అపోస్తలుడైన పౌలు – క్రైస్తవ నాయకత్వము: 12 లక్షణాలు – డాక్టర్ పాల్ కట్టుపల్లి

 

అంత్య దినాల్లో క్రైస్తవ సంఘాల్లో కొరవడే ముఖ్యమైన అవసరము క్రైస్తవ నాయకత్వము.  అపోస్తలుల కార్యములు 27 అధ్యాయము నుండి క్రైస్తవ నాయకత్వము ఎలా ఉండాలో మనము చూద్దాము. పౌలు గారు ఎంతో గొప్ప దేవుని సేవ చేశాడు. తన సువార్త సందేశముతో నాటి ప్రపంచాన్ని కదిలించాడు. ఆయన పరిచర్యను చూసి యూదా మత నాయకులకు కన్నుకుట్టింది. సాతాను వారిలో ప్రవేశించాడు. ఆయన మీద లేనిపోని నిందలు వేసి కేసులు బుక్ చేశారు. 

    యెరూషలేములో ఆయనను అరెస్ట్ చేశారు. కైసరియ పట్టణానికి తీసుకొనివెళ్ళారు. ఈ కైసరియ పట్టణము మధ్యధరా సముద్రము ఒడ్డున ఉంది. హేరోదు రాజు ఇక్కడ ఎన్నో గొప్ప భవనాలు నిర్మించాడు. అది ఇశ్రాయేలు దేశానికి అధికార రాజధానిగా ఉంది. రోమన్ గవర్నర్ ఆ పట్టణములోనే ఉండేవాడు. ప్రభువైన యేసు క్రీస్తుకు సిలువ శిక్ష విధించిన పిలాతు ఇక్కడే ఉండేవాడు.ఇప్పుడు ఫెలిక్స్ రోమన్ గవర్నర్ గా ఉన్నాడు. పౌలు గారిని న్యాయ విచారణ నిమిత్తము యెరూషలేము నుండి కైసరియ తీసుకు వచ్చారు. అక్కడ మొదట ఫెలిక్స్ ముందు, ఆ తరువాత ఫేస్తు ముందు, ఆ తరువాత అగ్రిప్ప ముందు ఆయనను హాజరుపరచారు.వారి దగ్గర ఆధారాలు ఉంటే ముగ్గురు జడ్జిలు అక్కరలేదు. ఒక్క జడ్జి చాలు. వారి కేసుల్లో డొల్లతనము అక్కడే మనకు కనిపిస్తున్నది.అందుకనే ముగ్గురు జడ్జిలు పౌలును విచారించినప్పటికీ ఆయనలో ఎలాంటి తప్పు వారు చూడలేకపోయారు. అయినప్పటికీ పౌలుకు నిర్దోషిగా విడిచిపెట్టలేకపోయారు. ఆయనకు న్యాయము చేయలేకపోయారు. పౌలు గారు రోమన్ పౌరుడు. రోమ్ లో కైసరు ఎదుట న్యాయము కోసము ప్రయత్నిస్తాను అన్నాడు. కైసరు కోర్ట్ ఆ రోజుల్లో సుప్రీమ్ కోర్ట్.కైసరు చివరి తీర్పు ఇస్తాడు. ఆ రోజుల్లో నీరో రోమన్ చక్రవర్తిగా ఉన్నాడు. అతడు ఒక పెద్ద సైకో.  

     ఈ నీరో ముందు హాజరవటానికి పౌలు కైసరియ నుండి రోమ్ నగరానికి బయలుదేరాడు. అది చాలా దూర ప్రయాణము. సంక్షిష్టమైన ప్రయాణము. మధ్యధరా సముద్రములో చాలా పెద్ద, పెద్ద తుఫానులు వచ్చే సమయము. రోమన్ శతాధిపతి యూలి పౌలుతో పాటు ఇతర ఖైదీలను, వారికి కాపలా కాసే సైనికులను తీసుకొని బయలుదేరాడు. వారు ప్రయాణించే ఓడ పెద్ద సంక్షోభములో చిక్కుకోబోతున్నది. పౌలు గారి నాయకత్వ లక్షణాలు ఈ సంక్షోభములో మనకు స్పష్టముగా కనిపిస్తున్నాయి.ఆ నాయకత్వ లక్షణాలు మనకు చూపించటానికి పరిశుద్ధాత్ముడు ఈ అధ్యాయాన్ని వ్రాయించాడు. ఈ నాయకత్వ లక్షణాలు మనమందరమూ నేర్చుకొంటే మంచిది.

 1. వెంబడించుట (27:1)

    మొదటిగా దేవుని వెంబడించుట. నాయకులంటే  మనము పెద్ద పెద్ద వారిని ఊహించుకొంటాము. అయితే మనమందరమూ నాయకులమే. ప్రతి వ్యక్తీ ఒక నాయకుడే. మా ఇంట్లో నేను నాయకుణ్ణి. నా భార్యకు నేను నాయకుణ్ణి, నా ముగ్గురు పిల్లలకు  నేను నాయకుణ్ణి. ఉద్యోగానికి వెళ్తే అక్కడ నా టీమ్ లో నేను నాయకుణ్ణి. ఆ విధముగా మీరు కూడా మీరు ఎక్కడ ఉంటే అక్కడ నాయకులే. 

