
బైబిల్ లో ప్రసంగి గ్రంథము చాలా ఆసక్తికరమైన పుస్తకం. మనిషి జీవితానికి అర్థం ఉందా? అనే ప్రశ్న ను ఈ పుస్తకము అడుగుతుంది. జీవిత అర్థం కోసం మనిషి చేసే అన్వేషణ ఈ పుస్తకములో మనం చూస్తాము. ఈ రోజు మన సందేశం అదే: ‘అర్థం కోసం మనిషి చేసే అన్వేషణ’ Man’s Search for Meaning
ప్రసంగి 9 అధ్యాయములో నుండి కొన్ని మాటలు చూద్దాము.9 అధ్యాయము, 7-9 వచనాలు
7. నీవు పోయి సంతోషముగా నీ అన్నము తినుము, ఉల్లాసపు మనస్సుతో నీ ద్రాక్షారసము త్రాగుము; ఎల్లప్పుడు తెల్లని వస్త్రములుధరించుకొనుము, నీ తలకు నూనె తక్కువచేయకుము. 9. దేవుడు నీకు దయచేసిన వ్యర్థమైన నీ ఆయుష్కాల మంతయునీవు ప్రేమించు నీ భార్యతో సుఖించుము, నీ వ్యర్థమైన ఆయుష్కాలమంతయుసుఖించుము, ఈ బ్రదుకునందు నీవు కష్టపడి చేసికొనిన దాని యంతటికి అదే నీకు కలుగు భాగము.
ఈ లోక సంభందమైన తత్వవేత్తలు ఏమని చెబుతారంటే, మనిషి జీవితానికి అర్థం ఇచ్చేది సుఖ సంతోషాలే.బాగా ఎంజాయ్ చేయి, అందులోనే నీ జీవితానికి మీనింగ్ ఉంది అంటుంది. ఎపిక్ అఫ్ గిల్గమెష్ అని ఒక కావ్యము ఉంది. దాదాపు 4 వేల సంవత్సరాల క్రితం అది వ్రాయబడింది. ఇందులో ఎంకిడు అనే వ్యక్తి మనకు కనిపిస్తాడు. ఈ ఎంకిడు జీవితాన్ని అర్థం చేసుకోవాలని ప్రపంచమంతా తిరుగుతాడు.ఈ కావ్యము లో ఒక చోట ఏమని ఉంటుందంటే, ‘గిల్గమెష్, నీ కడుపు నింపుకో. రాత్రి పగలు సంతోషముగా ఉండు. స్నానము చేయి, తలకు నూనె పెట్టుకో, మంచి బట్టలు వేసుకో అందులోనే ఆనందము పొందు’
నీ సంతోషములోనే నీ జీవితానికి అర్థం ఉంది. ప్రపంచ చరిత్రలో ఎక్కువ మంది నమ్మిన ఫిలాసఫీ ఇదే. దేవుడు ఇశ్రాయేలీయులను ఐగుప్తు నుండి విడిపించాడు. అరణ్యములో వారిని నడిపించాడు. అయితే ఇశ్రాయేలీయులు దేవుని స్తుతించలేదు, సణుగు కొన్నారు, గొణుగుకున్నారు. మేము ఐగుప్తులో ఉంటే ఎంత బాగుండేది! ఈ అరణ్యములో ఏముంది? ఎంజాయిమెంట్ అంతా ఐగుప్తు లో ఉంది. ఈ అరణ్యములో ఏముంది ఇసుక తప్ప! అని వారు అనుకొన్నారు. ఐగుప్తు లో దేవుడు లేదు, ఇక్కడ మాకు దేవుడు ఉన్నాడు, మాకు ఆయన చాలు అని వారు అనుకోలేదు.
దేవుని దృష్టిలో ప్రశస్తమైనవి మానవుడు వ్యర్ధమైనవిగా చూస్తున్నాడు, దేవుని దృష్టిలో వ్యర్ధమైనవాటిని మానవుడు ప్రశస్తమైనవిగా చూస్తున్నాడు. వేటిని దేవుడు ప్రశస్తమైనవిగా చూస్తున్నాడో వాటిని మనం ప్రశస్తమైనవిగా చూస్తామో, వేటిని దేవుడు వ్యర్ధమైనవాటిగా చూస్తున్నాడో వాటిని మనం వ్యర్ధమైనవిగా చూస్తామో అప్పుడు మన జీవితానికి అర్థం కలుగుతుంది.
