ఓబద్యా ప్రవక్త చెప్పిన తీర్పు : డాక్టర్ పాల్ కట్టుపల్లి సందేశం

మీ అందరికి ప్రభువైన యేసు క్రీస్తు మహిమ కలిగిన పేరు మీద శుభాకాంక్షలు తెలియజేస్తున్నాము. దేవుని కృప యందు మీరు క్షేమముగా ఉన్నారని తలంచుచున్నాము. మా వెబ్ సైట్ www.doctorpaul.org ని దర్శించండి. బైబిల్ స్టడీ చేయండి. బైబిల్ పుస్తకాల పరిచయం అనే అంశములో బైబిల్ లో ఉన్న 66 పుస్తకాలను మనం ధ్యానం చేస్తున్నాము. ఈ రోజు ఓబద్యా గ్రంథం మనం చూద్దాము. ఇప్పటి వరకు స్టడీ చేసిన పుస్తకాలు మీరు మిస్ అయి ఉంటే, మా వెబ్ సైట్ కి వెళ్లి బైబిల్ పుస్తకాలు పరిచయం అనే పేజీ కి వెళ్లి ఆ పుస్తకాలు మీరు స్టడీ చేయవచ్చు. ప్రేమ సందేశం కార్యక్రమం మీరు యూట్యూబ్ లో కూడా చూడవచ్చు. మా ఛానల్ నోట్ చేసుకొని మా ఛానల్ కి సబ్స్క్రయిబ్ చేయండి. మా ప్రతి సందేశం మీరు యూట్యూబ్ లో మీ సమయాన్ని బట్టి చూడవచ్చు, వినవచ్చు. మా కార్యక్రమం మీ జీవితానికి ఆశీర్వాద కరముగా ఉంటే, ఒక ప్రోగ్రాం ని స్పాన్సర్ చేయండి. ఇప్పటి వరకు స్పాన్సర్ చేసిన వారికి 

మా ధన్యవాదాలు. దేవుడు మిమ్మును దీవించాలని మా ప్రార్థన. ఈ రోజు ఓబద్యా గ్రంథము నుండి కొన్ని సత్యాలు మనం చూద్దాము. 

మీ బైబిల్  లో ఓబద్యా గ్రంథము నుండి కొన్ని మాటలు చూద్దాము. 

1. ఓబద్యాకు కలిగిన దర్శనము. ఎదోమును గురించి ప్రభువగు యెహోవా సెలవిచ్చునది. యెహోవా యొద్ద నుండి వచ్చిన సమాచారము మాకు వినబడెను. ఎదోము మీద యుద్ధము చేయుదము లెండని జనులను రేపుటకై దూత పంపబడియున్నాడు. 2. నేను అన్యజనులలో నిన్ను అల్పునిగా చేసితిని, నీవు బహుగా తృణీకరింపబడుదువు.3. అత్యున్నతమైన పర్వతములమీద ఆసీనుడవై యుండి కొండ సందులలో నివసించువాడానన్ను క్రిందికి పడ ద్రోయగలవాడెవడని అనుకొనువాడా, నీ హృదయపు గర్వముచేత నీవు మోసపోతివి.

                     ఓబద్యా గ్రంథము 

ఈ ఓబద్యా గ్రంథం పాత నిబంధన  గ్రంథములో అతి చిన్న పుస్తకముగా ఉంది. రచయిత: ఓబద్యా ప్రవక్త ఈ గ్రంథం వ్రాశాడు. ఆయన గురించిన వివరములు ఈ గ్రంథములో మనకు కనిపించవు. ఆయన ఎక్కడ పుట్టాడు, ఎక్కడ జీవించాడు, ఎప్పుడు జీవించాడు అనే వివరాలు మనకు ఇవ్వబడలేదు. ఈ పుస్తకాన్ని ఆయన ఎదోము జాతి వారికి వ్రాశాడు. పరిశోధకులు ఈయన యెహోరాము రాజు పాలనలో క్రీ.పూ 850 – 840 ల మధ్య యూదా ప్రాంతములో జీవించి ఉంటాడని భావిస్తున్నారు. నేను తయారు చేసిన చార్ట్ చూడండి. ఓబద్యా అందరి కంటే ముందు మనకు కనిపిస్తున్నాడు. ఈ చార్ట్ కావలసిన వారు మా వెబ్ సైట్ www.doctorpaul.org బైబిల్ చార్టులు అనే పేజీ చూడండి. ఈ ప్రవక్త ఎదోము వారితో మాట్లాడుతున్నాడు. 

