతే. అలాంటిది ఇక్కడ పెద్ద, పెద్ద దీవులు మనకు కనిపిస్తున్నాయి. భూమి కనిపించితే అది ఎలా ఏర్పడిందో అని మనకు ఆసక్తి కలుగుతుంది. ఒక రోజు మధ్యాహ్నము నేను లాస్ జెమెలోస్ అనే ప్రాంతానికి వెళ్ళాను. ఇవి రెండు పెద్ద గుంటలు. అగ్ని పర్వతాలు ప్రేలి లావా భూమి మీదకు ప్రవహించి ఈ గుంటలను ఏర్పరచాయి. ఇక్కడ కొన్ని గుహలు కూడా నాకు కనిపించాయి. కొన్ని గుహల్లో నడిచివెళ్లాను. లావా నేలలు ఏర్పడక ముందు చాలా వేడిగా ఉండే ద్రవము భూమిలోనుండి ప్రవహిస్తుంది. దీనిని మాగ్మా అంటాము. మాగ్మా ప్రవహిస్తూ ఈ గుహలను ఏర్పరచింది. ఇక్కడ గుహల యొక్క గోడలను మీరు గమనిస్తే లావా పొరలను మీరు చూడవచ్చు. ఈ గుహలు కొన్ని చోట్ల చాలా ఇరుకుగా ఉన్నాయి.నేల మీద పండుకొని వీటిని దాటవలసి ఉంటుంది. ఈ దీవులలో అగ్ని పర్వతాలు, లావా గుహలు, గోతులు ఎలా ఏర్పడ్డాయో ముందు చూద్దాము. ఒక్క ఇసబెల్లా దీవి మీదే 6 అగ్ని పర్వతాలు ఉన్నాయి. ఇవి సముద్రము మధ్యలో ఉన్నాయి కాబట్టి సముద్రము అడుగు నుండి ఇక్కడ బయటపడ్డాయి కాబట్టి ఈ పర్వతాలు చాలా ఎత్తైనవి అని మనము గ్రహించాలి.

   1835 లోచార్లెస్ డార్విన్ ఇక్కడకు వచ్చినప్పుడు ఈ కొండలు, గుహలు చూసి ఆయన కూడా ఆశ్చర్యపోయాడు.ఆ సమయములో చార్లెస్ లయల్ వ్రాసిన పుస్తకము ప్రిన్సిపుల్స్ అఫ్ జియాలజి అనే పుస్తకము డార్విన్ చదువుతున్నాడు. చార్లెస్ లయల్ ని మనము ఇప్పుడు భూగర్భ శాస్త్రానికి పితామహుడిగా పిలుస్తున్నాము. లయల్ వ్రాసిన పుస్తకము ఆధారముగా డార్విన్ ఈ ప్రాంతాన్ని అధ్యయనం చేశాడు.సముద్రము మధ్యలో మనము ఇక్కడ అగ్ని పర్వతాలను చూస్తున్నాము.ఇది చాలా గొప్ప వింత. సముద్ర గర్భము ఒక్క పొరగా లేదు. అది అనేక పొరలుగా ఉంది. ఈ పొరలు ఒక దాని కొకటి కలుసుకొనే ప్రాంతాలను subduction zones అని పిలుస్తాము. ఈ పొరలు ఒకదానికి ఒకటి వేరుగా లాగబడుచున్న ప్రదేశాలను రిడ్జెస్ అంటాము. ఇక్కడకు దగ్గరలోనే ఒక ఓషన్ రిడ్జ్ ఉంది. ఈ ఓషన్ రిడ్జ్ అన్ని సముద్రాలను కలుపుతుంది.