  పౌలు ఏ పరిస్థితి లో ఉన్నప్పటికీ ఆయన దేవుని వెంబడిస్తున్నాడు. ఇక్కడ ఆయన చేతికి సంకెళ్లతో ఆ ఓడ లో ప్రవేశించాడు. ఆయనను చూసిన వారు ఆయన నాయకుడు అని అనుకోరు. నాయకుడు అంటే సూటు, బూటు వేసుకొని వీడియో కాన్ఫరెన్స్ లో మాట్లాడుతున్నట్లు మనము ఊహించుకొంటాము. అయితే దేవుని నాయకుడు ఆ విధముగా లేడు. మాసిపోయిన దుస్తులు, నెరసిన గడ్డముతో సంకెళ్లు వేసుకొని ఖైదీగా ఉన్నాడు. ఆ ఓడలో ఉన్నవారు ఊహించి ఉండరు. ఒక ఖైదీ మాకు నాయకుడా అని వారు అనుకొని ఉండవచ్చు. అయితే దేవుడు మీతో ఉన్నప్పుడు మీరు ఎక్కడ ఉన్నా, ఎలా ఉన్నా మీరే నాయకులు. 

   యోసేపు సంకెళ్లతో ఐగుప్తు చెరశాలలో ఉన్నాడు. బానిసగా ఉన్నాడు. అయితే ఐగుప్తును రక్షించే దేవుని నాయకుడు ఆయనే. మోషే గొఱ్ఱెలను కాచుకొనే వాడుగా ఉన్నాడు. గొఱ్ఱెలను కాచుకొనే నువ్వు ఈ ప్రజలను నా చేతిలో నుండి విడిపించగలవా అని ఫరో ఈసడించుకొన్నాడు. అయితే ఇశ్రాయేలీయులను రక్షించే దేవుని నాయకుడు ఆయనే. దావీదు కూడా గొఱ్ఱెలను కాచుకొనే బాలునిగా ఉన్నాడు. అయితే ఇశ్రాయేలీయులను పాలించే దేవుని నాయకుడు ఆయనే. దానియేలు బబులోనుకు ఒక ఖైధీ గా వెళ్ళాడు. అయితే తన ప్రజలను నడిపించే దేవుని ప్రవక్త ఆయనే. నెహెమ్యా పర్షియా దేశములో రాజుకు ద్రాక్షారసము గ్లాసులు అందిస్తూ బ్రతుకుతున్నాడు. యెరూషలేము గోడలు కట్టే నాయకత్వ బాధ్యతలు ఆయన తీసుకొన్నాడు. గ్లాసులు అందించేవాడివి గోడలు ఎలా కడుతావు? అని ఆయనను అపహాస్యము చేశారు. అయితే ఆ పట్టణాన్ని నిర్మించుటకు దేవుడు పిలిచిన నాయకుడు ఆయనే. 

   ఇక్కడ పౌలు సంకెళ్లు వేసుకొని ఖైధీగా ఉన్నాడు. ఒక ఖైధీ నాయకుడా అని ఓడలో ఉన్న వారు అనుకొన్నారు. పౌలు దేవుని వెంబడిస్తున్నవాడు. సంకెళ్లతో ఉన్నా ఆయనే నాయకుడు. ఆయన దేవుని చిత్తములో ప్రతి అడుగూ వేస్తున్నాడు. మేడలో ఉన్నా, ఓడలో ఉన్నా, జైలులో ఉన్నా, జర్నీ లో ఉన్నా ఆయనే నాయకుడు. క్రైస్తవ నాయకునికి లేక క్రైస్తవ నాయకురాలికి ఉండవలసిన మొదటి లక్షణము దేవుని వెంబడించుట. 

  ఆ ఓడ  ఒక పెద్ద తుఫానులో చిక్కుకోబోతున్నది. ఒక పెద్ద సంక్షోభములో చిక్కుకోబోతున్నది. ప్రతి సంక్షోభము నాయకత్వానికి విషమ పరీక్ష పెడుతుంది. చైనా దేశములో మొదలైన కరోనా వైరస్ వలన  ఇప్పటికే లక్షలమంది  ప్రాణాలు కోల్పోయారు. అనేక ప్రపంచ దేశాల శక్తివంత మైన నాయకులకు ఈ వైరస్ పరీక్ష పెట్టింది. 

హిట్లర్ రెండో ప్రపంచ యుద్ధాన్ని ప్రపంచము మీద రుద్దాడు. లక్షల మంది ప్రజలు ప్రాణాలు కోల్పోతున్నారు. ఆ సమయములో ఇంగ్లాండ్ దేశ ప్రధాని విన్స్టన్ చర్చిల్ నాయకత్వ బాధ్యతలు తీసుకొన్నాడు. రెండో ప్రపంచ యుద్ధాన్ని ఆపగలిగాడు. 1961 లో జాన్ కెన్నెడీ క్యూబా దేశము అధ్యక్షుడు ఫిడెల్ క్యాస్ట్రో మీదకు తిరుగుబాటు లేవనెత్తాడు. క్యాస్ట్రో జోలికి వస్తే చూస్తూ ఊరుకోము అని రష్యా అమెరికాను హెచ్చరించింది. అణుబాంబులు, క్షిపణులను పంపించింది. ప్రపంచము అణు యుద్ధము అంచుకు వెళ్ళింది. ప్రజలు ఏమనుకొన్నారు? విన్స్టన్ చర్చిల్ మంచి నాయకుడు. రెండవ ప్రపంచ యుద్ధము – పెద్ద సంక్షోభము నుండి ప్రపంచాన్ని రక్షించాడు. ఓ జాన్ కెన్నెడీ, ఈయన ఎక్కడ దొరికాడు బాబూ, అందరినీ కెలుకుతాడు, ఈయన పనుల వలన మూడో ప్రపంచ యుద్ధము వచ్చేటట్లు ఉంది అన్నారు. నాయకుడు సంక్షోభాలను అంతము చేయాలి కానీ వాటిని సృష్టించకూడదు. పౌలు గారు ఆ సంక్షోభాన్ని సృష్టించలేదు. వారు సృష్టించిన సంక్షోభములో నుండి వారిని రక్షించాడు.

