2021 న్యూ ఇయర్ సందేశం: దేవుడు ఇచ్చే శక్తి – డాక్టర్ పాల్ కట్టుపల్లి

pexels-photo-5716815.jpeg
Photo by Karolina Grabowska on Pexels.com

2021 సంవత్సరంలోకి మనం ప్రవేశించాము. మీ అందరికీ నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియజేస్తున్నాము. ఈ సంవత్సరం దేవుడు మిమ్ములను ఆదరించి, బలపరచి తన సన్నిధిని మీకు మెండుగా అనుగ్రహించాలని మా ప్రార్థన. క్రొత్త సంవత్సరం అంటే మా ఇంట్లో వారికి  మా అమ్మ గుర్తుకు వస్తుంది. మా అమ్మ రాజాబాయి గారు 2018 జనవరి 3 తేదీ మరణించింది. ఈ సమయములో మేము ఆమెను జ్ఞాపకం చేసుకొంటున్నాము. ఆమె నేర్పించిన పాఠాలు ఈ రోజుకు కూడా మాకు ఎంతో సహాయపడుతున్నాయి. ఆమె గొప్ప ప్రవక్త. తన సువార్త ప్రకటనతో అనేక మందిని యేసు ప్రభువు దగ్గరకు నడిపించింది. ఆమె వ్రాసిన పుస్తకాల ద్వారా ఇప్పటికి కూడా ఆమె స్వరం మనం వినగలుగుచున్నాము. దేవుని నడిపింపు పొందగలుగుతున్నాము. 

     బైబిల్ స్టడీ కొరకు మా వెబ్ సైట్ www.doctorpaul.org ని  సందర్శించండి. ప్రతి రోజూ చాలా మంది మా వెబ్ సైట్ దర్శించి బైబిల్ ధ్యానము చేస్తున్నారు. ప్రతి వారము క్రొత్త వ్యాసాలు పోస్ట్ చేస్తున్నాము.సమయం ఉన్నప్పుడు మా వెబ్ సైట్ దర్శించండి.ఈ రోజు నూతన సంవత్సరం సందర్భముగా మీతో కొన్ని సత్యాలు పంచుకోవాలని నేను ఆశిస్తున్నాను. 2020 సంవత్సరం మన కళ్ళ ఎదుటే కరిగిపోయింది. 2020 మొదలవుటతోనే కరోనా వైరస్ మన ప్రపంచము మీదకు దూసుకు వచ్చింది. ఆ తరువాత లాక్ డౌన్ లు మొదలయినాయి. ఎంతో అనిశ్చితి ని మనం చవిచూశాము. చాలా మంది ఉద్యోగాలు కోల్పోయారు. ఆకలితో అలమటించారు. రోగులతో హాస్పిటల్స్ నిండిపోయినాయి. 

    జనవరి నెలలో నేను క్రొత్త హాస్పిటల్ ఓపెన్ చేసి ప్రారంభించాను. ప్రశాంతముగా ఉంటుంది అనుకొన్నాను. అలాంటి సమయములో కరోనా వచ్చి మీద పడింది. నా హాస్పిటల్ లో స్థలము లేక వెయిటింగ్ రూమ్ లో కూడా బెడ్లు వేసాను. ఆక్సిజన్ సిలిండర్ ఖాళీ అయిపోయినాయి. మందులన్నీ అయిపోయిన సందర్భాలు చవిచూశాను. పేషెంట్ ని అంటుకోవాలంటే గ్లోవ్స్ వేసుకోవాలి. ఒక సమయములో గ్లోవ్స్, PPE కిట్లు లేని పరిస్థితి వచ్చింది. అమెజాన్ సంస్థ వాళ్ళు నాతో ఏమన్నారంటే, ఇక నీకు పంపించటానికి మా దగ్గర గ్లోవ్స్, కిట్లు లేవు. అమెజాన్ వాళ్ళు, ప్రపంచములోనే పెద్ద కంపెనీ మీది. పంపించండి అంటే. మా దగ్గర ఉంటే కదా నీకు పంపించటానికి అన్నారు. ఒక ప్రక్క కరోనా బాధితులు బాధతో ఆక్రందన లు చేస్తూ ఉన్నారు. ఇంజక్షన్ ఇవ్వాలంటే సూదులు లేవు. అటువంటి పరిస్థితులను గత సంవత్సరం నేను చూశాను. అన్ని వైపులా కొరతలు చూశాను. మీలో ప్రతి ఒక్కరికి మీ మీ అనుభవాలు ఉంటాయి.