midoceanridge.png

ఇక్కడ పసిఫిక్ మహాసముద్రము, ఇండియా లో హిందూ సముద్రము, అట్లాంటిక్ మహా సముద్రము, ఇజ్రాయెల్ దగ్గర ఎఱ్ఱ సముద్రము – ఈ సముద్రాలన్నిటినీ ఈ రిడ్జ్ కలుపుతుంది. ఈ రిడ్జ్ కి దగ్గరలో ఒక హాట్ స్పాట్ ఏర్పడింది. అది భూగర్భములో అగ్ని. ఆ అగ్ని తన మీద ఉన్న భూమిని కరిగించుకొంటూ ఉపరితలము మీదకు వచ్చింది. దాని మీద ఉన్న భూమిని పైకెత్తింది. అప్పుడే ఈ గెలాపగోస్ దీవులు ఏర్పడ్డాయి. ఇక్కడ అగ్ని పర్వతాలు ఎప్పుడు ప్రేలతాయో చెప్పలేము ఎందుకంటే ఇవి సముద్ర రిడ్జ్ కి దగ్గరలో ఉన్నాయి. ఇక్కడ సముద్ర గర్భములో పసిఫిక్ ప్లేట్ ఉంది. అది అనేక భాగాలుగా ఉంది. రెండు భాగాలు కోకాస్ ప్లేట్, నాజ్కా ప్లేట్ ఈ దీవుల దగ్గర కలుస్తున్నాయి. జలప్రళయము జరిగినప్పుడు దేవుడు ఈ భూమిని చాలా భయంకరమైన రీతిలో కదిలించాడు. ఆదికాండము 6 అధ్యాయములో మనము చదువుతాము. ఆ ప్రళయములో దేవుడు సముద్ర గర్భాన్ని పగులగొట్టాడు.

ఆదికాండము 7:11 లో మనము చదువుతాము.

   మహాగాధజలముల ఊటలన్నియు ఆ దినమందే విడబడెను, ఆకాశపు తూములు విప్పబడెను.

that same day were all the fountains of the great deep

broken up, and the windows of heaven were opened.

జల ప్రళయము జరిగినప్పుడు దేవుడు మహాగాధజలముల ఊటలను విప్పాడు. ఓషన్ రిడ్జ్స్ ఏర్పడింది అప్పుడే. భూమి మీద ఖండాలు ఏర్పడింది అప్పుడే. ఈ దీవులు ఏర్పడింది కూడా అప్పుడే. ఈ లావా గోతులు, గుహలు, అగ్ని పర్వతాలు నాడు జరిగిన జల ప్రళయానికి నేటి సాక్షాలుగా మనముందు ఉన్నాయి. ఈ గుంటల చుట్టూ ఒక అడవి నాకు కనిపించింది.ఆ అడవిలో కాసేపు నడుచు కుంటూ వెళ్ళాను.    నాకు ఇక్కడ స్కాలేసియా చెట్లు కనిపించాయి. గోతుల చుట్టూ చూడండి. అందమైన స్కాలేసియా చెట్లు మనకు కనిపిస్తున్నాయి.ఈ చెట్లు ఈ గెలాపగోస్ దీవులలో మాత్రమే మనకు కనిపిస్తాయి.

IMG_9311.jpeg

ఈ స్కాలేసియా చెట్లలో 15 జాతులు ఉన్నాయి. ఈ చెట్లు ఆస్టరేసియా కుటుంబానికి చెందింది.ఆ కుటుంబములోని చెట్లలో జాతులు ఉండవు. కానీ ఈ దీవులలో ఉన్న ప్రత్యేక పరిస్థితులను బట్టి ఈ స్కాలేసియా చెట్లు 15 జాతులుగా మారినాయి.దీనిని Adaptive Radiation అడాప్టివ్ రేడియేషన్ అన్నారు. ఆ మాట గుర్తు పెట్టుకోండి. అడాప్టివ్ రేడియేషన్ అంటే ఏమిటంటే ఒక జీవి కాల క్రమేణా తన చుట్టూ ఉన్న పరిస్థితులకు అనుగుణముగా అనేక జాతులుగా మార్పు చెందుతుంది. ఆ జీవి ఏదయినా కావచ్చు. చెట్లు కావచ్చు, పక్షులు కావచ్చు, నీటి జంతువులు కావచ్చు, భూజంతువులు కావచ్చు, మనుష్యులయినా కావచ్చు. ఈ జీవులు కాలక్రమేణా అనేక జాతులుగా మార్పు చెందుతారు. దీనిని అడాప్టివ్ రేడియేషన్ అని పిలుస్తున్నాము. చార్లెస్ డార్విన్ ఈ దీవులలో చూసింది అదే. ఈ అడాప్టివ్ రేడియేషన్ చూసి ఆయన ఆశ్చర్యపోయాడు. దీని ఆధారంగానే తన పరిణామ సిద్ధాంతాన్ని వ్రాశాడు. ఇక్కడ పెరుగుతున్న చెట్లను కొంతసేపు చూద్దాము. ఈ ద్వీపాలలో కొన్ని చోట్ల దట్టమైన అడవిని చూస్తే, మరి కొన్ని చోట్ల ఎడారిని తలపించే ముళ్ల చెట్లు కనిపిస్తాయి.

