క్రీస్తు వెయ్యేళ్ళ పాలన  

SecondComingRaptureGettyImages-538966035.jpg

ప్రభువైన యేసు క్రీస్తు రెండవ రాకడ ముందు ఈ ప్రపంచము కనీ వినీ ఎరుగని వినాశనాన్ని చవిచూస్తుంది. ఏడేండ్ల పాటు అనేక శ్రమలు కలుగుతాయి. 7 ముద్రలు, 7 బూరలు, 7 పాత్రలు అనే దేవుని తీర్పులు భూమిమీద కుమ్మరించబడతాయి. ఆ సమయములో బయలు పడే క్రీస్తు విరోధి చేసే అత్యంత హీనమైన ఘోరాలను కూడా ఈ ప్రపంచ ప్రజలు అనుభవిస్తారు. అప్పుడు ప్రభువైన యేసు క్రీస్తు తిరిగి వచ్చి తన వెయ్యేళ్ళ పరిపాలనను ఈ ప్రపంచములో స్థాపిస్తాడు.

నీతి, సమాధానము, సంతోషములతో నిండి ఉండే ప్రపంచాన్ని ఒక సారి ఊహించండి. అందరికీ ఆహారము దొరికి ఎవ్వరూ ఆకలి మంట అనుభవించని ప్రపంచాన్ని ఒకసారి ఊహించండి. హింస, హత్యలు లేని ప్రపంచాన్ని ఒక సారి ఊహించండి. అన్యాయం, అక్రమం లేని ప్రపంచాన్ని ఒక సారి ఊహించండి. రేప్ లు, కిడ్నాప్ లు లేని ప్రపంచాన్ని ఒక సారి ఊహించండి.యుద్ధాలు, పోరాటాలు లేని ప్రపంచాన్ని ఒక సారి ఊహించండి.

   అటువంటి ప్రపంచము భవిష్యత్తులో రాబోవుచున్నది. అది తోడేలు, గొఱ్ఱెపిల్ల కలిసి నివసించే ప్రపంచము. అది చిఱుత పులి, మేకపిల్ల ఒక చోట కలిసి పండుకొనే ప్రపంచము. కొదమ సింహాలతో ఆవులు ఆడుకొనే ప్రపంచము. నాగు పాము పుట్ట యొద్ద పసి పిల్లలు ఆడుకొనే ప్రపంచము.మిడి నాగుపుట్టల మీద చిన్న పిల్లలు చేతులు పెట్టి సురక్షితముగా ఉండే ప్రపంచము. అటువంటి ప్రపంచాన్ని ఊహించగలమా? ఊహించవచ్చు.ఊహించి, చందమామ, బొమ్మరిల్లు కథలు వ్రాసిన వాళ్ళు చాలా మంది ఉన్నారు. అయితే నిజముగా, వాస్తవముగా అటువంటి ప్రపంచము భవిష్యత్తులో ఆవిష్కరించబడుతుంది అంటే చాలా మంది నమ్మరు. ఆశలకు హద్దులు ఉండాలి, గాలిలో మేడలు కట్టవద్దు అని మనలను హేళన చేసే వారే ఎక్కువగా ఉంటారు. దేవుని వాక్యము అటువంటి రాజ్యము రాబోవుచున్నది అని మనకు తెలియజేస్తున్నది. రాబోవుచున్న ప్రభువైన యేసు క్రీస్తు యొక్క వెయ్యేళ్ళ పాలనలో ఈ ప్రపంచము అటువంటి స్వర్ణ యుగము లోకి ప్రవేశించబోవుచున్నది.

  ఆరు వేల సంవత్సరాల మానవ చరిత్రలో ఎంతో మంది రాజులు, చక్రవర్తులు, ప్రవక్తలు, నాయకులు, నియంతలు ఈ ప్రపంచాన్ని పాలించారు. మేము తెస్తాము స్వర్ణ యుగము అని వీరిలో చాలా మంది ప్రయత్నించి విఫలమయ్యారు. తీవ్రమైన నిరాశను మిగిల్చి వెళ్లారు.

  రోమన్ చక్రవర్తి జూలియస్ సీజర్ తనను తాను దేవుని కుమారుణ్ణి అని పిలుచుకొన్నాడు.దేవుని పాలన తెస్తాను అని రక్తపుటేరులు పారించాడు. యూదుల రాజుగా పుట్టినవాడు ఎక్కడ ఉన్నాడు అని తన దగ్గరకు వచ్చినతూర్పు దేశపు జ్ఞానులను కపటముతో మోసగించి, హేరోదు రాజు పసిపిల్లలను సహితము ఎంతో క్రూరముగా చంపివేశాడు. హేరోదు ఎన్నో గొప్ప కట్టడాలు కట్టాడు.వాటి శిథిలాలు నేటికీ మన మధ్యలో ఉన్నాయి. అయితే ఏమి లాభము? అతని పాలనలో ప్రజల జీవితాల్లో నిప్పులు నింపాడు.

