దానియేలు 70 వారములు ప్రవచనము:డాక్టర్ పాల్ కట్టుపల్లి సందేశం

Daniel70weekschartstelugubyPaulKattupalli.jpg

    ఈ సత్యము దానియేలు గ్రంథము 9 అధ్యాయములో 70 వారములు ప్రవచనములో కూడా మనకు కనిపిస్తుంది. బైబిల్ గ్రంథములో అతి ముఖ్యమైన ప్రవచనముగా దీనిని చెప్పుకోవచ్చు.క్రీస్తు పూర్వము 538 లో ఈ ప్రవచనము ఇవ్వబడింది. ఆ సంవత్సరంలోనే పర్షియా రాజు కోరెషు యూదులు బబులోను చెర విడిచి తమ యూదయ దేశమునకు తిరిగి వెళ్ళవచ్చు అని ఆదేశించాడు. యేసు ప్రభువు, పౌలు, యోహాను చేసిన ప్రవచనాలు ఈ దానియేలు ప్రవచనము ఆధారముగా చేసినవే. మత్తయి 24 లో యేసు ప్రభువు చేసిన ఒలీవల కొండ ప్రసంగము, 2 థెస్సలొనీక 2 లో అంత్య క్రీస్తు గురించి పౌలు చెప్పిన ప్రవచనము, ప్రకటన గ్రంథము 6-19 అధ్యాయాల్లో యోహాను చెప్పిన ప్రవచనాలు దీని ఆధారముగా చేయబడ్డాయి. 

    గాబ్రియేలు దేవ దూత దానియేలుకు సాయంత్రం బలి అర్పించు సమయములో అంటే 3 గంటల సమయములో కనిపించాడు. ‘అభిషక్తుడు నిర్మూలము చేయబడును’ అని ఈ ప్రవచనంలో చెప్పబడింది. అభిషక్తుడు అంటే రక్షకుడైన క్రీస్తే. ఆ రక్షకుడు సిలువ వేయబడతాడు అనే సత్యము కూడా గాబ్రియేలు దూత దానియేలుకు తెలియజేశాడు. సిలువ ఈ ప్రవచనానికి కేంద్రము లాంటిది. ఆయన సాయంత్రము 3 గంటలకు సిలువ మీద మరణించాడు. దానియేలుకు సాయంత్రము 3 గంటల వేళ ఈ ప్రవచనము ఇవ్వబడింది అని మనం గ్రహించాలి. 69 వారముల తరువాత సరిగ్గా గంటలతో సహా ఈ ప్రవచనము నెరవేరింది. 

 

    దానియేలు 70 వారముల ప్రవచనము అని మనము దీనిని పిలుస్తున్నాము. వారము అంటే 7 దినములు అని మనకు తెలుసు. అయితే ఇక్కడ వారము అంటే 7 దినములు అని కాకుండా 7 సంవత్సరములు అని మనము అర్థము చేసుకోవాలి.70 వారములను మనము 7 తో హెచ్చించాలి, అప్పుడు 490 వస్తుంది.అంటే 490 సంవత్సరాల కాలము ఈ ప్రవచనంలో ఉన్నది .దానియేలుకు వెనుక 490 సంవత్సరాలు ఉన్నాయి. ఆయనకు ముందు 490 సంవత్సరాలు ఉన్నాయి. 490 సంవత్సరాల చరిత్రలో ఇశ్రాయేలీయులు 70 సబ్బాతు సంవత్సరాలు చూశారు. ఆ 70 సబ్బాతు సంవత్సరాలు వారు ఉల్లంఘించారు కాబట్టి దేవుడు వారికి 70 సంవత్సరాల బబులోను చెర విధించాడు. దానియేలు ఇప్పుడు మరొక 490 సంవత్సరాల భవిష్యత్తులోకి చూస్తున్నాడు.