    కొన్నిచోట్ల నాకు మంజనీల్లోచెట్లు కనిపించాయి. ఈ చెట్లు ఈ దీవులకు పరిమితమైనవి.ప్రపంచములోనే ప్రమాదకరమైన చెట్టు అని దీనికి పేరు.ఈ చెట్టు యాపిల్ చెట్టు వలె ఉంటుంది.దాని కాయలు కూడా చిన్న చిన్నయాపిల్ కాయల వలె కనిపిస్తాయి.ఆ కాయల్లో విషం ఉంటుంది.అవి తింటే ప్రాణాపాయము. పాన్స్ డి లియోన్ (Ponce de Leon) అనే ప్రఖ్యాత యాత్రికుడు ఈ చెట్టు కాయలు తిని ప్రాణాలు కోల్పోయాడు. ఈ చెట్టు ద్రవాలు మన శరీరం మీద పడితే బొబ్బలు వస్తాయి. ఈ చెట్టును తాకవద్దు అని హెచ్చరికలు ఈ చెట్ల మీద వ్రాసి ఉంటాయి. ఇక్కడి ప్రజలు ఈ చెట్టును హవ్వ చెట్టు అనిపిలుస్తారు. ఇది విన్నప్పుడు నాకు ఆదాము, హవ్వలు గుర్తుకువచ్చారు. ఏదెను వనములో దేవుడు ఒక చెట్టును పెట్టి ఈచెట్టు ఫలములు తినవద్దు, తింటే మీరు మరణిస్తారు అని హెచ్చరించాడు. కొన్ని చెట్ల జోలికి మనము వెళ్లకపోతే మంచిది. ఈ మంజనీల్లో చెట్లు అనేక రకాలుగా ఈ దీవులలో మార్పు చెందింది.

IMG_2270.jpg

   ఆ తరువాత ఇక్కడ దారికి ఇరువైపులా మనం ఫెర్న్ చెట్లు చూస్తున్నాము.దాదాపు 100 జాతుల ఫెర్న్ చెట్లు ఈ దీవులలో మనకు కనిపిస్తాయి.ఈ ఫెర్న్ చెట్లు యొక్క ఫాసిల్స్ ని ఇప్పుడు శాస్త్రవేత్తలు స్టడీ చేస్తున్నారు. కొన్ని వేల సంవత్సరాలు ఈ చెట్లు ఎలాంటి మార్పు లేకుండా పెరుగుతున్నాయి. డార్విన్ సిద్ధాంతములో దీనిని ‘Evolutionary Stasis’ ‘పరిణామ స్థిరత’ అంటారు. వాటి పరిస్థితులు, వాతావరణములో మార్పులు జరుగుతున్నప్పటికీ ఈ ఫెర్న్ చెట్లు మార్పు లేకుండా జీవిస్తున్నాయి.

