నిర్గమ 12: ప్రవచనాల్లో పస్కా పండుగ
బైబిల్ ప్రవచనాలు మనము ధ్యానము చేస్తున్నాము. ఇశ్రాయేలీయులు ఐగుప్తులో ఉన్నారు. వారు ఫరో చక్రవర్తి క్రింద బానిసత్వములో మ్రగ్గుచూ ఉన్నారు. దేవుడు వారి యొద్దకు మోషేను పంపాడు. మోషే ఫరోని కోరాడు: నా ప్రజలను వెళ్లనివ్వు. అయితే ఫరో తన హృదయాన్ని కఠినము చేసాడు. ఇంకోసారి నాకు కనిపించావంటే నిన్ను చంపేస్తాను అని మోషే కి గట్టి వార్నింగ్ ఇచ్చి పంపించాడు. దేవుడు ఐగుప్తు దేశము మీదకు 10 రకాల తెగుళ్లు పంపించాడు. ఫరో కి తన శక్తి ఏమిటో అర్ధమయ్యేలా
చేశాడు. తన ప్రజలకు విడుదల అనుగ్రహించాడు. క్రీ.పూ 1446 లో ఇశ్రాయేలీయులు ఐగుప్తు దేశము వదలి, తమ అరణ్య యాత్ర ప్రారంభించారు. ఐగుప్తు దేశము విడిచివెళ్లేముందు ఇశ్రాయేలీయులు పస్కా పండుగ ఆచరించారు. ఇశ్రాయేలీయుల చరిత్రలో, బైబిలు ప్రవచనాల్లో ఈ సంఘటనలకు ఎంతో ప్రాధాన్యత ఉంది. భవిష్యత్తులో రాబోయే క్రీస్తు విరోధి ఫరో లాగానే ఉంటాడు. దేవుని ప్రజలను
హింసిస్తాడు. ఐగుప్తు మీదకు గొప్ప తెగుళ్లు పంపినట్లుగానే, క్రీస్తు విరోధి రాజ్యము మీదకు దేవుడు తెగుళ్లు పంపిస్తాడు. ఫరో పట్ల దేవుడు ఎంతో సహనాన్ని చూపించాడు. అతడు మారు మనస్సు పొండుతాడేమో నని ఎదురుచూశాడు. ఫరో తన హృదయాన్ని కఠినము చేసుకొన్నాడు కానీ మారు
మనస్సు పొందలేదు. అప్పుడు దేవుని శిక్ష అతని మీదకు వచ్చింది. ఈ రోజు కూడా మారుమనస్సు పొందుటకు రక్షణ లేని వారికి సమయము ఇస్తున్నాడు. సమయము వున్నప్పుడే వారు రక్షణ
పొందితే మంచిది. ఫరో కి దేవుని భయము లేదు.రాబోయే క్రీస్తు విరోధికి కూడా దేవుని భయము
ఉండదు. ఫరో కి దీన మనస్సు లేదు. నేనే దేవుణ్ణి అనుకొన్నాడు.గర్వముతో అరిచాడు: నేను నీ మాట
వినుటకు ఎవడ్రా నీ దేవుడు.గెట్ అవుట్’ అని మోషే గారిని గెంటివేశాడు. అంత్య క్రీస్తు కూడా అంతే. నేనే దేవుణ్ణి అని ఈ ప్రపంచానికి ప్రకటించుకొంటాడు. తనను విమర్శించిన ప్రవక్తలను
చంపివేస్తాడు. ఫరో మీదకు, ఐగుప్తు మీదకు దేవుడు పంపిన తెగుళ్లు ఒక దాని తరువాత ఒకటి తీవ్ర రూపము దాల్చినాయి. ఏడేండ్ల శ్రమలలో కూడా ఈ ప్రపంచము మీదకు వచ్చే తెగుళ్లు ఒక దాని తరువాత ఒకటి తీవ్రరూపము దాల్చుతాయి.
ఫరో దేవుని వాక్యము వింటే బాగుండేది. అతని ప్రవర్తన వలన ఎంత నష్టము జరిగింది? 10 తెగులు వలన ప్రతి ఇంటిలో ప్రథమ సంతానము మృత్యువాత పడ్డారు. దేవుని మాటలో జీవము
ఉంది. సాతాను మాటలో మరణము ఉంది. ఈ మధ్యలో కబీర్ సింగ్ అనే సినిమా వచ్చింది. ఆ సినిమా నేను చూడలేదు కానీ న్యూస్ పేపర్లో చదివినది చెబుతున్నాను. ఈ సినిమా లో హీరో ఒక డాక్టర్. విచ్చలవిడిగా బ్రతుకుతాడు. త్రాగుతాడు, డ్రగ్స్ వాడుతాడు. మద్యము త్రాగి హాస్పిటల్ కి వెళ్తాడు, ఆపరేషన్ లు చేస్తాడు, కోపమొస్తే బూతులు తిడతాడు, కొడతాడు. ఇలాంటి క్యారెక్టర్ లను హీరోలుగా చూపిస్తున్నారు. ఈ సినిమాలు ఇప్పుడు వందల కోట్లు వసూళ్లు చేస్తున్నాయి. చిత్ర పరిశ్రమలో ఒక రోజుల్లో గొప్ప దర్శకులు ఉండేవారు. 1956 లో సెసిల్ బి డెమిల్ టెన్ కమాండ్మెంట్స్ చిత్రం తీశాడు. ఈజిప్ట్ వెళ్లి అక్కడ పిరమిడ్ల మీదకు ఎక్కి ఎంతో శ్రమ తీసుకొని ఆ చిత్రం నిర్మించాడు.ప్రపంచ వ్యాప్తముగా ఎన్నో వందల కోట్ల మంది ఆ సినిమా చూశారు.ఎంత గొప్ప దేవుడు అనుకొన్నారు. ఐగుప్తు దేశము నకు తన మహా శక్తిని చూపించి, ఫరో రాజు నుండి ఇశ్రాయేలీయులను విడిపించి మోషే లాంటి గొప్ప నాయకుణ్ణి తయారు చేసి, అరణ్యములో తన ప్రజలకు పది ఆజ్ఞలతో ధర్మశాస్త్రము ఇచ్చాడు. ఎంత గొప్ప దేవుడు ఈయన అనుకొన్నారు. ఒక రోజుల్లో హాలీవుడ్ అలా ఉండేది. వారు దేవునికి దూరముగా వెళ్ళిపోయిన తరువాత డ్రగ్స్ వాడే హీరోలను తయారు చేశారు. అదే సంస్కృతి ఇప్పుడు బాలీవుడ్ లో, టాలీవుడ్ లో మనము చూస్తున్నాము.