    రెండిటి మధ్య కొన్ని పోలికలు మనము చూస్తున్నాము. ఇంతకు ముందు వారు దేవుని మాటకు అవిధేయులయ్యారు.తరువాత కూడా అవిధేయులయ్యారు.ఇంతకు ముందు దేవుని ఆలయము కూల్చివేయబడింది, తరువాత కూడా దేవుని ఆలయము కూల్చివేయబడుతుంది. ఇంతకు ముందు దేవుడు పంపిన ప్రవక్తలను వారు హింసించి, చంపారు. తరువాత వచ్చిన దేవుని ప్రవక్త, దేవుని కుమారుడు ప్రభువైన యేసు క్రీస్తును కూడా హింసించి, చంపారు.ఇంతకు ముందు వారు అన్యజనుల రాజుల క్రింద దాసులు అయ్యారు.తరువాత కూడా అన్యజనుల రాజుల క్రింద దాసులు అగుట చూస్తున్నాము. అంటే చరిత్ర పునరావృతం కావుట చూస్తున్నాము.

    70 వారముల ప్రవచనములో ఆరు విషయాలు స్పష్టముగా మనకు కనిపిస్తున్నాయి.

సబ్బాతు

యెరూషలేము

దేవాలయము 

మానవ పాపము

దేవుని నీతి 

అభిశక్తుడు 

Daniel70years5042020

     ఈ 70 వారములు ఎప్పుడు మొదలవుతున్నాయి? క్రీ. పూ 444 సంవత్సరములో. ఆ సంవత్సరము పర్షియా రాజు అర్తహషస్త యెరూషలేము నిర్మాణము కొరకు ఆజ్ఞ ఇచ్చాడు.అప్పుడు ఈ 490 సంవత్సరములు మొదలయినాయి. ఈ ప్రవచనము 3 భాగాలు చేయబడింది. మొదటి భాగములో 7 వారములు అంటే 49 సంవత్సరములు, రెండో భాగములో 62 వారములు అంటే 434 సంవత్సరములు, మూడో భాగములో ఒక వారము అంటే 7 సంవత్సరములు మనకు కనిపిస్తున్నాయి. మొదటి రెండు భాగములు ముగిసినవి. 49 ప్లస్ 434 కలిపితే 483 సంవత్సరములు.అంటే 490 సంవత్సరాల్లో 483 సంవత్సరములు ముగిసినవి.ఇంకొక 7 సంవత్సరములు భవిష్యత్తులో సంభవిస్తాయి. అంటే ఈ 70 వారముల ప్రవచనములో గతము ఉంది, భవిష్యత్తు ఉంది. మనము ప్రస్తుతము 69 వ వారమునకు 70 వారమునకు మధ్యలో ఉన్నాము. 70 వారము 7 ఏడేండ్ల శ్రమల కాలము.దేవుడు యూదులకు మాత్రమే కాదు, ప్రపంచము మొత్తానికి తీర్పు తీర్చే సమయము. పోయిన సారి మనము సబ్బాతు గురించి చెప్పుకొన్నాము.

Daniel70weeks5072020

    వారమునకు ఒక రోజు సబ్బాతు దినము, ప్రతి ఏడో సంవత్సరము సబ్బాతు సంవత్సరం.దేవుడు సబ్బాతు ఆచరించమని యూదులకు ఆజ్ఞాపించాడు.రెండు కారణములు వారికి చెప్పాడు.మొదటిగా నిర్గమ 20:10 నేను ఆరు రోజుల్లో ఈ విశ్వాన్ని, మిమ్ములను సృష్టించాను. 7 రోజు మీకు విశ్రాంతి దినము.ఆ రోజు మీరు నన్ను సృష్టికర్తగా జ్ఞాపకం చేసుకోవలసిన రోజు. విశ్వం యొక్క ఉనికి ఆరాధనతో ముడిపెట్టబడి ఉంది. రెండో కారణము ద్వితీయోప దేశ కాండము 5:15 లో మనం చూస్తున్నాము.నువ్వు ఐగుప్తు దేశములో బంధించబడినప్పుడు నేను నిన్ను విడిపించాను.దానిని బట్టి విశ్రాంతి దినము రోజు నువ్వు నన్ను జ్ఞాపకము చేసుకొని ఆరాధన చేయి. నన్ను సృష్టికర్తగా, విమోచకునిగా ఆరాధించు. దేవుడు యూదుల ద్వారా అన్యులకు కూడా అదే సందేశము పంపాడు. అమెరికా దేశములో డెన్నిస్ ప్రాగర్ అనే యూదు మేధావి ఉన్నాడు. ప్రతి రోజు రేడియో లో ఆయన సందేశాలు ఇస్తాడు.Ten Commandments Still the best moral code పది ఆజ్ఞలు ఇప్పటికీ గొప్ప నైతిక నియమాలు అనే పుస్తకము వ్రాశాడు. నిన్న నేను కొంతసేపు ఆయనతో మాట్లాడాను.ఆయన ఏమన్నాడంటే, దేవుడు యూదుల మైన మాకు పది ఆజ్ఞలు ఇచ్చాడు.ఆ ఆజ్ఞలు ప్రపంచానికి తెలియజేయవలసిన బాధ్యత కూడా మా మీద పెట్టాడు.‘నీ పొరుగువాని దేమీ దొంగిలించకూడదు’ అని దేవుడు అన్నాడు. ఈ రోజు మన సమాజం దొంగలతో నిండి పోయింది. తమకు చెందని వాటిని వీరు దొంగిలిస్తున్నారు అన్నాడు.ఆయన మాటలు నిజమే. నేను సృష్టికర్తను, నేను మీ విమోచకుణ్ణి అని ఆయన యూదులతో అన్నాడు. ప్రభువైన యేసు క్రీస్తు మన సృష్టికర్త, మన విమోచకుడు. 

