గణిత విశ్వములో దేవుని మహిమ : డాక్టర్ పాల్ కట్టుపల్లి

     ‘గణిత విశ్వములో దేవుని మహిమ’ అనే సందేశం ఈ రోజు మీకు ఇవ్వాలని నేనుఆశపడుతున్నాను. గణిత విశ్వములో దేవుని మహిమ The Glory of God in the Mathematical Universe. ఈ సంవత్సరం నోబెల్ బహుమానాలు ప్రకటించారు. భౌతిక శాస్త్రములో ముగ్గురు గొప్ప సైంటిస్టులు – సర్ రోజర్ పెన్ రోజ్, రెయిన్ హార్డ్ గెంజల్, ఆండ్రియా గెజ్ నోబెల్ బహుమానం అందుకొన్నారు. మన విశ్వములో ఉన్న బ్లాక్ హోల్స్ మీద వీరు పరిశోధనలు చేశారు. ఆల్బర్ట్ ఐన్ స్టయిన్ సాపేక్ష సిద్ధాంతము ప్రకారము మన విశ్వములో బ్లాక్ హోల్స్ ఉండాలని పెన్ రోజ్ ప్రతిపాదించాడు. ఈ విశ్వములో కోట్లాది గేలాక్సీలు ఉన్నాయి. మనము ‘మిల్కీవే’  పాల పుంత అనే గేలాక్సీ లో ఉన్నాము.ఈ  గేలాక్సీ మధ్యలో కూడా ఒక పెద్ద బ్లాక్ హోల్ ఉంది అని రెయిన్ హార్డ్ గెంజల్, ఆండ్రియా గెజ్ నిరూపించారు. ఈ బహుమానానికి ముగ్గురూ అర్హులే.

    రోజర్ పెన్ రోజ్ (జననం 1931) పేరు చూసినప్పుడు నాకు సంతోషము కలిగింది ఎందుకంటే ఆయన ఒక గొప్ప గణిత మేధావి. ఆల్బర్ట్ ఐన్ స్టయిన్ సాపేక్ష సిద్ధాంతము లో ఉన్న గణిత శాస్త్రాన్ని ఆయన క్షుణ్ణముగా చదివాడు. ఆ గణిత శాస్త్రము ప్రకారం మన విశ్వములో అనేక బ్లాక్ హోల్స్ ఉంటాయి అని ప్రతిపాదించాడు.‘ఏంటయ్యా, ఏమి మాట్లాడుతున్నావు నువ్వు? బ్లాక్ హోల్సా? అర్థం లేకుండా మాట్లాడుతున్నావు.’అని పెన్ రోజ్ ని ఎగతాళి చేసిన సందర్భాలు ఉన్నాయి. అయితే, రోజర్ పెన్ రోజ్, ఆయన స్నేహితుడు స్టీఫెన్ హాకింగ్   బ్లాక్ హోల్స్ ఉంటాయి, ఏదో ఒక రోజు మనం వాటిని కనుగొంటాము అని చెప్పారు. ఈ రోజు వారి మాట నిరూపించబడింది. ఎక్కడో కాదు, మన గేలక్సీ మధ్యలోనే పెద్ద బ్లాక్ హోల్ ఉంది అని రెయిన్ హార్డ్ గెంజల్, ఆండ్రియా గెజ్నిరూపించారు.

గణిత శాస్త్రము యొక్క శక్తి ఈ పరిశోధనల్లో బయటపడింది.  ‘Predictive power’ ‘ప్రతిపాదన శక్తి’ అని మనం దానిని అంటాము. గణిత శాస్త్రములో ఆ ‘Predictive power’ ‘ప్రతిపాదన శక్తి’ మనకు కనిపిస్తున్నది. 2,4,6,8,10,12,14….ఆ తరువాత సంఖ్య ఏమిటి? 16 అని మీరు చెప్పగలరు. ఎలా చెప్పగలిగారు? 2 కు రెండు కలిపితే నాలుగు నాలుగుకు రెండు కలిపితే 6, ఆరుకు రెండు కలిపితే 8, ఆ సంఖ్యలలో ఒక క్రమాన్ని మీరు గమనించారు. కాబట్టే 14 తరువాత 16 రావాలి అని చెప్పగలిగారు. ఒక ఆర్డర్, ఒక క్రమాన్ని గమనించాలి, అందులో నుండే తరువాత ఏమి వస్తుందో మనము చెప్పగలము. 

