నరకం గురించి నలభై సంగతులు 

Screen Shot 2019-07-17 at 3.58.29 PM.png

    పరలోకము గురించి పది సంగతులయితే, నరకము గురించి నలభై సంగతులా అని మీరు ప్రశ్నించవచ్చు. పరలోకము కంటే నాలుగు రెట్లు ఎక్కువ సమాచారం నరకం గురించి బైబిల్ లో ఉంది. 

    నరకం అనే ఆలోచనే మనలో చాలామందిని తీవ్ర అసౌకార్యానికి గురిచేస్తుంది.  రే కర్జ్వెల్ లాంటి భవిష్యత్తు ఊహకర్తలు చనిపోయే ముందు తమ మైండ్ ని కంప్యూటర్ లోకి అప్ లోడ్ చేయడము గురించి ప్రయత్నాలు చేస్తున్నారు. దేవుని తీర్పు అనే మాటలు వారు సహించలేకపోవుతున్నారు.

    ప్రేమ, క్షమాపణ, ఆనందం, ఐశ్వర్యం ల గురించి మనం ఏ బెరుకూ లేకుండా మాట్లాడ టానికి ఇష్టపడతాము కాని, నరకం గురించి ఆలోచించడానికి, మాట్లాడడానికి మనకు ఇష్టం వుండదు. కానీ పాత, కొత్త నిభందనలు రెండూ దేవుని యొక్క రాబోయే తీర్పు, నిత్యాగ్ని గుండముల గురించి స్పష్టముగా హెచ్చరించాయి. ప్రభువయిన యేసు క్రీస్తు, అపోస్తలుడయిన పౌలు నరకము గురించి విస్కృతముగా భోదించారు. పరలోకము గురించి అనేక విషయాలు వ్రాసిన పౌలు నరకము గురించికూడా వ్రాసాడు.

‘దేవుని సంకల్పమంతయు మీకు తెలుపకుండ నేనేమియు దాచుకొనలేదు’ (అపొ. కార్య20:27). 

    పరలోకం వలె, నరకం కూడా దేవుని సంకల్పము లో భాగమే. కాబట్టి పరలోకం గురించి మాట్లాడి, నరకం గురించి తెలుపకుండ  దాచుకొనడం తప్పు. నరకము గురించి ప్రజాభిప్రాయ సేకరణ జరిగితే దానిని నమ్మని వారే ఎక్కువగా ఉంటారు. దీనికి చాలా కారణాలు ఉన్నాయి. 

1.మొదటిగా మనము మన ఫీలింగ్స్, మన అనుభూతులతోనే ఆలోచిస్తాము.నేనొక సారి అమెరిక లోని పిట్స్ బర్గ్ నగరములో నడచి వెళ్ళుచున్నాను. నేను వెళ్ళుచున్న ప్రదేశము నకు దారి తెలియక, నేను పడు చున్న ఇబ్బంది చూసి, అటువైపుగా నడిచి వెళ్ళుచున్న ఒక కాలేజీ స్టూడెంట్ నాకు సహాయం చేసాడు. ‘ఈ దారి నాకు తెలుసు, నా వెంట నడువు అన్నాడు’. మేము ఇద్దరం నడచుకొంటూ వెళ్ళుచున్నపుడు నేను అతని యొక్క ఆత్మీయ స్తితి గురించి ప్రశ్నించాను. అతను అటువంటి వాటి గురించి నేను పట్టించుకోను, ఆలోచించను అన్నాడు. ‘నరకం ఉన్నది అని బైబిలు మనలను హెచ్చరించున్నది’ అని అన్నాను. ‘నరకం ఉందంటే నేను నమ్మను, ఎందుకంటే అటువంటి ఆలోచనే నన్ను ఇబ్బంది పెడుతుంది, అది చాలా అప్రియమయినది’ అన్నాడు.

     ‘సరే, ఈ ప్రపంచములో అప్రియమయినవి ఎన్ని ఉన్నాయో తెలుసా? కాన్సర్ తో మరణించే చిన్న బిడ్డ, రైలు ప్రమాదములో మరణించే ప్రయాణికులు, విహార యాత్రలో చనిపోయిన విద్యార్దులు మొదలగునవి, ఈ ప్రపంచములో అప్రియమయినవి ఎన్నో వున్నాయి. మనకు అప్రియమయినవి అయినంత మాత్రాన అవి జరుగ కుండా పోతాయా?’ అన్నాను.

    ‘నీవు చాలా లాజికల్ గా మాట్లాడావు, మనకు ఇష్టం లేనంత మాత్రాన, నరకం లేదు అనుకోవటం పొరపాటు, దాని గురించి ఆలోచిస్తాను’ అన్నాడు. 

    మనలో చాలా మందిమి ఈ కాలేజీ స్టూడెంట్ లాగానే ఆలోచిస్తాము. నరకం అనే ఆలోచనే మనలో వికార భావనలు కలుగచేస్తుంది. కాబట్టి, అది ఉండదు, ఉండ కూడదు అని భావిస్తాము. కానీ, వాస్తవ ప్రపంచం మన ఇష్టాఇష్టముల మీద ఆధారపడి ఉండదు. కాబట్టి మన సొంత అభిప్రాయాల మీద కాకుండా దేవుని వాక్యము మీద ఆధారపడి, నరకము గురించి మన నమ్మకాలు ఏర్పరచుకొంటే అది మనకు మేలు. 

  1. రెండో కారణము చాలా మంది ప్రస్తుతములో ఎంజాయ్ చేద్దాము చాలు, భవిష్యత్తు గురించి ఆలోచించడము ఎందుకు అని అనుకొంటారు. 1971 లో బీటిల్స్ కి చెందిన సంగీతకారుడు imagine ‘ఊహించు’ అనే ప్రసిద్ధ పాట వ్రాసాడు. 

Imagine there’s no heaven

It’s easy if you try

No hell below us

Above us only sky

Imagine 

all the people living for today 

పరలోకము లేదని ఊహించు 

అది ప్రయత్నిస్తే తేలికే 

నరకము లేదని ఊహించు 

పైన కేవలము ఆకాశాన్ని మాత్రమే కోరుకో 

నేటి కోసమే అందరూ బ్రతకాలి! 

ఈ రోజు కోసమే బ్రతకాలి. పరలోకము, నరకము గురించి ఆలోచనే వద్దు అని చాలామంది కోరుకొంటారు. 

