చంద్రయాన్ నిరూపించిన బైబిలు ప్రవచనాలు

lavaonthemoon.png  

  ఈ రోజు ‘చంద్రుడు’ అనే సందేశాన్ని మీకు అందించాలని నేను ఆశపడుచున్నాను. భారత దేశము ‘చంద్ర యాన్ – 2’ అనే చంద్రుని యాత్ర ప్రారంభించింది. అపొల్లో 11 లో మానవుడు తొలిసారి చంద్రుని మీద అడుగు పెట్టి 50 సంవత్సరాలు ముగిసింది. అందరి ఆలోచనలు ఇప్పుడు చంద్రుని మీద ఉన్నాయి. చంద్రుడు గురించి బైబిల్ ఏమని చెబుతుందో ఈ రోజు చూద్దాము.

   భారత దేశ అంత రక్ష అధ్యయన సంస్థ ISRO ఆంధ్ర ప్రదేశ్ లోని శ్రీ హరి కోట నుండి చంద్ర యాన్ – 2 ని పంపించింది. చంద్రుని ఉపరితలమును, దాని అంతర్భాగాలను స్టడీ చేయటానికి ఈ యాత్ర 

ఉపయోగపడుతుంది. భూమి మీద మనకు చాలా పనులు, చాలా గొడవలు ఉంటాయి. వాటిల్లో పడి మనము అంతరిక్షాన్ని మరచిపోతాము. అప్పుడప్పుడూ మనము కొంత సమయము తీసుకొని అంత రిక్షము వైపు చూడాలి. అది దేవుడు సృష్టించిన అద్భుతము. నాస్తికులు ఏమంటారంటే, దేవుడు కావాలో, సైన్స్ కావాలో కోరుకోండి. రెండూ కావాలంటే కుదరదు.లాజిక్ లో దీనిని false dichotomy అంటారు. అదెలా ఉంటుందంటే, మీ నాన్న కావాలా? అమ్మ కావాలా? ఎవరినో ఒకరినే కోరుకో. ఇద్దరూ కావాలి అని అడగవద్దు. అది false dichotomy. మనకు ఇద్దరూ కావాలి. దేవుడు కావాలి, సైన్స్ కావాలి. 

     దేవుడు లేకపోతే సైన్స్ ఉండదు. క్రైస్తవ శాస్త్రవేత్తలు – దేవుడు, సైన్స్ రెండింటినీ కోరుకున్నారు. టికో బ్రాహి అంతరిక్షాన్ని అధ్యయనము చేస్తూ దేవుని స్తుతించాడు. జొహన్నెస్ కెప్లెర్ ప్లానెట్స్ ఏ విధముగా ప్రయాణిస్తాయి, వాటి కక్ష్యలు ఏ ఆకారములో ఉంటాయి, వాటి నియమాలు వ్రాశాడు.గొప్ప శాస్త్ర వేత్త.ఆ పనులు అన్నీ చేస్తూనే, కెప్లెర్ యేసు ప్రభువును స్తుతించాడు. సర్ ఐజాక్ న్యూటన్. చాలా గొప్ప శాస్త్రవేత్త. ఒక ఆపిల్ కాయ చెట్టు మీద నుండి పడటం ఆయన చూశాడు. చంద్రుని వైపు కూడా చూశాడు. భూమి ఆపిల్ ని ఆకర్షించింది, చంద్రుణ్ణి ఆకర్షించింది. అది ఎలా సాధ్యపడింది. ఈ రెండింటినీ కలిపే నియమము ఏమన్నా ఉందా? బైబిల్ లో దేవుడు అనేక నియమాలు వ్రాశాడు. ప్రకృతిలో ఏ నియమాలు పెట్టాడు. ఆ విధముగా అలోచించి న్యూటన్ universal law of gravitation వ్రాశాడు.విశ్వ గురుత్వాకర్ష నియమము.ఆ నియమము లేకపోతే ఈ చంద్రయాన్ లు, అపొల్లో మిషన్ లు ఉండేవి కాదు.