     సైంటిస్టులు చేసే పని అదే.వారు ప్రకృతిలో ఉన్న క్రమాన్ని గమనిస్తారు. దానినిబట్టి తరువాత ఏమి వస్తుందో చెప్పగలుగుతారు. ఈ ముగ్గురు సైంటిస్టులు చేసింది అదే. రోజర్ పెన్ రోజ్ ఒక గణిత క్రమాన్ని ప్రకృతిలో గమనించాడు. ఆ క్రమాన్ని బట్టి ‘బ్లాక్ హోల్స్’ ఉంటాయి అని ఊహించాడు, ప్రతిపాదించాడు, సిద్ధాంతాలు వ్రాశాడు. ఆ సిద్ధాంతానికి మిగిలిన ఇద్దరు ఆధారాలు కనుగొని నిరూపించారు.రోజర్ పెన్ రోజ్ ఆక్సఫర్డ్ యూనివర్సిటీ లో గణిత భౌతిక శాస్త్రములో అధ్యాపకునిగా ఉన్నాడు. 2004 లో ఆయన  ఒక పుస్తకము వ్రాశాడు. దానికి ‘రోడ్ టు రియాలిటీ’ అని పేరు పెట్టాడు. అందులో ఒక మాట వ్రాశాడు.మన చుట్టూ మూడు ప్రపంచాలు ఉన్నాయి.మొదటిది ‘ప్లేటోనిక్ గణిత ప్రపంచం’ రెండోది ‘భౌతిక ప్రపంచం’ మూడోది ‘మానసిక ప్రపంచం’ ఈ మూడు ప్రపంచాలు ఒక దానితో ఒకటి కలుస్తున్నాయి. ‘ప్లేటోనిక్ గణిత ప్రపంచం’ అంటే ఏమిటి? గ్రీకు తత్వవేత్త ప్లేటో (క్రీ.పూ 428-347) దానిని ప్రతిపాదించాడు.ప్లేటో ఏమన్నాడంటే, మనకు వేరుగా మన మైండ్ కు వేరుగా, మన భౌతిక ప్రపంచానికి వేరుగా ఒక గణిత ప్రపంచము ఉంది. అది స్థిరముగా ఉంది, నిలకడగా ఉంది.అది మనము సృష్టించింది కాదు. తత్వవేత్తలు దానికి ‘ప్లేటోనిక్ గణిత ప్రపంచం’ అని పేరు పెట్టారు. మన మైండ్ లో ఉండే మానసిక ప్రపంచానికి అది వేరుగా ఉంది.కాబట్టి, రోజర్ పెన్ రోజ్ మూడు ప్రపంచాలు ఉన్నాయి అంటున్నాడు.

మొదటిది ‘ప్లేటోనిక్ గణిత ప్రపంచం’ 

రెండోది ‘భౌతిక ప్రపంచం’ 

మూడోది ‘మానసిక ప్రపంచం’ 

     ఈ మూడు ప్రపంచాల మధ్య మూడు మిస్టరీ లు ఉన్నాయి అన్నాడు. మొదటి మిస్టరీ ఏమిటంటే, ప్లేటోనిక్ గణిత ప్రపంచము భౌతిక ప్రపంచము మీద ఒక క్రమాన్ని ఎలా పెట్టగలిగింది? రెండో మిస్టరీ ఏమిటంటే, మన మానసిక ప్రపంచము భౌతిక ప్రపంచమును ఎలా అర్థం చేసుకొనగలుగుతుంది? మూడో మిస్టరీ ఏమిటంటే, మన మానసిక ప్రపంచం, అంటే మన మైండ్ ‘ప్లేటోనిక్  గణిత ప్రపంచము’ తో ఎలా సంబంధం పెట్టుకొనగలిగింది? కొంతమంది రోజర్ పెన్ రోజ్ తో వ్యతిరేకించారు.వీరిని భౌతిక వాదులు అని పిలువవచ్చు. స్టీఫెన్ హాకింగ్ ఒక భౌతిక వాది. ఆయన ఏమన్నాడంటే, ఉన్నది రెండు ప్రపంచాలే. ‘మానసిక ప్రపంచం’, ‘భౌతిక ప్రపంచం’ ‘ప్లేటోనిక్ గణిత ప్రపంచం’ లేదు అన్నాడు. రోజర్ పెన్ రోజ్ దానికి ఒప్పుకోలేదు. మూడు ప్రపంచాలు ఉన్నాయి. ప్లేటోనిక్ గణిత ప్రపంచం నిజముగా ఉంది అన్నాడు.

