డైనోసార్లు: డార్విన్ చేసిన మోసం: డాక్టర్ పాల్ కట్టుపల్లి సందేశం

scene of the giant dinosaur destroy the park.

Dinosaurs prove Creation or Evolution? ప్రేమ సందేశం వీక్షకులకు ప్రభువైన యేసు క్రీస్తు నామములో శుభాకాంక్షలు తెలియజేస్తున్నాము. మీరందరూ క్షేమముగా ఉన్నారని భావిస్తున్నాము. మా వెబ్ సైట్ www.doctorpaul.org ని దర్శించండి. మీకు అనేక బైబిల్ స్టడీ సమాచారం లభిస్తుంది. డార్విన్ చేసిన మోసం: డైనోసార్లు  శీర్షికలో ఈ రోజు డైనోసార్ ల గురించి కొంత సేపు ధ్యానం చేద్దాము. ఈ రోజు నేను ఫీల్డ్ మ్యూసియం దర్శిస్తున్నాను. ఇక్కడ ప్రపంచం నలుమూలల నుండి సేకరించిన డైనోసార్ ఫాసిల్స్ ఉన్నాయి. ఇక్కడ మెయిన్ హాల్ లో చూస్తే పెద్ద డైనోసార్ కళేబరం మనకు కనిపిస్తుంది. ముందుగా ఈ మ్యూసియం లో ఉన్న శిలాజాలు మనం చూద్దాము. ఈ డైనోసార్ ఎముకలు చూస్తేనే అది ఎంత పెద్దగా వుంది అని మనకు అనిపిస్తుంది. అసలు జీవముతో ఉన్న  డైనోసార్ ని చూస్తే మనకు ఎంత థ్రిల్లింగ్ గా ఉంటుందో మన ఊహకు అందదు. ఇంత పెద్ద, పెద్ద జీవులు ఈ భూమి మీద ఒక రోజుల్లో జీవించాయా అని మనం ఆశ్చర్యపోతాము. వీటి ఫాసిల్స్ చూసినప్పుడు మనకు అనేక ప్రశ్నలు వస్తాయి. డైనోసార్ లు ఎలా ఉండేవి? ఎక్కడ జీవించేవి? ఎలా ఉద్భవించాయి? ఏమి తినేవి? ఏమి త్రాగేవి? అవి ఈ భూమి మీద నుండి ఎలా కనుమరుగయ్యాయి? మొదలగు ఆసక్తి కరమైన ప్రశ్నలు మనకు కలుగుతూ ఉంటాయి. 

      డైనోసార్ లు కూడా ప్రపంచ చరిత్రలో భాగమే. ఈ ప్రపంచ చరిత్ర అందరి కన్నా ఎక్కువ తెలిసింది దేవునికే. దేవుడు చెప్పిన చరిత్ర బైబిల్ గ్రంథము లో ఉంది. ప్రపంచ చరిత్ర అర్థం చేసుకోవాలంటే ముందుగా మనం బైబిల్ చదవాలి. డైనోసార్ ల గురించి తెలుసుకోవాలంటే మనం బైబిల్ చదవాలి. ఆదికాండము మొదటి అధ్యాయం చూస్తే 

25 వచనము చూడండి 

దేవుడు ఆ యా జాతుల ప్రకారము అడవి జంతువులను, ఆ యా జాతుల ప్రకారము పశువులను, ఆ యా జాతుల ప్రకారము నేలను ప్రాకు ప్రతి పురుగును చేసెను. అది మంచిదని దేవుడు చూచెను. దేవుడు తన స్వరూపమందు నరుని సృజించెను; దేవుని స్వరూపమందు వాని సృజించెను; స్త్రీనిగాను పురుషునిగాను వారిని సృజించెను.