 

  1. మూడో కారణము చాలామంది పాపాన్ని ప్రేమిస్తారు. నరకము అనే ఆలోచనను సహించలేరు. ఫ్రెంచ్ నవలా రచయిత గుస్టావ్ ఫ్లాబర్ట్  (1821 – 1880) ‘మేడం బావరి’ అనే నవల వ్రాశాడు. ఇందులో లియోన్ అనే యువకుడు ఎమ్మా అనే మహిళతో అక్రమ సంబంధము పెట్టుకొంటాడు. ఒక రోజు వీరిద్దరూ ఒక పెద్ద అందమైన కేథడ్రాల్ ను చూద్దామని వెళ్తారు. అక్కడ ఒక గైడ్ వారికి కేథడ్రాల్ చూపిస్తూ ఉంటాడు. ‘లోపల ఎన్నోఅందమైన చిత్రాలు ఉన్నాయి: యేసు క్రీస్తు పునరుత్తానము, అంతిమ తీర్పు, పరలోకము, దావీదు మహారాజు, నరకములో మండుచున్న నశించిన ఆత్మలు.వాటిని చూసి వెళ్ళండి’ అంటాడు. లియోన్ ఆ మాటలు సహించలేడు. టాక్సీ కోసము పిలుస్తాడు. టాక్సీ డ్రైవర్ డోర్ తీసి, ‘ఎక్కడికి సార్’ అని అడుగుతాడు. లియోన్ ఎమ్మాను టాక్సీ లో తోస్తాడు. ‘ఎక్కడికో ఒక చోటికి పోనివ్వు’ అని టాక్సీ డ్రైవర్ అని ఆవేశముగా అరుస్తాడు. మరొక వ్యక్తి భార్యతో అక్రమముగా జీవిస్తున్న లియోన్ ‘అంతిమ తీర్పు, నరకము’ అనే మాటలు సహించలేక కేథడ్రాల్ నుండి పారిపోయాడు. పాపాత్ములు తమ పాపాన్ని ప్రేమిస్తూ ‘నరకము’ గురించి ఆలోచించడానికి ఇష్టపడరు.

మార్కు 9:43 – 48 

నీ చెయ్యి నిన్ను అభ్యంతరపరచిన యెడల దానిని నరికివేయుము;నీవు రెండు చేతులు కలిగి నరకములోని ఆరని అగ్నిలోనికి పోవుటకంటె అంగ హీనుడవై జీవములో ప్రవేశించుట మేలు.నీ పాదము నిన్ను అభ్యంతరపరచిన యెడల దానిని నరికివేయుము; రెండు పాదములు కలిగి నరకములో పడవేయబడుటకంటె,కుంటివాడవై (నిత్య) జీవములో ప్రవేశించుటమేలు.నీ కన్ను నిన్ను అభ్యంతరపరచినయెడల దాని తీసిపార వేయుము; రెండు కన్నులు కలిగి నరకములో పడవేయ బడుటకంటె ఒంటి కన్ను గలవాడవై దేవుని రాజ్యములో ప్రవేశించుట మేలు.నరకమున వారి పురుగు చావదు; అగ్ని ఆరదు.మన చేతులు, కాళ్ళు, కన్నులు మనలను పాపమునకు ఈడ్చుకొని వెళ్లగలవు. ఆ పాపములు రక్షణ పొందకుండా మనలను ఆపగలవు.

  1. నాలుగో కారణము మనకు దేవుని పరిశుద్ధత, పాపము యొక్క తీవ్రత గురించి సరైన అవగాహన లేకపోవుట. సౌదీ అరేబియా లాంటి దేశాల్లో వ్యభిచారంలో పట్టుపడితే మరణ శిక్ష, 80 కొరడా దెబ్బలు లాంటి శిక్షలు పడతాయి. వ్యభిచారానికే మరణ శిక్షా? అని మనము సౌదీలను విమర్శిస్తాము. సాటి మనుష్యులు ఇచ్చే తీర్పులనే మనము అర్థము చేసుకోలేనప్పుడు పరిశుద్ధుడైన దేవుడు ఇచ్చే తీర్పులను ఎలా అర్ధం చేసుకొనగలము?

CSLewis325.jpg

మహానుభావుడు C.S.Lewis తన పుస్తకము Great Divorce లో వివరించినట్లు, దేవుడు మనిషికి స్వేచ్చను ఇచ్చాడు. ఆ స్వేచ్చ యెంత గొప్పదంటే దేవుని ప్రేమను సహితం మనిషి తృనీకరించ గలిగేటంత పెద్దది. ఆ స్వేచ్చతో మనిషి దేవుని కాదంటే, మనిషి చివరకు దేవుని ప్రేమ ఇసుమంతయినా ప్రసరించని ప్రదేశమయిన నరకములోనికి త్రోయబడతాడు. ఆ స్వేచ్చతో మనిషి దేవుని యొక్క ప్రేమను అంగీకరిస్తే, దేవుడు పరలోక ద్వారాలు తెరచి ఆ మనిషిని ఆహ్వానిస్తాడు.

దైవ  భక్తి కలిగిన కుటుంబాల్లో పుట్టిన వారు కూడా దేవుని వాక్యాన్ని వ్యతిరేకించుట బైబిల్  లో పలు చోట్ల మనము చూస్తాము. యూదా రాజైన హిజ్కియా మరణించిన తరువాత అతని కుమారుడైన మనశ్శే రాజు అయ్యాడు. అతడు ఒక అన్యురాలిని పెండ్లాడాడు. ఆయన తండ్రి హిజ్కియా గొప్ప భక్తుడు.ఆయన చేసిన సంస్కరణలను మనశ్శే కాలరాచాడు. బయలు, అషేరా దేవతలను దేవుని ఆలయములో నిలబెట్టి పూజలు చేయించాడు. మగ వేశ్యలు, ఆడ వేశ్యలు వీధులలో చెలరేగిపోయారు. నర బలులను ప్రవేశపెట్టాడు. యెరూషలేములో హిన్నోము లోయలో చిన్న పిల్లలను నిప్పుల మీద నడిపించాడు. తన సొంత బిడ్డలను కూడా దేవతలకు అర్పించాడు. ఆ లోయలో పిల్లలు చేసే ఆర్తనాదాలు వినిపించకుండా పూజారులు డ్రమ్ములు పెద్ద శబ్దముతో వాయించేవారు. ఆ లోయను యూదులు ‘గెహెన్న’ అని పిలిచారు. అంటే నరకము అని అర్ధము. నరకము అనేది సాతాను అంధకార శక్తులు కరాళ నృత్యము చేసే భయంకరమైన స్థలము.