  ఆధునిక యుగములో కార్ల్ మార్క్స్ కమ్యూనిస్ట్ మేనిఫెస్టో వ్రాశాడు. దేవుడు లేడు అన్నాడు.ప్రపంచ కార్మికులు అందరూ ఏకమైతే ప్రపంచము యొక్క కష్టాలన్నీ తీరిపోయినట్లే అన్నాడు. రాబోయేది స్వర్ణయుగము కాబట్టి, ఈ విప్లవాన్ని సాధించుకునే క్రమములో ఇప్పుడు కొంతమంది జనం చచ్చినా ఫర్వాలేదు అన్నాడు. స్వర్ణ యుగము పేరుతో కార్ల్ మార్క్స్ సిద్ధాంతాలను ఆచరణలో పెట్టి లెనిన్, స్టాలిన్, మావో, పోల్ పాట్ లాంటి కమ్యూనిస్ట్ దేశాధినేతలు కోట్లాదిమంది ప్రజలను హతమార్చారు.

  జర్మనీ దేశానికి చెందిన ఫ్రెడరిక్ నీచా అనే తత్వవేత్త కూడా దేవుడు లేడు అన్నాడు. ఒక ‘సూపర్ మాన్’ ద్వారా ప్రపంచ సమస్యలు తీర్చవచ్చు అని సిద్ధాంతాలు వ్రాశాడు. ఆ సూపర్ మాన్ కి కనికరము, జాలి, ప్రేమ ఉండవు. కఠినముగా ఈ సమాజాన్ని దారిలో పెడతాడు అన్నాడు.నీచా వ్రాసిన పుస్తకాలు చదివి అడాల్ఫ్ హిట్లర్ ఆ సూపర్ మాన్ ని నేనే, నేనే వెయ్యేళ్ళ పాలనను తీసుకువస్తాను అన్నాడు. అతని పాలనలో కూడా కోట్లాది మంది ప్రజలు దారుణ పరిస్థితులను చవిచూశారు.

 ఒక ఫిలాసఫర్ రావడము, దేవుడు లేదు అనడం, మనమే స్వర్ణ యుగము తెద్దాము అని ప్రకటనలు, ప్రణాళికలు చేయడము, వారి నిర్వాకాల వలన కోట్లమంది జనం చావడం – మానవ చరిత్ర మొత్తము ఈ వలయాల్లోనే చిక్కుకొని తిరిగింది. మానవ నాయకులు పలికే ప్రగల్భాలు విని దేవుడు ఏమి చేస్తున్నాడు? ఆయన నవ్వుచున్నాడు.

ఆకాశమందు ఆసీనుడగువాడు నవ్వుచున్నాడు

ప్రభువు వారిని చూచి అపహసించు చున్నాడు కీర్తన 2:4

ఏంటి వీళ్ళ యొక్క మూర్కత్వము?

ఏంటి వీళ్ళ యొక్క అవివేకము?

ఏంటి వీళ్ళ యొక్క అజ్ఞానము?

ఏంటి వీళ్ళ యొక్క అంధకారం?

నేను లేకుండా, నా కుమారుడు లేకుండా, నా పరిశుద్ధాత్ముడు లేకుండా స్వర్ణ యుగము ఎలా వస్తుంది? అని దేవుడు బాధతో కూడిన అపహాస్యము చేయుచున్నాడు.తాను ఉద్దేశించిన స్వర్ణయుగాన్ని దేవుడు తన పద్దతిలో ఈ లోకములోకి తెస్తాడు. అది మానవ పాలకుడు ద్వారా వచ్చేది కాదు. డబ్బు, విద్య, ఎన్నికలు ద్వారా వచ్చేది కాదు.అది కుమారుడైన యేసు క్రీస్తు ప్రభువు ద్వారా వచ్చేది.

నేను నా పరిశుద్ధ పర్వతమైన సీయోను మీదనా రాజును ఆసీనునిగా చేసియున్నాను కీర్తన 2:6

శ్రమ జీవుల బాధలు తీర్చే వాడు రాబోవుచున్నాడు.ఆయన కార్ల్ మార్క్స్ ఊహించినవాడు కాదు.సూపర్ మాన్ రాబోవుచున్నాడు. అయితే ఆయన నీచా ఊహించినట్లు ఉండడు. ఆయన దేవుడు సిద్ధపరచిన వాడు.

యెషయా 9:6

ఏలయనగా మనకు శిశువు పుట్టెను

మనకు కుమారుడు అనుగ్రహింపబడెను

ఆయన భుజముమీద రాజ్యభారముండును.

ఆశ్చర్యకరుడు ఆలోచనకర్త బలవంతుడైన దేవుడు

నిత్యుడగు తండ్రి సమాధానకర్తయగు అధిపతి అని అతనికి పేరు పెట్టబడును.

ఈ ప్రవచనంలో మొదటి రెండు వాక్యములు మాత్రమే ప్రభువైన యేసు క్రీస్తు యొక్క మొదటి రాకడలో నెరవేరినాయి. మిగిలినవి ఆయన రెండవ రాకడలో నెరవేరుతాయి. మొదటి సారి వచ్చినప్పుడు ప్రభువైన యేసు క్రీస్తు తన రాజ్యము గురించి మాట్లాడాడు.

