ఇప్పుడు ప్రపంచమంతా కరోనా వైరస్ క్రింద ఉంది. దాని ప్రభావము నా మీద కూడా పడింది. నా హాస్పిటల్ కి వచ్చేవారిలో ఎంత మందికి కరోనా రోగం అంటుకుందో తెలియదు. అయినా హాస్పటల్ లో రోగులకు వైద్య సేవలు కొనసాగిస్తున్నాను. అనిశ్చితి నెలకొంది. నా దగ్గరకు వచ్చే రోగులకు కరోనా పరీక్షలు చేస్తున్నాము.వారి పరిస్థితి ఎలాఉన్నప్పటికీ రోగులకు సేవలు అందిస్తూనేఉన్నాము. ఈ క్లిష్ట సమయములో నా కోసము, నా కుటుంబము కోసము మీరు ప్రార్థన చేయండి. దేవుని శక్తితో ఈ కరోనా వైరస్ ని ఓడిస్తాము.అందులో అనుమానం లేదు. రోగులందరికి వైద్యము చేస్తాము. ఈ రోజు కరోనా వైరస్ గురించి కొద్ది సేపు మీతో మాట్లాడాలని నేను ఆశ పడుచున్నాను. కరోనా బాధితులు 2 లక్షలు దాటిపోయారు.మరణించిన వారి సంఖ్య 10,000 మందికి చేరుతూ ఉంది. ప్రపంచము ఇంతకు ముందు ఎప్పుడూ చూడని పరిస్థితులు మనము చూస్తున్నాము. తగినన్ని వెంటిలేటర్ లు, బెడ్లు లేక చాలా చోట హాస్పిటళ్లు ఇబ్బందులు ఎదుర్కొంటున్నాయి. స్కూళ్ళు, కాలేజీలు,యూనివర్సిటీలు మూతపడ్డాయి. వ్యాపార సంస్థలు మూతపడ్డాయి.రెస్టారెంట్లు, బార్లు ఖాళీ అయినాయి. రోడ్లు ఖాళీగా కనిపిస్తున్నాయి. ఇటలీ లో పరిస్థితి ఎలా ఉందంటే చనిపోయిన వారి మృత దేహాలను సమాధి పెట్టెలో పెట్టడానికి కూడా వారికి కష్టముగా ఉంది. ‘డాక్టర్, నేను కరోనా వలన చనిపోతానా? నాకు ఇద్దరు చిన్న పిల్లలు ఉన్నారు.’ అని ఒక తల్లి నన్ను ప్రశ్నించింది.
అయితే చాలా మంది ఈ వైరస్ ని తేలికగా తీసుకొంటున్నారు. అది ప్రమాదము. కొంతమంది ఇంకా సామూహికముగా బీచ్ లకు వెళ్లి స్నానాలు చేస్తున్నారు. బార్లకు వెళ్లి డాన్సులు వేస్తూనే ఉన్నారు. ఈ వైరస్ ని వారు తేలికగా తీసుకొంటున్నారు. ఫ్రెంచ్ రచయిత ఆల్బర్ట్ కము వ్రాసిన మాటలు వారిని చూసినప్పుడు నాకు గుర్తుకు వచ్చాయి. ఒక నవలలో కము ఏమని వ్రాశాడంటే చాలా సీరియస్ గా తీసుకొనవలసిన విషయాలను చాలా తేలికగా తీసుకోవటం మానవ స్వభావము లో భాగముగా ఉంది.
ఆల్బర్ట్ కము ఫ్రాన్స్ దేశానికి చెందిన గొప్పతత్వవేత్త. 1913 – 1960 సంవత్సరముల మధ్య జీవించాడు. ఆయన ఒక నాస్తికుడు. గొప్ప రచనలు చేశాడు. 1957 లో 44 సంవత్సరాల వయస్సులోనే ఆయనకు సాహిత్యము లో నోబెల్ బహుమతి లభించింది. అంత చిన్నవయస్సులో నోబెల్ బహుమతి సాధించిన రెండవ వ్యక్తిగా మనము ఆయన పేరు చెప్పుకొంటున్నాము. విషాదకరముగా 46 సంవత్సరాల వయస్సులో ఒక కారు ప్రమాదంలో కము మరణించాడు.
