యేసు ప్రభువు చెప్పిన 7 మాటలు

యోహాను సువార్త లోనుండి కొన్ని సత్యాలు మీతో పంచుకోవాలని నేను ఆశ పడుతున్నాను. కరోనా సెకండ్ వేవ్ మన మీద విరుచుకుపడింది. జ్వరం, ఆయాసం, దగ్గు, నీరసం అనేక మందిని ఆవహించింది. గాలి పీల్చ లేని పరిస్థితిలో చాలా మంది ఉన్నారు. హాస్పిటల్ కి వెళ్లాలంటే, అంబులెన్సులు కనిపించవు. అవి ఉంటే హాస్పిటల్ లో బెడ్ లు లేని పరిస్థితి మనం చూస్తున్నాము. ఎంతో మంది అంబులెన్సు లోనే గంటలు, గంటలు ఉండాల్సి వస్తున్నది. నేను గత 20 సంవత్సరాలుగా డాక్టర్ గా పనిచేస్తున్నాను. హాస్పిటల్ లలో బెడ్ లు ఎప్పుడూ ఖాళీ గా కనిపించేవి. నా కెరీర్ లో మొదటి సారి హాస్పిటల్ లో బెడ్ లేని పరిస్థితి నాకు కనిపించింది. ఎటు చూసినా ఏడ్పులు, ఆర్త నాదాలు వినిపిస్తున్నాయి.

    చాలా మంది రోడ్డు ప్రక్కనే పడిపోతున్నారు.ఎవరన్నా వచ్చి సహాయం చేస్తే బాగుండు అనే వేదన వారి మొహాల్లో మనం చూస్తున్నాము.హాస్పిటల్ లో బెడ్ దొరికిన వారు బ్రతుకుతామో లేదో అనే నిస్పృహ లో ఉన్నారు. నా అనే వారు కూడా ప్రక్కన లేకుండా చాలా మంది ప్రాణాలు కోల్పోతున్నారు. మృత దేహాలను సరాసరి స్మశానాలకు తరలిస్తున్నారు. సమాధుల తోటలు రద్దీగా ఉన్నాయి.శ్మశాన వాటికలు మంటలతో నిండిపోతున్నాయి. 

    ఎటు చూసినా చితి మంటలే మనకు కనిపిస్తున్నాయి. అయిన వారి చివరి చూపు కూడా దొరకని వారు ఉన్నారు. ఆక్సిజన్ కోసం ప్రజలు కేకలు పెడుతున్నారు. సోషల్ మీడియా లో, ట్విట్టర్ లో సహాయం కోసం అర్థిస్తున్నారు. ఎలాంటి సహాయం అందక ప్రాణాలు కోల్పోతున్నారు.ఇలాంటి సంక్లిష్ట సమయాల్లో మనం దేవునికి ప్రార్ధన చేయాలి. మనం దేవునికి మొఱ్ఱ పెట్టాలి. దేవుడు తప్ప మనకు ఇంకెవ్వరూ సహాయం చేయలేరు. ఇలాంటి రోజుల్లో మనకు భద్రత ఇచ్చేది ఏమిటి? ఇలాంటి పరిస్థితుల్లో మనకు నిరీక్షణ ఎలా దొరుకుతుంది? మన ప్రభువైన యేసు క్రీస్తు వైపు మనం చూడాల్సిందే. ఈ సందర్భముగా యేసు ప్రభువు చెప్పిన 7 మాటలు మీకు గుర్తు చేయాలి అని నేను ఆశ పడుతున్నాను. వీటిని 7 I AM statements అంటారు ఏడు ‘నేను’ ప్రకటనలు యోహాను సువార్త లో మాత్రమే ఇవి మనకు కనిపిస్తున్నాయి.

మొదటిగా యోహాను 6:35, యేసు ప్రభువు ఏమంటున్నాడంటే, 

అందుకు యేసు వారితో ఇట్లనెను: జీవాహారము నేనే; నాయొద్దకు వచ్చువాడు ఏమాత్రమును ఆకలిగొనడు,నాయందు విశ్వాసముంచు వాడు ఎప్పుడును దప్పిగొనడు.