అన్నదమ్ముల వైరము: 

    ఈ ఎదోమీయులు ఏశావు సంతానము. ఈ ఏశావు ఎవరంటే ఈయన యాకోబుకు అన్న. అబ్రహాము కుమారుడు ఇస్సాకు. ఇస్సాకుకు ఇద్దరు కుమారులు: యాకోబు, ఏశావు. ఇశ్రాయేలీయులు యాకోబు లో నుండి వచ్చారు. ఎదోమీయులు ఏశావు లో నుండి వచ్చారు. వీరు ఇశ్రాయేలు దేశానికి దక్షిణాన, మృత సముద్రం క్రింద, చక్కటి పర్వతాల మధ్య తమ నివాసం ఏర్పరచుకున్నారు. పెట్రా నగరం ఈ ప్రాంతములోనే ఉంది. -ఇశ్రాయేలీయులు యాకోబు లో నుండి వచ్చారు, ఎదోమీయులు ఏశావు లో నుండి వచ్చారు. అన్నదమ్ముల పిల్లలే. అయితే వారి మధ్య ఎంతో శత్రుత్వము నెలకొని వుంది. 

ద్వేషం: 

  సంఖ్యా కాండము 20:14-22 లో చూస్తే వారు ఎదోమీయులకు ఒక మనవి చేశారు. మమ్ములను మీ దేశములో గుండా వెళ్లనివ్వండి. మేము రోడ్డు మీద నడుస్తాము. ఏదీ అంటుకోము అన్నారు. కానీ ఎదోమీయులు వారి మాట వినలేదు. మా దేశం వైపు రావద్దు. ఇటు చూశారో చంపేస్తాము. అని పెద్ద సైన్యముతో ఇశ్రాయేలీయులను బెదిరించారు. ఇశ్రాయేలీయులు గత్యంతరం లేక వేరే మార్గములో కనాను దేశం వైపు వెళ్ళవలసి వచ్చింది. 

   అంత చేసినా, దేవుడు ఇశ్రాయేలీయులతో ఒక మాట అన్నాడు. ఎదోమీయులు నీ సహోదరులు గనుక వారిని ద్వేషింపకూడదు.(ద్వితీయోప 23:7). ఇశ్రాయేలీయులు దేవుని మాటను బట్టి ఎదోమీయులను ద్వేషించలేదు. అయితే, ఎదోమీయులు ఇశ్రాయేలీయులను ద్వేషించారు.యాకోబు, ఏశావుల మధ్య ఉన్న ద్వేషం వీరు కూడా కొనసాగించారు. యాకోబు, ఏశావులు తల్లి గర్భములోనే కొట్లాడు కున్నట్లు ఆదికాండము 25:19-26 లో మనం చదువుతాము. ఆ తరువాత ఒక రోజు ఏశావు ఒక మంచి విందు కోసం తన జ్యేష్ఠత్వాన్ని యాకోబు కు అమ్మివేశాడు. ఆ తరువాత యాకోబు ఏశావుకు చెందాల్సిన ఆశీర్వాదాలు కూడా మోసకరమైన రీతిలో తన తండ్రి అయిన ఇస్సాకు నుండి పొందాడు. అది చూసి ఏశావుకు యాకోబు మీద మరింత ద్వేషం పెరిగింది. 

    వారిద్దరి మధ్య నెలకొన్న పగ వేలాది సంవత్సరాల పాటు వారి పిల్లల మధ్య కూడా కొనసాగింది. ఇశ్రాయేలీయులు ఐగుప్తు దేశములో బానిసలుగా మారారు. ఆ సమయములో ఎదోమీయులు మృత సముద్రం క్రింద ప్రాంతములో స్థిరపడ్డారు. ఇశ్రాయేలీయులు ఐగుప్తు దేశం నుండి విడిపింపబడి వాగ్దాన దేశం వైపుకు వెళ్తున్నప్పుడు ఎదోము ప్రాంతము మీదుగా వెళ్లాల్సి వచ్చింది. 

