లేవీయ కాండము 23 అధ్యాయము నుండి దేవుని పండుగలు అనే అంశము మనము కొద్ది సేపు ధ్యానము చేద్దాము. అధ్యాయములో 7 పండుగలు మనకు కనిపిస్తున్నాయి. గత వారం 3 పండుగలు మనము చూశాము. ఈ రోజు మిగిలిన 4 పండుగలు చూద్దాము. ఈ పండుగలు మీకు సుళువుగా అర్ధము అగుటకు, రెండు చార్టులు మీకు అందిస్తున్నాము. ఈ చక్కటి చార్టులు మీకు కావాలంటే మా వెబ్ సైట్ www.doctorpaul.org కి వెళ్ళండి. బైబిల్ ప్రవచన చార్టులు అనే పేజీ కి వెళ్లి ఈ చార్టులు డౌన్ లోడ్ చేసుకోండి.మొదటి చార్ట్ లో ఏ పండుగ ఎప్పుడు వస్తుందో చూపించాము, రెండో చార్ట్ లో ఏ పండుగ ఏ విధముగా యేసు క్రీస్తులో నెరవేరిందో చూపించాము.
యూదుల క్యాలెండర్ వేరు, మనము గ్రెగోరియన్ క్యాలెండర్ వాడుతున్నాము.మన క్యాలెండరులో నెలలు లోపలి వృత్తములో చూపించాము, యూదుల క్యాలెండర్ లోనెలలు బయటి వృత్తములో చూపించాము. ఈ 7 పండుగలు సంవత్సరము మొత్తము వెదజల్లబడి ఉన్నాయి.
పస్కా పండుగ, నీసాను 14 తేదీ
పులియని రొట్టెల పండుగ, నీసాను 15 తేదీ
ప్రథమ ఫలముల పండుగ, నీసాను 16 తేదీ
పెంతెకోస్తు పండుగ, శివన్, 6 తేదీ
బూరల పండుగ, రోష్ హసన్న – తిష్రి 1 తేదీ
ప్రాయశ్చిత్త దిన పండుగ, యోమ్ కిప్పుర్ – తిష్రి, 10 తేదీ
గుడారాల పండుగ, సుక్కోతు – తిష్రి, 15-22 తేదీలు
మొదటి 6 నెలల్లో 4 పండుగలు వస్తున్నాయి, తరువాత 6 నెలల్లో 3 పండుగలు వస్తున్నాయి.మొదటి మూడు పండుగలు నీసాను నెలలో వస్తున్నాయి.చివరి మూడు పండుగలు తిష్రి నెలలో వస్తున్నాయి.మొదటి మూడు పండుగల్లో ప్రభువైన యేసు క్రీస్తు మొదటి రాకడ మనకు కనిపిస్తే, తరువాత మూడు పండుగల్లో ఆయన రెండవ రాకడ మనకు కనిపిస్తుంది. రెండవ చార్టు చూడండి. ఈ చార్ట్ లో ఈ 7 పండుగల్లో క్రీస్తు రూపం ఎలా కనిపిస్తుందో మనము చూస్తున్నాము.
పస్కా పండుగలో క్రీస్తు మరణము,
పులియని రొట్టెల పండుగలో క్రీస్తు సమాధి,
ప్రథమ ఫలముల పండుగ లో క్రీస్తు పునరుత్తానము,
పెంతెకోస్తు పండుగలో క్రీస్తు సంఘము,
బూరల పండుగలో క్రీస్తు రాకడ,
ప్రాయశ్చిత్త దిన పండుగలో యూదులుక్రీస్తును గుర్తించుట,
గుడారాల పండుగలో క్రీస్తు వెయ్యేళ్ళ పాలన మనకు కనిపిస్తున్నాయి.
మనము ఇప్పుడు 4 – 5 పండుగల మధ్యలోఉన్నాము. ప్రస్తుత క్రైస్తవ సంఘ కాలము 4-5 పండుగల మధ్యలో ఉంది.
