బిలాము ప్రవచనాలు 

BaalamBalak.jpeg

దేవుడు యూదులను వదిలి వేశాడా? ఈ రోజు చాలా మంది క్రైస్తవులు ఏమనుకొంటారంటే, దేవుడు యూదులను వదలివేశాడు. వారి స్థానములో క్రైస్తవ సంఘాన్ని దేవుడు తన ప్రజలను చేసుకొన్నాడు అని నమ్ముతున్నారు. ఆ వాదనలో ఎంత వరకు సత్యము ఉన్నది అన్న విషయము ఈ రోజు చూద్దాము. 

సంఖ్యా కాండము 23,24 అధ్యాయాల్లో కొన్ని విషయాలు మనము చూద్దాము. ముందు ఈ వాక్య భాగము యొక్క చారిత్రిక నేపధ్యము చూద్దాము. దేవుడు ఇశ్రాయేలీయులను ఐగుప్తు దేశము నుండి విడిపించి కనాను దేశము వైపుకు తీసుకొని వెళ్లుచున్నాడు. 40 సంవత్సరములు అరణ్య యాత్ర ముగించుకొని యొర్దాను నది తీరానికి వచ్చారు. ఇశ్రాయేలీయులను చూసినప్పుడు అక్కడ ఉన్న మోయాబీయులకు అసూయ కలిగింది, భయము వేసింది. మోయాబీయులు ఇశ్రాయేలీయులకు బంధువులు. వారు అబ్రహాము బంధువు లోతు నుండి వచ్చిన వారు. దేవుడు ఇశ్రాయేలీయులతో ఏమన్నాడంటే, ‘మోయాబీయులు మీ బంధువులు కాబట్టి, వారితో యుద్ధము చేయవద్దు. మీ దారిన మీరు ప్రశాంతముగా కనాను దేశానికి వెళ్ళండి’. 

      ఇశ్రాయేలీయులు దేవుని మాట చొప్పున మోయాబీయులతో యుద్ధము చేయకుండా ముందుకు వెళ్లుచున్నారు. మోయాబీయుల రాజు బాలాకు. ఇశ్రాయేలీయులను చూసి బాలాకు అసూయ పడ్డాడు. అసూయ మన హృదయాల్లో పెరిగితే మనము తప్పుడు పనులు చేస్తాము. బాలాకు ఇశ్రాయేలీయులను చూసినప్పుడు, ‘మన బంధువులే కదా, పోనీ’ అని ఓర్చుకోలేకపోయాడు. ఇశ్రాయేలీయుల పట్ల అతని హృదయము అసూయతో రగిలిపోయింది.వెంటనే బిలాము అనే సోదె చెప్పే వాడి దగ్గరకు వెళ్ళాడు.’నీకు చాలా డబ్బులు ఇస్తాను, నువ్వు నీ చీకటి శక్తులు ఉపయోగించి ఇశ్రాయేలీయులను శపించు’ అన్నాడు.బిలాము వెళ్లి దేవుని అడిగాడు: బాలాకు మాట విని ఇశ్రాయేలీయులను శపించుటకు వెళ్లవచ్చా?’ అని ప్రశ్నించాడు. దేవుడు ఏమన్నాడంటే, ‘ఆ ఇశ్రాయేలీయులు నా ప్రజలు, వాళ్ళ జోలికి వెళ్ళవద్దు’.

