విలాప వాక్యములు: డాక్టర్ పాల్ కట్టుపల్లి సందేశం

ప్రేమ సందేశం వీక్షిస్తున్న సోదరీ, సోదరులకు మరొక సారి శుభాకాంక్షలు తెలియజేస్తున్నాము. ప్రభువైన యేసు క్రీస్తు మహిమ కలిగిన నామములో మీకు వందనములు. దేవుని కృప యందు మీరు క్షేమముగా ఉన్నారని తలంచుచున్నాము. అనేకమంది మా వెబ్ సైట్ లో దేవుని వాక్యాన్ని ధ్యానిస్తున్నారు. మీ అందరికి మా ధన్యవాదాలు. బైబిల్ లో ఉన్న 66 పుస్తకాలు పరిచయం అనే అంశం ప్రస్తుతం మనం ధ్యానిస్తున్నాము. మీరు ఒక పుస్తకాన్ని మిస్ అయితే మా వెబ్ సైట్ కి వెళ్లి బైబిల్ పుస్తకాల పరిచయం అనే పేజీ కి వెళ్లి ఆ పుస్తకాన్ని ధ్యానం చేయవచ్చు. ఈ రోజు విలాప వాక్యములు గ్రంథము మీకు పరిచయం చేయాలని నేను ఆశపడుతున్నాను. 

     ఈ రోజు విలాప వాక్యములు గ్రంథం నుండి కొన్ని తలంపులు మనం చూద్దాము. 1 అధ్యాయము 1 వచనము నుండి కొన్ని మాటలు చూద్దాము: 

1. జనభరితమైన పట్టణము ఎట్లు ఏకాకియై దుఃఖా క్రాంతమాయెను? అది విధవరాలి వంటిదాయెను. అన్యజనులలో ఘనతకెక్కినది సంస్థానములలో రాచకుమార్తెయైనది ఎట్లు పన్ను చెల్లించునదైపోయెను? 2. రాత్రియందు అది బహుగా ఏడ్చుచున్నది  కన్నీరు దాని చెంపలమీద కారుచున్నది. దాని విటకాండ్రందరిలో దాని నోదార్చువాడొకడును లేడు దాని చెలికాండ్రందరు దాని మోసపుచ్చిరి వారు దానికి శత్రువులైరి.

3. యూదా బాధనొంది దాసురాలై చెరలోనికి పోయియున్నది అన్యజనులలో నివసించుచున్నది విశ్రాంతినొందక పోయెను. దానితరుమువారందరు ఇరుకుచోట్లదాని కలిసికొందురు. నియామక కూటములకు ఎవరును రారు గనుక

4. సీయోను మార్గములు ప్రలాపించుచున్నవి పట్టణపు గుమ్మములన్నియు పాడైపోయెను.యాజకులు నిట్టూర్పు విడుచుచున్నారు. దాని కన్యకలు దుఃఖాక్రాంతులైరి అదియు వ్యాకులభరితురాలాయెను.

   విలాప వాక్యములు ఈ గ్రంథాన్ని యిర్మీయా ప్రవక్త వ్రాశాడు. క్రీ.పూ 586 సంవత్సరములో యెరూషలేము నగరం బబులోను వారి చేతిలో నాశనం చేయబడింది. అక్కడ ఉన్న దేవాలయం అగ్ని కి ఆహుతి అయ్యింది. యూదులు బబులోను చెరలోనికి తీసుకొని వెళ్ళబడ్డారు. 

     యిర్మీయా ఈ సంఘటనలకు ప్రత్యక్ష సాక్షి. ఆయనను ‘వీపింగ్ ప్రోఫెట్’ విలపించిన ప్రవక్త’ అని మనం పిలుస్తాము. ఎందుకంటే యెరూషలేముకు కలుగబోయే శ్రమలను ఆయన ముందుగానే చూశాడు. ఆయనలో యేసు ప్రభువు రూపం మనకు కనిపిస్తున్నది. యేసు ప్రభువు యెరూషలేము వీధులలో  తన సిలువను మోసుకొని వెళ్ళేటప్పుడు అనేక మంది స్త్రీలు ఆయనను చూసి ఏడుస్తూ ఉన్నారు. వారిని చూసి ఆయన ఒక మాట అన్నాడు: 