దానియేలు గ్రంథం 5 అధ్యాయములో బెల్షజరు రాజు మనకు కనిపిస్తున్నాడు. ఆయన వెయ్యి మంది ప్రముఖులకు పెద్ద విందు చేశాడు. వారందరూ ద్రాక్షరసము త్రాగుచున్నారు. అప్పుడు బెల్షజరు ఒక ఆజ్ఞ ఇచ్చాడు: యెరూషలేములో దేవుని ఆలయములో ఉండవలసిన బంగారు పాత్రలు తీసుకురండి. వాటిలో ద్రాక్ష రసం పోసుకొని త్రాగుదాము. వారు దేవుని పాత్రలను అతని ముందు పెట్టారు. అప్పుడు వారు వాటిలో ద్రాక్ష రసం పోసుకొని త్రాగారు.అవి దేవునికి ప్రతిష్టించబడిన వస్తువులు, అవి దేవుని ఆలయములో ఉండాల్సిన వస్తువులు, అవి దేవుని సేవలో ఉండాల్సిన వస్తువులు. వాటిలో మద్యం పోసుకొని త్రాగుతున్నావు. అది ఎంత పెద్ద పాపం.మీ శరీరం, మీ ఆత్మ, మీ జీవితం, మీ సమయం, మీ సంబంధాలు అవి దేవుడుమీకు ఇచ్చిన ప్రతిష్ఠిత వస్తువులు. వాటిలో ఈ లోక సంబంధమైనవి మనం పోస్తే మన జీవితానికి అర్థం ఉండదు. బెల్షజరు దేవుని పాత్రలలో ద్రాక్ష రసంపోసుకొని త్రాగుతున్నప్పుడు దేవుని తీర్పు అతని మీదకు వచ్చింది. దేవుని వ్రేలుఅతని నగరము గోడ మీద ఒక మాట వ్రాసింది.మేనె మేనె టేకేల్ ఉఫార్సిన్ నేను త్రాసులో నిన్ను తూచినప్పుడు, నువ్వు తక్కువగా కనిపించావు.ఈ రోజు దేవుని ప్రతిష్ఠిత వస్తువులను మనము పాడుచేస్తే, దేవుడు అదే మాట మనతో అంటున్నాడు: మేనె మేనె టేకేల్ నేను త్రాసులో నిన్ను తూచినప్పుడు, నువ్వు తక్కువగా కనిపించావు. నేను నీకిచ్చిన ప్రతిష్ఠిత వస్తువులను నువ్వు పాడు చేస్తున్నావు. నీ జీవితం వ్యర్థమైపోతుంది, జాగ్రత్త!
బెల్షజరు రాజు చేసిన తప్పు అదే. దేవుని ప్రతిష్ఠిత వస్తువులు తీసుకు రండి. వాటిలో నేను తింటాను, వాటిలో నేను త్రాగుతాను. ఎంజాయ్ చేస్తాను అనుకొన్నాడు. మన జీవితానికి అర్థం ఎలా వస్తుంది? యేసు క్రీస్తు ఒక మానవుడిగా మన మధ్యపెరిగాడు. దేవుని ప్రతిష్ఠిత వస్తువులను ఆయన కాపాడాడు. దేవాలయములో వ్యాపారం చేస్తున్న వారి మీద ఆయన ఆగ్రహం వ్యక్తము చేసాడు. దేవుని ప్రతిష్ఠిత వస్తువులను వారు పాడు చేస్తున్నారు. అది ఆయనకు తీవ్రమైన ఆగ్రహం కలిగించింది. ఏ పని అయినప్పటికీ దానిని చేయక ముందు ఆయన దేవుని స్తుతించేవాడు, దేవుని మహిమపరచేవాడు, జీవితానికి అర్థం ఇచ్చేది అదే. ప్రతి దినము దేవుని వైపు చూడడం. అయితే సాతానుడు దానిని ససేమిరా ఇష్టపడడు.ప్రసంగి ఒక మాట అంటున్నాడు:
మనుష్యుల ప్రయాసమంతయు వారి నోటికే గదా; అయినను వారి మనస్సు సంతుష్టినొందదు (6:7).