Molech10219a.PNG

 మానవ జాతి నరకమును ఒక్క సారిగా కోరుకొనలేదు. దేవునికి దూరముగా అది వేసే ప్రతి అడుగు దానిని నరకమునకు దగ్గరగా లాక్కొని వెళ్ళింది.  ప్రభువయిన యేసు క్రీస్తు తన భూలోక పరిచర్యలో పరలోకము గురించి కంటే, నరకము గురించి ఎక్కువగా మాట్లాడాడు అన్న సత్యం మనం మరచిపోకూడదు. దేవుడు చేసిన హెచ్చరికలను ఖాతరు చేయకుండా, అపహాస్యం చేసి చివరకు దేవుని నిందించడంలో ప్రయోజనం వుండదు. దేవుడు ఈ విశ్వములోని ప్రతి వ్యక్తిని, వస్తువును సృష్టించాడు. ఆయన అధికారము అందరి మీద ఉంటుంది. సాతాను ఆయన మీద తిరుగుబాటు చేసినప్పుడు దేవుడు అతనికి తీర్పు విధించాడు.

2 పేతురు 2:4

దేవదూతలు పాపము చేసినప్పుడు దేవుడు వారిని విడిచిపెట్టక,పాతాళ లోక మందలి కటిక చీకటిగల బిలములలోనికి త్రోసి, తీర్పుకు కావలిలో ఉంచబడుటకు వారిని అప్పగించెను.

  1. మన స్థాయి మరచిపోయాము. 

1995 లో అమెరికా దేశములోని ఓక్లహోమా నగరములో తిమోతి మెక్వెయిగ్ ఒక ప్రభుత్వ భవనము మీద బాంబులతో విరుచుకుపడ్డాడు. 168 మంది ఆ మారణ హోమములో అసువులు బాశారు. వారిలోచిన్న పిల్లలు కూడా చాలా మంది ఉన్నారు. తిమోతి మెక్వెయిగ్ కి ఆ తరువాత మరణ శిక్ష విధించారు. చనిపోయే ముందు ఆయన ఏమన్నాడంటే, ‘నేను దేవుని నమ్మను. నరకము ఉంటే అక్కడ దానికి అలవాటు పడి, దానిని జయిస్తాను. అక్కడ నాకు కంపెనీ ఇచ్చే వాళ్ళు చాలా మంది ఉంటారు. నా ఆత్మకు నేనే మాస్టర్ ని’.

TimothyMcVey.png

   మన సమాజములో తిమోతి మెక్వెయిగ్ లాంటి అవివేకులు చాలా మంది ఉన్నారు. నరకము చాలా భయంకరమైన స్థలము. దానికి అలవాటు పడి, జయించే వారు ఎవరూ ఉండరు. అది ఒంటరి ప్రదేశము. అక్కడ ఎవ్వరూ ఎవ్వరికీ కంపెనీ ఇవ్వరు. మన ఆత్మలకు మనం మాస్టర్ లముగా కొంతకాలమే ఉండగలము. ఒక సారి మన గుండె ఆగిపోయిన తరువాత దాని మీద మనకు ఎలాంటి కంట్రోల్ ఉండదు.

మన్నయి నది వెనుకటివలెనే మరల భూమికి చేరును, ఆత్మ దాని దయచేసిన దేవుని యొద్దకు మరల పోవును. ప్రసంగి 12:7 

  1. ఈ సుఖాలు చాలు, దేవుడు మాకు అక్కర లేదు అనే తత్వము: ఇంగ్లాండ్ దేశములో మత యుద్ధాలు జరుగుతున్న సమయములో థామస్ హాబ్స్ (1588-1679) ‘లెవియా ధన్’ అనే పుస్తకము వ్రాశాడు. ప్రజలు నరకము, పరలోకము, ఆత్మ రక్షణ మొదలగు బైబిలు సిద్ధాంతాల గురించి విచారించడము మానివేయాలని, వారు ఇహలోకంలో సుఖముగా జీవిస్తే చాలు అని ఆ పుస్తకములో హాబ్స్ బోధించాడు. అతని ప్రభావము పాశ్చాత్య దేశాల మీద చాలా తీవ్రముగా పడింది. ఇహలోకములో సుఖముగా ఉన్నాము చాలు, నరకము, పరలోకము మాకు అక్కరలేదు అనే భావజాలము ఇప్పుడు అక్కడ, ఇక్కడ, అన్నిచోట్లా పెరిగింది.

ThomasHobbes101819a.PNG   హాబ్స్ వంటి వారు డెయిజం (Deism) నుకూడా ప్రపంచము మీద రుద్దారు.దీని ప్రకారము దేవుడు ప్రపంచాన్ని సృష్టించి ఆ తరువాత మానవులను వదలి పెట్టి వెళ్ళిపోయాడు. ఇప్పుడు మన బాగు మనము చూసుకోవాలి కానీ ఏ దేవునికీ మన బాధలు పట్టవు. క్రైస్తవునికి జీవిత లక్ష్యము దేవుని మహిమ, జీవిత గమ్యము పరలోకము, జీవిత బాధ్యత సువార్త ప్రకటనతో నరకము నుండి ఆత్మల రక్షణ. కానీ డెయిస్టులు పరలోకాన్ని, నరకాన్ని నమ్మరు. వారి జీవిత లక్ష్యము ఈ భూమి మీద సుఖముగా ఉండడమే. వీరు సాతానుని కూడా నమ్మరు. C.S.లూయిస్ అన్నాడు: ‘సాతాను యొక్క గొప్ప చాకచక్యము ఏమిటంటే నేను అసలు లేను అని జనాన్ని నమ్మించడమే’ (‘Satan’s neatest trick is convincing men that he does not really exist’) 

  1. దేవుడు అంటే భయము లేక పోవుట: జర్మనీ దేశములో హెయిన్రిక్ హెయిన్ అనే కవి ఉండేవాడు. ఆయన మరణ శయ్య మీద ఉన్నప్పుడు ఒక పాస్టర్ గారు ఆయన దగ్గరికి వెళ్ళాడు. ఆయనను ఒక ప్రశ్న అడిగాడు: ‘హెయిన్రిక్, నీవు చనిపోవుతున్నావు. దేవుడు నీ పాపములు క్షమించాడని నమ్ముచున్నావా?’ హెయిన్రిక్ అప్పుడు పాస్టర్ గారికి బదులిచ్చాడు: ‘క్షమించక ఏమిచేస్తాడయ్యా. అది ఆయన పని’.Of course God will forgive me; that’s his job. దేవుడే మాకు ఋణమున్నాడు అన్నట్లు కొంతమంది ప్రవర్తిస్తారు.

ప్రభువైన యేసు క్రీస్తు ఈ లోకానికి ఎందుకు వచ్చాడు? మనలను మన పాపముల నుండి రక్షించడానికి, దేవుని తీర్పు నుండి రక్షించడానికి, నరకము నుండి రక్షించడానికి. అయితే చాలా మందికి దేవుని భయము లేదు. ఆత్మను, దేహాన్ని రెండింటిని నరకములో వేయ గల దేవునికి భయపడమని యేసు ప్రభువు మనలను ఆజ్ఞాపించాడు. 