    ఇప్పుడు వాక్సిన్ వచ్చింది. అది మనకు ఎప్పుడు అందుతుందో చెప్పలేము. ఇశ్రాయేలు దేశం 10 శాతం ప్రజలకు వాక్సిన్ ఇచ్చింది. వాక్సిన్ ప్రజలకు అందించటంలో వారు ప్రపంచములో అన్ని దేశాల కంటే ముందు ఉన్నారు. మనకు కూడా వాక్సిన్ తొందరగా అందాలని ప్రార్ధన చేద్దాము. కొత్త సంవత్సరములో ప్రవేశించాం కానీ మనం ఇంకా అలసిపోయే ఉన్నాము. పేరుకు క్రొత్త సంవత్సరంలోకి వచ్చినప్పటికీ మన పాత సమస్యలు మనలను ఇంకా  చుట్టుముట్టే ఉన్నాయి. ఇలాంటి సందర్భాలలో 

మనము ఏమి చెయ్యాలి? ఈ రోజు నా సందేశానికి ‘దేవుడు ఇచ్చే శక్తి’ అని పేరు పెట్టాను. యెషయా గ్రంథాన్ని నేను ప్రస్తుతము ధ్యానిస్తూ ఉన్నాను. అందులో నుండి ఒక వాక్యము మీతో పంచుకోవాలని నేను ఆశిస్తూ ఉన్నాను.

     యెషయా గ్రంథం 40 అధ్యాయం లో 28 వచనము నుండి చూద్దాము: 

భూదిగంతములను సృజించిన

యెహోవా నిత్యుడగు దేవుడు

ఆయన సొమ్మసిల్లడు అలయడు 

ఆయన జ్ఞానమును శోధించుట అసాధ్యము.

సొమ్మసిల్లినవారికి బలమిచ్చువాడు ఆయనే

శక్తిహీనులకు బలాభివృద్ధి కలుగజేయువాడు ఆయనే.

బాలురు సొమ్మసిల్లుదురు అలయుదురు¸

యౌవనస్థులు తప్పక తొట్రిల్లుదురు.

యెహోవాకొరకు ఎదురు చూచువారు

నూతన బలము పొందుదురు వారు 

పక్షిరాజులవలె రెక్కలు చాపి పైకి ఎగురుదురు

అలయక పరుగెత్తుదురు సొమ్మసిల్లక

నడిచిపోవుదురు.    

                    యెషయా గ్రంథం 40 : 28 – 31

    ఇశ్రాయేలీయులందరూ సొమ్మ సిల్లి పోయివున్నప్పుడు యెషయా ప్రవక్త వారికి ఈ మాటలు చెప్పాడు. ముందుగా ఈ యెషయా యొక్క చారిత్రక నేపధ్యం చూద్దాము. ఉజ్జియా, యోతాము ఆహాజు హిజ్కియాయను 4 రాజుల క్రింద యెషయా జీవించాడు. ఉజ్జియా (అజర్యా) 52 సంవత్సరాలు జీవించాడు. క్రీ.పూ 740 లో ఆయన మరణించాడు. 2 దిన 26:3. ఉజ్జియాకు కుష్టు రోగం వచ్చినప్పుడు ఆయన కుమారుడు యోతాము 16 సంవత్సరాలు అతనితో పాటు పరిపాలించాడు (2 దిన 26:21). యోతాము రాజు తరువాత ఆహాజు మరో16 సంవత్సరాలు పరిపాలించాడు. 2 దిన 28:1. అతని తరువాత హిజ్కియా రాజయ్యాడు.ఆయన 29 సంవత్సరాలు పరిపాలించాడు.2 దిన 29:1. అతని తరువాత  మనషే క్రీ.పూ 699 లో పరిపాలించడం మొదలుపెట్టాడు.2 దిన 33:1. మనషే రాజు క్రింద యెషయా చంపబడినట్లు కొన్ని చరిత్ర గ్రంథాలు చెబుతున్నాయి. 

తండ్రి, కుమారుడు, మనవడు, ముని మనవడు, ముని ముని మనవడి చేతిలో ప్రాణం కోల్పోయాడు. మనషే రాజు చాలా దుర్మార్గుడు. యెషయా బోధలు ఆయనకు గిట్ట లేదు. యెషయాను రెండు చెక్క దిమ్మల మధ్య బంధించి రంపాలతో కోయించాడు అని కొన్ని చరిత్ర గ్రంథాలు చెబుతున్నాయి. హెబ్రీయులకు వ్రాసిన పత్రిక 11 అధ్యాయంలో  విశ్వాస వీరుల పట్టిక మనకు కనిపిస్తుంది.  అక్కడ ‘రంపములతో కోయబడిరి’ (హెబ్రీ 11:37) అనే మాట మనం చదువుతాము. ఆ మాట యెషయా ప్రవక్త గురించే అని కొన్ని గ్రంథాలు తెలియజేస్తున్నాయి. 