 

    ఆ తరువాత శాంటా క్రజ్ దీవిలో నేను ఓపన్షియా చెట్లను చూశాను. ఈ ఓపన్షియా చెట్లు కాక్టస్ జాతికి  చెందినవి. ఈ కాక్టస్ జాతి చెట్లు ఇక్కడ ఉండే వేడికి తట్టుకొని బ్రతుకుతున్నాయి.డార్విన్ సిద్ధాంతములో దీనిని adaptation అంటారు. ఇక్కడ నీటి కొరత ఉంది. వర్షం పడినప్పుడు నీటిని పీల్చుకొనుటకు ఈ చెట్లు దృఢమైన వేరులను పెంచుకొంటాయి. వీటిని దగ్గరగా చూస్తే మైనం పూసినట్లు ఒక పొర వీటి మీద ఉంటుంది. ఎండ వేడికి వాటిలోని నీరు ఆవిరి అయిపోకుండా ఈ మైనం పొర కాపాడుతుంది. జంతువుల నుండి కాపాడుకొనుటకు ఇవి ముళ్ళు కలిగి ఉన్నాయి. ఇవి నిజమైన ముళ్ళు కాదు.వాటి ఆకులను ఈ చెట్లు ముళ్ల రూపములోకి మార్చుకున్నాయి.మొదట సారి వీటిని చూసినప్పుడు ఈ ఓపన్షియా చెట్లు ఎందుకు పనికిరావు అని నేను అనుకొన్నాను. ఆ తరువాత తెలుసుకున్నాను: ఈ చెట్ల ఫలములను చాలామంది కూరగాయలుగా తింటున్నారు. ఈ కాక్టస్ చెట్లలో నుండి ఈ ప్రాంతము వారు ఒక మత్తు కలిగించే మద్యం చేసుకొని త్రాగుతారు. మెక్సికో దేశము కాక్టస్ తమ జాతీయ పతాకం మీద చిత్రించుకొంది.ఇక్కడ జంతువులు కూడా ఈ చెట్లను తింటాయి.

    ఈ చెట్ల యొక్క ఫలాలు కూడా మీరు చూడండి. ప్రక్క నుండి చూస్తే ఇవి పైన్ ఆపిల్ కాయవలె ఉంటాయి. ఈ కాయ మీద మీరు చూస్తే మనకు చిన్న చిన్న మొగ్గలు కనిపిస్తున్నాయి. ఆ మొగ్గలు ఒక క్రమ పద్దతిలో వరుసలు, వరుసలుగా అమర్చి ఉన్నాయి. ఆ వరుసల్లో గణిత శాస్త్రము ఉంది. గణిత శాస్త్రములో ఫిబొనాసి సంఖ్యలు అని ఉన్నాయి.

0,1,1,2,3,5,8,13,21,34,55,89,144

ఈ సంఖ్యల్లో ముందు రెండు సంఖ్యలు కలిపితే మూడో సంఖ్య వస్తుంది.

0,1 కలిపితే 1 వస్తుంది;

1,1 కలిపితే రెండు;

1,2 కలిపితే మూడు

2,3 కలిపితే ఐదు

3,5 కలిపితే ఎనిమిది.