ఒక రోజుల్లో హీరో ఒక అమ్మాయినే ప్రేమించేవాడు.ఇప్పుడు కట్టుబాట్లు లేకుండా, విచ్చలవిడిగా తిరగటం ఫాషన్ గా చూపిస్తున్నారు. ఒక రోజుల్లో హీరో బూతులు తిట్టేవాడు కాదు.ఇప్పుడు హీరో బూతులు తిట్టడం ఫ్యాషన్ గా మారింది. ఒక రోజుల్లో హీరో తల్లిదండ్రులను గౌరవించేవాడు.ఇప్పుడు హీరో తల్లి దండ్రుల మీద జోకులు వేసి వారిని అపహాస్యము చేయటం ఫ్యాషన్ గా చూపిస్తున్నారు. ఒక రోజుల్లో హీరో డ్రగ్స్ వాడేవాడు కాదు. విలన్ మాత్రమే డ్రగ్స్ అమ్మేవాడు. ఆ విలన్ పట్టుకొని పోలీసులకు అప్పజెప్పేవాడు. ఇప్పుడు హీరో డ్రగ్స్ తీసుకొని, గడ్డం పెంచుకొని, కుక్క పిల్లను తీసుకొని రోడ్డు మీద తిరగడం ఫ్యాషన్ గా చూపిస్తున్నారు. దేవుడు లేకపోతే ఇలాంటి క్యారెక్టర్ లే హీరోలుగా తయారవుతారు. మోషే లో ఒక నిజమైన హీరో ని మనము చూస్తున్నాము. ఐగుప్తులో పాప భోగాలు ఉన్నాయి. మోషే వాటిని కోరుకోలేదు, నాకు క్రీస్తు కావాలి, నాకు యేసు క్రీస్తు కావాలి, ఆయన రక్షణ కావాలి, ఆయన వాక్యము కావాలి, నాకు అంతఃపురము అక్కరలేదు, క్రీస్తు కోసము అరణ్యము అయినా సరే వెళ్తాను అని బయలుదేరాడు.
యెషయా గ్రంథము లో అనేక ప్రవచనాలు మనము చూస్తాము. దేవుడు పదే పదే నిర్గమ కాండము వారికి గుర్తు చేశాడు. (యెషయా 11:15; 43:14-21; 51:9-11). ఐగుప్తు లో నుండి నా ప్రజలను ఏవిధముగా పూర్వము విడిపించానో, అదే విధముగా రాబోయే రోజుల్లో నా ప్రజలను విడిపిస్తాను. యెషయా గ్రంథము 51 అధ్యాయములో కొన్ని మాటలు చూద్దాము:
- యెహోవా బాహువా, లెమ్ము లెమ్ము బలము తొడుగు కొమ్ము
పూర్వపుకాలములలోను పురాతన తరములలోను లేచి నట్లు లెమ్ము
- అగాధ జలములుగల సముద్రమును ఇంకిపోజేసిన వాడవు
నీవే గదా? విమోచింపబడినవారు దాటిపోవునట్లు
సముద్రాగాధ స్థలములను త్రోవగా చేసినవాడవు నీవే గదా?
- యెహోవా విమోచించినవారు సంగీతనాదముతో సీయోనునకు
తిరిగి వచ్చెదరు నిత్యసంతోషము వారి తలలమీద ఉండును వారు
సంతోషానందము గలవారగుదురు.
యెషయా ప్రవక్త ఏమంటున్నాడంటే, దేవుడు మీకు రక్షణ ఇవ్వబోతున్నాడు. ఆయన ఎలాంటి దేవుడు? అగాధ జలములుగల సముద్రమును ఇంకిపోజేసిన వాడు. తన ప్రజల కోసము సముద్రాగాధ స్థలములను త్రోవగా చేసినవాడు. నేను చాలా సముద్రాలు చూశాను. అవి చాలా లోతుగా ఉంటాయి. అలాంటి సముద్రాన్ని చీల్చి తన ప్రజలను రక్షించిన దేవుడు ఈయన.
యెషయా గ్రంథము 11:16 కూడా చూద్దాము.
- కావున ఐగుప్తుదేశము నుండి ఇశ్రాయేలు వచ్చిన దినమున
వారికి దారి కలిగినట్లు అష్షూరునుండి వచ్చు
ఆయన ప్రజల శేషమునకు రాజమార్గముండును
- And there shall be a highway for the remnant of His people
ఐగుప్తు నుండి సముద్రములో, అరణ్యములో దారి వేసిన దేవుడు ఇప్పుడు తన ప్రజల ముందు ఒక రాజ మార్గము వేశాడు. ఒక హై వే వేశాడు. కేంద్ర ప్రభుత్వము బడ్జెట్ లో పెట్టింది. ప్రతి రోజు 20 కి మీ హై వే వేద్దాము అని లక్ష్యముగా పెట్టుకొంది. హై వే లు ముఖ్యము. యెషయా గ్రంథము లో ఈ హై వే అనే మాట అనేక చోట్ల మనము చూస్తాము. రాజ మార్గము. ప్రభువైన యేసు క్రీస్తు ఈ రాజ మార్గమును వేశాడు. ఆయన ఈ హై వే ని నిర్మించాడు. ఈ రాజ మార్గము ఆయన ఎలా వేశాడు? ఇంతకు ముందు మనము యెషయా చెప్పిన మాటలు చూశాము.
విమోచింపబడినవారు
దాటిపోవునట్లు సముద్రాగాధ
స్థలములను త్రోవగా చేసినవాడు.
ఆ రాజ మార్గము మీదకు మీరు వెళ్లాలంటే మీరు విమోచించబడాలి. దేవుడు ఆ ఏర్పాట్లు కూడా చేశాడు. మోషేని పిలిచాడు. మీరు పస్కా పండుగ ఆచరించండి. పస్కా బలి గా గొఱ్ఱెపిల్ల ను అర్పించండి. ఆ గొఱ్ఱెపిల్ల రక్తాన్ని మీ ఇంటి ద్వారబంధముల మీద పూయండి. పస్కా గొఱ్ఱెపిల్ల బైబిలు ప్రవచనాల్లో ఎంతో ప్రాధాన్యత కలిగింది.
