యెహెఙ్కేలు ప్రవచనాలు

ప్రేమ సందేశం వీక్షకులకు మరొకసారి శుభాకాంక్షలు తెలియజేస్తున్నాము. ప్రభువైన యేసు క్రీస్తు మహిమ కలిగిన నామములో మీకు ధన్యవాదాలు తెలియజేస్తున్నాము.దేవుని కృప యందు మీరు ధైర్యముగా ఉన్నారని తలంచుచున్నాము.కరోనా చాలా ఉదృతముగా మన మీదకు వస్తూ ఉంది. హాస్పిటల్ లలో బెడ్లు లేక అనేక మంది అవస్థలు పడుతున్నారు.నా హాస్పిటల్ లో రూమ్ సరిపోలేదు.కొంత మందిని వెయిటింగ్ రూమ్ లో పెట్టాను. వెయిటింగ్ రూమ్ లో కూడా స్థలము లేని పరిస్థితి కలిగింది. కొంత మంది రోగులను నేను వారు ఉన్నటు వంటి వాహనంలోనే చూడాల్సి వచ్చింది.ఆక్సిజన్ సిలిండర్ లు ఖాళీ అయిపోయినాయి. నా దగ్గర ఉన్న ఆక్సిజన్సిలిండర్ లు మొత్తం ఇచ్చేశాను. అవి కూడా సరిపోలేదు. ఒక వ్యక్తి తన 4 సంవత్సరాల బిడ్డను నా హాస్పిటల్ కి తీసుకువచ్చాడు. ఆ బాలుడు గాలి పీల్చలేక ఇబ్బంది పడుతున్నాడు. అతనికి 2 ఆక్సిజన్ సిలిండర్ లు ఇచ్చి పంపించాను. రెండో రోజు అతను తిరిగి వచ్చాడు.  మా అబ్బాయి ఇంకా ఇబ్బంది పడుతూనే ఉన్నాడు. నాకు ఇంకో రెండు సిలిండర్ లు కావాలి అన్నాడు. నా దగ్గర ఇంకా ఏమీ లేవు అని అతనికి చెప్పాను.అతను విచారముతో తిరిగి వెళ్ళాడు. అతని పరిస్థితి చూసి నాకు చాలా బాధ వేసింది.

    మరొక  వ్యక్తి తన తల్లి ని కోల్పోయాడు.అతడు మాత్రం ప్రాణాలతో బయట పడ్డాడు.అతను నాతో ఏమన్నాడంటే, మా అమ్మ చనిపోయింది, నేను బ్రతికాను. నేనెందుకు బ్రతికాను?’ నేను కరోనా వచ్చినా బ్రతికాను అనే సంతోషము అతని ముఖములో నాకు కనిపించలేదు. నేనెందుకు బ్రతికాను? అనే గిల్టీ ఫీలింగ్ అతని మోహములో నాకు కనిపించింది. 

    ఎటు చూసినా ఇటువంటి హృదయ విదారక దృశ్యాలు మనం చూస్తూ ఉన్నాము. ఇటువంటి పరిస్థితుల్లో ఏ మానవుడూ మనకు సహాయం చేయలేడు.మనం దేవుని వైపు చూడాల్సిందే.ఈ కరోనా నుండి దేవుడు తప్ప ఇంకెవ్వరూ మనలను రక్షించ లేరు. ఈ సమయములో మనం దేవునికి మొఱ్ఱ పెట్టాలి.బైబిల్ స్టడీచేసే వారు మా వెబ్ సైట్ దర్శించండి. www.doctorpaul.org ఇలాంటి సమయములో మనం ఇంకా ఎక్కువగా దేవుని వాక్యాన్ని ప్రచారం చేయాలి. 