     అయితే ఈ ప్రపంచము ఆ సత్యాలను వ్యతిరేకించింది.యేసు క్రీస్తు మా సృష్టికర్త కాదు, డార్విన్ చెప్పినట్లు మేము చింపాంజీల వంటి జంతువులలో నుండి ఉద్భవించాము. దేవుడు మమ్ములను చేయలేదు, మేము జీవ పరిణామము వలన పుట్టాము అంటున్నారు. సృష్టికర్తను వీరు తృణీకరించారు. యేసు క్రీస్తు విమోచకుడు అనే సత్యము కూడా వీరు వ్యతిరేకించారు. సిలువ మాకు అక్కర లేదు. మేము ఏ పాపములు చేయలేదు. మమ్ములను మేము రక్షించుకొంటాము, మా ప్రగతి మా చేతుల్లోనే ఉంది. మాకు దేవుని సహాయము అక్కర లేదు అని ఈ అన్య జనులు అంటున్నారు.దేవుడు సృష్టికర్త, విమోచకుడు ఈ రెండు సత్యాలను ఆ విధముగా యూదులు, అన్యులు ఇద్దరూ త్రోసిపుచ్చారు. దేవుడు ఇద్దరినీ శిక్షిస్తాడు. ఆదివారము ఎంత మంది దేవుని సన్నిధికి వెళ్లి ఆయనను ఆరాధిస్తున్నారు? సినిమా హాళ్లకు, బార్లకు, పార్కులకు, స్టేడియం లకు వెళ్లేవారే ఎక్కువ మంది ఉంటారు. యూదులను శిక్షించినట్లుగానే దేవుడు అన్యులను కూడా శిక్షిస్తాడు. 7 వారము, చివరి వారములో జరుగబోయేది అదే.ఆ వారములో దేవుడు యూదులను, అన్యులను ఇద్దరినీ కలిపి శిక్షిస్తాడు. అది ప్రపంచ చరిత్రకు క్లైమాక్స్.అప్పుడు ఇద్దరి మీదకు దేవుని కోపం దిగి వస్తుంది.

  1. యెరూషలేము: దేవుడు మానవ చరిత్రలో యెరూషలేముకు ప్రాధాన్యత ఇచ్చాడు. యెరూషలేము తో పోల్చితే ఇతర నగరాల్లోజనం ఎక్కువ ఉండవచ్చు, వాటిల్లో ఐశ్వర్యము ఎక్కువ ఉండవచ్చు, వాటిల్లో స్థిరత్వము ఎక్కువ ఉండవచ్చు, వాటిల్లో అందము ఎక్కువ ఉండవచ్చు. అయితే, మనిషిని విమోచించడానికి దేవుడు యెరూషలేమును ఎన్నుకొన్నాడు.అక్కడే దావీదు రాజు పరిపాలన చేసాడు. అక్కడే సొలొమోను దేవుని ఆలయము నిర్మించాడు.అక్కడే యేసు ప్రభువు సిలువ వేయబడ్డాడు, అక్కడ నుండే ఆయన పరలోకానికి వెళ్ళాడు,రెండవ రాకడలో ఆయన సరాసరి యెరూషలేము వెళ్తాడు, అక్కడ నుండే భూలోకాన్ని పరిపాలిస్తాడు. ఈ ప్రవచనంలో యెరూషలేముకు కేంద్ర స్థానము ఇవ్వబడింది.క్రీ.పూ 444 లో యెరూషలేము నిర్మాణము కొరకు ఇవ్వబడిన ఆజ్ఞతో ఈ ప్రవచనము మొదలయ్యింది. 25 వచనంలో