మత్తయి సువార్త 10:28 

మరియు ఆత్మను చంపనేరక దేహమునే చంపువారికి భయపడకుడి గాని, ఆత్మను దేహమునుకూడ నరకములో నశింపజేయగలవానికి మిక్కిలి భయపడుడి.

నరకము గురించిన అసత్య బోధలు 

మనము నరకానికి వెళ్లాలని దేవుడు కోరుకోవటము లేదు. అందుకు భిన్నముగా, మనలను నరకానికి త్రోసుకొని వెళ్ళుటకు సాతానుడు విశ్వ ప్రయత్నము చేస్తూ తన దగ్గర ఉన్న అస్త్రాలన్నీ మన మీద ప్రయోగిస్తాడు. అసలు నరకమే లేదు అనే అబద్ధబోధకులను సాతానుడు పుంఖాను పుంఖాలుగా సృష్టించాడు. ఈజిప్ట్ లో అలెగ్జాండ్రియా నగరములో జీవించిన ఒరిజిన్ (Origen)  (184-253) నరకము తాత్కాలికమైనది, కొంతకాలము అక్కడ ఉన్న తరువాత పశ్చాత్తాప పడి పాపాత్ములు దేవునితో ఏకమవుతారు అని బోధించాడు.అగ్ని గంధకములుగల గుండములో పడవేయబడెను: ఇటాలియన్ కవి ఢాంటే అలిగేరి (1265-1321) ‘డివైన్ కామెడీ’ అనే గ్రంథము వ్రాశాడు. ప్రపంచ సాహిత్యములో అది ఒక గొప్ప గ్రంథము గా ఎంచబడింది. ఈ కావ్యములో ఆత్మ మరణము తరువాత పరలోకము, పర్గెటరీ, నరకము ల గుండా ప్రయాణిస్తుంది. అయితే పర్గెటరీ అనేది దేవుని వాక్యమునకు వ్యతిరేకము. 

Dante518c.png

     పర్గెటరీ సిద్ధాంతము ప్రకారం చనిపోయిన తరువాత కొంతమంది పరలోకానికో, నరకానికో కాకుండా పర్గెటరీ అనే మరొక ప్రదేశానికి వెళ్తారు. ఇది తాత్కాలికమైన ప్రదేశము. ఇది నిత్యమైన స్థలము కాదు. సెయింట్ అగస్టీన్ కొంతమంది ఆత్మలు పర్గెటరీ కి వెళ్లి కొంత కాలము అక్కడ ఉండి, క్షమాపణ పొంది పరలోకానికి వెళ్తాయి అనిబోధించాడు. క్రూసేడ్ ల కాలములో, 11 – 13 శతాబ్దాల కాలములో ఈ సిద్ధాంతము మరింత ప్రచారము పొందింది. యుద్ధాలు చేయుటకు కావలసిన ఆర్ధిక వనరులు మత పెద్దలకు అవసరమయ్యాయి. వారు ఏమిచేశారంటే, ‘మీ కుటుంబీకులు ప్రస్తుతము పర్గెటరీ లో ఉన్నారు. మీరు మాకు కానుకలు, డబ్బులు ఇస్తే మేము వారికోసము ప్రార్ధన చేస్తాము. అప్పుడు వారు పరలోకము వెళ్తారు’ అని ప్రజలకు బోధించారు. బైబిలు జ్ఞానము లేని ప్రజలు కూడా మత పెద్దల మోసపు మాటలు నమ్మి డబ్బులు, పొలాలు కోల్పోయి జేబులు గుల్ల చేసుకొన్నారు. పర్గెటరీ అనే సిద్ధాంతము దేవుని వాక్యమునకు వ్యతిరేకము. బైబిల్ లో దానికి స్థానము లేదు. అది మనుష్యుల ఆలోచనల నుండి పుట్టినదే.

    డివైన్ కామెడీ లో సాతాను నరకము యొక్క శీతల సరస్సులో మంచులో చిక్కుకుపోయినట్లు డాంటే వ్రాశాడు.అయితే నరకములో శీతల సరస్సులు, మంచు గడ్డలు లేవు. అది అగ్ని గంధకములుగల గుండము. అక్కడ అగ్ని ఆరదు, పురుగు చావదు.

నరక భయము ఈ ఇహలోక జీవితానికి కూడా మేలు చేస్తుంది

డివైన్ కామెడీ లో నరకము యొక్క ప్రవేశ ద్వారము మీద 

 I endure eternally.

 Abandon every hope, you who enter.” 

‘నేను నిత్యమూ ఉంటాను. ఇందులో ప్రవేశించే వారికి ఇక ఏ నిరీక్షణ ఉండదు’ 

రెండో ప్రపంచ యుద్ధము కాలములో జర్మనీ, దాని చుట్టుప్రక్కల దేశాల్లో నాజీలు కాన్సంట్రేషన్ క్యాంపు లు నిర్మించారు. లక్షలాది మంది అమాయకులను వాటిల్లో సామూహిక జనహననం చేశారు. వాటిలో ముఖ్యమైనది ఔస్క్ విట్జ్ కాన్సంట్రేషన్ క్యాంపు. నేను దానిని చూడ టానికి పోలాండ్ దేశము వెళ్ళాను. దాని ప్రవేశ ద్వారము మీద ‘Arbeit Macht Frei’ పని మిమ్ములను స్వతంత్రులుగా చేస్తుంది అనే మాటలు నాకు కనిపించాయి. డాంటే డివైన్ కామెడీ లో నరకము యొక్క ప్రవేశ ద్వారము మీద వ్రాసిన మాటలను పోలినట్లుగానే నాజీలు ఔస్క్ విట్జ్ కాన్సంట్రేషన్ క్యాంపు ప్రవేశ ద్వారము మీద ఆ మాటలు వ్రాశారు. నరకము యొక్క భయము లేనప్పుడు మనుష్యులు భూమి మీదే నరకాన్ని తలపించే భవనాలు కడతారు అని ఆ క్యాంపు లో నడచినప్పుడు నాకు అనిపించింది.