                  ఆదికాండము 1:27

     6 రోజుల్లో దేవుడు ఈ విశ్వాన్ని, అందులో ఉన్న సమస్తాన్ని సృష్టించాడు. 6 దినమున జంతువులను, పశువులను, పురుగులను సృష్టించాడు. అదే రోజు మనిషిని సృష్టించాడు. అంటే జంతువులను, మనిషిని ఒకే రోజు సృష్టించాడు. డైనోసార్ లను, మనిషిని ఒకే రోజు సృష్టించాడు. అంటే ఆదాము, హవ్వలు ఏదెను వనములో జీవిస్తున్న రోజుల్లో వారికి ఈ డైనోసార్లు కనిపించే ఉంటాయి. ఆ డైనోసార్ల ను చూసి ఆదాము ఎంతో ఆశ్చర్య పోయి ఉంటాడు. వాటి ఎముకలను, అస్థిపంజరములను మ్యూసియం లలో చూసి మనం ఆశ్చర్యపోతున్నాము. ఆదాము, హవ్వ అతని సంతానము ఈ డైనోసార్లను చూసి ఎంత గా ఆశ్చర్యానికి గురయ్యారో మనం కొంతవరకు ఊహించవచ్చు. ఈ డైనోసార్లు ఏమి తిని బ్రతికాయి? 29 వచనం చూద్దాము 

దేవుడు ఇదిగో భూమిమీదనున్న విత్తనములిచ్చు ప్రతి చెట్టును విత్తనము లిచ్చు వృక్షఫలముగల ప్రతి వృక్ష మును మీ కిచ్చి యున్నాను; అవి మీ కాహారమగును.భూమి మీదనుండు జంతువులన్నిటికిని ఆకాశ పక్షులన్నిటికిని భూమిమీద ప్రాకు సమస్త జీవులకును పచ్చని చెట్లన్నియు ఆహారమగునని పలికెను. ఆ ప్రకారమాయెను.

                 ఆదికాండము 1:29,30

దేవుడు ఆదాముతో ఏమన్నాడు? కూరగాయలు తినండి, ఫలములు తినండి, ఆకు కూరలు తినండి. అంటే దేవుడు మనిషిని శాఖాహారిగా సృష్టించాడు. ఈ లోకములో పాపం ప్రవేశించిన తరువాతే మాంసాహారం తినడం మొదలయ్యింది. అంతకు ముందు అందరూ శాఖాహారులే. పాపం ప్రవేశించిన తరువాతే మరణం ప్రవేశించింది. అప్పటి నుండే మనుష్యులు, జంతువులు మరణించడం మొదలయ్యింది. పాపం ప్రవేశించక ముందు మనము చెట్ల మీద ఆధారపడ్డాము. డైనోసార్లు కూడా చెట్లను తింటూనే బ్రతికాయి. డైనోసార్లలో అనేక రకాలు చెట్లు తింటూనే బ్రతికాయి అనడానికి మనకు శాస్త్రీయ ఆధారాలు ఉన్నాయి. అయితే ఈ ప్రపంచములో పాపం ప్రవేశించిన తరువాత మనం మాంసాహారులము గా మారాము. జంతువులు కూడా అప్పటినుండే  మాంసాహారము తీసుకొంటున్నాయి. డైనోసార్లు కూడా అప్పటి నుండే ఇతర జంతువులను వేటాడి తినడం మొదలు పెట్టాయి. కాల క్రమేణా ఈ ప్రపంచములో అనేక మార్పులు జరిగాయి. భూమి తన ఉత్పత్తి సామర్థ్యం కోల్పోయింది. కరువులు, భూకంపాలు, తుఫానులు, వాతావరణములో మార్పులు ఈ డైనోసార్లు అంతరించిపోవటానికి కారణం అయ్యాయి. 