తిండి, పానీయములతో సంతృప్తి రాదు. సాతానుడు యేసు ప్రభువు అరణ్యములో ఉన్నప్పుడు ఆయనను శోధించాడు. మూడు శోధనలు ఆయన ముందు పెట్టాడు. రాళ్లను రొట్టెలుగా చేసుకొని తిను, దేవాలయం శిఖరం మీద నుండి క్రిందకు దూకు, ఈ లోక రాజ్యాలన్నీ నీకిస్తాను. నాకు సాగిలపడు, నన్ను మ్రొక్కు, నన్ను ఆరాధించు అన్నాడు.
యేసు ప్రభువు ఎలా స్పందించాడు? అందులోనే క్రైస్తవ జీవిత తత్వము ఉంది. మానవుడు తన జీవితానికి అర్ధాన్ని ఎలా పొందగలడు అనే ప్రశ్నకు అక్కడ యేసు ప్రభువు సమాధానము చెబుతున్నాడు.యేసు ప్రభువు ఏమన్నాడంటే, మనుష్యుడు రొట్టెవలన మాత్రము కాదుగాని దేవుని నోటనుండి వచ్చు ప్రతి మాట వలనను జీవించును (మత్తయి 4:4)
సొలొమోను ఏమంటున్నాడు?, ‘మనుష్యుల ప్రయాసమంతయు వారి నోటికే గదా; అయినను వారి మనస్సు సంతుష్టినొందదు’ అన్నాడు. యేసు ప్రభువు ఏమంటున్నాడంటే, ‘మనుష్యుల ప్రయాస పడాల్సింది నోటి కోసం కాదు, వారి కోరికల కోసం కాదు, దేవుని చిత్తం జరిగించుట కొరకు’. సాతాను మాట ఆయన వినలేదు. రొట్టెలు చేసుకొని తన కడుపు నింపుకోవటం కంటే, దేవుని చిత్తాన్ని చేయడం ఆయనకు ముఖ్యం. రెండో శోధనలో, సాతానుడు యేసు ప్రభువుకు ఒక మాట చెప్పాడు: ‘దేవాలయము మీద నుండి క్రిందకు దూకు. దేవదూతలు నిన్ను పెట్టుకొంటారు’ యేసు ప్రభువు ఏమని సమాధానం చెప్పాడు? నీ దేవుని శోధించకూడదు’
సాతానుడు చేసే పని అదే. నేను దూకుతాను, దేవుడు వచ్చి నన్ను పట్టుకోవాలి. నేను దేవుని వెంబడించను, దేవుడే నన్ను వెంబడించాలి అనే తత్వము అందులో మనకు కనిపిస్తున్నది. అలాంటి జీవితములో అర్థం ఉండదు. యేసు ప్రభువు జీవితములో అనేక సార్లు వ్యక్తులు ఆయనను బలవంతం చేశారు. ‘నువ్వు మాకు రాజు కావాలి’ అని ఆయనను బలవంతము చేశారు. ఆయన దానింకి ఒప్పుకోలేదు ఎందుకంటే ఆయన దేవుని వెంబడిస్తున్నాడు.పేతురు ఆయనతో, ‘సిలువ నీకు వద్దు’ అన్నాడు. ఆయన వెంటనే పేతురును గద్దించాడు. ‘సాతానా, నా వెనుకకు పో’ అన్నాడు. పేతురు దేవుని శోధిస్తున్నాడు. అది సాతాను పని. అయితే, యేసు ప్రభువుమనుష్యులను వెంబడించుట లేదు. ఆయన దేవుని వెంబడిస్తున్నాడు. అక్కడే ఆయన మానవ జీవితానికి అర్థం ఉంది. సాతాను మార్గములో సుఖం ఉంది.