                      యోహాను 6:35

     ఇక్కడ యేసు ప్రభువు మనతో ఏమంటున్నాడంటే, నేను జీవాహారమును.

దేవుని పేరులలో ఒకటి ‘నేను’ నిర్గమ 3:14 లో దేవుడు మోషే తో ఏమన్నాడు? అందుకు దేవుడు నేను ఉన్నవాడను అను వాడనైయున్నానని మోషేతో చెప్పెను.

Self – Existing God అంటే ఎవరి మీద, దేని మీద ఆధారపడకుండా మనగలిగే 

వాడు. మనం self-existing కాదు. మనం ఇతరుల మీద ఆధారపడవలసినదే. 

ఇప్పుడు చూస్తున్నాము కదా. ఆక్సిజన్ కోసం మనం ఎంత ప్రయాసపడుతున్నాము. 

నా దగ్గర ఉన్న ఆక్సిజన్ సిలిండర్ లు పేషెంట్ లకు ఇచ్చాను. ఇంకా ఆక్సిజన్ 

కావాలి. అనేక దేశాల నుండి విమానాల్లో ఆక్సిజన్ తీసుకురావలసిన వస్తున్నది. 

పెద్ద పెద్ద ఓడల్లో ఆక్సిజన్ తీసుకు రావలసి వస్తున్నది. కొంత సేపు ఆక్సిజన్ సప్లై ఆగిపోతే వందల మంది ప్రాణాలు కోల్పోతున్నారు. మనం self sufficient కాదు. 

దేని మీద ఆధారపడకుండా మనం బ్రతుకలేము. 

     దేవుడు ఆ ప్రశ్న మనలను అడుగుతున్నాడు. ఈ భూమి మీద నేను ఆక్సిజన్ ఆపివేస్తే నువ్వు బ్రతకగలవా? ఆహారం ఆపివేస్తే నువ్వు బ్రతకగలవా? నీరు ఆపివేస్తే నువ్వు బ్రతకగలవా? దేవుని అనుగ్రహం లేకుండా మనం ఈ భూమి మీద ఒక్క క్షణం కూడా బ్రతకలేము. ఆధునిక సమాజములో మనిషి ఆ సత్యాన్ని మరచిపోయాడు.

    ఆల్డస్ హక్సలె అనే రచయిత 1932 లో ‘బ్రేవ్ న్యూ వరల్డ్’ అనే నవల వ్రాశాడు.అందులో 632 AF అనే సంవత్సరములో మానవ సమాజం ఎలాఉంటుందో వ్రాశాడు.1932 నుండి 600 సంవత్సరాల తరువాత ప్రపంచం ఎలా ఉంటుంది? 

632 AF, AF అంటే హెన్రీ ఫోర్డ్ ఈ హెన్రీ ఫోర్డ్ గొప్ప పారిశ్రామికవేత్త. ఆయన అమెరికా దేశములో కార్ల ఫ్యాక్టరీ పెట్టాడు. ‘అసెంబ్లీ లైన్’ అనే సరికొత్త విధానం కనుగొన్నాడు. రోజుకు అనేక వేల కార్లు ఉత్పత్తి చేయడానికి ఆ విధానం ఉపయోగపడింది. అందరూ

కార్లు కొనుక్కోవటం మొదలుపెట్టారు. హెన్రీ ఫోర్డ్ ఆ విధముగా ప్రజల జీవితాన్ని టెక్నాలజీ తో ప్రభావితం చేసాడు. ప్రపంచం హెన్రీఫోర్డ్ మోజులో పడిపోయింది.