మా కార్యక్రమానికి ఆర్థిక సహకారం అందిస్తున్న వారికి కృతఙ్ఞతలు తెలియజేస్తున్నాము. దేవుడు మిమ్మును, మీ కుటుంబములను ఆశీర్వదించును గాక.ఈ రోజు యెహెఙ్కేలు   గ్రంథము నుండి కొన్ని సత్యాలు మనం చూద్దాము. బైబిల్  లో యెహెఙ్కేలు గ్రంథము చాలా గొప్ప పుస్తకం. యెహెఙ్కేలు పరిచర్య యెరూషలేము, బబులోను లలో సాగింది. మొదట ఆయన ఒక యాజకునిగా ఉన్నాడు. యెరూషలేములో దేవుని ఆలయములోఆయన యాజకునిగా పనిచేసి ఉండవచ్చును. క్రీ.పూ 597 లోఆయన బబులోనుకు చెరగా తీసుకొని వెళ్ళబడ్డాడు. కేబారు నది ఒడ్డున, నిప్పూరు పట్టణము దగ్గరలోని టెల్ అబీబ్ అనే ప్రాంతానికి ఆయన వెళ్ళాడు. 

జులై నెల, క్రీ. పూ 592:  సంవత్సరము దేవుడు యెహెఙ్కేలు కు గొప్ప దర్శనం ఇచ్చాడు. ఒక రథము మీద సింహాసనాసీనుడుగా దేవుడు ఆయనకు కనిపించాడు. అప్పటి నుండి ఈ యాజకుడు దేవుని ప్రవక్తగా పనిచేశాడు.యెహెఙ్కేలు ఇశ్రాయేలీయులకు ఒక పనోరమా ఇచ్చాడు. పనోరమా అంటే ఏమిటంటే ఒక సుదీర్ఘ చిత్రం. మన ఫోన్ తీసుకొని కెమెరా ఆన్ చేసి చుట్టూ తిరిగాము అనుకోండి, 360 డిగ్రీల ఫోటో తీయొచ్చు. మనకు అన్ని వైపులా ఉన్న వస్తువులను మనం ఫోటో తీసుకోవచ్చు. యెహెఙ్కేలు ప్రవక్త తన గ్రంథములో ఒక పనోరమా పాఠకులకు ఇస్తున్నాడు. ఇప్పటి వరకు జరిగింది ఇది, ఇక జరుగబోయేది ఇది అని ఆయన ఇశ్రాయేలీయుల ముందు ఒక చిత్రాన్ని గీస్తున్నాడు.

     మీరు బబులోను ఎందుకు వచ్చారు? ఇక్కడ ఎంత కాలం ఉంటారు? తిరిగిఇశ్రాయేలు దేశం ఎప్పుడు వెళ్తారు? భవిష్యత్తులో మీకు ఏమి జరుగుతుంది? అనే ప్రశ్నలకు ఆయన పుస్తకములో జవాబులు ఉన్నాయి. యెహెఙ్కేలు 36,37 అధ్యాయాలు  చదివితే, దేవుడు ప్రపంచం నలుమూలల నుండి యూదులను ఇశ్రాయేలు దేశానికి సమకూర్చుతాడు అని యెహెఙ్కేలు ప్రవచించాడు. 1948 లో ఇశ్రాయేలు దేశం ఏర్పడిన తరువాత ఆ ప్రవచనం నెరవేరింది. వంద సంవత్సరాల క్రితం ఇశ్రాయేలు దేశం తిరిగి ఏర్పడుతుంది అని మీరు అంటే, జనం మిమ్మును చూసి నవ్వే పరిస్థితి ఉండేది. ‘ఏంటయ్యా, ఏమి  మాట్లాడుతున్నావు, యూదులు ప్రపంచం మొత్తం చెదిరిపోయి ఉన్నారు. ఇశ్రాయేలు ప్రాంతము మొత్తం అరబ్బుల హస్తాల్లో ఉంది. యెరూషలేము ముస్లిముల క్రింద ఉంది. యూదులు తిరిగి రావడం, యెరూషలేము ను తిరిగి పొందడం అసంభవం’ అని వారు అంటూ ఉండేవారు. అయితే, దేవుడు చెప్పిన ఏ మాటా వ్యర్థం కాదు, దేవుడు చేసిన ఏ ప్రవచనమూ నిరర్ధకం కాదు. 