       యెషయా దేవుని నీతిని, పరిశుద్ధతను, న్యాయాన్ని ప్రజలకు బోధించిన గొప్ప ప్రవక్త.  తన చుట్టూ ఉన్న అన్యాయాలను, అక్రమాలను, అవినీతిని, వేషధారణను, స్వార్ధాన్ని తీవ్రముగా ఖండించాడు. బైబిల్ లో ఉన్న ప్రవక్తలను మీరు గమనిస్తే, ఒక్కొక్క ప్రవక్తకు ఒక్కొక ప్రత్యేకత ఉంది. సమూయేలు రాజులను గద్దించాడు.  మీకా న్యాయము గురించి ప్రవచించిన ప్రవక్త. హోషేయా ప్రేమ గురించి ప్రవచించాడు. ఏలీయా విశ్వాసము గురించి ప్రవచించాడు. యోనా తీర్పు గురించి ప్రవచించాడు. దానియేలు దేవుని రాజ్యం గురించి ప్రవచించాడు. వాటన్నిటినీ ఒక్క యెషయా ప్రవక్తలో మనం చూస్తున్నాము. అందుకనే, యెషయాను Prince of the Prophets ప్రవక్తలకు రాజు అని పిలిచారు. ఎందుకంటే వారందరిలో ఉన్న ప్రత్యేకతలు ఈయన ఒక్కడిలో మనకు కనిపిస్తున్నాయి. (దేవుని ప్రవక్తలు రిస్క్ తీసుకొన్నారు. వారు దేవుని మాటలు ధైర్యముగా రాజులకు, ప్రజలకు బోధించారు. దేవుని సత్యము ఉన్నది ఉన్నట్లుగా ప్రకటించారు. వారి ప్రాణాల గురించి భయపడలేదు. యెషయా 60 సంవత్సరాలు దేవుని ప్రవచనాలు బోధించి మనషే రాజు చేతిలో మరణించాడు. (Apocryphal Martyrdom of Isaiah))

చారిత్రిక నేపథ్యం 

     యెషయాప్రవక్త క్రీ.పూ 740 – 680 లమధ్య తన పరిచర్య చేశాడు.ఆ సమయములో అస్సీరియా సామ్రాజ్యం ప్రపంచాన్ని శాసిస్తున్నది. యూదా రాజ్యమును కూడా వారు భయపెట్టారు. క్రీ.పూ 743 లో తిగ్లత్ పిలేషర్ దక్షిణం వైపు తన సేనలతో దూసుకొని వచ్చాడు.హమాతు, కర్కెమీషు, తూరు, బిబ్లాస్ లాంటి గొప్ప పట్టణాలను నేల మట్టం చేసాడు. 2 రాజులు గ్రంథం 15:19-20 అధ్యాయములో ఆ వివరాలు మనము చదువుతాము. క్రీ.పూ 734 లో ఆయన ఫినీషియా ని జయించాడు, అష్కేలోను, గాజా పట్టణాలు ఆయనకు కప్పం కట్టడం ప్రారంభించాయి. అయితే ఇశ్రాయేలు రాజు పేక (క్రీ.పూ 752-732), సిరియా రాజు రెజీను ఇద్దరూ కూటమి గా ఏర్పడి అషీరియా రాజును ఎదిరించారు.

అందుకనే క్రీ.పూ 732 లో తిగ్లత్ పేలేషర్ మూడవ సారి వారి మీదదాడిచేశాడు.ఆయన దమస్కును నాశనం చేశాడు.రెజీను రాజును చంపివేశాడు.ఇశ్రాయేలు రాజు పేక స్థానములో హోషేయను రాజును చేశాడు (2 రాజులు17:1-6). క్రీ.పూ 724 లో అషీరియా రాజు శాల్మనేశేరు 5 ఇశ్రాయేలును చుట్టుముట్టాడు. 

    క్రీ.పూ 721 లో ఉత్తర దేశం 10 గోత్రాలు చెరలోకి తీసుకొని వెళ్ళాడు ఆతరువాత అశూరీయుల కళ్ళు దక్షిణ దేశం మీద పడ్డాయి. ఉత్తర దేశం అయిపొయింది. ఇప్పుడు మీ వంతు.మిమ్మల్ని కూడా నాశనం చేసి నిద్రపోతాం అన్నారు. ఆ విధముగా యెషయా కాలములో  ఈ  అషూరు  రాజులు ఇశ్రాయేలీయుల మీద దాడులు చేస్తూ వున్నారు. తిగ్లత్ పిలేషర్, శాల్మనేషర్, శార్గన్, సన్నెకరీబు – ఒకడి తరువాత ఒకడు ఇశ్రాయేలీయుల మీద దాడులు చేస్తూనే  ఉన్నారు. ఎప్పుడు ఎవరు  వచ్చి  మీద పడతారో  తెలియని పరిస్థితి ఇశ్రాయేలీయులకు కలిగింది. వారికి ధైర్యము లేదు . అశూరీయుల ముందు నిలబడే సాహసం ఎవరూ చేయలేకపోయారు. అటువంటి సమయములో యెషయా దేవుని యందు విశ్వాసముంచాడు. 