   ‘యెరూషలేము కుమార్తెలారా, నా నిమిత్తము ఏడ్వకుడి; మీ నిమిత్తమును మీ పిల్లల నిమిత్తమును ఏడ్వుడి.29. ఇదిగో గొడ్రాండ్రును కనని గర్భములును పాలియ్యని స్తనములును ధన్యములైనవని చెప్పుదినములు వచ్చుచున్నవి.30. అప్పుడు మామీద పడుడని పర్వతములతోను,మమ్ము కప్పుడని కొండలతోను జనులు చెప్పసాగుదురు.’ లూకా  23 

ఎందుకని ఆయన అటువంటి కఠినమైన మాటలు వారికి చెప్పాడు? ఆయన యెరూషలేముకు జరుగ బోయే శ్రమలను వారి కంటే ముందుగా చూశాడు. యెరూషలేము ను చూసి యేసు ప్రభువు కన్నీరు పెట్టాడు. యిర్మీయా కూడా 40 సంవత్సరాలు యెరూషలేమును చూసి కన్నీరు పెట్టాడు. ‘మీరు దేవుని నిబంధనను ఉల్లంఘించారు. మీరు మారు మనస్సు పొందండి. లేకపోతే దేవుని శిక్ష మీ మీదకు వస్తుంది’ అని యూదులను యిర్మీయా రాత్రి పగలు హెచ్చరించాడు. అయితే, యూదులు ఆయన మాట వినలేదు. దేవుని తీర్పు దిశగా వారు పరుగెత్తారు. బబులోను వారు ఆ దేశము మీద దండెత్తారు. 

    క్రీ. పూ 605 సంవత్సరములో నెబుకద్నెజరు యెరూషలేము మీద దండెత్తాడు. అప్పుడు కూడా యిర్మీయా యూదులను బ్రతిమలాడాడు. ‘కనీసం లొంగిపోండి. వారు మనలను ప్రాణాలతో బ్రతకనిస్తారు. మన నగరాన్ని నాశనం చేయకుండా వదలి పెడతారు. మన దేవుని ఆలయాన్ని తగుల పెట్టకుండా కనికరిస్తారు. లొంగిపోండి’. అప్పుడు కూడా ప్రజలు యిర్మీయా మాటలు వినలేదు. ‘లొంగిపోవడం ఏమిట్రా, పిరికి దద్దమ్మా. వీరుల వలె పోరాడదాం, బబులోను వారిని దేవుడు మనకు అప్పగిస్తాడు’ అని అబద్ద ప్రవక్తలు ప్రజలను యిర్మీయా కు వ్యతిరేకముగా రెచ్చగొట్టారు. ఆయనను తిట్టారు, కొట్టారు, అరెస్ట్ చేశారు, చెరసాలలో బంధించారు. నెబుకద్నెజరు యూదులను బానిసలుగా బబులోను కు తీసుకొని వెళ్లడం ప్రారంభించాడు. దానియేలును, అతని 3 స్నేహితులను, ఇంకొంత మంది యూదులను బబులోనుకు తరలించాడు. అటువంటి దృశ్యాలు చూసి కూడా ఇశ్రాయేలీయులు మారు మనస్సు పొందలేదు. క్రీ.పూ 597 , మార్చి నెలలో బబులోను సైన్యము తిరిగి యెరూషలేము మీదకు దాడికి వచ్చింది. యెరూషలేమును వారు కొల్లగొట్టారు. ఇంకొంతమంది యూదులను చెరగా  తీసుకువెళ్లారు. 

జనవరి 15, క్రీ.పూ 588 – యెరూషలేమును చుట్టుముట్టారు. 

జూలై  18, క్రీ.పూ 586 – యెరూషలేము గోడలు బ్రద్దలు కొట్టారు. 

ఆగస్టు 14 – యెరూషలేమును అగ్నితో తగులబెట్టారు. 

    యిర్మీయా చేసిన ప్రతి ప్రవచనము నెరవేరింది. ఆ ఘోరమైన దృశ్యాలు చూసి యిర్మీయా ఎలా 

స్పందించాడు: ‘మీకు తగిన శాస్తి జరిగింది. అనుభవించండి, నా మాట ఒక్కడన్నా  విన్నాడా? అనుభవించండి రా. నన్ను తిట్టారు, కొట్టారు, ఎన్ని బాధలు పెట్టారు రా. ఏడవండి రా. మీ ఏడుపులు వింటే నాకు సంతృప్తి కలుగుతుంది’ అని యిర్మీయా అనుకోలేదు. 