- పెంతెకోస్తు పండుగ. ఈ పెంతేకొస్తు పండుగ, ప్రథమ ఫలముల పండుగ తరువాత సరిగ్గా 50 రోజులకు వస్తుంది. ప్రభువైన యేసు క్రీస్తు పునరుత్తానము తరువాత సరిగ్గా 50 రోజులకు పెంతెకోస్తు దినము వచ్చింది. పెంట అంటే 50 అని అర్ధము. ఇది 50 రోజుల తరువాత వచ్చిన పండుగ. అపొస్తలుల కార్యములు 2 అధ్యాయములో మీరు చూస్తే ఈ పెంతెకోస్తు దినము రోజున పరిశుద్ధాత్ముడు భూమి మీదకు వచ్చాడు. యూదులు, అన్యులు కలిసి క్రైస్తవ సంఘము ఏర్పడింది. పెంతెకోస్తు దినము రోజున పరిశుద్ధాత్ముడు ఈ భూమి మీదకు వచ్చాడు. పరిశుద్ధాత్ముడు ప్రతి విశ్వాసిలో నివసిస్తున్నాడు.
1 కొరింథీ 6: 19 – 20 19.
మీ దేహము దేవునివలన మీకు
అనుగ్రహింపబడి, మీలోనున్న పరిశుద్ధాత్మకు
ఆలయమై యున్నదని మీరెరుగరా?
మీరు మీ సొత్తు కారు,
- విలువపెట్టి కొనబడినవారు
గనుక మీ దేహముతో దేవుని
మహిమపరచుడి.
దేవుడు తన రక్తము చిందించి మిమ్ములను కొనుక్కున్నాడు. మీ విలువ ఎంత గొప్పది. డార్వినిజం అటువంటి విలువ మనిషికి ఇవ్వలేదు. ‘మనిషి కూడా ఒక జంతువే, అతనికి గొప్ప విలువ లేదు’ అని డార్వినిజం అంటుంది. ఈ మధ్యలో జెండర్ ఫ్లూయిడ్ అని ఒక సంస్కృతి మొదలయ్యింది. కొంతమంది మగవాళ్ళు మేము ఆడవాళ్ళము అని తిరుగుతున్నారు. కొంతమంది ఆడవాళ్లు మేము మగవాళ్ళము అని తిరుగుతున్నారు. దేవుడు ఏమంటున్నాడంటే, నువ్వు నా సొత్తు, నువ్వు పురుషినివో, మహిళవో నిర్ణయించేది నేను, నువ్వు కాదు. పెంతెకోస్తు పండుగలో దేవుడు పరిశుద్ధాత్మను మనకు అనుగ్రహించాడు. పరిశుద్ధాత్ముడు ఒక దైవిక వ్యక్తి. దేవుడు ఒక్కడే, కానీ ఆయనలో ముగ్గురు వ్యక్తులు ఉన్నారు: తండ్రి, కుమారుడు, పరిశుద్ధాత్ముడు.
ప్రభువైన యేసు క్రీస్తు దేవుడే, పరిశుద్ధాత్ముడు కూడా దేవుడే. పరిశుద్ధాత్ముడు ఈ రోజు మనలో
ఉన్నాడు. మన జీవితానికి విలువ ఇచ్చేది ఆయనే, మనలను నడిపించేది ఆయనే.
మత్తయి 28:19 – పరిశుద్ధాత్ముడు మనకు బాప్తిస్మము ఇస్తాడు
మార్కు 13:11 – పరిశుద్ధాత్ముడు మన తరుపున మాట్లాడుతాడు
యోహాను14:16 – పరిశుద్ధాత్ముడు మనకు ఆదరణ ఇస్తాడు
యోహాను14:26 – పరిశుద్ధాత్ముడు యేసు ప్రభువు మాటలు మనకు గుర్తుచేస్తాడు.
అపోస్తలుల కార్యములు 1:8,జెకర్యా 4:6 – పరిశుద్ధాత్ముడు మనకు శక్తిని ఇస్తాడు
అపోస్తలుల కార్యములు 4:31 – పరిశుద్ధాత్ముడు మనకు ధైర్యాన్ని ఇస్తాడు
రోమా 5:5 – పరిశుద్ధాత్ముడు దేవుని ప్రేమను మనకు ఇస్తాడు
రోమా 15:13 – పరిశుద్ధాత్ముడు మనకు నిరీక్షణను ఇస్తాడు.