ఈ రోజు మనము కము ను ఎందుకు గుర్తుపెట్టుకొంటున్నాము అంటే ఆయన 1947 లో ‘ప్లేగ్’ అనే నవల వ్రాసాడు.ఈ రోజు ప్రపంచము ఆ నవలను జ్ఞాపకము చేసుకొంటున్నది, ఎందుకంటే ఆ నవలలో కము ఒక అంటువ్యాధి ప్రపంచాన్ని ఎలా అతలాకుతలము చేస్తుందో వ్రాశాడు. నాలుగు విషయాలు ఆ నవలలో ఆయన ప్రస్తావించాడు:
1.మనిషి స్థితి
2.మనిషి స్వభావము
3.మనిషి నిరీక్షణ
4.మనిషి గమ్యము
రెండో ప్రపంచ యుద్ధము తరువాత వ్రాయబడిన నవలల్లో గొప్ప నవలగా ఈ నవల చెప్పబడింది. కము ఈ నవలకు ‘ప్లేగ్’ అని పేరుపెట్టాడు. అంటే ఒక ‘భయంకరమైన అంటువ్యాధి’ కము ఈ నవలను 1947 లో వ్రాశాడు. అంటే అది భారత దేశానికి స్వాతంత్రము వచ్చిన సంవత్సరము. ఆయన వలస పాలన చూశాడు, హిట్లర్, నాజీలు రెండో ప్రపంచ యుద్ధములో చేసిన ఘోరాలు చూశాడు.లక్షలాది మంది యూదులను హతము చేసిన కాన్సంట్రేషన్ క్యాంపులు చూశాడు. యుద్ధ నేరాలు చూశాడు. రష్యా దేశములో స్టాలిన్ చేస్తున్న ఘోరాలు కూడా చూశాడు. అవన్నీ చూసిన తరువాత ఈ ‘అంటు వ్యాధి’ అనే నవల వ్రాశాడు. ఈ నవలలో ‘ఒరాణ్’ అనే నగరము ఉంటుంది. ఆ నగరములో లక్షలాది మంది ప్రజలు నివసిస్తూవుంటారు. వారి మధ్యలో డాక్టర్ బెర్నార్డ్ రూ అనే వైద్యుడు ఉంటాడు. ఆ నగరములో ఆయన తిరుగుతున్నప్పుడు అనేక చోట్ల చచ్చిపోయిన ఎలుకలు ఆయనకు కనిపిస్తాయి. కొంతమంది ప్రజలు జ్వరము, దగ్గుతో ఆయన దగ్గరకు వస్తారు. ఆయనకు పరిస్థితి అర్ధము అవుతుంది: ప్లేగ్ రోగము ఈ నగరములో ప్రవేశించింది.
వెంటనే డాక్టర్ రూ అధికారుల దగ్గరకు వెళ్తాడు: ఈ నగరములోప్లేగ్ వ్యాధి మొదలయ్యింది. మనము వెంటనే నిరోధక చర్యలు తీసుకోకపోతే, వచ్చే రెండు నెలల్లో ఈ ఊరులోనే లక్షమంది చనిపోతారు అని వారికి చెబుతాడు. అయితే వారు ఆయన మాటలు పట్టించుకోరు.మొన్న చైనా లో జరిగింది కూడా అదే కదా. కరోనా వైరస్ గురించి ఒక డాక్టర్ చేసిన హెచ్చరికలు ఎవరూ పట్టించుకోలేదు.ఇప్పుడు ఈ వైరస్ ప్రపంచ మంతా మరణ మృదంగము వాయిస్తూ ఉంది. చివరకు డాక్టర్ రూ చెప్పినట్లుగానే ఒరాణ్ నగరము మీదకు ప్లేగ్ విరుచుకుపడుతుంది.ఎంతో మంది ప్రజలు చనిపోతూ ఉంటారు.డాక్టర్ రూ ఆ రోగులకు సేవలు అందిస్తాడు.ఆ నగరములో కుప్పలు, కుప్పలుగా శవాలు పేరుకుపోతూ ఉంటాయి. డాక్టర్ రూవ్ ఆయన తన పనిలోనే తన కర్తవ్యాన్ని చూసుకొంటాడు. ఆయనకు జీవిత పరమార్థము ఇతరులకు సేవ చేయడమే. ఆయనకు దేవుని మీద నమ్మకము ఉండదు, తన పని మీదే నమ్మకము. సైన్స్ మీదే నమ్మకము.ఈ నవలలో ఫాదర్ పనెలూ అనే పాస్టర్ గారు కూడా మనకు కనిపిస్తాడు. ఆ వ్యాధితో అనేక మంది ప్రజలు చనిపోతున్నప్పుడు పాస్టర్ గారు వారికి ప్రసంగాలు చేస్తాడు. ఒక ప్రసంగములో ఏమని చెబుతాడంటే, దేవుడు మారుమనస్సు పొందని వారి మీదకు శిక్షగా ఈ వ్యాధిని పంపించాడు. మరొక ప్రసంగములో ఇప్పుడు కూడా మనకు దేవుడు ఆదరణ, నిరీక్షణ అనుగ్రహిస్తాడు అని చెబుతాడు.