ఆదికాండము 22 అధ్యాయములో మనము అబ్రహాము, అతని కుమారుడు ఇస్సాకులను చూస్తాము. ఆ మోరియా పర్వతము మీద ఇస్సాకు అబ్రహామును అడిగాడు: నా తండ్రీ, నిప్పును కట్టెలును ఉన్నవి గాని దహనబలికి గొఱ్ఱపిల్ల ఏది? అబ్రహాము యేమని చెప్పాడు? నా కుమారుడా, దేవుడే దహనబలికి గొఱ్ఱపిల్లను చూచుకొనును. దేవుడు చేసిన గొప్ప కార్యము అదే. మన కోసము ఒక పస్కా గొఱ్ఱెపిల్లను ఆయన సిద్ధము చేశాడు. ప్రభువైన యేసు క్రీస్తు ఈ భూమి మీదకు వచ్చినప్పుడు బాప్తిస్మ మిచ్చే యోహాను ఆయనను చూపించి:
ఇదిగో లోకపాపమును మోసికొనిపోవు దేవుని గొఱ్ఱపిల్ల.
ఈ గొఱ్ఱెపిల్ల ఒక్క ఇశ్రాయేలీయుల పాపములు మాత్రమే కాకుండా ప్రపంచ ప్రజలందరి పాపములు
సిలువ మీద మోసింది.
అపొస్తలుల కార్యములు 8 అధ్యాయములో మనము ఒక నపుంసకుని గురించి చదువుతాము.
ఈ నపుంసకుడు ఇథియోపియా దేశానికి చెందిన వాడు. ఒక రథములో యెరూషలేము వెళ్తున్నాడు. యెషయా గ్రంథము 53 అధ్యాయము చదువుతున్నాడు.
ఆయన గొఱ్ఱవలె వధకు తేబడెను
బొచ్చు కత్తిరించువాని యెదుట గొఱ్ఱపిల్ల
ఏలాగు మౌనముగా ఉండునో
ఆలాగే ఆయన నోరు తెరవకుండెను.
ఆ మాటలు ఆ నపుంసకునికి అర్ధము కాలేదు. గొఱ్ఱవలె వధకు తేబడింది ఎవరు? గొఱ్ఱపిల్ల వలె మౌనముగా ఉంది ఎవరు? ఆ సమయములో ఫిలిప్పు ఆ వీధిలో ఉన్నాడు. ఆయన ఆ రథము వద్దకు పరుగెత్తుకొంటూ వెళ్ళాడు. ‘మీరు చదివేది మీకు అర్ధము అవుతుందా?’ అని అడిగాడు. ఎవరన్నా నాకు వివరించకపోతే ఎలా అర్ధం అవుతుంది? అని నపుంసకుడు ప్రత్యుత్తరము ఇచ్చాడు. ఫిలిప్పును తన రథము మీదకు ఆహ్వానించాడు. ఫిలిప్పు యెషయా ప్రవక్త వ్రాసిన మాటలు నపుంసకునికి వివరించాడు. యెషయా ప్రవచించిన ఈ గొఱ్ఱె పిల్ల ఎవరంటే ప్రభువైన యేసు క్రీస్తే.
నపుంసకుడు ఆ సత్యము తెలుసుకొని తన రథము ఆపించి బాప్తిస్మము పొందాడు.
తార్సు వాడైన సౌలు క్రైస్తవ్యమును రూపు మాపవలెనని కంకణము కట్టుకున్నాడు. దమస్కు వెళ్ళుతూ మార్గమధ్యములో సజీవుడైన యేసు ప్రభువు ను చూశాడు. తన తప్పు తెలుసుకొన్నాడు. ఎవరీ యేసు క్రీస్తు అని పాత నిబంధన మొత్తము ధ్యానము చేశాడు. ప్రవక్తలందరూ చెప్పింది ఈ యేసు క్రీస్తు గురించే అని గ్రహించాడు. 1 కొరింథీ పత్రికలో వ్రాశాడు.
క్రీస్తు అను మన పస్కా పశువు
వధింపబడెను
(1 కొరింథీ 5:7)
ధర్మశాస్త్రాన్ని ఎంతో క్షుణ్ణముగా పాటిస్తున్న ఈ పరిసయ్యుడు దాని ద్వారా దేవుని నీతిని పొందలేము అని గ్రహించాడు. వధింపబడిన క్రీస్తు యొద్దకు వచ్చి ఆయన రక్తము ద్వారా కడుగబడాలి అని గ్రహించాడు. ఈ గొఱ్ఱెపిల్ల రక్తము ఎలాంటిది? మొదటి పేతురు పత్రికలో
మనం చదువుతాము.
- పితృపారంపర్యమైన మీ వ్యర్థప్రవర్తనను విడిచిపెట్టునట్లుగా
వెండి బంగారములవంటి క్షయ వస్తువులచేత మీరు
విమోచింపబడలేదుగాని
- అమూల్యమైన రక్తముచేత,
అనగా నిర్దోషమును నిష్కళంకమునగు
గొఱ్ఱపిల్లవంటి క్రీస్తు రక్తముచేత, విమోచింపబడితిరని మీరెరుగుదురు గదా
1 పేతురు 1:18-20
పేతురు స్వాతంత్రము కోరుకున్నాడు. ఆ రోజుల్లో యూదులు రోమన్ల క్రింద బానిసలుగా ఉన్నారు. యేసు ప్రభువుకు అడ్డుపడ్డాడు. సిలువ నీకు వద్దు, ఈ రోమన్ల నుండి మమ్ములను విడిపించు
చాలు, సీజర్ పాలన నుండి మమ్ములను విడిపించు చాలు అన్నాడు. యేసు క్రీస్తు సిలువను ఎందుకు
కోరుకొంటున్నాడో పేతురుకు చాలా కాలము అర్ధము కాలేదు. యేసు క్రీస్తు ప్రభువు సిలువ వేయబడి
మరణించి, తిరిగి లేచిన తరువాత ఈ సత్యము పేతురుకు అర్ధము అయ్యింది. రాజకీయ స్వాతంత్రము కన్నా ముఖ్యమైనది, సామాజిక స్వాతంత్రము కన్నా ముఖ్యమైనది ఆత్మీయ
స్వాతంత్రము. ఆ స్వాతంత్రము పొందాలంటే ఈ పస్కా గొఱ్ఱె పిల్ల దగ్గరకు రావాలి. ఆయన యొక్క అమూల్యమైన, నిర్దోషమైన, నిష్కళంకమైన రక్తము చేత విమోచించబడాలి.