2 కొరింథీ 3:17 – పరిశుద్ధాత్ముడు మనకు స్వాతంత్రము ఇస్తాడు
2 కొరింథీ 13:14 – పరిశుద్ధాత్ముడు మనకు దేవుని సహవాసాన్ని ఇస్తాడు
యూదా 1:20 – పరిశుద్ధాత్ముడు మనలను ప్రార్ధనలో నడిపిస్తాడు
పరిశుద్ధాత్ముడు దేవుడు మనకు ఇచ్చిన గొప్ప బహుమానము పరిశుద్ధాత్ముడు మీతో ఉన్నప్పుడు, ప్రతిరోజూ మీకు పండుగే. మీరు అనవచ్చు,‘కబుర్లు చెప్పొద్దు, తెల్లారిలెగిస్తే నాకు అనేక సమస్యలు ఉన్నాయి. ఆర్ధిక సమస్యలు, ఆరోగ్య సమస్యలు, కుటుంబ సమస్యలు, ఉద్యోగ సమస్యలు నాకు ఉన్నాయి. నాకు ఎప్పుడు పండుగ వచ్చింది?’
రోమా 15: 13 లో మనము చదువుతాము:
కాగా మీరు పరిశుద్ధాత్మశక్తి పొంది, విస్తారముగా నిరీక్షణ గలవారగుటకు
నిరీక్షణకర్తయగు దేవుడు విశ్వా సము ద్వారా సమస్తానందముతోను
సమాధానముతోను మిమ్మును నింపును. పరిశుద్దాత్మ సహవాసములో మనము ఉన్నప్పుడు దేవుడు విస్తారముగా నిరీక్షణ మనకు అనుగ్రహిస్తాడు. సమస్త ఆనందముతో, సమాధానముతో మనలను నింపుతాడు. పెంతెకోస్తు పండుగ ఆదివారము వచ్చింది. ఆదివారము ప్రతి క్రైస్తవ విశ్వాసికి ముఖ్యమైనది, ప్రభువైన యేసు క్రీస్తు మరణము నుండి తిరిగి లేచింది ఆదివారమే. పరిశుద్ధాత్ముడు ఈ భూలోకమునకు వచ్చింది ఆదివారమే. క్రైస్తవ సంఘము ప్రారంభము అయ్యింది ఆదివారమే.
- పిండిగల రెండు రొట్టెలను అల్లా డించు అర్పణముగా తేవలెను.
రెండు రొట్టెలు యూదులకు, అన్యులకు చిహ్నముగా ఉన్నాయి.
ఇది ఒక్క రోజు పండుగ.ఈ రోజున అందరూ పనులు మానుకొని దేవుని స్తుతించాలి.మనము కూడా ఆదివారము రోజు పనులు మానుకొని దేవుని సన్నిధికి వెళ్లి ఆయనను ఆరాధించాలి.ఆ తరువాత 3 పండుగలు తిష్రి నెలలో వస్తున్నాయి.ఈ చార్ట్ చూడండి. బూరల పండుగ, ప్రాయశ్చిత్త దిన పండుగ, గుడారాల పండుగ తిష్రి నెలలో వస్తున్నాయి. మన క్యాలెండర్ లో ఈ తిష్రి నెల సెప్టెంబర్, అక్టోబర్ నెలల కాలములో వస్తున్నది. తిష్రి నెల యూదుల క్యాలెండర్ లో ఏడవ నెల.ఏడు అంటే పరిపూర్ణత.
దేవుని ప్రణాళిక పరిపూర్ణమైనది, మొదటి మూడు పండుగలు కలిసి వచ్చినవి, చివరి మూడు పండుగలు కూడా కలిసి వస్తున్నవి. మొదటి మూడు పండుగల్లో ప్రభువైన యేసు క్రీస్తు మొదటి రాకడ మనకు కనిపిస్తే, తరువాత మూడు పండుగల్లో ఆయన రెండవ రాకడ మనకు కనిపిస్తున్నది.
- ఐదో పండుగ బూరల పండుగ.