ఒక రోజు ఒక చిన్న బాలునికి ప్లేగ్ వ్యాధి వస్తుంది.పాస్టర్ పనెలూ ఆ బాలుని మంచము ప్రక్కన కూర్చొని అతని స్వస్థత కోసము ప్రార్ధన చేస్తాడు. దేవా, ఈ బాలుని చావు నుండి తప్పించు అని ప్రాధేయ పడుతాడు. అయితే, కొన్ని రోజుల తరువాత ఆ బాలుడు చనిపోతాడు. పాస్టర్ గారు ప్రజలకు ఏమని చెబుతాడంటే, దేవుడు ప్రేమ కలిగిన వాడు, ఈ చిన్న బాలుని మరణము మనకు అర్థము కాకపోవచ్చు, అయినా దేవుని ఉద్దేశాలను మనము శంకించకూడదు. ఎంతో ప్రాణాలు పోయిన తరువాత, చివరకు, ఆ ప్లేగ్ వ్యాధి ఆ ఒరాణ్ నగరములో అనేక మందిని చంపివెళ్లిపోతుంది. అయితే ఆ ఊరి ప్రజలు మాత్రము ఎటువంటి పాఠాలు నేర్చుకోరు. తమ పూర్వ స్థితికి వెళ్ళిపోతారు. ఆల్బర్ట్ కము వ్రాసిన ఈ ‘ప్లేగ్’ అనే నవల గత వంద సంవత్సరాల్లో వ్రాయబడిన నవలలన్నిటిలో గొప్ప నవలగా చెప్పబడింది. ఎందుకంటే ఈ నవలలో ఆయన చాలా ముఖ్యమైన ప్రశ్నలు అడిగాడు. ఆయన ఏమంటాడంటే, అసలు మానవ జీవితానికి అర్ధం ఉందా? ప్రశాంతముగా జీవిస్తున్న వారి మీదకు ఒక భయంకరమైన వ్యాధి దూసుకువచ్చింది. వారి జీవితము కొన్ని రోజులకు కుదించబడింది. అక్కడ ఉత్పన్నమయ్యే ప్రశ్న, ఇలాంటి తాత్కాలికమైన, ఎప్పుడూ ఆరిపొద్దో తెలియని మన జీవితానికి అర్థము ఉందా? అంటు వ్యాధి వస్తున్నది అని తెలిసినా ఆ నగర ప్రజలు పట్టించుకోరు. అక్కడ ఉత్పన్నమయ్యే ప్రశ్న మానవ స్వభావాన్ని ఎవరు మార్చగలరు? ఆ ప్లేగ్ ఆ ఊరి ప్రజలను వేధిస్తున్నప్పుడు డాక్టర్ రూవ్ వారికి సేవచేయటానికి నడుం బిగిస్తాడు. పాస్టర్ పనెలూ ప్రజలకు తన సందేశాలు ఇస్తాడు. అక్కడ ఉత్పన్నమయ్యే ప్రశ్న, ఇటువంటి స్థితిలో మానవ సమాజము ఇరుకున్నప్పుడు, సగటు మానవుడు ఏమి చేయగలడు? ప్లేగ్ రోగము బాధితుల్లో చిన్న పిల్లలు కూడా ఉన్నారు.అక్కడ ఉత్పన్నమయ్యే ప్రశ్న ఏమిటంటే, దేవుడు ప్రేమ కలిగిన వాడైతే, దేవుడు శక్తి కలిగినవాడైతే ఈ చిన్న బాలుడు ఆ ప్లేగ్ రోగముతో ఎందుకు చనిపోయాడు?
ఆ ప్రశ్నలు అడిగి కము నాలుగు ప్రధాన అంశాలు ఆ నవలలో మనముందు ఉంచాడు.