క్రీ పూ 1446 లో ఇశ్రాయేలీయులు ఐగుప్తు దేశము నుండి స్వాతంత్రము పొందారు. అయితే దేవుడు వారితో ఏమన్నాడు? అది ఒక్కటే మీకు చాలదు. మీరు గొఱ్ఱె పిల్ల రక్తము చేత విమోచించబడాలి. అదే మీకు నిజమైన స్వాతంత్రము. పస్కా పండుగను ఇశ్రాయేలీయులు అప్పుడు
ఆచరించారు. అప్పటి నుండి వారు ప్రతి సంవత్సరము వారు ఆ పండుగను ఆచరించారు. అది వారికి ఇండిపెండెన్స్ డే లాంటిది.
నిర్గమ కాండము 12 అధ్యాయములో పస్కా పండుగ గురించి వివరించబడింది. బైబిల్ లో మనము ఏమి చదివినా దానిని క్రీస్తు వెలుగు లో చూడాలి. ఈ పస్కా పండుగను మనము క్రీస్తు వెలుగు లో ధ్యానిస్తే, ఆయన రూపం మనకు ఇక్కడ కనిపిస్తుంది. ఈ వాక్య భాగాలు మనం ధ్యానం చేసేటప్పుడు
మనం లోతుగా వెళ్ళాలి.పైపైన చదివితే లాభము ఉండదు. ఈ పస్కా పండుగ మీద నేను ఒక చార్ట్ చేశాను. పస్కా పండుగలో ప్రభువైన యేసు క్రీస్తు మనకు ఎలా కనిపిస్తున్నాడు పాయింట్ బై పాయింట్ ఈ చార్ట్ లో నేను చూపించాను. మా వెబ్ సైట్ www.doctorpaul.org కి వెళ్లి దీనిని డౌన్ లోడ్ చేసుకోండి.
ఇశ్రాయేలీయులు ఐగుప్తు దేశములో బానిసలుగా ఉన్నారు. ఫరో శక్తి క్రింద వారు బంధించబడివున్నారు. ఫరో మీద తిరగబడి ఫరోను యుద్ధములో ఓడించి దాస్యములో నుండి విముక్తి
పొందే శక్తి వారికి లేదు వారిని విడిపించే శక్తి మోషేకి లేదు, వారిని విడిపించే శక్తి అహరోనుకు లేదు.
దేవుడు మాత్రమే వారిని విడిపించగలడు. ఈ రోజు మనము కూడా అంతే.సాతాను శక్తి నుండి, నరకము శక్తి నుండి, పాపము శక్తి నుండి మనల్ని మనము విడిపించుకోలేము. దేవుని శక్తి మనకు
కావలసినదే. ప్రభువైన యేసు క్రీస్తు శక్తి మనకు కావలసినదే. ఫరో మీద ఇశ్రాయేలీయులు యుద్ధము చేయలేదు. నడుచుకొంటూ వారు ఐగుప్తు విడిచి వెళ్లిపోయారు. ఉచితముగా దేవుడు వారికి విడుదల ఇచ్చాడు. ఈ రోజు దేవుడు మనకు క్రీస్తు నందు ఉచితముగా రక్షణ అనుగ్రహిస్తున్నాడు. అది మనకు ఉచితమే కానీ దేవునికి కాదు. ఆ సత్యాన్నే వారికి పస్కా పండుగలో దేవుడు బోధిస్తున్నాడు.
పస్కా గొఱ్ఱె పిల్లలో విజయము ఉంది. ప్రకటన గ్రంథము 5:6 లో మనము చదువుతాము:
మరియు సింహాసనమునకును ఆ నాలుగు జీవుల కును పెద్దలకును మధ్యను,
వధింపబడినట్లుండిన గొఱ్ఱపిల్ల నిలిచియుండుట చూచితిని.
పరలోకము మధ్యలో ఈ వధింపబడిన గొఱ్ఱెపిల్ల మనకు కనిపిస్తున్నది. అంతిమ విజయము ఫరోది కాదు, దేవునిదే. అంతిమ విజయము సాతానునిది కాదు, గొఱ్ఱె పిల్లదే. the lamb is victorious.
క్రికెట్ ప్రపంచ కప్పు టోర్నమెంట్ జరిగింది. ఉత్కంఠ భరితముగా సాగిన ఫైనల్ మ్యాచ్ లో ఇంగ్లాండ్ దేశం విజయం సాధించింది. ఈ దేశం గెలుస్తుంది అని నేను ఊహించలేదు. నేను మన ఇండియా గెలుస్తుంది అనుకొన్నాను. మొన్న న్యూ జిలాండ్ తో సెమి ఫైనల్ జరిగింది. ఆ న్యూ జిలాండ్ దేముందిలే. ఆ దేశ జనాభా మొత్తము మా గుంటూరు జిల్లా అంత కూడా ఉండదు. పిల్ల దేశం…పిల్ల జట్టు, వాళ్ళను ఈజీగా ఓడించవచ్చు అని నేను అనుకొన్నాను. కానీ వాళ్ళ ముందు మన జట్టు బోల్తా పడింది. ప్రపంచములోనే గొప్ప బ్యాట్స్ మెన్ గా పేరు ఉన్న ఆటగాళ్లు విఫలమయ్యారు. రాహుల్ 1, రోహిత్ శర్మ 1, విరాట్ కోహ్లీ 1. కూడబలుక్కున్నట్లు, ఈ త్రిమూర్తులు 1,1,1 కొట్టి ప్రపంచ కప్పు క్రికెట్ ఎప్పుడూ లేని రికార్డు సొంతం చేసుకొన్నారు.టోర్నమెంట్ మొదటి రోజున ఏ జట్టు గెలుస్తుందో మనం ఖచ్చితముగా చెప్పలేము. గొప్ప ఆటగాళ్లు కూడా మానవ మాత్రులే.