    క్రీ.పూ 701 లో సన్నెకరీబుఅశీరియ సామ్రాజ్యానికి చక్రవర్తి అయ్యాడు.ఆ సమయములో యూదా దేశానికి హిజ్కియా రాజుగా ఉన్నాడు. సన్నెకరీబు ను ఎలా ఎదుర్కోవాలో హిజ్కియా కు అర్ధం కాలేదు. అతని బెదిరింపులు విని హిజ్కియా జుట్టు పీక్కున్నాడు. చుట్టూ ప్రక్కల దేశాలను సహాయం కోసం బ్రతిమలాడాడు.యెషయా ప్రవక్త హిజ్కియాను ప్రశ్నించాడు. నీ చుట్టు ప్రక్కల దేశాలను బ్రతిమలాడుకొంటున్నావు. ఒక్కసారైనా దేవుని సహాయం అడిగావా?  ఆ సమయములో హిజ్కియా దేవుని శక్తిని చూడలేదు.తన స్వంత శక్తి మీదే ఆధారపడ్డాడు.మా దగ్గర ఉన్నది మొత్తం నీకు దోచిపెడతాము, మమ్మల్ని వదలిపెట్టు అని సన్నెకరీబు  రాజును  బ్రతిమలాడుకొని  కాళ్ళ  బేరం పెట్టాడు . యెషయా  ప్రవక్త  హిజ్కియా  రాజును  గద్దించాడు . 

ఏంటి  నీవు  చేస్తున్న పని ? ఆ అన్యుని కాళ్ళు పట్టుకొని  ఎంత  కాలము ప్రాధేయపడతావు? ఎంత కాలం భయముతో బ్రతుకుతావు?  నువ్వు ఎంత  దోచిపెట్టినా వాడు నిన్ను వదిలిపెట్టడు . జలగ  లాగా  నీ  రక్తాన్ని , నీ ప్రజల రక్తాన్ని  పీల్చుకొంటాడే  గానీ  నిన్ను స్వేచ్ఛగా   బ్రతకనివ్వడు . నువ్వు మోకరించి  దేవుని ఎదుట మొఱ్ఱపెట్టు. దేవుని శక్తి నిన్ను, ఈ దేశ  ప్రజలను  విడిపిస్తుంది అన్నాడు . హిజ్కియా రాజు అప్పుడు బుద్ధి తెచ్చుకొని దేవుని సన్నిధిలో మోకరించి మొఱ్ఱపెట్టాడు . అప్పుడు దేవుని శక్తి అతనికి లభించింది . దేవుడు ఆశ్చర్య కార్యము చేశాడు.  ఒక దేవదూతను పంపించాడు . ఆ దేవదూత 1 లక్ష 85 వేల  మంది అషూరు  సైనికులను చంపివేశాడు. సన్నెకరీబు  రాజు పెద్ద  షాక్ కు  గురయ్యాడు . తన దేశానికి పారిపోయాడు . 

     హిజ్కియా తన వైపుకు చూచుకొన్నప్పుడు, తన ప్రజల వైపు చూసినప్పుడు నిరాశ చెందాడు. సొమ్మసిల్లాడు, తొట్రి ళ్లాడు. అయితే దేవుని వైపు చూసినప్పుడు నూతన బలాన్ని పొందాడు. పక్షి రాజు వలె పైకి ఎగిరాడు. మీ సమస్యలకు మీరు లొంగి పొతే ఆ సమస్యలు మిమ్ములను మరింత కృంగదీస్తాయి. సన్నెకరీబు కు ఎంత  దోచిపెట్టినా అతనికి తృప్తి రాలేదు. సాతానుకు ఒక దానితో తృప్తి పొందడు. నాకు నీ డబ్బు కావాలి డబ్బులు ఇస్తే నాకు నీ నాకు నీ సమయం కావాలి అంటాడు , సమయం ఇస్తే నాకు  నీ మనస్సు కావాలి అంటాడు మనస్సు ఇస్తే నాకు నీ శరీరం కావాలి అంటాడు శరీరం ఇస్తే నాకు నీ ఆత్మ  కావాలి అంటాడు మీ ఆత్మ  ఇస్తే ఇప్పుడు నాకు నీ కుటుంబం కావాలి అంటాడు. ఎంత ఇచ్చినా సాతానుకు తృప్తి ఉండదు. దేవుని శక్తి లేకుండా సాతానును మనం ఏమీ చేయలేము 

