లేవీయ కాండము 23: దేవుని ఏడు పండుగలలో ఉన్న ప్రవచనాలు, మొదటి భాగము

SukkotFeastoftabernacles.jpg

ఈ రోజు లేవీయ కాండము 23 అధ్యాయము నుండి దేవుని పండుగలు అనే అంశము మనము కొద్ది సేపు ధ్యానము చేద్దాము. లేవీయ కాండము 23 అధ్యాయము నుండి దేవుని పండుగలు అనే అంశము మనము కొద్ది సేపు ధ్యానము చేద్దాము. పాత నిబంధన మనము క్షుణ్ణముగా చదవాలి. పాత నిబంధన అర్ధము అయితేనే మనకు క్రొత్త నిబంధన సుళువుగా అర్ధము అవుతుంది. పాత నిబంధన లో దేవుడు ఒక స్టేజీ నిర్మించాడు. ఒక ప్రజలను ఎన్నుకున్నాడు, వారితో నిత్య నిబంధన చేశాడు.వారికి ఒక రక్షకుని వాగ్దానము చేశాడు. దేవునికి ఒక ప్లాన్ ఉంది. ఆ ప్లాన్ ని అడ్డుకోవటం ఎవరి వల్లాకాదు. హిట్లర్ ఏమన్నాడు? 

‘Once I really as in power, 

my first and foremost task 

will be the annihilation of the Jews’ 

‘నేను ఒక్క సారి అధికారములోకి వస్తే, నేను చేసే మొదటి పని, ముఖ్యమైన పని యూదులను నిర్మూలించడం’ హిట్లర్ సర్వశక్తులు కుమ్మరించి యూదులను నాశనము చేయాలని చూశాడు, విఫలం అయ్యాడు, ఎందుకంటే దేవుడు యూదులతో నిత్యమైన వాగ్దానము చేసాడు. ఇక్కడ లేవీయ కాండము 23 అధ్యాయములో దేవుడు వారికి 7 పండుగలు ఇచ్చాడు. ఇవి దేవుడు పెట్టిన పండుగలు.

    ఇశ్రాయేలీయులకు ఆ పండుగలు ఎంతో ప్రాధాన్యమైనవి, దేవునితో వారికి ఉన్న నిబంధనను అవి వారికి గుర్తు చేసినవి, దేవుని ఎడల భయభక్తులను, కృతజ్ఞతను అవి కలిగించాయి. ప్రవచనాల్లో కూడా ఈ పండుగలకు ఎంతో ప్రాధాన్యత ఉంది. ప్రభువైన యేసు క్రీస్తు కూడా ఈ పండుగలను ఆచరించాడు. ఆయన బాల్యములో తల్లిదండ్రులైన యోసేపు, మరియలతో కలిసి ఈ పండుగల సమయములో యెరూషలేము వెళ్ళాడు. ఆ తరువాత పెద్దవాడైన తరువాత కూడా ఆయన తన శిష్యులతో కలిసి ఈ పండుగలు ఆచరించాడు. ఈ ఏడు పండుగలు ఆయన వైపు చూపిస్తున్నాయి, ఈ ఏడు పండుగలు ఆయనలో నెరవేరినాయి. ఆ పండుగల కంటే ఆయన శ్రేష్టమైన వాడు. దేవుడు శరీర ధారి గా ఇశ్రాయేలీయుల మధ్య నిలబడి ఆ పండుగల యొక్క అసలు సందేశము ఆయనే అని వారికి తెలియజేశాడు.

John 11 

  1. మరియు యూదుల పస్కాపండుగ సమీపమై యుండెను గనుక అనేకులు తమ్మునుతాము 

శుద్ధిచేసికొనుటకై పస్కా రాకమునుపే పల్లె టూళ్లలోనుండి యెరూషలేమునకు వచ్చిరి.

  1. వారు యేసును వెదకుచు దేవాలయములో నిలువబడిమీకేమి తోచుచున్నది? ఆయన పండుగకు రాడా యేమి? అని ఒకనితో ఒకడు చెప్పుకొనిరి.