పట్టణపు రాచవీధులును కందకములును మరల కట్టబడును. 

     యెరూషలేము కట్టబడుతుంది అన్నాడు. ఆ ప్రవచనము నెరవేరింది. నెహెమ్యా మొదలుకొని, హేరోదు రాజు వరకు యెరూషలేము ను చక్కగా నిర్మించారు. 26 వచనము లోవచ్చునట్టి రాజు యొక్క ప్రజలు పవిత్ర పట్టణమును పరిశుద్ధ ఆలయమును నశింపజేయుదురు. వచ్చునట్టి రాజు అంటే క్రీస్తు  విరోధి, అంత్య క్రీస్తు. ఈ అంత్య క్రీస్తు ప్రజలు ఎవరంటే రోమన్లు. వారు పవిత్ర పట్టణమును నాశనము చేశారు. యెరూషలేము రోమన్ల చేతిలో నాశనము చేయబడుతుంది అని యేసు ప్రభువు కూడా చెప్పాడు. క్రీస్తు శకం 70 సంవత్సరములో ఈ  ప్రవచనము నెరవేరింది. రోమన్ జనరల్ టైటస్  యెరూషలేమును నామ రూపాలు లేకుండా నాశనం చేశారు. 

Titus

    అయితే, యెరూషలేము పని అయిపోలేదు.2000 సంవత్సరాల తరువాత దేవుడు యూదులకు యెరూషలేమును తిరిగి అప్పగించాడు. డోనాల్డ్ ట్రంప్ కూడా ఇశ్రాయేలు దేశానికి యెరూషలేమును అధికారిక రాజధానిగా ప్రకటించాడు. యేసు క్రీస్తు తిరిగివచ్చిన తరువాత యెరూషలేము స్వర్ణ యుగములో ప్రవేశిస్తుంది. క్రీ.పూ 586 లో నెబుకద్నెజరు దానిని నాశనము చేశాడు, క్రీ.శ 70 లో టైటస్ దానిని నాశనం చేసాడు, భవిష్యత్తులో అంత్య క్రీస్తు దానిని నాశనం చేస్తాడు, అయితే చివరిగా ప్రభువైన యేసు క్రీస్తు దానిని రక్షించి, పునర్నిర్మిస్తాడు.

3.దేవాలయము: ఈ ప్రవచనంలో మూడవదిగా మనకు దేవాలయము కనిపిస్తున్నది. 26 వచనములో మనం చదివాము.

వచ్చునట్టి రాజు యొక్క ప్రజలు పవిత్ర పట్టణమును పరిశుద్ధ ఆలయమును నశింపజేయుదురు

పరిశుద్ధ ఆలయం యెరూషలేములో ఉంది. సొలొమోను కట్టిన ఆలయాన్ని నెబుకద్నెజరు కూల్చివేశాడు. ఈ టైం లైన్ చూడండి.

TimelineJewishexilesreturnTelugu

 