దేవుని మార్గములో సిలువ ఉంది. అయితే యేసు క్రీస్తు దేవుని మార్గములో ఉన్నసిలువనే కోరుకున్నాడు. అక్కడ మనం నేర్చుకొనవలసిన సత్యం ఏమిటంటే, ‘సాతాను మార్గములో నడిచి సుఖపడడం కన్నా, దేవుని మార్గములో నడిచి శ్రమ పొందడం మంచిది’. ఆయన సిలువను కోరుకున్నాడు. ఎందుకంటే అది దేవుని మార్గము. అందులో నజరేయుడైన యేసు జీవితానికి అర్థం కలిగింది.
The most meaningful time in
the life of Jesus was when
he was suffering on the cross
‘యేసు క్రీస్తు జీవితములో అత్యంత అర్థవంతమైన సమయము ఆయన సిలువ మీద గడిపిన సమయమే’ సిలువ మీద మరణములో నజరేయుడైన యేసు తన జీవితానికి అర్థం పొందాడు. అందుకనే ఆయన ఈ లోకానికి వచ్చాడు, పాపముల నుండి మనలను రక్షించడానికి, మనలను విమోచించడానికి ఆయన సిలువ వేయబడాలి. సిలువ లేకుండా ఆయన జీవితానికి అర్థం లేదు. సిలువ మీద మరణించే ముందు ‘సమాప్తము’ అని కేక వేశాడు.
It is finished
ఆ కేకలో ఆయన పొందిన సంతృప్తి ఉంది.ఆ కేకలో ఆయన జీవితానికి అర్థం ఉంది.ఈ ప్రపంచానికి ఆ సత్యం అర్థం కాదు.మన ప్రపంచం ఏమనుకొంటుందంటే, ‘అయ్యో, పాపం సిలువ, బాడ్ ఎండింగ్, దానికి మీనింగ్ లేదు’. విక్టర్ ఫ్రాంకెల్ నాజీలు నిర్మించిన ఔస్క్ విట్జ్ కాన్సంట్రేషన్ క్యాంపు లో ఎంతో నరకయాతన అనుభవించాడు. ఆ అనుభూతులలో నుండే ‘Man’s Search for meaning’ ‘అర్థం కోసం మనిషి చేసే అన్వేషణ’ అనే పుస్తకం వ్రాశాడు. యూరప్ లో, అమెరికా లో ఇప్పుడు యూథనాసియా అనే విధానము డాక్టర్లు మొదలుపెట్టారు. అంటే ఒక కాన్సర్ రోగి లేక మరొక తీవ్రమైన వ్యాధి వచ్చిన వ్యక్తి, ‘డాక్టర్, నాకు జీవించాలని లేదు. నేను చనిపోతాను.నాకు సహాయం చేయండి’ అని అడుగుతాడు. అప్పుడు డాక్టర్ ఆ వ్యక్తికి ఇంజక్షన్ ఇచ్చి ప్రాణాలు తీస్తాడు. పెద్ద, పెద్ద జబ్బులే కాకుండా చిన్న, చిన్న జబ్బులు వచ్చిన వారు కూడా డాక్టర్ల దగ్గరకు వెళ్లి ఇంజక్షన్ వేయించుకొని ప్రాణం తీసుకొంటున్నారు. వారు ఒక పెద్ద అబద్దాన్ని నమ్ముతున్నారు. ‘సుఖం ఉంటేనే జీవితానికి అర్థం, ఆరోగ్యం ఉంటేనే జీవితానికి అర్థం, సుఖం లేనప్పుడు చనిపోవటం మంచింది, ఆరోగ్యం లేనప్పుడు యూథనాసియా చేయించుకోవటం మంచిది’ అనుకొంటున్నారు. అయితే దేవుడుఏమంటున్నాడంటే, ‘నీ సుఖములోనే కాదు, నీ దుఃఖంలో కూడా నేను నీకు అర్థం ఇస్తాను, నీ ఆరోగ్యములోనే కాదు, నీ అనారోగ్యములో కూడా నేను నీకు అర్థం ఇస్తాను’. అందుకనే యూథనాసియా ని మనం వ్యతిరేకించాలి.