    యెరూషలేములో దేవాలయములో వారు అడుగుతున్నారు? ఆయన పండుగకు రాడా? ఆయన పండుగకు వచ్చాడు. పండుగ యొక్క సందేశము ఆయనే.  

    ఇశ్రాయేలు దేశములో ఒక సారి ఒక సాయంకాలము నేను గలిలయ సముద్రము ఒడ్డున నడుస్తూ ఉన్నాను. అక్కడ అలలు నా పాదాలు తాకుతూ ఉన్నాయి. గాలి బలముగా వీస్తూ నా ఒంటిని స్పృజిస్తూ ఉంది. పక్షులు చేసే శబ్దాలు నాకు వినిపిస్తూ ఉన్నాయి. అప్పుడు నాకు ఒక ఆలోచన వచ్చింది. ఇది దేవుడు నడిచిన భూమి, నేను నిలబడిన స్థలములో విశ్వ సృష్టికర్త ఐన దేవుడు నిలబడ్డాడు. నాకు లాగే ఒక శరీరముతో ఆ గలిలయ సముద్ర తీరాన ఆయన నడిచాడు. ఒక గొప్ప అనుభూతిని ఆ అనుభవము నాకు మిగిల్చింది. క్రైస్తవ విశ్వాసము అది  ఒక చారిత్రిక సత్యము, క్రైస్తవ నమ్మకము అది ఒక చారిత్రిక వాస్తవము. అది ఒక ఆలోచన మాత్రమే కాదు, అది ఒక అనుభవం మాత్రమే కాదు, అది ఒక నమ్మకం మాత్రమే కాదు, అది దేవుడు చరిత్రలోకి వచ్చి చేసిన గొప్ప కార్యము.ఈ పండుగలు పెట్టింది దేవుడే, ఈ లోకంలోకి వచ్చి ఆ పండుగలు నెరవేర్చింది ఒక్క దేవుడే.

     ఈ లేవీయ కాండము 23 లో 7 పండుగలు మనము చూస్తున్నాము. ఈ పండుగలు మీకు సుళువుగా అర్ధము అగుటకు, రెండు చార్టులు మీకు అందిస్తున్నాము. ఈ చక్కటి చార్టులు మీకు కావాలంటే మా వెబ్ సైట్ www.doctorpaul.org కి వెళ్ళండి. బైబిల్ ప్రవచన చార్టులు అనే పేజీ కి వెళ్లి ఈ చార్టులు డౌన్ లోడ్ చేసుకోండి.మొదటి చార్ట్ లో ఏ పండుగ ఎప్పుడు వస్తుందో చూపించాము, రెండో చార్ట్ లో ఏ పండుగ ఏ విధముగా యేసు క్రీస్తులో నెరవేరిందో చూపించాము. యూదుల క్యాలెండర్ వేరు, మనము గ్రెగోరియన్ క్యాలెండర్ వాడుతున్నాము.మన క్యాలెండరులో నెలలు లోపలి వృత్తములో చూపించాము, యూదుల క్యాలెండర్ లోనెలలు బయటి వృత్తములో చూపించాము.

SevenFeastsonCalendar.jpg

యూదుల క్యాలెండర్ లో 12 నెలలు ఉన్నాయి.

నీసాను ఇయర్ శివన్ తమూజు 

అవ్ ఏలూల్ తిష్రి చేస్వాన్

చిస్లేవ్ తెవెట్ షేవత్ అదర్

    ఈ 7 పండుగలు సంవత్సరము మొత్తము వెదజల్లబడి ఉన్నాయి.