   యెరూషలేము ను చూసి ఆయన గుండె బ్రద్దలయ్యింది. తన ప్రజలకు కలిగిన దీన స్థితి చూసి ఆయన గుండెలు బాదుకొన్నాడు. అయ్యో, దేవా, నా ప్రజలకు ఎందుకింత ఘోరమైన పరిస్థితి కలిగింది? అని యిర్మీయా ఏడుస్తున్నాడు. అందమైన దేవుని ఆలయము ఎందుకు పాడై పోయింది అని ఆయన ఘోషిస్తున్నాడు. 40 సంవత్సరాలు దేవుని ప్రవచనాలు బోధించి నేను సాధించింది ఏమిటి అని ఆయన వ్యధ చెందుతున్నాడు. దేవుడు తన ప్రజలను స్పష్టముగా హెచ్చరించాడు. 

   ద్వితీయోప దేశ కాండము 28 అధ్యాయము లో దేవుడు తన ప్రజలకు తెలియజేశాడు. మీరు నా ఆజ్ఞలు పాటిస్తేనే నా దేశములో మిమ్ములను ఉండనిస్తాను. నా ఆజ్ఞలు మీరు పాటించకపోతే మిమ్ములను నా దేశములో నుండి వెళ్ళగొడతాను. ఏదెను వనములో కూడా అదే జరిగింది. దేవుడు ఆదాము, హవ్వలను హెచ్చరించాడు. మీరు నా మాట విన్నంతవరకే మిమ్ములను ఈ తోటలో ఉండనిస్తాను. నా మాట మీరు వ్యతిరేకించినప్పుడు మిమ్ములను ఇక్కడ నుండి వెళ్ళగొడతాను. 

    ఇశ్రాయేలీయులకు కూడా అదే జరిగింది. వారు దేవుని ఆజ్ఞలు వ్యతిరేకించినప్పుడు దేవుడు వారిని తన దేశములో నుండి వెళ్ళగొట్టాడు. ఈ ప్రపంచము కూడా దేవునిదే. ప్రపంచ ప్రజలు దేవుని మాటను వ్యతిరేకించారు. వీరిని దేవుడు తన భూమి మీద నుండి వెళ్లగొట్టే రోజు కూడా భవిష్యత్తులో ఉంది. యిర్మీయా యెరూషలేము వైపు చూశాడు. దాని ప్రాకారములు అగ్నితో కాల్చబడుతూ ఉన్నాయి. దేవుడు ఎందుకు యూదులను ఆ విధముగా శిక్షించాడో యిర్మీయా కు తెలుసు. అయినప్పటికీ అతనికి దేవుని మీద కూడా కోపం వచ్చింది. దేవా, నీ ప్రజలు ఇలా బాధలు పడుతూ ఉంటే నువ్వు ఏమి చేస్తున్నావు? నీవు ప్రేమించిన పట్టణాన్ని తగల పెడుతుంటే నీవు ఏమి చేస్తున్నావు? నీవు కోరుకొన్న నీ ఆలయాన్ని కూల్చివేస్తుంటే నీవు ఏమి చేస్తున్నావు? యిర్మీయా ఈ విలాప వాక్యముల గ్రంథములో ఆ ప్రశ్నలు అడుగుతున్నాడు. ఈ గ్రంథాన్ని మీరు చదివితే, 5 అధ్యాయాల్లో దేవుడు నోరు తెరువలేదు. ఆయన స్వరం వినిపించలేదు.యిర్మీయా ను అది వేధించింది. దేవుని మౌనాన్ని ఆయన సహించలేక పోయాడు. లాజరు చనిపోయినప్పుడు, అతని సమాధి చేసిన తరువాత యేసు ప్రభువు వారి ఇంటికి వెళ్ళాడు. అక్కడ అందరూ విలపిస్తున్నారు.‘ప్రభువా, ఇన్ని రోజులు ఎక్కడ ఉన్నావు?’ అని వారు ఆయనను అడిగారు.