Auschwitz.png

సాతాను ప్రణాళికలు మనము అర్ధము చేసుకోవాలి: ప్రసిద్ధ రచయిత C.S. లూయిస్ స్క్రూ టేప్ లెటర్స్ అనే పుస్తకము వ్రాశాడు. ఈ నవలలో స్క్రూ టేప్ అనే సీనియర్ దెయ్యము వర్మ్ ఉడ్ అనే జూనియర్ దెయ్యానికి ‘పేషెంట్’ అనే వ్యక్తిని నరకానికి ఎలా ఈడ్చుకొని వెళ్లాలో శిక్షణ సలహాలు ఇస్తాడు. ఒక చోట ఏమంటాడంటే, 

 ‘Indeed the safest road to Hell is the gradual one

 – the gentle slope, 

soft underfoot, 

without sudden turnings, 

without milestones, 

without signposts’ 

నరకానికి మనం వేసే దారి చిన్న చిన్న అడుగులతో, సున్నితముగా ఉంటుంది. అందులో విపరీత మలుపులు ఉండవు. సంకేతాలు, మార్గ దర్శకాలు ఉండవు’ సాతానుడు మనిషిని ముందు గందర గోళానికి గురిచేసి, తొందర లేకుండా, కొద్ది కొద్దిగా జరుపుకుంటూ నరకానికి కొనిపోతాడు. దేవుడు అత్యవస స్వరముతో మనలను ఆజ్ఞాపిస్తున్నాడు: 

ఇదిగో ఇప్పుడే మిక్కిలి అనుకూలమైన సమయము, ఇదిగో ఇదే రక్షణ దినము (2 కొరింథీ 6:3)

ఈ రోజు కాదు, రేపు చూద్దాములే అని సాతానుడు అనేక మందిని మోసము చేస్తున్నాడు. గొప్ప బాప్టిస్ట్ బోధకుడు కర్టిస్ హట్సన్ (1934 – 1995) ఒకసారి అన్నాడు, ‘నరకములో ఎక్కువ మంది నాస్తికులు ఉండరు. అక్కడ ఉండే అత్యధికులు ‘ఈ రోజు కాదు, రేపు చూద్దాములే’ అని రక్షణ తీర్మానాన్ని వాయిదా వేసుకొన్నవారే’ 

దేవుడు మన ఆత్మలకు ఎంతో విలువ ఇచ్చాడు.

మత్తయి సువార్త 16:26

ఒక మనుష్యుడు లోకమంతయు సంపాదించు కొని తన ప్రాణమును పోగొట్టుకొంటే అతనికేమి ప్రయో జనము? ఒక మనుష్యుడు తన ప్రాణమునకు ప్రతిగా నేమి యియ్యగలడు?

ఈ ప్రపంచములో మీరు జెఫ్ బెజోస్, బిల్ గేట్స్, ముఖేష్ అంబానీ లాంటి ధనవంతులు అయినప్పటికీ ఆత్మ రక్షణ పొందకుండా మీరు మరణిస్తే అంత కన్నా దరిద్రం మరొకటి ఉండదు. 

పునర్జన్మ లేదు.ఒక్కటే జీవితము. దీని తరువాత తీర్పు జరుగుతుంది.

ఇది ఒక్కటే జీవితము అని దేవుడు తన వాక్యములో మనకు స్పష్టముగా తెలియజేశాడు. ‘మళ్ళీ, మళ్ళీ పుడతాను, సీతా కోక చిలుకలా ఎగురుతాను’ అని చాలా మంది పాటలు పాడు కొంటున్నారు. అది వారి అజ్ఞానము. 

హెబ్రీయులకు 9:27

మనుష్యులొక్కసారే మృతిపొందవలెనని నియమింపబడెను; ఆ తరువాత తీర్పు జరుగును.

రక్షణ పొందని వారందరూ దేవుని యొక్క ధవళ సింహాసనము ముందు నిలబడి తీర్పు పొందుతారు.

రక్షణ పొందని ఎవ్వరూ దేవుని ధవళ సింహాసనాన్ని తప్పించుకోలేరు 

ప్రకటన గ్రంథము 20:11

మరియు ధవళమైన మహా సింహాసనమును దానియందు ఆసీనుడైయున్న యొకనిని చూచితిని; 

భూమ్యాకాశములు ఆయన సముఖమునుండి పారిపోయెను; వాటికి నిలువ చోటు కనబడకపోయెను.

ఎవ్వరూ ఈ సింహాసనాన్ని తప్పించుకోలేరు. సముద్రాగాధాలలో కృశించి, కనుమరుగు అయిపోయిన వారితో సహా అందరూ దాని ముందు నిలబడవలసినదే.

ప్రకటన గ్రంథము 20:13 

సముద్రము తనలో ఉన్న మృతులను అప్పగించెను; మరణమును పాతాళలోకమును వాటి వశముననున్న మృతుల నప్పగించెను; వారిలో ప్రతివాడు తన క్రియల చొప్పున తీర్పుపొందెను.

నరకానికి వెళ్ళేది ఎవరు? 

సాతాను, అతని అనుసరించిన దేవ దూతలు, మనుష్యులు 

ప్రకటన గ్రంథము 20:10 

వారిని మోసపరచిన అపవాది అగ్ని గంధకములుగల గుండములో పడవేయబడెను. అచ్చట ఆ క్రూరమృగమును అబద్ధ ప్రవక్తయు ఉన్నారు; వారు యుగయుగములు రాత్రింబగళ్లు బాధింపబడుదురు. దేవుడు సాతానునికి తీర్పు తీర్చాడు. అతని అనుచర చీకటి సేనలు, దురాత్మలు కొన్ని ఇప్పటికే నరకములో బంధించబడినవి. ఇప్పుడు స్వేచ్ఛగా తిరుగుతున్న దెయ్యాలు కూడా భవిష్యత్తులో నరకములో త్రోసివేయబడుతాయి. 

ప్రకటన గ్రంథము 20:15

ఎవని పేరైనను జీవగ్రంథమందు వ్రాయబడినట్టు కనబడనియెడల వాడు అగ్నిగుండములో పడవేయబడెను.

ప్రకటన గ్రంథము 21:8

పిరికివారును,అవిశ్వాసులును, అసహ్యులును, నరహంతకులును, వ్యభిచారులును, మాంత్రి కులును,విగ్రహారాధకులును, అబద్ధికులందరును అగ్ని గంధకములతో మండు గుండములో పాలుపొందుదురు; ఇది రెండవ మరణము. ఎవరైతే పాపములో కొనసాగుతూ, పాప క్షమాపణ పొందకుండా, ప్రభువైన యేసు క్రీస్తును తమ రక్షకునిగా అంగీకరించకుండా మరణిస్తారో వారి గమ్యము నరకమే.

మరణము అంటే ఏమిటి? 

బైబిల్ లో రెండు మరణాలు ఉన్నాయి. మొదటి మరణము భౌతికమైనది, తాత్కాలికమైనది. రెండవ మరణము ఆత్మీయమైనది, నిరంతరమైనది. దేవుడు యేసు క్రీస్తు నందు అనుగ్రహిస్తున్న నిత్యజీవమును అంగీకరించ కుండా మరణిస్తే అది రెండవ మరణము. విశ్వాసికి ఒక్క మరణమే, అది భౌతికమైనది. అవిశ్వాసికి రెండు మరణాలు. మొదటిది భౌతికమైనది, రెండవది ఆత్మీయమైనది. 