అది లేకుండా మనిషి ఆలోచనకు శక్తి లేదు.

అది లేకుండా సైన్స్ లేదు, 

అది లేకుండా ఫిలాసఫీ లేదు.

    ఈ ప్లేటోనిక్ గణిత ప్రపంచము మనలను ఒక గైడ్ లాగా ముందుకు నడిపిస్తుంది. కంటి చూపు సరిగా లేని వ్యక్తి రోడ్డు దాటాలంటే మరొకరి సహాయము తీసుకోవాలి. మనిషి కూడా భౌతిక ప్రపంచములో అన్నిటినీ చూడలేడు. ప్లేటోనిక్ గణిత ప్రపంచము ఆ సమయములో మనిషిని ముందుకు నడిపిస్తున్నది. ఒక పెయింటింగ్ కాదు, అది ఒక మ్యాప్. మీరొక క్రొత్త ఊరు వెళ్లారు అనుకొందాము. వెనిస్ వెళ్లారు అనుకొందాము. ఆ ఊరులో మీరు హోటల్ కి వెళ్లారు. ఒక రూమ్ తీసుకొన్నారు.

ఆ రూమ్ లో గోడ  మీద ఒక పెయింటింగ్ చూశారు. ఆ పెయింటింగ్ లో ఒక కాలువ, ఆ కాలువలో పడవలు, పడవల్లో మనుష్యులు, కాలువ ప్రక్కన బిల్డింగ్ లు మీకు కనిపిస్తే, మీరు వాటినిచూసి ఆనందిస్తారు. అవి చిత్రకారుడు ఊహించి గీచినవిగా మీరు భావిస్తారు.అవి నిజముగా ఆ ఊరిలో ఉన్నాయి అని మీరు అనుకోరు. ఆ తరువాత ఆ హోటల్ మీకు వెనిస్ మ్యాప్ ఒకటి కనిపించింది. ఆ మ్యాప్ లో ఒక పెద్ద కాలువ ఆ పట్టణం మధ్యలో గుండా వెళ్తున్నది . ఆ కాలువ తిన్నగా లేదు. మలుపులు తిరుగుతూ ఉంది. ఆ మ్యాప్ చూసిన తరువాత మీరు ఏమనుకొంటారు? 

     ఈ వెనిస్ లో పట్టణము మధ్యలో గుండా ఒక పెద్ద కాలువ వెళ్తున్నది. అది తిన్నగా లేదు, మలుపులు తిరుగుతూ ఉంది. ఆ కాలువలో పడవ మీద ప్రయాణిస్తే ఈ ఊరు నేను చూడవచ్చు అనుకొంటారు.మనము పెయింటింగ్ వైపు చూడడం వేరు, మ్యాప్ వైపు చూడడం వేరు.పెయింటింగ్ లో కాలువ కనిపిస్తే అది చిత్రకారుడు ఊహించి గీసాడో, లేక చూసింది గీసాడో అనుకొంటాము. ఒక మ్యాప్ ని  ఆ విధముగా చూడము. మ్యాప్ లో కాలువ ఉంటే, ఊరిలో కూడా కాలువ ఉండాలి అనుకొంటాము. ఒక మ్యాప్ వాస్తవ ప్రపంచాన్ని ప్రతిబింబించాలి అనుకొంటాము. ‘ప్లేటోనిక్ గణిత ప్రపంచం’ ఎలా ఉంది? ఒక పెయింటింగ్ లా ఉందా? లేక ఒక మ్యాప్ లాగా ఉందా? స్టీఫెన్ హాకింగ్ లాంటి వారు అది ఒక పెయింటింగ్ లా ఉంది అంటారు. అయితే, రోజర్ పెన్ రోజ్ అది ఒక మ్యాప్ లాగా ఉంది అంటున్నాడు.అంటే, ఈ గణిత ప్రపంచం వాస్తవ ప్రపంచాన్నిమనకు చూపిస్తున్నది. ఒక పెయింటింగ్ వలె ఊహాజనితమైన ప్రపంచాన్ని అది మనకుచూపించడం లేదు. గణితం ప్రకారం ‘బ్లాక్ హోల్స్’ ఉండాలి. వెనిస్ మధ్యలో కాలువ వలె ఈ బ్లాక్ హోల్ మన మధ్యలోనే ఉంది. కనబడే దాకా వెదకండి అన్నాడు.