   మనం కూడా కొన్ని సార్లు అలాంటి పరిస్థితుల్లో వెళ్ళవచ్చు. దేవా, నేను ఇంత బాధలో ఉంటే నీవు ఏమి చేస్తున్నావు? నేను ఇంత శ్రమలో వుంటే నీవు మౌనముగా ఉన్నావేంటి అని మనకు అనిపిస్తుంది. మనం మన స్వరం వినాలని దేవుడు కొన్ని సార్లు మౌనముగా ఉంటాడు. బయటకు రానీ, నీ హృదయములో ఏముందో బయటకు చెప్పు, నీ భావోద్రేకాలు బయట పెట్టు, నేను మౌనముగా వింటాను అని దేవుడు మనతో అంటున్నాడు. కీర్తనల గ్రంథము మొత్తం అదే. భక్తులు తమ హృదయాల్లో ఏముందో దేవుని ఎదుట బయటపెట్టారు.దేవా, నీలో నాకిది నచ్చలేదు. ఏమి చేస్తున్నావు? ఎక్కడ ఉన్నావు? అని వారు దేవుని ముక్కుసూటిగా ప్రశ్నించారు. దేవుని ప్రశ్నలు అడగడములో తప్పు లేదు. దేవుని జ్ఞానము ముందు మన జ్ఞానం చాలా తక్కువ. ఆల్బర్ట్ ఐను స్టెయిన్ లాంటి సైంటిస్ట్ తో మీరు ఒక పూట గడిపితే, ఆయనతో మాట్లాడే అవకాశం వస్తే, మనం ఎన్నో ప్రశ్నలు అడుగుతాము. ఎందుకంటే విశ్వం గురించి ఆయనకు తెలిసింది ఎక్కువ, మనకు తెలిసింది తక్కువ. దేవుడు కూడా తన జ్ఞానముతో ఈ ప్రపంచాన్ని నడిపిస్తున్నపుడు, మనకు అర్థం కానివి ఎన్నో ఉంటాయి. కాబట్టి మనం దేవుని ప్రశ్నించడములో ఆశ్చర్య పోవలసినది ఏమీ లేదు. జీవిత అర్ధం అందులోనే ఉంది.

    యూదులు ఈ రోజుకూ విలాప వాక్యములు, ప్రసంగి – ఈ రెండు పుస్తకాలను ఒక భాగములోపెట్టి చదువుతారు. ప్రసంగి గ్రంథములో సొలొమోను తన జీవితానికి అర్ధం ఉందా అని ప్రశ్నించాడు. సమస్తం వ్యర్థం, వ్యర్థం అన్నాడు. ఈ ప్రపంచాన్ని చూసి అతనికి టెన్షన్ పెరిగింది. దానికి విలాప వాక్యములు జోడిస్తే ఎలా ఉంటుంది? శ్రమలో మౌనముగా ఉండే దేవుడు. నీ టెన్షన్ ఇంకా పెరిగిపోతుంది.నీ టెంపరేచర్ ఇంకా పెరిగిపోతుంది.

    బబులోను వెళ్లిన తరువాత కూడా వారు దేవుని ప్రశ్నించడం మానుకోలేదు.అరేయ్, నీ బాధ నాకు వినిపించురా, నీ ప్రశ్నలు అడుగు నేను మౌనముగా వింటాను అని దేవుడు మనతో అంటున్నాడు.

137 కీర్తన లో ఇశ్రాయేలీయులు బబులోనులో మనకు కనిపిస్తారు: 

బబులోను నదులయొద్ద కూర్చుండి యున్నప్పుడు మనము సీయోనును జ్ఞాపకము చేసికొని యేడ్చు చుంటిమి. యెహోవా, యెరూషలేము పాడైన దినమును జ్ఞాపకమునకు తెచ్చుకొనుము.

                                     137 కీర్తన    

   దేవా మమ్మును జ్ఞాపకం చేసుకో అని వారు దేవుని ప్రార్థిస్తున్నారు. బబులోను లో కూర్చొని వారు దేవునికి మొఱ్ఱ పెడుతున్నారు. దేవుని మీద వారికి చాలా కోపం వచ్చింది. అయినప్పటికీ వారు దేవునికే మొఱ్ఱ పెడుతున్నారు. ఎందుకంటే వారికి మరొక దిక్కు లేదు.