 1. సహోదరత్వము  (27:2) 

    రెండో నాయకత్వ లక్షణము సహోదరత్వము. రెండో వచనములో చూస్తే, ‘ఓడనెక్కి మేము బయలుదేరితివిు; మాసిదోనీయుడును థెస్సలొనీక పట్టణస్థుడునైన అరిస్తార్కు మాతోకూడ ఉండెను’ (27:2) మేము అంటే ఇక్కడ ఈ గ్రంథ రచయిత లూకా మాట్లాడుతున్నాడు. ఆయన కూడా పౌలు వెంట బయలుదేరాడు. అరిస్తార్కు అనే మరొక సహోదరుడు కూడా పౌలుకు సహచరునిగా బయలుదేరాడు. ‘పౌలు పని అయిపొయింది. ఇదే ఆయన అంతిమ యాత్ర. రోమ్ వెళ్లి ఇక తిరిగిరాక పోవచ్చు. ఆయనను ఓడ ఎక్కించి మన దారిన మనము పోదాము’ అని వారు అనుకోలేదు. ‘ఇన్ని సంవత్సరాలు ఈయనతో కలిసి పరిచర్య చేసాము. ఇప్పుడు ఈయన ఇబ్బందుల్లో ఉన్నాడు.ఆయనకు సహాయము చేద్దాము’ అని వారు అనుకొన్నారు. ఆయనకు తోడుగా వారు కూడా ఓడలో ప్రవేశించారు. మనము కష్టాల్లో ఉన్నప్పుడు ఇతర విశ్వాసులు ఇచ్చే తోడ్పాటు ఎంతో విలువైనది. పౌలు అటువంటి సహోదరత్వమును ఇతరులకు చూపించాడు. ఆయన పొందాడు.

 1. నమ్మకత్వము (27:3) 

3 వచనము చూద్దాము: మరునాడు సీదోనుకు వచ్చితివిు. అప్పుడు యూలి పౌలు మీద దయగా ఉండి, అతడు తన స్నేహితులయొద్దకు వెళ్లి పరామరిక పొందుటకు అతనికి సెలవిచ్చెను. ఓడ కైసరియ నుండి బయలుదేరి సీదోనుకు వచ్చింది. రోమన్ శతాధిపతి, ‘పౌలు, ఈ ఊరిలో ఉన్న నీ స్నేహితులను చూసుకొనిరా’ అన్నాడు. ఒక ఖైధీ ని వెళ్లి ‘నీ స్నేహితులతో గడిపి రా అని’ ఒక పోలీస్ ఆఫీసర్ విడిచిపెడతాడా? ఒక ఖైదీ తప్పించుకొంటే ఇప్పుడు పోలీస్ అధికారిని సస్పెండ్ చేస్తే గొప్ప. కానీ ఆ రోజుల్లో ఒక ఖైధీ తప్పించుకొంటే రోమన్ అధికారికి మరణ శిక్ష విధిస్తారు. అయినప్పటికీ ఈ శతాధిపతి యూలి పౌలును ఎంతగా నమ్మాడో మీరు గమనించండి. పౌలు సాక్ష్యము అలాంటిది. 16 అధ్యాయములో పౌలు, సీలలు ఫిలిప్పీ పట్టణములో జైలులో ఉన్నారు.పెద్ద భూకంపము వచ్చింది. చెర శాల తలుపులు తెరచుకొన్నాయి. జైలు అధికారి ఖైదీలు పారిపోయారనుకొన్నాడు. కత్తి తీసుకొని ఆత్మహత్యకు సిద్ధపడ్డాడు. పౌలు ఏమన్నాడు? అయ్యా, హాని చేసుకోవద్దు. మేము ఇక్కడే ఉన్నాము అన్నాడు. ఛాన్స్ దొరికింది అని ఆయన పారిపోయే రకం కాదు.  ఇక్కడ కూడా అటువంటి నమ్మకత్వమే ఆయన చూపిస్తున్నాడు. సంక్షోభము నుండి పారిపోవడము ఆయనకు అలవాటు లేదు. సంక్షోభము నీ ఇంటి తలుపు తట్టితే పారిపోవద్దు. దేవుని శక్తితో దానిని ఎదుర్కొనుము. 

 1. ఓర్పు 

     సీదోను లో ఉన్న సంఘస్తులను పరామర్శించి ఆయన తిరిగి ఓడ ఎక్కాడు. ఓడ బయలుదేరి లసయ పట్టణము చేరుకొంది. పౌలుకు పరిస్థితి అర్థము అయ్యింది.ఈ ప్రయాణము సాఫీగా సాగేది కాదు. ఆయన జీవితమంతా ఆయన సువార్త పనిలో ఎన్నో ఓడ ప్రయాణాలు చేశాడు. ఆ రూట్ లో ఆయన ఎన్నో సార్లు తిరిగాడు. మూడు  సార్లు  ఆ సముద్రములో ఆయన వెళ్తున్న   ఓడలు బద్దలు కావడము ఆయన చూశాడు. ఆ  ఆ అనుభవము ఆయనకు ఎన్నో పాఠాలు నేర్పింది. వారితో ఆయన స్పష్టముగా చెప్పాడు: ఈ ప్రయాణము మనము కొనసాగించడము మంచిది కాదు. ఈ సమయములో ఈ సముద్ర ప్రయాణము అపాయకరము. మన ప్రాణాలు పోగొట్టుకొంటాము అని వారిని హెచ్చరించాడు. అయితే శతాధిపతి పౌలు క్యారెక్టర్ ని నమ్మినట్లు, ఆయన అనుభవాన్ని నమ్మలేదు. ఓడ కెప్టెన్ ఏమన్నాడు? ఖైధీ మాట వింటున్నావా? నేను కెప్టెన్ ని, నా ట్రైనింగ్, నా ఎక్స్పీరియన్స్, నా నాలెడ్జ్ తో చెబుతున్నాను. ఈ పౌలు చెప్పినట్లు కానేకాదు. మనము ఏమీ కాదు, చక్కగా ముందుకు వెళ్ళుదాము. పౌలు, నువ్వు ఖైధీవి, ఖైదీలుగా ఉండు. అనవసరమైన సలహాలు ఇవ్వమాకు. ఓడకు కెప్టెన్ ని నేను. ఆ నిర్ణయాలు నాకు వదిలేయి అన్నాడు. 