   యెషయా తాను ఉన్న చరిత్రలో నుండి భవిష్యత్తులోకి చూశాడు. వారితో ఏమన్నాడంటే, భవిష్యత్తులో కూడా దేవుడు తన యందు విశ్వాసముంచేవారిని వదలి పెట్టడు. యెషయా గ్రంథము 55 నుండి 66 అధ్యాయాల వరకు దేవుని యొక్క భవిష్యత్తు ప్రణాళికలు ఆయన వివరించాడు. రాబోయే మెస్సియా యొక్క రెండవ రాకడ, ఇశ్రాయేలు పునరుద్ధరణ, వెయ్యేళ్ళ పాలన వీటిలో ప్రధాన ఘట్టాలు. యెషయా మొదటి భాగం పాత నిబంధనను పోలి ఉంది. అందులోని  39 అధ్యాయాలు పాత నిబంధన లోని 39 పుస్తకాలను పోలి ఉన్నాయి. రెండవ భాగం క్రొత్త నిబంధనను పోలి ఉంది. అందులోని 27 పుస్తకాలు క్రొత్త నిబంధనలోని 27 పుస్తకాలను పోలి ఉన్నాయి. యెషయా 40, బైబిల్ లోని 40 వ పుస్తకం అంటే మత్తయి సువార్తను పోలిఉండడం గమనార్హం. యెషయా గ్రంథం చివరి అధ్యాయాలు –  65, 66 అధ్యాయాలు – నూతన యెరూషలేము గురించి ప్రవచించాయి. క్రొత్త నిబంధనలో కూడా ప్రకటన గ్రంథం – 21,22 అధ్యాయాలు – నూతన యెరూషలేములో ముగుస్తుంది. దేవుని ప్రజల విజయముతో ప్రపంచ చరిత్ర ముగుస్తుంది.

     విజయం గురించి ఊహించడం ప్రస్తుతం మనకు కష్టముగా ఉండవచ్చు. గత సంవత్సరం మొత్తం మనం కరోనా క్రింద నలిగిపోయాము. ఎటు చూసినా మరణం మన సమాజాన్ని ఏలుతున్నది. శాంతి సమాధానములతో, ఆయురారోగ్యములతో నిండిన గొప్ప ప్రపంచము భవిష్యత్తులో వస్తుంది అంటే మనకు నమ్మటం కష్టముగా ఉండొచ్చు. 

      1940 వేసవిలో జర్మనీ దేశ అధ్యక్షుడు అడాల్ఫ్ హిట్లర్ ఇంగ్లాండ్ దేశము మీద బాంబుల వర్షం కురిపిస్తున్నాడు.అప్పటికే యూరప్ లోఅనేక దేశాలు హిట్లర్ పాదం క్రింద నలుగుతూ ఉన్నాయి. హిట్లర్ వాయుసేన లూప్ట్ వాఫా ఇంగ్లాండ్ మీద బాంబుల యుద్ధము చేస్తూ ఉంది. అయితే ఇంగ్లాండ్ మాత్రం లొంగిపోవడం లేదు. వారు తమ సర్వ శక్తులు ఒడ్డి హిట్లర్ కు ఎదురు తిరిగారు. ఇంగ్లాండ్ ను జయించలేక  హిట్లర్ తోక ముడిచాడు. హిట్లర్ ని ఎదిరించి నిలబడడం అప్పుడు గొప్ప వార్త అయ్యింది. బీబీసీ రేడియో ద్వారా ఆ వార్త యూరప్ మొత్తం ప్రసారం అయ్యింది. బెల్జియం దేశానికి విక్టర్ డి లావెలెయే (Victor de Laveleye) ఒక చిహ్నం రూపొందించాడు. చూపుడు వ్రేలు, మధ్య వ్రేలు కలిపి వి (V ) చిహ్నాన్ని తయారు చేశాడు. వి అంటే విక్టరీ. ఆయన ఎక్కడికి వెళ్లినా ‘v’ చిహ్నం ప్రజలకు చూపిస్తూ ఉండేవాడు. హిట్లర్ ఎంత రెచ్చిపోయినా చివరకు విజయం మనదే అన్నాడు. అప్పటికే హిట్లర్ ఆక్రమించిన దేశాల ప్రజలకు అది ఎంతో ధైర్యాన్ని ఇచ్చింది. వారందరూ కనిపించిన ప్రతి చోటా వి, వి, వి అని వ్రాశారు. సున్నం తీసుకొన్నారు, చాక్ పీస్ లు తీసుకొన్నారు, బొగ్గు బలపాలు తీసుకొన్నారు, పెయింట్ తీసు కొన్నారు. కనిపించిన ప్రతి చోటా వి చిహ్నాలు గీచారు. నాజీ అధికారులు వారిని చూసి అపహాస్యం చేశారు. ఓడిపోయిన దద్దమ్మలు మా కాళ్ళ క్రింద పడి ఉండక ఏంటి ఈ పిచ్చి పనులు, పిచ్చి గీతలు అని హేళన చేశారు. అయితే ప్రజలు మాత్రం ఏ రోజుకైనా విజయం మనదే అని నమ్మారు. ఆ రోజుల్లో ఇంగ్లాండ్ దేశ ప్రధాని ఎక్కడికి వెళ్లినా వి చిహ్నం చూపించి తన చుట్టూ ఉన్న వారిని ఉత్తేజపరచేవాడు. 