    రెండో ప్రపంచ యుద్ధము సమయములో హిట్లర్ యూదులను ఎంతో బాధించాడు. కొన్ని లక్షల మంది యూదులను కాన్సంట్రేషన్ క్యాంపు లలో పెట్టాడు. వారు ఆకలితో అలమటించారు. ఒక్కొక్కరు ఎముకల గూడు వలె తయారయ్యారు. వందలమంది చిన్న చిన్న గదుల్లో కుక్కాడు. వారి చేత కఠినమైన పనులు చేయించాడు. విష వాయువులు వదలి వారి ప్రాణాలు తీయించాడు. నేను అవుస్క్ విట్జ్ అనే కాన్సంట్రేషన్ క్యాంపు ను చూశాను. పోలాండ్ దేశములో అది ఉంది. అక్కడ యూదులను హింసించి వారి బంగారు ఆభరణాలు అమ్ముకున్నారు. వారి యొక్క జుట్టు కూడా అమ్ముకున్నారు. వారి మీద నాజీ శాస్త్రవేత్తలు ప్రయోగాలు కూడా చేశారు. ఎలీ వీసల్ అనే తత్వవేత్త ఔస్క్ విట్జ్ లో కొంతకాలం గడిపాడు. ఆయన యూదుడు. ఆయన ఒక పుస్తకములో ఏమని వ్రాశాడంటే, నా ప్రజలైన ఇశ్రాయేలీయులను నాజీలు పెడుతున్న బాధలు చూసి నాకు బాధ వేసింది. దేవుని మీద నాకు చాలా కోపం వచ్చింది. దేవా, ఈ ఘోరాలు, అక్రమాలు, అన్యాయాలు జరుగుతూ ఉంటే నీ ప్రజలైన ఇశ్రాయేలీయులు ఇంత బాధ పడుతుంటే, మౌనముగా ఎలా ఉండగలుగు తున్నావు అని ఆయన దేవుని ప్రశ్నించాడు. 

    ఔస్క్ విట్జ్ లో జరిగిన ఒక సంఘటన ఎలీ వీసల్ తన పుస్తకములో వ్రాశాడు. కొంత మంది యూదులు ఒక చోట చేరారు. వారి మత నాయకుడు, రబ్బీ అంటారు,  వారి మధ్యలో నిలబడ్డాడు. వారితో అన్నాడు: ఈ హిట్లర్, ఈ నాజీలు మనలను వేధిస్తున్నారు. ఇశ్రాయేలీయులు ఇంత బాధ పడుతూ ఉంటే, ఈ దేవుడు ఎక్కడ ఉన్నాడు? అబ్రహాము దేవుడు, ఇస్సాకు దేవుడు, యాకోబు దేవుడు, మోషే దేవుడు, దావీదు దేవుడు ఎక్కడ ఉన్నాడు? మనల్ని వదలి వేశాడు. మనం ఈ రోజు ఇక్కడ ఎందుకు సమావేశం అయ్యాము అంటే, దేవుని మీద విచారణ చేసి, దేవునికి తీర్పు విధించాలి, దేవుని శిక్షించాలి. 

    దేవుడు మన పట్ల క్రూరముగా ప్రవర్తించాడు. మనలను వదలి పెట్టాడు.నమ్మక ద్రోహానికి పాల్పడ్డాడు. దేవునికి శిక్ష విధించాల్సిందే.ఏ శిక్ష విధించాలో మీరే చెప్పండి.వారందరూ ఏమన్నారంటే, దేవుడు మరణ శిక్ష పాత్రుడు. ఆయనకు మరణ శిక్ష విధించాలి. రబ్బీ, అప్పుడు పరలోకంవైపు చూసి, ‘దేవా, నీ ప్రజలను మోసం చేసావు. నీకు తీర్పు తీర్చి, నీకు మరణ శిక్ష విధించాము’ అన్నాడు. తిరిగి ఆ సమావేశం లో ఉన్న వారి వైపు చూసి, ‘సాయంత్రం ప్రార్థనకు సమయము అయ్యింది.వెళదాము పదండి’ అన్నాడు.

    ఇశ్రాయేలీయులకు దేవుని మీద అంత కోపం వచ్చింది, అయితే వారు దేవుని వదలి పెట్టలేదు. తిరిగిదేవుని వైపు చూశారు, దేవుని యొద్దకే వెళ్లారు, దేవునికే మొఱ్ఱ పెట్టారు.ఎలీ వీసల్ ఒక మాట వ్రాశాడు: 

An individual can be a Jew with God,

be a Jew against God,

but you cannot be a Jew without God

ఒక వ్యక్తి దేవునితో ఉండి యూదుడు కాగలడు, 

దేవునికి వ్యతిరేకముగా ఉండి యూదుడు కాగలడు, కానీ దేవుడు లేకుండా యూదుడు కాలేడు.