   9 వచనములో  మనము చదువుతున్నాము : చాల కాలమైన తరువాత ఉపవాసదినముకూడ అప్పటికి గతించినందున ప్రయాణముచేయుట అపాయ కరమై యుండెను. ఈ సమయములో మనము వెళ్లకూడదు అని పౌలు చేసిన హెచ్చరికను వారు పట్టించుకోలేదు. పౌలు  గారికి ఉన్నట్లు వారికి ఓర్పు లేదు . ఒక పెద్ద గాలి తుఫానులో చిక్కుకొనుటకు వారు వెళ్ళుతున్నారు.

    1996 లో కొంతమంది వ్యక్తులు మౌంట్ ఎవరెస్ట్ పర్వత శిఖరము ఎక్కుదామని వెళ్లారు. ఆ శిఖరము ఎక్కటానికి 2 నెలలు కేటాయించాలి. 6 వారాలు పాటు శరీరాన్ని సిద్దము చేసుకోవాలి. ఆ శిఖరము 29,000 అడుగుల ఎత్తులో ఉంది. బేస్ క్యాంపు 17000 అడుగుల ఎత్తులో ఉంది. 25,900 అడుగుల ఎత్తులో క్యాంపు IV ఉంది. క్యాంపు IV నుండి ఎవరెస్ట్ శిఖరము ఎక్కడానికి 18 గంటలు పడుతుంది. సాయంత్రము 6 గంటలకు బయలుదేరితే రేపు మధ్యాహ్నానికి శిఖరానికి చేరుకొంటారు. వెంటనే బయలుదేరి సాయంకాలానికి తిరిగి క్యాంపు IV కి రావాలి. ఆ సమయము మించితే చీకటిలో మంచు తుఫానులో చిక్కుకొనే ప్రమాదం ఉంది. ఈ 8 మంది పర్వతారోహకులు బయలుదేరారు. మధ్యాహ్నానికి కూడా వారు శిఖరము చేరుకోలేకపోయారు. టీం లీడర్ వారితో ఏమన్నాడంటే, ‘మనము తిరిగి వెళ్లిపోదాము. పైకి వెళ్లి తిరిగి రావటానికి టైం లేదు.ఇంకో రోజు ట్రై చేద్దాము.’ అన్నాడు. ఆ మాటలు విని వారికి కోపం వచ్చింది. ‘ మేము ఇంత దూరము వచ్చింది ఇందుకా? తిరిగి వెళ్లిపోవటానికా? ఎంత డబ్బు ఖర్చుపెట్టాము! ఎంత శ్రమ పడి ఇంత దూరము వచ్చాము! మేము పైకి వెళ్లాల్సిందే. అక్కడ జెండాలు పాతాలి. ఫోటోలు దిగాలి’ అని ఆయన హెచ్చరికను వారు పట్టించుకోలేదు. పైకి నడుచుకొంటూ వెళ్లారు. పర్వత శిఖరము ఎక్కే సరికి సాయంత్రము 4 గంటలు అయ్యింది. అప్పుడు తిరిగి క్రిందకు దిగటము మొదలుపెట్టారు.  6 గంటలు తరువాత చీకటి పడిపోయింది. ఒక పెద్ద మంచు తుఫానులో చిక్కుకున్నారు. కళ్ళు కూడా కనిపించని పరిస్థితి వారికి కలిగింది. ఆ మంచులో కూరుకుపోయి ప్రాణాలు విడిచారు. చాలా సార్లు ఓర్పును కోల్పోయి, హెచ్చరికలు పట్టించుకోకుండా మనము ప్రాణాల మీదకు తెచ్చుకొంటాము.

   ఇక్కడ కూడా పౌలు చేసిన హెచ్చరికను వారు విని వారి ప్రయాణము మానుకోలేదు. మేము వెళ్లాల్సిందే అని ముందుకు వెళ్లారు. సముద్రము మీద పెద్ద గాలి తుఫానులో చిక్కుకున్నారు.

 1. క్షమాపణ

20 వచనము: 20. కొన్ని దినములు సూర్యుడైనను నక్షత్రములైనను కనబడక పెద్దగాలి మామీద కొట్టినందున ప్రాణములతో తప్పించు కొందుమను ఆశ బొత్తిగ పోయెను.