Feast of the Trumpets
ఇది మన ముందు వున్న పండుగ.నీకు ముందు ఉంది మొసళ్ల పండుగ అంటారు.మనకు ముందుది మొసళ్ల పండుగ కాదు, మనకు ముందుంది బూరల పండుగ బూర యూదులకు చాలా ఆధ్యాత్మిక వస్తువు. హెబ్రీ భాషలో షోఫార్ అని దీనిని పిలుస్తారు. బైబిల్ లో అనేక చోట్ల ఈ పదము మనకు కనిపిస్తుంది. (Exodus 19:16; Lev 25:9; 2 Sam 6:15; 1 Chr 15:28; Job39:24-25; Ps 47:5; Psalm 81:3; 98:6; 150:3; Isaiah 18:3; Jeremiah 4:5; 4:19; 4:21; 6:1; 6:17; 42:14; 51:27 etc)
ఒక ప్రకటన చేసే టప్పుడు ఈ షోఫార్ ఊదుతారు. పండుగ సమయాల్లో, ఉత్సవ సమయాల్లో దీనిని ఊదుతారు.దేవుని మాటకు ఈ షోఫార్ సంకేతముగా మారింది. దీనిని ఊది క్రొత్త సంవత్సరాన్ని ప్రకటిస్తారు. షోఫార్ ఊదినప్పుడు అందరూ నిద్ర లేస్తారు. మనమంతా దేవుని ఎదుట
నిలబడ్డాము అనే సత్యాన్ని షోఫార్ ప్రజలకు గుర్తు చేస్తుంది. ఈ రోజుకూ యూదులు ఈ షోఫార్ ని తమ కూడికలో వాడుచున్నారు. యూదులు తమ చరిత్రలో చాలా విషాదకరమైన సమయాల్లో
కూడా ఈ షోఫార్ బూర వారికి నిరీక్షణ ఇచ్చింది. ఇశ్రాయేలు దేశములో యాడ్ వాషెమ్ మూసేయంలో
నేను కొన్ని షోఫార్ బూరలు చూశాను. హిట్లర్ యూదులను ఎంతగా హింసించాడో మనకు తెలిసిందే. లక్షల మంది యూదులను హిట్లర్ కాన్సంట్రేషన్ క్యాంపులలో పెట్టి హింసించాడు. చాలా మంది యూదులు ఈ బూరలను క్యాంపులలోకి తమతో తీసుకొని వెళ్లారు. ఆ బూరలు ఊదుతూ దేవుని వాగ్దానములను వారు జ్ఞాపకము చేసుకొన్నారు.
https://www.nytimes.com/2019/09/21/arts/auschwitz-shofar.html?searchResultPosition=5
యూదులు తమ ఇళ్లల్లో ఈ షోఫార్ బూరను ఇప్పటికీ ఊదుతున్నారు. ఫేస్ బుక్ స్థాపకుడు మార్క్ జుకర్ బర్గ్ ఈ పండుగ రోజున తన షోఫార్ బూరను ఊదాడు. రోష్ హసన్న పండుగకు 30 రోజుల ముందు నుండి ప్రతి రోజూ వారు ఈ బూరను ఊదుతారు. పండుగ రోజున 100 సార్లు ఊదుతారు.
-ఈ బూరల పండుగలో ప్రభువైన యేసుక్రీస్తు మనకు ఎంతో స్పష్టముగా కనిపిస్తున్నాడు.ఈ షోఫార్ బూర పొట్టేలు కొమ్ములో నుండి చేయబడింది. అబ్రహాము తన కుమారుడైన ఇస్సాకును మోరియా పర్వతము మీద వధించుటకు తన కత్తిని ఎత్తినప్పుడు దేవుడు ఆయనను ఆపాడు. అబ్రహాముకు కు ఒక పొట్టేలును చూపించాడు. ఇస్సాకుకు బదులుగా ఆ పొట్టేలు వధించబడింది.మనకు బదులుగా
ప్రభువైన యేసు క్రీస్తు వధించబడ్డాడు. ప్రవచనాల్లో ఈ బూరల పండుగకు ఎంతో ప్రాముఖ్యత ఉంది. రెండు ముఖ్యమైన సంఘటనలను ఈ బూరల పండుగ సూచిస్తున్నది.
మొదటిది క్రైస్తవ సంఘము ఎత్తబడుట.
రెండవది యూదులు యెరూషలేముకు చేర్చబడుట.
అపోస్తలుడైన పౌలు రెండు చక్కటి వాక్యములు వ్రాశాడు. మొదటిది 1 థెస్సలొనీక 4:16;
ఆర్భాటముతోను, ప్రధానదూతశబ్దముతోను,
దేవుని బూరతోను పరలోకమునుండి
ప్రభువు దిగివచ్చును; క్రీస్తునందుండి
మృతులైన వారు మొదట లేతురు.
- ఆ మీదట సజీవులమై నిలిచియుండు
మనము వారితోకూడ ఏకముగా ప్రభువును
ఎదుర్కొనుటకు ఆకాశమండలమునకు
మేఘములమీద కొనిపోబడుదుము.
కాగా మనము సదాకాలము ప్రభువుతో కూడ ఉందుము.
- కాబట్టి మీరు ఈ మాటలచేత ఒకనినొకడు ఆదరించుకొనుడి.