పస్కా పండుగ, నీసాను 14 తేదీ 

పులియని రొట్టెల పండుగ, నీసాను 15 తేదీ 

ప్రథమ ఫలముల పండుగ, నీసాను 16 తేదీ 

పెంతెకోస్తు పండుగ, శివన్, 6 తేదీ 

బూరల పండుగ, రోష్ హసన్న –  తిష్రి, 1,2 తేదీలు

ప్రాయశ్చిత్త దిన పండుగ, యోమ్ కిప్పుర్ – తిష్రి, 10 తేదీ

గుడారాల పండుగ, సుక్కోతు – తిష్రి, 15-22 తేదీలు

    మొదటి 6 నెలల్లో 4 పండుగలు వస్తున్నాయి, తరువాత 6 నెలల్లో 3 పండుగలు వస్తున్నాయి.

మొదటి మూడు పండుగలు నీసాను నెలలో వస్తున్నాయి. చివరి మూడు పండుగలు తిష్రి నెలలో వస్తున్నాయి. మొదటి మూడు పండుగల్లో ప్రభువైన యేసు క్రీస్తు మొదటి రాకడ మనకు కనిపిస్తే, తరువాత మూడు పండుగల్లో ఆయన రెండవ రాకడ మనకు కనిపిస్తుంది. రెండవ చార్టు చూడండి. ఈ చార్ట్ లో ఈ 7 పండుగల్లో క్రీస్తు రూపం ఎలా కనిపిస్తుందో మనము చూస్తున్నాము.

SevenFeastsoftheLordTelugu.jpg

పస్కా పండుగలో క్రీస్తు మరణము, 

పులియని రొట్టెల పండుగలో క్రీస్తు సమాధి, 

ప్రథమ ఫలముల పండుగలో క్రీస్తు పునరుత్తానము, 

పెంతెకోస్తు పండుగలో క్రీస్తు సంఘము, 

బూరల పండుగలో క్రీస్తు రాకడ, 

ప్రాయశ్చిత్త దిన పండుగలో యూదులు క్రీస్తును గుర్తించుట, 

గుడారాల    పండుగలో క్రీస్తు వెయ్యేళ్ళ పాలన మనకు కనిపిస్తున్నాయి.

    మనము ఇప్పుడు 4 – 5 పండుగల మధ్యలో ఉన్నాము. ప్రస్తుత క్రైస్తవ సంఘ కాలము 4-5 పండుగల మధ్యలో ఉంది. మరొక సారి మొదటి చార్ట్ చూడండి. మొదటి మూడు పండుగలు మూడు రోజుల్లో వచ్చినవి.ప్రభువైన యేసు క్రీస్తు మూడు రోజుల్లో జరిగించిన రక్షణ కార్యము అక్కడ మనకు కనిపిస్తున్నది.

1.మొదటి పండుగ పస్కా పండుగ. నిర్గమ కాండము 12 అధ్యాయములో దీని వివరాలు మనకు కనిపిస్తాయి. ఇశ్రాయేలీయులు ఐగుప్తు దేశము విడచివెళ్లేటప్పుడు దేవుడు ఈ పండుగను వారికి నియమించాడు.ఆ పండుగ రోజు వారు నిర్దోషమైన ఒక గొఱ్ఱెపిల్లను తీసుకొని, దానిని చంపి దాని  రక్తమును వారి ఇంటి ద్వారముల మీద రాసుకున్నారు. దేవుడు వారితో ఏమన్నాడంటే, మీరున్న యిండ్లమీద ఆ రక్తము మీకు గురుతుగా ఉండును. నేను ఆ రక్తమును చూచి మిమ్మును నశింప చేయక దాటిపోయెదను. నిర్గమ కాండము 12:13 

    దేవుని తీర్పు, దేవుని ఉగ్రత తప్పించుకోవాలంటే రక్తము క్రిందకు రావాలి. అది వారికి విమోచన. 