   ఈ ఫిబొనాసి సంఖ్యల్లో ఒక ఆర్డర్ మనం చూస్తున్నాము. ఆ ఆర్డర్ మనకు ఈ మొగ్గల్లో కూడా కనిపిస్తున్నది. ఒక క్రొత్త మొగ్గ పుట్టేటప్పుడు 137.5 డిగ్రీల కోణములో అది మొలుస్తున్నది. ఆ కోణములో మొలిస్తేనే కాయ మీద ఉన్న స్పేస్ వేస్ట్ కాదు.ఈ 137.5 డిగ్రీల కోణాన్ని గణిత శాస్త్రములో గోల్డెన్ ఆంగల్ అన్నారు. దేవుని యొక్క గొప్ప జ్ఞానము ఈ ఎడారి చెట్లలో మనము చూస్తున్నాము. ఆ మొగ్గలను దేవుడు ఫిబొనాసి సంఖ్యల సీక్వెన్స్ లో అమర్చాడు.ప్రతి మొగ్గను గోల్డెన్ యాంగిల్ లో పెట్టాడు.ఒక ఇంజనీర్ గుడ్డిగా ఏదీ కట్టడు. ముందు ‘mathematical model’ గణిత మోడల్ గీసుకొంటాడు. దేన్ని ఎక్కడ పెట్టాలో, వాటి మధ్య ఎంత స్పేస్ ఉండాలోదేనిని ఏ యాంగిల్ లో నిర్మించాలోఇంజినీర్ కానీ, ఆర్కిటెక్ట్ కానీ ఒక ప్లాన్ ముందుగా గీసుకొంటాడు.ఆ తరువాతే నిర్మిస్తాడు. దేవుడు కూడా అంతే.ఈ చెట్లను సృష్టించేటప్పుడు ఆయన గ్రుడ్డిగా, అనాలోచితముగా వాటిని సృష్టించలేదు. ఒక ఇంజనీర్ లాగా ఆయన ఒక mathematical order లో గణిత శాస్త్ర సంఖ్యల్లో వాటిని సృష్టించాడు.

   డార్విన్ సిద్ధాంతము ఏమంటదంటే, ఈ చెట్లన్నీ గ్రుడ్డిగా మొలిచినాయి.దేవుడు లేడు, సృష్టికర్త లేడు, డిజైనర్ లేడు.అంటుంది.అయితే అది అవివేకము అని మనము గుర్తించాలి. ఇక్కడ ప్రజలు తమ చుట్టూ ఉన్న ప్రకృతిలో దేవుని జ్ఞానాన్ని చూశారు. పెద్ద పెద్దఇంజినీర్లు, సైంటిస్టులు, గణిత శాస్త్ర మేధావులు ఈ రోజు వీటిని చూసి ఆశ్చర్యపోతున్నారు.అయితే ఇక్కడి ప్రజలు వేల సంవత్సరాల క్రితమే ప్రకృతిలో దేవుడు పెట్టిన గోల్డెన్ యాంగిల్ ని చూశారు.వాళ్ళ దేవాలయాలు కూడా గోల్డెన్ యాంగిల్ లో కట్టుకున్నారు.

IMG_2365.jpg

    ఆ తరువాత ప్రపంచవ్యాప్తముగా ఈ కాక్టస్ చెట్లు ఏ విధముగా విస్తరించిఉన్నయో మనము గమనించాలి.ఇవి భూమి యొక్క పశ్చిమ అర్ధభాగానికే పరిమితమయినాయి.ఈ  గెలాపగోస్ దీవులు, ప్రక్కన దక్షిణ అమెరికా, పైన ఉత్తర అమెరికా కెనడా దేశము దాకా ఇవి విస్తరించి ఉన్నాయి.

మిగిలిన ఖండాల్లో – ఆసియా, ఆఫ్రికా యూరప్ లలో ఇవి కనిపించవు. ఎందుకని? ఇంతకు ముందు ఆదికాండము 7:11 లో మనం చూశాము.