  ఇశ్రాయేలీయులు వారి దేశములో స్థిరపడిన తరువాత కూడా వారిని ప్రశాంతముగా బ్రతకనివ్వలేదు. సౌలు రాజుతో, దావీదు రాజుతో, సొలొమోను రాజుతో, యెహోరాము, ఆహాజు రాజులతో యుద్ధాలు చేశారు. మాకు చెందాల్సిన ఆశీర్వాదాలు మీరు దొంగిలించారు. మేము ఉండాల్సిన దేశములో మీరు ఉన్నారు అని పగతో రగిలిపోయారు కానీ దేవుని చిత్తము అలా ఉంది, గొడవలు ఎందుకులే అని అనుకోలేదు. వారి ప్రవర్తన దేవునికి నచ్చలేదు. అందుకనే దేవుడు ఈ పుస్తకములో ఎదోమీయులను గద్దిస్తున్నాడు. వారి పాపములు వారికి చూపిస్తున్నాడు. వారి మీదకు రాబోయే శిక్షలను వారికి చెబుతున్నాడు. 

ఎదోమీయుల 4 పాపాలు: 

  1. గర్వం మొదటిగా గర్వం. 3 వచనంలో దేవుడు వారితో ఒక మాట అంటున్నాడు. 

3. అత్యున్నతమైన పర్వతములమీద ఆసీనుడవైయుండి కొండ సందులలో నివసించువాడా నన్ను క్రిందికి పడ ద్రోయగలవాడెవడని అనుకొనువాడా, నీ హృదయపు గర్వముచేత నీవు మోసపోతివి.అత్యున్నతమైన పర్వతముల మధ్య నేను నివసిస్తున్నాను. నా జోలికి వచ్చేది ఎవరు? నన్ను అంటుకొనేది ఎవరు? అని నీవు గర్వముతో అతిశయిస్తున్నావు. నీ హృదయపు గర్వముచేత నీవు మోసపోతివి. గర్వము అనేక మందికి గ్రుడ్డితనం కలుగజేస్తుంది.

ఒక నాస్తికుడు ఈ మధ్యలో నాతో  ఒక మాట అన్నాడు. ‘బైబిల్ లో దేవుడు ఆ విధముగా మాట్లాడడం నాకు నచ్చలేదు, ఆయన ఆ ప్రజలను ఆ విధముగా తీర్పు తీర్చడం నాకు నచ్చలేదు. నేను దేవుని కన్నా మంచివాణ్ణి’ నేను అతనితో ఒక మాట అన్నాను. ‘నీవు దేవునికే తీర్పు తీర్చేవాడివి అయ్యావా? దేవునికన్నా నీవు మంచివానివా? దేవుడు ఎవరి పట్ల ఎలా ప్రవర్తించాలో చెప్పగలిగే జ్ఞానము, అనుభవము నీకున్నాయా?’ మన ఆధునిక ప్రపంచములో చాలా మంది హృదయాలు అంధకారముతో నిండి పోయినవి. ‘నేను దేవుని కన్నా మంచి వాణ్ని’ అని వారు అనుకొంటున్నారు. 

   మనిషి తనను దేవునితో పోల్చుకోవడం. 1960 ప్రాంతములో రష్యా దేశములో నాస్తికులు స్టాలిన్, లెనిన్ విగ్రహాలను దేవతల రూపములో చెక్కించి పెట్టుకొనేవారు. చైనా దేశములో 2.2 బిలియన్ కోట్లాది మావ్ చిత్రాలు చేయించుకొని ప్రజలకు పంచిపెట్టారు. సూర్యుడు మావ్ మీద నుండి ప్రజల మీద ఉదయిస్తున్నట్లు ఈ చిత్రాలలో చూపించారు. మీకు దేవుడు అక్కరలేదు, మేమే మీకు దేవుళ్ళము అనే సందేశం ప్రజలకు పంపించారు. నేను దేవుని కన్నా మంచివాణ్ణి అని వీరు అనుకొంటున్నారు. ఎదోమీయులు పర్వతాలు చూసుకొని దేవుని మీద గర్వించారు. ఈ రోజు మనం అనేక ఆధునిక పర్వతాలు కట్టుకొన్నాము. ‘మనిషి ఐశ్వర్యం’, ‘మనిషి జ్ఞానం’, ‘మనిషి శక్తి’ అనే ఈ పర్వతాలు వారిలో ఎంతో గర్వాన్ని నింపుతూ ఉన్నాయి. 