IsaacNewtonTelugu.jpg

    న్యూటన్ F = G m1 m2/d² అనే నియమము వ్రాశాడు. భూమికి, చంద్రునికి మధ్య గురుత్వాకర్షణ శక్తి ఎంత ఉందో తెలుసుకోవాలంటే న్యూటన్ నియమాలు కావాల్సిందే. ఆ విధముగా న్యూటన్ ఒక ప్రక్క గొప్ప శాస్త్రవేత్తగా రాణించాడు. మరొక ప్రక్క బైబిల్ స్టడీ కూడా చేశాడు. బైబిల్  మీద చక్కటి పుస్తకాలు వ్రాశాడు. నాస్తికులకు నేను చేసే మనవి ఏమిటంటే, మీరు దయచేసి ఈ false dichotomy క్రైస్తవుల ముందు పెట్టవద్దు. దేవుడు కావాలో, సైన్స్ కావాలో కోరుకోండి అని మాకు షరతులు పెట్టబాకండి. క్రైస్తవులు దేవుని ప్రేమించారు. సైన్స్ ని కూడా అభివృద్ధి చేశారు. ఎందుకంటే క్రైస్తవులు ఇది దేవుని సృష్టి, ఇందులో దేవుని జ్ఞానము ఉంది, దీనిని మనము అర్థము చేసుకోవాలి అని ప్రకృతి వైపు చూశారు. 

    ఆదికాండము మొదటి అధ్యాయములో మనము చదువుతాము.

  1. దేవుడు పగటిని రాత్రిని వేరుపరచునట్లు ఆకాశవిశాల మందు జ్యోతులు కలుగును గాకనియు, 

అవి సూచనలను కాలములను దిన సంవత్సరములను సూచించుటకై యుండు గాకనియు,

  1. భూమిమీద వెలుగిచ్చుటకు అవి ఆకాశ విశాలమందు జ్యోతులై యుండు గాకనియు పలికెను; 

ఆ ప్రకారమాయెను.

  1. దేవుడు ఆ రెండు గొప్ప జ్యోతులను, అనగా పగటిని ఏలుటకు పెద్ద జ్యోతిని రాత్రిని ఏలుటకు చిన్న జ్యోతిని నక్షత్రములను చేసెను.
  2. భూమిమీద వెలు గిచ్చుటకును
  3. పగటిని రాత్రిని ఏలుటకును వెలుగును చీక టిని వేరుపరచుటకును దేవుడు ఆకాశ విశాలమందు వాటి నుంచెను; అది మంచిదని దేవుడు చూచెను.
  4. అస్తమయమును ఉదయమును కలుగగా నాలుగవ దినమాయెను.

     6 రోజుల సృష్టిలో దేవుడు నాలుగో రోజున సూర్యుని, చంద్రుని, నక్షత్రాలను సృష్టించాడు. ఆదికాండములో దేవుడు మొదటి రెండు అధ్యాయాల్లోతన సృష్టి కార్యము గురించి మనకు తెలియ జేశాడు. చాలా సింపుల్ గా మనకు చెప్పాడు. He made the stars also అని మనము ఇక్కడ చదువుతున్నాము.ఆయన నక్షత్రములను కూడా చేశాడు.కొన్ని కోటానుకోట్ల నక్షత్రాలు ఉన్నాయి.