   సూర్యుడు కొన్ని రోజులే వారికి కనిపించలేదు. నక్షత్రాలను చూసి వాటిని గైడ్ గా పెట్టుకొని నావికులు సముద్ర ప్రయాణము చేస్తారు. వారికి నక్షత్రాలు కూడా కనిపించని పరిస్థితి వచ్చింది. సముద్రములో యెక్కడ ఉన్నారో కూడా వారు తెలుసుకోలేని పరిస్థితి వచ్చింది. ఇక మనము ప్రాణాలతో బయటపడడం అసంభవం అనుకొన్నారు. భోజనము చేయడము కూడా మరచిపోయారు. పౌలు వారిని తిట్టలేదు. ‘మూర్కులారా, నేను చెప్పిన మాట విన్నారా? నా ప్రాణాలు కూడా పోయేటట్లు ఉన్నాయి. మీ చావు మీరు చావండి’ అని ఆయన వారిని వదలివేయలేదు. వారిని క్షమించాడు. వారికి తన పరిచర్యను కొనసాగించాడు. ‘నువ్వు నా మాట వినలేదు, నీ తిక్క బాగా అణిగింది’ 

‘నువ్వు ఆ రోజు నా మాట వినలేదు, అందుకనే ఇప్పుడు అనుభవిస్తున్నావు, ఇంకో సారి నీ మోహము నాకు చూపించవద్దు’ ఆ విధముగా మనము ప్రవర్తిస్తాము. 

     ప్రభువైన యేసు క్రీస్తు తో శిష్యులు మూడున్నర సంవత్సరాలు తిరిగారు. సిలువ దగ్గర దాదాపు వారందరూ ఆయనను విడిచి పారిపోయారు. మూడున్నర సంవత్సరాలు నేను వీరిని మేపాను, బోధించాను, పరిచర్య చేశాను. అయితే, నాకు కష్టము వచ్చినప్పుడు వీరందరూ నన్ను వదలి వెళ్లిపోయారు. ఈ దద్దమ్మలు నాకెందుకు? అని ఆయన అనుకోలేదు. సమాధి నుండి తిరిగి లేచిన తరువాత ఒక్కొక్కరినీ ఆయన చేరదీశాడు.  

 అమెరికా లో నాకు ఒక స్నేహితుడు  ఉన్నాడు. ఆయన, ఆయన భార్య ఒక స్థానిక సంఘానికి వెళ్లేవారు. వారి కుమార్తెను ఆ సంఘములో ఒక నాయకుని కుమారునికి ఇచ్చి పెండ్లి చేశారు. ఒక రోజు నా మిత్రునికి ,  ఆ సంఘ నాయకునికి సంఘములో ఒక ఆర్గుమెంట్ వచ్చింది. దానితో ఆ నాయకునికి విపరీతమైన కోపం వచ్చింది. ‘ఏమయ్యా ,జీవితములో ఇంకోసారి నాతో  మాట్లాడవద్దు. నాకు నీ మొహం చూపించవద్దు. నీ కుమార్తెను కూడా నువ్వు చూడటానికి వీల్లేదు’. ‘అమ్మాయి, నువ్వు మా ఇంట్లో ఉండాలంటే నీ తల్లిదండ్రులతో మాట్లాడకూడదు. వారికి ఫోన్ చేసినా, ఉత్తరము వ్రాసినా ఊరుకోము’ అన్నాడు. నా మిత్రుడు నాతో ఏమన్నాడంటే, ‘ఒక చిన్న ఆర్గుమెంట్ చేసినందుకు 30 సంవత్సరాలుగా మా అమ్మాయి మొహం కూడా చూసే అవకాశము లేకుండా చేశాడు’. కొంతమంది క్రైస్తవ సంఘ నాయకులు టెర్రరిస్టులు కన్నా హీనంగా ప్రవర్తిస్తున్నారు. ఒసామా బిన్ లాడెన్ అయినా తోటి వాణ్ని క్షమిస్తాడేమో కానీ నేను నిన్ను క్షమించను అంటున్నారు. పౌలు ఆ విధముగా లేడు. ‘మీరు నా మాట వింటే బాగుండేది, అయినప్పటికీ నేను మీకు సహాయము చేస్తాను.ధైర్యముగా ఉండండి. మీకేమి కాదు’ అని వారిని క్షమించి, తన పరిచర్యను కొనసాగించాడు.

   చైనా లో ఒక డాక్టర్ లీ వెన్‌లియాంగ్‌ తనకు వద్దకు వచ్చిన ఓ రోగిలో డిసెంబరు 30న తొలిసారి కరోనా వైరస్‌ ఆనవాళ్లను గుర్తించారు. సార్స్‌ తరహా వైరస్‌ ఆనవాళ్లు గుర్తించానంటూ తన మిత్రులకు సామాజిక మాధ్యమాల ద్వారా తెలియజేశాడు. ఆ సందేశం కాస్తా వైరల్‌ కావడంతో వైరస్‌ విషయం వెలుగులోకి వచ్చింది. ఆయన చేస్తున్న హెచ్చరికలు అధికారులు పట్టించుకోలేదు. అసత్య ప్రచారాలతో ప్రజల్ని భయభ్రాంతులకు గురిచేస్తున్నావు అని ఆయన మీద నేరం మోపి అరెస్ట్ చేసి చిత్ర హింసలకు గురిచేశారు. రెండు వారాల తరువాత ఆయనను వదిలిపెట్టారు. ఆయన వారిని క్షమించాడు. తిరిగి ఆయన విధుల్లో చేరి వైరస్‌ బారి నుంచి ప్రజల్ని కాపాడేందుకు కృషి చేశాడు. జనవరి రెండో వారంలో ఆయనకి వైరస్‌ సోకినట్లు గుర్తించారు. ఫిబ్రవరి 1న ఐసీయూలో చేరి వైరస్‌తో పోరాడుతూనే ప్రాణాలు కోల్పోయాడు. ప్రపంచమంతా ఈ రోజు ఆయన త్యాగాన్ని గుర్తుచేసుకొని బాధ పడుతూ ఉంది.