అయితే గొఱ్ఱె పిల్ల వేరు. ఎంత మంది అడ్డొచ్చినా, గొఱ్ఱె పిల్లదే విజయము అని దేవుడు సెలవిచ్చాడు. సాతాను తో తాను చేసే ఫైనల్ మ్యాచ్ లో గెలిచేది ఎవరో దేవుడు ఖచ్చితముగా మనకు తన వాక్యంలో తెలియజేశాడు. క్రికెట్ లోఊహించని అపజయాన్ని చూసి అనేక మంది అభిమానులు ఆవేదనకు గురవుతారు. గొఱ్ఱె పిల్ల మీద ఆశ పెట్టుకొన్న వారు ఆవేదన పడే పరిస్థితి రాదు, వారికి ఓటమి లేదు, ఎందుకంటే గొఱ్ఱె పిల్ల యొక్క విజయం ఖాయం.అందుకనే పరలోకములో వారు ఆనందముతో దేవునికి స్తుతులు చెల్లిస్తున్నారు. గొఱ్ఱె పిల్లను మహిమపరుస్తున్నారు. ఇప్పుడు కొంత సేపు నిర్గమ కాండము 12 అధ్యాయములో మనకు కనిపిస్తున్న దేవుని గొఱ్ఱెపిల్ల యొద్దకు వెళ్లి దానిలో
ప్రభువైన యేసు క్రీస్తు మనకు ఎలా కనిపిస్తాడో చూద్దాము.
- ఈ నెల దశమినాడు: వారు ఒక గొఱ్ఱపిల్లనైనను తీసికొనవలెను. గొఱ్ఱె పిల్లను ఎప్పుడు బలి ఇవ్వాలో ఆ సమయాన్ని దేవుడే నిర్ణయించాడు. యేసు క్రీస్తు ఎప్పుడు సిలువ వేయబడతాడో దేవుడు ముందే తెలియజేశాడు. దానియేలు గ్రంథము 9:26 మీరు చూస్తే ప్రభువైన యేసు క్రీస్తు ఎప్పుడు సిలువ వేయబడతాడో దేవుడు ముందుగానే దానియేలు ప్రవక్తకు తెలియజేశాడు.
- ఇశ్రాయేలీయులలో ఒక్కొక్కడు… ప్రతి ఒక్కరు పస్కా గొఱ్ఱె పిల్ల దగ్గరకు వెళ్లారు. ఈ రోజు మనం ఒక్కొక్కరిగా యేసు క్రీస్తు దగ్గరకు రావాలి. మా డాడీ వెళ్ళాడుగా చాలులే, మా మమ్మీ వెళ్ళింది చాలులే అనుకోకూడదు.
రోమా పత్రిక 10:9 లో మనము చదువుతాము. ‘యేసు ప్రభువని నీ నోటితో ఒప్పుకొని…’
Jesus Christ is the Lord
యేసు క్రీస్తు ప్రభువు అని నీ నోటితో ఒప్పుకోవాలి.అప్పుడే రక్షణ.
3.ఆ గొఱ్ఱె పిల్ల నిర్దోషమైనది….. ఇశ్రాయేలీయులు నిర్దోషమైన ఏడాది మగ గొఱ్ఱె పిల్ల ను అర్పించారు.
ఆ గొఱ్ఱె పిల్ల నిర్దోషమైనది.ఈ యేసు క్రీస్తు దోషము లేని వాడు.కళంకము లేని వాడు.పాపము లేని వాడు.‘నాలో పాపము ఉన్నదని మీలో ఎవడు స్థాపించగలడు? అని ఆయన నాటి సమాజాన్ని ఛాలెంజ్ చేశాడు (యోహాను 8:46). ‘పవిత్రుడు, నిర్దోషి, నిష్కల్మషుడు, పాపులలో చేరక ప్రత్యేకముగా
ఉన్నవాడు’ అని హెబ్రీయులకు వ్రాసిన పత్రికలో మనము చదువుతాము.(హెబ్రీ7:26) ఈ గొఱ్ఱె పిల్ల నిష్కళంకమైనది.
- పస్కా గొఱ్ఱె పిల్ల సాయంకాలమందు అర్పించబడింది. చరిత్ర కారుడు జోషి ఫస్ యేమని వ్రాశాడంటే, పస్కా పండుగ రోజున యాజకులు గొఱ్ఱె పిల్లలను యెరూషలేములో దేవాలయమునకు తెచ్చి 3 గంటల సమయములో వాటిని వధించేవారు.దేవుని గొఱ్ఱె పిల్ల యేసు క్రీస్తు కూడా పస్కా పండుగ రోజునే యెరూషలేములో మన కొరకు అర్పించబడ్డాడు. 3 గంటల సమయములోనే ఆయన
వధించబడ్డాడు.
- గొఱ్ఱె పిల్ల చంపబడాలి. దెబ్బలు తింటే సరిపోదు. గాయాలు పొందితే సరిపోదు. గొఱ్ఱె పిల్ల చంపబడాలి.యేసు క్రీస్తు బోధలు చేస్తే సరిపోదు.అవమానించబడితే సరిపోదు.ముళ్ల కిరీటం ధరిస్తే సరిపోదు.గాయాలు పొందితే సరిపోదు.రక్తం చిందిస్తే సరిపోదు. ఆయన చంపబడాలి.సిలువ మీద సమాప్తము అని కేక వేసి ఆయన చనిపోయాడు.It is finished.
పేతురు గారు యేమని వ్రాశాడు?
ఏలయనగా మనలను దేవునియొద్దకు తెచ్చుటకు,
అనీతిమంతులకొరకు నీతిమంతు డైన క్రీస్తు శరీరవిషయములో చంపబడియు,
ఆత్మవిషయ ములో బ్రదికింపబడి, పాపముల విషయములో
ఒక్కసారే శ్రమపడెను. 1 పేతురు 3 : 18 – 19
గొఱ్ఱె పిల్ల చంపబడింది. క్రీస్తు కూడా మన కొరకు మరణించాడు.
- ఆ పస్కా గొఱ్ఱె పిల్లలో ఒక్క ఎముకను కూడా విరువకూడదు. 46 వచనము చూద్దాము.
దేవుడు వారితో ఏమన్నాడంటే,
పస్కా గొఱ్ఱె పిల్ల ను మీరు వధించేటప్పుడు దానిలో ఒక్క ఎముక కూడా విరువకూడదు.
34:20 కీర్తనలో ఒక ప్రవచనము వ్రాయబడింది.
ఆయన వాని యెముకలన్నిటిని కాపాడును
వాటిలో ఒక్కటియైనను విరిగిపోదు.
యేసు క్రీస్తు ను రోమన్ సైనికులు చాలా దారుణముగా హింసించారు. ఆయనను గుద్దారు. ఆయనకు కొరడాలతో కొట్టారు. ఆయనను ఈడ్చుకొంటూ వెళ్లారు.ఆయనకు మేకులు కొట్టారు.