Earthandmoon.PNG

అయితే దేవుడు చాలా సింపుల్ గా ఒక్క మాటలో చెప్పాడు. కొంత మందికి ఇది అభ్యంతరముగా ఉంటుంది.ఇంకాస్త ఎక్కువ చెప్పవచ్చుగా అని వారంటారు. ఒక విషయము చాలా సేపు చెప్పినంత మాత్రాన సత్యము అయిపోదు, కొంచెము సేపు చెప్పినంత మాత్రాన అసత్యము అయిపోదు. దేవుడు బైబిల్ ఎందుకు వ్రాయించాడంటే మనలను రక్షించటానికి, విమోచించటానికి. తన సృష్టి గురించి సుదీర్ఘముగా వివరించటానికి కాదు.జెఫ్ బెజోస్. ఈయన ప్రపంచములోనే ధనవంతుడు. అమెజాన్ అనే కంపెనీ పెట్టి కొద్ది కాలములోనే ఈయన ప్రపంచములోనే నెంబర్ వన్ ధనవంతుడయ్యాడు. ఈయన ఒక రోజు మీకు రోడ్డు మీద పరిచయమయ్యాడు అనుకొందాము. మనిద్దరము టెన్నిస్ ఆడుదాము రా  అన్నాడు. మీరు ఆశ్చర్యపోయారు. కానీ వెళ్లారు. ఇద్దరూ టెన్నిస్ ఆడారు. ఆ తరువాత జెఫ్ బెజోస్ టీ త్రాగుదాము రా అన్నాడు. మీరు ఇద్దరు కలిసి టీ త్రాగారు. ఒక అర గంట సేపు కబుర్లు చెప్పుకొన్నారు. జెఫ్ బెజోస్ మీతో ఏమన్నాడంటే, ‘నేను అమెజాన్ కంపెనీ పనుల్లో చాలా బిజీ గా ఉన్నాను. కానీ సాయంత్రం రిలాక్స్ అవుదామని టెన్నిస్ ఆడుతున్నాను’ అని మొదలు పెట్టి మిగిలిన అరగంట సేపు టెన్నిస్ గురించే మాట్లాడాడు.మీరనుకోవచ్చు: జెఫ్ బెజోస్ అమెజాన్ గురించి మాట్లాడుతాడనుకొన్నాను. దాని గురించి ఒక్క మాటలో ముగించి మిగిలిన సమయం అంతా టెన్నిస్ గురించే మాట్లాడాడు. 

    బెజోస్ అంతరంగములో ఏముంది? నేను నీతో స్నేహం చేస్తున్నది ఎందుకు? టెన్నిస్ ఆడి రిలాక్స్ అవుదామని. నా వ్యాపారాల గురించి చెప్పుకోవడానికి కాదు. బైబిల్ కూడా అంతే. దేవుడు మనతో స్నేహము చేసింది మనలను ప్రేమించి తన రక్షణ కార్యాన్ని మనలో జరిగించడానికి. తన గురించి గొప్పలు చెప్పుకోవడము ఆయన ముఖ్య ఉద్దేశ్యము కాదు. అందుకనే భూమిని, సూర్యుణ్ణి,చంద్రుణ్ణి, నక్షత్రాలను చేసింది నేనే అని దేవుడు ఒక్క మాటలో చెప్పి ఆ విషయాన్ని ప్రక్కన పెట్టాడు. బైబిల్ లో మిగిలిన కథ మొత్తము మనిషి గురించే. దేవుడు సూర్య చంద్రులను ఎందుకు సృష్టించాడు? 14 వచనము. 

అవి సూచనలను కాలములను దిన సంవత్సరములను సూచించుటకై యుండు 

  1. భూమిమీద వెలు గిచ్చుటకును
  2. పగటిని రాత్రిని ఏలుటకును వెలుగును చీక టిని వేరుపరచుటకును దేవుడు ఆకాశ విశాలమందు వాటి నుంచెను.

   

     పగలు సూర్యుని వెలుగులో మనము బ్రతుకుతాము. రాత్రి పూట చంద్రుని వెలుగు మనకు లభిస్తుంది. భూమి సూర్యుని చుట్టూ తిరుగుతుంది. చంద్రుడు భూమి చుట్టూ తిరుగుతున్నాడు.మనము కాలము గురించి తెలుసుకోవటానికి దేవుడు వాటిని పెట్టాడు. భూమి సూర్యుని చుట్టూ తిరుగుటకు ఒక సంవత్సరము పడుతున్నది. దాని ఆధారము గానే మన జీవితాన్ని సంవత్సరాల్లో మనము చెప్పుకొంటాము. చంద్రుడు భూమి చుట్టూ తిరుగుటకు నెల రోజులు పడుతున్నది. దాని ఆధారముగా మన సంవత్సరాలను నెలలుగా మనము మనము విభజించుకొన్నాము. మా తాత ఏమంటావుండే వాడంటే, ఆ సంవత్సరము జనవరిలో అమావాస్యకు నేను ఈ పని చేశాను. ఫిబ్రవరి లో పౌర్ణమికి నేను ఆ ఊరు వెళ్ళాను అనేవాడు. అమావాస్య, పౌర్ణమి వాటిని మనము ఇప్పుడు పెద్దగా పట్టించుకోము. కానీ ఒక రోజుల్లో ప్రజలు వాటి ఆధారంగానే సమయాలను, జీవిత సంఘటనలను గుర్తుపెట్టుకొనేవారు.రాత్రి పూట చంద్రుని చూస్తే ఎంత అందముగా ఉంది అని మనకు అనిపిస్తుంది.దాని వెన్నెల ఎంత ఆహ్లాదకరంగా ఉంది అని మనకు అనిపిస్తుంది. జెన్ బుద్ధిజం లో ఒక శ్లోకము ఉంది. 