రోమీయులకు 6:23 

ఏలయనగా పాపమువలన వచ్చు జీతము మరణము, 

అయితే దేవుని కృపావరము మన ప్రభువైన క్రీస్తుయేసునందు నిత్య జీవము.

ప్రకటన గ్రంథము 20:14 

మరణమును మృతుల లోకమును అగ్నిగుండములో 

పడవేయబడెను; ఈ అగ్నిగుండము రెండవ మరణము.

    గుండె నొప్పితో నాదగ్గరకు ఒక రోగి వచ్చాడనుకొందాము. ఒక డాక్టర్ గా అతని జబ్బు గుర్తించి, నయం చేసి, అతని ప్రాణాలు కాపాడే నైపుణ్యము, సామాగ్రి, సదుపాయాలు నా దగ్గర ఉన్నాయి. అయితే నా దగ్గర వైద్యం చేయించుకోవటానికి ఆ రోగి అంగీకరించాలి. అంగీకరించకపోతే ఆ వ్యక్తికి నేను ఎలాంటి సహాయము చేయలేను. గుండె జబ్బులు లేని లోకము ఉంటే బాగుండు అని అతడు అనుకోవచ్చు. కానీ రియాలిటీ అది కాదు. నా వైద్యమును అంగీకరించని పక్షములో అతని గుండె జబ్బే అతని ప్రాణాలు తీస్తుంది. నేను కాదు. 

   ప్రభువైన యేసు క్రీస్తు తనను ఒక పరలోక వైద్యునితో పోల్చుకొన్నాడు (మార్కు సువార్త 2:17). పాప రోగము నయం చేయకపోతే మనము నరకానికి వెళ్తాము అని ఆయన మనలను హెచ్చరించాడు. మనలను నరకము నుండి రక్షించగలిగే నైపుణ్యము, సామర్ధ్యము, శక్తి ఆయన దగ్గర ఉన్నాయి. అయితే ఆయన వైద్యం చేయించుకోవటానికి పాపి అంగీకరించాలి. అంగీకరించకపోతే ఆ వ్యక్తికి రక్షకుడు ఎలాంటి సహాయము చేయలేదు. నరకము లేని విశ్వము ఉంటే బాగుండు అని అతడు అనుకోవచ్చు. కానీ రియాలిటీ అది కాదు. ప్రభువైన యేసు క్రీస్తు ను రక్షకునిగా అంగీకరించకపోతే మన పాపమే మనలను నరకానికి ఈడ్చుకొనివెళ్తుంది.దేవుడు మనలను రక్షించి, క్షమించటానికి సిద్ధముగా ఉన్నాడు. 

మత్తయి సువార్త 7:13 

ఇరుకు ద్వారమున ప్రవేశించుడి; 

నాశనమునకు పోవు ద్వారము వెడల్పును, ఆ దారి విశాలమునైయున్నది, 

దాని ద్వారా ప్రవేశించువారు అనేకులు.

పరలోకానికి వెళ్లే మార్గము ఇరుకుగా ఉంది. అంటే ఇది చాలా మందికి ఇష్టము ఉండదు. ‘నీవు పాపివి, నీ స్వంత నీతితో నీవు పరలోకము వెళ్ళలేవు. క్రీస్తు నీతి నీకు కావాలి’: ఈ మాటలు చాలా మందికి రుచించవు. ‘నీవు నీతి మంతుడివి, నీ స్వంత నీతితో పరలోకము వెళ్లగలవు’: ఈ మాటలు చాలా మందికి ఇంపుగా ఉంటాయి. మన స్వంత నీతితో పరలోకములో ప్రవేశించటానికి ప్రయత్నించడమే విశాల ద్వారము. ఈ విశాల ద్వారము పరలోకమునకు నడిపించదు. దాని గమ్యము నరకమే.

మత్తయి సువార్త 25:41

అప్పుడాయన యెడమవైపున ఉండువారిని చూచి శపింప బడినవారలారా, నన్ను విడిచి అపవాదికిని

వాని దూతల కును సిద్ధపరచబడిన నిత్యాగ్నిలోనికి పోవుడి.

శపింప బడినవారలారా: క్రీస్తు నందు దేవుడు ఏర్పరచిన ఆశీర్వాదాలను మనము తృణీకరిస్తే, నరకము యొక్క శాపమే మనకు మిగులుతుంది.

 అపవాదికిని, వాని దూతల కును సిద్ధపరచబడిన నిత్యాగ్ని: దేవుడు మానవుల కోసము నరకమును సృష్టించలేదు. అది సాతానుని కొరకు, వాని దూతల కొరకు సిద్ధపరచబడింది. 

ఈ ప్రపంచములో చాలా విషయాల్లో రెండు స్థితులనే దేవుడు ఉంచాడు. పరీక్ష పాస్ అవటమో, ఫెయిల్ అవటమో రెండిటిలో ఒకటే జరుగుతుంది. మూడో అవకాశం లేదు. ప్రాణము ఉండుట లేక మరణించుట రెండిటిలో ఒక స్థితిలోనే ఉండగలము. మూడో అవకాశము లేదు. ప్రేమించుటయో లేక ద్వేషించుటయో రెండిటిలో ఒక భావమే కలిగి ఉండగలము. మూడో అవకాశము లేదు. అలాగే పరలోకమా లేక నరకమా? వాటిలో ఒక గమ్యాన్నే మనము కోరుకొనగలము. మూడో అవకాశము లేదు.

నరకము ఎలా ఉంటుంది? 

నరకము ఎలా ఉంటుందో కొన్ని విషయాలు  బైబిల్ చదివి మనము తెలుసుకొనవచ్చు. 

అక్కడ తీవ్రమైన దప్పిక ఉంటుంది: 

లూకా సువార్త 16:24 

తండ్రివైన అబ్రాహామా,నాయందు కనికర పడి,తన వ్రేలికొనను-నీళ్లలోముంచి నా నాలుకను 

చల్లార్చుటకు లాజరును పంపుము; నేను ఈ అగ్నిజ్వాలలో యాతనపడు చున్నానని కేకలువేసి…..

మనకు దాహము అయినప్పుడు నీరు త్రాగుతాము. ఇంకా దాహము గా ఉంటే రెఫ్రిజిరేటర్ తెరిచి కూల్ డ్రింక్ త్రాగుతాము. కానీ నరకములో నీరు, రెఫ్రిజిరేటర్, కూల్ డ్రింక్ లు కానీ ఉండవు. నరకములో ధనవంతుని పరిస్థితి ఎలా ఉందో యేసు ప్రభువు వివరించాడు. వ్రేలి కొన మీద నుండి పడే ఒక చిన్న నీటి బొట్టు కోసము ధనవంతుడు అభ్యర్ధించాడు కానీ పొందలేకపోయాడు.