   హిట్లర్ సైన్యాలను ఎదిరించడం మొదలు పెట్టారు. నాజీ అధికారులు ఈ వి క్యాంపైన్ ని చూసి ఏమన్నారంటే, ‘ఈ ప్రజలు భవిష్యత్తును చూస్తున్నారు. మానసికంగా వారు విజయం సాధించారు. బీబీసీ రేడియో వారిని ఉత్తేజపరుస్తూ వారికి  నమ్మకం కలిగిస్తున్నది . మనం వారి సమాజాన్ని జయించామే కానీ వారి మనస్సును గెలవలేకపోయాం ‘ . హిట్లర్ సైన్యాలు ఓడిపోయి అతను ఆత్మ హత్య చేసుకొనే పరిస్థితి కలిగింది. ఈ రోజున సాతానుడు మన సమాజాన్ని జయించాడే కానీ మన మనస్సులను గెలవలేడు . సాతాను ఎంత రెచ్చిపోయినా చివరి విజయం దేవునిదే, దేవుని ప్రజలదే. మనది కూడా వి క్యాంపైనే. మీ ఇంట్లో గోడ మీద వ్రాసుకోండి తప్పులేదు. V for Christ.చివరివిజయం క్రీస్తుదే. మనం ఎక్కడున్నా, ఎట్టి పరిస్థితుల్లో ఉన్నా మనం ఎప్పుడూ వి గుర్తు చూపించవచ్చు. ఎందుకంటే యేసు క్రీస్తు నందు దేవుడు మనకు విజయాన్ని అనుగ్రహించాడు. 

   1 కొరింథీ 15:57 లో మనం చదువుతాము.

అయినను మన ప్రభువైన యేసుక్రీస్తు

మూలముగా మనకు జయము 

అనుగ్రహించుచున్న దేవునికి స్తోత్రము

కలుగును గాక.

                1 కొరింథీ 15:57

మన ప్రభువైన యేసు క్రీస్తు మూలముగా దేవుడు మనకు విజయం అనుగ్రహిస్తున్నాడు.  యెషయా ప్రవచించిన సత్యం అదే. ఆ సత్యం మనం గుర్తుచేసుకోవడం సాతానుకు ఇష్టం ఉండదు. అందుకనే మనం ఎప్పుడూ దేవుని వాక్యాన్ని జ్ఞాపకం చేసుకోవాలి. 

    నా సోదరి రూత్ మార్సెల్లా, ఆమె భర్త శరత్. వారి  కుమారుడు పాల్ కొమ్మతోటి  కి 7 సంవత్సరాలు. 119 కీర్తన మొత్తం కంఠస్తం చేశాడు. అది బైబిల్ లో అన్నిటికంటే పెద్ద కీర్తన. అతని చూసినప్పుడు నాకు ఆశ్చర్యం వేసింది. 7 సంవత్సరాల పిల్లవాడు 119 కీర్తన మొత్తం కంఠస్తం చేసి చెబుతున్నాడు. మన పిల్లలకు మనం దేవుని వాక్యాన్ని కంఠస్తం చేయడం చిన్నప్పటి నుండే నేర్పించాలి. ఆ వాక్యం వారిని జీవితమంతా నడిపిస్తుంది. ఆదరిస్తుంది.  వీడియో గేములు, చాట్టింగ్లు, చెత్త సినిమాలు, సీరియళ్లు, ఫేసుబుక్ పోస్టింగులు వీటిల్లో మనం చాలా సమయాన్ని వృథా చేస్తాము. అవి కాకుండా ఈ క్రొత్త సంవత్సరములో దేవుని వాక్యాన్ని ధ్యానించి, కంఠస్తం చేసి మన హృదయములో ఉంచుకొంటే మనకు ఎక్కువ ఆశీర్వాదం కలుగుతుంది. నాజీ అధికారులు ప్రజలను హేళన చేశారు. మా శక్తి ముందు మీరు ఏ పాటి వారు? అయితే విన్స్టన్ చర్చిల్ వారికి తన వ్రేళ్ళు చూపిస్తూనే ఉన్నాడు. మీ విజయాలు తాత్కాలికమైనవి. అంతిమ విజయం మాదే. ఈ రోజు సాతాను మన శక్తిని ప్రశ్నిస్తాడు. నా ముందు మీ శక్తి ఎంత? యెషయా ప్రవక్త ఏమన్నాడంటే, నీ విజయాలు తాత్కాలికమైనవి. అంతిమ విజయం దేవునిది. ఆయన శక్తిని పొందే ప్రజలది. ఈ శక్తి కోసం మీరు దేవుని వైపు చూడాలి. 

యెషయా ఏమంటున్నాడు? 

భూదిగంతములను సృజించిన యెహోవా నిత్యుడగు దేవుడు ఆయన సొమ్మసిల్లడు అలయడు 

       యెషయా 40 : 28 

ఈయన నిత్యుడగు దేవుడు. ఈ సంవత్సరం, ఆ సంవత్సరం, ఈ నెల, ఆ నెల, ఈ రోజు, ఆ రోజు – అవి మనకే ఎందుకంటే మనం కాలములో బంధించబడి ఉన్నాము. అయితే దేవునికి కాలములతో పనిలేదు. ఆయన నిత్యుడగు దేవుడు. The Eternal God.