మా నాన్న యోహాను గారు కొన్ని సంవత్సరాలు కాన్సర్ తో బాధ పడ్డాడు.ఆ బాధకు కూడా దేవుడు అర్ధాన్ని ఇచ్చాడు. కరోనా ప్రపంచం మీదకు వచ్చి 10 నెలలు కావస్తుంది. దీనికి అర్థం లేదు అని కొంతమంది అనుకొంటారు. అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ కి కూడా కరోనా వచ్చింది. ప్రపంచములో అతి శక్తి మంతుడైన వ్యక్తికి కూడా దేవుడు తన సందేశాన్ని పంపిస్తున్నాడు. వైట్ హౌస్ లో కూర్చుని కూడా దేవుని పాఠాలు నేర్చుకోవచ్చు.
హెబ్రీ 5:8 లో మనము చదువుతాము:
ఆయన కుమారుడై యుండియు తాను పొందినశ్రమలవలన విధేయతను నేర్చుకొనెను
హెబ్రీ 5:8
యేసు క్రీస్తు శ్రమలలో విధేయతను నేర్చుకొన్నాడు. మనం కూడా అంతే. మన శ్రమలలో విధేయతను నేర్చుకోవాలి. ఈ శ్రమలకు అర్థం లేదు, నా జీవితానికి అర్థం లేదు అని మనము అనుకోకూడదు. సాతాను మార్గము అదికాదు. నువ్వు ముందు దూకు, దేవదూత నిన్ను పట్టుకొంటాడు అన్నాడు. యేసు ప్రభువు ఏమని సమాధానం చెప్పాడు? నీ దేవుని శోధించకూడదు. మన జీవితానికి అర్థం ఉండాలంటే మనం దేవుని శోధించకూడదు. అంటే, దేవా, నన్ను వెంబడించు అని మనము దేవుని అడుగకూడదు. నేను దూకుతాను, దేవ దూతను పంపి నన్ను కాపాడు అనే తత్వముతో జీవిస్తే మన జీవితానికి అర్థం ఉండదు. మూడో శోధనలో సాతాను యేసు ప్రభువుతో ఒక మాట అన్నాడు: ‘నువ్వు నాకు మ్రొక్కు, నేను నీకు ఈ లోకం మొత్తాన్ని ఇస్తాను’ సాతాను హృదయము ఎలా ఉందో ఇక్కడ మనకు అర్థం అవుతున్నది. దేవుడే నాకు మ్రొక్కాలి అని సాతానుడు అనుకొంటున్నాడు.
‘ఈ లోక అందాలు చూడు, ఇవన్నీ నీకు ఇస్తాను, నీవు నన్ను ఆరాధించు’ అన్నాడు. సాతాను ప్రసంగి ముందు అనేక శోధనలు పెట్టాడు. సొలొమోను సాతాను పెట్టిన శోధనలు తట్టుకోలేకపోయాడు. తన ఐశ్వర్యములో, రాజరికములో, జ్ఞానములో సంతృప్తిని వెదుకున్నాడు. 2:10 లో సొలొమోను ఏమంటున్నాడంటే, నా కన్నులు ఆశించిన వాటిలో దేనిని అవి చూడకుండ నేను అభ్యంతరము చేయలేదు; మరియు నా హృదయము నా పనులన్నిటినిబట్టి సంతో షింపగా సంతోషకరమైనదేదియు అనుభవించకుండ నేను నా హృదయమును నిర్బంధింపలేదు.
ప్రసంగి 2:10
నా కన్నులు ఆశించిన వాటిలో దేనిని అవి చూడకుండా నేను అభ్యంతరముచేయలేదు. గొప్ప భవనాలు కట్టుకున్నాడు, అయినప్పటికీ ఆయనకు సంతృప్తి లేదు.300 మంది భార్యలు, 700 మంది ఉపపత్నులు. అయినప్పటికీ ఆయన కన్నులకు సంతృప్తి లేదు. గొప్ప దేవాలయము కట్టాడు. కానీ ఆయనకు సంతృప్తి లేదు.విగ్రహారాధన కూడా మొదలు పెట్టాడు. ‘నా హృదయము నా పనులన్నిటినిబట్టిసంతో షింపగా సంతోషకరమైనదేదియు అనుభవించకుండ నేను నా హృదయమును నిర్బంధింపలేదు’.