క్రీ పూ 586 లో దేవుని ఆలయము కూల్చివేయబడింది. క్రీ. పూ 538 లో దానియేలుకు ఈ ప్రవచనం ఇవ్వబడినప్పుడు యెరూషలేములో దేవుని ఆలయము లేదు. ఇంకో 22 సంవత్సరాల తరువాత క్రీస్తు పూర్వం 516 లో దేవాలయం పునర్నిర్మాణం జరిగింది. దేవుడు ఈ ప్రవచనంలో దానియేలుతో ఏమని చెబుతున్నాడంటే, ‘ఇంకో ఆలయం కట్టబడుతుంది,  దానిని కూడా అన్యజనులు కూల్చివేస్తారు’ ఆ మాట విని దానియేలు షాక్ తిని ఉంటాడు. ఒకటి పోయి ఏడుస్తున్నాము, ఇంకొకటి కడుతారు అంటున్నావు, దానిని కూడా అన్యజనులు కూల్చివేస్తారా? అని ఆయన విచారించి ఉంటాడు. యేసు ప్రభువు కూడా విచారించాడు.‘రాయి మీద రాయి లేకుండా ఈ ఆలయము కూల్చివేయబడుతుంది’ అని ఆయన స్పష్టముగా తన శిష్యులకు చెప్పాడు.దేవుని మాట వినకుండా మనము ఎన్ని ఆలయాలు కట్టుకొన్నా వ్యర్థమే.

27 వచనము చూద్దాము: 

అతడు ఒక వారమువరకు అనేకులకు నిబంధనను స్థిరపరచును; 

అర్ధవారమునకు బలిని నైవేద్యమును నిలిపివేయును హేయమైనది

నిలుచువరకు నాశనము చేయువాడు వచ్చును

యూదులు కట్టబోయే మూడో ఆలయము గురించి ఇక్కడ మనం చూస్తున్నాము. బలులు, నైవేద్యాలు ఇందులో వారు చేస్తారు. అయితే అంత్య క్రీస్తు దానిని అపవిత్రం చేస్తాడు. నాశనకరమైన హేయవస్తువు ను ఆయన అక్కడ నిలుపుతాడు. ఒలీవల కొండ మీద ప్రసంగములో యేసు ప్రభువు కూడా ఈ ప్రవచనమును తన శిష్యులకు గుర్తు చేసాడు. మత్తయి సువార్త 24:15 లో మనము చదువుతాము: 

కాబట్టి ప్రవక్తయైన దానియేలుద్వారా 

చెప్పబడిన నాశనకరమైన హేయవస్తువు

పరిశుద్ధస్థలమందు నిలుచుట మీరు

చూడగానే చదువువాడు గ్రహించుగాక

JesusonMtOlivespredictsdestructionoftemplegoodsalt

   యేసు ప్రభువు ఈ మాటలు చెప్పినప్పుడు యెరూషలేము లో దేవుని ఆలయము ఉంది. అది కూల్చివేయబడుతుంది అని ఆయనకు తెలుసు. దానిని బట్టి, ఆయన భవిష్యత్తులో నిర్మించబోయే ఆలయము గురించి ఈ మాటలు చెప్పాడని మనకు అర్థమవు చున్నది. అది మనకు కూడా భవిష్యత్తే. ఎందుకంటే యెరూషలేములోఇప్పుడు ఆలయము లేదు. అది భవిష్యత్తులో కట్టబడుతుంది. దానిని క్రీస్తు విరోధి అపవిత్రం చేస్తాడు.అని యేసు ప్రభువు అని యేసు ప్రభువు మనకు స్పష్టముగా చెప్పాడు. ఆ విధముగా యూదుల యొక్క మూడు దేవాలయములను అన్య జనులు అపవిత్రం చేస్తారు. దానికి కారణము ఏమిటంటే, యూదులు దేవుని వాక్యాన్ని కాకుండా అన్యజనుల మాటే విన్నారు కాబట్టి వారి ఆలయాలకు దేవుని దృష్టిలో విలువ లేదు. ఏ మనిషి కూల్చలేని ఆలయము యేసు క్రీస్తు కట్టిన దేవుని ఆలయము. ప్రతి విశ్వాసి అందులో ఒక రాయిగా ఉన్నాడు. ఆ తరువాత రెండు అంశాలు మీరు గమనించండి. మానవ పాపము, దేవుని నీతి. ఈ ప్రవచనములో 6 లక్ష్యాలు చెప్పబడ్డాయి. మొదటి మూడు మానవ పాపము గురించి చెబితే, తరువాత మూడు దేవుని నీతి గురించి చెబుతున్నాయి.