    సరిగ్గా మన గేలక్సీ మధ్యలోనే వారు పెద్దబ్లాక్ ని చూశారు. ‘ప్లేటోనిక్ గణిత ప్రపంచం’ ఒక మ్యాప్ వలె ఈ ప్రపంచాన్ని మనకు చూపిస్తున్నది. సైన్స్ చరిత్రలో అనేక సార్లు ఇది నిరూపించబడింది. ఒక రోజుల్లో సౌర కుటుంబములో అన్ని గ్రహాలూ భూమి చుట్టూ తిరుగుతున్నాయి అనుకునేవారు.సూర్యుడు కూడా భూమి చుట్టూ తిరుగుతున్నాడు అనుకునేవారు.

నికోలస్ కోపెర్నికస్ (1473-1543) అనే గొప్పశాస్త్రవేత్త ఉన్నాడు. ఆయన  ఒక పాస్టర్.గణిత శాస్త్రాన్ని క్షుణ్ణముగా చదివాడు. గణిత శాస్త్రం ప్రకారం భూమి సూర్యుడు చుట్టూ తిరగాలి, గ్రహాలన్నీ సూర్యుడు చుట్టూ తిరగాలి. అన్నాడు. ఆయన దగ్గర టెలిస్కోపులు లేవు, శాటి లైట్లు లేవు. కేవలం గణిత శాస్త్రం ప్రకారం సౌర కుటుంబం ఎలా ఉండాలో చెప్పాడు. చాలా మంది ఆయనను అపహాస్యం చేశారు.సూర్యుడు చుట్టూ భూమి తిరగడం ఏమిటి? ఈ పిచ్చి వాడు ఏమి మాట్లాడుతున్నాడు? అన్నారు. అయితే, కోపర్నికస్ చెప్పిందే నిజం అని తరువాత పరిశోధనల్లో తేలింది.

     ఆ తరువాత జోహన్నస్ కెప్లెర్ (1571-1630) అనే గొప్ప శాస్త్రవేత్త వచ్చాడు. ఆయన ఏమన్నాడంటే, దేవుడు ఈ విశ్వాన్ని సృష్టించాడు కాబట్టి ప్రకృతి లో తప్పనిసరిగా మనకు ఒక క్రమం కనిపిస్తుంది. ప్రకృతిలో గణిత శాస్త్రము పెట్టింది దేవుడే అన్నాడు. కోపర్నికస్ చెప్పింది నిజమే అన్నాడు. సూర్యుడు చుట్టూ అన్ని గ్రహాలూ తిరుగుతున్నాయి. అవి వృత్తాకారములో ఉండే కక్ష్యలలో కాకుండా, దీర్ఘ వృత్తాకారంలో ఉండే కక్ష్యలలో తిరుగుతున్నాయి అన్నాడు.గ్రహాల గమనము గురించి మూడు గొప్పగణిత నియమాలు ప్రతిపాదించాడు. 

     ఆ గాలాలయో గాలలీ (1564-1642) అనే శాస్త్రవేత్త వచ్చాడు.కెప్లెర్ ఆకాశములో తిరిగే వస్తువుల గమనాన్ని పరిశీలిస్తే, గాలాలయో భూమి మీద ఉండే వస్తువుల గమనాన్ని పరిశీలించాడు. ఇటలీలో అనేక చోట్లకు వెళ్లి ఎన్నో పరిశోధనలు చేశాడు.భూమి మీద ఉన్న వస్తువుల గమనములో కూడా గణిత శాస్త్ర నియమాలు ఉన్నాయి అన్నాడు. ‘దేవుడు గణిత శాస్త్ర భాషలో ఈ విశ్వాన్ని వ్రాశాడు’ అన్నాడు.