    డార్విన్ పరిణామ వాదులు బైబిల్ చరిత్రను వ్యతిరేకించారు. వారు ఏమంటారంటే, మనిషి ఈ ప్రపంచములో సృష్టించబడకముందే డైనోసార్లు అంతరించిపోయాయి. దాదాపు 140 మిలియన్ సంవత్సరాలు అవి జీవించాయి, 65 మిలియన్ సంవత్సరాలకు ముందు ఒక ఉల్క భూమిని ఢీకొట్టింది. అప్పుడు ఈ డైనోసార్లు మాయమయ్యాయి అని డార్విన్ వాదులు చెబుతున్నారు. అందులో ఎలాంటి సత్యము లేదు. కరోనా వైరస్ ఎలా మొదలయ్యింది? జంతువులలో నుండి మనిషికి వచ్చిందా? లేక సైంటిస్టులు దీనిని ఉద్దేశపూర్వకముగా సృష్టించారా? ఆ ప్రశ్నకు స్పష్టమైన సమాధానము మనకు దొరకడం లేదు. ఈ రోజు పుట్టిన కరోనా ఎలా మొదలయ్యిందో చెప్పలేని ఈ డార్విన్ వాదులు 6 కోట్ల సంవత్సరాల క్రితం ఏమి జరిగిందో ఎలా చెప్పగలరు? ఎంత పెద్ద మేధావి అయినా, ఎంత గొప్ప సైంటిస్ట్ అయినా వారికి తెలిసింది కొంత మాత్రమే. సమస్తము తెలిసిన వాడు దేవుడు ఒక్కడు మాత్రమే. దేవుడు చెప్పిన చరిత్ర బైబిల్ లో ఉంది. బైబిల్ వెలుగులో మనం ఈ ప్రపంచాన్ని చూడాలి కానీ ఈ ప్రపంచం వెలుగులో బైబిల్ ని చూడకూడదు. 

      డైనోసార్లు కానీ, పక్షులు కానీ, పర్వతాలు కానీ, సముద్రాలు కానీ ఇంకేదయినప్పటికీ ప్రతిదానినీ మనం బైబిల్ వెలుగులో చూడాల్సిందే. బైబిల్ వెలుగులో చూస్తే మనకు అర్థం అయ్యేదేమిటంటే డైనోసార్లు, మానవుడు కొంతకాలం పాటు ఈ భూమి మీద కలిసే జీవించారు. ప్రపంచ వ్యాప్తముగా అనేక దేశాల్లో డైనోసార్ల వంటి జంతువుల గురించి అనేక కథలు ఉన్నాయి. అనేక ప్రాచీన జాతుల వారు నివసించిన గుహల్లో వారు డైనోసార్లు వంటి చిత్రాలు గోడల మీద గీచారు. వారు చెప్పుకొన్న పురాణాల్లో డైనోసార్ల వంటి జంతువుల కథలు ఉన్నాయి. 

ఫాసిల్స్ 

    డైనోసార్ ఫాసిల్స్ కూడా బైబిల్ నే దృఢ పరుస్తున్నాయి. ఫాసిల్స్ అంటే ఏమిటి? తెలుగు లో చెప్పుకొంటే శిలాజాలు. Fossils = శిలాజాలు. చనిపోయిన జంతువు కొన్ని ప్రత్యేక పరిస్థితుల్లో భద్రపరచబడుతుంది. దాని ఎముకలు, అస్థిపంజరం, దంతాలు, కొన్ని సార్లు ఇతర అవయవాలు కూడా భద్రపరచబడతాయి. చనిపోయిన ప్రతి జంతువూ శిలాజం కాలేదు. దానికి ప్రత్యేక పరిస్థితులు కావాలి. జల ప్రళయం జరిగినప్పుడు ఆ పరిస్థితులు ఉన్నాయి. ఇప్పుడు మనం చూస్తున్న శిలాజాలు అధిక శాతం నోవహు జలప్రళయం జరిగినప్పుడు ఏర్పడినవే. 