7. మోస పోకుడి, దేవుడు వెక్కిరింపబడడు; మనుష్యుడు ఏమివిత్తునో ఆ పంటనే కోయును అన్నాడు అపోస్తలుడైన పౌలు గలతీ పత్రిక 6 అధ్యాయములో. ఇక్కడ ఎదోమీయులతో దేవుడు అదే మాట అంటున్నాడు. నీ హృదయపు గర్వముచేత నీవు మోసపోతివి.నేను నా పర్వతాలు అని సంబరపడిపోకు. నేను నిన్ను శిక్షిస్తాను. చాలా ఎత్తులో కూర్చున్న నిన్ను క్రిందకు దించుతాను. అత్యున్నత స్థానము నుండి నిన్ను అత్యల్పమైన స్థితిలోకి తీసుకువస్తాను అన్నాడు. 

2. దేవుడు వారి మీద మోపిన రెండో నేరం బలాత్కారం. 

10 వచనము చూద్దాము: 

10. నీ సహోదరులైన యాకోబు సంతతి నీవు చేసిన బలాత్కారమును బట్టి నీవు అవమానము నొందుదువు, ఇక నెన్నటికిని లేకుండ నీవు నిర్మూలమగుదువు.నా ప్రజల మీద నీవు బలాత్కారం చేశావు. నీవు వారి మీద హింసకు పాల్పడ్డావు. ఎదోమీయులు వారి చరిత్ర మొత్తం ఇశ్రాయేలీయులను హింసించారు. వారితో యుద్ధాలు చేశారు. ఇశ్రాయేలీయుల శత్రువులతో చేతులు కలిపి యెరూషలేము మీద అనేక సార్లు దాడులు చేశారు. హేరోదు రాజు గురించి మనకు తెలుసు కదా. అతడు ఎదోమీయుడు. యేసు ప్రభువు జన్మించినప్పుడు యూదుల మీద అతడు రాజుగా ఉన్నాడు. యూదుల కొరకు ఒక రక్షకుడు పుట్టడా? చంపేసేయండి. రెండు సంవత్సరముల కన్నా చిన్న వయస్సు ఉన్న మగ పిల్లల నందరినీ చంపివేయండి అన్నాడు. చిన్న పిల్లలు అని కూడా అతడు కనికరించలేదు. అతని కుమారులు కూడా ప్రవక్తలను, అపోస్తలులను హింసించారు. బాప్తిస్మ మిచ్చు యోహాను గొప్ప ప్రవక్త. తన పాపాన్ని గద్దించాడని హేరోదు యోహాను మీద పగబట్టి అతని తల నరికించాడు. అపోస్తలుడైన యాకోబును హేరోదు చంపించడం అపోస్తలుల కార్యములు 12 అధ్యాయములో మనం చదువుతాము. 

   ఏశావు దగ్గర నుండి హేరోదు రాజు వరకు ఎదోమీయులు ఇశ్రాయేలీయులను, వారి రాజులను, ప్రవక్తలను, అపోస్తలులను ఎంతో హింసించారు. దేవుడు వారితో ఏమంటున్నాడంటే, నేను మిమ్ములను నిర్మూలము చేస్తాను. 

మూడవది పగ. దేవుడు ఎదోమీయుల మీద మోపిన మూడవ నేరం పగ. 

11 వచనం చూద్దాము: 

11. నీవు పగవాడవై నిలిచిన దినమందు, పరదేశులు వారి ఆస్తిని పట్టుకొనిపోయిన 

దినమందు, అన్యులు వారి గుమ్మములలోనికి చొరబడి యెరూష లేముమీద చీట్లువేసిన దినమందు నీవును వారితో కలిసి కొంటివి గదా. నా ప్రజల మీద నువ్వు పగ పట్టావు. వారి శత్రువులతో నీవు చేయి కలిపావు. నా ప్రజల రహస్యాలు వారి శత్రువులకు చెప్పావు. నా ప్రజలు పారిపోతుంటే నువ్వు వారిని అడ్డుకొని వారి చేతులకు అప్పగించావు. వారికి సహాయం చేయకపోగా, దగ్గరే నిలబడి వారిని వారి శత్రువులకు బానిసలుగా అప్పగించావు. నువ్వు చేసిన పనులు నేను చూశాను. 

14. వారిలో తప్పించుకొనినవారిని సంహ రించుటకు అడ్డత్రోవలలోనీవు నిలువతగదు, శ్రమదిన మందు అతనికి శేషించిన వారిని శత్రువులచేతికి అప్పగింప తగదు.సోదరులైన ఇశ్రాయేలీయులకు ఎదోమీయులు ఎప్పుడూ సహాయం చేయలేదు. ఎందుకంటే వారి హృదయములో పగ ను పెంచుకొన్నారు. 