    2600 సంవత్సరముల క్రితం దేవుడు యెహెఙ్కేలు ద్వారా చెప్పిన ప్రవచనం మన ఆధునిక కాలములో నెరవేరింది. యెహెఙ్కేలు: ఆయన పేరుకు ‘దేవుడు శక్తిమంతుడు’ అని అర్ధం. ఇశ్రాయేలీయులు చెరలో ఉన్నారు. వారికి ఆ దుస్థితి ఎందుకు కలిగిందో చెప్పాలంటే ఆయనకు ధైర్యం కావాలి. వారికి ఆదరణ కలిగించాలంటే దేవుని శక్తి ఆయనకు అవసరం. దేవుని శక్తి ఎంత? 37 అధ్యాయములో దేవుడు యెహెఙ్కేలుకు ఇచ్చిన గొప్ప దర్శనం మనం చూస్తాము. ఎండిన ఎముకలతో కూడిన ఒక గొప్ప లోయ అక్కడ ఉంది. ఆ ఎముకలలో జీవం లేదు. అప్పుడు దేవుని శక్తి వచ్చి ఆ ఎముకలలో ప్రవేశించింది. దేవుని జీవం ఆ ఎముకలలో ప్రవేశించింది. అప్పుడు అవి ఒకదాని నొకటి కలుసుకొని జీవముతో తిరిగి లేచినవి. దేవుని శక్తి అలాంటిది. 

     అనేక చిహ్నాలు, ఉపమానాలు, వింత చేష్టలతో యెహెఙ్కేలు దేవుని సందేశాన్ని ప్రజలకు అందించాడు. క్రీ. పూ 597 లో యెహెఙ్కేలు 3000 మంది యూదు సోదరులతో బబులోను కు చెరగా తీసుకొని వెళ్ళబడ్డాడు. బబులోనులో ఉండి దేవుని ప్రజలకు ఆయన గొప్ప నిరీక్షణ సందేశం ఇచ్చాడు: దేవుడు మరొక సారి మిమ్ములను దర్శిస్తాడు. ప్రపంచం నలుమూలల నుండి దేవుడు మిమ్ములను తన వద్దకు, యెరూషలేముకు చేకూర్చుతాడు. అనేక ప్రవచనాలు ఈ యెహెఙ్కేలు గ్రంథము లో మనకు కనిపిస్తాయి. 

ముఖ్య ప్రవచనాలు: 

-యూదా, యెరూషలేము శిక్షించబడుట  (యెహెఙ్కేలు 4-24) 

-దేవుడు తన ప్రజలతో చేసే నిత్య నిబంధన (యెహెఙ్కేలు 16:60-63) 

-చెదరిపోయిన యూదులు స్వదేశం చేరుకొంటారు (యెహెఙ్కేలు 20:33-44) 

-అన్య దేశములకు వ్యతిరేకముగా దేవుని ప్రవచనాలు (యెహెఙ్కేలు 25-32) 

-ఇశ్రాయేలు పశ్చాత్తాప పడుట (యెహెఙ్కేలు 33) 

-ఇశ్రాయేలుకు రాబోయే నిజమైన కాపరి (యెహెఙ్కేలు 34:11-31) 

-ఇశ్రాయేలు తిరిగి జన్మించుట ((యెహెఙ్కేలు 36-37) 

-దేవుని నామము పరిశుద్ధపరచబడుట (యెహెఙ్కేలు 36:22-32) 

-గోగు, మాగోగు ల నుండి ఇశ్రాయేలు రక్షణ (యెహెఙ్కేలు 38-39) 