పాంజియా

దేవుడు ఆదాము, హవ్వలను సృష్టించాడు. వారిలో నుండి అనేక రకాల మనుష్యులు ఉద్భవించారు. మనందరికీ 46 క్రోమోసోములు ఉన్నాయి. అయితే వాటిలో నుండి అనేక జాతుల వారు పుట్టారు. యూరప్ లో కనిపించే మనుష్యులకు, చైనా లో కనిపించే మనుష్యులకు, ఆఫ్రికా లో కనిపించే మనుష్యులకు, ఇండియా లో కనిపించే మనుష్యులకు కంటికి కొన్ని బేధాలు కనిపిస్తాయి. వారి శరీర నిర్మాణం, ఎత్తు, బరువు, అవయవాలు పనిచేసే విధానం మార్పులు ఉంటాయి.  జల ప్రళయం తరువాత భూమి నలుదిశలకు మనుష్యులు వెళ్లారు. డార్విన్ పరిణామ వాదులు ఏమని చెబుతారంటే, వందల కోట్ల సంవత్సరాల క్రితం భూమి మొత్తం ఒకే ఖండముగా ఉంది. అప్పుడు మన ఇండియా ప్రక్కనే ఆస్ట్రేలియా ఉంది. ఇండియా క్రింద అంటార్కిటికా ఉంది. మరోప్రక్క ఆఫ్రికా ఉంది. ఆఫ్రికా కి ఆనుకొని సౌత్ అమెరికా ఉంది. కాల క్రమేణా ఈ ఖండాలు దూరముగా జరిగిపోయాయి అని వారు అంటారు. ఖండాలు విడిపోయిన మాట వాస్తవమే. అయితే అది జరిగింది కోట్లాది సంవత్సరాల క్రితం కాదు. అది జరిగింది జల ప్రళయం సమయములో. 

    నోవహు జలప్రళయం జరిగినప్పుడు కేవలం భూమి మీద వర్షం కురిసి వెళ్లిపోలేదు. భూమి అనేక సమూల మార్పులకు గురయ్యింది. మన చుట్టూ ఉన్న వాతావరణం సమూల మార్పులకు గురయ్యింది. ఖండాలు విడిపోయినాయి. క్రొత్త సముద్రాలు పుట్టాయి. పర్వతాలు పుట్టాయి. అనేక జంతువులను నోవహు తన ఓడలో భద్ర పరచాడు. కొన్ని రకాల డైనోసార్ల ను కూడా నోవహు తన ఓడలో తీసుకొని వెళ్లి ఉంటాడని మనం అనుకోవచ్చు. జల ప్రళయం తరువాత ఈ డైనోసార్లు అనేక ప్రాంతాలకు వెళ్ళినవి. అనేక మార్పులకు గురయ్యాయి. భూమి మీద కురిసిన మంచు తుఫానులు, కరువులు, భూకంపములలో ఇవి అంతరించి ఉంటాయి. ఆ విధముగా ఖండములుగా విడిపోవటం, డైనోసార్లు రెండిటి గురించి మనం మాట్లాడుకోవాలి. డార్విన్ పరిణామ వాదులు కూడా జురాసిక్ యుగములోనే ఈ ఖండాలు విడిపోయినాయి అని అంటున్నారు. 

    జురాసిక్ యుగము డైనోసార్లకు స్వర్ణ యుగం లాంటిది. అప్పుడే ఖండాలు విడిపోయినాయి. ఉత్తర అమెరికా లో శిలాజాలు, దక్షిణ అమెరికా లో శిలాజాలు మొదట్లో ఒకే రకముగా ఉన్నాయి. అయితే ఆ రెండు ఖండాలు విడిపోయిన తరువాత, వాటి మధ్య భూ మార్గాలు తెగిపోయిన తరువాత ఈ డైనోసార్లు అనేక మార్పులకు గురయ్యాయి. అందుకనే ఖండాలు విడిపోయిన తరువాత ఉత్తర అమెరికా, దక్షిణ అమెరికా ఖండాల్లో దొరికిన శిలాజాల్లో మనం అనేక మార్పులను చూస్తున్నాము. 