Daniel70weeks6goals

24 వచనము చూద్దాము: 

1.తిరుగుబాటును మాన్పుటకును, 

to finish the Transgression

2.పాపమును నివారణ చేయుటకును, 

to make an end of sins 

3.దోషము నిమిత్తము ప్రాయశ్చిత్తము చేయుటకును, 

to make reconciliation for iniquity 

4.యుగాంతము వరకుండునట్టి 

నీతిని బయలు పరచుటకును, 

to bring in everlasting righteousness 

5.దర్శనమును ప్రవచనమును ముద్రించుటకును, 

to seal up the vision and prophecy 

6.అతి పరిశుద్ధ స్థలమును అభిషేకించుటకును, 

to anoint the Most Holy 

ఈ 6 లక్ష్యాలు నెరవేర్చింది ప్రభువైన యేసు క్రీస్తే. 

మొదటిగా, 

1.తిరుగుబాటును మాన్పుటకును, 

to finish the Transgression

మనము దేవుని మీద తిరుగుబాటు చేశాము. మనలను దేవునితో కలపడానికే యేసు క్రీస్తు ఈ లోకానికి వచ్చాడు. ఈ ప్రవచనము దానియేలుకు ఇచ్చిన గాబ్రియేలు దేవ దూత 500 సంవత్సరాల తరువాత కన్య మరియతో చెప్పాడు: ‘తన ప్రజలను వారి పాపములనుండి ఆయనే రక్షించును గనుక ఆయనకు యేసు అను పేరు పెట్టుదువు’ (మత్తయి 1:21) 

2.పాపమును నివారణ చేయుటకును, 

to make an end of sins 

బలులు, అర్పణలు ఎన్ని కోట్ల సార్లు అర్పించినా అవి మన పాపములను నివారణ చేయలేవు. యేసు క్రీస్తు ప్రభువు అర్పించిన ఒక్క బలి ద్వారానే అది సాధ్యపడింది. 

అయితే ఆయన యుగముల సమాప్తియందు తన్నుతానే బలిగా అర్పించుకొనుటవలన పాపనివారణ చేయుటకైయొక్కసారే ప్రత్యక్షపరచ బడెను.

                                                                      హెబ్రీ 9:26 

3.దోషము నిమిత్తము ప్రాయశ్చిత్తము చేయుటకును, 

to make reconciliation for iniquity 

మన దోషము నిమిత్తము ప్రాయశ్చిత్తము చేసింది కూడా యేసు క్రీస్తు ప్రభువే.ఆయన సిలువ ద్వారా ఆయన చేసింది అదే. 

యెషయా 53:10 లో మనము చదువుతాము. 

అతని నలుగగొట్టుటకు యెహోవాకు ఇష్టమాయెను ఆయన అతనికి వ్యాధి కలుగజేసెను. అతడు తన్నుతానే అపరాధపరిహారార్థబలి చేయగా అతని సంతానము చూచును.

రోమా 5:10 లో మనము చదువుతాము: 

ఏలయనగా శత్రువులమై యుండగా, ఆయన కుమారుని మరణముద్వారా మనము దేవునితో సమాధాన పరచబడిన యెడల సమాధానపరచబడిన వారమై,ఆయన జీవించుటచేత మరి నిశ్చయముగా రక్షింపబడుదుము. కొలస్సి 1:20 

ఆయన సిలువరక్తముచేత సంధిచేసి, ఆయనద్వారా సమస్తమును, అవి భూలోకమందున్నవైనను పరలోక మందున్నవైనను, వాటినన్నిటిని ఆయన ద్వారా తనతో సమాధానపరచుకొన వలెననియు తండ్రి అభీష్టమాయెను. హెబ్రీ 2:17 

కావున ప్రజల పాపములకు పరిహారము కలుగజేయుటకై, దేవుని సంబంధమైన కార్యములలో కనికరమును నమ్మకమునుగల ప్రధానయాజకుడగు నిమిత్తము, అన్నివిషయములలో ఆయన తన సహోదరుల వంటివాడు కావలసివచ్చెను.

మన పాపములకు ప్రాయశ్చిత్తము చేయుటకు దేవుడు మానవుడిగా మన మధ్యలోకి వచ్చాడు. 

ఆ తరువాత, నీతి విషయములో 3 విషయాలు చెప్పబడ్డాయి.