ఇక్కడ నిలిచియున్న వారిలో కొందరు, మనుష్యకుమారుడు తన రాజ్యముతో వచ్చుట చూచువరకు మరణము రుచి చూడరని నిశ్చయముగా మీతో చెప్పుచున్నాననెను. మత్తయి 16:28

మనుష్య కుమారుని రాజ్యమును వారిలో కొంతమంది చూస్తారు అని యేసు ప్రభువు వారితో చెప్పాడు. వారందరూ రెండువేల సంవత్సరాల క్రితమే చనిపోయారు కదా! వారు ఎప్పుడు ఆయన రాజ్యమును చూశారు అని మనం అనుకోవచ్చు.

 ఒక కొండ మీద ఆయన రూపాంతరము చెంది వారికి తన మహిమ రాజ్యమును చూపించాడు.

  1. ఆరు దినములైన తరువాత యేసు పేతురును, యాకోబును అతని సహోదరుడైన యోహానును

వెంట బెట్టుకొని యెత్తయిన యొక కొండమీదికి ఏకాంతముగా పోయి వారి యెదుట రూపాంతరము పొందెను.

  1. ఆయన ముఖము సూర్యునివలె ప్రకాశించెను; ఆయన వస్త్రములు వెలుగువలె తెల్లనివాయెను.
  2. ఇదిగో మోషేయు ఏలీయాయు వారికి కనబడి ఆయనతో మాట లాడుచుండిరి.

                                                                                          మత్తయి సువార్త 17

ఇది యేసు ప్రభువు యొక్క రాబోయే రాజ్యము యొక్క తీపి జ్ఞాపకము. రూపాంతరపు కొండ మీద మోషే, ఏలీయాలు మనకు కనిపించుచున్నారు. వారు పాత నిబంధన సంబంధికులు.పేతురు, యాకోబు, యోహాను లు కూడా కనిపించుచున్నారు. వారు క్రొత్త నిబంధన సంబంధికులు. రాబోయే క్రీస్తు రాజ్యములో పాత నిబంధన, క్రొత్త నిబంధన రెండిటి యొక్క విశ్వాసులు పాలుపొందుతారు.

  ఏడేండ్ల శ్రమలు ప్రారంభము కాక ముందు ఎత్తబడిన క్రొత్తనిబంధన విశ్వాసులు, శ్రమల కాలములో రక్షించబడిన విశ్వాసులు, పాత నిబంధన విశ్వాసులు అందరూ క్రీస్తు రాజ్యములో ప్రవేశిస్తారు. ఆరాజ్యము గురించి 7 సంగతులు మీకు చూపించాలని నేను ఆశ పడుచున్నాను.

  1. సర్వాదికారం

క్రీస్తు యొక్క వెయ్యేళ్ళ పాలన ఆయన యొక్క సర్వాధికారముతో మొదలవుతుంది. ఆయన అధికారము అన్నిటి మీద ఉంటుంది. ఆయన సాతాను మీద సర్వాధికారము చూపిస్తాడు. సాతానుని భూమి మీద నుండి తీసి వేసి వెయ్యేళ్ళ పాటు అగాధములో బంధిస్తాడు. సాతానుడు తన వ్రేళ్ళను ఈ ప్రపంచములోని ప్రతి వ్యవస్థ లో పెట్టాడు. అయితే ప్రభువైన యేసు క్రీస్తు సాతాను అధికారాన్ని తుంచివేస్తాడు.

ప్రకృతి మీద ఆయన సర్వాధికారము ఉంటుంది. ఈ భూమండలము యొక్క నైసర్గిక స్వరూపాన్ని కూడా ఆయన మార్చివేస్తాడు. ఆయన రాజులకు రాజుగా, ప్రభువులకు ప్రభువుగా ఉంటాడు.

రాజులందరు అతనికి నమస్కారము చేసెదరు.

అన్యజనులందరు అతని సేవించెదరు. కీర్తనలు 72:11

అవిధేయులను ఆయన తన శక్తితో కుండను పగుల గొట్టినట్లు పగులగొడతాడు.

నేను నా పరిశుద్ధ పర్వతమైన సీయోను మీదనా రాజును ఆసీనునిగా చేసియున్నాను.

ఇనుపదండముతో నీవు వారిని నలుగగొట్టెదవు

కుండను పగులగొట్టినట్టు వారిని ముక్క చెక్కలుగా పగులగొట్టెదవు  

                                                                కీర్తనలు 2: 6-9

దానియేలు ప్రవక్త ‘చేతి సహాయము లేక తీయబడిన ఒక రాయి’ గా యేసు క్రీస్తు ను వివరించాడు.

మరియు చేతిసహాయము లేక తీయబడిన ఒక రాయి,

యినుమును మట్టియు కలిసిన ఆ ప్రతిమయొక్క

పాదములమీద పడి దాని పాదములను తుత్తునియలుగా విరుగగొట్టినట్టు తమకు కన బడెను.

అంతట ఇనుమును మట్టియు ఇత్తడియు వెండియు బంగారమును

ఏకముగా దంచబడి కళ్లములోని చెత్తవలె కాగా వాటికి స్థలము

ఎచ్చటను దొరకకుండ గాలి వాటిని కొట్టుకొనిపోయెను;

ప్రతిమను విరుగగొట్టిన ఆ రాయి సర్వభూతలమంత మహా పర్వతమాయెను.