     అయితే, బిలాము ‘దేవుని మాట వింటే నేను డబ్బులు సంపాదించుకోలేను’ అనుకొని బాలాకుతో కలిసి వెళ్ళాడు. తప్పు అని తెలిసినా డబ్బుకు కక్కుర్తి పడి వెళ్ళాడు. బిలాము ఇశ్రాయేలీయులను శపించుదామని నోరు తెరచాడు. ఆ సమయములో బిలాము నోటి ద్వారా దేవుడు తన ప్రజలను ఆశీర్వదించాడు.బిలాము ఇశ్రాయేలీయులను ఆశీర్వదించడం చూసి బాలాకు ఒళ్ళుమండింది. ‘నేను ఎంతో డబ్బు ఖర్చు పెట్టి వాళ్ళను శపించమని నిన్ను తీసుకువస్తే, ఆశీర్వదిస్తావేంటయ్యా’ అని బిలాము మీద కేకలు వేశాడు. బిలాము ఏమన్నాడంటే, ‘ఎలా శపించగలను? దేవుడు వారిని శపించలేదు.ఎలా భయపెట్టగలను? దేవుడు వారిని భయపెట్టలేదు. దేవుడు ఆశీర్వదించిన ప్రజలను మనము శపించలేము’. 

     మానవ చరిత్రలో బాలాకు వలె యూదులను శపించవలెనని, వారిని కనుమరుగు చెయ్యాలని చాలా మంది ప్రయత్నించారు, వాళ్లంతా భంగపడ్డారు. కారణము ఏమిటంటే, బిలాము మాటల్లోనే మనము చూద్దాము. బిలాము నాలుగు సార్లు ప్రవచించాడు.అయితే, నాలుగు సార్లు ఇశ్రాయేలీయులను నాలుగు రకాలుగా ఆశీర్వదించాడు. 

1.విభిన్నమయిన జనం 

సంఖ్యాకాండము 23

 1. అప్పుడు బిలాము ఉపమాన రీతిగా ఇట్లనెను 
 2. ఏమని శపింపగలను? దేవుడు శపింపలేదే. ఏమని భయపెట్టగలను?

దేవుడు భయపెట్టలేదే. 

 1. మెట్టల శిఖరమునుండి అతని చూచుచున్నాను

కొండలనుండి అతని కనుగొనుచున్నాను 

ఇదిగో ఆ జనము ఒంటిగా నివసించును

జనములలో లెక్కింపబడరు.

 1. యాకోబు రేణువులను ఎవరు లెక్కించెదరు?

ఇశ్రాయేలు నాల్గవపాలును ఎవరు 

లెక్కపెట్టగలరు? 

నీతిమంతుల మరణమువంటి మరణము నాకు లభించును గాక.

నా అంత్యదశ వారి అంతమువంటి దగును గాక అనెను.

బిలాము ఏమన్నాడంటే, ‘ఇదిగో ఆ జనము ఒంటిగా నివసించును. జనములలో లెక్కింపబడరు. ఇశ్రాయేలీయులు ప్రత్యేకమైన జనము, విభిన్నమైన జనము. దేవుడు వారిని ప్రత్యేకముగా ఉండమన్నాడు. నువ్వు ప్రత్యేకముగా ఉంటే తప్ప, నీ వల్ల ఈ ప్రపంచానికి ఏ ప్రయోజనము ఉండదు. ,మహానుభావుడు క్యాంప్ బెల్ మోర్గాన్ ఒక సారి అన్నాడు: 

 “The church did the most for the world when the church was least like the world” 

ప్రపంచములాగా ఉండాలి అనుకోబాకు, ప్రపంచానికి నువ్వు యెంత విభిన్నముగా

ఉంటే నీ వాళ్ళ ప్రపంచానికి అంత ప్రయోజనం. 

‘మీరు ప్రపంచమునకు విభిన్నముగా ఉండాలి, మీ ద్వారా నేను ప్రపంచాన్ని ఆశీర్వదించాలి’. యాకోబు సంతానాన్ని మనము లెక్కించలేము. వారిని దేవుడు విస్తారముగా ఆశీర్వదించాడు.

తరువాత, బిలాము తనను తాను ఆశీర్వదించుకొన్నాడు: నీతిమంతుల మరణమువంటి మరణము నాకు లభించును గాక. నీతిమంతులు ఎలా మరణిస్తారు? 

అబ్రహాము నిరీక్షణతో మరణించాడు.

శారా నిరీక్షణతో మరణించాడు.

ఇస్సాకు, యాకోబు, యోసేపు నిరీక్షణతో మరణించారు.

