సెల్ ఫోన్ లో దేవుని జ్ఞానము

   మనిషి ఈ విశ్వములో ఉన్న సృష్టిని ధ్యానిస్తే దేవుని యొక్క అద్భుతమైన జ్ఞానము ఎటువైపు చూసినా కనిపిస్తుంది. ఉదాహరణకు ఈ ఫోన్ లో ఉన్న GPS వ్యవస్థనే తీసుకోండి. ఆ వ్యవస్థలో మనిషి ఇంత వరకు తెలుసుకున్న సైన్స్ విజ్ఞానము దాగి ఉంది. మన చేతిలో ఉన్న మొబైల్ ఫోన్ అనేక ఉపగ్రహాలతో లింక్ చేయబడి ఉంది. అవి అణు గడియారము లెక్కించే సమయముతో కలుపబడి వుంటాయి. ఒక సెకనులో లక్షవ వంతు సమయము తేడా వచ్చినా, GPS ఒక కిలొమీటరు తప్పుగా చూపిస్తుంది. ఈ అణు గడియారాలు అతి సూక్ష్మమైన పదార్థములను ప్రభావితము చేసే క్వాంటమ్ మెకానిక్స్ మీద ఆధారపడి నడుస్తాయి.

    ఆల్బర్ట్ ఐన్ స్టెయిన్ స్పెషల్ థియరీ ఆఫ్ రెలెటివిటీ, జనరల్ థియరీ ఆఫ్ రెలెటివిటీ అనే రెండు గొప్ప సిద్ధాంతాలు కనిపెట్టాడు. ఉపగ్రహాలు వాటి కక్ష్యలో గంటకు 14000 కిలో మీటర్ల వేగముతో ప్రయాణిస్తాయి. స్పెషల్ థియరీ ఆఫ్ రెలెటివిటీ ప్రకారము భూమి మీద ఉన్న గడియారాలతో పోల్చితే ఈ ఉపగ్రహాల మీద గడియారాలు 7 మైక్రో సెకండ్లు నెమ్మదిగా నడుస్తాయి. కానీ, జనరల్ థియరీ ఆఫ్ రెలెటివిటీ ప్రకారము భూమి మీద ఉన్న గడియారాలతో పోల్చితే ఈ ఉపగ్రహాల మీద గడియారాలు 45 మైక్రో సెకండ్లు వేగముగా నడుస్తాయి, ఎందుకంటే భూమికి దూరముగా ఉండుట వలన వాటి మీద గురుత్వాకర్షణ శక్తి తక్కువగా ఉంటుంది. మొత్తమ్మీద, ఆ 38 మైక్రో సెకండ్లు పరిగణనలోకి తీసుకొనక పొతే, మన GPS వ్యవస్థ 10 కిలోమీటర్లు తప్పుగా చూపిస్తుంది.

   అంటే, GPS వ్యవస్థ సక్రమముగా పనిచేయాలంటే, అతి సూక్ష్మ పదార్ధాల మీద పనిచేసే క్వాంటమ్ మెకానిక్స్, అత్యంత పెద్ద పదార్ధాల మీద పనిచేసే ఐన్ స్టెయిన్ రెలెటివిటీ సిద్ధాంతాలు ఒక చోటికి రావాలి. దేవుడు అతి సూక్ష్మ, అతి పెద్ద భౌతిక వ్యవస్థలలో ఒక గొప్ప క్రమాన్ని తన జ్ఞానము చొప్పున నిర్మించాడు.

Leave a Reply