Being in the world: 

To what might it be compared? 

Dwelling in a dewdrop 

Fallen from a waterfowl’s beak, 

The image of the moon 

 

ఈ ప్రపంచములో మన జీవితాన్ని

దేనితో పోల్చగలము? 

ఒక పక్షి ముక్కు నుండి జాలువారే 

నీటి బిందువులో కనిపించే 

చంద్ర బింబము వంటిదే.

 

Impermanence and Beauty: అది ఎంతో అందముగా ఉంది, అయితే అది తాత్కాలికమైనదే.

నీటి బిందువులో కనిపించే చంద్ర బింబము – అది ఎంతో అందమైన దృశ్యము. అయితే ఆ నీటి బిందువు పక్షి ముక్కు నుండి జారిపోతావుంది. దేవుడు చంద్రుని ఆకాశములో ఎంతో అందముగా పెట్టాడు. దానిని చూసి మీ సమయాన్ని కూడా గుర్తుపెట్టుకోండి అని మనతో అంటున్నాడు.వెలుగు ను ఇవ్వటం మాత్రమే కాకుండా చంద్రుడు తన గురుత్వాకర్షణతో భూమి మీద మన జీవితాలను ప్రభావితము చేస్తాడు. సముద్ర తరంగాలు ఎంత ఎత్తులో వస్తాయి, ఎప్పుడు వస్తాయి ఆ ఆటుపోట్లను చంద్రుని యొక్క గురుత్వాకర్షణ నిర్ణయిస్తుంది. చంద్రుని గురించి మన అపోహలు

ఈ ఆధునిక యుగములో తొలగిపోవుతున్నాయి.

     నా చిన్న తనములో మా తాత నాకు చెబుతూ ఉండేవాడు. చంద్రుని చూడు. పేదరాలి పెద్దమ్మ చెట్టు క్రింద కూర్చొని అట్లు వేస్తున్నది. అయితే చంద్రుని మీద చెట్లు లేవు, పెద్దమ్మలు, చిన్నమ్మలు లేరు. మనకు కనిపించే రూపాలు అవి పెద్ద పెద్ద గోతులు. చంద్రుని మీద అగ్ని పర్వతాలు ప్రేలి ఆ గోతులు ఏర్పడ్డాయి.

    మన ప్రపంచ చరిత్రలో మొదటినుండి మానవులు చేస్తున్న పెద్ద తప్పు సృష్టిని పూజించడము. బైబిల్ లో దేవుడు స్పష్టముగా తెలియజేశాడు. ద్వితీయోప దేశ కాండము 4:19 లో మనము చూస్తే అక్కడ దేవుడు 

సూర్య చంద్ర నక్షత్రములైన ఆకాశ సైన్యమును చూచి మరలుకొల్పబడి, నీ దేవుడైన యెహోవా సర్వాకాశము క్రిందనున్న సమస్త ప్రజలకొరకు పంచి పెట్టినవాటికి నమస్కరించి వాటిని పూజింపకుండునట్లును మీరు బహు జాగ్రత్త పడుడి. 