నీతి మంతుల మరణము మనకు రావాలంటే మనము యేసు క్రీస్తు సిలువ క్రిందకు రావాలి, మన పాపములు యేసు క్రీస్తు రక్తము చేత కడుగబడాలి. అప్పుడే పరలోకానికి మనము వెళ్లగలము.

 

హెబ్రీయులకు 11:10

ఏలయనగా దేవుడు దేనికి శిల్పియు నిర్మాణకుడునై యున్నాడో, 

పునాదులుగల ఆ పట్టణముకొరకు అబ్రాహాము ఎదురు చూచుచుండెను.

అబ్రహాము విశ్వాసముతో దేవుని పట్టణము కోసము ఎదురుచూశాడు.

నాకు కూడా అలాంటి మరణము కావాలి అని బిలాము ఆశపడ్డాడు. అయితే, బిలాము రెండు పడవల మీద కాళ్ళు వేశాడు. ఒక వైపు ఇశ్రాయేలీయులను శపిస్తాను, డబ్బు సంపాదిస్తాను. మరొక వైపు, నాకు నీతిమంతుని మరణము కూడా కావాలి అన్నాడు.  ఆ రెండూ పొందలేవు. ఇశ్రాయేలీయులను శపించి, దేవుని ఆశీర్వాదాన్ని ఎవరూ పొందలేరు. ఆదికాండము 12 అధ్యాయములో దేవుడు అబ్రహాముకు వాగ్దానము చేశాడు.నేను నీతో, నీ సంతానముతో శాశ్వతమైన, నిరంతరమైన నిబంధన చేస్తున్నాను. ఆ నిబంధన మార్చడము ఎవరి వల్లా కాదు. ఆ విధముగా బిలాము మొదటి ప్రవచనములో ఇశ్రాయేలీయులు ఒక విభిన్నమైన జనముగా మనకు కనిపిస్తున్నారు.

 1. విడువబడని జనము: ఇశ్రాయేలీయులు మొదటిగా విభిన్నమైన జనము, రెండవదిగా విడువబడని జనము. బాలాకు బిలామును ఇంకొక కొండ మీదకు తీసుకొనివెళ్ళాడు. ‘బిలాము, ఇక్కడనుండి ప్రయత్నించు, ఈసారైనా వారిని శపించు’ అన్నాడు. బిలాము అప్పుడు నోరు తెరచి రెండో ప్రవచనము చేశాడు.18 వచనము నుండి చూద్దాము.
 2. బిలాము ఉపమాన రీతిగా నిట్లనెను
 3. దేవుడు అబద్ధమాడుటకు ఆయన మానవుడు కాడు 

పశ్చాత్తాపపడుటకు ఆయన నరపుత్రుడు కాడు 

ఆయన చెప్పి చేయకుండునా?

ఆయన మాట యిచ్చి స్థాపింపకుండునా? 

 1. ఇదిగో దీవించుమని నాకు సెలవాయెను ఆయన

 దీవించెను; నేను దాని మార్చలేను.

 1. ఆయన యాకోబులో ఏ దోషమును కనుగొనలేదు 

ఇశ్రాయేలులో ఏ వంకరతనమును చూడలేదు 

అతని దేవుడైన యెహోవా అతనికి తోడైయున్నాడు.

బాలాకూ, అబద్ధమాడుటకు దేవుడు మానవుడు కాదు. పశ్చాత్తాపపడుటకు దేవుడు నరపుత్రుడు కాదు. ఆయన ఇంతకు ముందే అనేక సార్లు మాట ఇచ్చిన దేవుడు. ఆయన నమ్మదగిన దేవుడు. అబ్రహాముకు వాగ్దానము చేసిన దేవుడు. నువ్వు, నేను ఎంత ప్రయత్నించినా దేవుడు వారిని వదిలిపెట్టడు.

3.విజయం పొందే జనం

మూడవదిగా, వారు విజయము పొందే జనము. బిలాము మూడో సారి ప్రయత్నించాడు. సంఖ్యా కాండము 24 అధ్యాయము చూద్దాము.