‘‘the universe is written in the language of mathematics  by God”

     గాలాలయో తరువాత ఐజాక్ న్యూటన్ (1643-1727) వచ్చాడు.ఆయన అన్ని వస్తువుల గమనాన్ని పరిశీలించాడు.కెప్లెర్ ఆకాశ వస్తువుల గమనంలో గణితనియమాలు చూశాడు. గాలాలయో భూమి మీద వస్తువుల గమనంలో గణిత నియమాలు చూశాడు. న్యూటన్ జ్ఞానము ఏమిటంటే, అవి రెండూ ఒకటే అని నిరూపించాడు.భూమి లేదు, ఆకాశం లేదు – ఈ విశ్వములో అన్ని వస్తువులు గణిత నియమాలు పాటించాల్సిందే అన్నాడు. న్యూటన్ విశ్వ గురుత్వాకర్షణ నియమం వ్రాశాడు. తన చేతిలో ఉన్న ఆపిల్ ని ఏ శక్తి ప్రభావితం చేస్తుందో, అదే శక్తి విశ్వములో ఉన్న ప్రతి వస్తువును ప్రభావితం చేస్తుంది అన్నాడు. ‘ఈ గురుత్వాకర్షణ నియమములో దేవుని అద్భుతమైన జ్ఞానము మనకు కనిపిస్తున్నది’ అన్నాడు. ప్రింకిపియా మాథెమటికా అనే పుస్తకం వ్రాశాడు. అందులో దేవుని మహిమపరచాడు. భిన్నత్వములో ఏకత్వం ఉంది అన్నాడు. 

      ఆకాశములో వస్తువులు, భూమి మీద వస్తువులు మనకు వేరువేరుగా కనిపిస్తాయి.అయితే వాటిని నడిపించేది ఒకే గణిత శాస్త్రం అన్నాడు. న్యూటన్ గణిత శాస్త్రాన్ని ఉపయోగించి, 1846 లో ఫ్రాన్స్ దేశానికి చెందిన అర్బైన్ లెవియే అనే గణిత శాస్త్రవేత్త నెప్ట్యూన్ గ్రహాన్ని కనుగొన్నాడు.న్యూటన్ గణిత శాస్త్రం ఒక మ్యాప్ లాగా ఆయనకు కనిపించింది. అక్కడ ఒక క్రొత్త గ్రహం ఉంటుంది. జాగ్రత్త్తగా చూడండి అన్నాడు. ఆయన చెప్పిన చోట వెదికారు, ఒక క్రొత్త గ్రహాన్ని కనుగొన్నారు. నెప్ట్యూన్ గ్రహం అని పేరుపెట్టారు.

     న్యూటన్ తరువాత జేమ్స్ జూల్ 1818-1889 అనే శాస్త్రవేత్తవచ్చాడు. ప్రకృతి లో శక్తి అనేక రూపాల్లో ఉంది.వేడిలో ఉండే శక్తి, రసాయనిక శక్తి, గమన శక్తి, ధ్వని శక్తి, సౌర శక్తి. అనేక రూపాల్లో కనిపిస్తున్న ఈ శక్తికి ఏకత్వము లేదా? అని ఆయన ఆలోచించాడు.అనేక రకాల వస్తువుల గమనంలో న్యూటన్ ఒకే గణిత శాస్త్ర నియమాలు చూశాడు. అనేక రూపాల్లో ఉన్న శక్తి క్రింద కూడా ఒకే గణిత శాస్త్ర నియమాలు ఉండాలి అనుకొన్నాడు.పరిశోధనలు చేశాడు. అప్పుడే ఉష్ణ గతి శాస్త్ర నియమాలు బయటపడ్డాయి.

the laws of thermodynamics

మొదటి ఉష్ణ గతి శాస్త్ర నియమాన్ని కనుగొన్న తరువాత జేమ్స్ జూల్ ఒక మాట అన్నాడు.‘మొదటి ఉష్ణ గతి నియమములో మనకుదేవుని యొక్క మంచి తనము కనిపిస్తున్నది’ (జేమ్స్ జూల్)

The first law of thermodynamics shows us the beneficence of God 

దేవుని యొక్క మంచితనము ఈ నియమములో మనకు కనిపిస్తుంది అన్నాడు. ఎందుకంటే, ప్రకృతిలో వున్న శక్తిని అనేక రూపాల్లో మనము పొందాలని దేవుడు ఉద్దేశించాడు. శక్తి అనేక రూపాల్లో ఉన్నప్పటికీ అందులో ఏకత్వం ఉంది. ఒకే గణిత శాస్త్ర నియమాలు శక్తిని నడిపిస్తున్నాయి అని జేమ్స్ జూల్ గుర్తించాడు. 