రెండవది 1 కొరింథీ 15:52
1 Th 4:16; I Cor 15:52; Mathew 24:31; Isaiah 27:13;
- ఇదిగో మీకు ఒక మర్మము తెలుపుచున్నాను;
మన మందరము నిద్రించము గాని
నిమిషములో, ఒక రెప్ప పాటున,
కడబూర మ్రోగగానే మనమందరము
మార్పు పొందుదుము.52. బూర మ్రోగును;
అప్పుడు మృతులు అక్షయులుగా
లేపబడుదురు, మనము మార్పు పొందుదుము.
బూర మ్రోగింది, అది దేవుని బూర అది దేవుని షోఫార్; అది మ్రోగినప్పుడు క్రీస్తు నందుండి నిద్రించిన విశ్వాసులందరూ సమాధులలో నుండి తిరిగి లేస్తారు. జీవించి ఉన్న విశ్వాసులతో కలిసి
ప్రభువైన యేసు క్రీస్తును వారు కలుస్తారు. రెండో సంఘటన యూదులను దేవుడు ఇశ్రాయేలు దేశమునకు సమకూరుస్తాడు. (యెషయా 27:13; మత్తయి24: 31) చదివితే ఆ సత్యము మనకు అర్ధము అవుతుంది.
షాఫార్ and the most fervent expression of Jewish hope — “next year in Jerusalem.”
- ఆరో పండుగ ప్రాయశ్చిత్త దిన పండుగ.
లేవీయ కాండము 16 అధ్యాయము ధ్యానించినప్పుడు మనము ఈ పండుగ గురించి తెలుసుకున్నాము. దీనిని యోమ్ కిప్పుర్ అని పిలుస్తారు.యూదులు తమ పాపములను బట్టి దుఃఖించే రోజు అది.
వారు దేవుని ధర్మశాస్త్రాన్ని ఉల్లంఘించారు,
విశ్రాంతి దినాన్ని అతిక్రమించారు,
అబద్ధ బోధకులను ప్రోత్సహించారు
దేవుని ప్రవక్తలను హింసించారు
అన్య దేవతలను పూజించారు
దేవుని ఆలయాన్ని అపవిత్రం చేశారు,
దేవుని కుమారుడైన యేసు క్రీస్తును
హత్య చేయించారు. ఆ పాపాలన్నిటిని బట్టి వారు దుఃఖించే రోజు అది.
జెకర్యా 12:10 లో దీని గురించి వ్రాయబడింది.
వారు తాము పొడిచిన నా మీద దృష్టియుంచి, దుఃఖించుచు ప్రలాపింతురు.
యూదులు తాము పొడిచిన యేసు క్రీస్తు ను చూసి, దుఃఖించి మారుమనస్సు పొందటం ఈ పండుగలో మనము చూస్తున్నాము.
- చివరిగా 7 పండుగ గుడారముల పండుగ.
దీనిని పర్ణశాలల పండుగ అని కూడా పిలుస్తారు.
ఈ పండుగలో ఇశ్రాయేలీయులు చెట్ల కొమ్మలతో, మట్లతో గుడారాలు కట్టుకొంటారు. వారి యొక్క అరణ్య యాత్రను ఈ పండుగ వారికి గుర్తుచేస్తుంది. ఇశ్రాయేలీయులు అరణ్యములో ఈ పండుగ చేసుకొన్నారు. 40 సంవత్సరాలు అరణ్యములోవారి యాత్ర సాగింది. గుడారములలో యాత్రికుల వలె వారు జీవిస్తున్నారు. అరణ్యములో ఉన్నంత కాలము వారు ఈ పండుగ చేసుకొన్నారు. వాగ్దాన దేశములోకి వెళ్లిన తరువాత వారు ఈ పండుగ చేసుకోవటము మానివేశారు.