మనిషి స్థితి
మనిషి స్వభావము
మనిషి నిరీక్షణ
మనిషి గమ్యము
1.మనిషి స్థితి – Human Condition
ఆల్బర్ట్ కము ఈ ‘ప్లేగ్’ నవలలో మన సమాజానికి పట్టిన ఒక వ్యాధి గురించి వ్రాశాడు. ఆయన దృష్టిలో ‘వ్యాధి’ అంటే అది శరీరానికి అంటుకునే వ్యాధి అని కాదు. అది మన మనస్సుకు పట్టిన వ్యాధి. పాపపు రోగము. ఆ నగర ప్రజలు ఆ అంటువ్యాధి యొక్క తీవ్రత ను గమనించలేకపోయారు. ఆ సూక్షజీవి ఎంత భయంకరమైనదో వారు గుర్తించలేకపోయారు. ఈ వ్యాధి చాలా చిన్న సమస్య అని వారు అనుకొంటారు. యేసు ప్రభువు మనకు చెప్పింది కూడా అదే. మనలో ఉన్న పాప రోగము యెంత భయంకరమైనదో మనము గుర్తించుట లేదు. మరణము వారిని కమ్ముకొని వస్తున్న విషయము ఆ ఊరి ప్రజలు గమనించలేకపోయారు. చివరకు అంటు వ్యాధి సోకిన వారు కూడా తమ రోగాన్ని ఒప్పుకోరు. ఈ రోజు మన పరిస్థితి కూడా అలానే ఉంది. పాప రోగము మనలను నరకమునకు ఈడ్చుకొని వెళ్తున్నది. మనము పాపములో నశించిన స్థితిలో ఉన్నాము అని యేసు ప్రభువు చెప్పాడు. అయితే ఆ స్థితిని గుర్తించింది ఎంత మంది? ఆ స్థితిని అంగీకరించింది ఎంత మంది?
2.మనిషి స్వభావము – Human Nature
రెండోది మనిషి స్వభావము కము చెప్పేది ఏమిటంటే, ఈ ప్లేగ్ అప్పుడప్పుడూ వచ్చి వెళ్లి పోయేది కాదు. అది ఎప్పుడూ మనలోనే ఉంటుంది.కము దృష్టిలో ఇక్కడ ‘అంటువ్యాధి’ అంటే శారీరకమైన రోగము మాత్రమే కాదు, అది మానసిక రోగము కూడా. ఈ వ్యాధి మానవ స్వభావాన్ని బయటపెట్టింది. మనలో ఉన్న రోగాన్ని మనము గుర్తించము.ఈ రోగము మన చుట్టూ ఉంది, మన ప్రపంచము మొత్తము ఉంది, మన సమాజము మొత్తము ఉంది, మనలోనే ఉంది, అయితే దానిని మనము గుర్తించము.ఈ వ్యాధి సర్వత్రా వ్యాపించి ఉంది. ఈ రోజు కరోనా వైరస్ సర్వత్రా వ్యాపించి ఉంది. ఆ వైరస్ ఉన్న వారు మన మీద తుమ్మితే, దగ్గితే అది మనలోకి రావచ్చు. వారి బట్టల నుండి రావచ్చు, వారు మనలను తాకితే అది మనకు రావచ్చు. ఆ వైరస్ ఉన్న కుర్చీ మీద కూర్చుంటే అది మనలోకి రావచ్చు, అది ఉన్న గాలి పీల్చుకొంటే అది మనలోకి రావచ్చు. అది అంతగా వ్యాపించి ఉంది. కము కూడా అదే మాట వ్రాశాడు.ప్లేగ్ వచ్చినప్పుడు వారి జీవితము స్తంభించిపోతుంది.చివరకు ఆ ప్లేగ్ వ్యాధి ఆ నగరాన్ని వదలి పెట్టి వెళ్ళిపోతుంది. అప్పుడు ఆ నగర ప్రజలందరూ పాత జీవితాన్ని తిరిగి ప్రారంభిస్తారు. ఈ వ్యాధి వెళ్ళిపోయింది కదా, మళ్ళా ఎంజాయ్ చేద్దాము రండి అని తమ సరదాల్లోకి వెళ్ళిపోతారు.ఈ రోజు అన్ని ప్రాంతాల్లో బార్లు, డాన్స్ క్లబ్బులు క్లోజ్ చేశారు. అయితే, ఈ వైరస్ వెళ్ళిపోయిన తరువాత ప్రజలందరూ తిరిగి పాత జీవితము లోకి వెళ్ళిపోతారు. కము వ్రాసిన మాటలు చదువుతా వినండి:
“And, indeed, as he listened to the cries of joy rising from the town, Rieux remembered that such joy is always (impermanent). He knew what those jubilant crowds did not know but could have learned from books: that the plague bacillus never dies or disappears for good; that it can lie dormant for years and years in furniture and linen-chests; that it bides its time in bedrooms, cellars, trunks, and bookshelves; and that perhaps the day would come when, for the bane and the enlightening of men, it would rouse up its rats again and send them forth to die in a happy city”
“ఆ అంటు వ్యాధి వెళ్ళిపోయినప్పుడు ప్రజలందరూ సంబరాలు చేసుకొంటున్నారు. డాక్టర్ రూవ్ అది చూసి ఏమంటాడంటే, ఈ ప్రజలు తమ స్థితిని గ్రహించలేని స్థితిలో ఉన్నారు.ఈ అంటువ్యాధి స్వభావము వారు తెలుసుకోలేకపోయారు.అది వెళ్లిపోయేది కాదు, చచ్చిపోయేది కాదు.అది వారి ఇళ్లల్లోనే ఉంటుంది, మంచాల మీద, కుర్చీల మీద, బల్లల మీద జీవిస్తూనే ఉంటుంది.అవకాశము వచ్చినప్పుడు ఎలుకల్లో ప్రవేశిస్తుంది.వారి దగ్గరకు మరణాన్ని పంపిస్తుంది.”
మనలో ఉండే పాప స్వభావము అలాంటిదే అని కము గుర్తించాడు. దేవుని ఎరుగని పాపిలో పాప స్వభావము ఎప్పుడూ అతనిలోనే, అతనితోనే ఉంటుంది. దేవుడు కయీను తో అన్నాడు, ఆదికాండము 4:7 లో మనము చదువుతాము.‘నీ వాకిట్లో పాపము పొంచి ఉంది’. యేసు ప్రభువు చెప్పింది కూడా అదే. మార్కు సువార్త 7 అధ్యాయములో మనము చదువుతాము.
కము ఏమన్నాడు? ఆ రోగము వెళ్లిపోలేదు, అక్కడే ఉంది, ఆ ఊరిలోనే ఉంది. యేసు ప్రభువు యేమని చెప్పాడంటే, ‘పాపము ఎక్కడో లేదు.పాపి హృదయములోనే ఉంది. సమస్తమైన పాపములు పాపి హృదయములోనుండే జన్మిస్తాయి. ఆ ప్లేగ్ వ్యాధి వచ్చినప్పుడు ఆ నగరములోమనిషి యొక్క అసలు స్వభావము బయటపడింది.
డాక్టర్ రూవ్ లాంటి వారు ఇతరులకు సహాయము చేస్తూ గడిపారు. కొంతమంది తమ స్వార్థ ప్రయోజనాల కోసమే ప్రాకులాడారు. ఇంకొంతమంది ఇతరులను మోసము చేయడానికి ప్రయత్నించారు.ఈ రోజు కూడా మనము అటువంటి దృశ్యాలనే చూస్తున్నాము. కరోనా రోగులకు సేవలు చేస్తూ చాలా మంది ప్రాణాలు కూడా కోల్పోతున్నారు.కొంతమంది వారి హృదయాల్లో ఉన్న స్వార్ధాన్ని కూడా బయటపెడుతున్నారు. ఈ రోజు ఒక వ్యాపారి చేసిన పని గురించి నేను చదివాను. కరోనా వలన హ్యాండ్ శానిటైజర్ లకు విపరీతముగా డిమాండ్ పెరిగింది. ప్రజలు చేతులు శుభ్రము చేసుకోవటానికి ఇవి ఉపయోగపడతాయి. అది గమనించిన ఈ వ్యాపారి వెంటనే ఒక వ్యాన్ లో బయలుదేరి ఆ ప్రాంతములో ఉన్న షాపులకు వెళ్లి హ్యాండ్ శానిటైజర్ లను మొత్తము కొనుక్కున్నాడు. దాదాపు 20,000 బాటిళ్లు కొనుక్కొని ఇంట్లో పెట్టుకొన్నాడు. వాటిని అమెజాన్ లో ఆన్ లైన్ అధిక రేట్లకు దాదాపు 10 రెట్లకు అమ్ముకొని సొమ్ము చేసుకొంటున్నాడు. అమెజాన్ అది గమనించి అతని అకౌంట్ రద్దు చేసింది. ఆయన ఇంట్లో ఇంకా 17,000 బాటిళ్లు మిగిలిపోయినాయి.ఇప్పుడు వాటిని ఎలా వదిలించుకోవాలో తెలియక ఆ వ్యాపారి లబోదిబోమంటున్నాడు. దురాశ దుఃఖానికి చేటు అని చెప్పింది అందుకే.