 1. యాకోబూ, నీ గుడారములు 

ఇశ్రాయేలూ, నీ నివాసస్థలములు ఎంతో రమ్యమైనవి.

 1. దేవుడు ఐగుప్తులోనుండి అతని రప్పించెను 

గురుపోతు వేగమువంటి వేగము అతనికి కలదు 

అతడు తన శత్రువులైన జనులను భక్షించును 

వారి యెముకలను విరుచును

తన బాణములతో వారిని గుచ్చును.

 1. సింహమువలెను ఆడు సింహమువలెను అతడు క్రుంగి పండుకొనెను 

అతనిని లేపువాడెవడు? 

నిన్ను దీవించువాడు దీవింపబడును

నిన్ను శపించువాడు శపింపబడును.

బిలాము ఇశ్రాయేలీయుల విజయముల గురించి ఇక్కడ వ్రాశాడు. ఐగుప్తు దేశములో గొప్ప విజయాలు వారికి అనుగ్రహించి దేవుడు వారిని విడిపించాడు. అరణ్యములో వారికి విజయాలు ఇచ్చాడు. కనాను దేశములో వారికి విజయాలు ఇచ్చాడు. 9 వచనములో వారిని సింహముతో పోల్చాడు. ఈ సింహము ఎవరంటే ప్రభువైన యేసు క్రీస్తే. ఆయన యూదా రాజ సింహం. భవిష్యత్తులో వెయ్యేళ్ళ పాలనలో ఆయన ఇశ్రాయేలీయులకు పూర్తి విజయాన్ని అనుగ్రహిస్తాడు.

4.విమోచించబడే జనం 

చివరిగా వీరు విమోచించబడే జనము. బిలాము నాలుగో సారి ప్రవచించాడు. ఆ ప్రవచనములో ఏమన్నాడంటే, 

సంఖ్యా కాండము 24:17 

నక్షత్రము యాకోబులో ఉదయించును

రాజదండము ఇశ్రాయేలులోనుండి లేచును 

Numbers 24:17

There shall come a

Star out of Jacob,

and a Scepter shall

rise out of Israel

యాకోబులో ఉదయించే ఈ నక్షత్రము ఎవరంటే ప్రభువైన యేసు క్రీస్తే. బెత్లెహేములో ఆయన జన్మించినప్పుడు ఒక నక్షత్రము అక్కడ ఉదయించింది. ఈ లోకానికి వెలుగుగా యేసు క్రీస్తు జన్మించాడు. కన్యక మరియతో దేవదూత ఏమన్నాడంటే, 

తన ప్రజలను వారి పాపముల

నుండి ఆయనే రక్షించును

గనుక ఆయనకు యేసు

అను పేరు పెట్టుదువనెను.

ఇశ్రాయేలీయులు విమోచించబడే జనము, ఎందుకంటే యేసు క్రీస్తు వారికి విమోచకుడుగా వచ్చాడు.ఈ రోజున ఇశ్రాయేలు దేశములో విమోచించబడిన వారు, రక్షణ పొందిన వారు చాలా తక్కువ. అయితే ఆ పరిస్థితి మారుతుంది.దేవుడు ఆ విషయాన్ని తన వాక్యంలో తెలియజేశాడు. యెహెఙ్కేలు గ్రంథములో మనము చదువుతాము.

యెహేజ్కేలు 36:26 

నూతన హృదయము మీ కిచ్చెదను, 

నూతన స్వభావము మీకు కలుగజేసెదను,

రాతిగుండె మీలోనుండి తీసివేసి మాంసపు గుండెను మీకిచ్చెదను.