యేసు క్రీస్తు ను మరచిపోయింది.క్రీస్తు శకం అనే పద్దతిని ఆపివేశారు.హెన్రీ ఫోర్డ్ శకం అనే క్రొత్త పద్దతిని కనుగొన్నారు. ఆ  నవలలో లండన్ నగరం మనకు కనిపిస్తుంది. అక్కడ అంతా ‘అసెంబ్లీ లైన్’ ప్రపంచం ఉంటుంది.మానవ శిశువులను కూడా అసెంబ్లీ లైన్ ఉత్పత్తి చేస్తూ ఉంటారు. జీన్ టెక్నాలజీ తో కోరుకున్నట్లు బేబీ లను తయారు చేసుకోవచ్చు. వారికి వాక్సిన్ లు ఇచ్చి రోగ నిరోధక శక్తి ఇస్తారు. వారికి ఏ కొదువా ఉండదు. 

     వివాహ వ్యవస్థ రద్దుచేస్తారు. ఎవరు, ఎవరితో నైనా తిరగొచ్చు. అడిగే వారు ఉండరు. వారికి దేవుని మీద నమ్మకం ఉండదు.‘దేవుడు ఉంటే ఏమిటి, లేకపోతే నాకేంటి? ఆయన గొడవ నాకు ఎందుకు? మనకు ఏమి తక్కువ అయ్యింది? దేవుడు నాకు అనవసరం’ అనే సంస్కృతి ఆ నగరములో  ఉంటుంది.బెర్నార్డ్, లెనినా – ఇద్దరు వ్యక్తులు న్యూ మెక్సికో వెళ్తారు. అడవుల్లోకి వెళ్తారు.అక్కడ ఆదిమ జాతి వారు బ్రతుకుతూ ఉంటారు. వారిని చూసి బెర్నార్డ్, లెనినాలకు ఆశ్చర్యం వేస్తుంది. వారికి టెక్నాలజీ ఉండదు. దేవుని మీద వారికి భక్తి ఉంటుంది.తెల్లారి లేచిన దగ్గర నుండి బ్రతుకు తెరువు కోసం వారు ప్రయాస పడుతూ ఉంటారు.నీటి కోసం, ఆహారం కోసం శ్రమ పడుతూ ఉంటారు. దేవుని వైపు చూస్తూ ఉంటారు.ఈ రోజు మనం కూడా బెర్నార్డ్, లెనినాల వలె మారిపోయాము. టెక్నాలజీ మన జీవితాలను ఎంతో మార్చివేసింది. సుఖముగా బ్రతకటం మనం అలవాటు చేసుకొన్నాము. దేవుడు ఉంటే ఏమిటి? లేకపోతే ఏమిటి? అనే పరిస్థితి కి వచ్చాము.

    దేవుడు మనకు కూడా ఆ కొండ జాతి వారిని చూపిస్తున్నాడు. వారికి ఉన్న కృతజ్ఞత కూడా మీకు నా మీద ఉండదు.మనం టెక్నాలజీ చూసుకొని, ఆర్ధిక ప్రగతి చూసుకొని దేవుడు మాకు అవసరం లేదు అనుకొంటున్నాము. నీరు ఎక్కడ? ఆహారం ఎక్కడ? ఆక్సిజన్ ఎక్కడ? అనే పరిస్థితి లోకి మనలను నెట్టాలంటే దేవునికి ఎంతో సేపు పట్టదు. 

ఇక్కడ యేసు ప్రభువు యూదులతో మాట్లాడుతున్నాడు. వారు యేసు ప్రభువు ను  నిర్లక్ష్యం చేశారు . నీతో మాకేంటి? అనే ధోరణి ప్రదర్శించారు.నేను జీవాహారమును అని ఆయన వారితో అన్నాడు. 

 I am the Bread of Life

మనకు కావలసిన జీవాహారము యేసు క్రీస్తు ప్రభువు 

ఆ ఆహారం లేకపోతే మీకు దేవుని జీవం ఉండదు. ఇశ్రాయేలీయులు 40 సంవత్సరములు అరణ్యములో ప్రయాణం చేశారు.ప్రతి రోజూ దేవుడు ఆకాశం నుండి

వారి మీద మన్నా కురిపించాడు.ఈ రోజు మనం కూడా అరణ్యయాత్రలో ఉన్నాము. ఆకాశం నుండి వచ్చిన మన్నా ఇశ్రాయేలీయులను అరణ్య యాత్రలో ముందుకు నడిపించింది.ఈ రోజు మన అరణ్యయాత్రలో మనలను ముందుకు నడిపించే దేవుని జీవాహారం ఎవరంటే ప్రభువైన యేసు క్రీస్తు.