-వెయ్యేళ్ళ పాలనలో నిర్మించబడే దేవుని ఆలయం (యెహెఙ్కేలు 40-46) 

-దేవుని ఆలయములో గొప్ప నది ప్రవహిస్తుంది (యెహెఙ్కేలు 47:1-12) 

-వెయ్యేళ్ళ పాలనలోఇశ్రాయేలు గోత్రముల మధ్య స్థల విభజన (యెహెఙ్కేలు 48:1-29) 

ప్రభువైన యేసు క్రీస్తు రూపం: 

    తరువాత మనం అడగవలసిన ప్రశ్న: యెహెఙ్కేలు గ్రంథము లో ప్రభువైన యేసు క్రీస్తు మనకు ఎలా కనిపిస్తున్నాడు? 

దేవుని మహిమ: 

యెహెఙ్కేలు గ్రంథములోమనకు ప్రాముఖ్యముగా కనిపిస్తుంది. దేవుని మహిమ యెరూషలేము లోని ఆలయము నకు వచ్చుట యెహెఙ్కేలు ప్రవక్త చూశాడు.ఆ దేవునిమహిమ మన మధ్యలోకి ఎలా వచ్చింది? ప్రభువైన యేసు క్రీస్తు గా వచ్చింది.ఆ వాక్యము శరీరధారియై, కృపాసత్యసంపూర్ణు డుగా మనమధ్య నివసించెను; తండ్రివలన కలిగిన అద్వి తీయకుమారుని మహిమవలె మనము ఆయన మహిమను కనుగొంటిమి.

                    యోహాను 1:14 

    మన మధ్యలోకి దిగి వచ్చిన ఆ దేవుని మహిమ ఎవరంటే ప్రభువైన యేసు క్రీస్తే. ఆయన దివ్యమైన దైవిక మోహములో దేవుని మహిమ మనకు కనిపించింది.

Son of Man in Ezekiel 

ఆ తరువాత యెహెఙ్కేలు లో యేసు క్రీస్తు: మనుష్య కుమారుడు

  దానియేలు గ్రంథములొ, యెహెఙ్కేలు గ్రంథము లో ‘మనుష్య కుమారుడు’ అనే పేరు మనకు కనిపిస్తుంది. సెయింట్ అగస్టీన్ ‘సిటీ అఫ్ గాడ్’ ‘దేవుని నగరము’ అనే పుస్తకం వ్రాశాడు. ఆ పుస్తకములో దానియేలు, యెహెఙ్కేలు గ్రంథాలను ఆయన ప్రస్తావించాడు. 

the  city of man, and the city of God.

The City of Man: మనిషి కట్టే నగరం, దేవుడు కట్టే నగరం.మనిషి కట్టే నగరం ఎలా ఉంది? హింస, రక్త పాతం, ద్వేషం, అసూయ, హత్యలు, మాన భంగాలు, కరువులు, కరోనాలు, బెడ్లు లేని హాస్పిటల్ లు, ఆక్సిజన్ లేని సిలిండర్ లు, నిండిపోతున్న శ్మశాన వాటికలు స్థలం లేని సమాధుల తోటలు. అది City of Man. అందులో నిరీక్షణ లేదు, జీవం లేదు, భవిష్యత్తు లేదు, వెలుగు లేదు.