ఆయనను పొడిచారు. అయితే ఆయన శరీరములో ఒక్క ఎముక కూడా విరుగలేదు. వారి యొక్క మృత్యుహేలలో వారు చిన్న ఎముకను విరిచినా దేవుని ప్రవచనము నిరర్థకము అయ్యి ఉండేది.
రోమన్ సైనికులు యేసు క్రీస్తు మీద అంత దౌర్జన్యము చేసినా, దేవుడు వారిని నియంత్రించాడు. తన
కుమారుని ఎముకలన్నీ కాపాడాడు. Cruficixion was a divinely orchestrated event.
- పస్కా గొఱ్ఱె పిల్ల రక్తాన్ని ఇశ్రాయేలీయులు తమ ఇంటి ద్వార బంధముల మీద రాసుకున్నారు. దేవుడు వారితో ఏమన్నాడంటే,
నేను ఆ రక్తమును చూచి మిమ్మును నశింప చేయక దాటిపోయెదను. ఎంత చక్కటి మాటలు!
when I see the blood, I will pass over you
ఈ రోజు మనము దేవుని గొఱ్ఱె పిల్ల ప్రభువైన యేసు క్రీస్తు సిలువ మీద చిందించిన రక్తము క్రిందకు రావాలి. ఆ రక్తము క్రింద ఉన్నప్పుడే దేవుని ఉగ్రత నుండి మనము తప్పించుకోగలము.
యేసు రక్తము ఎంత ముఖ్యమైనదో బైబిల్ లో మనము చాలా చోట్ల చదువుతాము.
రోమా 3:26 – యేసు రక్తము దేవుని ప్రేమను బయలుపరచింది.
రోమా 5:9 – యేసు రక్తము వలన మనము నీతి మంతులముగా తీర్చబడ్డాము.
ఎఫెసీ 1: 7 – యేసు రక్తము వలన మన పాపాలు క్షమించబడ్డాయి.
1 పేతురు 1:18-19 – యేసు రక్తము మనలను విమోచించింది.
1 యోహాను 1:7 – యేసు రక్తము ప్రతి పాపము నుండి మనలను పవిత్రులనుగా చేసింది.
ఎఫెసీ 2:13 – యేసు రక్తము మనలను దేవునికి సమీపముగా తెచ్చింది.
హెబ్రీ10:22 – యేసు రక్తము వలన మనకు దేవుని పరిశుద్ధ సన్నిధిలోకి ప్రవేశం లభించింది.
లూకా 22:20 – యేసు రక్తము దేవుని నిబంధన క్రొత్త నిబంధనను మనకు అనుగ్రహించింది.
ప్రకటన 12:11 – యేసు రక్తము మనకు విజయాన్ని ఇచ్చింది.
బ్లడ్…బ్లడ్… బ్లడ్ ఆయన రక్తము వలన దేవుడు మనకు అనేక ఆశీర్వాదాలు అనుగ్రహించాడు.
రోమా 3:26 లో మనము చదువుతాము.
క్రీస్తుయేసు రక్తమునందలి విశ్వాసము
Through Faith in His Blood
మన విశ్వాసము క్రియల మీ లేదు,
భక్తుల మీద లేదు,
బిషప్ లో మీద లేదు,
అద్భుతాల మీద లేదు,
డేనామినేషన్ ల మీద లేదు.
యేసు రక్తము మీద ఉంది.
- మీరున్న యిండ్ల మీద ఆ రక్తము మీకు గురుతుగా ఉండును. గొఱ్ఱెపిల్ల రక్తము ఒక గురుతుగా ఉంది. ఇశ్రాయేలీయులు గొఱ్ఱె పిల్ల రక్తాన్ని తమ ఇళ్ల మీద రాసుకున్నారు. అది చూసి ఐగుప్తీయులు
నవ్వు కొని ఉంటారు. ఏంటి వీరు చేస్తున్న పిచ్చి పని అని ఫరో వారిని అపహాస్యము చేసి ఉంటాడు.
అయితే ఇశ్రాయేలీయులు సిగ్గుపడకుండా గొఱ్ఱె పిల్ల రక్తాన్ని తమ ఇళ్ల మీద రాసుకొన్నారు. ఈ రోజు క్రైస్తవులను చూసి అపహాస్యము చేసే వాళ్ళు ఉన్నారు. సిలువ, సిలువ అంటారు, రక్తము, రక్తము అంటారు ఏంటి మీ గొడవ అని మనల్ని యెగతాళి చేసే వాళ్ళు కూడా ఉంటారు. అపొస్తలుడైన
పౌలు అన్నాడు:
రోమా 1:16
సువార్తను గూర్చి నేను సిగ్గుపడువాడను కాను. ఏలయనగా నమ్ము ప్రతివానికి, మొదట యూదునికి, గ్రీసుదేశస్థునికి కూడ రక్షణ కలుగజేయుటకు అది దేవుని శక్తియై యున్నది.
1 కొరింథీ 1:18
సిలువనుగూర్చిన వార్త, నశించుచున్న వారికి వెఱ్ఱి తనము గాని రక్షింపబడుచున్న మనకు దేవుని శక్తి.
ఇశ్రాయేలీయులు కత్తులు తీసుకోలేదు, ఖడ్గాలు సాన పట్టలేదు, గొఱ్ఱె పిల్ల రక్తాన్ని తమ ఇళ్ల మీద రాసుకున్నారు. దేవుని శక్తి వారిని ఐగుప్తు నుండి, ఫరో నుండి వారిని విడిపించింది. ఈ రోజు మనలను విడిపించేది గొఱ్ఱె పిల్ల రక్తమే. మనకు దేవుని శక్తిని ఇచ్చేది ఆ సిలువ సువార్తే.
- మీ నడుము కట్టుకొని: 11 వచనము మీరు దానిని తినవలసిన విధమేదనగా, మీ నడుము కట్టుకొని మీ చెప్పులు తొడుగుకొని మీ కఱ్ఱలు చేత పట్టుకొని, త్వరపడుచుదాని తినవలెను
గొఱ్ఱెపిల్లను అగ్నితో కాల్చి దాని మాంసమును తినాలి. వారు నడుము కట్టుకొని చెప్పులు తొడుగుకొని
కఱ్ఱలు చేత పట్టుకొని, త్వరపడుచు దాని తినాలి. వారి ఎదుట గొప్ప ప్రయాణము ఉంది. వారికి శక్తి కావాలి. గొఱ్ఱె పిల్ల వారికి ఆహారము. ఈ రోజు మన ఎదుట కూడా ఒక ప్రయాణము ఉంది. ఒక గొప్ప యాత్ర మన ముందు ఉంది. దీనికి గొఱ్ఱె పిల్ల మనకు ఇచ్చే శక్తి అవసరము.