రెండవ ‘నేను’ అనే ప్రకటన యోహాను సువార్త 8:12 లో మనకు కనిపిస్తున్నది.అక్కడ యేసు ప్రభువు ఏమన్నాడంటే, 

మరల యేసు : 

నేను లోకమునకు వెలుగును, నన్ను 

వెంబడించువాడు చీకటిలో నడువక

జీవపు వెలుగుగలిగి యుండును 

                     యోహాను 8:12

     ఇక్కడ యేసుప్రభువు నేను లోకమునకు వెలుగును అని అంటున్నాడు. ఆయన దైవత్వము ఆ మాటల్లో మనకు కనిపిస్తున్నది. బైబిల్ లో దేవుడు సూర్యునితో పోల్చబడ్డాడు. కీర్తన 84:11 లో మనం చదువుతాము.

దేవుడైన యెహోవా సూర్యుడును

కేడెమునై యున్నాడు. 

                      కీర్తన 84:11 

   మీకు నీతి సూర్యుడు ఉదయించును; అతని రెక్కలు ఆరోగ్యము కలుగజేయును

అని మనం మలాకీ గ్రంథములో 4:2 మనం చదువుతాము. సూర్యుడు లేకుండా మనం ఈ భూమి మీద ఒక్క క్షణం కూడా ఉండలేము. మన ఉనికి, మన గాలి, వెలుతురు, నీరు, ఆహారం, వాతా వరణం అన్నీ సూర్యుని మీద ఆధారపడి ఉన్నాయి. 

మనం కూడా అన్నిటికీ దేవుని మీద ఆధారపడాలి. నేను లోకమునకు వెలుగును అని 

ఇక్కడ యేసు ప్రభువు యూదులతో అంటున్నాడు. అరణ్యములో 40 సంవత్సరములు ఇశ్రాయేలీయులు నడచివెళ్తున్నప్పుడు ఆ చిమ్మ చీకటిలో వారికి దారి చూపించింది ఎవరు? వారి ఎదుట ఒక అగ్ని స్థంబముగా దేవుడు నడిచాడు. ఈ లోక యాత్రలో, ఈ చీకటి ప్రపంచములో మీకు దారి చూపించేది ఎవరు? ప్రభువైన యేసు క్రీస్తు. 

    దేవుని వెలుగు మనిషి మీద పడినప్పుడు మనిషి చేసే చీకటి పనులు బయటపడుతాయి. ఈ రోజు మన ప్రపంచములో ఎంత  చీకటి ఉందో మనం చూస్తున్నాము. కొన్ని హాస్పిటల్ లో రోగులను దారుణముగా దోచుకొంటున్నారు. రెండేసివిర్ లాంటి మందులు బ్లాక్ మార్కెట్ లో 50 రెట్ల ధరకు అమ్ముకొంటున్నారు. అంబులెన్సు కావాలంటే లంచం, బెడ్ కావాలంటే లంచం ఆక్సిజన్ సిలిండర్ కావాలంటే మార్చురీ లో పెట్టాలంటే లంచం శ్మశాన వాటికలో లంచం అన్ని చోట్ల ప్రజలను దోచుకొంటున్నారు. మన సమాజములో ఉన్న చీకటి మనకు ప్రతి రోజూ కనిపిస్తున్నది. 

    నేను లోకమునకు వెలుగును అని యేసు ప్రభువు అంటున్నాడు. ఆయన వెలుగులో నడుస్తున్నప్పుడు మనం ఏ చీకటికీ భయపడ వలసిన అవసరం లేదు. 

మూడవ నేను అనే ప్రకటన యోహాను సువార్త 10:9 లో మనకు కనిపిస్తున్నది. నేనే ద్వారమును; నా ద్వారా ఎవడైన లోపల ప్రవేశించిన యెడల వాడు రక్షింపబడినవాడై, లోపలికి పోవుచు బయటికి వచ్చుచు మేత మేయుచునుండును.