City of God: దేవుని నగరములో జీవం ఉంది, నిరీక్షణ ఉంది, వెలుగు ఉంది, భవిష్యత్తు ఉంది. ఆ దేవుని నగరాన్ని నిర్మించడానికి మనుష్య కుమారుడుమన మధ్యలోకి వచ్చాడు.‘మనుష్య కుమారుడు’ అనే మాట ఎంతో ప్రశస్తమైనది. ప్రభువైన యేసు క్రీస్తు అనేక సార్లు తనను తాను ‘మనుష్య కుమారుడు’ అని పిలుచుకొన్నాడు. యెహెఙ్కేలు, దానియేలు గ్రంథములలో ‘మనుష్య కుమారుడు’ మనకు స్పష్టముగా కనిపిస్తున్నాడు.దేవుడు భూమి మీదకు ‘మనుష్య కుమారుడు’ గావచ్చే సమయము దగ్గరపడింది. యెహెఙ్కేలు అనేక సూచక క్రియలు చేసి ఇశ్రాయేలీయులకు దేవుని సందేశం ఇచ్చాడు. యేసు ప్రభువు కూడా అనేక సూచక క్రియలు చేసి యూదులకు దేవుని వాక్యం ప్రకటించాడు.యెరూషలేములో ఉన్న దేవుని మందిరం లో జరుగుతున్న అక్రమాలను దేవుడు యెహెఙ్కేలుకు చూపించాడు. యేసు ప్రభువు కూడా యెరూషలేములోని దేవుని మందిరము లోకి వెళ్లి అక్కడ జరుగుతున్న అక్రమాలను ఎండగట్టాడు. ‘మీరు నా తండ్రి ఆలయాన్ని దొంగల గుహగా మార్చి వేశారు’ అని అక్కడ ఉన్న వ్యాపారస్తులను ఆయన వెళ్ళగొట్టాడు.ఆ తరువాత ఆయన మనకు కాపరి గా కనిపిస్తున్నాడు.

యెహెఙ్కేలు 34: అధ్యాయములో దేవుడు మనకు ఒక కాపరి గా కనిపిస్తున్నాడు.  అక్కడ కొన్ని మాటలు చూద్దాము: 

2. నరపుత్రుడా, ఇశ్రాయేలీయుల కాపరులనుగూర్చి ఈ మాట ప్రవచింపుము, ఆ కాపరులతో ఇట్లనుము ప్రభువగు యెహోవా సెలవిచ్చున దేమనగా తమ కడుపు నింపుకొను ఇశ్రాయేలీయుల కాపరులకు శ్రమ; కాపరులు గొఱ్ఱెలను మేపవలెను గదా.3. మీరు క్రొవ్విన గొఱ్ఱెలను వధించి క్రొవ్వును తిని బొచ్చును కప్పుకొందురు గాని గొఱ్ఱ లను మేపరు,4. బలహీనమైన వాటిని మీరు బలపరచరు, రోగముగలవాటిని స్వస్థపరచరు, గాయపడిన వాటికి కట్టుకట్టరు, తోలివేసిన వాటిని మరలతోలుకొనిరారు, తప్పిపోయినవాటిని వెదకరు, అది మాత్రమేగాక మీరు కఠినమనస్కులై బలాత్కారముతో వాటిని ఏలుదురు.5. కాబట్టి కాపరులు లేకయే అవి చెదరిపోయెను,చెదరి పోయి సకల అడవి మృగములకు ఆహారమాయెను.11. ప్రభువైన యెహోవా సెలవిచ్చునదేమనగా ఇదిగో నేను నేనే నా గొఱ్ఱెలను వెదకి వాటిని కనుగొందును.

                               యెహెఙ్కేలు 34 

     ఇక్కడ దేవుడు చాలా కోపముతో మాట్లాడుతున్నాడు. ఇశ్రాయేలు కాపరులతో ఆయన మాట్లాడుతున్నాడు. మీరు దొంగ కాపరులు, మీ కడుపు నింపుకోవటమే తప్ప మీరు నా గొఱ్ఱెలను పట్టించుకోరు. మీరు గొఱ్ఱెలను భక్షించే వారే కానీ రక్షించే వారు కాదు. బలహీనమైనవాటిని మీరు బలపరచరు, రోగముగలవాటిని స్వస్థపరచరు, గాయపడిన వాటికి కట్టుకట్టరు, తోలివేసిన వాటిని మరల తోలుకొనిరారు, తప్పిపోయిన వాటిని వెదకరు. ఇదిగో నేను నేనే నా గొఱ్ఱెలను వెదకి వాటిని కనుగొందును.