నరకములో నెమ్మది ఉండదు: 

ప్రకటన గ్రంథము 14:11

వారి బాధసంబంధమైన పొగ యుగయుగములు లేచును; 

ఆ క్రూరమృగమునకు గాని దాని ప్రతిమకు గాని నమస్కారము చేయువారును,

దాని పేరుగల ముద్ర ఎవడైనను వేయించుకొనినయెడల

వాడును రాత్రింబగళ్లు నెమ్మది లేనివారై యుందురు. 

నరకమునకు అంతము లేదు: 

అది యుగయుగములు ఉండేది.

గొప్ప బోధకుడు C.H.స్పర్జన్ (1834-1892)  నరకము గురించి ఈ మాటలు చెప్పాడు: 

“On every chain in hell, there is written “for ever.”

 In the fires, there blaze out the words, “for ever.” 

Up above their heads, they read “for ever.” 

Their eyes are galled, and their hearts are pained with the thought that it is “for ever.”

 Oh! if I could tell you to-night that hell would one day be burned out, 

and that those who were lost might be saved, there would be a jubilee in

hell at the very thought of it. But it cannot be—it is “for ever” they are “cast

into utter darkness.”

“నరకములో ప్రతి గొలుసు మీద ‘నిరంతరము’ అని వ్రాసి ఉంది. 

మంటల మీద ఒక మాట ఎగసిపడుతుంది: ‘ఇది నిరంతరము’ 

వారి తలలకు పైగా ఒక మాట వ్రాయబడి ఉంది: ‘ఇది నిరంతరము’ 

వారి కన్నుల్లో నిస్పృహ ఉంది; ‘ఇది నిరంతరము’ అని తెలిసివారి హృదయాలు శోకించాయి. రక్షణ పొందుటకు మరొక అవకాశము ఉంది అని తెలిస్తే వారంతా నరకములో పండుగ చేసుకొంటారు. అయితే ఆ అవకాశము లేదు. వారు నిరంతరము వెలుపటి చీకటిలో త్రోయబడుతారు.” 

ఇంటర్ స్టెల్లార్ అనే చిత్రములో భూమి చాలా పాడైపోతుంది.  ఒక శాస్త్రవేత్త మానవ జాతిని రక్షించుటకు కొంతమందిని మరొక గ్రహానికి పంపించాలని ప్రయత్నిస్తాడు. కానీ అతనికి అంత సమయము దొరకదు. ఆ శాస్త్రవేత్త చనిపోయే సమయములో మంచము మీద ఉంటాడు. అతని తోటి శాస్త్రవేత్త ‘నీకు మరణము అంటే భయముగా ఉందా?’ అని అతని అడుగుతుంది. దానికి ఆ శాస్త్ర వేత్త, ‘మరణము అంటే నాకు భయము లేదు, సమయము అంటే నాకు భయము’ అంటాడు.

   దేవుడు లేని వ్యక్తి మరణానికి భయపడటము కాదు, దాని తరువాత అంతము లేని, యుగయుగములు ఉండే వేదనాభరితమైన సమయానికి భయపడాలి.

నరకములో పండ్లు కొరుకుట ఉంటుంది

మత్తయి సువార్త 13:49 – 50 

ఆలాగే యుగసమాప్తియందు జరుగును. 

దేవ దూతలు వచ్చి నీతిమంతులలోనుండి దుష్టులను వేరుపరచి,

వీరిని అగ్ని గుండములో పడవేయుదురు.

అక్కడ ఏడ్పును పండ్లుకొరుకుటయును ఉండును.

నరకము క్రూరత్వము కాదా? 

నరకము గురించి యేసు ప్రభువు చేసిన హెచ్చరికలు చాలా మంది మేధావులకు రుచించలేదు. దేవుడు రక్షణ పొందని వారిని నిరంతరము నరకములో బంధిస్తాడు అనే మాట నాస్తికులకు కోపం తెప్పిస్తుంది.

Bertrandrusselltelugu.jpg

బెర్ట్రాండ్ రస్సెల్ (1872 – 1970) అనే బ్రిటిష్ మేధావి, నాస్తికుడు ‘నేనెందుకు క్రైస్తవుణ్ణి కాలేదు?’ అనే పుస్తకములో క్రింది వ్రాశాడు.

“There is one serious defect to my mind in Christ’s moral character, and that is that He believed in hell. I do not myself feel that any person who is really profoundly humane can believe in everlasting punishment”

“క్రీస్తు యొక్క నైతిక స్వభావములో ఒక తీవ్రమైన లోపము ఉంది. ఆయన నరకము ఉందని విశ్వసించాడు. మానవత్వము ఉన్న ఏ వ్యక్తీ నరకమును నమ్మడు” 

మార్క్ ట్వేయిన్ (1835-1910) అనే అమెరికా మేధావి, నాస్తికుడు ఏమన్నాడంటే, ‘నరకము గురించి బోధించిన ఈ సాత్వికుడైన రక్షకుడు పాత నిబంధనలో దేవుని కంటే వెయ్యి రెట్లు క్రూరుడు’ 

“the meek and gentle Savior was a thousand times crueler than ever he was in the Old Testament.”

MarkTwain.png

నరకము గురించి బోధించాడు కాబట్టి యేసు క్రీస్తుకు మానవత్వము లేదని, ఆయన క్రూరుడు అని ఈ నాస్తికులు ఆయన మీద నిందలు వేశారు. అయితే నరకము నిజముగా ఉంటే క్రీస్తును తప్పుపట్టాల్సిన అవసరము లేదు.