కము నవలలో కూడా ఆ ప్లేగ్ వ్యాధి వచ్చినప్పుడు చాలా మంది డబ్బు మీదే దృష్టి పెట్టారే కానీ, ఇతరుల అవసరాలు పట్టించుకోలేదు.అమెరికా దేశములో జిమ్ బేకర్ అనే ఒక బోధకుడు ఉన్నాడు. ఆయన ‘సిల్వర్ సొల్యూషన్’ అనే ఒక మందు అమ్ముతున్నాడు. ప్రజలకు ఆయన యేమని చెబుతున్నాడంటే, నాకు స్వస్థతా వరము ఉంది. నేను చేసిన ఈ సిల్వర్ సొల్యూషన్ త్రాగితే కరోనా 12 గంటల్లో తగ్గిపోతుంది అని చెబుతున్నాడు. చాలా మంది అమాయకులు ఆ సిల్వర్ సొల్యూషన్ కొనుక్కొని త్రాగుతున్నారు. అది ఒక పెద్ద మోసము. కరోనా కి మందు లేదు, వాక్సిన్ లేదు. అయితే కొంతమంది ప్రజలను మోసము చేస్తున్నారు. మాకు స్వస్థతా వరం ఉంది. మేము అమ్మే నూనె, పరిశుద్ధ జలము, సిల్వర్ సొల్యూషన్ కొనుక్కొని త్రాగండి అని వ్యాపారాలు చేసుకొంటున్నారు. వారి మాటలు విని మనము మోసపోకూడదు. నిజముగా వారికి స్వస్థతావరము ఉంటే, హాస్పిటల్ కి వెళ్లి కరోనా రోగులను స్వస్థపరచాలి.అమెరికా గవర్నమెంట్ జిమ్ బేకర్ కి నిన్న వార్నింగ్ ఇచ్చింది. సిల్వర్ సొల్యూషన్ పేరిట నువ్వు ఇలాంటి జిమ్ముక్కులు ప్రదర్శిస్తే మేము నీ మీద చర్యలు తీసుకోవలసి ఉంటుంది. జిమ్ బేకర్ లాంటి వారి వలన దేవునికి చెడ్డ పేరు వస్తున్నది. దేవాలయములో జరుగుతున్న వ్యాపారాలను యేసు ప్రభువు అడ్డుకున్నాడు.కొంతమంది దృష్టి దేవుని మీద ఉంటే, మరికొంతమంది దృష్టి డబ్బు మీద ఉంది.కము తన నవలలో వారి స్వభావాన్ని మనకు చూపించాడు.
3.మనిషి నిరీక్షణ Human Hope
కము తన నవలలో చూపించిన మూడవ అంశము మనిషి నిరీక్షణ. ఈ పాపరోగము మనిషిని బంధించింది. మనిషికి నిరీక్షణ లేదు అన్నాడు. కము కమ్యూనిస్టులతో ఆ విషయములో విభేదించాడు. కమ్యూనిస్టులు ఏమన్నారంటే మనిషి స్వభావాన్ని మేము మార్చగలము, ఆర్ధిక పరిస్థితులు మారిస్తే ఆ పాప రోగము పోతుంది’ అన్నారు.కము వారితో ఏమన్నాడంటే, ‘ఆర్ధిక పరిస్థితులు మారినంత మాత్రాన ఈ పాప రోగము పోదు, మనిషికి నిరీక్షణ లేదు’ కము అబ్సర్డిజం అనే ఫిలాసఫీ ని స్థాపించాడు.ఈ అబ్సర్డిజం ఏమంటదంటే, మనిషి పాపరోగములో ఇరుక్కుపోయాడు. అతని జీవితం ‘అసంబద్దమైనది’, absurd.యేసు ప్రభువు చెప్పేది అది కాదు.