     జేమ్స్ జూల్ తరువాత మైఖేల్ ఫెరడే (1791-1867) వచ్చాడు.ఆ రోజుల్లో విద్యుతు శక్తి, అయస్కాంత శక్తి వేరు వేరుగా కనిపిస్తున్నాయి. ఒక వైర్ లో గుండా విద్యుత్ పంపిస్తే దాని దగ్గరలో ఉన్న అయస్కాంతాలు కదులుతున్నాయి.భిన్నత్వములో ఏకత్వాన్ని గణితశాస్త్రం చూపిస్తుంది కాబట్టి, అది ఈ విద్యుత్ శక్తి, అయస్కాంత శక్తి ల మధ్య కూడా ఉండాలి అనుకొన్నాడు. పరిశోధనలు చేశాడు.విద్యుత్ శక్తి పంపిస్తే అయస్కాంతాలు కదులుతున్నాయి.అయస్కాంతాలు కదిలిస్తే విద్యుత్ శక్తి రావాలి అనుకొన్నాడు. అయస్కాంతాలు తిప్పి విద్యుత్ సృష్టించాడు. మన ప్రపంచ స్వరూపాన్ని మార్చివేశాడు. పెద్ద పెద్ద టర్బయిన్ లను త్రిప్పి విద్యుత్తును మనం అపారముగా సృష్టిస్తున్నాము. మనిషి జీవితములో ఎలక్ట్రిసిటీ లేని రోజును మనం ఊహించలేము.

     మైఖేల్ ఫారడే తరువాత జేమ్స్ క్లార్క్ మాక్స్ వెల్ (1831-1879) అనే శాస్త్రవేత్త వచ్చాడు. విద్యుతు శక్తి, అయస్కాంత శక్తి అవి రెండూ ఒక్కటే అని గణిత నియమాలు వ్రాశాడు. అవి రెండు వేరు కాదు, భిన్నత్వములో ఏకత్వము ఉంది, రెండిటినీ కలిపి విద్యుతయస్కాంత శక్తి అని పిలిచాడు. అది ఒక తరంగములు రూపములో ప్రయాణిస్తున్నది. కాంతి వేగముతో ప్రయాణిస్తున్నది అని గ్రహించాడు. దాని వలన ఆశ్చర్యకరంగా కాంతి యొక్క స్వభావము కూడా అర్థం అయ్యింది.కాంతి కూడా ఒక విద్యుతయస్కాంత తరంగం అని చెప్పాడు. ఈ విద్యుతయస్కాంత తరంగాల్లో ఉన్న గణిత నియమాలు పరిశీలించాడు. ఆ తరంగాల్లో మన కంటికి కనిపించే తరంగాలు ఉన్నాయి, మన కంటికి కనిపించని తరంగాలు కూడా ఉంటాయి అని చెప్పాడు.ఆయన వ్రాసిన గణిత నియమాల ప్రకారం పరిశోధనలు చేసి అనేక రకాలైన విద్యుతయస్కాంత తరంగాలు కనుకొన్నారు.

రేడియో తరంగాలు, మైక్రోవేవ్ తరంగాలు, 

ఇన్ఫ్రా రెడ్ తరంగాలు

అల్ట్రా వయొలెట్ తరంగాలు, 

ఎక్స్ రే తరంగాలు, గామా తరంగాలు.

    ఆ తరంగాల్లో ప్రతి తరంగం మానవ సమాజాన్ని ఊహించని విధముగా మార్చివేసింది. రేడియో తరంగాల వలన రేడియో లు, టెలిగ్రామ్ లు, ఫోన్ లు కనుగొన్నారు. ఎక్స్ రే తరంగాలు వుపయోగించి ఎక్స్ రే లు తీయించుకొంటున్నాము.అవన్నీ కాంతి వేగముతో ప్రయాణిస్తున్నాయి అని జేమ్స్ క్లార్క్ మాక్స్ వెల్ అన్నాడు. మాక్స్ వెల్ తరువాత ఆల్బర్ట్ ఐన్ స్టయిన్ అనే శాస్త్రవేత్త వచ్చాడు. ఆయన మాక్స్ వెల్ వ్రాసిన గణిత నియమాలు చదివాడు. మాక్స్ వెల్ చెప్పినట్లు కాంతి వేగం స్థిరముగా ఉంటే, ఇంకా దేనికీ స్థిరత్వం ఉండదు.సమయానికి స్థిరత్వం ఉండదు, పదార్ధానికి స్థిరత్వం ఉండదు, శూన్యానికి స్థిరత్వం ఉండదు, కొలతలకు స్థిరత్వం ఉండదు, ఆల్బర్ట్ ఐన్ స్టయిన్ ఆ ఆలోచనలతో సాపేక్ష సిద్ధాంతము వ్రాశాడు. సమయానికి స్థిరత్వము లేదు అన్నాడు. 