   డాక్టర్లు, నర్సులు ఆ విధముగా రోగులకు సేవ చేయాలి. గాలెన్ గొప్ప వైద్యుడు. రోమ్ నగరములో ప్లేగ్ వచ్చినప్పుడు ఆయన పారిపోయాడు. జనము చస్తే ఏమిటి? బ్రతికితే ఏమిటి? నా ప్రాణాలు కాపాడుకోవటం ముఖ్యము అని గాలెన్ పారిపోయాడు. క్రైస్తవ డాక్టర్లు, నర్సులు రోమ్ నగరములో రోగులకు సేవలందించారు. నా హాస్పిటల్ ప్రతిరోజూ తెరచే ఉంచుతా.కరోనా కానివ్వండి, ఇంకో జబ్బు కానివ్వండి. రోగులకు ఎప్పుడూ అందుబాటులోనే ఉన్నాను.భయపడి పారిపోవడం నాకు అలవాటు లేదు.పౌలు పారిపోలేదు. అక్కడే ఉండి, వారిని క్షమించి, వారికి పరిచర్య చేశాడు.

 1. ధైర్యము

22 వచనము. ఇప్పుడైనను ధైర్యము తెచ్చుకొనుడని మిమ్మును వేడుకొనుచున్నాను.

పౌలు వారికి ధైర్యాన్ని నూరిపోయడము మనము ఇక్కడ చూస్తున్నాము. ఆ గాలి తుఫాను వారిని భయ భ్రాంతులకు గురిచేసింది. సముద్రము మనకు మన శక్తి ఎంత తక్కువో చూపిస్తుంది. పోయిన సంవత్సరము నేను గాలాపగోస్ దీవులకు వెళ్ళాను. ఒక రోజు పసిఫిక్ మహా సముద్రములో ఒక చిన్న బోటులో కొంతమందితో కలిసి వెళ్ళాను. ఒక చోట నేను రెండు చిన్న కొండలను చూశాను. ఇక్కడ చాలా ఆహ్లాదకరంగా ఉంది కాసేపు ఈత కొడదాము అని నేను సముద్రములో దూకాను. ఆ రెండు కొండల మధ్యకు వెళ్లిన తరువాత ఒక్క సారిగా గాలి పెరిగింది. నేను ఎంత బలముగా ఈత కొడుతున్నా ముందుకు కదలలేక పోతున్నాను. నీళ్లలోకి చూస్తే అక్కడ ఎంతో లోతుగా ఉంది. ఆ కొండల రాళ్లే ఒక్కొక్కటి ఒక పెద్ద ఇల్లు సైజులో ఉంది. కొండల మధ్యలో ఒక వైపు నుండి మరొక వైపుకు ఈదుకుంటూ వెళదామని నేను బయలుదేరాను. అయితే ఆ గాలి వలన ముందుకు వెళ్లలేకపోవుచున్నాను. చిన్న, చిన్న చేపలు నాచుట్టూ ఈదుతున్నాయి. నాకు తిమింగలాలు, సొర చేపలు గుర్తుకువచ్చి చాలా ఆందోళనకు గురయ్యాను. కాసేపటి తరువాత ఆ బోట్ నాకు కనిపించింది. వారిని పిలిచి బయటపడ్డాను. ఆ సముద్రము తుఫాను లేనప్పుడే నన్ను అంతగా భయపెట్టింది. ఒక తుఫాను లో చిక్కుకొని కకావికలమైన ఈ నావికుల పరిస్థితి ఎలా ఉంటుందో మనము ఊహించవచ్చు. వారు ఎంతో భయాందోళనలకు గురయ్యివుంటారు. పౌలు వారిని ధైర్యము తెచ్చుకోండి అని వారిని వేడుకొంటున్నాడు. పదే పదే వారికి ధైర్యము చెబుతున్నాడంటే వారు ఏ స్థితిలో ఉన్నారో మనము చూడవచ్చు.

    పౌలు కూడా అదే ప్రమాదములో ఉన్నాడు. అయితే ఆయన ధైర్యముగా ఉన్నాడు. ఆ ధైర్యము ఆయనలో నుండి పుట్టినది కాదు. ఆ ధైర్యము ఎలా పుట్టిందో చూడండి. 

 1. విశ్వాసము 

25. కాబట్టి అయ్యలారా, ధైర్యము తెచ్చుకొనుడి; నాతో దూత చెప్పిన ప్రకారము జరుగునని నేను దేవుని నమ్ముచున్నాను. పౌలు ధైర్యముగా ఉన్నాడు. ఆయన ధైర్యము దేవుని యందు విశ్వాసములో నుండి పుట్టింది. మన సమాజములో ఆత్మ  విశ్వాసము గురించి (Power of Positive thinking) గురించి అందరూ మాట్లాడుతున్నారు. trust yourself, believe in yourself, నిన్ను నువ్వు నమ్ము అంటున్నారు. అయితే అది తప్పుడు ఆలోచన. నిన్ను నువ్వు నమ్ముకొంటే నువ్వు డిప్రెషన్ లోకి వెళ్లిపోవడము ఖాయము. పౌలు, ‘నేను ధైర్యముగా ఉన్నాను, ఎందుకంటే నేను దేవుని నమ్ముచున్నాను’ అంటున్నాడు. వారందరూ అవిశ్వాసులు. తన ధైర్యానికి కారణము ఏమిటో పౌలు స్పష్టముగా వారికి చెబుతున్నాడు. మన విశ్వాసాన్ని అవిశ్వాసులకు మనము స్పష్టముగా తెలియజేయాలి. లేకపోతే మన ధైర్యానికి కారణము ఏమిటో వారు తెలుసుకోలేరు.