                                                                  దానియేలు 2:34-35

చేతి సహాయము లేక తీయబడిన ఈ రాయి సర్వభూతలమంత మహా పర్వతముగా మారింది. అటువంటిశక్తిని ఎవ్వరూ క్రీస్తుకు ఇవ్వలేదు.ఆయన దేవుడు కాబట్టి అపరిమితమైన శక్తితో ఆ ప్రపంచాన్ని తన వశం చేసుకొనే శక్తి ఆయనకు ఉంది.

  రాజులకు రాజుగా ఆయన ఒక క్రొత్త రాజధానిని, క్రొత్త ఆలయమును, క్రొత్త రాజ్యాంగమును కలిగి ఉంటాడు.

యిర్మియా 30: 18

యెహోవా ఈ మాట సెలవిచ్చుచున్నాడు

యాకోబు నివాసస్థలములను కరుణించి వాని గుడారము లను నేను చెరలోనుండి రప్పింతును;

అప్పుడు పట్టణము దాని కొండమీద కట్టబడును,

నగరియు యథాప్రకారము నివాసులు గలదగును.

అప్పుడు పట్టణము దాని కొండమీద కట్టబడును,

యేసు ప్రభువు తిరిగివచ్చినప్పుడు నూతన యెరూషలేము కట్టబడుతుంది. నూతన దేవాలయము కూడా యెరూషలేములో కట్టబడుతుంది. యెహెఙ్కేలు 40-48 అధ్యాయాల్లో ఆ వివరాలు మనకు ఇవ్వబడ్డాయి.

ఆ నగరమునకు, ఆ దేవాలయమునకు ప్రభువుగా యేసు క్రీస్తు ఉంటాడు. ఆయనకు మంత్రి వర్గము, అధికారులు కూడా ఉంటారు.

మత్తయి సువార్త 19 లో ఒక వాక్య భాగము చూద్దాము.

మత్తయి సువార్త 19: 27-28

పేతురు – ఇదిగో మేము సమస్తమును విడిచిపెట్టి నిన్ను వెంబడించితివిు గనుక మాకేమి దొరకునని

ఆయనను అడుగగా యేసు వారితో ఇట్లనెను(ప్రపంచ) పునర్జననమందు మనుష్య కుమారుడు

తన మహిమగల సింహాసనముమీద ఆసీనుడై యుండునపుడు నన్ను వెంబడించిన మీరును పండ్రెండు

సింహాసనములమీద ఆసీనులై ఇశ్రాయేలు పండ్రెండు గోత్రముల వారికి తీర్పుతీర్చుదురు.

పేతురు గారు యేసు ప్రభువును అడిగాడు: ‘ప్రభువా, సమస్తము వదులుకొని నిన్ను వెంబడించాము. నీ వలన మాకు ప్రయోజనము ఏమిటి? ప్రభువు పేతురుతో ఏమన్నాడంటే, ‘నేను మహిమతో తిరిగివచ్చి, నా రాజ్యమును స్థాపించినప్పుడు మీ పండ్రెండు మందికి కూడా సింహాసనములు ఇవ్వబడుతాయి. మన ముఖ్య మంత్రులు, ప్రధాన మంత్రులు ఎన్నికలు ముగిసిన తరువాత ఎవరెవరిని మంత్రి వర్గములోకి తీసుకోవాలని హడావుడిగా తర్జన భర్జనలు చేస్తారు. యేసు ప్రభువు ప్రభుత్వములో అలా ఉండదు. ఆయన మంత్రివర్గములో ఎవరు ఉండేది దేవుడు 2000 సంవత్సరాల క్రితమే నిర్ణయించివేశాడు!

  నిజముగా వారు ఎంత ఆశీర్వదించబడినవారు! నాడు యేసు ప్రభువుతో కలిసి పరిచర్య చేశారు. భవిష్యత్తులో ఆయన తో కలిసి రాజ్యము చేస్తారు. మిగిలిన పరిశుద్ధులందరూ వారి క్రింద రాజ్యము చేస్తారు.

పరిశుద్ధులు లోకమునకు తీర్పు తీర్చుదురని మీరెరుగరా?  1 కొరింథీయులకు 6:2

ఆకాశమంతటి క్రిందనున్న రాజ్యమును అధికారమును రాజ్య మహాత్మ్యమును మహోన్నతుని

పరిశుద్ధులకు చెందును. ఆయన రాజ్యము నిత్యము నిలుచును దానియేలు  7:27

  1. సహవాసము

 వెయ్యేళ్ళ పాలనలో ఉండే ఒక మహద్భాగ్యము ఏమిటంటే విశ్వాసుల మధ్య ఉండే సహవాసము. విచారకరముగా ప్రస్తుతము మన మధ్య ఉన్న సహవాసము లోపభూయిష్టమైనది. పాపము సహవాసమును పాడుచేస్తుంది. సాతానుడు కూడా విశ్వాసుల మధ్య కలతలు సృష్టిస్తూనే ఉంటాడు. వ్యాధులు, మరణాలు కూడా విశ్వాసులను మన నుండి విడదీస్తాయి. అయితే క్రీస్తు వెయ్యేళ్ళ పాలనలో పాపము, సాతాను, వ్యాధులు, మరణాలు విడదీయలేని ఆనందకరమైన సహవాసము విశ్వాసులకు అనుగ్రహించబడుతుంది.