‘పాప రోగముతో బాధించబడుతున్న మనిషికి విడుదల ఇవ్వటానికే నేను ఈ లోకానికి ఇచ్చాను. పాప రోగముతో నశించిన మనిషికి స్వస్థత ఇవ్వటానికే నేను ఈ లోకానికి వచ్చాను. లూకా సువార్త 19 లో
యేసు ప్రభువు యెరికో పట్టణమునకు వెళ్ళినప్పుడు జక్కయ్య ఆయనను చూద్దామని మేడి చెట్టు ఎక్కాడు. యేసు ప్రభువు ఆ చెట్టు దగ్గరకు వెళ్ళాడు. ‘జక్కయ్యా, దిగిరా. నేడు నేను నీ ఇంట్లో వుంటాను.నేడు నీ యింటికి రక్షణ వచ్చియున్నది. నశించినదానిని వెదకి రక్షించుటకు మనుష్యకుమారుడు వచ్చెనని అతనితో చెప్పెను. లూకా 19:1-10
మనిషికి యేసు ప్రభువు అలాంటి నిరీక్షణ ఇస్తున్నాడు. నాకు నీ స్థితి తెలుసు, నీ స్వభావం తెలుసు, నేను నీ ఇంటికి వస్తాను, నీ పాప రోగమును స్వస్థపరుస్తాను, నీకు నిరీక్షణ ఇస్తాను నీకు గమ్యాన్ని ఇస్తాను.యేసు ప్రభువు మన జీవితములో వున్నప్పుడు మన ఆలోచనలు కూడా మారుతాయి.
నిన్న నా భార్య షాపింగ్ కి వెళ్ళింది. చాలా మంది పానిక్ షాపింగ్ చేస్తున్నారు. ఇతరుల గురించి ఆలోచించకుండా వారి అవసరాలకు మించి నిత్యావసరాల కోసము సరుకులు కొనుక్కొంటున్నారు. వారి తరువాత వెళ్లినవారికి ఏమీ మిగలని పరిస్థితి కల్పిస్తున్నారు. నా భార్య ఏమందంటే ‘నేను ఒక్క బ్యాగ్ బియ్యము మాత్రమే కొన్నాను, నాలుగు ఐదు బ్యాగ్లు బియ్యము కొని పోగు వేసుకోవటం నాకు ఇష్టము లేదు’ అని చెప్పింది. ఆ మాట నాకు ఇచ్చింది. మనం షాపింగ్ చేసేటప్పుడు ఇతరుల గురించి కూడా ఆలోచించాలి. యేసు ప్రభువు యేమని ప్రార్ధన చేయమన్నాడు?
మా అనుదిన ఆహారము మాకు దయచేయుము
Give us our Daily bread
ఇశ్రాయేలీయులు అరణ్యములో ఉన్నప్పుడు దేవుడు వారికి మన్నాను ఆహారముగా అనుగ్రహించాడు.
ఏ రోజుకు కావాల్సిన మన్నా ఆ రోజు పోగుచేసుకోండి, రేపటి గురించి ఆందోళన చెందకండి అన్నాడు.
ఇంకో సంవత్సరము గురించి మనం ఆందోళన చెందాల్సిన అవసరము లేదు. ఏ రోజుకు కావలసిన కృపను దేవుడు ఆ రోజే మనకు ఇస్తాడు. రేపటి కృపను ఈ రోజు ఇవ్వడు.ఈ రోజుకు కావాల్సిన కృప ఈ రోజు ఇస్తాడు. రేపటికి కావాల్సిన కృప రేపు ఇస్తాడు. ఎల్లుండి కావాల్సిన కృప ఎల్లుండి ఇస్తాడు.
ఓరాన్ నగరములో ప్లేగ్ వ్యాధి వచ్చినప్పుడు పాస్టర్ పనెలూ తన నిరీక్షణను దేవుని మీద పెట్టుకొన్నాడు. ఆ నగరాన్ని ఆ అంటువ్యాధి కబళిస్తున్నప్పడు ఆయన ధైర్యముగా ఉన్నాడు. ఇలాంటి రోగాలు ప్రబలినప్పుడే అనేక మైన ప్రశ్నలు మన మనస్సులను తొలిచివేస్తాయి. జీవితము
ఇంత తాత్కాలికమైనదా? ఇంత అనిశ్చితితో నిండినదా? అని మనకు అనిపిస్తుంది. మనిషి దగ్గర నిరీక్షణ లేదు. దేవుడు మాత్రమే శాశ్వతమైన వాడు. ఫాదర్ పనెలూ దేవుని మీద తన నిరీక్షణ పెట్టుకొన్నాడు.క్రైస్తవ నిరీక్షణ ఒక ఆలోచన మాత్రమే కాదు, అది ఒక జీవన విధానము.