 1. నిశ్చయిత

23. నేను ఎవనివాడనో, యెవనిని సేవించుచున్నానో, ఆ దేవుని దూత గడచిన రాత్రి నాయొద్ద నిలిచిపౌలా, భయపడకుము;24. నీవు కైసరు ఎదుట నిలువవలసియున్నది; ఇదిగో నీతో కూడ ఓడలో ప్రయాణమై పోవుచున్న వారందరిని దేవుడు  నీకు అనుగ్రహించి యున్నాడని నాతో చెప్పెను.

నేను ఎవని వాడనో…. I belong to God. దేవుని దూత నాతో యేమని చెప్పాడంటే, నేను కైసరు ఎదుట నిలువబడవలసి ఉన్నది. మార్గ మధ్యములో తుఫానులు వచ్చినా, భూకంపాలు వచ్చినా అవి దేవుని ప్రణాళికను ఆపలేవు. పౌలు యొక్క నిశ్చయత కు కారణము దేవుడు తన ప్రణాలికను ఆయనకు ముందుగా తెలియజేశాడు. దేవుని ప్రణాళిక తెలిసినప్పుడు మనకు నిశ్చయిత కలుగుతుంది. పౌలు దగ్గరకు వెళ్లినట్లు దేవ దూతలు ఈ రోజున మన దగ్గరకు రాకపోవచ్చు. పౌలు ‘కైసరు ఎదుట నేను నిలువబడవలసి ఉన్నది’ అని ఎంత నిశ్చయితతో చెప్పాడో ఈ రోజు మనం ‘క్రీస్తు ఎదుట నేను నిలువబడవలసి ఉన్నది’ అని అంతే నిశ్చయితతో ఈ రోజు మనము చెప్పవచ్చు. ఆ నిశ్చయిత ఉండబట్టే పౌలు అంత సంక్లిష్టమైన పరిస్థితుల్లో కూడా అంత నిబ్బరముగా పనిచేయగలిగాడు. 

 1. ఐకమత్యము

30. అయితే ఓడవారు ఓడ విడిచి పారిపోవలెనని చూచి, తాము అనివిలోనుండి లంగరులు వేయబోవునట్లుగా సముద్రములో పడవ దింపి వేసిరి.31. అందుకు పౌలువీరు ఓడలో ఉంటేనేగాని మీరు తప్పించుకొనలేరని శతాధిపతితోను సైనికులతోను చెప్పెను.

  కొంత మంది ఏమి చేశారంటే ఓడ విడిచి పారిపోవాలని చూశారు. లంగరులు వేసి వస్తాము ఇక్కడే కూర్చోండి అని లైఫ్ బోట్ ని క్రిందకు వెళ్ళుతున్నారు. పౌలు గారికి అబద్దాలు చెబుతున్నారు, ఆయనను మోసము చేస్తున్నారు. పారిపోయేవాడే అటువంటి నాటకాలు, అబద్ధాలు చెబుతాడు. మీతో నిలబడే వాడు నటించడు.పౌలు వారితో, ‘మీరు పారిపోతే మీ ప్రాణాలు కాపాడుకోలేరు. మనమందరము కలిసే ఉండాలి’ అన్నాడు.

  ఐకమత్యము ఉచితముగా రాదు. కొన్ని త్యాగాలు చేయాలి.అమెరికా దేశము సైన్యములో మెరీన్ కార్ప్స్ అని విభాగము ఉంది. వారు ప్రమాదకరమైన సైనిక చర్యలు చేపడతారు. వారి  నినాదం  సెంపెర్ ఫిడేలిస్ అని ఉంటుంది. సెంపెర్ ఫిడేలిస్ Always faithful. ఎప్పుడూ నమ్మకత్వము నిలుపుకొంటాము. వారు 10 మంది కలిసి ఒక సైనిక చర్యకు వెళ్తే, వారిలో శత్రువులు ఒక సైనికుని గాయపరిస్తే, మిగిలిన 9 మంది ఆ గాయపడిన వానిని వదిలేసి పారిపోరు. వాణ్ని ఎత్తుకొని తీసుకొనివెళ్తారు. ఆ సైనికుడు చనిపోయినా, అతని మృత దేహాం కోసమైనా వస్తారు. వారికి తమ ప్రాణాలకంటే ఐకమత్యము, నమ్మకత్వము ముఖ్యము. 

   పౌలు, ‘పారిపోకండి, మనమందరమూ కలిసి ఉంటేనే మన ప్రాణాలు కాపాడుకోగలము’ అన్నాడు. క్రైస్తవ నాయకుడు ఐకమత్యము కోసము ప్రయత్నించాలి. 

 1. మాదిరి

35. ఈ మాటలు చెప్పి, యొక రొట్టె పట్టుకొని అందరి యెదుట దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించి దాని విరిచి తిన సాగెను.36. అప్పుడందరు ధైర్యము తెచ్చుకొని ఆహారము పుచ్చుకొనిరి.

   వాళ్ళు ఎంత షాక్ లో ఉన్నారంటే, 14 రోజులు ఆహారము పుచ్చుకోలేదు. మేము ఎటొచ్చి చనిపోతున్నాము కదా, మేము తిని సాధించేది ఏముంది? అంత నిర్లిప్తత లోకి వెళ్లిపోయారు. పౌలు ఏమిచేసేడంటే, వారి ముందు రొట్టె విరిచి తిన్నాడు. ఆయనను చూసి వారు కూడా తిన్నారు. తనను వారికి ఒక మాదిరిగా అక్కడ చూపించాడు. క్రైస్తవ నాయకులు ఇతరులకు మాదిరిగా ఉండాలి. 