పక్షులు – డైనోసార్లు 

ఈ డైనోసార్ల శిలాజాలు 100 శాతం డైనోసార్లే. పరిణామ వాదులు ఈ డైనోసార్లు పరిణామము చెందాయి అంటారు. అవి అంతరించిపోలేదు. పక్షులుగా మారినవి. అని చెబుతారు. పక్షులను చూడు, అవే డైనోసార్లు అని వారు చెబుతున్నారు. చికెన్ బిర్యాని తింటూ మేము డైనోసార్లను తింటున్నాము అనుకునే వారు కూడా ఉన్నారు. అయితే అది అవివేకం. చికెన్ కి, డైనోసార్ల కు ఎలాంటి సంబంధం లేదు. పక్షులకు, డైనోసార్లకు ఎలాంటి సంబంధం లేదు. అయితే పక్షులకు, డైనోసార్లకు ఎలాంటి సంబంధము లేదు. డార్విన్ పరిణామ వాదుల ప్రకారం డైనోసార్లు ముందు ఆ తరువాత కోట్లాది సంవత్సరాల తరువాత పక్షులు పుట్టాయి. కానీ బైబిల్ చెప్పేది అది కాదు. దేవుడు ఐదో రోజున పక్షులను సృష్టించాడు. ఆరో రోజున జంతువులను సృష్టించాడు. అంటే పక్షులు ముందు వచ్చినవి, జంతువులు, డైనోసార్లు తరువాత వచ్చినవి. ఒక రోజు ముందు వాటిని సృష్టించాడు. అంటే పెద్ద తేడా లేదు. భూమి పొరల్లో మనం చూస్తే మనకు దానికి ఆధారాలు కనిపిస్తాయి. డార్విన్ సిద్ధాంతము ప్రకారం లోతైన పొరల్లో డైనోసార్ల ఫాసిల్స్ దొరకాలి. ఆ తరువాత పై పొరల్లో పక్షుల ఫాసిల్స్ దొరకాలి. కానీ మనం చూస్తున్నది అది కాదు. పక్షుల ఫాసిల్స్, డైనోసార్ల ఫాసిల్స్ కంటే క్రింద కనిపిస్తున్నాయి. ఆర్కియాప్ట్ రిక్స్ అనే శిలాజం ఉంది. అది ఒక పక్షి. దాని వయస్సు డైనోసార్ ఫాసిల్ కంటే ఎక్కువ. దానిని బట్టి పక్షులు డైనోసార్ల కంటే ముందుగా సృష్టించబడ్డాయి అని మనకు అర్ధం అవుతుంది. 

     ఇక్కడే మనం ఇంకో విషయం చెప్పుకోవాలి. ఈ డైనోసార్ ఫాసిల్స్ లో వాటి ఎముకల్లో రక్త నాళాలు, కణ జాళాలు దొరికాయి. సాఫ్ట్ టిష్యూ ఇంకా ఆ ఫాసిల్స్ లో ఉంది. అంటే మహా అయితే కొన్ని వేల సంవత్సరాల క్రితమే ఇవి అంతం అయి ఉంటాయి. కోట్లాది సంవత్సరాల క్రితం డైనోసార్లు అంతం అయిపోయి ఉంటే ఈ రోజున వాటి ఎముకల్లో మనకు రక్త నాళాలు కనిపించవు. ఎప్పుడో పాడైపోయి అంతరించి ఉండేవి. దీనిని బట్టి మనకు అర్థం అయ్యేది ఏమిటంటే, బైబిల్ చెబుతున్నట్లు డైనోసార్లు అంతరించి కొన్ని వేల సంవత్సరాలు మాత్రమే అయ్యింది. 

    కొన్ని డైనోసార్లు చర్మం కూడా దొరికింది. చర్మము దొరికింది అంటే అవి ఈ మధ్యనే అంతరించి ఉండాలి. చర్మం కోట్లాది సంవత్సరాలు ఉండదు. వాటి చర్మం ఎప్పుడో మాయమై పోవాల్సి ఉంది కానీ ఇప్పటి వరకు ఉంది అంటే డైనోసార్లు అంతరించి ఎంతో కాలం కాలేదు అని మనకు అర్ధం అవుతుంది. ఇంకో విషయం ఏమిటంటే ఈ డైనోసార్ చర్మం మీద మనకు స్కేల్స్ కనిపిస్తున్నాయి. ఇవి బల్లులు, చేపలలో మనకు కనిపిస్తాయి. చేప శరీరాన్ని మనం చూస్తే దాని మీద మనకు చిన్న, చిన్న స్కేల్స్ కనిపిస్తాయి. అంటే డైనోసార్ బల్లి జాతికి చెందింది అని మనకు అర్ధం అవుతుంది. డైనోసార్ శిలాజాల మీద మనకు ఈకలు కనిపించడం లేదు. డైనోసార్లు పక్షులుగా మారితే మనకు కొన్ని ట్రాన్సిషనల్ ఫాసిల్స్ (మధ్యస్థ జీవుల శిలాజాలు) దొరకాలి. అంటే ఏమిటంటే, కొన్ని డైనోసార్ లక్షణాలు, కొన్ని పక్షి లక్షణాలు కలబోసిన శిలాజాలు మనకు కనిపించాలి. అయితే అలాంటి ఫాసిల్స్ మనకు కనిపించలేదు. 