దేవుడు యూదుల కన్నులు తెరచి, వారికి నూతన హృదయము, నూతన స్వభావము అనుగ్రహిస్తాడు. దేవుడు యెహెఙ్కేలు ప్రవక్తకు ఎండిన ఎముకలతో నిండిపోయిన ఒక లోయను చూపించాడు. అక్కడ జీవము లేదు, నిరీక్షణ లేదు. ‘ఎండిన యెముకలారా లెండి’ అని దేవుడు పిలిచినప్పుడు, ఆ నిర్జీవమైన ఎముకలన్నీ జీవముతో పైకి లేచినవి. ఇది ఇశ్రాయేలీయులకు సాదృశ్యముగా ఉంది.

NebuchadnezzarTelugu.jpg

    యూదులు ప్రపంచమంతా చెదరిపోయారు. క్రీ.పూ 722 లో అశూరీయులు ఉత్తర దేశాన్ని నాశనము చేశారు. క్రీ.పూ 586 లో బబులోనీయులు దక్షిణ దేశాన్ని తగులబెట్టి, యూదులను చెరలోనికి తీసుకొనివెళ్ళారు. క్రీ.శ 70 లో రోమన్లు యెరూషలేమును తగులబెట్టి దాదాపు 10 లక్షల మంది యూదులను సంహరించారు. రెండో ప్రపంచ యుద్ధ కాలములో హిట్లర్ 60 లక్షల మంది యూదులను సంహరించాడు.యెహెఙ్కేలుకు దేవుడు చూపించిన ఆ ఎముకల లోయ వలె యూదులు శక్తి హీనముగా ప్రపంచమంతా పడి ఉన్నారు. యెహెఙ్కేలు తో దేవుడు ఏమన్నాడంటే, 

యెహేజ్కేలు 36:10

మీ మీద మానవ జాతిని, అనగా ఇశ్రాయేలీయులనందరిని, విస్తరింప జేసెదను, 

నా పట్టణములకు నివాసులు వత్తురు, పాడై పోయిన పట్టణములు మరల కట్టబడును.

ఈ ప్రవచనము ఈ రోజు నెరవేరుతూ ఉంది. ఇశ్రాయేలు దేశములో పాడైపోయిన అనేక పట్టణములు తిరిగి కట్టబడుచూ ఉన్నాయి. పైన గలిలయ ప్రాంతములో యేసు ప్రభువు తిరిగిన నజరేతు, కపెర్నహూము, తిబెరయ, బేతని, క్రింద హెబ్రోను, యెరికో ప్రాంతాలు జనావాస ప్రాంతములుగా మారినవి.

     1948 సంవత్సరములో ఇశ్రాయేలు దేశము ఏర్పడింది.ఇశ్రాయేలు అంటే నాకు 1948 గుర్తుకువస్తుంది. రెస్టారెంట్ కి వెళ్తే చికెన్ 65 గుర్తుకువస్తుంది. 1965 లో అది కనిపెట్టారు కాబట్టి చికెన్ 65  అని దానికి ఆ సంవత్సరము అతికిపోయింది. ఇశ్రాయేలు దేశానికి కూడా 1948 అతికిపోయింది.

     ఇశ్రాయేలు దేశము ఏర్పాటు బైబిలు ప్రవచనముల నెరవేర్పే, నక్షత్రము యాకోబులో ఉదయించకుండా ఎవరూ అడ్డుకోలేరు. రెండు ప్రవచనములు చూద్దాము.