సొలొమోను ఫిలాసఫీ ఏమిటంటే, ‘నా హృదయం సంతోషముగా ఉండాలి,అది ఏమి అడిగితే నేను దానిని ఇస్తాను’. ఆ ఫిలాసఫీ చివరకు అతని జీవితాన్ని ఖాళీ చేసింది. అతనికి అసంతృప్తిని, నిరాశను, నిరాసక్తతను మిగిల్చింది. ఈ రోజు మన సమాజము కూడా అదే ఫిలాసఫీ ని అలవరచుకొంది. నా కన్నులు ఆశించినవి నేను పొందాలి, నా హృదయము కోరుకొన్నది నాకు కావాలి. అవసరమైతే నేను సాతానుకు సాగిలపడతాను.యేసు ప్రభువు సొలొమోను ఫిలాసఫీ ని పాటించలేదు.సాతానుడు ఈ ప్రపంచ అందాలు ఆయనకు చూపించాడు.ఆ సమయములో యేసు క్రీస్తు తన కన్నులను నియంత్రించుకొన్నాడు, తన హృదయాన్ని నిర్బందించుకొన్నాడు.
‘అవన్నీ నాకు వద్దు, దేవుని చిత్తాన్ని చేయడం నాకు ముఖ్యం, దేవుని వాక్యాన్ని పాటించడం నాకు ముఖ్యం.సాతానుడు మనతో ఏమంటాడంటే, మీరు నాకు మ్రొక్కండి, మీకు చాలా వస్తువులు నేను ఇస్తాను’ యేసు ప్రభువు మనతో ఏమంటున్నాడంటే, మీరు మ్రొక్కాల్సింది దేవుని మాత్రమే, మీరు ఆరాధించాల్సింది దేవుని మాత్రమే. అందులోనే మీ జీవితానికి అర్థం ఉంది. నిజమైన ఆరాధన చేసినప్పుడే మన జీవితానికి అర్ధం వస్తుంది. సాతానుని ఆరాధించే వారి జీవితానికి అర్థం లేదు. ఆరాధన చేసే వ్యక్తి దేవునితో సంభంధం కలిగిఉన్నాడు.
ఆ కొండ మీద 3 శోధనల్లో 3 పాఠాలు ఉన్నాయి.
1.దేవుని వాక్యాన్ని హత్తుకో
2. దేవుని వెంబడించు
3.దేవుని ఆరాధించు
జీవితానికి అర్థం వాటిల్లోనే ఉంది.
అల్కహాలిక్ అనానిమస్ అని ఒక సంస్థ వుంది . మద్యపానానికి బానిసలైన వారికి ఆ సంస్థ చికిత్స చేస్తున్నది. ఆ చికిత్స లో వారు ఏమని చెబుతారంటే, నీకు మద్య పానము మీద విజయము కావాలంటే ముందు నీవు దేవునితో సంబంధం కలిగి ఉండాలి. ఈ మధ్యలో అల్కహాలిక్ అనానిమస్ కి వెళ్లిన 10,565 మంది మీద ఒక స్టడీ చేశారు.వారు ఏమని చెప్పారంటే, దేవునితో సంబంధం మద్య పానం నుండి మాకు విడుదల ఇచ్చింది. జీవితములో ఉండే శూన్యాన్ని మద్యముతో మనము నింపుకోలేము. చివరిగా 12 అధ్యాయములో ప్రసంగి ఎలా ముగిస్తున్నాడో చూద్దాము:
నీ సృష్టికర్తను గుర్తుపెట్టుకో 12:1-7
1. దుర్దినములు రాకముందే ఇప్పుడు వీటియందు నాకు సంతోషము లేదని
నీవు చెప్పు సంవత్సరములు రాకముందే, 2. తేజస్సునకును సూర్య
చంద్ర నక్షత్రములకును చీకటి కమ్మకముందే, వాన వెలిసిన తరువాత
మేఘములు మరల రాకముందే, నీ బాల్యదినములందే నీ సృష్టికర్తను స్మరణకు
తెచ్చుకొనుము.