                 యోహాను 10:9

 గొఱ్ఱెలు రాత్రికి ఒక స్థలమునకు వెళ్లి విశ్రాంతి తీసుకొంటాయి. ఆ స్థలానికి చుట్టూ ఒక ప్రహరీ ఉంటుంది. ముందు ఒక ద్వారము ఉంటుంది. గొఱ్ఱెలకు విశ్రాంతి కావాలంటే అవి ఆ ద్వారములో గుండా లోపలికి వెళ్ళాలి. ఈ రోజు మీకు విశ్రాంతి ఉందా? మీ మనస్సుకు విశ్రాంతి ఉందా? మీ హృదయానికి విశ్రాంతి ఉందా? మీకు విశ్రాంతి కావాలంటే యేసు క్రీస్తు అనే ద్వారం గుండా మీరు ప్రవేశించాలి. 

యేసు ప్రభువు ఏ సందర్భములో ఈ మాటలు చెప్పాడు? యోహాను 9 లో ఆయన ఒక గుడ్డి వానికి ఆయన చూపు ఇచ్చాడు. ప్రజలంతా యేసు ప్రభువు వైపు ఆకర్షితులయ్యారు. అయితే మతాధికారులు అది చూసి ఓర్చుకోలేకపోయారు. ఆ గ్రుడ్డి వానిని పిలిచి అడిగారు. ఏమి జరిగిందో చెప్పారా అని ఆరా తీశారు. ఆ గ్రుడ్డి వాడు 

వారితో ఏమన్నాడు? నేను పుట్టుకతోనే గుడ్డివాణ్ణి. యేసు ప్రభువు నాకు చూపు ఇచ్చాడు. ప్రపంచ చరిత్రలో ఇలాంటిది జరిగిందా? వాడు యేసు ప్రభువు గురించి మంచి మాటలు చెప్పడం వారు ఓర్చు కోలేకపోయారు.‘ఒరే పాపాత్ముడా, నువ్వు మాకు బోధ చేసేవాడివి అయ్యావా? పోరా, 

ఇక్కడ నుండి’ అని అతని మీద అరచారు. వారు దొంగ కాపరులు. ఒక గొఱ్ఱె, చూపు లేని గొఱ్ఱె చూపు పొందింది అని వారు సంతోషపడలేదు. గొఱ్ఱెల  సంక్షేమాన్ని ఆ దొంగ కాపరులు పట్టించుకోరు. వారు ఎప్పుడు చూసినా వారి స్వార్ధ ప్రయోజనాలు చూసుకొన్నారు, వారి జేబులు నింపుకోవడం చూసుకొన్నారు, దేవాలయములో వ్యాపారాలు చేసుకొంటున్నారు. గొఱ్ఱెల సంక్షేమం వారికి పట్టలేదు. గొఱ్ఱెల  ప్రాణాలు తీసే వారే కానీ గొఱ్ఱెలను రక్షించే వారు కాదు. ద్వారము గుండా వారు వెళ్ళరు. గోడ దూకి వెళ్తారు, ప్రహరీ దూకి వెళ్తారు. వారి దొంగ పనులు ముగించుకొని మళ్ళీ గోడ దూకి పారిపోతారు. కాపరి ఆ విధముగా ప్రవర్తించడు. ఆయన ద్వారము ద్వారా వెళ్తాడు. ప్రతి గొఱ్ఱె ఆయన స్వరాన్ని గుర్తు పడుతుంది. ద్వారము మూసి గొఱ్ఱెలకు భద్రత కల్పిస్తాడు. ఆ ద్వారం ముందు కాపరి పండుకొంటాడు. నేను ధైర్యముగా ఉంటాను, ప్రశాంతముగా నిద్రపోతాను. ఎందుకంటే, నా ద్వారము దగ్గర నా కాపరి ఉన్నాడు. శత్రువు నా దగ్గరకు రాలేడు. మీకు దేవుడు ఇచ్చే విశ్రాంతి కావాలంటే, దేవుడు ఇచ్చే  రక్షణ కావాలంటే మీరు యేసు క్రీస్తు ద్వారము ద్వారా ప్రవేశించాలి. నేనే ద్వారమును, I am the Door అని ఆయన అంటున్నాడు.