క్రొత్త నిబంధన విశ్వాసులే కాకుండా పాత నిబంధన పరిశుద్ధులు కూడా అక్కడ ఉంటారు. యెరూషలేములో మీరు నడుస్తా ఉంటే, ఏలీయా గారు మీకు ఎదురుపడవచ్చు. కాఫీ షాప్ లోకి వెళ్తే దానియేలు ప్రవక్త మీకు కనిపించవచ్చు. చేపల మార్కెట్ కి వెళ్తే పేతురు గారు తారసపడవచ్చు. లైబ్రరీ కి వెళ్తే అపొస్తలుడైన పౌలు కనిపించవచ్చు.

 దేవుని వెంబడించిన  పితరులందరూ, ప్రవక్తలందరూ, రాజులందరూ, యాజకులందరూ ఈ వెయ్యేళ్ళ పాలనలో పాలుపంచుకొంటారు. మానవ చరిత్ర గమ్యము అదే.

 ఎమ్మాయి దారిలో యేసు ప్రభువు పాత నిబంధన ప్రవక్తలు ఆయన గురించి చేసిన ప్రవచనములు శిష్యులకు గుర్తుచేశాడు. వెయ్యేళ్ళ పాలనలో ఆ అవసరం ఉండదు. ఆ ప్రవక్తలందరూ యెరూషలేములో ఉన్న ప్రభువైన యేసు క్రీస్తు సముఖములో ఉంటారు. ఆ సహవాసము అపూర్వమైనది, అనిర్వచనీయమైనది.

  1. సమాధానం

 

వెయ్యేళ్ళ పాలనలో నీతిమంతుల ప్రాభల్యము భూమి మీద స్థిరముగా ఉండుట వలన ఆ రాజ్యము సమాధానముతో నిండి ఉంటుంది. క్రీస్తు వెయ్యేళ్ళ పాలనలో ఎటువంటి సమాధానము భూమి మీద వికసిస్తుందో యెషయా, మీకా ప్రవక్తలు తెలియజేశారు.

నీతి సమాధానము కలుగజేయును

నీతివలన నిత్యమును నిమ్మళము నిబ్బరము కలుగును.

అప్పుడు నా జనుల విశ్రమ స్థలమునందును ఆశ్రయ స్థానములయందును

సుఖకరమైన నివాసముల యందును నివసించెదరు.  యెషయా 32:17

అంత్యదినములలో యెహోవా మందిరపర్వతము పర్వ తముల శిఖరమున

స్థిరపరచబడి కొండలకంటె ఎత్తుగా ఎత్తబడగా ప్రవాహము వచ్చినట్లు జనులు దానిలోనికి వత్తురు.

కాబట్టి ఆ కాలమున అన్యజనులనేకులు వచ్చి సీయోనులోనుండి  ధర్మశాస్త్రమును,

యెరూషలేములో నుండి యెహోవా వాక్కును బయలు వెళ్లును;

యాకోబు దేవుని మందిరమునకు యెహోవా పర్వతమునకు మనము వెళ్లుదము రండి,

ఆయన తనమార్గముల విషయమై మనకు బోధించును, మనము ఆయన త్రోవలలో నడుచుకొందము అని

చెప్పుకొందురు.

  1. ఆయన మధ్యవర్తియై అనేక జనములకు న్యాయము తీర్చును,

దూరమున నివసించు బలము గల అన్యజనులకు తీర్పు తీర్చును.

వారు తమ ఖడ్గములను నాగటి నక్కులుగాను తమ యీటెలను

మచ్చు కత్తులు గాను సాగకొట్టుదురు, జనము మీదికి జనము

ఖడ్గము ఎత్తక యుండును, యుధ్దముచేయ నేర్చుకొనుట జనులు ఇక మానివేతురు. మీకా 4:1

పోయిన సారి ఢిల్లీ నగరమునకు నేను వెళ్ళినప్పుడు నేను గాంధీ సమాధి దగ్గరకు వెళ్ళాను. ప్రక్కనే ఉన్న గాంధీ మ్యూసియం లోకి వెళ్ళాను. ఆ మ్యూసియం లో గాంధీ ని ప్రభావితము చేసిన గొప్ప ప్రసంగాలు ప్రదర్శితమై ఉన్నాయి. ప్రభువైన యేసు క్రీస్తు కొండ మీద ప్రసంగము అక్కడ వ్రాయబడి ఉంది. ఆ ప్రసంగములో యేసు క్రీస్తు ఆవిష్కరించిన శాంతి రాజ్యము కోసము గాంధీ వంటి గొప్ప నాయకులు కాంక్షించారు. కొండ మీద ప్రసంగము వెయ్యేళ్ళ పాలనలోని క్రీస్తు రాజ్యమునకు రాజ్యాంగము లాంటిది.