1 కొరింథీ పత్రిక 5:7 లో పౌలు గారు వ్రాశాడు: క్రీస్తు అను పస్కా పశువు వధింపబడెను. పస్కా గొఱ్ఱెపిల్ల రక్తము క్రింద ఇశ్రాయేలీయులు విమోచించబడ్డారు. ఈ రోజు మనము ప్రభువైన యేసు క్రీస్తు రక్తము చేత విమోచించ బడ్డాము. ప్రతి సంవత్సరము పస్కా పండుగ చేసు కొనేటప్పుడు ఇశ్రాయేలీయులు ఐగుప్తు చెర నుండి వారు పొందిన విడుదలను గుర్తుచేసుకున్నారు. ఈ రోజు మనము సిలువను చూసినప్పుడు దేవుడు యేసు క్రీస్తు నందు మనకు అనుగ్రహించిన విమోచనను జ్ఞాపకము చేసుకొంటున్నాము. దేవుని రాజ్యములో ప్రవేశించాలంటే ఎవరైనా సరే పస్కా గొఱ్ఱెపిల్ల దగ్గరకు రావాల్సిందే. తీవ్ర వాద సంస్థ ISIS ని స్థాపించిన అల్ బాగ్ధాది గురించి మనము ఈ వారము విన్నాము. అమెరికా సైనికులు అతడు ఉంటున్న గుహ దగ్గరకు వెళ్ళినప్పుడు అల్ బాగ్ధాది బాంబు పేల్చుకుని ఆత్మహత్య చేసుకొన్నాడు. అల్ బాగ్ధాది భూమి మీద దేవుని రాజ్యము తీసుకు వస్తాను అని ప్రగల్భాలు పలికాడు. కొన్ని వేల మంది అమాయకుల ప్రాణాలు తీశాడు. లెక్కలేనంత మహిళ మీద అతని అనుచరులు అత్యాచారాలు చేశారు. వారికి కనిపించిన ప్రతి సిలువను, చర్చ్ లను ధ్వంసము చేశారు. వేలాది మంది క్రైస్తవుల ప్రాణాలు తీశారు. దేవుని రాజ్యము పేరుతో సాతాను పనులు చేశారు. చివరికి అల్ బాగ్ధాది జీవితము ఎలా ముగించాడు? అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ ఏమన్నాడంటే, He died like a dog కుక్కచావు చచ్చాడు. చిన్న పిల్లలను తీసుకొని బాంబు పేల్చుకుని ప్రాణాలు తీసుకొన్నాడు.చివరి దశలో అతని మానసిక స్థితి ఎలా ఉందో మనము గమనించవచ్చు.చిన్న పిల్లల్ని కూడా వదిలిపెట్టకుండా వారి ప్రాణాలు కూడా తీశాడు. చనిపోయేటప్పుడు, నేను ఇప్పుడు పరలోకము వెళ్తున్నాను అని అతను అనుకొని ఉంటాడు.కానీ అతడు వెళ్ళింది నిత్య నరకానికి, అతడు కళ్ళు తెరచింది, పాతాళములో. పరలోకములో కాదు. 

పరలోకము వెళ్లాలంటే మనము ముందు పస్కా గొఱ్ఱెపిల్ల దగ్గరకు రావాలి. దేవుడు మనతో ఏమంటున్నాడంటే, మీరు ఆచరించవలసిన మొదటి పండుగ పస్కా పండుగ, వధింపబడిన గొఱ్ఱె పిల్ల దగ్గరకు రా, ఆయన రక్తము క్రిందకు రా, మారు మనస్సు పొందు, రక్షణ పొందు నీ స్వంత ఆలోచనలను బట్టి కాకుండా నా వాక్యము బట్టి జీవించు అంటున్నాడు.