      దేవుడు తానే మన మధ్యలోకి ఒక గొఱ్ఱెల కాపరిగా వచ్చాడు. మన ప్రభువైన యేసు క్రీస్తు గా మన మధ్యలోకి వచ్చాడు. ఆయన మంచి గొఱ్ఱెల కాపరి, గొప్ప గొఱ్ఱెల కాపరి, ప్రధాన కాపరి. ఈయన గొఱ్ఱెల కోసము తన ప్రాణం పెట్టే కాపరి. నేను గొఱ్ఱెలకు మంచి కాపరిని; మంచి కాపరి గొఱ్ఱెలకొరకు తన ప్రాణము పెట్టును. 

              యోహాను10:11 

ప్రభువైన యేసు క్రీస్తు మంచి గొఱ్ఱెల కాపరి, గొఱ్ఱెల కొరకు తన ప్రాణం పెట్టే కాపరి.బలహీనమైన గొఱ్ఱెలను బలపరచే కాపరి రోగము గల వాటిని స్వస్థపరచే కాపరి, గాయపడిన వాటికి కట్టుకట్టే కాపరి తోలివేసిన వాటిని సమకూర్చే కాపరితప్పి పోయిన వాటిని వెదికే కాపరి.ఈ మంచి కాపరి యొద్దకు నీవు వచ్చావా? 21. ప్రభువైన యెహోవా సెలవిచ్చున దేమనగా ఏయే అన్యజనులలో ఇశ్రాయేలీయులు చెదరిపోయిరో ఆ యా అన్యజనులలోనుండి వారిని రక్షించి, వారు ఎచ్చటెచ్చట ఉన్నారో అచ్చటనుండి వారిని సమకూర్చి వారి స్వదేశములోనికి తోడుకొనివచ్చి 22. వారికమీదట ఎన్నటికిని రెండు జనములుగాను రెండు రాజ్యములుగాను ఉండ కుండునట్లు ఆ దేశములో ఇశ్రాయేలీయుల పర్వతముల మీద 23. వారిని ఏకజనముగా చేసి, వారికందరికి ఒక రాజునే నియమించెదను. 26. నేను వారితో సమాధా నార్థమైన నిబంధన చేసెదను, అది నాకును వారికిని నిత్య నిబంధనగా ఉండును

    దేవుడు ఇశ్రాయేలీయులకు గొప్ప వాగ్దానము చేస్తున్నాడు. ప్రపంచమంతా చెదరిపోయిన నా ప్రజలను సమకూర్చుతాను.వారిక రెండు జనములుగా ఉండరు, రెండు రాజ్యములుగా ఉండరు.వారిని ఏక జనముగా చేస్తాను.వారికి ఒక రాజునే నియమిస్తాను.వారితో సమాధాన నిబంధన చేస్తాను. వారితో నిత్య నిబంధన చేస్తాను.

    దేవుడు ఆ వాగ్దానం నెరవేర్చాడు. ప్రపంచమంతా చెదరి పోయిన తన ప్రజలను తిరిగి యెరూషలేముకు తీసుకువచ్చాడు.మీరు ఆలోచిస్తే దేవుని కార్యములు చాలా గొప్పవి.యాకోబుకు 12 మంది కుమారులు. ఆ 12 మంది కుమారులలో నుండి12 గోత్రాలు దేవుడు చేసాడు. 12 మంది పిల్లల్ని పెంచి పెద్ద వారిని చేయడం సామాన్యమైన విషయం కాదు. 4 వేల సంవత్సరాల క్రితం శిశు మరణాలు చాలా ఎక్కువగా ఉండేవి. అలాంటి సమయములో 12 పిల్లలు మొత్తం బ్రతకడం గొప్ప విషయమే. ఈ రోజు కరోనా పాండమిక్ లో కుటుంబాలు, కుటుంబాలే కనుమరుగు అవుతున్నాయి. 21 శతాబ్దములో, ఈ ఆధునిక యుగములో ఎంత కాలము బ్రతుకుతామో మనకే తెలియని పరిస్థితి మనకు కలిగింది. 