  అశూరు సైన్యాలు యెరూషలేము మీద దాడి చేసినప్పుడు, బబులోను సైన్యాలు యెరూషలేమును తగలబెట్టినప్పుడు, రోమన్ సైన్యాలు యూదులను సంహరించినప్పుడు ప్రతి సారీ ఎదోమీయులు దగ్గర ఉండి ఆ మారణ హోమములో పాల్గొన్నారు. రోమన్ల మెప్పు కోసం, సీజర్ ని సంతోషపెట్టడం కోసం హేరోదు రాజు యూదులను నిర్ధాక్షిణ్యముగా అణచివేశాడు. 

నాలుగవదిగా సంతోషము. 

దేవుడు ఎదోమీయుల మీద మోపిన నాలుగవ నేరం యూదుల బాధను చూసి సంతోషపడడం. 12 వచనం చూద్దాము. 

12. నీ సహోదరుని శ్రమానుభవదినము చూచి నీవు ఆనందమొంద తగదు;యూదా వారి నాశన దినమున వారి స్థితినిచూచి నీవు సంతోషింపతగదు;

 ఒక సారి నా సోదరుడు తన స్కూటర్ మీద వెళ్ళుచూ వెనక నుండి లారీ కి గుద్దాడు. అతనికి మొహం మీద తీవ్ర గాయాలు అయ్యాయి. అతని మేము గుంటూరులో ఒక హాస్పిటల్ కి తీసుకొని వెళ్ళాము. బ్రతుకు తాడో లేదో అని మేము తీవ్రమైన ఒత్తిడిలో ఉన్నాము. అతని చూడటానికి చాలా మంది హాస్పిటల్ కు వస్తున్నారు. ఒక రోజు మధ్యాహ్నం ఒక వ్యక్తి నా సోదరుణ్ణి చూడటానికి వచ్చాడు. నా సోదరుడు పడు తున్న బాధను చూసాడు. 

   నేను హాస్పిటల్ బయట నిలబడి ఉన్నాను. అతను నా దగ్గరకి వచ్చాడు: ‘నీ బ్రదర్, ఒక సారి నాతో గొడవ పడ్డాడు. నన్ను తిట్టాడు. నన్ను విమర్శించాడు. ఇప్పుడు చూడు ఏమి జరిగిందో అన్నాడు. అతని చూసి నాకు ఆశ్చర్యం వేసింది. ఇలాంటి వ్యక్తులు కూడా ఉంటారా అని పించింది. ఎవరన్నా బాధలో ఉంటే వారిని పరామర్శించాలి, వారికి సానుభూతితో రెండు మంచి మాటలు చెప్పాలి, వారి కోసం ప్రార్థన చేయాలి. కానీ, అప్పుడు నన్ను తిట్టావు కదా, ఇప్పుడు నువ్వు హాస్పిటల్ లో బాధ పడుతూ ఉంటే, నీ బాధ చూసి సంతృప్తి పడతాను. నా పగ కొంతయినా తగ్గుతుంది’ అనుకోవడం చాలా దుర్మార్గం. ‘పరామర్శించటానికి వచ్చావా? పగ తీర్చుకోవటానికి వచ్చావా? 

   ఎదోమీయులు చేసిన పాపం అదే. సోదరులను చూసి వారు సంతోషపడ్డారు.యూదులను వారి శత్రువులు నాశనం చేస్తున్నప్పుడు, వారు సహాయం చేయలేదు. ‘అయ్యో, నా తమ్ముడు సంతానం ఎంత దుస్థితికి వచ్చింది!’ అని వారు సానుభూతి కూడా చూపించలేదు. నిన్ను బాగా నలగ్గొట్టారు కదా, నాకు చాలా హ్యాపీ గా ఉంది. నువ్వు ఏడుస్తుంటే, నాకు సంతోషంగా ఉందబ్బా. నువ్వు బాధ పడుతుంటూ చూసి ఎంత ఆనందంగా ఉందో’ అనుకొన్నారు. దేవుడు ఆ విషయములో వారిని తప్పుపట్టాడు. 

12. నీ సహోదరుని శ్రమానుభవదినము చూచి నీవు ఆనందమొంద తగదు; యూదా వారి నాశన దినమున వారి స్థితిని చూచి నీవు సంతోషింప తగదు. నువ్వు చేసిన నేరాలు నాకు కనిపిస్తున్నాయి. 

గర్వం, 

హింస, 

పగ, 

వికృత ఆనందం 

ఈ నాలుగు నేరాలను బట్టి నేను నిన్ను శిక్షించబోవుతున్నాను. 15 వచనం. 