నాలుగవ నేనే ప్రకటన యోహాను సువార్త 10:11 లో మనం చూస్తున్నాము.

నేను గొఱ్ఱెలకు మంచి కాపరిని మంచి కాపరి గొఱ్ఱెలకొరకు తన ప్రాణము పెట్టును

             యోహాను సువార్త10:11

I am the Good Shepherd

ఆయన గొఱ్ఱెలకు మంచి కాపరి. 

చెడు కాపరులు ఎంతో మంది ఉన్నారు. వారు దొంగలు, దోచుకొనే వారు. అయితే ఈయన మంచి కాపరి. ప్రతి గొఱ్ఱె కోసం ఆయన వెదికేవాడు; ప్రతి గొఱ్ఱె గురించి ఆసక్తి చూపేవాడు; ప్రతి గొఱ్ఱె ను ప్రేమించే వాడు; ప్రతి గొఱ్ఱె కోసం ప్రాణం పెట్టినవాడు. ఎవరూ ఆయన ప్రాణం తీసుకోలేదు. ఆయనను అవమానించారు; బంధించారు; తీర్పు విధించారు;  కొరడాలతో కొట్టారు; ఉమ్మి వేశారు; ముళ్ల కిరీటం పెట్టారు; మేకులు వేశారు; బల్లెంతో పొడిచారు;  అయితే, ఆయన ప్రాణం వారి చేతుల్లో లేదు ఆయనే సిలువ మీద దానిని అర్పించాడు. మూడు రోజుల తరువాత ఆ ప్రాణాన్ని తిరిగి తీసుకొని సమాధి నుండి సజీవునిగా తిరిగి లేచాడు. ఈయన శక్తి కలిగిన కాపరి; ప్రధాన కాపరి; గొప్ప కాపరి; మంచి కాపరి. ఈ రోజు ఆ కాపరి దగ్గరకు మీరు రావాలి. 

అయిదవ నేను అనే ప్రకటన యోహాను సువార్త 11:25 లో మనం చూస్తున్నాము. 

అందుకు యేసు పునరుత్థానమును జీవమును నేనే; నాయందు విశ్వాసముంచువాడు చని పోయినను బ్రదుకును; బ్రదికి నాయందు విశ్వాస ముంచు ప్రతివాడునుఎన్నటికిని చనిపోడు

                    యోహాను 11:25

    యెరూషలేముకు 2 మైళ్ళ దూరములో బేతని అనే గ్రామం ఉంది. అక్కడ లాజరు అనే వ్యక్తి ఉన్నాడు. అతడు చనిపోయి నాలుగు రోజులు అయ్యింది. లాజరుకు మరియా, మార్త అనే ఇద్దరు సోదరీలు ఉన్నారు. వారు తమ సోదరుని కోల్పోయి దుఃఖముతో ఉన్నారు. యేసు ప్రభువు వారిని పరామర్శిస్తున్నాడు. వారితో కలిసి లాజరు సమాధి దగ్గరకు ఆయన వెళ్ళాడు. లాజరును జ్ఞాపకం చేసుకొని కన్నీరు 

పెట్టాడు. ఆ సందర్భములో ఆయన వారితో ఒక మాట అన్నాడు: 

పునరుత్థానమును జీవమును నేనే

I am the resurrection and the life

    ఈ రోజు సమాధుల దగ్గరకు వెళ్లేవారందరూ యేసు ప్రభువు మాటలను జ్ఞాపకం 

చేసుకోవాలి.కొన్ని రోజుల క్రితం ఒక మార్చురీ నుండి నాకు ఫోన్ వచ్చింది. మీ పేషెంట్ చనిపోయాడు.అని అతను నాకు చెప్పాడు. ఆ పేషెంట్ తో నేను గడిపిన సమయాలు, సందర్భాలు నాకు గుర్తుకు వచ్చాయి. అతడు నాకు మరొకసారి కనిపించడు, అతని స్వరం మరొక సారి నాకు వినిపించదు అనే బాధ నాకు కలిగింది.మరణం అలాంటి నిస్పృహను, నిరాశను మనలో కలిగిస్తుంది. క్రీస్తు లేపబడని యెడల మీ విశ్వాసము వ్యర్థమే  (1 కొరింథీ 15:17) అన్నాడు అపొస్తలుడైన పౌలు మొదటి కొరింథీ 

పత్రిక 15:17 అధ్యాయములో. 