     చంద్రుడు సృష్టించబడిన గోళమే కానీ సృష్టికర్త కాదు. అయితే ఇశ్రాయేలీయులు దేవుని ఆజ్ఞను విస్మరించారు. వారు చంద్రుణ్ణే దేవునిగా కొలవటము 2 రాజులు గ్రంథము 23 అధ్యాయములో

మనము చదువుతాము (2 రాజులు 23:5; యిర్మీయా 8:1-2) 

    యెహోషువ నాయకత్వములో ఇశ్రాయేలీయులు గిబియోనీయులతో యుద్ధము చేసే టప్పుడు దేవుడు సూర్యుని, చంద్రుని ఆపాడు. అది ఆయనకు చాలా చిన్న పని. జెఫ్ బెజోస్ ఒక చిన్న చెక్ వ్రాసి ఇచ్చినట్లే. 

    చంద్రుని మీద ఏ ప్రదేశములో దిగాలో ఆస్ట్రోనాట్ లు ముందే నిర్ణయించుకొంటారు. 1969, జూలై నెల 16 తేదీన అపొల్లో 11 లో ఆస్ట్రోనాట్ లు నీల్ ఆర్మ్ స్ట్రాంగ్, బుజ్ ఆల్డ్రిన్ లు చంద్రుని మీద అడుగుపెట్టారు. మొత్తము 6 అపొల్లో యాత్రలు చంద్రుని మీదకు జరిగినవి. 

అపొల్లో 11: జూలై 1969

అపొల్లో 12: నవంబర్ 1969 

అపొల్లో 14: జనవరి 1971 

అపొల్లో 15: జూలై 1971 

అపొల్లో 16: ఏప్రిల్ 1972 

అపొల్లో 17: డిసెంబర్ 1972 

Apollo111969.PNG

     ప్రచ్ఛన్న యుద్ధము సమయములో ఈ చంద్ర యాత్రలు అమెరికా, రష్యా దేశముల మధ్య ఒక ఆధిపత్య పోరాటము లాగా కొనసాగినవి. ఈ అపొల్లో యాత్రల్లో చంద్రుని మీద నడిచిన అమెరికా దేశ ఆస్ట్రోనాట్ లు వారు స్తుతించారు. చంద్రుని మీదకు వెళ్లుచూ వారు బైబిల్ వాళ్ళతో తీసుకొని వెళ్లారు. చంద్రుని మీదకు వెళ్లిన మొదటి, ఏకైక పుస్తకంగా బైబిల్ చరిత్ర సృష్టించింది. చంద్రుని మీద కూర్చొని చూస్తున్నప్పుడు భూమి, విశ్వము వారికి ఎంతో అందముగా కనిపించినవి. వారు చంద్రుని మీద కూర్చొని దేవుని ఆరాధించారు. నీల్ ఆర్మ్ స్ట్రాంగ్ తరువాత చంద్రుని మీద అడుగు పెట్టిన రెండవ మనిషి బుజ్ ఆల్డ్రిన్. ఆయన మాగ్నిఫిసెంట్ దేసోలాషన్ (Magnificent Desolation) అనే పుస్తకము వ్రాశాడు.అందులో ఏమని వ్రాశాడంటే, చంద్రుని మీద నేను కొంత సేపు యేసు ప్రభువును ఆరాధించాను.

    ప్రభువు బల్ల లో మనం పెట్టే రొట్టె, ద్రాక్షారసము ఆయన చంద్రుని మీదకు తీసుకువెళ్లాడు. అక్కడ వాటిని తిని, త్రాగి ప్రభువైన యేసు క్రీస్తును ఆరాధించాడు.

కీర్తన 148:3 లో మనము చదువుతాము: 

సూర్యచంద్రులారా, ఆయనను స్తుతించుడి

కాంతిగల నక్షత్రములారా, 

మీరందరు ఆయనను స్తుతించుడి.

     ఆ ఆస్ట్రోనాట్ లు  దేవుని స్తుతించారు. బైబిల్ చదివారు. ఆదియందు దేవుడు భూమ్యాకాశములను సృజించెను అనే బైబిల్ యొక్క తొలి మాటలను వారు ప్రపంచానికి పలికి వినిపించారు.  