యెహోవా దినం

15. యెహోవా దినము అన్యజనులందరిమీదికి వచ్చు చున్నది. అప్పుడు నీవు చేసినట్టే నీకును చేయబడును, నీవు చేసినదే నీ నెత్తిమీదికి వచ్చును.నువ్వు చేసినట్లే నేను నీకు చేస్తాను. నా జీవముతోడు నేను నిన్ను రక్తముగా చేసె దను, రక్తము నిన్ను తరుమును, రక్తము నీకిష్టమాయెను గనుక రక్తమే నిన్ను తరుమును, ఇదే ప్రభువగు యెహోవా వాక్కు. 

                     యెహెఙ్కేలు 35:6 

నువ్వు రక్తపాతాన్ని ఇష్టపడ్డావు కదా, నేను నీకు అదీ ఇస్తాను. రక్తము నిన్ను తరుముతుంది. క్రీ శకం 70 సంవత్సరములో దేవుని ప్రవచనం నెరవేరింది. ఎదోమీయులను రోమన్ సైన్యం ఊచకోత కోసింది. ఈ రోజు మీరు యెరూషలేము వెళ్తే యూదులు కనిపిస్తారా? కనిపిస్తారు. మీరు పెట్ర్రా వెళ్తే ఎదోమీయులు కనిపిస్తారా ? కనిపించరు. దేవుడు వారిని పూర్తిగా నిర్మూలించాడు. దేవుడు న్యాయవంతుడు అనే సత్యం అక్కడ మనకు అర్థం అవుతుంది. ఎదోమీయుల పాపానికి దేవుడు అంతం పలికాడు. మీరు ఇశ్రాయేలు దేశం వెళ్తే ఎదోమీయులు కట్టుకొన్న చక్కటి భవనాలు, కొండల మీద వారు కట్టుకొన్న కోటలు మనకు కనిపిస్తాయి. వారు మాత్ర్రం కనిపించరు. ఆ ప్రాంతాలను దేవుడు యూదులకు అప్పజెప్పాడు. ఓబద్యా చేసిన ప్రవచనం ఖచ్చితముగా నెరవేరింది. ఒక మంచి శుభవార్త తో ఓబద్యా తన పుస్తకాన్ని ముగించాడు.  21 వచనం చూద్దాము: 

21. మరియు ఏశావు యొక్క కొండకు తీర్పుతీర్చుటకై సీయోను కొండమీద రక్షకులు పుట్టుదురు; అప్పుడు రాజ్యము యెహోవాది యగును.

ఏశావు కొండకు తీర్పు తీర్చుటకు సీయోను కొండ మీద రక్షకులు జన్మిస్తారు. ఎదోమీయుడైన హేరోదు యేసు ప్రభువును శిశువుగా ఉన్నప్పుడే చంపివేయాలని ప్రయత్నించాడు. అయితే దేవుడు అతని ప్రయత్నాలను వమ్ముచేశాడు. తన కుమారుడైన యేసు క్రీస్తును ఆయన కాపాడాడు. ఆయన ద్వారా మనకు రక్షణ అనుగ్రహించాడు. 

ఓబద్యా గ్రంథము లో నుండి ఈ రోజు మనం కొన్ని ముఖ్యమైన విషయాలు చూశాము. ఇశ్రాయేలీయుల మీద ఎదోమీయులు చేసిన ఘోరాలు దేవుడు చూశాడు. వారి పాపాలను సరైన సమయములో శిక్షించాడు. దేవుడు న్యాయం చేసే వాడిగా మనకు కనిపిస్తున్నాడు. ఇశ్రాయేలీయుల కొరకు ఒక రక్షకుని పంపించాడు. 

మత్తయి 1:21 లో మనం చదువుతాము. తన ప్రజలను వారి పాపములనుండి ఆయనే రక్షించును గనుక ఆయనకు యేసు అను పేరు పెట్టుదువనెను.

   ఇశ్రాయేలీయులకు, మనకు ఒక రక్షకుడు కావాలి. ఆయన ప్రభువైన యేసు క్రీస్తు. అన్నిటి కంటే ముఖ్యమైనది మన పాపముల నుండి మనం రక్షించబడాలి. ఈ రోజు సిలువ దగ్గర కు వచ్చి ప్రభువైన యేసు క్రీస్తు అనుగ్రహించే రక్షణ మీరు పొందాలన్నదే నేటి మా ప్రేమ సందేశం. 

Leave a Reply