 1. కృతజ్ఞత

35. ఈ మాటలు చెప్పి, యొక రొట్టె పట్టుకొని అందరి యెదుట దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించి దాని విరిచి తిన సాగెను. కష్టాలు వచ్చినప్పుడు ఎక్కువ మంది చేసే పని దేవుని దూషించుట. పైకి అనకపోయినా మనస్సులో దేవుని నిందిస్తారు, మనస్సు కష్టపెట్టుకొంటారు

దేనినిగూర్చియు చింతపడకుడి గాని ప్రతి విషయములోను ప్రార్థన విజ్ఞాపనములచేత కృతజ్ఞతాపూర్వకముగా మీ విన్నపములు దేవునికి తెలియజేయుడి. ఫిలిప్పి 4:6 లో పౌలు వ్రాశాడు. ఇప్పుడు తన జీవితములోనే ఆయన దానిని అనుసరిస్తున్నాడు.

   భూలోక సంభందముగా ఆయన పరిస్థితే బాగోలేదు. ఆయన మీద తప్పుడు కేసులు పెట్టి అరెస్ట్ చేశారు. ఆయన జీవితము జైళ్ల పాలయ్యింది.ముగ్గురు న్యాయ మూర్తుల ముందు ఆయన నిలబడ్డాడు. వారు ఆయనకు న్యాయము చేయలేదు. ఇప్పుడు నీరో ముందు హాజరవుటకు వెళ్తున్నాడు. మూలిగే నక్క మీద తాటికాయ పడ్డట్లు ఇప్పుడు ఆ ఓడ తుఫానులో చిక్కుకొంది. కాసేపటి తరువాత అది రెండు ముక్కలవుతుంది. అయితే ఆయన దేవుని మీద తన మనస్సును కష్టపెట్టుకోలేదు.అందరి యెదుట దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించాడు. అది ఒక గొప్ప నాయకత్వ లక్షణము. మనం ఏ పరిస్థితుల్లో ఉన్నప్పటికీ దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించాలి. 

 1. క్షేమము

42. ఖైదీలలో ఎవడును ఈదుకొని పారి పోకుండునట్లు వారిని చంపవలెనని సైనికులకు ఆలోచన పుట్టెను గాని 43. శతాధిపతి పౌలును రక్షింప నుద్దేశించివారి ఆలోచన కొనసాగనియ్యక, మొదట ఈదగలవారు సముద్రములో దుమికి దరికి పోవలెననియు 44. కడమ వారిలో కొందరు పలకలమీదను, కొందరు ఓడ చెక్కల మీదను, పోవలెననియు ఆజ్ఞాపించెను. ఈలాగు అందరు తప్పించుకొని దరిచేరిరి. 

ఓడ బద్దలైపోయినప్పుడు, ఖైదీలు పారిపోతారేమో అనే సందేహము సైనికులకు కలిగింది. అందరినీ  చంపేద్దాము అని వారు అనుకొన్నారు. అయితే, శతాధిపతికు పౌలును చంపడము ఇష్టము లేదు. ఆయన ఆలోచన విరమించుకొని అందరినీ ఏదో ఒకరకముగా ఒడ్డుకు వెళ్ళమని చెప్పాడు. పౌలు వారి మధ్యలో ఉండుట వలన ఆ ఖైదీలందరికీ క్షేమము కలిగింది. 

తుఫానులో నుండి పౌలు నాయకత్వము వారిని కాపాడితే, సైనికుల నుండి పౌలు వ్యక్తిత్వము వారిని కాపాడింది. పౌలు ను బట్టి వారికి క్షేమము కలిగింది. వారు క్షేమముగా ఒడ్డుకు చేరారు. సైనికులు అనుకొన్నట్లుగా వారు పారిపోలేదు. పౌలు వ్యక్తిత్వము, ఆయన చర్యలు, ఆయన మాటలు వారిని ప్రభావితము చేసినాయి. పౌలు మంద యొక్క క్షేమము గురించి ఆలోచించే నాయకుడు. 

కాపరి 99 మంది గొఱ్ఱెలను ఒక చోట ఉంచి, తప్పిపోయిన ఒక్క గొఱ్ఱె కోసం వెళ్తాడు. ఆ తప్పి పోయిన గొఱ్ఱె ఏమనుకొంటుంది? నేను తప్పిపోయాను. కానీ నా ఒక్కదాని కోసం కాపరి వెతుక్కుంటూ వస్తాడు. ప్రతి గొఱ్ఱె యొక్క క్షేమం కాపరి కోరుకొంటాడు. పౌలు అటువంటి కాపరి.

29. నేను వెళ్లిపోయిన తరువాత క్రూరమైన తోడేళ్లు మీలో ప్రవేశించునని నాకు తెలియును; వారు మందను కనికరింపరు.31. కావున నేను మూడు సంవత్సరములు రాత్రింబగళ్లు కన్నీళ్లు విడుచుచు ప్రతి మను ష్యునికి మానక బుద్ధి చెప్పితినని మీరు జ్ఞాపకము చేసికొని మెలకువగాఉండుడి. (అపోస్తలుల కార్యములు 20) 

క్రైస్తవం నాయకునికి, నాయకురాలికి  ఉండవలసిన 12 లక్షణాలు ఈ రోజు మనము చూశాము. దేవుని వెంబడించుట, సహోదరత్వము, నమ్మకత్వము, ఓర్పు, క్షమాపణ, ధైర్యము, విశ్వాసము, నిశ్చయత, ఐకమత్యము, మాదిరి, కృతజ్ఞత, క్షేమము.   దేవుడు ఇటువంటి ఉత్తమమైన నాయకులను, నాయకురాళ్లను మన సంఘములలో తయారు చేయాలని మనము కోరుకొందాం.

Leave a Reply