    చంద్ర మండలము యాత్ర అంటే ఎంతో ప్రణాళిక, మేధస్సు ఉండాలి. రాకెట్ లు, బూస్టర్లు, ఆర్బిటర్ లు, కమాండ్ మోడ్యూల్ లు, ల్యాండ్ రోవర్ లు, శాటిలైట్ లు అన్ని సిద్ధము చేసుకోవాలి. ఆ శక్తిని, యుక్తిని, జ్ఞానాన్ని దేవుడు మానవునికి మాత్రమే ఇచ్చాడు.పిల్లులు, కుక్కలు, కోతులు ఆ పనులు చేయలేవు.

    సోవియెట్ యూనియన్ మేము దేవుని నమ్మము, మేము నాస్తికులము అని ప్రచారము చేసుకొంది. కాస్మోనాట్ లను వారు అంతరిక్షంలోకి పంపారు. యూరి గగారిన్, వాలెంటైనా టెరిష్కోవా వీళ్ళు చంద్రుని మీదకు వెళ్ళలేదు, అంత రిక్షములో ప్రయాణము చేసి వచ్చారు.క్రిందకు వచ్చి వీళ్ళు ఏమన్నారంటే, ‘అంతరిక్షములో మేము దేవుని కోసము వెదికాము. ఆయన మాకు ఎక్కడా కనిపించలేదు. ఎక్కడ దాక్కున్నాడో!’ వారి యొక్క అహంకారము బయటపెట్టుకున్నారు. నువ్వు వెళ్ళింది ఎంత? చూసింది ఎంత? ఎందుకంత వెటకారం? సోవియెట్ కాస్మోనాట్ లు దేవుని అపహాస్యము చేశారు. అందుకనే వారి ప్రయత్నాల మీద దేవుని ఆశీర్వాదము లేదు. చంద్రుని మీద కాలు పెట్టాలి అని యాభై సంవత్సరాలుగా పైనా క్రిందా పడి శ్రమిస్తున్నా వాళ్లకు సాధ్యము కావటము లేదు. 2024 కు మరొక సారి చంద్రుని మీదకు వెళ్ళాలి, అక్కడ నుండి మార్స్ మీదకు వెళ్ళాలి అని అమెరికా కుచెందిన NASA సంస్థ ప్రకటించింది. 

     అమెరికా వాడు వెళ్ళాడు కాబట్టి మేము వెళ్ళాలి అని రష్యా వాడు, రష్యా వాడు వెళ్ళాడు కాబట్టి మేము వెళ్ళాలి అని చైనా వాడు, చైనా వాడు వెళ్ళాడు కాబట్టి మేము వెళ్ళాలి  అని ఇండియా వాడు, ఇండియా వాడు వెళ్ళాడు కాబట్టి మేము వెళ్ళాలి అని కొరియా వాడు – మనిషి తన ఆధిపత్యాన్ని చూపించుకోవటానికి చంద్ర మండలాన్ని ఈ రోజు వాడు కొంటున్నాడు కానీ, ఇది దేవుని సృష్టి, ఇది దేవుని విశ్వము, మనము ఆయనను స్తుతించాలి, మనము ఆయనను మహిమపరచాలి, మనము ఆయన మార్గములో నడవాలి అనే ఆలోచనే నేటి ప్రపంచ దేశాల్లో లోపించింది.

కీర్తన 8:3 – 4 

నీ చేతిపనియైన నీ ఆకాశములను

నీవు కలుగజేసిన చంద్రనక్షత్రములను నేను చూడగా

నీవు మనుష్యుని జ్ఞాపకము 

చేసికొనుటకు వాడేపాటి వాడు?

నీవు నరపుత్రుని దర్శించుటకు 

వాడేపాటివాడు?

 

నీల్ ఆర్మ్ స్ట్రాంగ్ చంద్రుని మీద పెట్టిన మొదటి అడుగు ఇప్పటి వరకూ అలాగే ఉంది. అడుగు పెట్టి ఆయన ఒక మాట అన్నాడు.

That’s one small step for a man, 

one giant leap for mankind 

 

ఇది ఒక మనిషి వేసిన చిన్న అడుగు కానీ

మానవ జాతి వేసిన పెద్ద అడుగు.