దానియేలు గ్రంథము 9 అధ్యాయము చూడండి. అక్కడ 70 వారముల ప్రవచనము ఉంది. ఆ ప్రవచనము దేవుడు యూదులకు ఇచ్చిన టైం టేబుల్. ఇశ్రాయేలు దేశమును అందుకనే God’s Time Piece అని పిలుస్తాము. ఇశ్రాయేలు దేశము దేవుని గడియారం అని పిలుస్తాము. రోజులో సమయము తెలుసుకోవాలంటే గడియారం చూస్తాము. అదే విధముగా ప్రపంచ పరిస్థితులు తెలియాలంటే ఇశ్రాయేలు దేశము వైపు చూడాలి. దానియేలు 70 వారముల ప్రవచనములో 69 వారములు గడచినవి. యేసు ప్రభువు సిలువ వేయబడినప్పుడు దేవుని గడియారం ఆగిపోయింది. ఇప్పుడు క్రైస్తవ సంఘ యుగములో మనము ఉన్నాము. సమీప భవిష్యత్తులో దేవుని గడియారములో ముళ్ళు కొట్టుకోవటం మొదలవుతుంది. అప్పుడు 70 వారము మొదలవుతుంది. ఆ 70 వారము, ఆ 7 సంవత్సరములు మహా శ్రమల కాలము. Great Tribulation. ఆ సమయములో క్రీస్తు విరోధి (Antichrist) ఈ లోకమును తన ఆధిపత్యము లోకి తీసుకొంటాడు. యెరూషలేములోని దేవుని ఆలయములో ఒక హేయ వస్తువును నిలబెడతాడు. ఈ విషయాన్ని యేసు ప్రభువు కూడా మనకు తెలియజేశాడు. ఈ విషయాన్ని యేసు ప్రభువు కూడా మనకు తెలియ జేశాడు. మత్తయి 24 లో తన ఒలీవల కొండ ప్రసంగములో యేసు ప్రభువు ఏమన్నాడు? 

మత్తయి సువార్త 24:15,16

కాబట్టి ప్రవక్తయైన దానియేలు ద్వారా చెప్పబడిన 

నాశనకరమైన హేయవస్తువు పరిశుద్ధస్థలమందు నిలుచుట

మీరు చూడగానే చదువువాడు గ్రహించుగాక; 

యూదయలో ఉండువారు కొండలకు పారిపోవలెను

యేసు ప్రభువు ఇక్కడ ఏమన్నాడంటే, దానియేలు ప్రవక్త చెప్పినట్లు, క్రీస్తు విరోధి వచ్చి యెరూషలేములో నాశనకరమైన హేయ వస్తువును దేవుని ఆలయములో నిలబెడతాడు.అది చూసినప్పుడు మీరు యెరూషలేము వదలిపెట్టి పారిపోండి. ఇక్కడ మనము రెండు విషయాలు గమనించాలి.మొదటిగా యూదులు, రెండవదిగా ఆలయము. దానియేలు ప్రవక్త ఏమన్నాడు? 

యూదులు క్రీస్తు విరోధితో ఒప్పందము చేసుకొంటారు. అంటే యెరూషలేములో యూదులు వున్నట్లే. యేసు ప్రభువు ఏమన్నాడు? మీరు యెరూషలేములో నుండి పారిపోండి అని యూదులతో అన్నాడు. అంటే, యెరూషలేముకు యూదులు తిరిగివచ్చారనే కదా! అది ఎప్పుడు జరిగింది? 1948 లో జరిగింది. అంటే యేసు ప్రభువు మాటలను బట్టి చూస్తే, 1948 లో ఇశ్రాయేలు దేశము ఏర్పాటు ప్రవచనముల మూలముగానే జరిగింది.

2.ఆలయము కట్టబడుతుంది: ప్రస్తుతము యూదులు యెరూషలేములో ఆలయము కట్టుటకు తీవ్రముగా శ్రమిస్తున్నారు. అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ కుమార్తె, అల్లుడు – ఇవంకా ట్రంప్, జారెడ్ కుష్ణర్ – వాళ్లిద్దరూ యూదులు. వీరిద్దరూ ఇశ్రాయేలు దేశమునకు శాంతి దూతలుగా వెళ్లుచున్నారు. యూదులకు, అరబ్బులకు శాంతి నెలకొల్పాలని వారు ప్రయత్నము చేస్తున్నారు. యెరూషలేమును పూర్తిగా యూదులకు అప్పజెప్పి, అక్కడ ఒక మంచి దేవాలయము కట్టాలని వారు ఆశిస్తున్నారు. వారి వలె ఇంకా అనేక యూదు సంస్థలు ఈ ప్రయత్నాలు చేస్తున్నారు.