     ఆల్బర్ట్ ఐన్ స్టయిన్ ఒక యూదుడు. వారు బైబిల్ చేత ప్రభావితం చెందినవారు. సమయానికి స్థిరత్వము లేదు అని బైబిల్ లో దేవుడు స్పష్టముగా  మనకు తెలియజేశాడు. 

నీ దృష్టికి వేయి సంవత్సరములు గతించిన 

నిన్నటివలె నున్నవి రాత్రియందలి 

యొక జామువలెనున్నవి 

                                   కీర్తన 90:4 

లో మనము చదువుతాము. దేవుని దృష్టిలో వేయి సంవత్సరములు ఒక రోజు వలె ఉన్నాయి. హెన్రిక్ లోరెంట్జ్ (1853-1928) అనే గణిత శాస్త్రవేత్త మాక్స్ వెల్ గణిత నియమాలను ఆధారముగా చేసుకొని కొన్ని క్రొత్త గణిత నియమాలు వ్రాశాడు. వాటి నుండి ‘టైం డై లేషన్’ పుట్టింది.సమయానికి స్థిరత్వం లేదు, అది సాగబడుతుంది, కుదించబడుతుంది. సమయం సాగుట ‘టైం డై లేషన్’ అనేది కల్పించింది కాదు, సైన్స్ ఫిక్షన్ కాదు. అది వాస్తవమే. 

     ఈ రోజున మనం ప్రయాణాలలో GPS వాడుతున్నాము. మన ఫోన్ లో ఉండే GPS సరిగ్గా పనిచేయాలంటే అనేక శాటి లైట్లతో మనకు కనెక్షన్ ఉండాలి.మన ఫోన్ లను, శాటి లైట్లతో కలిపేటప్పుడు ఐన్ స్టయిన్ సాపేక్ష సిద్ధాంతమును పరిగణనలోకి తీసుకోవాలి. అందుకనే శాటి లైట్లు పంపే ముందు వాటి సమయాన్ని తగ్గిస్తారు.మన సమయము వేగముగా వెళ్తుంది, శాటి లైట్లు సమయము నిదానముగా వెళ్తుంది.ఐన్ స్టయిన్ సాపేక్ష సిద్ధాంతము వుపయోగించి ఈ రెండిటినీ అనుసంధానం చేయాలి.సమయానికి స్థిరత్వము లేదు అంటే అది శాశ్వతమైనది కాదు, సమయము కూడా సృష్టించబడిందే. ఆ విధముగా ఐన్ స్టయిన్  సాపేక్ష సిద్ధాంతము ఆదికాండము మొదటి అధ్యాయములో ఉన్న సృష్టి కార్యము వద్దకు మనలను తీసుకువెళ్తుంది. 

‘ఆదియందు దేవుడు 

భూమ్యాకాశములను సృష్టించెను’ 

                     ఆదికాండము 1:1 

    దేవుడు మన విశ్వాన్ని సృష్టించినప్పుడే సమయాన్ని కూడా సృష్టించాడు. మొదటిగాఆయన వెలుగును సృష్టించాడు. దానికి స్థిరమైన వేగాన్ని ఇచ్చాడు.ఇప్పుడు నోబెల్ బహుమానం పొందిన రోజర్ పెన్ రోజ్ ఐన్ స్టయిన్ సాపేక్ష సిద్ధాంతములోఉన్న గణిత శాస్త్రాన్ని క్షుణ్ణముగా చదివాడు. ఒక వస్తువు తనకు ఉన్న గురుత్వాకర్షణ శక్తితో కాంతి పయనాన్ని ప్రభావితం చేస్తుంది.ఒక వస్తువు బరువు పెరిగే కొద్దీ దాని గురుత్వాకర్షణ శక్తి పెరుగుతుంది. ఆ వస్తువు బరువు పెరిగేకొద్దీ, దాని గురుత్వాకర్షణ పెరిగే కొద్దీ, చివరకు కాంతి కూడా ఆ ప్రదేశాన్ని విడచి వెళ్లలేని పరిస్థితి వస్తుంది.  ఆ ప్రదేశాలకు‘బ్లాక్ హోల్స్’ అని పేరు పెట్టారు. గణిత శాస్త్రం ఆధారముగా రోజర్ పెన్ రోజ్ ప్రతిపాదించిన ఈ బ్లాక్ హోల్స్ ఇప్పుడు వాస్తవ ప్రపంచములో ఉన్నాయి అని మనము తెలుసుకున్నాము.        నాడు కోపెర్నికస్ నుండి నేడు రోజర్ పెన్ రోజ్ వరకు గణిత శాస్త్రం ఒక మ్యాప్ లాగా సైన్స్ ను ముందుకు నడిపిస్తున్నది. మనము కలలో కూడా ఊహించని విషయాలు గణిత శాస్త్రము మనకు భోదిస్తున్నది.