కొన్ని రోజుల క్రితము ఒక లారీ డ్రైవర్ నా దగ్గరకు వైద్య పరీక్షల కోసము వచ్చాడు. అతనికి పరీక్షలు చేసిన తరువాత, ‘మీకు డయబిటిస్ జబ్బు ఉంది’ అని నేను అతనికి చెప్పాను. అతడు నా మాటలు నమ్మలేదు. నేను అతనికి వెంటనే బ్లడ్ షుగర్ చెక్ చేశాను. అది 270 చూపించింది. అతనికి చెప్పాను:  ‘బ్యాడ్ న్యూస్ ఏమిటంటే నీకు డయబిటిస్ జబ్బు ఉంది, నువ్వు లారీ తోలితే ప్రమాదానికి గురై నీకు, ఇతరులకు హాని చేస్తావు. గుడ్ న్యూస్ ఏమిటంటే డయబిటిస్ జబ్బు కు మంచి మందులు ఉన్నాయి. వాటిని వాడి నువ్వు ఆరోగ్యముగా ఉన్నప్పుడు మళ్ళీ నువ్వు లారీ తోలవచ్చు’ 

     నా మాటలు అతనికి ఏ మాత్రం రుచించలేదు. ‘నాకు డయబిటిస్ జబ్బు లేదు, ఏ జబ్బు లేదు’ అని అరుచుకొంటూ అతను నా ఆఫీస్ నుండి వెళ్ళిపోయాడు.3 వారాల తరువాత మళ్ళీ వచ్చాడు. ‘నన్ను క్షమించండి, నేను మీ మాటలు వినకుండా ఇంటికి వెళ్ళాను. కొన్ని రోజుల తరువాత నాకు కను చూపు పోయి స్పృహ కోల్పోయాను. నన్ను వెంటనే హాస్పిటల్ కి తీసుకువెళ్లారు. నా బ్లడ్ షుగర్ 800 కు చేరింది. నేను కోమాలోకి వెళ్తున్నప్పుడు డాక్టర్లు నా ప్రాణము కాపాడారు’.

    ఒక వైద్యుడు రోగికి బ్యాడ్ న్యూస్, గుడ్ న్యూస్ రెండూ చెబుతాడు. ‘నాకు జబ్బు ఉండటము ఏమిటి?’ అని రోగికి కోపం, బాధ కలుగుట సహజమే కానీ బ్యాడ్ న్యూస్ ను అంగీకరిస్తేనే వైద్యము చేయగలము. ప్రభువైన యేసు క్రీస్తు పరలోక వైద్యుడుగా మన మధ్యలోకి వచ్చాడు. ఆయన ముందు మనకు బ్యాడ్ న్యూస్ చెప్పాడు: నరకము ఉన్నది. బెర్ట్రాండ్ రస్సెల్, మార్క్ ట్వేయిన్ లాంటి మేధావులు ఆ లారీ డ్రైవర్ లాగానే గొడవ చేశారు. యేసు క్రీస్తు కు మానవత్వము లేదని ఆయన మీద నిందలు వేశారు. యేసు ప్రభువు మనకు గుడ్ న్యూస్ కూడా చెప్పాడు: నిన్ను నరకము నుండి రక్షించుటకు నేను నీ పాపాల కోసము చనిపోయి, తిరిగి లేచాను.

     సువార్త అనే మాట ‘ఇవాంజెలియన్’ అనే గ్రీకు పదము నుండి ఆవిర్భవించింది.

ప్రకటన గ్రంథము 1:18

నేను మొదటివాడను కడపటివాడను జీవించువాడను; 

మృతుడనైతిని గాని ఇదిగో యుగయుగములు సజీవుడనై యున్నాను. 

మరియు మరణము యొక్కయు పాతాళ లోకము యొక్కయు తాళపు చెవులు నా స్వాధీనములో ఉన్నవి.

మత వ్యవస్థ మనలను నరకము నుండి రక్షించలేదు. 

మత్తయి సువార్త 23:15

అయ్యో, వేషధారులైన శాస్త్రులారా, పరిసయ్యులారా, ఒకని మీ మతములో కలుపుకొనుటకు

మీరు సముద్ర మును భూమిని చుట్టివచ్చెదరు; అతడు కలిసినప్పుడు అతని మీకంటె 

రెండంతలు నరకపాత్రులుగా చేయుదురు.

మనుష్యులను తమ మత వ్యవస్థలోకి దూర్చి, మతాధికారులు వారిని రెండంతలు నరకపాత్రులుగా చేస్తారు అని యేసు ప్రభువు పైన మనకు తెలియజేశాడు.మార్టిన్ లూథర్ (1483-1546) క్యాథలిక్ చర్చి లో పెద్ద మతాధికారిగా ఉన్నాడు. అతని ఆత్మ రక్షణ మీద అతనికి అనుమానము కలిగింది. దేవుడు నా పాపములు క్షమించాడా? అనే అనుమానము కలిగింది.

 ఉదాహరణకు, ఇద్దరు అన్నదమ్ములు కీచులాడుకొంటున్నారు అనుకొందాము. కొద్ది సేపటికి అన్న తమ్ముణ్ణి వెనక్కు త్రోశాడు. తమ్ముడు మెడ విరిగింది. ఆ అన్న వారి తండ్రిని ఎలా ఎదుర్కొంటాడు? తండ్రి ‘ఒరేయ్ తమ్ముణ్ణి ఎందుకు త్రో శావు రా’ అని అన్నకు చెంప దెబ్బ వేయవచ్చు. కానీ, ‘ఈ రోజు నుండి నీవు నాకు కొడుకువే కాదు పో’ అంటే అన్న ఆ తండ్రి మాటలు తట్టుకోగలడా? 

MartinLuther1225a.png

   నరక శిక్ష కంటే దేవుడు ‘నువ్వు ఎవరివో నాకు తెలియదు పో’ అని తనను అంటాడేమో అన్న భయమే లూథర్ ని తీవ్రముగా బాధించింది. మత వ్యవస్థ తనను నరకము నుండి రక్షించలేదని మార్టిన్ లూథర్ కి అర్ధము అయ్యింది. ‘నీతి మంతుడు విశ్వాస మూలముగా జీవించును’ అనే వాక్యము (రోమా 1:17) అతనికి ఎంతో ఆదరణ కలిగింది. మన నరక శిక్షను యేసు క్రీస్తు ప్రభువు సిలువ మీద భరించి మనలను రక్షించాడు అనే సత్యము నరక భయము నుండి లూథర్ ని విడిపించింది.

నరకములో ఆకలి ఉంది, సిలువ మీద యేసు ప్రభువు మన ఆకలిని భరించాడు.

నరకములో దప్పిక ఉంది, సిలువ మీద యేసు ప్రభువు మన దప్పికను భరించాడు.

నరకములో బాధ ఉంది, సిలువ మీద యేసు ప్రభువు మన బాధను భరించాడు.

నరకములో పాపము ఉంది, సిలువ మీద యేసు ప్రభువు మన పాపమును భరించాడు.

నరకములో వేడి ఉంది, సిలువ మీద యేసు ప్రభువు మన వేడిని భరించాడు.

నరకములో ఒంటరి తనము ఉంది, సిలువ మీద యేసు ప్రభువు మన ఒంటరి తనాన్ని భరించాడు.

ఆయన దగ్గరికి వచ్చి రక్షణ పొంది నీవు నరక శిక్షను తప్పించుకోవచ్చు.

డాక్టర్ పాల్ కట్టుపల్లి 

Feed a Hungry Child with as little as $10 per month

Give a helping hand to feed the hungry children and to provide them health care and education

$10.00

Leave a Reply