  1. సస్యశ్యామలత

వెయ్యేళ్ళ పాలనలో ఈ ప్రపంచములో ఇంతకు ముందెన్నడూ లేని సస్యశ్యామలత కనిపిస్తుంది. మన వాతావరణములో, నీటిలో, ఆహారములో పెరిగిపోతున్న కలుషితమును ఎలా అరికట్టాలో తెలియక ప్రపంచ నాయకులు, ప్రజలు తీవ్ర నిరాశకు గురికావటము మనము చూస్తూనే ఉన్నాము.

వెయ్యేళ్ళ పాలనలో క్రీస్తు ఈ కలుషిత వాతావరణాన్ని మార్చివేసి ఏదెను వనము నాటి పరిస్థితులను తెస్తాడు.

నీవు నీ భూమిలో విత్తుటకు నీ గింజలకు కావలసిన వాన ఆయన కురిపించును

భూమి రాబడియైన ఆహారద్రవ్యమిచ్చును

అది విస్తార సార రసములు కలదై యుండును

ఆ దినమున నీ పశువులు విశాలమైన గడ్డిబీళ్లలో మేయును. యెషయా 30:23

ఈ రోజు రైతు బజారులకు వెళ్తే ఏవి నిజమైన విత్తనాలో, ఏవి నకిలీ విత్తనాలో గుర్తించలేని పరిస్థితి ఉంది. ఎంతో కష్టించి సాగుచేసినా ఉత్పత్తి సరిగా లేక రైతులు ఆందోళన చెందుతున్నారు. కరువు వలన పశువులు ఎముకుల గూళ్ళుగా బక్కచిక్కి పోవటం చూసి మనం చాలా సార్లు విచారిస్తున్నాము. అయితే, యెషయా క్రీస్తు రాజ్యములో వ్యవసాయము ఎలా ఉంటుందో వ్రాశాడు. వానలు సమృద్ధిగా కురుస్తాయి. భూమి రాబడి పెరుగుతుంది. మనుష్యుల ఆకలి తీరటమే కాకుండా, పశువులకు కూడా విస్తారముగా గడ్డి దొరుకుతుంది. ఎక్కడా కరువు ఉండదు.

  1. సంతోషం

వెయ్యేళ్ళపాలనలో ఉండే దేవుని సంతోషము గురించి కూడా ప్రవక్తలు మనకొరకు వ్రాశారు.

  1. ప్రభువగు యెహోవా ఆత్మ నా మీదికి వచ్చియున్నది

దీనులకు సువర్తమానము ప్రకటించుటకు యెహోవా నన్ను అభిషేకించెను

నలిగిన హృదయముగల వారిని దృఢపరచుటకును చెరలోనున్నవారికి

విడుదలను బంధింపబడిన వారికి విముక్తిని ప్రకటించుటకును

  1. యెహోవా హితవత్సరమును మన దేవుని ప్రతిదండన

దినమును ప్రకటించుటకును దుఃఖాక్రాంతులందరిని ఓదార్చుటకును

  1. సీయోనులో దుఃఖించువారికి ఉల్లాస వస్త్రములు

ధరింపజేయుటకును బూడిదెకు ప్రతిగా పూదండను

దుఃఖమునకు ప్రతిగా ఆనందతైలమును భారభరితమైన ఆత్మకు

ప్రతిగా స్తుతివస్త్రమును వారికిచ్చుటకును ఆయన నన్ను పంపియున్నాడు. యెషయా 61

 

యెషయా చేసిన ఈ ప్రవచనమును ప్రభువైన యేసు క్రీస్తు తనకు అన్వయించుకొన్నాడు. లూకా సువార్త 4:17-20 అధ్యాయములో ఒక విశ్రాంతి దినము రోజున ఆయన యూదుల సమాజ మందిరమునకు వెళ్ళాడు.

యెషయా 61 లోని ప్రవచనము వారికి చదివి వినిపించాడు. అప్పుడు వారందరూ షాక్ అయ్యే మాట వారితో అన్నాడు: యెషయా చేసిన ఈ ప్రవచనము నా గురించే. ఈ రోజు ఆ ప్రవచనము నెరవేరింది. ఆయన మాటలు విని వారు అవాక్కయ్యారు.

  ప్రభువు హితవత్సరము ప్రకటించుటకు…అని పలికి ఆయన ఆపివేశాడు. ఎందుకంటే ఆ ప్రవచనములో అంత మేరకే ప్రభువైన యేసు క్రీస్తు యొక్క మొదటి రాకడలో నెరవేరింది. మిగిలినది ఆయన వెయ్యేళ్ళ పాలనలో నెరవేరవలసి ఉంది. అప్పుడు దుఃఖాక్రాంతులను ఆయన ఓదార్చుతాడు, వారికి ఉల్లాస వస్త్రములు ధరింపజేస్తాడు, ఆనంద తైలముతో వారిని అభిషేకిస్తాడు.