4.మనిషి గమ్యము
నాలుగవదిగా మనిషి గమ్యము. Human Destiny
మనిషి గమ్యము ఏమిటి? కము ఏమన్నాడంటే, ప్లేగ్ రోగము కబళించిన నగరములో మనిషి ఇరుక్కుపోయాడు.
He is trapped, that is his destiny
అతడి గమ్యము అదే. అతడు ఎలా బయట పడగలడు? కము ఏమన్నాడంటే,
There is only one really serious philosophical question, and that is suicide
ఫిలాసఫీ లో ముఖ్యమైన ప్రశ్న ఒక్కటే:
నేనెందుకు ఆత్మ హత్య చేసుకోకూడదు?
కరోనా భయముతో కొంతమంది ఆత్మ హత్య చేసుకోవటం మనం చూస్తున్నాము.కము నాస్తికుడు కాబట్టి, దేవుని మీద విశ్వాసము లేని వాడు కాబట్టి ఆ విధముగా మాట్లాడాడు. యేసు క్రీస్తు ఇచ్చే సందేశం అది కాదు. సిలువ మీద దొంగ మేకులతో ఆ సిలువకు బంధించబడి ఉన్నాడు.అతడికి నిరీక్షణ లేదు.చావు తప్ప అతని ముందు మరొక మార్గము లేదు. అయితే అతడు ప్రక్కకు తిరిగి సిలువ మీద ఉన్న యేసు ప్రభువు వైపు చూశాడు.
‘ యేసూ, నీవు నీ రాజ్యము లోనికి వచ్చునప్పుడు నన్ను జ్ఞాపకము చేసికొనుమనెను.’
లూకా 23:42-43
ఆ దొంగ విశ్వాసముతో ఆయనను అడిగాడు.‘ప్రభువా, నీ రాజ్యములో నన్ను జ్ఞాపకము చేసుకో’ యేసు ప్రభువు ఆ దొంగతో అన్నాడు: నేడు నీవు నాతో కూడ పర దైసులో ఉందువని నిశ్చయముగా నీతో చెప్పుచున్నా ననెను.ఈ రోజే నీవు నాతో పాటుగా పరలోకం వస్తావు.అని ప్రభువైన యేసు క్రీస్తు ఆ దొంగతో అన్నాడు.యేసు క్రీస్తును నమ్మిన వారికి దేవుడు అలాంటి గమ్యాన్ని ఇస్తున్నాడు.
1 పేతురు 5:10 లో మనం చదువుతాము:
తన నిత్యమహిమకు క్రీస్తునందు మిమ్మును పిలిచిన సర్వకృపా నిధియగు
దేవుడు కొంచెము కాలము మీరు శ్రమపడిన పిమ్మట,తానే మిమ్మును పూర్ణులనుగా
చేసి స్థిరపరచి బలపరచును.
1 peter 5:10
దేవుడు తన నిత్యమహిమకు మనలను పిలిచాడు. కొంచెము కాలము మీరు శ్రమపడిన పిమ్మట…. ఈ లోకములో మనకు ఉండే శ్రమలు కొంతకాలమే.వాటిల్లో కూడా దేవుడు తన కృపను మనకు చూపిస్తున్నాడు.ఆయన సర్వకృపానిధియగు దేవుడు God of All Grace
ఈ కరోనా వైరస్ మన ప్రపంచాన్ని కనీ, విని ఎరుగని అనిశ్చితిలోకి నెట్టింది. కము వ్రాసిన ప్లేగ్ అనే ప్రసిద్ధ నవల గురించి ఈ రోజు చూశాము. కము నాలుగు ప్రధాన అంశాలు
ఆ నవలలో మనముందు ఉంచాడు.
మనిషి స్థితి
మనిషి స్వభావము
మనిషి నిరీక్షణ
మనిషి గమ్యము
కము ఏమన్నాడు? మనిషి పాప రోగములో బంధించబడ్డాడు. అతనికి విడుదల లేదు.యేసు ప్రభువు ఏమన్నాడంటే, ఆ మనిషిని విడిపించి, విమోచించడానికే నేను ఈ లోకమునకు వచ్చాను. ఆయన దగ్గరకు వచ్చి, రక్షణ పొంది మీరు కూడా ఆ గొప్ప నిశ్చయతను, కాన్ఫిడెన్స్ పొందాలన్నదే నేటి మా ప్రేమ సందేశం.