     మనిషి చంద్రుని మీద కాలు మోపాడు అంటే చాలా మందికి నమ్మ బుద్ధి కాదు. ఈ రోజుకి కూడా అపొల్లో యాత్రను నమ్మని వారు ఉన్నారు. బుజ్ ఆల్డ్రిన్ భూమి మీదకు తిరిగి వచ్చిన ఆయనను కలిసిన వారిలో కొంతమంది ఆయన మాటలు నమ్మలేదు.ఆయన పుస్తకం Magnificent Desolation మొదటి పేజీలోనే ఆయన ఆ మాటలు వ్రాశాడు.

ఏంది బాబూ, చంద్రుని మీదకు వెళ్ళావా? నువ్వు జోకులు వెయ్యటానికి మేమే దొరికామా? ఏదో ఫోటో స్టూడియో లో నాలుగు ఫోటోలు దిగి వచ్చి చంద్రుని మీద నడిచాను అని మాకు కబుర్లు చెబుతున్నావు? అని ఆయన మాటలు కొంతమంది నమ్మలేదు. మనము కథల్లో, పురాణాల్లో చెప్పుకొనేది నిజముగా జరిగింది అంటే చాలా మందికి నమ్మకము కలుగలేదు. దేవుడు భూమి 

మీదకు వచ్చాడు అంటే దేవుడు భూమి మీద అడుగు పెట్టడం ఏమిటి అని ఆశ్చర్యపోయే వాళ్ళు ఉన్నారు.దానిని నమ్మని వారు ఉన్నారు. అయితే, మానవుడు చంద్రుని మీద పాదము మోపాడు అనేది ఎంత సత్యమో దేవుడు ఈభూమి మీద తన పాదము మోపాడు అనేది కూడా అంతే సత్యము.

    ప్రభువైన యేసు క్రీస్తు అనే పేరుతో దేవుడు మన మధ్యలో జీవించాడు. మనము పస్కా పండుగ ధ్యానించేటప్పుడు చదివాము. పస్కా పండుగను దేవుడు నిండు చంద్రుడు వున్నప్పుడు చేయమన్నాడు. దేవుని పస్కా గొఱ్ఱె పిల్ల యేసు క్రీస్తు సిలువ వేయబడిన రాత్రి నిండు చంద్రుడు

ఉన్నాడు. రాత్రి చీకటి మనలను కమ్ముకొన్నప్పుడు నిండు చంద్రుడు సూర్యుని వెలుగును మనకు అందిస్తాడు. ప్రభువైన యేసు క్రీస్తు చీకటిలో ఉన్న ఈ లోకములో దేవుని వెలుగును మన మీద కుమ్మరించే నిండు చంద్రుడు. పరలోకపు వెలుగును మనకు ఇవ్వటానికి ఆయన ఈ భూమి

మీద అడుగు వేసిన దేవుడు. చివరిగా చంద్రుడికి కూడా దేవుడు ఒక డెడ్ లైన్ పెట్టాడు. దాని మీద కూడా ఆయన expiration date వ్రాశాడు. చంద్రుని అంతము ఎలా ఉంటుందో దేవుడు తన వాక్యములో మనకు తెలియజేశాడు. 

 

   పాత నిబంధనలో యోవేలు ప్రవక్త ఒక మాట వ్రాశాడు: 

సూర్యచంద్రులకు తేజో హీనత కలుగుచున్నది

నక్షత్రములకు కాంతి తప్పుచున్నది. 

                                         (యోవేలు 2:10) 

 

యోవేలు ప్రవక్త ‘దేవుని దినము’ గురించి వ్రాశాడు. The Day of the Lord. ప్రభువైన యేసు క్రీస్తులో అది నెరవేరింది. అపొస్తలుల కార్యములు 2 అధ్యాయములో పెంతెకోస్తు దినము రోజున పేతురు గారు మాట్లాడుచూ ఈ యోవేలు ప్రవచనమును ప్రస్తావించాడు.(అపో.కార్యములు 2:20)

ప్రభువు ప్రత్యక్షమగు ఆ మహాదినము

రాకమునుపుసూర్యుడు

చీకటిగాను చంద్రుడు రక్తముగాను

మారుదురు.