     డైనోసార్ ఫాసిల్స్ 100 శాతం డైనోసార్ ఫాసిల్స్ యే. సగం డైనోసార్, సగం పక్షి ఫాసిల్స్ మనకు దొరకలేదు. డార్విన్ పరిణామ వాదులు ఈకలు గల డైనోసార్ల గురించి మాట్లాడుతూ ఉంటారు. డైనోసార్లు పక్షులుగా మారి ఉంటాయి అనే ఆలోచన థామస్ హక్స్ లే అనే పరిణామ వాది ముందుగా ప్రతిపాదించాడు. యాంకీయార్నిస్  అనే శిలాజానికి హక్స్ లే పేరు పెట్టారు. ఇది ఒక ఈకలు కలిగిన డైనోసార్ అని వారు చెప్పుకొంటున్నారు. డైనోసార్లు పక్షులుగా మారాయి అనే వాదానికి వారు కట్టుబడి ఉన్నారు కాబట్టి దానికి ఆధారాలు చూపించాలి అని వారు తపన పడుతున్నారు. ఈకలతో నిండిన డైనోసార్లు మనకు అనేకం ఈ మ్యూసియం లలో కనిపిస్తాయి. అయితే అవి ఆర్టిస్టులు ఊహించి గీచినవే కానీ శిలాజాల్లో దొరికినవి కావు. 

     1999 లో నేషనల్ జియోగ్రాఫిక్ పత్రిక ఒక ఫాసిల్ గురించి ప్రచురించింది. దాని పేరు ఆర్కియో రాప్ టర్. పక్షులకు, డైనోసార్లకు మధ్యస్థ జీవిగా దానిని చెప్పుకొన్నారు. అయితే తరువాత తేలింది ఏమిటంటే, యయోర్నిస్ అనే పక్షి, మైక్రో  రాప్ టర్ అనే పక్షి రెండిటి శిలాజాలు కలిపి దీనిని తయారు చేసి చూపించారు. ఈ ఈకలు చూడండి. ఇది ఈకలు గల డైనోసార్, కొంత కాలం తరువాత ఇదే పక్షిగా మారుతుంది అని కట్టుకథలు చెప్పారు’ వారు చేసిన మోసం తరువాత బయటపడింది. నేషనల్ జియోగ్రాఫిక్ పత్రిక క్షమాపణలు చెప్పుకోవలసి వచ్చింది. మైక్రో  రాప్ టర్ ఒక ఈకలు గల పక్షి. అది ఈకలు గల డైనోసార్ కాదు. ఈకలతో ఉన్న శిలాజాలు పక్షులు, డైనోసార్లు కాదు. 

యోబు గ్రంథము లో డైనోసార్లు 

     డైనోసార్లను తమ ప్రకృతి వాదాన్ని బలపరచ టానికి డార్విన్ వాదులు వాడుకొంటున్నారు. అయితే మనం వాటిని దేవుని సృష్టిగా చూడాలి. దేవుని యొక్క గొప్ప జ్ఞానం, గొప్ప మహిమ డైనోసార్ల లో మనకు కనిపిస్తుంది. యోబు గ్రంథములో 

దేవుడు యోబుతో మాట్లాడుతూ డైనోసార్ల గురించి ప్రస్తావించాడు. యోబు గ్రంథం 40 అధ్యాయము లో మనం చదువుతాము. 

15. నేను చేసిన నీటిగుఱ్ఱమును నీవు చూచియున్నావు గదా ఎద్దువలె అది గడ్డి మేయును.

16. దాని శక్తి దాని నడుములో ఉన్నది దాని బలము దాని కడుపు నరములలో ఉన్నది.

17. దేవదారుచెట్టు కొమ్మ వంగునట్లు అది తన తోకను వంచును. దాని తొడల నరములు దిట్టముగా సంధింపబడి యున్నవి.