దేవుని మీద ఎంత కోపం వచ్చినా వారు దేవుని వైపు చూడాల్సిందే.

ఇక్కడ యిర్మీయా విలాప వాక్యములలో దేవుని మీద తనకు కలిగిన కోపాన్ని బయటపెట్టాడు. అయితే తిరిగి దేవుని యొద్దకే వెళ్ళాడు. 3 అధ్యాయములో ఆయన ఏమన్నాడంటే, 

22. యెహోవా కృపగలవాడు ఆయన వాత్సల్యత యెడతెగక నిలుచునది గనుక మనము నిర్మూలము కాకున్నవారము.23. అనుదినము నూతనముగా ఆయనకు వాత్సల్యత పుట్టుచున్నది నీవు ఎంతైన నమ్మదగినవాడవు.

      విలాప వాక్యములు 3 

 అనుదినము నూతనముగా ఆయనకు వాత్సల్యత పుట్టుచున్నది నీవు ఎంతైన నమ్మదగినవాడవు.

His compassions fail not; 

They are new every morning, 

great is Thy faithfulness 

1923 లో థామస్ ఛిస్లోమ్ మీ మాటలు ఆధారము చేసుకొని ఇంగ్లీష్ లో ఒక మంచి పాట వ్రాశాడు.

Great is Thy faithfulness, great is Thy faithfulness; Morning by morning new mercies I see

All I have needed Thy hand hath provided; Great is Thy faithfulness, Lord, unto me

దేవుడు ఎంతైనా నమ్మదగిన వాడు ప్రతి రోజూ ఆయనకు మన మీద ప్రేమ కలుగుతూ ఉన్నది.యిర్మీయా దేవుని మీద నిరీక్షణతో ఈ పుస్తకాన్ని ముగించాడు: 

19. యెహోవా, నీవు నిత్యము ఆసీనుడవై యుందువు నీ సింహాసనము తరతరములుండును.

20. నీవు మమ్ము నెల్లప్పుడును మరచిపోవుట ఏల? మమ్ము నింతకాలము విడిచిపెట్టుట ఏల? (విలాప 5:19,20) 

బబులోను వారు యెరూషలేమును సర్వ నాశనం చేశారు. దేవుడు యెక్కడ ఉన్నాడు? దేవుడు మౌనంగా ఎందుకు ఉన్నాడు? అని యిర్మీయాను ఎగతాళి చేశారు.యేసు ప్రభువు సిలువ మీద ఉన్నప్పుడు ఆయన వర్ణించలేనంత బాధలో ఉన్నాడు.రక్తసిక్త మైన గాయములతో అల్లాడుచూ ఉన్నాడు. సిలువ మీద ఉండి తండ్రికి మొఱ్ఱ పెట్టాడు. నా దేవా, నా దేవా, నన్నెందుకు చేయి విడిచితివి? అని ఆక్రందన చేశాడు.దేవుని కుమారుడు అంట, దేవుని పిలుస్తున్నాడు అని ఆయనను ఎగతాళి చేశారు.

    ఎలీ వీసల్ ‘నైట్’ అనే పుస్తకములో ఒక సంఘటన వ్రాశాడు. నాజీలు ఒక రోజు ముగ్గురు యూదులను ఉరితీశారు.ఇద్దరు పెద్దవారు, ఒక చిన్న బాలుడు.ఇద్దరు పెద్ద వారు కొన్ని నిమిషాల్లోనే ప్రాణాలు కోల్పోయారు. అయితే ఆ చిన్న బాలుడు ఆ త్రాడుకు వేలాడుతూనే ఉన్నాడు.అతని ప్రాణం అతనిలోనే ఉంది.గాలి ఆడక ఆ బాలుడు కాళ్ళు విదిలిస్తున్నాడు.నాజీ సైనికులు అక్కడ నిలబడి ఉన్న యూదులతో ఒక మాట అన్నాడు: ‘చూస్తున్నారు కదరా, మీ అందరికీ అదే గతి పడుతుంది’ ఎలీ వీసల్ వెనుక నిలబడి ఉన్న ఒక వ్యక్తి ఒక మాట అన్నాడు: దేవుడు ఎక్కడ ఉన్నాడు? 

ఎలీ వీసల్ అప్పుడు ఒక మాట అన్నాడు: 

God is on the Gallows

దేవుడు ఆ ఉరి కంబం మీద ఉన్నాడు.