యోహాను 6:54-55
నా శరీరము తిని నా రక్తము త్రాగువాడే నిత్యజీవము గలవాడు;
అంత్యదినమున నేను వానిని లేపుదును.
నా శరీరము నిజమైన ఆహారమును నా రక్తము నిజమైన పానమునై యున్నది.
యేసు ప్రభువు మాటలు శిష్యులకు అర్ధము కాలేదు. ఇవి కఠినమైన మాటలు అని వారు అన్నారు. ఈ మాటల యొక్క యొక్క సారాంశము ఏమిటంటే, మన భౌతిక శరీరానికి ఆహారము, నీరు ఎంత అవసరమో మన ఆత్మలకు ప్రభువైన యేసు క్రీస్తు యొక్క సిలువ అంత అవసరము. ఆయన పరలోకము నుండివచ్చిన జీవాహారము.ఆయన వాక్యాన్ని మనము అనుదినము భుజించాలి.
నాకు ఎన్ని పనులున్నప్పటికీ ప్రతి రోజూ బైబిల్ లో రెండు అధ్యాయాలు చదువుతాను. ఆయన వాక్యమును ప్రతిరోజూ భుజించక పొతే మనము అలసిపోతాము.
- కాబట్టి యీ దినము మీకు జ్ఞాపకార్థమైన దగును.14 వచనము. పస్కా పండుగ ఒక జ్ఞాపకార్ధ దినము. ఇది ఒక మెమోరియల్. సిలువ వేయబడకమునుపు ప్రభువైన యేసు క్రీస్తు తన శిష్యులకు ఒక రొట్టె విరిచి ఇచ్చాడు, ద్రాక్షారస పాత్రను ఇచ్చాడు. నన్ను జ్ఞాపకము చేసికొనుటకు దీనిని చేయుడి అన్నాడు. ఒక సారి నేను ఫోర్డ్ థియేటర్ కి వెళ్ళాను. అమెరికా దేశములో అంతర్యుద్ధము ఆపుటకు అబ్రహం లింకన్ ఎంతో శ్రమించాడు. బానిసలకు విడుదల ఇచ్చాడు. ఆయన చర్యలు కొంతమందికి నచ్చలేదు. ఆయన ప్రాణాలు తీయాలని వారు పథకం పన్నారు. లింకన్ ఒక రాత్రి నాటకం చూద్దామని ఫోర్డ్ థియేటర్ కి తన కొడుకుతో కలిసి వెళ్ళాడు. ఆగంతకుడు ఆయన ను వెనుకవైపు నుండి తుపాకీతో కాల్చి చంపాడు. లింకన్ రక్తము చిందిన చోటును ఇప్పుడు ఒక మెమోరియల్ కట్టారు. ఆయన ఏ కుర్చీలో కూర్చొని హత్య చేయబడ్డాడో ఆ కుర్చీని మనం అక్కడ చూడవచ్చు. బానిసల విముక్తి కోసం లింకన్ చెల్లించిన మూల్యము ఆ కుర్చీ ని చూస్తే మనకు గుర్తుకు వస్తుంది. ఆ కుర్చీ ఆయన జ్ఞాపకార్ధము. ఈ రోజు సిలువ మనకు జ్ఞాపకార్ధము. మనలను విమోచించుటకు ప్రభువైన యేసు క్రీస్తు ఎంత మూల్యము చెల్లించాడో సిలువను చూసినప్పుడు మనకు జ్ఞాపకము వస్తున్నది. సిలువను మనము పూజించము. అది ఒక మెమోరియల్. కమ్యూనియన్ టేబుల్ ని, ప్రభువు బల్లను మనము పూజించము.అది ఒక మెమోరియల్. పస్కా గొఱ్ఱెపిల్ల లో దేవుని గొఱ్ఱె పిల్ల ప్రభువైన యేసు క్రీస్తు ఏ విధముగా మనకు కనిపిస్తున్నాడో అనే అంశములో ఈ రోజు 10 విషయాలు మనము చూశాము. ఆ గొఱ్ఱె పిల్ల రక్తము చేత మీరు రక్షించబడాలన్నదే నేటి మా ప్రేమ సందేశము.