     4 వేల సంవత్సరాలుగా యూదులు అనేక వ్యాధులు, బాధలు, కరువులు,భూకంపాలు, యుద్ధాలు, దోపీడీలు చవిచూశారు. దేవుడు వారిని కాపాడుకొంటూ వస్తున్నాడు. అది చాలా గొప్ప అద్భుతం. నన్నడిగితే, ప్రపంచ చరిత్రలోనే గొప్ప అద్భుతం. అబ్రహాము కు ఇచ్చిన మాటను దేవుడు ఈ రోజుకూ నిలబెడుతున్నాడు. అది నిత్య నిబంధన, సమాధాన నిబంధన.

దేవుని ఆలయము: దేవుని ఆలయం: యెహెఙ్కేలు 41 – 46 అధ్యాయాల్లో యెరూషలేములో నిర్మించబడే దేవుని ఆలయం మనకు కనిపిస్తుంది. ఈ ప్రవచనముమనకు అర్థం కావాలంటే మనము దానియేలు గ్రంథం కూడా చూడాలి. దానియేలు 9 అధ్యాయములో మనం 70 వారములు ప్రవచనం చూస్తున్నాము. 

తిరుగుబాటును మాన్పుటకును, పాపమును నివారణ చేయుటకును, దోషము నిమిత్తము ప్రాయశ్చిత్తము చేయుటకును, యుగాంతము వరకుండునట్టి నీతిని బయలు పరచుటకును, దర్శనమును ప్రవచనమును ముద్రించుటకును, అతి పరిశుద్ధ స్థలమును అభిషేకించుటకును, నీ జనమునకును పరిశుద్ధ పట్టణమునకును డెబ్బదివారములు విధింపబడెను.

                   దానియేలు 9

     నీ జనమునకును పరిశుద్ధ పట్టణమునకును డెబ్బదివారములు విధింపబడెను: ఈ 70 వారముల ప్రవచనము దేవుడు యూదులకు, యెరూషలేముకు విధించాడు. ఈ 70 వారములలో మనకు 490 సంవత్సరాలు కనిపిస్తున్నాయి. ఆ 490 సంవత్సరాల తరువాత 6 కార్యములు జరుగుతాయి.

1.తిరుగుబాటును మాన్పుటకును: ఇశ్రాయేలీయులు ప్రభువైన యేసు క్రీస్తు మీద తిరుగు బాటు చేశారు. ఆయనను సిలువ వేసి చంపారు. అయితే, ఆయన రెండవ సారి తిరిగి వచ్చినప్పుడు వారు ఆయన మీద తిరుగు బాటు చేయరు. ఆయనను తమ రక్షకునిగా మెస్సియా గా అంగీకరిస్తారు. 

2.పాపమును నివారణ చేయుటకును: ప్రభువైన యేసు క్రీస్తు ను నమ్ముకొనిన తరువాత ఇశ్రాయేలీయుల పాపము నివారణ చేయబడుతుంది.

3.దోషము నిమిత్తము ప్రాయశ్చిత్తము చేయుటకును: యేసు క్రీస్తు రెండవ సారి వచ్చినప్పుడు ఇశ్రాయేలీయులు ఆయనను నమ్ముకొనుట మాత్రమే కాక ఆయన సిలువ కార్యాన్ని కూడా అంగీకరిస్తారు. అప్పుడు వారు చేసిన దోషానికి ప్రాయశ్చిత్తము కలుగుతుంది.

4.యుగాంతము వరకుండునట్టి నీతిని బయలు పరచుటకును: వెయ్యేళ్ళ పాలనలో యేసు క్రీస్తు తన ప్రజలకు పరిపూర్ణమైన నీతిని ఇస్తాడు.