ప్రభువైన యేసు క్రీస్తులో ఈ ప్రవచనము నెరవేరింది అని పేతురు గారు మనకు తెలియజేశాడు. ‘దేవుని దినము’ అది చాలా తీవ్రమైనది, అది తీర్పు దినము.అది అంత్య దినాల్లో జరగబోయేది. యేసు ప్రభువు కూడా దాని గురించి మనకు తెలియజేశాడు.మత్తయి సువార్త 24:29 లో ఆయన యేమని చెప్పాడంటే, 

ఆ దినముల శ్రమ ముగిసిన

వెంటనే చీకటి సూర్యుని కమ్మును,

చంద్రుడు కాంతిని ఇయ్యడు,

ఆకాశమునుండి నక్షత్రములు రాలును, 

ఆకాశమందలి శక్తులు కదలింప బడును.

     శ్రమల కాలములో చంద్రుడు పని అయిపోతుంది. అది ఇక కాంతిని ఇవ్వలేదు. అది ఎలా జరుగుతుందో ప్రకటన గ్రంథములో వ్రాయబడింది. ప్రకటన గ్రంథము 6:12 లో ఒక మాట చూద్దాము.

ఆయన ఆరవ ముద్రను

విప్పినప్పుడు నేను చూడగా

పెద్ద భూకంపము కలిగెను. 

సూర్యుడు కంబళివలె నలు పాయెను,

చంద్రబింబమంతయు రక్తవర్ణమాయెను

శ్రమల కాలములో 7 ముద్రలు విప్పబడుతాయి. ఆరవ ముద్ర విప్పబడినప్పుడు ఏమి జరిగింది? 

చంద్రబింబమంత రక్తవర్ణమయిపోయింది.

    చంద్రయాన్ – 1, అపొల్లో యాత్రలలో చంద్రుడు సైంటిస్ట్లు స్టడీ చేశారు. చంద్రుడు మీద నుండి

రాళ్లను కూడా తీసుకువచ్చారు. నేను కూడా ఒక రాయిని ముట్టుకొన్నాను. వాటిని అధ్యయనము

చేసిన వారికి అర్ధం అయింది ఏమిటంటే, ఆ రాళ్లు అగ్ని పర్వతాలు ప్రేలుట  వలన ఏర్పడినవి. మనం పేదరాలు పెద్దమ్మ అట్లు వేస్తుందా అని అనుకొనేవాళ్ళము. ఆ రూపాలు పెద్ద పెద్ద గ్రోతులు. చంద్రయాన్-1 పంపిన ఫోటోలు కొన్ని చంద్రుని మీద ఎఱ్ఱని లావా ను చూపించాయి. దానిని బట్టి చంద్రుని మీద అగ్ని పర్వతాలు ప్రేలి లావా బయటికి వచ్చి అది రక్తవర్ణముగా మారుతుంది అని మనకు అర్ధం అవుచున్నది. ఆ సమయములో భూమి మీద పెద్ద భూకంపము కలిగింది. చంద్రుని కక్ష్యలో మార్పు వస్తే దాని పరిణామాలు భూమి మీద తీవ్రముగా ఉంటాయి.

    దేవుడు ఆదికాండము మొదటి అధ్యాయములో మనకు చెప్పాడు. మీకు సమయము చెప్పటానికి నేను మీ ముందు చంద్రుణ్ణి పెట్టాను. ప్రకటన గ్రంథములో మనకు ఏమని చెబుతున్నాడంటే, చంద్రుణ్ణి నేను రక్తవర్ణముగా మార్చినప్పుడు మీ సమయము అయిపోయినట్లు. మీ మానవ జాతి చరిత్ర ముగిసినట్లు. రక్షణ కాలము ముగిసినట్లు.కృపా యుగము ముగిసినట్లు. ఆ తీర్పు దినము రాకముందే మీరు ప్రభువైన యేసు క్రీస్తు యొద్దకు వచ్చి మీ పాపములు ఒప్పుకొని రక్షణ పొందాలన్నదే నా మనవి.

డాక్టర్ పాల్ కట్టుపల్లి

Leave a Reply