  జల ప్రళయము జరిగినప్పుడు దేవుడు భూగర్భములో నుండి మహాగాధ జలములను బయటికి తెచ్చాడు.వాటి వలన ఖండాలు ఏర్పడ్డాయి.జల ప్రళయము ముందు భూమి మీద ఖండాలు లేవు. జల ప్రళయము లో జరిగిన గొప్ప మార్పుల వల్లే ఇప్పుడు ఉన్న 7 ఖండాలు ఏర్పడ్డాయి. జల ప్రళయము సమయములోనే ఈ కాక్టస్ చెట్లు పశ్చిమ ఖండాలలోకి అంటే ఉత్తర, అమెరికా దక్షిణ అమెరికా ఖండాలకు వెళ్ళిపోయినాయి. అందుకనే అవి ఆసియా, ఆఫ్రికా, యూరప్, ఆస్ట్రేలియా ఖండాలలో మిగల్లేదు.ప్రస్తుతము మనము అక్కడ చూస్తున్న కాక్టస్ చెట్లు అన్నీ ఇక్కడ నుండి మానవులు కానీ పక్షులు కానీ తీసుకొని వెళ్ళినవే. ఆస్ట్రేలియా వాళ్ళు 1839 లో ఒక పని చేశారు. ఈ కాక్టస్ చెట్లు చూడటానికి  చాలా బాగున్నాయి.మనది పెద్ద దేశము. ఈ చెట్లు పెంచుకొందాము అని ఒక మొక్క తీసుకొని వెళ్లి పాతుకొన్నారు.ఆ ఒక్క మొక్క కొన్ని లక్షల మొక్కలుగా విస్తరించింది.ఆ దేశములో కొన్ని కోట్ల ఎకరాలు కాక్టస్ చెట్లతో నిండిపోయింది. ఇంకా ఇతర పంటలు పండించటానికి చోటు లేకుండా పోయింది. ఆస్ట్రేలియా వాళ్ళు ఏమి చేయాలో తోచక జుట్టు పీక్కున్నారు. సైంటిస్ట్ లను పిలిచి రీసెర్చ్ మొదలుపెట్టారు. డాక్టర్ జాన్ మాన్ (Dr.John Mann)అని ఒక సైంటిస్ట్ ఉన్నాడు. ఆయన బైబిల్ ని నమ్మాడు. దేవుడు మానవులను, చెట్లను, జంతువులను ఒక దానిమీద ఒకటి ఆధారపడి ఉండేటట్లు సృష్టించాడు. ఈ చెట్లను తినే పురుగులు ఏమన్నా ఉన్నాయా అని వెదికాడు. చివరకు కెక్టబ్లాస్టిస్ అనే పురుగు దొరికింది. ఈ పురుగు కేవలం ఈ కాక్టస్ చెట్లను మాత్రమే తింటుంది. ఆ పురుగులను వృద్ధి చేసి ఆస్ట్రేలియా మొత్తం పంపించారు.అవి వెళ్లి కాక్టస్ చెట్లను తిని వాటిని నియంత్రించాయి. మరో సారి ఇలాంటి తప్పు చేయము అని ఆస్ట్రేలియా వాళ్ళు చెంపలేసుకొన్నారు.

   దేవుడు మానవుణ్ణి ఈ సృష్టికి అధిపతిగా సృష్టించి నియమించాడు.పక్షులు, చేపలు,జంతువులు, పురుగులు, మానవుల మధ్య ఒక సమతుల్యతను ఆయన పెట్టాడు. జీవ వ్యవస్థలు ఒక దాని నొకటి నియంత్రిస్తున్నాయి.ఈ దీవులలో తిరుగుతున్నప్పుడు ఆ నియమాన్ని నేను స్పష్టముగా చూశాను. ఈ ఓపన్షియా కాక్టస్ చెట్లను ఇక్కడ ఉన్న పక్షులు, పురుగులు, తాబేళ్లు నియంత్రిస్తున్నాయి. ఈ దీవులలో నాకు పెద్ద పెద్ద తాబేళ్లు కనిపించాయి. ఒక దీవిలో ఉన్న తాబేళ్లకు, మరొక దీవిలో ఉన్న తాబేళ్లకు సైజులో తేడా ఉంది. తాబేళ్లలో కూడా అడాప్టివ్ రేడియేషన్ జరుగుతుంది. ఈ తాబేళ్లు ఓపన్షియా చెట్లను తింటాయి. పెద్ద చెట్లు ఉన్న దీవుల్లో తాబేళ్లు పెద్ద సైజులో ఉన్నాయి. చిన్న చెట్లు ఉన్న దీవుల్లో తాబేళ్లు చిన్న సైజు లో ఉన్నాయి. ఓపన్షియా చెట్టు ఈ గెలాపగోస్ దీవులలో 6 జాతులుగా, 14 రకాలుగా మారింది. పరిస్థితులతో పాటు ఈ చెట్లు మార్పులకు గురవుతున్నాయి.అది adpative radiation. తాబేళ్లు, అవి తింటున్న ఓపన్షియా చెట్టులు: రెండింటిలో ఇక్కడ adoptive radiation మనకు కనిపిస్తున్నది.