5.దర్శనమును ప్రవచనమును ముద్రించుటకు: సమస్త దర్శనములు, ప్రవచనములు యేసు క్రీస్తు రెండవ సారి వచ్చినప్పుడు ముద్రించబడతాయి. అంటే అవన్నీ నెరవేరుతాయి. ఇంకా నెరవేరని దర్శనము అంటూ ఉండదు, ఇంకా నెరవేరని ప్రవచనము అంటూ ఉండదు.

6.అతి పరిశుద్ధ స్థలమును అభిషేకించుటకు: దేవుని అతి పరిశుద్ధ స్థలము అభిషేకించబడుతుంది. అంటే దేవుని మందిరము నిర్మించబడుతుంది. రెండు వేల సంవత్సరములుగా యెరూషలేములో దేవుని మందిరం లేదు. యేసు క్రీస్తు తిరిగి వచ్చినప్పుడు అది తిరిగి నిర్మించబడుతుంది. 

     ఈ యెహెఙ్కేలు గ్రంథములో ‘దేవుని ఆలయము’ నకు చాలా ప్రాముఖ్యత ఉన్నది. మొదటి భాగములో, దేవుని ఆలయము ను మీరు చూస్తే ఇశ్రాయేలీయులు దానిని అపవిత్రం చేయడం మనం చూస్తున్నాము. దేవుడు వారిని  చూసినప్పుడు దేవుని హృదయానికి  సంతోషం  లేదు.ఇశ్రాయేలీయులు పేదలకు సహాయం చేయకపోగా, దేవుని ఆలయాన్నే ఒక వ్యాపార కేంద్రముగా మార్చివేశారు.అందుకనే దేవుడు ఆ ఆలయమును నిర్మూలించాడు. వారిని తమ స్వదేశములో నుండి వెళ్ళగొట్టాడు. ‘దేవుని ఆలయము’ కేంద్రముగా వారికి శిక్ష విధించబడింది. 

    రెండవ భాగములో కూడా ‘దేవుని ఆలయము’ మనకు స్పష్టముగా కనిపిస్తున్నది. 40-48 అధ్యాయాలు మీరు చదివితే, ఆ ఆలయము ఎలా నిర్మించబడుతుందో మనకు అనేక వివరములు ఇవ్వబడ్డాయి. దేవుడు వారితో ఏమన్నాడు? చెదరి పోయిన మీ అందరినీ నేను తిరిగి మీ స్వదేశానికి సమకూర్చుతాను. మీతో క్రొత్త నిబంధన చేస్తాను. మీకు ఒక క్రొత్త ఆలయము నిర్మించబడుతుంది. ‘దేవుని ఆలయము’ కేంద్రముగా వారికి నిరీక్షణ, ఆశీర్వాదం లభించినవి. దేవుని సమాజములో, దేవుని ప్రజలకు దేవుని ఆలయము కేంద్రముగా ఉంది. ఆ సత్యాన్ని మనం గుర్తుపెట్టుకోవాలి. ప్రతి ఆది వారంమనం దేవుని ఆలయమునకు వెళ్ళాలి. టీవీ లో దేవుని వాక్యం విన్నాను అది చాలు, యూట్యూబ్ లో దేవుని వాక్యం చూశాను అది చాలు అని మనం సరిపెట్ట కూడదు. దేవుని మందిరానికి వెళ్లి, దేవుని ప్రజల మధ్య గడపాలి.        

      ఈ రోజు యెహెఙ్కేలు గ్రంథం నుండి ఈ రోజు కొన్ని సత్యాలు మనం చూశాము. దేవుని కాపరి ప్రభువైన యేసు క్రీస్తు అక్కడ మనకుకనిపిస్తున్నాడు. ఆ కాపరి దగ్గరకు వచ్చి మీరు రక్షణ పొందాలన్నదే నేటి మా ప్రేమ సందేశం.

Leave a Reply