  1. రెండవ పండుగ పులియని రొట్టెల పండుగ. ఈ పండుగ పస్కా పండుగ తరువాత రోజే మొదలవుతుంది. పులుపు బైబిల్ లోపులుపు అంటే పాపమునకు చిహ్నముగా ఉంది. నా భార్య మొన్న ఒక సారి బ్రెడ్ చేస్తూ ఉంది. ఒక పాత్రలో పిండి వేసింది, నీళ్లు కలిపింది, ఒక స్పూన్ ఈస్ట్ కలిపింది. రెండు నిమిషాల్లో ఆ పిండి పొంగింది. గిన్నె మొత్తం నిండిపోయింది.పాపము కూడా అంతే కదా. అది చాలా తొందరగా మన జీవితాన్ని నింపివేస్తుంది. ఒక పాపపు ఆలోచన కార్య రూపం దాల్చటానికి ఎంతో సమయం పట్టదు. ఈస్ట్ మన కంటికి కనిపించకుండానే మన ఆహారములో, మన శరీరములో ప్రవేశిస్తుంది. పాపము కూడా చాలా సార్లు మన కంటికి కనిపించకుండానే మన జీవితాల్లో ప్రవేశిస్తుంది. పులుపు యొక్క మరొక లక్షణము అది ఆల్కహాల్ ని సృష్టిస్తుంది, మత్తు ను కలిగిస్తుంది. ఆ మత్తులో మన మీద మనకే పట్టు ఉండదు, పాపము కూడా ఒక లాంటి మత్తును కలిగిస్తుంది, పాపపు మత్తులో ఉన్న వారు తమ జీవితము మీద పట్టు కోల్పోతారు. పులుపు కార్బన్ డయాక్సిడ్ వాయువు ను వదులుతుంది, అది ఒక విసర్జిత వాయువు, పాపమును కూడా దేవుడు విసర్జించమంటున్నాడు. పులుపు యొక్క మరొక లక్షణము అది ఎందులో ఉంటే దానిని పాడు చేస్తుంది. అది ఆహారములో ఉంటే ఆహారాన్ని పాడుచేస్తుంది, అది నీళ్ళల్లో ఉంటే నీటిని పాడుచేస్తుంది. పాపము కూడా అంతే.అది ఎక్కడ ఉంటే దానిని పాడుచేస్తుంది. ఆ విధముగా పులుపు పాపమునకు సాదృశ్యముగా ఉంది. ఇది పులియని రొట్టెల పండుగ.పులుపు లేని పండుగ, పరిశుద్ధమైన పండుగ, ఇది ఏడు రోజుల పండుగ.

    ఏడులో పరిపూర్ణత కనిపిస్తున్నది. అంటే ఈ పండుగలో పరిపూర్ణమైన పరిశుద్ధత మనకు కనిపిస్తున్నది. ప్రభువైన యేసుక్రీస్తు పరిపూర్ణమైన పరిశుద్ధుడు, ఆయనలో చిన్న పాపము కూడా లేదు.ఆయనలో పులుపు ఏమాత్రం లేదు. అందుకనే ఆయన శరీరం పాడయిపోలేదు. సిలువ మీద

మరణించిన తరువాత క్రీస్తు శరీరాన్ని వారు క్రిందకు దించి సుగంధ ద్రవ్యాలు రుద్ది సమాధి చేశారు. దావీదు ప్రవక్త 16 కీర్తనలో వ్రాశాడు.

నీ పరిశుద్ధుని కుళ్లుపట్టనియ్యవు

You will not allow your Holy One to see corruption 

    దావీదు చెప్పిన  పరిశుద్ధుడు ఎవరంటే ప్రభువైన యేసు క్రీస్తే. ఆయన సమాధి చేయబడ్డాడు కానీ

కుళ్లుపట్టలేదు.

  1. మూడవ పండుగ ప్రథమ ఫలముల పండుగ. 10 వచనము చూద్దాము: 

నేను మీ కిచ్చు చున్న దేశమునకు మీరు వచ్చి దాని పంటను కోయు నప్పుడు

మీ మొదటి పంటలో ఒక పనను యాజకుని యొద్దకు తేవలెను.

లేవీయ కాండము 23:10 

ఈ పండుగ రోజున ఇశ్రాయేలీయులు తమ మొదటి పంటలో నుండి కొన్ని ఫలములను యాజకుని యొద్దకు తీసుకొనివెళ్ళారు. అందుకనే  దీనిని ప్రథమ ఫలముల పండుగ అని పిలిచారు. ఇందులో మనకు క్రీస్తు పునరుత్తానము కనిపిస్తున్నది. 