గణిత విశ్వములో దేవుని మహిమ

The Glory of God in the

 mathematical universe 

అనే అంశం ఈ రోజు మనం చూశాము. నోబెల్ బహుమానము పొందిన రోజర్ పెన్ రోజ్ మూడు ప్రపంచములు ఉన్నాయి అన్నాడు.

ప్లేటోనిక్ గణిత ప్రపంచం

భౌతిక ప్రపంచం 

మానసిక ప్రపంచం 

వాటి మధ్యలో మనకు దేవుడు కనిపిస్తున్నాడు.

దేవుని కోణములో నుండి చూస్తే వాటిమధ్య ఎలాంటి మిస్టరీలు కనిపించవు.ఆ మూడు ప్రపంచాలను దేవుడే తన జ్ఞానముతో, తన మహిమ కొరకు సృష్టించాడు. భౌతిక ప్రపంచాన్ని అర్థం చేసుకోవాలంటే, మన మానసిక ప్రపంచం గణిత ప్రపంచాన్ని ఒక గైడ్ గా ఉపయోగించుకోవాలి.ఒక మ్యాప్ లాగా ఉపయోగించుకోవాలి.ఆ మ్యాప్ గీసింది దేవుడే.ప్రతి మ్యాప్ ఎవరో ఒకరు గీయాల్సిందే. ఏ మ్యాప్ దానికంతటదే పుట్టదు.

ఈ ప్లేటోనిక్ గణిత ప్రపంచము దేవుడు ఈ విశ్వం మీద గీసిన మ్యాప్. గాలలాయో 

ఆ మాటే అన్నాడు: 

‘దేవుడు గణిత శాస్త్ర భాషలో

ఈ విశ్వాన్ని వ్రాశాడు’ అన్నాడు.

‘‘the universe is written in the language of mathematics  by God”

-భౌతిక ప్రపంచములో భిన్నత్వములో ఏకత్వమును కూడా మనకు గణిత ప్రపంచం 

చూపిస్తున్నది. ఈ భిన్నత్వములో ఏకత్వము అనేది దేవుని స్వభావములో నుండి 

వచ్చిందే. దేవుని లో ముగ్గురు భిన్న వ్యక్తులు ఉన్నారు.

తండ్రి, కుమారుడు, పరిశుద్ధాత్ముడు 

తండ్రి చేసే పనులు, కుమారుడు చేసే పనులు, పరిశుద్ధాత్ముడు చేసే పనులు

వేరు వేరుగా మనకు కనిపించ వచ్చు.అయితే, వాటిలో ఏకత్వము ఉంది.

దైవిక త్రిత్వములో ఉన్న ఆ ముగ్గురు వ్యక్తుల స్వభావము ఒక్కటే, వారి 

లక్షణాలు ఒక్కటే, వారి లక్ష్యము ఒక్కటే. అది ఏమిటంటే, 

మనము దేవుని తెలుసుకోవాలి, 

దేవుని మహిమను చూడాలి, 

దేవుని మంచితనాన్ని చూడాలి, 

యేసు క్రీస్తు ప్రభువు నందు మనకు 

కలిగిన ప్రత్యక్షత మనము చూడాలి.

ఆయన సిలువను మనము చూడాలి

అందులో చూపించబడిన దేవుని 

ప్రేమను మనము చూడాలి. 

పాప క్షమాపణ పొంది రక్షణ పొందాలి. 

అదే నేటి మా ప్రేమ సందేశం.

–డాక్టర్ పాల్ కట్టుపల్లి

Leave a Reply