    యేసు క్రీస్తు మరణాన్ని జయించి తిరిగి లేచాడు కాబట్టే ఈ రోజు మన విశ్వాసము విలువైనది. 

     ఢిల్లీ నగరములో కరోనా విలయ తాండవం చేస్తూ ఉంది. ప్రతిరోజూ వందల మంది మృతదేహాలను శ్మశాన వాటికలలో అగ్నికి ఆహుతి చేస్తున్నారు. ఢిల్లీకి తూర్పున ఘాజీపూర్ అనే శ్మశాన వాటిక ఉంది. ఎంతో మంది మృతదేహాలతో అది నిండి పోయివుంది.  డాక్టర్ దత్తరాజ్ పరాక్ అనే శాస్త్రవేత్త. 65 సంవత్సరాల వయస్సు.ఆయనకు కరోనా వచ్చింది. ఆక్సిజన్ లెవెల్ పడిపోయింది. ఆయన ప్రాణాలు నిలబెట్టాలంటే ICU లో వెంటిలేటర్ బెడ్ కావాలి. అది దొరక లేదు. ఆక్సిజన్ సిలిండర్ తో సరిపెట్టారు. అది సరిపోలేదు. తరువాత రోజు ఉదయం 7:30 కి ఆయన చనిపోయాడు. ఆయన కుమార్తెకు ఫోన్ చేశారు. ఆయన కుమార్తె మాళవిక పరాక్ క్లినికల్  సైకాలజిస్ట్. ఆమె తండ్రి మృత దేహాన్ని తీసుకొని గాజీపూర్ శ్మశాన వాటికకు వెళ్ళింది.అప్పటికే అది నిండిపోయింది. వరుసలు, వరుసలు గా మృత దేహాలను ఉంచి తగలబెడుతున్నారు. ‘పుట్టిన వాడు గిట్టక తప్పదు’ అని ఒక పూజారి ఆ మంటల మధ్య శ్లోకాలు చెబుతూ నడుస్తున్నాడు. మాళవిక పరాక్ ఒక మాట అంది. ఇలాంటి దృశ్యాలు నేను సినిమాల్లోనే చూశాను. ఎటు చూసినా మృత దేహాలే.

సినిమాల్లో కనీసం ఒక సూపర్ హీరో వస్తాడు.అందరినీ రక్షిస్తాడు.నిజజీవితములో ఇక్కడ ఒక సూపర్ హీరో లేడు’ 

   ఆమె అన్న మాటలు నేను మరచిపోలేదు.‘పుట్టిన వాడు గిట్టక తప్పదు’ ఆ సత్యాన్ని

అంగీకరించు అని శ్లోకాలు చెబుతున్నా, మనం మాత్రం ఒక సూపర్ హీరో కావాలి 

అని కోరుకొంటాము. ఈ రోజు భారత దేశము నలుమూలలా అందరి హృదయాల్లో జనిస్తున్న ఆశ ఆమె మాటల్లో మనకు వినిపిస్తున్నాడు. మనకు సూపర్ హీరో కావాలి.

మరణాన్ని జయించిన సూపర్ హీరో ఈ యేసు క్రీస్తు ఒక్కడే.

I am the resurrection and the life

నేను పునరుత్తానమును, జీవమును అని ఆయన అన్నాడు.

 ‘పుట్టిన వాడు గిట్టక తప్పదు’ అని ఎవరూ నిరాశ పడాల్సిన అవసరం లేదు.యేసు

క్రీస్తు నందు విశ్వాసముంచితే మరణం మీద కూడా మీరు విజయం సాధించినట్లే.