 అబ్రహాము ఆ దినాన్నిచూసి ఆనందిస్తాడు ఎందుకంటే దేవుడు చేసిన అన్నీ ప్రవచనములకు అది సంపూర్ణత.మోషే ఆ దినాన్ని చూసి ఆనందిస్తాడు, ఎందుకంటే దాని కోసము ఆయన క్రీస్తు విషయమైన నింద భరించాడు, ఐగుప్తు యొక్క తాత్కాలిక సుఖాల కోసం, పాపాల కోసం ఆయన తాపత్రాయపడలేదు. అహరోను ఆదినాన్ని చూసి ఆనందిస్తాడు, ఎందుకంటే ప్రధాన యాజకుడైన క్రీస్తు సన్నిధి అందరికీ లభిస్తుంది. యెహోషువ ఆ దినాన్ని చూసి ఆనందిస్తాడు, ఎందుకంటే దేవుడు వాగ్దానము చేసిన భూమి మొత్తము అబ్రహాము సంతానము ఆక్రమించుకొంటుంది. దావీదు ఆ దినం చూసి ఆనందిస్తాడు, ఎందుకంటే ఆయన కీర్తనలు వ్రాసి, పాటలు పాడింది దాని కోసమే. అపొస్తలుడైన పౌలు దానిని చూసి ఆనందిస్తాడు, ఎందుకంటే ఆయన ప్రయాస పడి సువార్త ప్రకటించింది దాని కోసమే. క్రైస్తవ సంఘ మొదటి హత సాక్షి స్తెఫను ఆ దినాన్ని చూసి ఆనందిస్తాడు ఎందుకంటే ఆయన చిందించిన రక్తము వ్యర్ధము కాలేదు.

 ఆ గొప్ప సంతోషము ఎలా ఉంటుందో ప్రవక్తలు వివరించారు.

కావున మీరు ఆనందపడి రక్షణాధారములైన బావులలోనుండి నీళ్లు చేదుకొందురు.యెషయా 12:3

దేశమా, భయపడక సంతోషించి గంతులు వేయుము,

యెహోవా గొప్పకార్యములు చేసెను.

పశువులారా, భయపడకుడి, గడ్డిబీళ్లలో పచ్చిక మొలుచును,

చెట్లు ఫలించును, అంజూరపుచెట్లును, ద్రాక్షచెట్లు సమృద్ధిగా ఫలించును,

సీయోను జను లారా, ఉత్సహించి మీ దేవుడైన యెహోవాయందు సంతోషించుడి. యోవేలు 2:21-23

ఆ దినమున చెవిటివారు గ్రంథవాక్యములు విందురు

అంధకారము కలిగినను గాఢాంధకారము కలిగినను

గ్రుడ్డివారు కన్నులార చూచెదరు.

యెహోవాయందు దీనులకు కలుగు సంతోషము అధిక మగును

మనుష్యులలో బీదలు ఇశ్రాయేలుయొక్క పరిశుద్ధ దేవుని యందు ఆనందించెదరు. యెషయా 29: 18-19

నాకు దేహములో బాగులేదని అందులో నివసించు వాడెవడును అనడు. యెషయా 33:24

నేను యెరూషలేమునుగూర్చి ఆనందించెదను

నా జనులనుగూర్చి హర్షించెదను

రోదనధ్వనియు విలాపధ్వనియు దానిలో ఇకను విన బడవు.

అక్కడ ఇకను కొద్దిదినములే బ్రదుకు శిశువులుండరు

కాలమునిండని ముసలి వారుండరు

బాలురు నూరు సంవత్సరముల వయస్సుగలవారై చని పోవుదురు

పాపాత్ముడై శాపగ్రస్తుడగువాడు సహితము నూరు సంవత్సరములు బ్రదుకును. యెషయా 65:19-20

నేటి ప్రపంచములో వంద సంవత్సరాలు దాటిన వారిని శతాధిక వృద్ధుడు లేక వృద్ధురాలు అని న్యూస్ పేపర్ లలో వ్రాసి గొప్పగా చెప్పుకొంటారు. అయితే యేసు క్రీస్తు పాలనలో వంద సంవత్సరాలు అంటే చాలా చిన్న ప్రాయము గా ఉంటుంది. ఎవరైనా అప్పుడు వందేళ్లకు చనిపోతే, ‘పాపం, వందేళ్లకే ఈ వ్యక్తి చనిపోయాడు’ అని జనం అనుకొంటారు.

  1. సంఘీభావం

 

క్రీస్తు వెయ్యేళ్ళ పాలనలో కూడా ఈ ప్రపంచములో ఇంతకు ముందెన్నడూ లేని సంఘీభావము కనిపిస్తుంది. యెషయా ప్రవక్త దాని గురించి వ్రాశాడు.

తోడేలు గొఱ్ఱపిల్లయొద్ద వాసముచేయును

చిఱుతపులి మేకపిల్లయొద్ద పండుకొనును

దూడయు కొదమసింహమును పెంచబడిన కోడెయు

కూడుకొనగా బాలుడు వాటిని తోలును.

ఆవులు ఎలుగులు కూడి మేయును

వాటి పిల్లలు ఒక్క చోటనే పండుకొనును ఎద్దు మేయునట్లు సింహము గడ్డి మేయును.

పాలుకుడుచుపిల్ల నాగుపాము పుట్టయొద్ద ఆట్లాడును

మిడినాగు పుట్టమీద పాలువిడిచిన పిల్ల తన చెయ్యి చాచును.  