3. ఆ దినమున ఇంటి కావలివారు వణకు దురు బలిష్ఠులు
వంగుదురు, విసరువారు కొద్దిమంది యగుటచేత పని చాలించుకొందురు,
కిటికీలలోగుండ చూచువారు కాన లేకయుందురు.4. తిరుగటిరాళ్ల ధ్వని
తగ్గిపోవును, వీధి తలుపులు మూయబడును, పిట్టయొక్క కూతకు ఒకడు లేచును;
సంగీతమును చేయు స్త్రీలు, నాదము చేయువారందరును నిశ్చబ్దముగా ఉంచ
బడుదురు.5. ఎత్తు చోటులకు భయపడుదురు. మార్గములయందు భయంకరమైనవి
కనబడును, బాదము వృక్షము పువ్వులు పూయును, మిడుత బరువుగా ఉండును,
బుడ్డబుడుసర కాయ పగులును, ఏలయనగా ఒకడు తన నిత్యమైన ఉనికిపట్టునకు పోవుచున్నాడు. వాని నిమిత్తము ప్రలా పించువారు వీధులలో తిరుగుదురు
6. వెండి త్రాడు విడి పోవును, బంగారు గిన్నె పగిలిపోవును, ధారయొద్ద కుండ పగిలిపోవును, బావియొద్ద చక్రము పడిపోవును.7. మన్నయి నది
వెనుకటివలెనే మరల భూమికి చేరును, ఆత్మ దాని దయచేసిన దేవుని యొద్దకు మరల పోవును.
ఈ వచనాల్లో వృధాప్యము లో మన శరీరములో కలిగే మార్పులను గురించి ప్రసంగి మాట్లాడుతున్నాడు. ఎస్పీ బాలసుబ్రమణ్యం గారు ఎంతో గొప్ప గాయకుడు. ఎప్పుడు చూసినా ఆయన మోహములో సంతోషం కనిపించేది. ఆయన జీవితాన్ని ఎంతో ప్రేమించాడు. ఒక ఇంటర్వ్యూ లో ఆయన ఏమన్నాడంటే, ‘జీవితమంటే నాకెంతో ఇష్టం.
ఒక వేళ భగవంతుడు కనుక వరమిస్తే ఎంతకాలమైనా జీవించాలనే కోరుకొంటాను’ జీవితాన్ని అంతగా ఇష్టపడ్డాడు. అయితే కరోనా వైరస్, వృద్ధాప్యం ఆయన ఆశల మీద నీళ్లు చల్లినాయి. సిద్ధార్థుడు తన ప్యాలస్ బయటికి వెళ్ళినప్పుడు ఆయన ఒక వృద్ధుడు పడుతున్న బాధలు చూశాడు. ఎంతో ఆవేదన చెందాడు. గౌతమ బుద్ధుడు గా మారాడు. చాలా మంది తత్వవేత్తలు వృద్ధాప్యము గురించి మాట్లాడారు.
ఆ వృధాప్యం గురించే ఇక్కడ ప్రసంగి మనతో చెబుతున్నాడు.
3. ఆ దినమున ఇంటి కావలివారు వణకు దురు: అంటే మన చేతులు వణకుతాయి
బలిష్ఠులు వంగుదురు: మన వెన్నెముక, కాళ్ళు, భుజాలు ఒంగుతాయి
విసరువారు కొద్దిమంది యగుటచేత పని చాలించుకొందురు: విసరు వారు అంటే
మన పళ్ళు; పళ్ళు ఊడిపోతాయి
కిటికీలలోగుండ చూచువారు కానలేకయుందురు: మన కంటి
చూపు తగ్గిపోతుంది
తిరుగటిరాళ్ల ధ్వని తగ్గిపోవును: మన వినికిడి శక్తి తగ్గిపోతుంది
వీధి తలుపులు మూయబడును: మాటలాడే శక్తి తగ్గిపోతుంది
పిట్టయొక్క కూతకు ఒకడు లేచును: సరిగ్గా నిద్ర పట్టదు, పిట్ట కూతకే మెలకువ వస్తుంది, ఇంకాసేపు నిద్ర పొతే బాగుంటుంది అనుకొంటాము కానీ నిద్ర పట్టదు