ఆరవ నేను ప్రకటన యోహాను 14:6 లోమనకు కనిపిస్తున్నది. అక్కడ యేసు ప్రభువు

ఏమంటున్నాడంటే, నేనే మార్గమును, సత్యమును,జీవమును; నా ద్వారానే తప్ప

యెవడును తండ్రియొద్దకు రాడు.

                         యోహాను 14:6

యేసు క్రీస్తు పరలోకానికి ఏకైక మార్గం ఆయనలో ఉన్న  సమస్తం సత్యం ఆయన ఇచ్చేది జీవం 

యేసు క్రీస్తు మార్గం కాబట్టి, ఆయన లేకపోతే మీరు తప్పిపోయినట్లే. 

యేసు క్రీస్తు సత్యం కాబట్టి, ఆయన లేకపోతే మీరు అబద్దములో బ్రతుకుతున్నట్లే. 

యేసు క్రీస్తు జీవం కాబట్టి, ఆయన లేకపోతే మీరు మరణములో ఉన్నట్లే. 

ఈ మార్గము పరలోకం వైపు మనలను నడిపిస్తున్నది. ఈ మార్గములో కష్టాలు, 

నష్టాలు, దుఃఖాలు, కన్నీరు సహజమే. అయితే ఈ మార్గం పరలోకానికి మనలను 

నడిపిస్తున్నది.మనయెడల ప్రత్యక్షము కాబోవు మహిమయెదుట ఇప్పటి కాలపు శ్రమలు 

ఎన్నతగినవి కావని యెంచు చున్నాను.రోమా 8:18.మన యెడల ప్రత్యక్షం కాబోయే మహిమ ఎదుట ఇప్పుడు మనం అనుభవిస్తున్న శ్రమలు ఎన్నతగినవి కావు. 

ఏడవ  నేను ప్రకటన యోహాను సువార్త 15:1 లో మనం చూస్తున్నాము. 

నేను నిజమైన ద్రాక్షావల్లిని,

నా తండ్రి వ్యవసాయకుడు

                       యోహాను 15:1

యేసు క్రీస్తు ఒక ఆలోచన కాదు 

ఆయన ఒక వ్యవస్థ కాదు 

ఆయన ఒక సిద్ధాంతము కాదు 

ఆయన ఒక వ్యక్తి  

ఆయన మనకు వ్యక్తిగత సంభందం ఇచ్చాడు. 

ఆయన మనకు ద్రాక్షా వల్లి. 

మనం ఆయనలో తీగలం. 

    ఒక చెట్టు యొక్క జీవం దాని కొమ్మలలోకి ప్రవహించినట్లు, ఆయనలోని జీవం మనలోకి ప్రవేశిస్తూ ఉంది. ఆ జీవం మనలో అనేక ఫలాలు ఫలింపజేస్తుంది. దేవుని ఆరాధనలో గడపడం, ప్రార్ధన లో గడపడం, దేవుని వాక్యంలో గడపడం, సువార్త చెప్పడం, ఇతరులకు సేవ చేయడం ఇవే మనం కాచే ఫలాలు. ఆయన మనకు 

 నిజమైన ద్రాక్షావల్లి. ఆయన ఆనందం, ప్రేమ, సంతోషం, సమాధానం, జీవం, 

సమృద్ధి మనలో ప్రవహిస్తున్నది. 

యేసు ప్రభువు చేసిన 7 నేను ప్రకటనలు ఈ రోజు మనం చూసాము 

1.నేను జీవాహారము 

2.నేను లోకమునకు వెలుగును 

3.నేను ద్వారమును 

4.నేను గొఱ్ఱెలకు మంచి కాపరి 

5.నేను పునరుత్థానము, జీవము 

6.నేను మార్గము, సత్యము, జీవము 

7.నేను నిజమైన ద్రాక్షావల్లి 

ఆ యేసు క్రీస్తు దగ్గరకు మీరు రావాలన్నదే నేటి మా ప్రేమ సందేశం 

Leave a Reply