దేవుడు ఆ ఉరి కంబం ఉన్నాడు.

    యిర్మీయా కూడా కాలిపోతున్న యెరూషలేము ప్రాకారములలో దేవుని చూశాడు.దేవుడు ఎక్కడికీ పారిపోలేదు.బబులోను వారు యెరూషలేమును కాలుస్తున్నపుడు దేవుడు అక్కడే ఉన్నాడు. రోమీయులు తన కుమారుని హింసిస్తున్నప్పుడు దేవుడు అక్కడే ఉన్నాడు.

నాజీలు యూదులను హింసిస్తున్నప్పుడు దేవుడు అక్కడే ఉన్నాడు.

ఆ గ్యాస్ ఛాంబర్ ల దగ్గరే ఆయన ఉన్నాడు.

ఆ ఉరి కంబముల దగ్గరే ఆయన ఉన్నాడు.

కాలిపోతున్న యెరూషలేము ప్రాకారముల దగ్గరే ఆయన ఉన్నాడు 

తన కుమారుని సిలువ దగ్గరే ఆయన ఉన్నాడు

ఆయన మౌనముగా ఉన్నాడే కానీ వెళ్లిపోలేదు తన స్వరము వినిపించలేదే కానీ ఆయన వారిని నిర్లక్ష్యం చేయలేదు.యిర్మీయా దేవుని నమ్మకత్వాన్ని గుర్తు చేసుకొన్నాడు, దేవుని సార్వభౌమాధికారాన్ని గుర్తుచేసుకొన్నాడు.

యెహోవా, నీవు నిత్యము ఆసీనుడవై యుందువు నీ సింహాసనము తరతరములుండును.

(విలాప 5:19) 

మానవ చరిత్ర అనేక కుదుపులకు లోనవుతూనే ఉంటుంది, మన జీవితం కూడా అనేక కష్టాలకు లోనవుతూనే ఉంటుంది. వాటన్నిటిలో దేవుడు మనకు తన నమ్మకత్వాన్ని, తన సన్నిధిని మనకు అనుగ్రహిస్తున్నాడు. మీ జీవితములో కూడా మీరు రాసుకొనే ‘విలాప వాక్యములు’ ఉంటాయి. మీరు ఆరోగ్యం కోల్పోయి ఉండొచ్చు, మీరు ఉద్యోగం కోల్పోయి ఉండొచ్చు కుటుంబ సభ్యుని కోల్పోయి ఉండొచ్చు, హింసకు గురయి ఉండవచ్చు అవమానానికి గురై ఉండవచ్చు. దేవా, ఎక్కడ ఉన్నావు? ఎందుకు మౌనంగా ఉన్నావు? అని మీ హృదయం ఘోషిస్తూ ఉండవచ్చు. మీరే పరిస్థితుల్లో ఉన్నప్పటికీ దేవుని యొక్క నమ్మకత్వాన్ని మీరు గుర్తుపెట్టుకోండి. అను దినము నూతనముగా దేవునికి మీ పట్ల వాత్సల్యత కలుగుతున్నది అనుదినం నూతనముగా దేవునికి మీ పట్ల ప్రేమ కలుగుతున్నది. తన సింహాసనం మీద కూర్చొని దేవుడు; తన చిత్తాన్ని మీ జీవితములో జరిగిస్తున్నాడు. దేవుని వాగ్దానములను నమ్మి నిరీక్షణతో మీరు గడపవచ్చు విలాప వాక్యములు గ్రంథం నుండి ఈ రోజు మనం కొన్ని సత్యాలు చూశాము.బబులోను సైనికులు యెరూషలేమును నాశనము చేసిన తరువాత యిర్మీయా దానిని చూసి బాధతో వ్రాసిన కన్నీటి గాథ ఈ పుస్తకములో మనకు కనిపిస్తున్నది.యేసు ప్రభువు కూడా యిర్మీయా వలె యెరూషలేమును చూసి కన్నీరు కార్చాడు.దాని పాపములను చూసి ఆయన వేదన చెందాడు. యెరూషలేము లోనే ఆయన తన పవిత్రరక్తాన్ని మన పాపముల కొరకు చిందించాడు. ఈ రోజు మీరు కూడా ప్రభువైన యేసు క్రీస్తునందు విశ్వాసముంచి, రక్షణ పొందాలన్నదే నేటి మా ప్రేమ సందేశం.

Leave a Reply