నా పరిశుద్ధ పర్వతమందంతటను ఏ మృగమును హాని చేయదు

నాశముచేయదు సముద్రము జలముతో నిండియున్నట్టు

లోకము యెహోవానుగూర్చిన జ్ఞానముతో నిండి యుండును.  యెషయా 11:6-9

70 మైళ్ళ కన్నా వేగముతో భూమి త్రొక్కి ఇతర జీవులను చీల్చుకుతినే చిఱుత పులి లాంటి క్రూర జీవులు కూడా ప్రభువైన యేసు క్రీస్తు రాజ్యములో సాధు జంతువులుగా మారుతాయి. మానవుల మధ్యే కాకుండా జంతువుల మధ్య కూడా ఆయన శత్రుత్వమును తీసివేసి సమాధానముతో నింపుతాడు.

  1. సమకూర్పు

యెషయా చెప్పిన మరికొన్ని ప్రవచనాలు చూద్దాము:

ఆ దినమున శేషించు తన ప్రజల శేషమును

అష్షూరులోనుండియు ఐగుప్తులోనుండియు పత్రోసులోనుండియు కూషులోనుండియు

ఏలాములోనుండియు షీనారులోనుండియు హమాతులో నుండియు

సముద్రద్వీపములలో నుండియు విడిపించి రప్పించుటకు

యెహోవా రెండవమారు తన చెయ్యి చాచును.

జనములను పిలుచుటకు ఆయన యొక ధ్వజము నిలువ బెట్టును భ్రష్టులైపోయిన

ఇశ్రాయేలీయులను పోగుచేయును భూమియొక్క నాలుగు దిగంతములనుండి చెదరి పోయిన

యూదా వారిని సమకూర్చును. యెషయా 11:11-12

వెయ్యేళ్ళ పాలన ప్రారంభములో దేవుడు ప్రపంచమంతా చెదిరిపోయి ఉన్న యూదులను వారి స్వదేశమైన ఇశ్రాయేలు దేశమునకు తిరిగి తీసుకొని వెళ్తాడు. అప్పుడు యూదులు వారి దేశములో ఎటువంటి భయము లేకుండా జీవిస్తారు. ఆ రోజులు ఎలా ఉంటాయో యిర్మీయా ప్రవక్త తెలియజేశాడు.

యెహోవా ఈలాగు ఆజ్ఞ ఇచ్చుచున్నాడు

రాబోవు దినములలో నేను దావీదునకు నీతి చిగురును పుట్టించెదను;

అతడు రాజై పరిపాలన చేయును,

అతడు వివేకముగా నడుచుకొనుచు కార్యము జరిగించును,

భూమిమీద నీతి న్యాయములను జరిగించును.

అతని దినములలో యూదా రక్షణనొందును,

ఇశ్రాయేలు నిర్భయముగా నివసించును,

యెహోవా మనకు నీతియని అతనికి పేరు పెట్టుదురు.యిర్మీయా 23:5-6

పోయిన సారి నేను ఇశ్రాయేలు దేశము వెళ్ళినప్పుడు ఒక రోజు మన ప్రభువు జన్మించిన బేత్లెహేముకు వెళ్లుచున్నాను. నా కారు డ్రైవర్ నన్ను రాహేలు సమాధి దగ్గరకు తీసుకొని వెళ్ళాడు. అక్కడ ఉన్న భవనములోకి వెళ్ళాను. చాలా మంది యూదులు అక్కడ సంప్రదాయ దుస్తుల్లో ఉన్నారు. ఆ భవనము చుట్టూ చాలా ఎత్తైన గోడలు నిర్మించారు. చాలా మంది ఇశ్రాయేలీ సైనికులు అక్కడ AK 47 తుపాకులు తీసుకొని ఎంతో జాగ్రత్తగా కావలి యున్నారు. దానికి మార్గము కూడా భూగర్భము లో గుండా వేశారు. అక్కడ నుండి బయలుదేరి వెళ్ళేటప్పుడు నా టాక్సీ డ్రైవర్ని నేను అడిగాను: ‘ఎందుకు ఇక్కడ ఇంత సెక్యూరిటీ ఉంది?’ అతడు యేమని చెప్పాడంటే,

‘టెర్రరిస్టులు ఈ ప్రాంతము మీద ఇప్పటికే ఒక సారి దాడి చేశారు. వారు సమీపములో గాజా ప్రాంతము నుండి భూగర్భము లో టన్నెల్ ల ద్వారా, వాయు మార్గము ద్వారా, సముద్ర మార్గము ద్వారా ఎలాగైనా మా మీద దాడి చేసి మా ప్రాణాలు తీయాలని చూస్తున్నారు. మేము ఇక్కడ నిర్భయముగా జీవించే పరిస్థితి లేదు.’

ఈ పరిస్థితులు యేసు ప్రభువు రాజ్యములో ఉండవు అని యిర్మీయా ప్రవచించాడు. ఆయన దినములలో యూదాకు రక్షణ కలుగుతుంది, ఇశ్రాయేలు నిర్భయముగా నివసిస్తుంది. వెయ్యేళ్ళ పాలనలో యూదులకు సమాధానము కలుగుతుంది.

డాక్టర్ పాల్ కట్టుపల్లి MD can be reached at info@doctorpaul.org

Feed a Hungry Child with as little as $10 per month

Give a helping hand to feed the hungry children and to provide them health care and education

$10.00

Leave a Reply