పస్కా పండుగలో ప్రభువు రూపం
12:2 | మీ సంవత్సరమునకు మొదటి నెల…ఈ నెల దశమినాడు | దేవుడు నిర్ణయించిన సమయములోనే పస్కా ఆచరించాలి | దేవుడునిర్ణయించిన సమయములోనే ప్రభువైన యేసు క్రీస్తు మన కొరకు వధించబడ్డాడు. మత్తయి 26:24; దానియేలు 9:26 |
12:3 | ఒక్కొక్కడు | ప్రతి ఒక్కరూ పస్కా ఆచరించాల్సిందే | ప్రతి ఒక్కరూ వ్యక్తిగతముగా ప్రభువైన యేసు నందు విశ్వాసముంచితేనే, రక్షణ వస్తుంది. రోమా 10:9 |
12:6 | నిర్దోషమైన యేడాది మగపిల్ల | నిర్దోషమైన గొఱ్ఱె పిల్లను
మాత్రమే అర్పించాలి |
మన ప్రభువైన యేసు క్రీస్తు నిర్దోషమైన, పాపము లేని, పవిత్రమైన దేవుని గొఱ్ఱె పిల్ల. హెబ్రీ 7:26 |
12:7 | సాయంకాలమందు | గొఱ్ఱె పిల్ల సాయంకాలమందు అర్పించబడింది | ప్రభువైన యేసు సాయంకాలమందు 3 గంటల సమయములో అర్పించబడ్డాడు.లూకా 23:44-46 |
దాని చంపి | గొఱ్ఱె పిల్ల చంపబడాలి | ప్రభువైన యేసు సిలువ మీద చంపబడ్డాడు 1 పేతురు 3:18-19 | |
దాని రక్తము యిండ్లద్వారబంధముల మీద చల్లాలి | గొఱ్ఱె పిల్ల రక్తము ద్వారానే
రక్షణ, భద్రత |
యేసు రక్తము లేకుండా మనకు రక్షణ లేదు | |
12:8 | అగ్నిచేత కాల్చబడింది | గొఱ్ఱె పిల్ల అగ్ని చేత కాల్చబడింది | దేవుని యొక్క తీవ్రమైన కోపాన్ని ప్రభువైన యేసు క్రీస్తు సిలువ మీద భరించాడు |
12:46 | దానిలో ఒక్క యెముకనైనను మీరు విరువ కూడదు. | గొఱ్ఱె పిల్లలో ఒక్క ఎముక కూడా విరువబడలేదు | యేసు క్రీస్తు శరీరములోఒక్క ఎముక కూడా విరువబడలేదు
కీర్తన 34:20; యోహాను 19:36 |
ఆ మాంసమును పొంగని రొట్టెలను తినవలెను | గొఱ్ఱె పిల్ల వారికి ఆహారము | యేసు క్రీస్తు మన జీవాహారము
యోహాను 6:35 |
|
చేదుకూరలతో దాని తినవలెను | చేదు మనకు రుచించదు; మన మానవ నైజానికి
దేవుని ప్రణాళికలు రుచించవు |
క్రీస్తు సువార్త ఈ లోకానికి రుచించదు
రోమా 1:16 1 కొరింథీ 1:18 |
|
12:11 | మీ నడుము కట్టుకొని మీ చెప్పులు తొడుగుకొని మీ కఱ్ఱలు చేత పట్టుకొని, త్వరపడుచుదాని తినవలెను | పస్కా తరువాత ప్రయాణానికి సిద్ధపడాలి | రక్షణ పొందిన వ్యక్తి దేవునితో పరలోక ప్రయాణానికి సిద్ధపడాలి |
అది యెహో వాకు పస్కాబలి. | ఇది మానవుల పండుగ కాదు, దేవుడు నియమించినది | యేసు క్రీస్తు దేవుడు నియమించిన రక్షణ మార్గము, మానవులు ఏర్పరచినది కాదు | |
12:12 | ఆ రాత్రి నేను ఐగుప్తుదేశమందు సంచరించి…హతముచేసి…. తీర్పు తీర్చెదను | గొఱ్ఱె పిల్ల రక్తము క్రింద కు
రాని వారి మీదకు దేవుని తీర్పు వచ్చింది |
యేసు క్రీస్తు రక్తము క్రిందకు రాని వారి మీదకు దేవుని తీర్పు వస్తుంది |
12:13 | మీరున్న యిండ్లమీద ఆ రక్తము మీకు గురుతుగా ఉండును. | సిగ్గుపడకుండా రక్తమును వారి ఇంటి మీద రాసుకున్నారు | సువార్తను గూర్చి మనము సిగ్గుపడకూడదు |
నేను ఆ రక్తమును చూచి మిమ్మును నశింప చేయక దాటిపోయెదను. | గొఱ్ఱె పిల్ల రక్తము క్రిందలేని వారు నశించారు | ప్రభువైన యేసు రక్తము క్రిందకు రాని వారు తమ పాపములలోనే నశిస్తారు
రోమా 3:26 రోమా 5:9 ఎఫెసీ 1: 7 1 పేతురు 1:18-19 1 యోహాను 1:7 ఎఫెసీ 2:13 హెబ్రీ10:22 లూకా 22:20 ప్రకటన 12:11 |
|
తెగులు మీ మీదికి రాదు | గొఱ్ఱె పిల్ల రక్తము క్రింద ఉంటే ఏ తెగులు మన మీదకు రాదు | యేసు రక్తము క్రింద ఉన్న వారిని సాతాను శక్తులు, నరకపు శక్తులు మరే శక్తీ, తెగులు తాకలేవు | |
12:14 | కాబట్టి యీ దినము మీకు జ్ఞాపకార్థమైన దగును. | పస్కా జ్ఞాపకార్ధ దినము | నన్ను జ్ఞాపకము చేసికొనుటకు దీనిని చేయుడి |
మీరు యెహోవాకు పండుగగా దాని నాచ రింపవలెను | పస్కా లో ఆనందము కూడా ఉంది | సిలువ దగ్గర రక్షకుడు మన కొరకు పడిన శ్రమను చూసి బాధ, దేవుడు మన పాపములను క్షమించాడు అనే ఆనందము రెండూ కలుగుతాయి | |
తరతరములకు నిత్యమైనకట్టడగా దాని నాచ రింపవలెను. | పస్కా పండుగ నిత్యమైన కట్టడ | క్రొత్త నిబంధన నిత్యమైన కట్టడ
యిర్మీయా 31:31 లూకా 22:20 |
|
12:15 | ఏడుదినములు పులియని రొట్టెలను తినవలెను | గొఱ్ఱె పిల్ల లో పులుపు కు స్థానము లేదు | పులుపు వేషధారణకు, పాపానికి సాదృశ్యము.
వాటికి మనము దూరముగా ఉండాలి గలతీ 5:9 మత్తయి 16:6 |
12:22 | హిస్సోపు కుంచె తీసికొని పళ్లెములో నున్న రక్తములో దాని ముంచి | హిస్సోపు పవిత్రతకు సాదృశ్యముగా ఉంది
లేవీయ 14:1-7 కీర్తన 51:7 |
ప్రభువైన యేసు క్రీస్తు రక్తము మనలను ప్రతి పాపము నుండి పవిత్రులనుగా చేస్తుంది
1 యోహాను 1:7 |
12:43,48 | అన్యుడెవ డును దాని తినకూడదు…సున్నతి పొందిన తరువాత తినవచ్చును | నిబంధనలో లేని వారికి పస్కా లో భాగము లేదు | క్రొత్త నిబంధన లో ఉన్న వారికి మాత్రమే ప్రభువు బల్లలో ప్రవేశము
1 కొరింథీ 11:23-30 |
13:3 | మీరు దాసగృహమైన ఐగుప్తునుండి బయలుదేరివచ్చిన దినమును జ్ఞాప కము చేసికొనుడి | పస్కా పండుగ తరువాత దాస్యము నుండి విడుదల వచ్చింది | ప్రభువైన యేసు క్రీస్తు సిలువ దగ్గర మనకు పాప దాస్యము నుండి విడుదల కలిగింది |
డాక్టర్ పాల్ కట్టుపల్లి