4.యుగాంతము వరకుండునట్టి నీతిని బయలు పరచుటకును, 

to bring in everlasting righteousness 

నీతిమంతుడైన నా సేవకుడు జనుల దోషములను భరించి నకున్న అనుభవజ్ఞానము చేత అనేకులను నిర్దోషులుగా చేయును.               యెషయా 53:11 

యెహోవా ఈలాగు ఆజ్ఞ ఇచ్చుచున్నాడు రాబోవు దినములలో నేను దావీదునకు నీతి చిగురును పుట్టించెదను; 

అతడు రాజై పరిపాలన చేయును, అతడు వివేకముగా నడుచుకొనుచు కార్యము జరిగించును, భూమిమీద నీతి న్యాయములను జరిగించును.                                                               యిర్మీయా 23:5-6 

    ఆ నీతి చిరుగు ఎవరు అంటే యేసు క్రీస్తే. యేసు క్రీస్తు నందు ఉండి మనము దేవుని ఎదుట నీతి మంతులముగా తీర్చబడ్డాము. 

5.దర్శనమును ప్రవచనమును ముద్రించుటకును, 

to seal up the vision and prophecy 

అన్ని దర్శనాలు, అన్ని ప్రవచనాలు ముద్రించబడాలి. సీల్ వేయాలి. వాటి మీద దేవుని స్టాంప్ వేయాలి. అప్పుడే వాటికి విలువ. ఆ దర్శనాలు, ప్రవచనాలకు  సీల్ వేసింది ప్రభువైన యేసు క్రీస్తే. ఎందుకంటే అవన్నీ ఆయన వైపే చూపిస్తున్నాయి. 

6.అతి పరిశుద్ధ స్థలమును అభిషేకించుటకును, 

to anoint the Most Holy 

వెయ్యేళ్ళ పాలనలో ఒక గొప్ప దేవాలయము నిర్మించబడుతుంది.యెహెఙ్కేలు గ్రంథము 40 – 48 అధ్యాయాల్లో దాని గురించి మనము చదువుతాము. దానిని అభిషేకించేది ప్రభువైన యేసు క్రీస్తే. మన ప్రధాన యాజకుడిగా అక్కడ ఆయన మనకు కనిపిస్తున్నాడు. 

  1. అభిశక్తుడు 

26 వచనములో మనం చూద్దాము: 

ఈ అరువది రెండు వారములు 

జరిగిన పిమ్మట ఏమియు లేకుండ అభిషిక్తుడు 

నిర్మూలము చేయబడును. 

69 వారముల తరువాత అభిషిక్తుడు నిర్మూలము చేయబడతాడు. 

Messiah shall be cut off.

ఆ ప్రవచనము సిలువ దగ్గర నెరవేరింది. క్రీస్తు పూర్వము 444 నుండి 483 సంవత్సరాలు మనలను క్రీస్తు శకం 33 సంవత్సరమునకు తీసుకు వస్తున్నాయి. ఆ సంవత్సరము పస్కా పండుగ రోజున మెస్సియా అంటే యేసు క్రీస్తు సిలువ వేయబడ్డాడు.  ఆ విధముగా యేసు క్రీస్తు సిలువ దగ్గర ఈ ప్రవచనము నెరవేరింది. అభిషక్తుడు అంటే యేసు క్రీస్తు. క్రీస్తు అంటేనే అభిషేకించబడిన వాడు అని అర్థం.

Daniel70years5042020

    దానియేలు గ్రంథము 9 అధ్యాయము నుండి ఈ  రోజు 70 వారములు అనే ప్రవచనము మనము చూశాము. బైబిల్ లో అన్నిటి కంటే గొప్ప ప్రవచనముగా ఇది మనకు కనిపిస్తున్నది. ప్రపంచ చరిత్ర, యూదుల చరిత్ర, యెరూషలేము చరిత్ర, యేసు క్రీస్తు సిలువ అన్నీ అందులో ఇవ్వబడ్డాయి. యేసు క్రీస్తు ప్రభువు ఏ సంవత్సరములో సిలువ వేయబడతాడో కూడా దేవుడు దానియేలు ప్రవక్తకు ముందుగానే తెలియజేశాడు. దాని ద్వారానే మనకు పాప క్షమాపణ, దేవుని నీతి లభిస్తున్నాయి. 

Leave a Reply