సంగీతమును చేయు స్త్రీలు, నాదము చేయువారందరును నిశ్చబ్దముగా ఉంచబడుదురు: పాటలు పాడాలి, వినాలి అనిపించదు, నిశ్చబ్దముగా ఉండాలని కోరుకొంటాము
ఎత్తు చోటులకు భయపడుదురు. మార్గములయందు భయంకరమైనవి కనబడును: ఎత్తైన ప్రదేశాలకు వెళ్లము; దూర ప్రయాణాలు అంటే భయపడతాము
బాదము వృక్షము పువ్వులు పూయును: జుట్టంతా బాదము పువ్వు వలె తెల్లబడిపోతుంది
మిడుత బరువుగా ఉండును: చిన్న, చిన్న వస్తువులు కూడా బరువుగా ఉంటాయి
బుడ్డబుడుసర కాయ పగులును;
త్రాడు తెగింది
గిన్నె పగిలింది
కుండ బద్దలయ్యింది
చక్రము ఆగిపోయింది
మరణము వచ్చింది
మన్నయి నది వెనుకటివలెనే మరల భూమికి చేరును, ఆత్మ దాని దయచేసిన
దేవుని యొద్దకు మరల పోవును
ఏలయనగా ఒకడు తన నిత్యమైన ఉనికిపట్టునకు పోవుచున్నాడు:
నిత్యమైన ఉనికి : His Long Home
నిత్యత్వానికి ఆ వ్యక్తి వెళ్లుచున్నాడు జీవితానికి అర్థము కావాలంటే నిత్యత్వము గురించి ఆలోచించు ఆత్మ దాని దయచేసిన దేవుని యొద్దకు మరల పోవునుజీవితానికి అర్థము కావాలంటే నీ ఆత్మ ఒక రోజు దేవుని యొద్దకు తిరిగి వెళ్తుంది అని గుర్తు పెట్టుకో. నీ బాల్యదినములందే నీ సృష్టికర్తను స్మరణకు తెచ్చుకొనుము జీవితానికి అర్థం కావాలంటే నీ బాల్య దినములయందే దేవుని యొద్దకు రా నీ బాల్యదినముల యందే యేసు క్రీస్తు దగ్గరకు రా. నీ శరీరములో బలము ఉండినప్పుడే దేవుని యొద్దకు రా, దేవుని మాటలు విను, దేవుని పని చేయి. దాని వలన నీ జీవితానికి అర్ధం వస్తుంది.
రోమ్ నగరములో మేమార్టిన్ జైలు కు నేను ఒకసారి వెళ్ళాను. అక్కడ అపోస్తలుడైన పౌలు చివరిగా గడిపిన జైలు గది ఉంది. అక్కడ కూర్చుని ఆయన తిమోతి పత్రిక వ్రాశాడు.‘మంచి పోరాటం పోరాడితిని, నా పరుగు తుదముట్టించితిని’ పౌలు యేసు క్రీస్తును హత్తుకొని వెంబడించాడు. క్రీస్తులో జీవితానికి అర్థం తెలుసుకొన్నాడు.
ఇప్పుడు ముగింపులో ఒక వృద్ధ ఖైదీ గా రోమ్ లో ఉన్నాడు. ‘మంచి పోరాటం పోరాడితిని, I have nothing to regret అంటున్నాడు.
ప్రసంగి గ్రంథము లో నుండి ఈ రోజు ‘అర్థం కోసం మనిషి చేసే అన్వేషణ’ అనే అంశం మనం చూశాము. సొలొమోను అనేక కోణాల నుండి ఆ అంశాన్ని పరిశీలించాడు. చివరకు ఏమన్నాడు? నీ బాల్యదినములందే నీ సృష్టికర్తను స్మరణకు తెచ్చుకొనుముమన సృష్టికర్త ఐన యేసు క్రీస్తు దగ్గరకు మనం రావాలి, మన పాపములు ఒప్పుకొని, మారు మనస్సు పొంది రక్షణ పొందాలి. ఆయన సహవాసాన్ని పొందాలి, ఆయనను ఆరాధించాలి. అదే మన జీవితానికి అర్ధాన్ని ఇస్తుంది. ఆ అనుభవాన్ని మీరు పొందాలన్నదే నేటి మా ప్రేమ సందేశం