 భూదిగంతములను సృష్టించిన దేవుడు. ఆ దేవుడు సొమ్మసిల్లడు, అలయడు. ఆయన దేనినీ మరచిపోడు. మనం చాలా విషయాలు మరచిపోతాము. ఈరోజు ఉదయం లేవగానే, నా భార్య నా దగ్గరకు వచ్చింది. నాకు గొంతునొప్పి గా ఉంది.నాకు కరోనా వచ్చిందేమో. కరోనా తరువాత నాకు డిమెన్షియా వస్తుందేమో అని అంది. నాకు ఇది వస్తే, దాని వల్ల అది వస్తే… దీని వల్ల ఇది వస్తే… మన భయాలకు అంతు ఉండదు. నాకు ఆశ్చర్యం కలిగించే విషయం ఏమిటంటే, దేవునికి డిమెన్ షియా ఎప్పటికీ రాదు. కాలముతో పాటు ఆయన శక్తి తగ్గదు. యెషయా ఆ సత్యాన్ని మనకు బోధిస్తున్నాడు. దేవుని శక్తిని మీరు చూడండి.

   29. సొమ్మసిల్లినవారికి బలమిచ్చువాడు ఆయనే శక్తిహీనులకు బలాభివృద్ధి కలుగజేయువాడు ఆయనే.

30. బాలురు సొమ్మసిల్లుదురు అలయుదురు¸ యౌవనస్థులు తప్పక తొట్రిల్లుదురు.

31. యెహోవాకొరకు ఎదురు చూచువారు నూతన బలము పొందుదురు 

వారి శక్తి ఎక్కడ ఉంది? మన శక్తి మీద ఆధారపడితే మనం సాతానుని గెలవలేము. ఒక  యుద్ధంజరుగుతున్నప్పుడు ఒక పెద్ద ట్యాంకు వస్తూ ఉంది. ఒక పిల్ల వాడు ఆ ట్యాంక్ మీద రాయి వేస్తే ఆ యుద్ధ ట్యాంక్ ఆగుతుందా? ఆ ట్యాంక్ లో ఉన్న కమాండర్ ఏమనుకొంటాడు? ఏంటి ఈ పిల్ల సన్నాసి? నా ట్యాంక్ మీద చిన్న చిన్న రాళ్లు వేసి నన్ను ఆపగలడా? సాతానుడు కూడా మన స్వంత శక్తిని చూసి అదే అనుకొంటాడు. సాతాను భయపడేది క్రీస్తు శక్తికి మాత్రమే. మన సమాజం ఆ సత్యం మరచిపోయింది. హాలీవుడ్ స్టార్ వార్స్ అని సినిమాలు తీస్తూ ఉంది.

      స్టార్ వార్స్ సినిమాలు ఒక అసత్యాన్ని ప్రచారం చేస్తున్నాయి. ఆ అసత్యం ఏమిటంటే, ‘శక్తి నీలోనే ఉంది’. ఈ స్టార్ వార్స్ సినిమాల్లో జెడై అనే ఫిలాసఫీ దాగి ఉంది. దాని ప్రకారం ఈ ప్రపంచములోని అన్ని వస్తువులు మనుష్యులు, జంతువులు, రాళ్లు, రప్పలు, దేవుడు, దేవ దూతలు, సమస్తం ఒకే శక్తితో నింపబడ్డారు.ఆ శక్తి అందరిలో ఉంది, అన్నిటిలో ఉంది. మనలో ప్రతి ఒక్కరూ ఆ శక్తిని పొందగలరు. ఈ స్టార్ వార్స్ సినిమాల్లో కనిపించే ప్రతి క్యారెక్టర్ – లూక్ స్కైవ్వాకర్, డార్త్ వాడర్, అనాకిన్, ప్రిన్సెస్ లేయా, కైలో రెన్, హాన్ సోలో – వారు కలుసుకొన్నప్పుడు

May the Force be with you అని చెప్పుకొంటారు.

May the Force be with you

 ‘శక్తి నీతో ఉండును గాక’. ఏంటి ఈ శక్తి? జలపాతాల్లో ఉన్న శక్తి. నీటిలో ఉన్న శక్తి, భూగర్భములో ఉన్న శక్తి, సూర్యునిలో శక్తి, నక్షత్రాల్లో శక్తి, చెట్లలో శక్తి, జంతువుల్లో శక్తి, ఆత్మీయ శక్తి, ఈ శక్తి మొత్తాన్ని మనము తపస్సు చేసి పొందవచ్చు. ధ్యానం చేసి ఆ శక్తిని పొందు. యోగా చేసి ఆ శక్తిని పొందు. 