18. దాని యెముకలు ఇత్తడి గొట్టములవలె ఉన్నవి దాని ప్రక్క టెముకలు ఇనుపకమ్ములవలె ఉన్నవి

19. అది దేవుడు సృష్టించినవాటిలో గొప్పది దాని సృజించినవాడే దాని ఖడ్గమును దానికిచ్చెను.

                              యోబు గ్రంథం 40

దేవుడు సృష్టించినవాటిలో అది గొప్ప జంతువు అని అక్కడ వ్రాయబడింది. దేవుని మహిమ ఈ డైనోసార్లలో మనకు కనిపిస్తుంది. ఇంగ్లాండ్ దేశములో రిచర్డ్ ఓవెన్ అనే గొప్ప సైంటిస్ట్ ఉండేవాడు. ఆయనే ఈ జంతువులకు డైనోసార్ అనే పేరు పెట్టాడు. అంటే అంటే ‘భయంకరమైన బల్లి’ అని అర్ధం. ఈ బల్లులు కొమొడో డ్రాగన్ ల వలె ఈ ప్రపంచాన్ని ఒక రోజుల్లో గడగడలాడించాయి అని ఆయన భావించాడు. లండన్ నగరములో నాటురల్ హిస్టరీ మ్యూసియం ను ఆయన స్థాపించాడు. అందులోకి వెళ్లి జంతువులు, మొక్కలు చూసి ప్రకృతిలో దేవుని హస్తాన్ని అందరూ చూడాలి అని ఆయన ఆకాంక్షించాడు. అయితే డార్విన్ పరిణామ వాదులు ఆయన కోరికను త్రుంచివేశారు. దేవుని కి, డైనోసార్ల కు ఎలాంటి సంబంధం లేదు అనే పెద్ద అబద్దాన్ని వారు సృష్టించారు. 

     ఈ మ్యూసియం లో నాకు జేన్ గుడాల్ చిత్రం కనిపించింది. ఆమె ఆఫ్రికా దేశములో చింపాంజీల మధ్య తన జీవితాన్ని గడిపింది. ‘నేను ప్రకృతిని ప్రేమిస్తాను. పక్షులతో మాట్లాడుతాను, చెట్లతో కబుర్లు చెబుతాను, జంతువులను ప్రేమిస్తాను, నాకు ఆధ్యాత్మిక చింతన ఉంది. స్పిరిట్యుయల్ గా ఉంటాను’ అని ఆమె అంటూ ఉంటుంది. అవి మంచి లక్షణాలే కానీ అవి మనలను పరలోకం తీసుకొని వెళ్ళలేవు. ఈ గొప్ప జంతువులను సృష్టించిన యేసు క్రీస్తు దగ్గరకు మీరు రావాలి. ఆయనను మీ రక్షకునిగా ప్రభువుగా అంగీకరించాలి. ఆయన సిలువ దగ్గర మీ పాపములు ఒప్పుకోవాలి. ఆయనను అనుసరిస్తూ నడవాలి. జల ప్రళయం వచ్చినప్పుడు కేవలం ఒక్క కుటుంబం మాత్రమే తప్పించుకొంది. 

    నోవహు, అతని కుటుంబం ఒక ఓడలో ప్రవేశించి దేవుని ఉగ్రతను తప్పించుకొన్నారు. ఈ రోజు దేవుని ఉగ్రతను తప్పించుకోవాలంటే క్రీస్తు అనే ఓడలో మీరు ప్రవేశించాలి. మన పాపములను బట్టి మన మీద కు రావలసిన శిక్షను ఆయనను భరించాడు. ఆయనలో ఉన్న వారి మీద ఇక శిక్ష లేదు. ఈ డైనోసార్ లను చూసి మీరు దేవుని మహిమను, దేవుని గొప్ప తనాన్ని తెలుసుకోవాలి, ప్రభువైన యేసు క్రీస్తు ను మీ రక్షకునిగా, ప్రభువుగా స్వీకరించాలి అన్నదే నేటి మా ప్రేమ సందేశం. 

Leave a Reply