- యెహోవా మోషేకు దయచేసిన గ్రంథములో చూడగా, ఏడవ మాసపు ఉత్సవకాలమందు ఇశ్రాయేలీ యులు పర్ణశాలలో నివాసము చేయవలెనని వ్రాయబడి యుండుటకను గొనెను.15. మరియు వారు తమ పట్టణము లన్నిటిలోను యెరూషలేములోను ప్రకటనచేసి తెలియజేయవలసినదేమనగామీరు పర్వతమునకు పోయి ఒలీవ చెట్ల కొమ్మలను అడవి ఒలీవచెట్ల కొమ్మలను గొంజిచెట్ల కొమ్మలను ఈతచెట్ల కొమ్మలను గుబురుగల వేరువేరు చెట్ల కొమ్మలను తెచ్చి, వ్రాయబడినట్లుగా పర్ణశాలలు కట్టవలెను.16. ఆ ప్రకారమే జనులుపోయి కొమ్మలను తెచ్చి జనులందరు తమ తమ యిండ్ల మీదను తమ లోగిళ్లలోను దేవమందిరపు ఆవరణములోను నీటి గుమ్మపు వీధిలోను ఎఫ్రాయిము గుమ్మపు వీధిలోను పర్ణశాలలు కట్టుకొనిరి.17. మరియు చెరలోనుండి తిరిగి వచ్చినవారి సమూహమును పర్ణశాలలు కట్టుకొని వాటిలో కూర్చుండిరి. నూను కుమారుడైన యెహోషువ దినములు మొదలుకొని అది వరకు ఇశ్రాయేలీయులు ఆలాగున చేసియుండలేదు; అప్పుడు వారికి బహు సంతోషము పుట్టెను. (నెహెమ్యా 8)
మంచి ఇల్లు కట్టుకొన్న తరువాత ‘ఈ గుడారాల గొడవ’ మనకు ఎందుకులే అని అనుకొన్నారు.ఈ రోజు మనము కూడా అదే తప్పుచేస్తాము ఒక మంచి ఇల్లు కట్టుకొన్న తరువాత ఒక స్థిర నివాసము కలిగి నప్పుడు మనము యాత్రికులము అనే సత్యము మరచిపోతాము. ఈ గుడారముల పండుగలో విశ్వాసి ఈ లోకములో యాత్రికుడు అనే సత్యము కనిపిస్తున్నది. ప్రభువైన యేసు క్రీస్తు వెయ్యేళ్ళ పాలన కూడా ఇందులో మనకు కనిపిస్తుంది. మత్తయి సువార్త 17 లో మనము చూస్తే, ప్రభువైన యేసు కీస్తు ముగ్గురు శిష్యులను తీసుకొని ఒక కొండ మీదకు వెళ్ళాడు. అక్కడ ఆయన వారి ముందు ఆయన రూపము మారింది. ఆయన దైవిక మహిమను, తేజస్సును వారు కొన్ని నిమిషాలు చూశారు.ఆయన
మోషే, ఏలీయాలతో మాట్లాడడం వారు చూశారు. పేతురు ఏమన్నాడంటే, ‘ప్రభువా, మేము నీకొకటి, మోషేకు ఒకటి, ఏలియాకి ఒకటి చొప్పున మూడు పర్ణశాలలు నిర్మిస్తాము’. పరలోకములో నుండి దేవుడు ఏమన్నాడంటే, ఇదిగో ఈయన నా ప్రియకుమారుడు, ఈయనయందు నేనానందించు చున్నాను, ఈయన మాట వినుడి’ ఆయన మోషే కంటే శ్రేష్ఠుడు, ఏలీయా కంటే శ్రేష్ఠుడు.మానవుల మధ్య జీవించుటకు వచ్చిన దేవుడు.రెండవ సారి వచ్చినప్పుడు ఆయన వెయ్యేళ్ళ పాటు మానవుల మధ్య తన గుడారము వేసుకొంటాడు.
జెకర్యా 14:16 లో మనము చూస్తే అక్కడ యూదులు యెరూషలేములో జరుపుకొనే పర్ణశాలల పండుగ మనకు కనిపిస్తుంది. యెహెఙ్కేలు 48:35 లో చూస్తే, యెహోవా యుండు స్థలమని యెరూషలేము పిలువబడుతుంది. ఈ గుడారముల పండుగలో ఆ ప్రవచనాలు నెరవేరుతాయి. ఈ రోజు దేవుని 7 పండుగలు అనే అంశము మనము చూశాము. మొదటి 4 పండుగలు పూర్తి అయినవి. మిగిలిన మూడు పండుగలు భవిష్యత్తులో నెరవేరబోవుతున్నాయి.ఈ పండుగలు నిర్వహిస్తున్నది దేవుడే కాబట్టి అవి తప్పకుండా జరుగుతాయి. రక్షకుడైన యేసు క్రీస్తునందు విశ్వాసముంచి, పాపక్షమాపణ పొంది, మీరు రక్షణ పొందాలన్నదే నేటి మా ప్రేమ సందేశము.
Thankyou I received good information about Jews.