     సాతానుడు చెబుతున్న పెద్ద అబద్దం ఈ స్టార్ వార్స్ సినిమాల్లో ఉంది. శక్తి కోసం నీవు దేవుని వైపు చూడాల్సిన అవసరం లేదు. ఆ శక్తి నీలోనే ఉంది అని సాతానుడు మన సమాజాన్ని మోసం చేస్తున్నాడు.యెషయా మనతో ఏమంటున్నాడంటే, శక్తి నీలో లేదు.బాలురు సొమ్మసిల్లిపోతారు యౌవనస్థులు తప్పక తొట్రిల్లుతారు.శక్తి కావాలంటే వారు దేవుని వైపు చూడాలి. ధ్యానాలు చేసి, తపస్సులు చేసి, యోగాలు చేసి మీరు ఈ శక్తిని పొందలేరు. యేసు క్రీస్తు నామములో దేవుని ప్రార్ధించాలి. ఆ దేవుని శక్తి ద్వారా మాత్రమే మనం విజయం పొందగలం.

    పోయిన వారం చైనా దేశములో జాంగ్ జాన్ అనే క్రైస్తవ జర్నలిస్టుకు 4 సంవత్సరముల జైలు శిక్ష పడింది. ఆమె చేసిన పాపం ఏమిటి అంటే చైనా ప్రభుత్వం చేసిన తప్పులు ఎత్తి చూపించింది. చైనా లోని వూహాన్ నగరములో కరోనా వైరస్ మొదలయినప్పుడు చైనా ప్రభుత్వం ప్రపంచం కళ్ళు కప్పింది. అంతా బాగానే ఉంది, ఏదో కొంతమంది అస్వస్థతకు గురయ్యారు.అని కట్టుకథలు చెప్పింది. వైరస్ తీవ్రతను గుర్తించక ప్రపంచ దేశాలు సరిగ్గా సిద్ధపడలేదు. చైనా లో నిజముగా ఏమి జరుగుతుందో ప్రపంచ దేశాలకు తెలియలేదు. చైనా అధికారులు జర్నలిస్టులను బెదిరించారు. మీరు వ్రాసే వార్తలు, వ్యాసాలు ముందు మేము చదవాలి. మేము ఒప్పుకొన్న వార్తలు మాత్రమే మీరు మీ పత్రికల్లో ప్రచురించి ప్రజలకు చెప్పాలి అన్నారు. వారి మాటలు ఈ అమ్మాయి జాంగ్ జాన్ కి నచ్చలేదు. నేను యేసు ప్రభువును నమ్ముకొన్న వ్యక్తిని. ఏది సత్యమో అదే నేను నా వార్తల్లో, వ్యాసాల్లో వ్రాస్తాను అంది. నిజముగా చైనా లో ఏమి జరుగుతుందో ఆమె ద్వారా ప్రపంచం తెలుసుకొంది. చైనా లో వేల మంది జర్నలిస్టులు ఉన్నారు. వారందరూ నోరు మూసుకొని కూర్చున్నారు. కానీ ఈ క్రైస్తవ జర్నలిస్టు సత్యాన్ని ప్రచురించింది? చైనా ప్రభుత్వము ఆమెను అరెస్ట్ చేసి, కేసులు పెట్టి నాలుగు సంవత్సరాలు జైలు శిక్ష విధించింది. జైలులో కూర్చొని దేవుని మరచిపోలేదు.

 1 కొరింథీ 10:14 లో వాక్యంచెప్పింది: 

దేవుడు నమ్మదగినవాడు

మీరు సహింపగలిగినంతకంటె

ఎక్కువగా ఆయన మిమ్మును

శోధింపబడ నియ్యడు. 

               1 కొరింథీ 10:14

    ఈమె ఆధునిక ప్రవక్త. దేవుని శక్తితో పక్షి రాజు వలె ఎగిరింది. అషూరు చాలా బలమైన సామ్రాజ్యము. అయితే దేవుని యందు విశ్వాసముంచి యెషయా పక్షి రాజు వలె పైకి ఎగిరాడు. విశ్వాసముతో వారిని ఎదుర్కొన్నాడు. చైనా నేడు చాలా బలమైన సామ్రాజ్యం. జాంగ్ జాన్ భయపడకుండా సత్యం కోసం వారిని ఢీకొట్టింది. దేవుని శక్తితో పక్షి రాజు వలె ఎగిరింది. ఈ క్రొత్త సంవత్సరములో మీరు అలసిపోయి ఉండవచ్చు, నీరసించి పోయి ఉండొచ్చు, కృంగిపోయి ఉండొచ్చు, బలహీనంగా ఉన్నారేమో. అయితే దేవుడు ప్రభువైన యేసు క్రీస్తు నందు గొప్ప శక్తిని, నిరీక్షణను మీకు అనుగ్రహిస్తున్నాడు. ఆ శక్తిని మీరు పొంది పక్షి రాజు వలె రోజూ రోజూ పై పైకి ఎగరాలని, మీ ముందు ఎలాంటి సమస్య వచ్చినా దానిని అధిగమించాలని, సాతాను మీద మీరు విజయము సాధించాలని మా ప్రార్థన. 

Wish you a happy, joyful, Christ filled New Year

Leave a Reply