1 కొరింథీ 15:23 చూద్దాము. 

ప్రతివాడును తన తన వరుసలోనే బ్రదికింపబడును; 

ప్రథమ ఫలము క్రీస్తు; తరువాత క్రీస్తు వచ్చినపుడు ఆయనవారు బ్రది కింపబడుదురు.

అపొస్తలుడైన పౌలు ఇక్కడ ఏమంటున్నాడంటే, ప్రథమ ఫలము

క్రీస్తు,Christ, the firstfruits 

క్రీస్తు మృతులలో నుండి ముందు లేచాడు.అందుకనే ఆయన ప్రథమ ఫలముగా పిలవబడ్డాడు.

యాకోబు పత్రికలో మనము చదువుతాము

James 1:18; 18. 

ఆయన తాను సృష్టించిన వాటిలో మనము ప్రథమఫలముగా ఉండునట్లు సత్యవాక్యమువలన మనలను తన సంకల్ప ప్రకారము కనెను.

Revelation 14:4 

వీరు దేవుని కొరకును గొఱ్ఱ పిల్లకొరకును ప్రథమఫలముగా ఉండుటకై మనుష్యులలోనుండి కొనబడినవారు.

     క్రొత్త పంట లో మొదటి బియ్యము మన చేతికి వచ్చినప్పుడు రాబోయే పంట ఎలా ఉంటుందో మనకు అవగాహన వస్తుంది, రాబోయే పంట మీద మనకు నమ్మకం కలుగుతుంది. ‘ప్రతివాడును తన తన వరుస లోనే బ్రదికింపబడును’ క్రీస్తు ప్రథమ ఫలముగా మొదట లేచాడు. కాబట్టి ఇప్పుడు విశ్వాసుల పునరుత్తానము ఎలా ఉంటుందో మనకు ఒక అవగాహన వచ్చింది. విశ్వాసుల పునరుత్తానము 

మీద మనకు నమ్మకము కలిగింది. 

1 కొరింథీ 15:3-4 వచనాలు చూద్దాము; 

 

  1. నాకియ్యబడిన ఉపదేశమును మొదట మీకు అప్పగించితిని. 

అదేమనగా, లేఖనముల ప్రకారము క్రీస్తు మన పాపముల

నిమిత్తము మృతిపొందెను, సమాధిచేయబడెను,

  1. లేఖనముల ప్రకారము మూడవదినమున లేపబడెను.

     క్రైస్తవ శుభవార్త లో మూడు ముఖ్యమైన సంఘటనలు ఉన్నాయి. ప్రభువైన యేసు క్రీస్తు మరణము, సమాధి, పునరుత్తానము. ఈ మొదటి మూడు పండుగల్లో అవి ఎంతో చక్కగా మనకు కనిపిస్తున్నాయి. ఈ మూడు పండుగలు మూడు రోజుల్లో వచ్చేవి. యేసు క్రీస్తు మరణము, సమాధి, పునరుత్తానము మూడు రోజులలో జరిగినవి. దేవుడు ఎంత  చక్కగా ఆ పండుగలను అమర్చాడో మీరొక సారి గమనించండి. లేవీయ కాండము 23 అధ్యాయము నుండి దేవుని ఏడు పండుగలలో 

మొదటి మూడు పండుగలు ఈ రోజు మనము చూసాము. 

పస్కా పండుగలో ప్రభువైన యేసు క్రీస్తు మరణము,

పులియని రొట్టెల పండుగలో ఆయన సమాధి, 

ప్రథమ ఫలముల పండుగలో ఆయన పునరుత్తానము మనకు 

కనిపిస్తున్నాయి. సువార్త అంటే అదే. ఈ రోజు మీరు ఆ సువార్తను నమ్మి పాప క్షమాపణ పొంది, రక్షణ 

పొందాలన్నదే నేటి మా ప్రేమ సందేశము.

దేవుని పండుగలు – రెండవ భాగము

Leave a Reply