   ఈ రోజు మనము గెలాపగోస్ దీవులలో కొన్ని జంతువులు, చెట్ల గురించి చూశాము. అగ్ని పర్వతాలు ప్రేలి సముద్రము మధ్యలో ఈ దీవులు ఏర్పడినాయి. సృష్టి యొక్క అబ్దుతాల్లో ఈ దీవులు కూడా ఒకటి అని మనం చెప్పుకోవచ్చు. కొన్ని వేల సంవత్సరాలుగా ఇక్కడ ఉన్న చెట్లు, జంతువులు, చేపలు మార్పులకు గురవుతున్నాయి. చార్లెస్ డార్విన్ ఈ దీవులకు వచ్చాడు. ఈ మార్పులను గమనించాడు.అడాప్టివ్ రేడియేషన్ జరిగింది.అయితే దానికి ఒక హద్దు ఉంది.  స్కాలేసియా చెట్టు అనేక జాతులగా మారింది, అయితే అది స్కాలేసియా చెట్టే. మంజనీల్లో చెట్టు అనేకజాతులుగా మారింది, అయితే అది మంజనీల్లో చెట్టే.

ఫెర్న్ చెట్టు అనేక జాతులుగా మారింది.అయితే అది ఫెర్న్ చెట్టే.

ఓపన్షియా చెట్టు అనేక జాతులుగా మారింది.అయితే అది ఓపన్షియా చెట్టే.

తాబేళ్లు అనేక జాతులుగా మారినాయి.అయితే అవి ఇంకా తాబేళ్లే.వేరే జంతువులు అయిపోలేదు. కొంత మార్పుకు అవకాశం ఇస్తూ దేవుడు జెనెటిక్ కోడ్ వ్రాశాడు.

   డార్విన్ చేసిన మోసం ఏమిటంటే మార్పులు చెందీ, చెందీ ఒక జాతి జంతువులు పూర్తిగా భిన్నమైన జాతిగా అవతరిస్తాయి అన్నాడు. దానికి ఎలాంటి ఆధారాలు లేవు. ఈ గెలాపగోస్ దీవుల్లో మనం చూసింది అదే. ఇక్కడ డార్విన్ పరిణామ వాదానికి ఎలాంటి ఆధారాలు నాకు కనిపించలేదు.దేవుని యొక్క గొప్ప సృష్టి, ఆయన ప్రేమ, ఆయన జ్ఞానము నాకు కనిపించాయి. ప్రభువైన యేసు క్రీస్తు వీటన్నిటినీ సృష్టించాడు. ఆయనను తెలుసు కొని ఆరాధించడమే నిజమైన జ్ఞానము. ఇక్కడ సముద్ర తీరాన కొద్ది సేపు నేను ఆరాధనలో గడిపాను.

ప్రార్థన:    “ప్రియమైన యేసు ప్రభువా, మరోసారి మీ ఘనమైన నామమునకు కృతఙ్ఞతలు తెలియజేస్తున్నాము. ఈ గెలాపగోస్ దీవులలో మీ యొక్క సృష్టి మహిమను, జ్ఞానమును మేము చూసి  ఆశ్చర్యపోవుచున్నాము. సాతాను అబద్దాల నుండి, డార్విన్ మోసము నుండి ఈ తరము యువతీ యువకులను మీరు విడిపించండి. మీ ఘనమైన నామములో ఈ ప్రార్ధన చేయుచున్నాము.ఆమెన్.”

Please make a donation to our ministry

We are sustained by donations averaging about $20. Only a tiny portion of our readers give. Please support us to keep us online and growing. Thank you.

$20.00

Leave a Reply