వారి కృషి సఫలము కావచ్చు, లేక విఫలము కావచ్చు. మనము చెప్పలేము. సఫలమైతే వారు దేవుని ప్రవచనములు నెరవేర్చినవారు అవుతారు. 

     ఇశ్రాయేలు చుట్టూ ఉగ్రవాదులు తమ పట్టు బిగిస్తున్నారు. క్రీస్తు విరోధి కూడా ఎటువంటి మానవత్వము లేని మానవత్వము లేని సాతాను చేత పంపబడిన ఒక పెద్ద ఉగ్రవాది. అందుకనే యేసు ప్రభువు ఏమని చెప్పాడంటే, 

క్రీస్తు విరోధి వచ్చినప్పుడు మీరు యెరూషలేములో ఉండవద్దు, అక్కడ నుండి పారిపోండి. ఈ క్రీస్తు  విరోధి (అంత్య క్రీస్తు) ప్రపంచాన్ని వణకిస్తాడు. అతని వ్యతిరేకించే శక్తి ఎవరికీ ఉండదు. ఏడేండ్ల శ్రమలు ముగిసే సమయములో యేసు ప్రభువు పరలోకములో నుండి తిరిగివస్తాడు, క్రీస్తు విరోధిని సంహరిస్తాడు. శాంతి, సమాధానం, సంక్షేమములతో కూడిన తన రాజ్యాన్ని స్థాపిస్తాడు. 

  కాబట్టి, దేవుడు యూదులను వదలివేశాడు అని మనము అనుకోకూడదు. ఈ విషయములో గందర గోళం లేకుండా ఉండాలంటే మనము దేవుని కేలండర్ చూడాలి. దేవునికి 4 ప్రణాళికలు ఉన్నాయి. 

fourplansofGod.jpg

దేవ  దూతలకు ఒక ప్రణాళిక 

యూదులకు ఒక ప్రణాళిక 

క్రైస్తవ సంఘానికి ఒక ప్రణాళిక 

అన్యజనులకు ఒక ప్రణాళిక 

ఆ నాలుగు ప్రణాళికలు సమాంతరముగా వెళ్తున్నాయి. వాటిని ఒకదానితో ఒకటి కలిపితే మనము గందర గోళం చెందే ప్రమాదం ఉంది. 

    దేవుడు యూదులను వదలివేయలేదు. దానియేలు 70 వారముల ప్రవచనములో 70 వ వారము ఇంకా మిగిలి ఉంది. అది యూదులకు ఇవ్వబడిన ప్రవచనము. బిలాముకు ఇవ్వబడిన 4 ప్రవచనాల్లో మనము ఈ సత్యము స్పష్టముగా చూస్తున్నాము.

వారు 

విభిన్నమయిన జనం 

విడువబడని జనం 

విజయం పొందే జనం 

విమోచించబడే జనం ముగా మనకు కనబడుచున్నారు.

మొదటి ప్రవచనములో మానవ చరిత్రలో యూదులను ఒక విభిన్నమైన జనముగా ఉంచుతాను అన్నాడు.

రెండవ ప్రవచనములో నేను వారిని విడచిపెట్టను, నిరంతరము వారికి తోడుగా ఉంటాను అన్నాడు.

మూడవ ప్రవచనములో వారికి విజయము అనుగ్రహిస్తాను అన్నాడు

నాలుగవ ప్రవచనములో వారిని విమోచిస్తాను అన్నాడు 

నక్షత్రము యాకోబులో ఉదయించును అన్నాడు. ఆ నక్షత్రము ఎవరంటే ప్రభువైన యేసు క్రీస్తే. ఆయన సిలువ వేయబడింది ఎందుకు? మన పాపముల కోసమే. ఆయన సమాధి చేయబడి, తిరిగిలేచింది ఎందుకు? మనకు నిరీక్షణ ఇచ్చుట కొరకు. ఆ రక్షణ, నిరీక్షణ మీరు పొందాలన్నదే నా కోరిక. 

డాక్టర్ పాల్ కట్టుపల్లి 

 

Leave a Reply